బీజేపీకి నాలుగు వందల స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్‌ విషప్రచారం సాగించింది.  రాహుల్‌ గాంధీ   చేతిలో రాజ్యాంగ ప్రతిని ఉంచుకుని మరీ ఎన్నికల్లో విద్వేష  ప్రచారం సాగించారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగినంత మాత్రాన దానికి విలువ ఇస్తున్నట్టు, దాని ప్రాతిపదికగా రాజకీయాన్ని నడుపుతున్నట్టు కాదని అంతా గ్రహించాలి. అసలు కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉంది? ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏ తీరుగా నడిచాయి?

స్వాతంత్య్రానంతరం నిర్వహించిన 17 సార్వత్రిక ఎన్నికల్లో, కాంగ్రెస్‌ ఏడుసార్లు పూర్తి మెజార్టీ సాధించి అధికారం చేపట్టింది. మూడుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను నడిపింది. మొత్తం 54 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ ఐదు దశాబ్దాలలో 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగాయి. షాబోనా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టటం, ఎమర్జెన్సీ విధింపు, ఆర్టికల్‌ 356 దుర్వినియోగం వంటి అంశాలు ఇందుకు కొన్ని ఉదాహరణలు.

షాబానో కేసు

ముస్లిం మహిళల స్వేచ్ఛ, హక్కుల పోరాటంలో మైలురాయిగా షాబానో కేసును పేర్కొంటారు. షాబానో అనే ముస్లిం మహిళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన న్యాయవాది మహ్మద్‌ అహ్మద్‌ఖాన్‌ను వివాహం చేసుకుంది. మొత్తం ఐదుగురు సంతానం. 14 సంవత్సరాల తర్వాత షాబానో భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు. 1975లో, 62 ఏళ్ల షాబానోను పిల్లలతో సహా తరిమివేశాడు. దాంతో 1978లో ఆమె సెక్షన్‌ 125 సీఆర్పీసీ కింద ఇండోర్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేటు కోర్టులో పిటీషన్‌ వేసింది. నవంబరు 1978లో మహమ్మద్‌ఖాన్‌ షాబానోకి తలాక్‌ చెప్పాడు. భరణం చెల్లించ నవసరంలేదని వాదించాడు.

స్థానిక కోర్టునెలకు రూ.25 వంతున మెయింటెనెన్స్‌గా చెల్లించమని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రూ.179 పెంచాలని కోరుతూ షాబానో మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. ఖాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కూడా ఖాన్‌ వాదనను సమర్థించింది. షాబానో కేసులో ఏప్రిల్‌ 23, 1985లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఆమె తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి నెలవారీగా 179.20పై నెలవారీ అలవెన్సుగా పొందవచ్చని పేర్కొంది. ముస్లిం మత గురువులు, ముస్లిం లా బోర్డు ఈ తీర్పును అంగీకరించలేదు.

తర్వాత జరిగిన పరిణామాలు అననుకూలంగా మారాయి. రాజీవ్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లిం మహిళల (ప్రొటెక్షన్‌ ఆన్‌ డైవర్స్‌ యాక్ట్‌),1986 పేరుతో చట్టాన్ని చేసింది. ఈ చట్టం ద్వారా షాబానో కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయనవసరంలేనిదిగా మారింది. కేవలం ఇద్దత్‌ వ్యవధి వరకే మెయింటెనెన్స్‌ వర్తిస్తుందని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు బాధిత మహిళకు ఆమెపైన ఆధారపడిన పిల్లలకు స్థిరత్వం అందించటానికి వక్ఫ్‌బోర్డుకు మెజిస్ట్రేట్‌ తగిన సూచనలు చేయవచ్చని సూచించింది.

షాబానో కేసులో రాజీవ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన పత్రికలు తప్పుపట్టాయి. అప్పటి వరకూ ‘రాజీవ్‌ను కొత్త ఆశాకిరణం’ అని కీర్తించే టైమ్స్‌ ఇండియా సంపాదకుడు గిరిలాల్‌ జైన్‌ తీవ్రంగా నిందిస్తూ వ్యాసం రాశాడు. మరో సంపాదకుడు అరుణ్‌శౌరి కూడా విమర్శలు గుప్పించాడు. షాబానో తీర్పును తారుమారు లేదా తల్లకిందులు చేయవద్దని హోం, న్యాయశాఖలు సలహా ఇచ్చినా ప్రధాని పెడచెవిన పెట్టారని విమర్శించారు. పార్లమెంటు హౌస్‌కు పిలిపించి మాట్లాడినప్పుడు అరుణ్‌శౌరి తన అభిప్రాయాన్ని రాజీవ్‌ కి సూటిగా చెప్పారు. 73 ఏళ్ల బాధిత మహిళకు నెలవారీ రూ.179.20పై చెల్లించటం ఇస్లాం మతానికి ఏ రకంగా భంగకరం అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీవ్రవాదులకు తలొగ్గుతుందనే భావనలో ఉన్నారు.సుప్రీం తీర్పుపైన పార్లమెంటులో మాట్లాడి అందరి ప్రశంసలు పొందిన హోంశాఖ సహాయమంత్రి అరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేయటం ఇందులో కొసమెరుపు. షాబానో కేసులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల హిందువులకు ఆగ్రహం కలిగిందన్న వార్తలు ప్రధాని రాజీవ్‌గాంధీని కలిచివేశాయి.

ఎమర్జెన్సీ నిర్ణయం

1975జూన్‌ 25వ తేదీ అర్థరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించటం ప్రజా స్వామ్యంలో చీకటిరోజుగా చరిత్రలో నమోదయ్యింది. అది రాజ్యాంగపీఠిక మీద జరిగిన దాడి. ఎమర్జెన్సీ దుష్పరిణామాలు ఏమిటో అవి ప్రజాస్వామ్యాన్ని ఎలా దెబ్బతీశాయో ఇన్ని సంవత్సరాలుగా విస్తృతమైన చర్చే సాగుతోంది. ఈ సందర్భంగా ఎన్నో అకృత్యాలు చోటుచేసుకున్నాయి. తన రెండో కుమారుడు సంజయ్‌గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించ టానికి అవకాశం ఇవ్వటం ఇందిరాగాంధీ చేసిన అతి పెద్ద పొరపాటు. తర్కుమాన్‌ గేట్‌ వద్ద సామాన్యుల ఇళ్లను కూల్చివేయటం, సంఖ్యాపరంగా లక్ష్యాలు నిర్దేశించి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం, మూకుమ్మడిగా ప్రతిపక్ష నేతలను నెలల్లో తరబడి జైళ్లలో మగ్గపెట్టటం వంటి దురాగతాలు ఎన్నో అప్పుడు చోటుచేసు కున్నాయి.

ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ మరిచిపోయిందేమో గానీ ఇతరులు ఎవరూ మరిచిపోలేదు.

సీబీఐ పెంపుడు చిలక

దాదాపు 11 ఏళ్ల క్రితం జస్టిస్‌ ఆర్‌.ఎం.లోథా అప్పటి ప్రయివేటు వ్యక్తులకు బొగ్గు గనుల లైసెన్సులు ఇచ్చే విషయంలో అప్పటి అటర్నీ జనరల్‌కు చివాట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవే. ‘‘చూడబోతే సీబీఐ పంజరంలా చిలకలా తయారయింది.

తన యజమాని చెప్పినట్టే నడుస్తోంది’’ అని వ్యాఖ్యా నించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తమను అణచివేయటానికి సీబీఐని ఆయుధంగా వాడుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అప్పుడు అధికారికంగా స్వరం వచ్చినట్టయ్యింది. అయితే తర్వాత రోజుల్లో మోదీ ప్రభుత్వం పైన ఇదే అంశంపైన కాంగ్రెస్‌ ఇతర ఇండీకూటమి నేతలు వ్యాఖ్యలు చేస్తూండటం గమనార్హం.

పార్టీ ప్రతిష్ఠ దిగజారుతూ..

అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాలకు పర్యాయపదంగా మారి ఒకప్పటి ప్రాభవాన్ని కాంగ్రెస్‌ కోల్పోవటం చరిత్ర. 2004లో 26 శాతం ఓట్లతో 145 సీట్లు, 2009లో 28 శాతం సీట్లతో 206 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 2014లో 19శాతం ఓట్లతో 44 స్థానాలకు, 2019లో 19శాతం ఓట్లతో 52 స్థానాలకు పరిమితం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చే నాటికి అది 99 స్థానాలకు చేరినా, విద్వేష రాజకీయాలకు దూరం కాలేదు.

కాంగ్రెస్‌ విష ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పి కొట్టారు.‘‘మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక ప్రతిపత్తిని అందించే 370వ అధికరణను రద్దు చేసి జమ్ముకశ్మీర్‌లో రాజ్యాంగం అమలుకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశాం. దళితు లకు, గిరిజనులకు, ఓబీసీలకు రిజర్వేషన్‌ హక్కులు కల్పించాం. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ట్రిపుల్‌ తలాక్‌ ని కాంగ్రెస్‌ నిషేధించలేదు. ఇన్ని సంవత్సరాల పాటు పాలించినా స్టాట్యూట్‌ బుక్‌ను రూపొం దించలేకపోయిందని ధ్వజమెత్తారు.

–  డాక్టర్‌ పార్థసారథి చిరువోలు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE