సాధారణంగా ఇంటి యజమాని అదీ పురుషుడు నిత్యపూ చేయాలి. సంకల్పంలోనే ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంటుంది. యజమాని ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి. పురుషుడు ప్రతిరోజూ నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వ్రతంలాంటిది చేసినప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే ప్రధానం కదా.
ఇక పురుషులకు వేదం ఒక మాట చెప్పింది ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛం’ అంటారు. పురుషుడికి పైన ఉత్తరీయం ఒక్కటే ఉండాలి. భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నావు నీలో ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనే ఎదురుగుండా ఉన్నాడు. ఆయన, ఈయనకు కనపడాలి. కనుకనే ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే భార్యా సహితుడు, మంగళ ప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని అర్థం. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని భావం. పూజ చేసేటప్పుడు భగవంతుడితో సమన్వయం అవుతున్నాం. ఆయన అనుగ్రహించాలంటే మంగళప్రదుడై అయి ఉండాలి. అందుకని ఉత్తరీయం తప్పనిసరి. సంప్రదాయం తెలిసినవారు, వేదం చదువుకున్న పెద్దలు, భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్లరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్టలు ధరించడమంటే అమంగళప్రదుడుగా భావిస్తారు. అవతలివాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే శుభ కార్యాల్లో అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. పీటల మీద కూర్చుని భగవత్‌ ‌కార్యంలో పాల్గొనడం అంటే ‘ఆయుఃకారకం’ కనుక ఉత్తరీయం వేసుకోవాలి. అది లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. దేనికైనా అంచు ఉన్న బట్టలు శ్రేష్టం. అంచు ఉన్న బట్టలు గోచీ కట్టుకుని, ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు శౌచంతో ఉన్నాడని భావిస్తారు. కాబట్టి పురుషుడు ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలనే వస్త్రధారణ నియమాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు.

About Author

By editor

Twitter
Instagram