జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

”నేను ఇవాళ విప్లవసేనతో తలపడ్డాను!”

ప్రపంచ చరిత్ర నిర్ఘాంతపోయిన కిరాతకమది. అంతటి రక్తపాతానికి పాల్పడి కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనరల్‌ డయ్యర్‌, అమృత్‌సర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌కు పంపించిన నివేదికలో రాసిన మాటలివి.

”నీ నిర్ణయం, నీ చర్య తప్పుకాదు!” అన్నది లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సమాధానం.

ఇంతకీ తాను తలపడ్డానని జనరల్‌ డయ్యర్‌ చెప్పిన ఆ విప్లవసేన ఏది?

రౌలట్‌ చట్టం దారుణమని, ఆ చట్టం అమలు మరింత అవమానకరమని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరాయుధుల సమూహం.

ఆ చట్టం పేరుతో పెళ్లి బృందమని కూడా చూడ కుండా నేల మీద పాకించిన కిరాతకానికి అభ్యంతరం వ్యక్తం చేసిన సాధారణ ప్రజానీకం.

ఈ సాధారణ ప్రజానీకమే జనరల్‌ డయ్యర్‌ కళ్లకీ, అతడి శ్వేత దురహంకార దృష్టికీ విప్లవసేన కింద కనిపించింది. ఫలితమే జలియన్‌వాలా బాగ్‌ దురంతం.

ఏప్రిల్‌ 13, 1919… బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో మరచిపోలేని రోజు. పంజాబ్‌ లోని అమృతసర్‌లో స్వర్ణదేవాలయం పక్కనే ఉన్న జలియన్‌వాలా బాగ్‌ మైదానంలో శాంతియుతంగా సమావేశమైన పౌరుల మీద బ్రిటిష్‌ పోలీసులు కాల్పులు జరిపారు.

రౌలట్‌ చట్టాలకు వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమావేశం జరిగింది. ఆ సంవత్సరం ఏప్రిల్‌ ఆరున హర్తాళ్‌, నిరాహారదీక్ష జరగాలని గాంధీ పిలుపునిచ్చారు. అహింసా మార్గాన్ని విడనాడితే తాను ఉద్యమాన్ని నిలిపివేస్తానని కూడా హెచ్చరించారు. గాంధీజీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. కానీ గాంధీజీ చేసిన శాంతి హెచ్చరిక పంజాబ్‌కు చేరే లోపుననే అక్కడ హింసాయుత వాతావరణం నెలకొంది. అమృతసర్‌ సభలో పాల్గొనడానికి వస్తున్న గాంధీని ఆ నగరానికి కొంచెం ముందే రైలు నుంచి దించి బొంబాయి తీసుకుపోయి నిర్బంధించడం కూడా జరిగిపోయింది. ఈ వార్త తెలిసి ఏప్రిల్‌ ఆరు నుంచి అమృత్‌సర్‌ పరిసరాలలో అల్లర్లు మొదలైనాయి. ఈ అల్లర్లను అణచివేయడానికి అమృతసర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మైకేల్‌ ఫ్రాన్సిస్‌ ఓడ్వయ్యర్‌ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అందుకే జనరల్‌ బ్రిగేడియర్‌ రెజినాల్డ్‌ ఇ.హెచ్‌. డయ్యర్‌ను తాత్కాలిక మిలటరీ కమాండర్‌ గా నియమించాడు. ఏప్రిల్‌ పదో తేదీన స్థానిక నాయకులు డా. సైఫుద్దీన్‌ కిచూ, డా. సత్యపాల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దీనితో అల్లర్లు మరింత పెరిగాయి. ఒక బ్యాంకులోకి మూకలు చొరబడి ఐదుగురు ఐరోపా అధికారులను చంపివేశారు. అమృతసర్‌లోని మిషన్‌ స్కూలు మేనేజరు మార్బెల్లా షేర్వుడ్‌ అనే మహిళ సైకిల్‌ మీద వెళుతుండగా కొందరు కింద పడతోశారు. దీనితో భారతీయులు వీధిలోకి వస్తే చతుష్పాద జంతువుల్లా పాకి వెళ్లాలని ఆదేశాలు వచ్చాయి. సైనిక శాసనం అమలులోకి వచ్చింది. ఒక పెళ్లి బృందాన్ని కూడా జనరల్‌ డయ్యర్‌ కొరడాలతో కొడుతూ నడి రోడ్డు మీద పాకించాడు. ఈ అలజడులు, అంశాంతికి కొంచెం తలొగ్గి కిచ్లూ, సత్యపాల్‌లను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ పంజాబ్‌ మొత్తం జనరల్‌ డయ్యర్‌ నిషేధాజ్ఞలు ప్రకటించాడు. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో ఈ సంగతి ప్రకటించాడు. అయినా ఏప్రిల్‌ 13న జలియన్‌ వాలాబాగ్‌ లో సభ జరపాలని కాంగ్రెస్‌లోని హిందువులు, ముస్లింలు, సిక్కులు నిర్ణయించారు. నిజానికి ఈ ఆంక్షల గురించి ప్రజానీకానికి సరైన సమాచారం లేదు.

ఆ రోజే వైశాఖి. అంటే పంజాబీ వారి సంవత్స రాది. గురుగోవింద్‌ సింగ్‌ ఆరంభించిన (1699) ఖల్సా పంథ్‌ దినోత్సవం కూడా అదే. ఆ ఉత్సవంలో పాల్గొనడానికి అమృతసర్‌ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి జనం జలియన్‌వాలా బాగ్‌ వచ్చారు. వీరెవరికీ సైనిక శాసనం సంగతి తెలియదు. సాయంత్రం నాలుగు గంటలకు సభ అని ప్రకటిం చారు. అలా గే మొదలుపెట్టారు. హన్స్‌రాజ్‌, అబ్దుల్‌ అజీజ్‌, గురు భక్ష్‌రాయ్‌, రాయ్‌రామ్‌సింగ్‌, ధన్‌సింగ్‌, అబ్దుల్‌ మాజిద్‌, బ్రిజ్‌ గోపీనాథ్‌ వంటి స్థానిక నేతలు ప్రసంగించడం పూర్తయింది.

బ్యాంక్‌ ఉద్యోగి అయిన గోపీనాథ్‌ ఉర్దూలో ‘ఫర్యాద్‌’ అనే కవితను చదువుతున్నాడు. ‘ఫర్యాద్‌’ అంటే, ‘కోరుకుంటున్నాం!’ అని అర్థం.

అప్పుడే ఎవరూ కోరుకోకూడని, ఊహించలేని అవాంఛనీయమైన సంఘటన జరిగిపోయింది. ఆ కవిత చదువుతుండగానే ”వచ్చేశారు… వచ్చేశారు” అంటూ జనంలో కలకలం బయలుదేరింది. జనరల్‌ డయ్యర్‌ 65 మంది గూర్ఖా సైనికులను, 25 మంది బలూచీ సైనికులను వెంట పెట్టుకుని బాగ్‌ దగ్గరకు వచ్చాడు. అందులో 303 ఎన్‌ఫీల్డ్‌ తుపాకులు ఉన్న వారిని బాగ్‌ లోపలకి పంపాడు. ఒక్కటే మార్గం. అక్కడ నుంచి కూడా పోవడానికి వీలులేకుండా సైనికులు లోపలికి వచ్చి జనం మీద కాల్పులు మొదలుపెట్టారు.

జలియన్‌వాలా బాగ్‌ కాల్పులు సాయంత్రం నాలుగు తరువాత జరిగాయి. జనరల్‌ డయ్యర్‌ ఆ రోజు మధ్యాహ్నం 12.40 తరువాత జలియన్‌వాలా బాగ్‌కు వచ్చాడు. అక్కడ సమావేశం సంగతి కూడా తెలుసు. అయినా మాట్లాడకుండా, సాయంత్రం ఈ దురాగతానికి తెగబడ్డాడు. భారతీయులకు ‘పాఠం’ చెప్పడమే అతడి లక్ష్యం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారత వలసలో కొంచెం కూడా వ్యతిరేక ఉండరాదన్నదే ఇంగ్లండ్‌ లక్ష్యం. గ్రేట్‌వార్‌ కాలంలో గదర్‌పార్టీ జర్మనీతో మంతనాలు జరిపిందని బ్రిటన్‌ అనుమానం. ఆ కుట్రను ఛేదించడం రౌలట్‌ కమిషన్‌ లక్ష్యాలలో ఒకటి. గదర్‌పార్టీలో ఎక్కువ మంది పంజాబీలే. పైగా ఆ సంస్థను అతి దారుణంగా అణచి వేయడం కూడా పంజాబీలకు బాధ కలిగించింది. గ్రేట్‌వార్‌లో పంజాబ్‌ ఆంగ్ల ప్రభుత్వానికి విశేషంగా సాయ పడింది. ఆ సంగతి కూడా మరచిపోయి ఆంగ్లేయులు పంజాబీల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించారు.

పది నిమిషాలే కాల్పులు జరిగాయి.

దాదాపు 1650 రౌండ్లు పూర్తయ్యి, మందు గుండు నిండుకున్న తరువాతనే ఆగాయి.

లోనికి ప్రవేశించడానికీ, బయటకి రావడానికీ జలియన్‌వాలా బాగ్‌కు ఒక్కటే మార్గం. దాదాపు నాలుగు గోడల మధ్య ఈ కిరాతకం జరిగింది. తుపాకీ గుళ్లు తగిలి చనిపోయిన వారు, తొక్కిస లాటలో చనిపోయినవారు ఎందరో!

హర్మందిర్‌ సాహెబ్‌ దగ్గరే ఉన్న ఈ తోటలో జరిగిన కాల్పులలో 379 మంది చనిపోయారనీ, 1137 మంది గాయపడ్డారనీ ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ అంకె నిజం కాదనీ, చనిపోయినవారి సంఖ్య ఇంకా ఎంతో ఎక్కువ అని గాంధీగారికి సమాచారం అందుతోంది. సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ సభ్యుడు, సేవా సమితి గౌరవ కార్యదర్శి వి.ఎన్‌. తైవ్‌రాజ్‌ కాల్పులకు బలైన వారి సంఖ్య 590 అని చెప్పారు. బీహార్‌ నాయకుడు హసన్‌ ఇమామ్‌ అమృతసర్‌లో తానే 941 మృతదేహాలను లెక్కించినట్టు వెల్లడించారు. ఇది జరిగిన కొద్దిరోజుల తరువాత ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్లో చర్చను లేవదీసిన మదనమోహన మాలవీయ 1000 మంది వరకు చనిపోయారని ప్రకటించారు. ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామీ శ్రద్ధానంద ఇంకా బాధ కలిగించే సంఖ్య చెప్పారు. బాగ్‌ లో మరణించిన వారు 1500 అని ఆయన గాంధీగారికి రాసిన లేఖలో ఉటంకిం చారు. భారత జాతీయ కాంగ్రెస్‌ సొంతంగా ఏర్పాటు చేసుకున్న దర్యాప్తు సంఘం కూడా ఇదే సంఖ్యను ధ్రువీకరించింది. మొత్తం 1500 మంది అని, అందులో మృతులు 1000 మంది అని కాంగ్రెస్‌ నివేదిక నిర్ధారించింది. లోపల ఉన్న బావిలో నుంచే 120 మృతదేహాలను వెలికి తీసిన సంగతిని కూడా ఇందులో పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన కొద్దిసేపటికి ఆ ప్రాంతానికి వెళ్లిన స్థానికుడు లాలా గిరిధర్‌ లాల్‌ కూడా ఇదే అంకెను వెల్లడించారు. మృతులలో 41 మంది బాలురు, ఆరువారాల శిశువు కూడా ఉన్నారని పంజాబ్‌ ప్రభుత్వమే ప్రకటించింది. చనిపోయిన వారి సంగతే కాదు, గాయాలతో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా నగరంలో జనసంచారాన్ని నిషేధిస్తూ రాత్రి 8 గంటల వేళ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడం మరీ బాధాకరం. గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘సర్‌’ బిరుదులను త్యజించారు. ”మీ పాలనలో మా భారతీయులు ఎంత నిస్సహాయులో జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత ద్వారా అవగతమైంది” అంటూ వైస్రాయ్‌ లార్డ్‌ చెమ్స్‌ఫర్డ్‌కు లేఖ రాశారు. మోతీలాల్‌ ఇంగ్లండ్‌ నుంచి తెచ్చుకున్న ప్రతి వస్తువునీ ఆనందభవన్‌ పెరట్లో వేసి దగ్ధం చేశారు.

జలియన్‌వాలా బాగ్‌ దురంతం తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పుండు మీద కారం చల్లినట్టే ఉంటుంది. లార్డ్‌ విలియం హంటర్‌ నాయకత్వంలో ‘జలియన్‌వాలా బాగ్‌ దురంగం దర్యాప్తు సంఘం’ నియమించారు. నిజానికి ఈ సంఘాన్ని అవకతవకల దర్యాప్తు కోసమే నియ మించారు. ఏడుగురు సభ్యులు ఇందులో ఉంటే, మళ్లీ నలుగురు ఆంగ్లేయులు. విలియం హంటర్‌ స్కాట్లాండ్‌ సెనేటర్‌. హోంశాఖకు చెందిన డబ్ల్యు ఎఫ్‌ రైస్‌, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జిసి ర్యాంకన్‌, పెషావర్‌ సైనిక విభాగానికి చెందిన మేజర్‌ జనరల్‌ సర్‌ జార్జ్‌ బరో ఆంగ్లేయులు. సర్‌ చిమనలాల్‌ సెతల్వాడ్‌, పండిత్‌ జగత్‌ నారాయణ్‌, సర్దార్‌ సుల్తాన్‌ అహ్మద్‌ఖాన్‌ భారతీయులు.

హంటర్‌ నివేదికకు ముందే భారత జాతీయ కాంగ్రెస్‌ తన నివేదికను బయటపెట్టింది. జనరల్‌ డయ్యర్‌ చర్యను అందులో తీవ్రంగా గర్హించింది. అసలు పంజాబ్‌లో సైనిక శాసనం అవసరం ఏముందని ప్రశ్నించింది. తరువాత వెలువడిన హంటర్‌ నివేదిక జనరల్‌ డయ్యర్‌ తీసుకున్న చర్యను ఖండిచింది. కానీ సైనిక శాసనాన్ని సమర్థించింది. అమృత్‌సర్‌లో, ఇతర ప్రాంతాలలో శాంతిభద్రతలు భగ్నం కావడానికి గాంధీయే కారణమని కూడా హంటర్‌ నివేదిక ఆరోపించింది. ఈ నివేదిక తరువాత కొంచెం ఆలస్యం గాంధీజీ తన కైజర్‌ ఎ హింద్‌ పదవిని కూడా త్యజించారు.

జనరల్‌ డయ్యర్‌ను బాధ్యతల నుంచి తప్పించి ఇంగ్లండ్‌ పంపించారు. భారతీయులలో ఇంతటి భీతావహాన్ని సృష్టించిన జనరల్‌ డయ్యర్‌ను ఒట్టి చేతులతో పంపలేదు. బహుమానంగా 26,000 పౌండ్లు ముట్టాయి. ఇతడు 1927లో గుండెపోటుతో చనిపోయాడు. బాగ్‌ రక్తపాతానికి కక్ష కట్టి పంజాబ్‌ గవర్నర్‌ మైఖేల్‌ ఓడయ్యర్‌ను మార్చి 13, 1940లో ఉద్దమ్‌సింగ్‌ లండన్‌లోనే కాక్‌స్టన్‌ హాలులో కాల్చి చంపాడు. వందేళ్ల నాటి జలియన్‌వాలా బాగ్‌ దురాగతంలో మరణించిన వారి గురించి బ్రిటిష్‌ పార్లమెంటులో ఎగువ సభ త్వరలోనే స్వల్పకాలిక చర్చను నిర్వహించబోతున్నది. లార్డ్‌ మేఘనాథ్‌ దేశాయ్‌, రాజ్‌ లూంబా ఇందుకు చొరవ చూపారు. ఆ ఇద్దరు బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యులే. ఈ రక్తపాతం గురించి పంజాబ్‌కు ఇంగ్లండ్‌ క్షమాపణలు చెప్పాలని ఈ ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం ఆమోదించింది.

ఇందుకు క్షమాపణ చెప్పే ఉద్దేశం ఇంగ్లండ్‌కు లేదని రెండుమూడు సందర్భాలలో తేలిపోయింది. నిజమే, ఇలాంటి వాటికి క్షమాపణలు చెప్పే పని మొదలుపెడితే ఇంగ్లిష్‌ జాతికి చాలాకాలం వరకు ఖాళీ దొరకదు. సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఇంగ్లండ్‌ ఇలాంటి ఎన్నో రక్తపు మరకలను అంటించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *