ఎక్కడి ఉగ్రవాదమైనా మూలాలు హైదరాబాద్‌లోనే

దక్షిణ భారతదేశానికే గర్వకారణమైన హైదరాబాద్‌ ‌నగరంలో ఇటీవలనే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌భారీ విగ్రహం ప్రతిష్టించారు. 125 అడుగుల ఎత్తయిన ప్రతిమ అది. ఆయన హైదరాబాద్‌ను భారతదేశానికి రెండవ రాజధానిగా ఊహించుకున్నారు. అందుకు సిఫారసు చేశారు కూడా. కానీ అత్యంత విషాదంగా ఈ చరిత్రాత్మక నగరం ముస్లిం మతోన్మాదానికీ, ఉగ్రవాదానికీ ప్రపంచంలోనే రెండో రాజధాని అన్న అపకీర్తిని మూటకట్టుకుంది. ముస్లిం ఛాందస ఉగ్రవాదానికి ప్రపంచ తొలి రాజధాని పాకిస్తాన్‌ అన్న వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు. భూగోళం మీద ఎక్కడ ముస్లిం ఉగ్రవాదులు పేలుళ్లు జరిపినా, ఆ పేరుతో నెత్తుటికాండ జరిగినా మొదట పాకిస్తాన్‌ ‌పేరు వినిపిస్తుంది. తరువాత హైదరాబాద్‌ ‌పేరు వినపడుతుంది. ఆ పేలుళ్ల మూలాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలా చెప్పడం బాధాకరమే అయినా ఇది చేదు నిజం. మళ్లీ ఇప్పుడు హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ అనే పాత/కొత్త అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ కదలికలు ఈ హైదరాబాద్‌లోనే సుస్పష్టంగా కనిపించాయి. నగరం ఉలిక్కి పడింది. సెక్యులర్‌ ‌పార్టీల నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. మళ్లీ లుంబిని పార్క్ ‌రక్తపాతం, గోకుల్‌ ‌చాట్‌ ‌దురంతం జరుగుతాయన్న భయాలు సాధారణ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ ‌నేతల నోటి నుంచి మాత్రం మన హైదరాబాద్‌ ‌ప్రపంచంలోనే గొప్ప నగరమన్న శుష్క వ్యాఖ్యలు వెల్లువెత్తు తూనే ఉన్నాయి. మొన్న రొహింగ్యాల గొడవ, నిన్న పాకిస్తాన్‌ ‌దేశీయుల జాడ, ఇవాళ హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ ‌కదలిక. కానీ నేతలలో మాత్రం చలనం లేదు.

మే 9వ తేదీన వేకువన మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ (‌యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌) అధికారులు హైదరా బాద్‌ ‌వచ్చి తెలంగాణ కౌంటర్‌ ఇం‌టెలిజెన్స్ (‌సీఐ) సెల్‌ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. నగరంలో పలుచోట్ల తలదాచుకున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలతో పాటు భారీగా ఇస్లామిక్‌ ‌జిహాదీ సాహిత్యం, ఎయిర్‌గన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఏటీఎస్‌ అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఎస్‌ఐఏ) ‌సహకారంతో భోపాల్‌, ‌చింద్వాడాలో 11 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో పట్టుబడిన ఐదుగురూ కొన్ని నెలల క్రితం భోపాల్‌ ‌నుంచి వచ్చి తలదాచుకున్నట్లు సమాచారం. వారికి అందిన ప్రాథమిక సమాచారంతో నెల క్రితం నుంచే ఏటీఎస్‌ ‌నిఘా పెట్టింది.

ఈ తాజా పరిణామంలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం అసలు రూపాన్ని ఇంకాస్త స్పష్టంగా చూపిస్తున్నవేనని గుర్తించాలి. ఇందులో మతాంతరీకరణల కోణం ఉంది. లవ్‌ ‌జిహాద్‌ ‌కోణం కూడా బలంగానే ఉంది. ఇక దేశాన్ని అల్లకల్లోలం చేయడం, ఇస్లామిక్‌ ‌రాజ్య స్థాపన, హింస సరేసరి. గతంలో వలె ముస్లింలలోని నిరక్షరాస్యత వారిని ఉగ్రవాదం వైపు నడుపు తున్నదనీ, వారి పేదరికం రక్తపాతం వైపు అడుగులు వేయిస్తున్నదనీ చేసే వాదనలన్నీ శుద్ధ తప్పు అని, అవి ఉదారవాదులు, కుహనా సెక్యులరిస్టులు చేసే శుష్క ప్రవచనాలనీ ఇక్కడ మరోసారి రుజువైంది. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారే.

 ఇస్లామిక్‌ ‌రాడికల్‌ ‌కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అందిన సమాచారంతోనే దాడులు జరిగాయి. ఇంతకీ ఇక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నదో గానీ, మధ్యప్రదేశ్‌ అధికారులు ఇచ్చిన సమాచారంతో వీరు అప్రమత్తమయ్యారు. అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు జరిగాయి. ఐదుగురే కాకుండా మరొక ముగ్గురిని అరెస్టు చేసే అవకాశం ఉందని మధ్యప్రదేశ్‌ ‌డీజీపీయే చెప్పారు. ఈ ఐదుగురి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు మొదట ఆధారాలేవీ దొరకలేదు. ఇండియన్‌ ‌ముజాహిదిన్‌, ‌లష్కర్‌ ఏ ‌తాయిబా, హిజ్బుల్‌ ‌ముజా హుదీన్‌, అల్‌ ‌కాయిదా అయిపోయాయి. ఇప్పుడు వీరు పనిచేస్తున్న సంస్థ హిజ్బుత్‌ ‌తహ్రీర్‌. ‌మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌, ‌మరొక పట్టణం ఛింద్వాడాల్లో చిక్కిన 11 మంది ఈ గ్రూపునకు చెందినవారే. ఇది అల్‌ ‌కాయిదా కంటే భయానకమైనదన్న అభిప్రాయం ఉంది. 1953లో స్థాపించిన హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ 50 ‌దేశాల్లో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. ఈ సంస్థపై యూకే, ఆసియా దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ కార్యకలాపాలు సాగిస్తోంది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లలో ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అరెస్టయిన వారిలో భోపాల్‌ ‌గ్యాస్‌ ‌దుర్ఘటన బాధితుడి కుమారుడు మహమ్మద్‌ ‌వసీం కూడా ఉన్నాడు. మధ్యప్రదేశ్‌ ‌పోలీసులు పట్టుకున్న 16 మందిని భోపాల్‌ ‌తరలించి ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో మొదట పలాయనం చిత్తగించి తరువాత దొరికిన ఉగ్రవాది సల్మాన్‌ని కూడా అక్కడికే తీసుకువెళ్లారు. దొరికిన వారిలో ఐదుగురు హిందూ యువతులను వివాహాలు చేసుకున్న సంగతి కూడా బయటపడింది. అలాగే ఇద్దరు హిందువులు మతం మార్చుకుని ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఈ కేసులో అరెస్టయిన 16 మందిలో ఏడుగురు లవ్‌ ‌జిహాద్‌ ‌కేసులలో కూడా ఉన్నారని మధ్యప్రదేశ్‌ ‌హోం శాఖ మంత్రి నరోత్తమ్‌ ‌మిశ్రా కూడా చెప్పారు. మిశ్రా చెప్పిన వివరాల ప్రకారం ఆ ఏడుగురు కూడా మొదట హిందువులే. ఇస్లాం తీసుకున్నామని తరువాత దర్యాప్తులో చెప్పారని ఆయన అంటున్నారు. వీరేమీ చదువుకోని వారు కాదు. నిరక్షరాస్యులు కూడా కాదు. ఒక ఫార్మసీ ప్రొఫెసర్‌, ఒక ఇంజనీర్‌, ‌కొందరు ఉపాధ్యాయులు. ఫార్మసీ చదువుకున్న ఆ ప్రొఫెసరే హైదరాబాద్‌లో ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ‌నడుపుతున్న వైద్య కళాశాలలో పనిచేసేవాడు. ఇతడి పేరు మహమ్మద్‌ ‌సలీం. హిందువుగా ఉన్నప్పుడు పేరు సౌరభ్‌ ‌రాజవైద్య. పదవీ విరమణ చేసిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్‌ అశోక్‌ ‌జైన్‌ ‌కుమారుడు. వీరిది భోపాల్‌. ‌హైదరాబాద్‌ ‌నగరంలో చిక్కిన ఆరుగురిలో ముగ్గురు గతంలో భోపాల్‌ల్లోనే ఉండేవారనీ, నాలుగేళ్ల క్రితమే వారు నగరానికి వచ్చారనీ సమాచారం. ముగ్గురు గతంలో మతమార్పిడి ద్వారా ముస్లింలుగా మారి ఇస్లాం బోధనలు సాగిస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు. ఇది విస్తుపోయే సమాచారమే.


‌తహ్రీర్‌… ఎం‌దుకు పుట్టింది?

ఇస్లామిక్‌ ‌మతోన్మాద సంస్థలు, ఉగ్రవాద సంఘాలు కలుగుల నుంచి ఎలుకలు వచ్చినట్టు ఎక్కడెక్కడి నుంచో బయటకు వస్తున్నాయి. పాత వాటిని చావగొట్టి చెవులు మూస్తూ ఉంటే, కొత్త పేర్లతో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. లేకపోతే ఎక్కడో చరిత్ర పుటలలో మారుమూల పడి ఉన్న ప్రేతాత్మల వంటి పురాతన సంస్థలకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేసి కార్యకలాపాలకు సమాయత్తం చేస్తున్నారు. అలాంటిదే హిజ్బుత్‌ ‌తహ్రీర్‌. ‌హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ అం‌టే విమోచన సంస్థ. లేదా విమోచన కోసం పనిచేసే పక్షం.

హిజ్బుత్‌ అం‌తర్జాతీయ ముస్లిం రాజకీయ పక్షం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దీని పేరు పెద్దగా వినిపించకపోయినా ఇండోనేషియా రాజధాని జకార్తాలో తరచుగా ఇది సమావేశాలు నిర్వహించు కుంటుంది. నాటి పరిస్థితులను బట్టి 1953లో జెరూసలేంలో ఈ సంస్థ ఆవిర్భవించింది. తాకి అల్‌ ‌దిన్‌ అల్‌ ‌నభాని (1909-1977) దీనిని స్థాపించాడు. ఇతడు పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్‌ ‌పండితుడు. నాటి పరిస్థితులలో అంటే ఇరవయ్యో శతాబ్దం మధ్యలో ఇస్లాం దేశాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తహ్రీర్‌ ‌సంస్థ ఏర్పాటు అవసరమైందని ఇతడు చెప్పేవాడు. 1914 నాటి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఖలీఫా ప్రాబల్యం అంతరించడం, 1948 నాటి అరబ్‌-ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య యుద్ధాలు, పాలస్తీనా ఆక్రమణ వంటి పరిణామాలతో ఆయన ఇలాంటి ఒక సంస్థ ఏర్పాటు గురించి ఆలోచించాడు. ఖలీఫా నాయకత్వంలో ఉండే ఏక ప్రపంచాన్ని నిర్మించడంతోనే ముస్లిం సమాజానికి పూర్వ వైభవం వస్తుందని సిద్ధాంతీక రించుకున్నాడు. అంటే చరిత్ర మొత్తం కనిపించినట్టే ఇస్లాంకూ, రాజకీయాలకూ భేదం లేదనే ఇతడూ నమ్మకానికి వచ్చాడు. అంతకు ముందు ఈజిప్ట్‌లో మొదలైన (1928) ముస్లిం బ్రదర్‌ ‌హుడ్‌, ‌భారత్‌లో మొదలైన (1941) జమాత్‌ ఇ ఇస్లామీ ఇదే బాటలో నడిచాయి.

 తహ్రీర్‌ ‌పక్ష సభ్యులను రష్యా, మధ్య ఆసియా, టర్కియే, మధ్య ప్రాచ్యంలో తరచు అరెస్టు చేస్తుంటారు. ఆ మధ్య అరబ్బు దేశాలలో మొదలైన తిరుగుబాట్ల నేపథ్యంలో ఇది ఒక బలీయమైన శక్తిగా హఠాత్తుగా రూపుదిద్దుకుంది. ట్యునీసియా వ్యవహారాలలో కీలకపాత్ర పోషించినందు వల్ల ఈ ప్రాధాన్యం వచ్చింది. నిజానికి సోవియెట్‌ ‌రష్యా పతనమే దీని పునరుత్థానానికి మార్గం చూపింది. తరువాత ఈజిప్ట్, ‌సిరియాలలో వచ్చిన అలజడులలో కూడా దీని పేరు విస్త•ృతంగా వినిపించింది. ఇది ముస్లిం దేశాలలో ఖలీఫా పాలన ఉండాలని వాదిస్తుంది.

మూడు దశలలో తన ఆశయాన్ని అమలు చేయడం తహ్రీర్‌ ‌సంస్థ ప్రణాళిక. మొదటి దశలో మేధావులైన వారిని సంస్థలో చేర్చుకుంటారు. ప్రవక్త తన బోధనలను మొదటిసారి లోకానికి పరిచయం చేసినప్పుడు చూపించిన సహనం, నిభాయింపు వీరు చూపుతారు. రెండో దశలో ముస్లిం సమాజంతో మమేకం అవుతారు. అంటే సంస్థ సిద్ధాంతాన్ని సమాజంలో ప్రవేశపెడతారు. అలాగే అమలుకు కూడా పాటుపడతారు. తరువాత ఇస్లామిక్‌ ‌రాజ్యం ఏర్పాటు. అంటే దీని ఆశయం కూడా ఇస్లామిక్‌ ‌రాజ్య స్థాపన మాత్రమే. ఇందుకు అనుసరించే మార్గం జిహాద్‌.


కొన్నేళ్లుగా భారతదేశంలో దీని కార్యకలాపాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. మొదట దీనిని చాలా సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది ఐఎస్‌ఐఎస్‌ ‌కంటే ప్రమాదకరమైనదని తరువాత తేలింది. కొంతవరకు దీని సమాచారం భారత్‌ ‌వద్ద కూడా ఉంది. అది అంతర్జాతీయ నిఘా సంస్థల ద్వారా లభించిన సమాచారం. దీనికి 50 దేశాలలో సభ్యులు ఉన్న సంగతి అలా తెలిసినదే. దక్షిణ ఆసియాకు సంబంధించి దీని ప్రభావం ప్రధానంగా పాకిస్తాన్‌, ‌బంగ్లాకే పరిమితమన్న భావన ఉండేది. కానీ ఇజ్రాయెల్‌ ‌ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా నిరసన పేరుతో ఈ సంస్థ ఢిల్లీలోని బాట్లా హౌస్‌ ‌వద్ద కార్యక్రమం నిర్వహించింది. ఇది 2010లో జరిగింది. తహ్రీర్‌ ‌భారత్‌లో నిర్వహించిన కార్యక్ర మంగా దీనిని మన నిఘా వర్గాలు గుర్తించాయి. అప్పుడు కొందరిని అరెస్టు చేసి ప్రశ్నించారు కూడా. అయితే హఠాత్తుగా ఈ సంస్థ సంగతి బయటపడింది. కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో తమిళనాడులో జియావుద్దీన్‌ ‌బఖావి అనే ఉగ్రవాది భద్రతా సిబ్బందికి దొరికిపోయాడు. అప్పుడే హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ ‌సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా సభ్యులున్నారని, ఇండియాలోనూ సానుభూతిపరులున్నారని అధికారులు గుర్తించారు. ఆ సానుభూతిపరులను గుర్తించే క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ‌ఛింద్వారా నగరాల్లో కొందరిని పట్టుకున్నారు. ఆ సమయంలో దొరికిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్న ఆరుగురిపై నిఘా పెట్టారు. ఈ సమయంలో వారి గురించి పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతే అదుపులోకి తీసుకున్నట్టు ఏటీఎస్‌ ‌పోలీసులు వెల్లడించారు. కాగా కుత్బుల్లాపూర్‌ ‌పరిధిలోని జగద్గిరిగుట్ట, రొడామిస్త్రీ నగర్‌, ‌గాజులరామారం, దేవేందర్‌ ‌నగర్‌, ‌కైసర్‌ ‌నగర్‌, ‌సూరారం కాలనీ, సాయిబాబానగర్‌ ‌ప్రాంతాలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కువ శాతం నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో పోలీసుల నిఘా లేక పోవడంతోనే అసాంఘిక శక్తులు దీన్ని తమ అడ్డాగా మార్చుకుంటున్నాయని, కాబట్టి నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ ‌మీద యూకేతో పాటు పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌వంటి ఆసియా దేశాల్లో నిషేధం ఉన్నా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలున్నాయి. ఇస్లామిక్‌ ‌రాడికలిజం సాగిస్తున్నారనే అనుమానంతో తొలుత భోపాల్‌లో ఉన్న అనుమానితులపై నిఘా పెట్టిన అధికారులు వారిలో సంప్రదింపుల ఆధారంగా హైదరాబాద్‌పై కూడా దృష్టి సారించారు. 15 నెలల పాటు నిఘా సాగించారు. కానీ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. హెచ్చరించలేదు. అంత జాగ్రత్త పడ్డారు. ఒక్కరు చిక్కితే మిగతా వారు పరారవుతారనే ఆలోచన, వారితో లింకై ఉన్నవారి గురించి పూర్తి ఆధారాలు సేకరించడానికి కాస్త సమయం తీసుకు న్నారు. ఆ తర్వాత మే 9న ముహూర్తం పెట్టి భోపాల్‌, ‌ఛింద్వారా, హైదరాబాద్‌లలో ఏకకాలంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

 ప్రధానంగా భోపాల్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న ప్పటికీ హైదరాబాద్‌లో దీని విస్తృతి తక్కువేమీ కాదు. నగరంలోని మల్లెపల్లి, ఆసిఫ్‌నగర్‌, ‌గోల్కొండ, టోలీచౌకి ప్రాంతాల్లో నివసించిన ఆ ఆరుగురు ఉగ్రవాదులు ఇక్కడ బయాన్‌ ‌పేరుతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం ఉంది. హైదరాబాద్‌లో చిక్కిన వారిలో ప్రధాన నిందితుడు మహమ్మద్‌ ‌సలీం అలియాస్‌ ‌సౌరభ్‌రాజ్‌ 2018‌లో ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు. ఓ వైద్య కళాశాలలో ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని నగరానికి తీసుకువచ్చాడు. పెద్ద స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి జనాన్ని సమీకరించేవారని, గోల్కొండ లోని సలీం ఇంట్లోనే సమావేశాలు నిర్వహించేవారని మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ ‌పోలీసులు గుర్తించారు. ఆ సమావేశాలకు హాజరైనవారి గురించి తెలంగాణ కౌంటర్‌ ఇం‌టెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

తక్కువ మందే అయినా ఏర్పాట్లు పెద్దగానే ఉన్నాయని దాడుల తరువాత అర్ధమైంది. హైదరా బాద్‌లో ఇంటెలిజెన్స్ అధికారులు (ఐబీ), తెలంగాణ రాష్ట్ర కౌంటర్‌ ఇం‌టెలిజెన్స్ అధికారులతో కలిసి గోల్కొండ, టోలీచౌకీ, మల్లెపల్లి, జవహర్‌నగర్‌, ‌జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో వీరు తనిఖీలు నిర్వహిం చారు. మహమ్మద్‌ ‌సలీమ్‌, అబ్దుల్‌ ‌రెహ్మన్‌, ‌మహ్మద్‌ అబ్బాస్‌, ‌షేక్‌ ‌జునైద్‌, ‌మహ్మద్‌ ‌హమీద్‌లను అరెస్ట్ ‌చేశారు. అనంతరం పక్కా సమాచారంతో మేడ్చల్‌ ‌జిల్లా జవహర్‌ ‌నగర్‌లోని విఘ్నేశ్వర కాలనీలో ఉన్న సల్మాన్‌ ‌నివాసంలో తనిఖీలు చేసి, ఎయిర్‌గన్‌తో పాటు పిల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారంతో సల్మాన్‌ ‌పారిపోయాడు. అయితే అతణ్ని మరునాడు ఉదయం పట్టుకుని భోపాల్‌ ‌తరలించారు. మినీ ఇండియాగా పేరుగాంచిన జవహర్‌ ‌నగర్‌ ‌కార్పొరేషన్లో సల్మాన్‌ అనే ఉగ్రవాదిని అరెస్ట్ ‌చేశారంటూ వార్తలు రావడంతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాకూబ్‌ అనే వ్యక్తి సుమారు 20 ఏళ్ల క్రితం జవహర్‌ ‌నగర్‌, ‌బాలాజీనగర్‌లోని శివాజీనగర్‌లో స్థిరపడ్డాడు. అతనికి నలుగురు కుమారుల్లో ఒకడు సలాం అలియాస్‌ ‌సల్మాన్‌ (27). అతడు వెల్డింగ్‌ ‌పనులు చేసేవాడు. ఎప్పుడూ ఎవరితో గొడవలు పడేవాడు కాదు. చెప్పిన పని చేసి వెళ్లిపోయేవాడు. మధ్యప్రదేశ్‌ ‌పోలీసులు అరెస్టు చేసిన హమీద్‌ ‌జగద్గిరిగుట్టలో రహస్య జీవితం గడుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతణ్ని బయట ఎప్పుడూ చూడలేదని సమాచారం. బయటకు వెళ్లే సమయంలో ముఖం కనిపించకుండా హెల్మెట్‌ ‌ధరించేవాడు. రాత్రి ఎప్పటికో వచ్చేవాడు. ఇంట్లో నలుగురు చిన్నపిల్లలు, భార్య ఉన్నా మనుషులు లేనట్టుగానే కనిపించేది. ఇంటి ముందు తలుపునకు ఎప్పుడూ తాళం వేసి ఉండేదని స్థానికులు చెబుతు న్నారు. హమీద్‌ ‌వెల్డింగ్‌ ‌పనిచేస్తుండేవాడని భార్య హమీదాబేగం కూడా చెప్పారు. రెండు సంవత్స రాలుగా వీరు మగ్దూంనగర్లో ఉంటున్నా పక్కంటి వారితో కూడా మాట్లాడిన దాఖలాలు లేవని చెప్పుకొంటున్నారు.


2014 ‌నుంచి …

2014 నుంచి 2018 వరకు చూసినా హైదరాబాద్‌ ‌కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు వందలలో నమోదైనాయి. అవి పెరుగుతూనే ఉన్నాయి. 2018లో మూడు, 2017లో 14, 2016లో 31, 2015లో 45, 2014లో 28 అరెస్టులు జరిగాయి. ఇండియన్‌ ‌ముజాహిదీన్‌ ‌నాయకుడు యాసిన్‌ ‌భత్కల్‌ ‌హైదరాబాద్‌ ‌నుంచి తన భార్యతో మాట్లాడి నట్టు నిఘా వర్గాలు కనిపెట్టాయి. అది కూడా జైలు నుంచి. డెమాస్కస్‌ ‌సాయంతో తాను త్వరలోనే బయటపడతానని అతడు ఫోన్‌లో భార్యకు చెప్పాడు. బర్ధమాన్‌ ‌పేలుళ్లకు సంబంధించి ఖలేదా మహ్మద్‌ అనే మైన్మార్‌ ‌జాతీయుడిని 2014లో ఇక్కడే అరెస్టుచేశారు. ఇతడిని హైదరాబాద్‌లోనే జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అలాగే సిమీ కార్యకర్తలు ఎందరినో ఇక్కడే అరెస్టు చేశారు. ఈ జాబితా చాలా పెద్దది.


అలాగే.. పోలీసులు అదుపులోకి తీసుకున్న మరో ఉగ్రవాది మహ్మద్‌ ‌సలీం అలియాస్‌ ‌సౌరభ్‌ ‌రాజ్‌ ఓ ‌ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌. అది అసదుద్దీన్‌ ఒవైసీది కావడం విచిత్రమే. అక్కడ ఒక విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నట్లు సమాచారం. అతడికి భోపాల్‌లో ఉన్న హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ ‌గ్రూపుతో సంబంధాలున్నట్లు మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ అధికారులు గుర్తించారు. భోపాల్‌, ‌ఛింద్వారాల్లో తమ చేతికి చిక్కిన 11మంది హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ ‌గ్రూపులో కొందరు సలీంతో సంబంధాలు పెంచుకున్నారని వారికి తెలిసింది. ఒడిశాకు చెందిన అబ్దుల్‌ ‌రెహ్మాన్‌ ‌ప్రముఖ బహుళజాతి సంస్థ (ఎంఎన్సీ)లో క్లౌడ్‌ ఇం‌జనీర్‌గా పనిచేస్తున్నాడు. షేక్‌ ‌జునైద్‌ ‌పాతబస్తీలో డెంటిస్ట్. అబ్బాస్‌ ఆటో డ్రైవర్‌.

‌భోపాల్‌-‌హైదరాబాద్‌ ఉ‌గ్రవాద కుట్ర బయటపడిన తరువాత కేంద్ర ప్రభుత్వం చురుకుగానే వ్యవహరించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. దర్యాప్తు సందర్భంగా, దాడుల సందర్భంగా కొంత సమాచారం నిఘావర్గా లకు చిక్కింది. దీనిని బట్టి ఇది మైనారిటీలను లక్ష్యం చేసుకున్న దాడి అనడానికి వీలు లేనంత గట్టిగా ఆధారాలు లభించాయి. వారి వద్ద దొరికిన పత్రాలు, కేసెట్లు ఖలీఫా రాజ్యం గురించి ప్రస్తావించిన సంగతి బయటపడింది. కొందరు సభ్యులు సమావేశాలలో ప్రజాస్వామ్యం వద్దంటూ ఖలీఫా రాజ్యం గురించి ప్రబోధించారు. వీరి ఫోన్లలో పాకిస్తాన్‌ ‌దేశీయుల నంబర్లు కూడా కొన్ని దొరికాయి.

వీరు యువకులను చేర్చుకుని రహస్యంగా తుపాకీ పేల్చడం వంటి పనులు నేర్పుతున్నట్టు కూడా బయటపడింది. ఇవన్నీ కూడా సమీపంలోని అటవీ ప్రాంతంలోనే (తెలంగాణలోనే) జరుగుతున్నట్టు కూడా బయటపడింది. దర్స్ ‌పేరుతో జరిగే కార్యక్ర మాలలో జిహాదీ సాహిత్యం పంచడం, నాయకులు ఉద్రేక పరిచే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి కూడా చేశారని తెలిసింది. ఇందులో చేరిన యువకులు సంస్థ లక్ష్యం నెరవేరడానికి ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేవారు.

తెలంగాణను, అందులోను దేశానికే గర్వ కారణంగా నిలుస్తున్న హైదరాబాద్‌ను ఉగ్రవాద చెర నుంచి తప్పించవలసిన బాధ్యతను తక్షణమే ప్రభుత్వాలు స్వీకరించాలి. నిజామాబాద్‌లో, భైంసాలో ఆ మధ్య పట్టుబడిన ఉగ్రవాద మూకల వ్యవహారాలు చూసినా దీని తక్షణ అవసరం ఏమిటో కూడా బోధపడుతుంది. ఐటీ పరిశ్రమకు, వైద్యరంగానికి గొప్ప కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో నగరం ఉగ్రవాద ముఠాల జాడలు ప్రగతికి దోహదపడేవి కాదు. సెక్యులర్‌ అని చెప్పుకునే పార్టీలు ఉగ్రవాద నిర్మూలనలో రాజకీయాలు నెరపడం సరికాదు. బుజ్జగింపుతో మైనారిటీలలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం నగరానికే కాదు, దేశానికి కూడా చేటు. ఈ విషయంలో బీజేపీ నాయకులు ఏం చెప్పినా అందులో హిందూత్వను చూడడం, ముస్లిం వ్యతిరేకతను చూడడం వాస్తవిక దృష్టి అనిపించుకో లేదు. ఉగ్రవాదానికీ మతానికీ సంబంధం లేదు. ఉగ్రవాదానికి మతం లేదు. హింసోన్మాదం మాత్రమే ఉగ్రవాదానికి ఆలంబనగా ఉంటుంది. సాహిత్య పరంగా, కళల పరంగా హైదరాబాద్‌కు ఉన్న ఖ్యాతి వేరు. ఇక్కడి ముస్లింలు ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచారన్న అపకీర్తి మూట కట్టుకోవడం సరికాదు.

జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram