తలరాతను మార్చిన ఇతిహాసాలు

అవంతీ నగరంలో రామశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. ఆయనంటే రాజుతో సహ అందరికి నమ్మకం. ఎక్కడ ఏ కార్యమైనా ఆయన చేత చేయించేవారు. రామశర్మకు ఎన్నో ఏళ్లుగా సంతానం లేదు. యజ్ఞాలు, యాగాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జతకాది కర్మలు చేశాడు. సుధీంద్రశర్మ అని పేరు పెట్టాడు. ఒకరోజు ఈ పిల్లాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది. గుండేఝల్లు మంది. అయినా మళ్లి మళ్లి వేశాడు. ఎన్నిసార్లు చూసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు ‘‘బాబోయ్‌! ‌నేను పండితుడిని. వీడు గజదొంగ. పండితపుత్రుడు పరమ శుంఠ అనేమాట నిజమౌతుందేమో!’’అని భయపడ్డాడు. ఇంతలోనే మనస్సుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేం. కాని మనస్సుని అదుపు చేయాలని అలోచించి ఆ రోజు నుండి పిల్లాడికి రామాయణ భారత, భాగవతాలు, గరుడపురాణం, ఇతర పురాణాలు చెప్పాడు.

వీటిలో ప్రత్యేకంగా గరుడపురాణం మరీమరీ ఒకటికి పదిసార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది. ఈ తప్పు చేస్తే ఈశిక్ష పడుతుంది. ఆ తప్పుచేస్తే మరో శిక్ష పడుతుంది. బంగారం దొంగతనం చేస్తే కుష్ఠు వ్యాధి వస్తుంది. వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది. ఎవరినైనా దూషించడం, పరులమీద నిందలు వేయడం, గురువులని వేదాలని నిందించడం, దొంగ తనాలు చేయడం లాంటివి చేస్తే దారుణంగా చావాలి. ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈ కుర్రాడు కూడా పండితుడు అయ్యాడు. ఇతడి పేరు కూడా క్రమంగా విస్తరించి రాజు దగ్గరికి వెళ్ళింది.

రాజు రామశర్మను పిలిపించి ఓ పండిత బ్రహ్మ! నీ కుమారుడి గుణగణాలు విన్నాను. ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్లాడు. కాని మనస్సంతా ఆందోళన, వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్లు నా దగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సు మళ్లకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి ఇతర విలువైన సామాగ్రి చూసి పొరబాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది. అయ్యో పంపించక పోతే వీడికి భవిష్యత్తు ఉండదు. అక్కడికి వెళ్లాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు. అయినా తనను తాను నిగ్రహించుకొని కొడుకుని పిలిచి నాయనా! రేపటి నుండి నువ్వు రాజమంది రంలో పురోహితుడిగా చేయాలి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నావా! రాజు తలే తీసేస్తాడు అని ఎన్నో నీతులు, జాగ్రత్తలు చెప్పి పంపించాడు.

చిన్ననాడు పురాణాలు, రామాయణ, భారత భాగవతాలు చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో సుధీంద్రశర్మకు అర్థమయ్యేది కాదు. గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప అతనికి తెలియదు. మొత్తమ్మీద రాజుని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజామందిరంలోకి వెళ్ళగానే అక్కడ ధగధగ మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారం, వెండి వస్తువులు చూసి ఆహా! నా జీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. వెంటనే మనస్సులో దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి అమ్మో! వద్దు వద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తీ చేసి ఇంటికి వెళ్ల బోతుంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి ‘ఏంటిది స్వామి చూపించండి’ అన్నారు. అయ్యో ఏమిలేదు అనగా అనుమానం వచ్చి లాక్కుని చూస్తే ఆ మూటలో తవుడు ఉంది. ఇదేంటి స్వామి తవుడు మూట పట్టుకు పోతున్నారు? సుధీంద్ర బెదిరి పోతూ సైనికుల వంక చూశాడు. సందేహంతో రాజు దగ్గర ఇతడిని ప్రవేశపెట్టారు. అప్పుడు జరిగినదంతా పూసగుచ్చి నట్లు భటులు చెప్పారు. అంతావిని ‘ఎందుకు ఇలా చేశావు? అని అడిగారు’. ‘ఏమిలేదు మహారాజా! ఆవుకి పెట్టడానికి ఇంట్లో తవుడు అయిపోయింది’ అందుకే ఇలా చేశాను. అనేసరికి రాజు నవ్వుకొని అదేంటి పండితపుత్రా! అడిగితే బస్తాలకి బస్తాలకి ఇచ్చేవాడిని దొంగతనం చేయాల్సిన కర్మేమి వచ్చింది? చిన్నపిల్లాడి చేష్టలా ఉంది అనుకోని అతడి తండ్రిని పిలిపించాడు. రామశర్మ గజగజా వణికిపోయి అయ్యో వీడేం చేశాడో? అనుకున్నదంతా జరిగి నట్లు ఉంది. ఎంత చెప్పిన కర్మని మార్చలేం. వాడి తల తీసేస్తారు అంటూ ఏడుస్తూ దర్బార్‌కి వచ్చాడు. అప్పుడు రాజు జరిగింది చెప్పాడు. మనస్సులో హమ్మయ్య! అనుకోని మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి అని ఏకాంత మందిరానికి తీసుకెళ్లాడు. మహారాజా! నన్ను క్షమించండి. ఇదిగో వాడి జాతకం. సుధీంద్ర జాతకం ప్రకారం గజదొంగ అవ్వాలి. కాని నేను భారత, భాగవత, రామాయణ, పురాణాలు చిన్ననాటి నుండి భోదించాను. వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తి అయింది. లేదంటే ఈపాటికి వాడు గజదొంగ అయ్యేవాడు. వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయ్యింది. ఇక మీదట ఎలాంటి అపశ్రుతి జరగదని మాటిస్తున్నాను అని రాజుకి వివరించాడు. రామశర్మ నిజాయి తీకి మెచ్చుకొని రాజు మణిమాణిఖ్యాలు, బస్తాల కొద్ది ఆహార ధాన్యాలు, తవుడు ఇచ్చి పంపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram