ఘోరమైన అంటువ్యాధులు ఇప్పటివి కాదా? కాదనే చెబుతున్నారు ప్రఖ్యాత పౌరాణికులు గరికపాటి నరసింహారావు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన వివరాలను ఉదాహరణతో అందించారాయన-
అర్చకులు, పురోహితులు, ఆధ్యాత్మిక సంస్థల నిర్వాహకులు ఈ క్లిష్ట సమయంలో ఒక విషయాన్ని గమనంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. యోగ వాసిష్ఠం ఒక మహా కావ్యం. శ్రీరామచంద్రమూర్తికి వసిష్ఠ మహర్షి చేసిన ప్రబోధమే ఇందులో ఇతివృత్తం. 32,000 శ్లోకాల క్యావమిది. ఇందులోని ఉత్పత్తి ప్రకరణం, 69వ సర్గలో విషూచిక అనే ఒక వ్యాధి ప్రస్తావన ఉంది. అది చదువుతుంటే ఇవాళ్టి ప్రపంచ దృశ్యం అందులో ప్రతిబింబి స్తుంది. దుర్భోజనం, దురాలోచన వంటి వాటితో ఆ వ్యాధి జనిస్తుంది. దుర్భోజనం అంటేనే విచక్షణ లేకుండా రకరకాల జంతువుల మాంసం తినడం. గట్టిగా చెప్పాలంటే కుక్క, పిల్లి, గబ్బిలం ఇలాంటి వాటి మాంసాన్ని భక్షించడమే దుర్భోజనం. దుష్టసంకల్పం ఉండడం అంటే! అమానవీయమైన వ్యూహాలతో ఇతరుల మీద దాడికి దిగాలన్న దుర్బుద్ధి. అంటే ఏదో సమయంలో ఉపయోగపడుతుందని జీవాయుధలను సిద్ధం చేసుకోవడం వంటివి. ఇంకా ముఖ్యంగా ఆ వ్యాధి మనుషులలో ఉన్నదో లేదో కూడా నిర్ధారించుకోలేరట. ఇది అచ్చంగా ఇవాళ్టి ప్రపంచ దృశ్యమే కదా!
యోగ వాసిష్ఠంలోనే దీనికి విరుగుడు కూడా చెప్పారని నాకు అనిపిస్తుంది. అటు మంత్ర పరంగా, ఇటు మందుపరంగా కూడా చెప్పారని నా అభిప్రాయం. నేను ఇంతవరకే చెప్పగలను. ఎందుకంటే నేను తెలుగు పండితుడినే కానీ, శాస్త్రవేత్తను కాను. అందుకే ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు పరిశోధించాలని మనవి. పరిశోధనలు చేయండి! నిజం కాకపోతే పక్కన పెట్టవచ్చు. మంత్రం గురించి నేను చెప్పడం సరికాదు. కానీ మందు గురించి ఇలా చెప్పింది, యోగ వాసిష్ఠం. చంద్రసంబంధమైన వస్తువుల నుంచి ఆ మందు తీయవచ్చు నంటుంది ఆ కావ్యం. అంటే ముత్యాలు, నవధాన్యాలలో చంద్రసంబంధి ఇలాంటివి. చివరిగా పురోహితులు, అర్చకులు వంటివారు నిత్య విధి పూర్తి చేసుకుని ఆ మంత్రం పఠించాలి.
(ఇంతకీ విషూచిక అసలు కథ ఏమిటి? గరికపాటివారు ఆ ఇంటర్వ్యూలో ఈ విషయం వివరించకపోయినా అంతకు ముందు కొందరు ఈ అంశం గురించి కొంత సమాచారం ఇచ్చారు. అది జాగృతి పాఠకుల కోసం… కరోనా గురించి చాలా కథలు వినవస్తున్నా, రెండు మాత్రం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది కోరంకి వ్యాధి. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనిది. ఇక యోగ వాసిష్ఠంలో కనిపిస్తున్నది కర్కటి కథ. ఇందులో కర్కటి ఒక మహా రాక్షసి. ఆ రాక్షసికి అంతులేని ఆకలి. భూలోకంలో ఉన్న సమస్త ప్రాణులను తినేస్తే బావుంటుందని ఆలోచన వచ్చింది. ఈ కోరిక నెరవేర్చమని తపస్సు చేసిందట. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ‘ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయంలోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి సృష్టిలోని జీవులను తృప్తిగా భోజనం చేయాలి. ఇదీ వరం’ అని చెప్పిందట. ఆపై విషూచిక అనే రోగం పేరుతో కర్కటి పుట్టిందట. తినకూడనివి తినేవారినీ, చెయ్యకూడనివి చేసేవారినీ, చెడు ప్రదేశాల్లో ఉండేవారినీ, శాస్త్ర వ్యతిరేకంగా నడిచేవారినీ, దుర్మార్గులనూ యథేచ్చగా ఆరగించవచ్చు. కానీ మంచివారికి దీని నుంచి మినహాయింపు ఇస్తున్నాను అన్నాడట బ్రహ్మ. దాని ఫలితమే ఆ మంత్రం. ఇదొక పురాణగాథ. ఎవరి వ్యాఖ్య వారిది. ఏమైనా యోగ వాసిష్ఠానికి సంస్కృత సాహి త్యంలో ఎంతో ఖ్యాతి ఉంది. మహాభారతం తరువాత అంత పెద్ద కావ్యం. జీవితం, ఇందులో కేశం గురించి ఆ మహాకావ్యం చెబుతుంది. ఇది కూడా వాల్మీకి విరిచితమేనని చెబుతారు.)

About Author

By editor

Twitter
YOUTUBE