హిందువులు ఎవరినీ దూరం పెట్టకూడదు!

హిందువులు ఎవరినీ దూరం పెట్టకూడదు!

ప్రజోపయోగ పౌర కార్య ప్రణాళికల విషయంలో కూడా పేష్వాలు, వారి సామంతులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అటక్‌, రామేశ్వరం మధ్య భూముల నుండి కప్పం రూపంలో ధనవాహినులు కానుకలుగా వచ్చి పునహా (పూనా) చేరుకున్నాయి. కానీ ఆ నిధులు వృధాగా మూల్గుతూ పడి ఉండలేదు. ఆ నిధులు మళ్లీ చెరువునీరు పంటకాలువల ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు పారినట్లు, హిందూస్థాన మంతటా ఉన్న తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రవహించి ప్రజోపయోగాన్ని కూర్చాయి. హిందూదేశం మొత్తం మహారాష్ట్రుల హిందూ సామ్రాజ్య పోషణ క్రింద అభివృద్ధికి నోచని పుణ్యవాహిని ఉపయుక్త రమణీయ తీర్థం గాని ఒక్కటి కూడా లేదు. విశాల ధర్మశాలతో శోభిల్లని ప్రధాన స్నానఘట్టం ఒక్కటీలేదు. గంభీర గోపుర ప్రాకారాలతో అందగించని దేవాలయమే లేదు; ఆ సార్వభౌమాధికారం ధారాళంగా ఇచ్చిన భూరి విరాళాన్నో, భూరి దానాన్నో (ఇనాం) అనుభవించని ప్రఖ్యాత పునీత దేవాలయమే లేదు. ఇవన్నీ ఆ సామ్రాజ్య ఉదార వదాన్యతకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి.

అత్యంత అవసరమైన సైనిక వ్యవహారాలలో నిమగ్నులై ఉన్నప్పటికి ఒక వైపు యుద్ధాలు చెలరేగి, ఇంకొకవైపు యుద్ధ వదంతులు దట్టంగా వ్యాపిస్తుస్తున్నప్పటికి, ఆ సామ్రాజ్య ప్రత్యక్షాధికారం క్రింద ఉండిన విశాల భూభాగంలో నివసిస్తున్న ప్రజలందరూ సుఖ శాంతిభద్రతలను ఎక్కువగానే అనుభవించారు. జింజి, తంజావూరు నుండి గ్వాలియరు వరకు, ద్వారక నుండి జగన్నాథం వరకు వ్యాపించిన మహారాష్ట్ర సామ్రాజ్యంలోని పౌరు లందరూ ఇతర రాజ్యాల ప్రజల కంటె చాలా తక్కువ శుల్కాల చెల్లించడమేగాక, ధర్మబద్ధమైన పాలనకు నోచుకున్నారు. ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహానికి పాత్రు లయ్యారు కూడా. ఈ భాగ్యం ఇతర భారత రాజ్యా లలో ఇంతగా లేదు. రాజ మార్గాలు, పత్రవాహక విధానం (తపాల) చెరసాల పాలన, వైద్య సహాయం మొదలైన ప్రజోపయోగశాఖలు, ఇతర ప్రాంతాలలో కంటె ఇక్కడనే ఉచ్ఛ స్థితిలో ఉండి, క్రమం తప్ప కుండా అమలయినట్టు కూడా బలమైన సాక్ష్యా లున్నాయి. మొత్తంమీద ప్రజలందరు, అప్పుడప్పుడు అక్కడక్కాడా చోటు చేసుకున్న అల్లర్లు, అరాచకాలు లెక్కబెట్టకుండా, తమకు లభించిన స్వాతంత్య్ర లాభాలను బట్టి తమ ప్రభుత్వాన్ని ప్రేమించి, గర్వోన్మీలితులై మురిసిపోయారు. తాము ఆ మహిమోపేత కీర్తిమయ దినాలలో పుట్టినందుకు, ఆ ప్రభువులకు కృతజ్ఞతా రుణబద్ధులమై ఉన్నామని గుర్తించారు. ఆ అంశాలన్నిటికి ఆనాటి లేఖలు, జాతీయ కవితలు, వీరగీతాలు బఖారులు మొదలైనవి ప్రత్యక్ష నిదర్శనాలై ఉన్నాయి.

ఇవేగాక, ఎంతో గురుతరమైన, ఉదార భావోపేతములైన ఉద్యమాలకు ఆనాడు కొరత లేకుండినది. రాజకీయ, సాంఘికాభివృద్ధికి ప్రతిబంధ కాలుగా తయారైన మూఢా చారాలు, అంధవిశ్వాసాలు ఎన్నిటినో జన సామాన్యం నుంచి సడలించడమో, సమూలంగా నిర్మూలించడమో జరిగింది. ఇందు ప్రత్యేకమైనవి – ప్రధానమైనవి ఉన్నాయి. దైవ ప్రార్థనా విధానంలో చాలా ఛాంద సాలను తొలగించే ప్రయత్నం అప్పుడు జరిగింది. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. సముద్రయానం అభిరుచిని, శక్తిని సాహసాన్ని పెంపొందించినారు. సముద్రాలు దాటి విదేశాలు చూచి తిరిగి వచ్చినవారిని మళ్లీ సంఘంలో సగౌరవంగా కలుపుకొన్నారు. బలవంతంగానో, వంచనతోనే విదేశ ముస్లిం, క్రైస్తవ మతాలలో చేరినవారిని తిరిగి హిందూ మతంలో కలుపుకొనే ప్రయత్నం ఈ సంస్కరణలలో గురుతరమైనది.

శుద్ధి, లేకపోతే హిందూమత పునఃప్రవేశాన్ని గురించి ఆసక్తి కలిగించే విశేషాలు చాలా ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి. హిందూమత పోషకమైన ఈ శుద్ధి (ప్రాయ చిత్తం) పక్రియను మన పూర్వులు ఎప్పుడో గుర్తించారు. ఈ ఉద్యమం మహారాష్ట్ర రాజ్యాధికారవృద్ధితో కూడా విశిష్ట గౌరవాన్నీ, స్థానాన్నీ పొందింది. అప్పుడప్పుడు, బ్రాహ్మణ పండిత నాయకులు, పోర్చుగీసు వారి చేత బలవంతంగా క్రైస్తవంలోనికి మార్చిన వారిని మళ్లీ హిందూమతం లోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తూ ఉండేవారన్న వాస్తవం పోర్చుగీసు చరిత్ర భాగాలు వెల్లడిస్తున్నాయి. ఆ పండితులు రహస్యంగా మతాంతరులచేత ప్రాయశ్చిత్త స్నానం చేయించి, పవిత్రులను చేసి, హిందూసంఘంలో సగౌరవంగా ప్రవేశ పెట్టారు. దక్షిణ భారతంలో హిందూధర్మ పునర్వికాసానికి మాధవ విద్యారణ్య స్వాములవారు చిరస్మరణీయులు. మతాంతరులను తిరిగి హిందూ సనాతన ధర్మావ లంబకులుగా చేసే శుద్ధి ఉద్యమానికి ఈయనే మూల పురుషుడు అనదగినవారు. ఆ పుణ్య ఉదంతమిది:-

కంపిలరాజులు – హరిహరబుక్కరాయ సోదరులను (వీరికి మరి ముగ్గురు తమ్ముళ్లు ఉండే వారు) ఢిల్లీ సుల్తాన్‌ మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ (పిచ్చి తుగ్లక్‌) ఓడించి, ఢిల్లీకి బందీలుగా తీసుకుని పోయాడు. అక్కడ ఆ సోదరులని ఇస్లాంలోకి మార్చారు. తర్వాత కంపిల రాజ్యంలో అరాజకం తలెత్తింది. దీనిని అణచడానికి హరిహర బుక్కరాయ లనే సైన్యంతో సుల్తాన్‌ పంపించాడు. ఆ రాజ్య ప్రజలు తమ అలనాటి ప్రభువులను గుర్తించి స్వాగతించారు.

హంపి విరూపాక్ష ఆలయంలో ఉన్న మాధవ విద్యారణ్య స్వాములవారు హిందూధర్మ స్వరూపం. ఉదారాశయాలు ఉన్నవారు. మహమ్మదీయులు కృష్ణను దాటి వస్తే దక్షిణభారతంలో సనాతన ధర్మమే అడుగంటిపోతుందని ఊహించి, ఈ ప్రమాదానికి నివారణోపాయం గురించి యోచిస్తున్నారు. విద్యారణ్యులు ఈ సోదరులను పిలిపించి, శాస్తోక్తంగా మరల హిందువులుగా జేసి, 1336 సంవత్సర విజయదశమి పుణ్యముహూర్తాన, విరూపాక్ష ఆలయంలో, ఆ దేవదేవుని కృపాకటాక్ష వీక్షణబలంతో విజయనగర సామ్రాజ్యానికి శంకుస్థాపన చేయించారు, హరిహర సోదరులను సార్వభౌములుగా సింహపీఠికపై అభిషిక్తులజేసినారు. ఇట్లా ఈ మహానుభావుడు హిందూధర్మ పునర్జన్మకు, నూతన హిందూ సామ్రాజ్యానికి జనకులైనారు. దేవల స్మృతి ఈ శుద్ధి విధానాన్ని నొక్కి చెప్పింది. దానిని ఆచరణలో పెట్టి మాధవుడు కూటస్థుడైనాడు. అది మొదలు ఈ విధానాన్ని మూర్ఖ సంప్రదాయ వాదులు ప్రతిఘటిస్తుండినా, మహారాష్ట్రులు అవలంబించి పుణ్యం కట్టుకొన్నారు. పూర్వాచార పరాయణులు దీనిని వ్యతిరేకిస్తూ ఉండడం వల్ల హిందువుల సంఖ్య తరిగిపోతున్నది.

హిందూమతం కృశించిపోవడానికి, ఇంకొక ఆగమ శాస్త్రసూత్రం చాలా సహాయం చేసింది. అది విగ్రహధ్వంసకుల పని చాలా సులభం చేసింది. పూజా విగ్రహంలో ఏ అంగం విరిగిపోయినా ఇక దానిని దూరంగా పారవేయమంటుంది ఆ సూత్రం. అనర్థదాయక ఈ ఛాందసశాస్త్రం వల్ల తురకలు దేవాలయాల పడగొట్టే కాయకష్టం తప్పించుకొన్నారు. విగ్రహాల రూపు చెడగొట్టి భాగ్యాల దాచుకొని, ఆరాధకుల చేతనే ఆలయాలు పాడుబెట్టించారు. ఇంకొక స్మృతి సూత్రం-బాహుబలంతో మతాన్ని రక్షించే శూద్రభక్తులకు మహాపచారం చేసింది. శూద్రులు తాకిన విగ్రహాన్ని బయట పారవేయ మన్నాడు – ఈ ధర్మశాస్త్రకర్త. ఇది మతద్రోహమని, జాతీయావమానమని ఆ స్మృతి కారునికి తోచకపోవడం హిందూమత ప్రారబ్ధం. ఈ మాటలు పెడచెవిన బెట్టి శ్రీకాళహస్తీశ్వరుడు సాలెపురుగుకు, నల్లత్రాచుకు, ఏనుగుకు, బోయకు మోక్షమిచ్చినాడు. కాశీవిశ్వనాథుని, శ్రీశైలమల్లికార్జునుని అన్ని కులాల వారు అభిషేకించి స్పర్శించి ఆరాధించి ముక్తులౌతు న్నారు; అందువల్లనే ఈ సర్వ జనీనమైన మతం నిలిచి సాగుతున్నది.

ఇలాంటి స్వమత వినాశకారకమైన మూఢాచార, అంధవిశ్వాసభంజకంగా, ఈ యుగంలో ఆర్యసమాజ స్థాపకుడు స్వామీదయానంద సరస్వతి శుద్ధి సంఘటన ఉద్యమాల చేబట్టి, హిందూజాతి వికలం గాకుండా కాపాడారు. అలా ఆ స్వామి సర్వకులాల పరువును నిలబెట్టినారు. ఇప్పటికీ ఈ సంగతి విన్నవారు పులకితగాత్రులౌతున్నారు.

మళ్లీ విద్యారణ్యస్వాములవారి పవిత్ర కార్యసరణికి వద్దాం:- స్వయంగా వారు ‘శంకర విజయం’ పేరుతో ఆదిశంకరులవారి జీవితం మహా సంస్కృత కావ్యంగా రాశారు. తమ్ముడు సాయణా చార్యుల చేత వేదాలకు భాష్యం రాయించి, అవి జీర్ణమైపోకుండా నిలబెట్టి, వేదవాఙ్మయాన్ని, ప్రపంచ వాఙ్మయ శిరోభూషణంగా చేసినారు. శంకరపీఠాలు నాల్గింటిలో ప్రధానమైన శృంగేరి పీఠాన్ని తుంగభద్రా నది తీరాన సముద్ధరించి, ఒక తెనుగు ములికెనాటి బ్రాహ్మణుని ఆ పీఠాధిపతిగా అభిషేకించి, ఆ మఠాన్ని తేజోవంతంగా జేసినారు; ఈ పరంపర నేటికికూడ సాగివస్తున్నది. ఈ నిర్ణయం హిందూమతానికి పునర్జన్మనిచ్చి సనాతనం శాశ్వతం చేసినది.

ఇటువంటి ఒక ప్రాయశ్చిత్త కార్యక్రమం విషయం పోర్చుగీసు అధికారులకు తెలిసింది. సైనికులు ఆ సమావేశాన్ని చుట్టుముట్టి తుపాకులు చూపించి చెదరగొట్టారు. ఒక గోసాయి మాత్రం అడుగైనా కదల్చలేదు. అతడిని పోర్చుగీసు సైనికులు ముక్కలు ముక్కలుగా నరికారు. నింబాల్కర్‌ ధైర్యం, ఆత్మాభిమానం ప్రశంసనీయం. ఈ గొప్ప ఠాణా సర్దార్‌ విజయపూరు సుల్తాన్‌కు బందీ అయ్యాడు. అతడిని సుల్తాన్‌ మతం మార్పించి, తన కూతురుని ఇచ్చి వివాహం చేశాడు. అయినా అతడు సందు చూసుకుని మహారాష్ట్ర చేరాడు. ఛత్రపతి శివాజీ, జిజాబాయి ప్రత్యక్ష పర్యవేక్షణ, అభిమాన పూర్వక ఆదేశంతో పండితులు ఆయనను హిందూత్వంలో కలుపుకున్నారు. పూర్వాచార పరాయణులైన వారి అపోహలు తొలగించేందుకు శివాజీ తన పుత్రికను నింబాల్కర్‌ ప్రథమ పుత్రునికి ఇచ్చి పెళ్లి చేశాడు.

ఇంకొక చిరస్మరణీయ సంఘటన. నేతాజీ పాల్కర్‌కు శివాజీ అంటే గురి. ఇతడు ఔరంగజేబు చేతికి చిక్కాడు. పాదుషా ఆజ్ఞ మేరకు ఇతడిని మతం మార్చారు. సరిహద్దు పరగణాకు తీసుకుపోయి అక్కడ క్రూర ఆటవికుల మధ్య జీవితం గడపమని వదిలిపెట్టి వచ్చారు. అతడు కూడా ఎలాగో తప్పించు కుని స్వరాష్ట్రం చేరుకున్నాడు. తాను హిందువుగా మారడానికి అవకాశం ఇవ్వాలని కోరాడు. పండి తులు శివాజీ ఆమోదం కోరారు. శివాజీ అనుమతితో పాల్కర్‌ సగర్వంగా మళ్లీ హిందువయ్యాడు.

పేష్వాలు సాగించిన ఈ శుద్ధి విధానం నానా ఫడ్నవీస్‌ తర్వాత కూడా కొనసాగింది. ఇలాంటి శుద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నట్టు ‘పేష్వాల దినచర్య’ అనే గ్రంథం పేర్కొంటున్నది. క్రైస్తవం, ఇస్లాంలలో చేరిన ఎందరో పశ్చాత్తాప పరితప్తులై మళ్లీ హిందువులు కాదలచుకున్నప్పుడు వారిని శుద్ధి చేసి ఆయా సంఘాలు ఇలాంటి పునఃప్రవేశకుడికి పూర్వం మాదిరిగానే సంఘాచారాలకు అర్హులను చేస్తూ ఆజ్ఞలు జారీ చేశారు. ఇందుకు ఒక నిదర్శనం – సూతాజీ సూరత్‌ జిల్లా సైన్యంలో పనిచేసేవాడు. ఇతడు కూడా ముస్లిం సేనలకు దొరికిపోయి మతం మారవలసి వచ్చింది. బాలాజీ బాజీరావు ఢిల్లీ నుండి తిరిగి వస్తుండగా పూతా తప్పించుకుని పేష్వా సేనలో స్థానం పొందాడు. తరువాత పెద్దలు సభచేసి, ఒక తీర్మానం చేశారు. ఆ సంగతి పేష్వాకు తెలియ చేశారు. పూతా రాకకు అనుమతిస్తూ పేష్వా ఆజ్ఞా పత్రం ఇచ్చాడు. తులసీభట్‌ జోషి బలవంతంగా కాకుండా ఆ ప్రలోభాలతో ఇస్లాంలో చేరాడు. అయితే వెంటనే తన దుడుకుతనానికి చింతించాడు. పైఠాన్‌ నగరం పోయి బ్రాహ్మణ సమాజాన్ని శరణు కోరాడు. ఈ సమాజం ఆ రోజుల్లో ఎంతో నైష్టికమైనది. కానీ తులసీ స్వచ్ఛమైన పశ్చాతాపాన్ని బట్టి అతడిని తిరిగి హింధుత్వంలోకి అనుమతించారు. అతనితో కలసి సహపంక్తి భోజనం కూడా చేశారు. కొన్ని సంక్షోభాలు ఎదురైనప్పటికీ కూడా శంభాజీ కాలంలోను ఈ ప్రక్రియ కొనసాగింది. గంగాధర కులకర్ణి గాధ ఇందుకు నిదర్శనం. ఇతడిని బలవంతంగా ఇస్లాంలో చేర్చారు. తిరిగి ఇతడు హిందుత్వంలోకి వచ్చాడు. ఈ ప్రక్రియ వివరాలను ఒక రాజాజ్ఞగా పేర్కొంటూ మనస్మృతిలోని ఒక ప్రఖ్యాత శ్లోకాన్ని అనుసరించి ఇతనితో సహపక్తి భోజనం చేయనిరాకరించినవారు ఇతర సాంఘిక దురాచారాల ఆచరిస్తే అడ్డుపెట్టేవారు దేవ బ్రాహ్మణ సద్ధర్మానికి ద్రోహం చేసిన పాపానికి పాల్పడతారని, ఇంకా పాత్ములుగా చిన్న చూపునకు గురై సంఘ బహిష్కారానికి కూడా గురౌతారని కూడా ఒక ఆ రాజాజ్ఞ తెలియచేసింది. ప్రస్తావవశంగా, ఇక్కడ జోధ్‌పూర్‌ రాజకుమారి – ఇంద్రకుమారి ఉదంతాన్ని పేర్కొంటున్నాం. ఈమె ఢిల్లీ మొగల చక్రవర్తిని పెండ్లాడి, కొంతకాలం అతనితో కాపురంచేసి, తిరిగి స్వస్థానం చేరగానే, రాజపుత్రులు ఆమెను మరల హిందూసంఘంలో చేర్చుకొన్నారు.

– వి.డి.సావర్కర్‌ రాసిన హింద్‌ పద పాద షాహి గ్రంథం నుంచి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *