భారత రాజ్యాంగ ప్రతిని చేతబూని రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌, కొందరు డీఎంకే సభ్యులు, ఇండీ కూటమి సభ్యులు 18వ లోక్‌సభలో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. నిజం మాట్లాడుకోవాలంటే ఆ దృశ్యం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్‌కే అవమానకరంగా కనిపించింది. రాహుల్‌తో సహా ఇండీ కూటమి ముఠా యావత్తు ‘రాజ్యాంగాన్ని చేతులలోకి తీసుకున్నాం!’ అన్నట్టే ఉంది. అంతేతప్ప ఆ హస్తభూషణ విన్యాసం రాజ్యాంగ విలువలను సమున్నతంగా నిలబెట్టడానికి అంటే నమ్మవలసిన అవసరం లేదన్నదే చాలామంది అభిప్రాయం. కాంగ్రెస్‌ పార్టీ, అఖిలేశ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్‌జేడీ ఇవన్నీ రాజ్యాంగం, అందులోని విలువల గురించి  మాట్లాడడానికి కనీస అర్హత కలిగినవేనా? దేశాన్ని దాదాపు ఐదు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్‌ చరిత్ర చూస్తే వెంటనే ఆ వాస్తవం బోధపడుతుంది. ఆ కాలమంతా  రాజ్యాంగ రక్షణ ఒక మిథ్యగానే కనిపించదా? అదొక నికార్సయిన కుటుంబ పార్టీ అంటే నిరాకరించగలిగేవారు ఇవాళ ఎవరూ లేరు. కాంగ్రెస్‌, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ పాల్పడిన చట్ట ఉల్లంఘనలు, ఎదుర్కొంటున్న అవినీతి కేసులు, వారి హయాములలో దేశంలో, ఆయా రాష్ట్రాలలో శాంతిభద్రతలు, వీరి కుటుంబీకుల ఆగడాలు..ఒక్కటి ప్రస్తావించుకున్నా, వాటి ఫలితంగా దేశం అనుభవించిన క్షోభ ఎంతటిదో అంచనా వేసుకున్నా రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్యప్రియులు సిగ్గుతో చచ్చిపోవాలి. ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ రాష్ట్రపతి పాలన రుద్దింది? ఎన్ని ప్రజాతీర్పులను భగ్నం చేసింది? కోర్టు తీర్పులను ఎన్నిసార్లు వక్రీకరించింది? జాతి మరచిపోలేదు. వీటికి పరాకాష్ట జూలై 1న రాహుల్‌ లోక్‌సభలో హిందువులు హింసావాదులంటూ చేసిన వ్యాఖ్య.

హిందువులం అంటూ ఎవరు తమను తాము చెప్పుకుంటున్నారో అలాంటి వారంతా హింస ద్వేషంతో నిరంతరం ఊగిపోతూ, అసహనంతో ఉంటారని దేశ అత్యున్నత చట్టసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ మాట్లాడడం భారత భూమిలో ఘర్షణ వాతావరణం సృష్టించడానికే. జూలై 1న రాహుల్‌ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు. బీజేపీని అడ్డం పెట్టుకుని మొత్తం హిందూజాతిని హింసావాదులుగా చిత్రించడం చాలా తీవ్రమైన వ్యాఖ్య అని అధికారంపక్షం, ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎప్పుడూ నాలుక మడత వేసినట్టుగానే రాహుల్‌ వెంటనే తాను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఉద్దేశించి మాత్రమే అన్నానని వెనక్కి తగ్గాడు. పార్లమెంటులోను, బయట హిందూ వ్యతిరేకతతో, అసహనంతో దేశంలో సెగ రేపాలని మొదటి నుంచి రాహుల్‌ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

జూన్‌ 24, 2024న 18వ లోక్‌సభ తొలిసారిగా కొలువు తీరింది. తారీఖులకీ, దస్తావేజులకీ ఎవరి అభిప్రాయాలు అవసరం ఉండదు. ఎవరి అభ్యంతరాలతో, అభీష్టాలతో వాటికి నిమిత్తమే లేదు. చరిత్రలో ఏ రోజు ఏం జరిగిందో అవి ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటిస్తాయి. జూన్‌ 25న దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు దుశ్చర్యకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. చరిత్ర పట్ల గౌరవం ఉన్నవారే కాదు, అత్యవసర పరిస్థితి బాధితులు కూడా ఆ రోజును తప్పక స్మరించుకుంటారు. దేశ స్వాతంత్య్రం మీద, ఆ క్రమంలో జరిగిన త్యాగాలు మీద గౌరవం ఉండబట్టే మనం ఆగస్ట్‌ 15ను సగౌరవంగా గుర్తు చేసుకుంటున్నాం. అత్యవసర పరిస్థితి (జూన్‌ 25, 1975) విధించిన తేదీని గుర్తు చేసుకోవడం అలాంటిదే. 18వ లోక్‌సభ ప్రారంభ ఘడియలలో ఆ సందర్భం వచ్చింది.

2024 ఎన్నికలలో రాజ్యాంగ ప్రతులతో ఇండీ కూటమి చేసిన ఊరేగింపులు, ప్రదర్శనలు లాభాన్నే తెచ్చిపెట్టాయి. అందుకు కృతజ్ఞతగానే కాబోలు సభలో కూడా ఆ ప్రతులను పట్టుకుని వచ్చారు. ఇది ముందే ఊహించారేమో అన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒంటి చేతి రాజ్యాంగ పరిరక్షకుల అసలు బండారం బయటపెట్టారు. అత్యవసర పరిస్థితి యాభయ్‌ ఏళ్లు పూర్తయ్యాయంటూ ఒక ప్రకటనతో పార్లమెంట్‌ ప్రాంగణంలోనే మీడియా ఎదుటే దివ్యాస్త్రం సంధించారు. మోదీని మూడోసారి ప్రధాని కాకుండా నిలువరించడానికి సర్వశక్తులూ ఒడ్డిన ఇండీ కూటమి దారుణ పరాజయం చవిచూసింది. ప్రజలు అప్పగించిన అధికారంతో ఎన్‌డీఏ ప్రభుత్వం తన పని తాను చేయకుండా ఆపాలన్న పరమ లక్ష్యమే ఇండీ కూటమిలో తొలి అడుగులోనే స్పష్టమై పోయింది.16,17 లోక్‌సభలలో (2014, 2019)ఈ పార్టీలన్నీ చేసినది అదే. ఆ వికృత ధోరణికి మరింత పదును పెట్టి దుందుడుకుతనంతో వ్యవహరించా లన్నదే ఇండీ కూటమి ఆశయం.

రాజ్యాంగ ప్రదర్శన, ఉల్లంఘన ఏకకాలంలో చేయగల విద్య ఇండీ కూటమిలోని ప్రతి పార్టీకి క్షుణ్ణంగా తెలుసు. ఎన్నికలకు ముందు పెట్టుకున్న పొత్తుతో 293 స్థానాలు సాధించి ఎన్‌డీఏ పెద్ద కూటమిగా ఆవిర్భవించింది. అయినా 233 వచ్చిన ఇండీ కూటమి పెద్దలు మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్‌ అధ్యక్షుడు), రాహుల్‌ ‘పాత మిత్రుల’తో మాట్లాడ తామని నిస్సిగ్గుగా చెప్పారు. అంటే తెలుగు దేశంతోను, జనతాదళ్‌ (యు)లతోనే కదా! కాంగ్రెస్‌ ప్రతి అడుగులోను రాజ్యాంగానికి ఎదురైనవి ఇలాంటి పరాభవాలే. అటు ఎన్నికల ఫలితాలన్నీ వెల్లడి కాకుండానే రాహుల్‌ ఏదో మూల నుంచి కాకుల లెక్క తెచ్చి షేర్ల అక్రమాలు అంటూ జాతీయ మీడియా ముందు వీరంగం వేశారు. అది కాస్తా తుస్సుమంది. ఇది ప్రజాతీర్పును అవమానించడమే. రాహుల్‌ గాంధీ పిల్ల జమిందారులా వ్యవహరిస్తారు. బాధ్యత లేకుండా, తీవ్రమైన చర్యలకు కేంద్ర బిందువు అవుతారు. ఆయన చర్యలన్నీ జాతీయ స్ఫూర్తికీ, జాతీయోద్యమ స్ఫూర్తికీ కూడా భంగకరమైనవేనంటే తొందరపాటు కాదు. ఆయన బీజేపీ మీద, ఆర్‌ఎస్‌ఎస్‌ మీద, మోదీ మీద ఎన్నో ఆరోపణలు చేశారు. అందుకు కోర్టులు మొట్టికాయలు వేశాయి. అయినా ఆయన కాస్త కూడా సిగ్గుపడడం లేదు. ఆధారాలు లేని ఆరోపణలను వరసపెట్టి సంధిస్తూనే ఉన్నారు. షేర్ల అక్రమాల వ్యవహారం బెడిసికొట్టిన తరువాత రాజకీయ గురువు దిగ్విజయ్‌సింగ్‌ మొదలు అనేక పార్టీల నేతలతో కలసి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల మీద రాహుల్‌ మళ్లీ పాత ఆరోపణలు చేశారు. ఈ యంత్రాలను ఉపయోగించ వచ్చునని, ట్యాంపరింగ్‌కు అవకాశం లేదనే పోలింగ్‌కు కొద్ది ముందు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం గాలికి పోయింది. ఫలితాలు వచ్చి, స్వతంత్రంగా అధికారం చేపట్టడానికి బీజేపీకే మెజారిటీ తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ఓటింగ్‌ యంత్రాల మీద రాహుల్‌ విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అయితే మాత్రమేం! కాంగ్రెస్‌ విమర్శిస్తుంది. రాహుల్‌ తప్పు పడతారు.

ప్రజాక్షేత్రంలో బ్యాలెట్‌ సమరంలో ఓడిపోయినా, పార్లమెంట్‌లో రచ్చచేయడం ద్వారా తాము అనుకున్నది సాధించాలన్న దురద ఇండీ కూటమిలో కనిపిస్తూనే ఉంది. దక్షిణ భారతం, ఉత్తర భారతం పేరిట వేర్పాటువాదం ఆలోచన కూడా అందులో ఉంది. ఆ నినాదంతోనే పార్లమెంట్‌లో ఇంకాస్త గట్టి రగడ చేసే యోచన కనిపిస్తున్నది. సెంగోల్‌ను తొలగించి తీరాలని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడి చేత మొరిగించడం అందుకే. ఎంత చిత్రమంటే` అత్యవసర పరిస్థితికి డీఎంకే, ఆర్‌జేడీ వ్యతిరేకంగా పోరాడాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ వీటి మోచేతి నీళ్లు తాగుతోంది. కొన్నిచోట్ల నెయ్యం, కొన్నిచోట్ల కయ్యం విధానంతో కాంగ్రెస్‌తోనే కలసి ఉన్న సీపీఎం కూడా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడినదే. ఈ పార్టీలన్నీ మోదీ ప్రకటనతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయి, వాటి పోరాట చరిత్రకు అవే సమాధి కట్టుకున్నాయి. ఆ కాలంలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన ప్రాణ త్యాగాలకీ, సాహసాలకీ, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికీ నీళ్లు వదిలేశాయి. ‘ఔను అత్యవసర పరిస్థితి కాలంలో భారత ప్రజాస్వామ్యం భంగపడిరది’ అని ఒప్పుకోవడం వీటి కనీస బాధ్యత. ఇంత నేరుగా కాకున్నా లాలూ యాదవ్‌ మాత్రం ఔను, మేం కూడా అరెస్టయ్యాం, అది ప్రజాస్వామ్యా నికి మచ్చేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అత్యవసర పరిస్థితి స్వతంత్ర భారత చరిత్రలోని పెద్ద చారిత్రక పరిణామం, దాని ఫలితాల పట్ల వాటికి ఉన్న నిబద్ధత, నిజాయతీల నిరూపణకూ ఇలాంటి ఒప్పుకోలు అవసరం. ఆ సత్యాన్ని అంగీక రించడం అంటే చరిత్రను గౌరవించడం అవుతుంది. ఆ చారిత్రక వాస్తవాన్ని ప్రకటిస్తే కాంగ్రెస్‌ బలహీన పడి బీజేపీ నైతికంగా బలపడే చర్య కాగలదనీ, అది సెక్యులరిజానికి చేటనీ వీళ్లంతా భావించడం చరిత్ర పట్ల చేస్తున్న పెద్ద ద్రోహం. ఆత్మవంచన కూడా. బీజేపీని ఇరుకున పెట్టడం కోసం కొన్ని విషయాలు రోడ్డు మీద తేల్చుకోవడం, దబాయించి పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిరోధించడమే ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండీ కూటమి విధానంగా కనిపిస్తున్నది. కానీ రాహుల్‌ హ్రస్వదృష్టి ఎంతటిదో ఈ వ్యూహంలోనే తెలుస్తున్నది. ఇవాళ చేతిలో రాజ్యాంగ ప్రతిని కదిలిస్తూ, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు దంచితే కాంగ్రెస్‌ గతం గురించి ప్రజలను మభ్యపెట్టవచ్చునని ఆయన నమ్ము తున్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ వరకు రాజ్యాంగానికి పొడిచిన తూట్ల వివరాలు చరిత్రలో నమోదై ఉన్న సంగతిని గుర్తించలేనంత మౌఢ్యంలో రాహుల్‌ ఉన్నారు. ఇది స్వీయ హననం. పార్టీల పేర్లు వేరు. కానీ ఇప్పుడు విపక్ష శిబిరంలో ఉన్నవీ, లేదా ఇండీ కూటమిలో ఉన్నవీ అన్నీ ఒకే పంథాలో నడుస్తున్నాయి. జాతీయ భావంతో, మెజారిటీ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ సాగే పాలనను ఇవన్నీ అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాయి. బుజ్జగింపు బురద రాజకీయాలలో పొర్లుతూ, దేశ భద్రత సంగతి కూడా అవి విస్మరించాయి. దేశ రాజకీయ నాయ కత్వంలో ఏకాభిప్రాయం లేదన్న అభిప్రాయానికి ఇరుగు పొరుగు వచ్చే తీరులోనే ఇవి ప్రవరిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఇచ్చే కొన్ని ప్రకనలు, అంటే రాహుల్‌ నోటి నుంచి వచ్చే మాటలు నేరుగా పాకిస్తాన్‌ను, చైనాను సమర్ధిస్తూ, భారత్‌ను తప్పుపడుతున్నట్టే ఉంటాయి. 18వ లోక్‌సభలో వేస్తున్న ప్రతి అడుగు భారత సార్వభౌమత్వాన్ని బలహీనపరిచే విధంగా, భారత వ్యతిరేకులు దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు ఆహ్వానించినట్టే ఉన్నాయి. ప్రోటెం స్పీకర్‌, స్పీకర్‌ ఎంపికలు, సెంగోల్‌, పాలస్తీనాకు జేజేలు, వెంటనే నీట్‌ మీద చర్చకు మంకుపట్టు ఇవన్నీ ఇరుగు పొరుగు చేత అంతర్యుద్ధం జరుగుతున్నదన్న అభిప్రాయానికి వచ్చేటట్టు చేస్తున్నాయి. ఐఐటీలలో బడుగులు పరీక్షపత్రాలు రూపొందించడం లేదంటూ వివాదం లేవనెత్తే ప్రయత్నం చేయడం, సైన్యంలో రిజర్వేషన్‌ గురించి మాట్లాడడం రాహుల్‌ చేస్తున్న ఘోర తప్పిదాలు. ఇంత మాట్లాడిన ఆ పదవీ లాలసుడు ప్రతిపక్ష హోదాను ఎందుకు ఒక దళితుడికి ఇవ్వలేదు? దీనిని దేశం ప్రశ్నించాలి.

ప్రోటెం స్పీకర్‌ ఎంపిక వివాదం

కాలు తొక్కిన రోజే కాపురం సంగతి తెలుస్తుందని సామెత. 18వ లోక్‌సభలో విపక్షాల వైఖరి ఎట్లా ఉండబోతున్నదో ప్రమాణ స్వీకారోత్సవం తోనే వెల్లడయింది. తొలి సమావేశాలలో కొత్త సభ్యుల ప్రమాణాలు, స్పీకర్‌ ఎంపిక ఉంటాయి. కొత్త ఎంపీల ప్రమాణానికి ప్రోటెమ్‌ స్పీకర్‌గా కేరళ నుంచి వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ కె. సురేశ్‌ను నియమించాలని కోరే క్రమంలో కాంగ్రెస్‌ వృధా వివాదం రేపింది. ఎన్‌డీఏ కూటమి భర్తృహరి మెహతాబ్‌ను ఆ బాధ్యతకు ఎంచుకుంది. మెహతాబ్‌ కంటే సురేశ్‌ ఎక్కువ అనుభవజ్ఞుడని కాంగ్రెస్‌ దబాయించడానికి విశ్వప్రయత్నం చేసింది. ఈ వాదనను ఎన్‌డీఏ కొట్టిపారేసింది. రాష్ట్రపతి ముర్ము మెహతాబ్‌ను (జూన్‌ 20న) ప్రోటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన కటక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఏడుసార్లు వరసగా ఎన్నికయ్యారు. సురేశ్‌ ఎనిమిది పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారని ఇండీ కూటమి వాదన. అయితే ఆయన వరసగా ఎన్నిక కాలేదనీ, 1998, 2004లలో గెలుపు సాధించలేదనీ ఎన్‌డీఏ వెల్లడిరచింది.ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి సురేశ్‌ దళితుడు కాబట్టి ప్రోటెం స్పీకర్‌ అవకాశం నిరాకరించారని ఇండీ కూటమి వాదించడం దిగజారుడు రాజకీయం. తమ ప్రభుత్వం సభా సంప్రదాయాలను ఏ మాత్రం ఉల్లంఘించ లేదని, నెహ్రూ కాలం నుంచి వస్తున్న ఆచారాన్నే పాటించా మని బీజేపీ ఎంపీ సంబిత్‌ పాత్రా స్పష్టం చేశారు. నిజానికి దళితుడైన సురేశ్‌ను కాంగ్రెస్‌/ ఇండీ కూటమి రెండుసార్లు అవమానించాయి. ప్రోటెం స్పీకర్‌ పదవి రాదని తెలిసి ఆయనను ముందుకు తోయడం ఒకటి. స్పీకర్‌ పదవి ఏకగ్రీవం కావాలంటే, డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇండీ కూటమికి ఇవ్వాలంటూ ఆచరణ సాధ్యం కాని బేరం పెట్టి ఓం బిర్లా చేతిలో ఓడిరచి రెండోసారి అవమానించారు. 293 స్థానాలు ఉన్న ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తాడని తెలిసి కూడా 233 స్థానాలు ఉన్న ఇండీ/కాంగ్రెస్‌ ఈ పని చేసింది. ఈ సందర్భంలోనే ఢల్లీి ఎంపీ భాసురి స్వరాజ్‌ చేసిన వ్యాఖ్య నిశితమైనది. దళితుల మీద అంత ప్రేమే ఉంటే, స్పీకర్‌ పదవి దక్కని సురేశ్‌కు ఇండీ కూటమి, రాహుల్‌ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నించారామె. ఈ ఎన్నిక నేపథ్యంలోనే ఒక్కసారిగా వైరల్‌ అయిన సురేశ్‌ సంబంధిత వీడియోలో మాటలు వింటే బీజేపీ సభ్యులు ఆయనతో ప్రమాణం తీసుకోవాలని అనుకోరు. పీఎఫ్‌ఐని నిషేధించినప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించాలని మీడియాతో అన్న నాయకుడు సురేశ్‌. ఎందుకంటే పీఎఫ్‌ఐ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకటే అంటాడా పెద్దమనిషి. మైనారిటీల మీదనే కాదు, దళితుల మీద కాంగ్రెస్‌ ప్రేమ రాజకీయంలో భాగం. సమన్యాయం కోసం కాదు.

 జూన్‌ 24న 18వ లోక్‌సభ తొలి సమావేశం జరిగింది. అంతకు ముందు రోజే ప్రోటెం స్పీకర్‌ వివాదాన్ని తెచ్చిన ఇండీ సభ్యులు ఎర్ర అట్ట ఉన్న రాజ్యాంగ ప్రతులతో వచ్చి హడావిడి సృష్టించారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు రాజ్యాంగం మీద దాడి చేయకుండా మేం కాపాడతామని పార్లమెంట్‌ మీడియా పాయింట్‌ దగ్గర బీరాలు పలికారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, కె. సురేశ్‌, కేసీ వేణుగోపాల్‌, గౌరవ్‌ గొగొయ్‌, దీపేంద్ర హుడా, టీఆర్‌ బాలు (డీఎంకే), సుదీప్‌ బందోపాధ్యాయ (టీఎంసీ), సుప్రియా సూలే, డిరపుల్‌ యాదవ్‌ మొదలైన యావన్మంది విపక్ష గణం అక్కడ చేరింది. తరువాత సభలోకి కూడా రాజ్యాంగ ప్రతులతోనే ప్రవేశించారు.

మోదీ నోట అత్యవసర పరిస్థితి మాట

రాజ్యాంగం పట్ల విపక్షం ప్రదర్శిస్తున్న ఈ దొంగ భక్తినీ, నయ వంచక వైఖరినీ చూశాక అధికార పక్షానికి జవాబు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి గురించి ప్రస్తావించడం దాని ఫలితమే. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడం కాంగ్రెస్‌ పాలనా కాలంలో సర్వసాధారణ విషయంగానే కనిపిస్తుంది. దీనికి పరాకాష్ట అత్యవసర పరిస్థితి విధింపు. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద సమావేశాల మొదటి రోజే కాలు దువ్వుతున్న కాంగ్రెస్‌ ప్రేమ దుకాణానికి అదే సరైన సమాధానం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా దేశం మీద రుద్దిన అత్యవసర పరిస్థితి స్వతంత్ర భారత చరిత్ర మీద మాయని మచ్చ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది కీలెరి పెట్టిన వాత. ప్రధాని చేసిన ప్రస్తావనకు మీడియా విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రజలంతా తీర్మానం చేయాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని కూడా ప్రధాని చెప్పడం విజ్ఞతతో కూడుకొని ఉన్న మాట. నిజమే, అత్యవసర పరిస్థితివేళ దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కారాగారంగా మార్చివేసింది. ఇప్పుడు రాజ్యాంగ రక్షణ అంటూ ఊరేగినంత మాత్రాన ఆ మచ్చ చెరిగిపోదు. అత్యవసర పరిస్థితి విధించి కావలసినంత అప్రతిష్ట మూట కట్టుకున్న పార్టీ నాయకుడిగా రాహుల్‌ దేశానికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి తీరాలి. ప్రజాస్వామ్యం అంటూ తాను చేస్తున్న గడబిడ పదవీదాహంతో కాదని నిరూపించు కోవాలి. అప్పుడు ఆయన నిజమైన ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షకుడని కాస్తయినా జనానికి నమ్మకం ఏర్పడుతుంది. రాహుల్‌ ప్రజాస్వామ్యం పేరుతో విపక్ష నేతలు దేశంలో ఒక జుగుప్సాకరమైన ప్రహసనాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఒవైసీ ‘జై పాలస్తీనా నినాదం

ప్రమాణ స్వీకారం సందర్భంగా కొత్త ఎంపీలు రకరకాల నినాదాలు చేశారు. అవన్నీ భారత చరిత్రకో, రాజకీయ చరిత్రకో, సంస్కృతికో చెందినవే. కొందరు తమ రాష్ట్రం మీద, ప్రాంతం మీద భక్తి ప్రకటించుకున్నారు. కానీ సభలో ఏకైక ఎంఐఎం సభ్యుడు మాత్రం తన ఇతర నినాదాలతో పాటు ‘జై పాలస్తీనా’ అని పెద్ద రగడకు తెర తీశారు. భారత మాతకు జై అని పలకను అని నిస్సిగ్గుగా చెప్పినవాడు, భారత పార్లమెంటులో పాలస్తీనాకు జైకొట్టాడు. ప్రస్తుతం ఈ అంశం మీద చేసిన ఫిర్యాదు రాష్ట్రపతి వద్ద, న్యాయస్థానాలలోను ఉంది. ఒవైసీ వైఖరికి నిరసనగా ఢల్లీిలోని ఆయన నివాసం మీద జూన్‌ 27వ తేదీ రాత్రి దాడి జరిగింది. భారత్‌`ఇజ్రాయెల్‌ బంధాన్ని గుర్తు చేసే ఒక పోస్టర్‌ను కూడా ఇంటి గోడల మీద అతికించారు.

స్పీకర్‌ ఎంపిక

స్పీకర్‌ పదవిని ఏకగ్రీవం చేయడానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ చూపించిన చొరవకు కాంగ్రెస్‌ సరైన రీతిలో స్పందించలేదు. ప్రోటెం స్పీకర్‌ విషయంలో తన నిర్ణయాన్ని టీఎంసీ, ఎన్‌సీపీతో మాటమాత్రంగా కూడా చెప్పని పార్టీ, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనను గౌరవిస్తుందా? డిప్యూటీ స్పీకర్‌ పదవి విపక్షానికి ఇస్తామని మాట ఇస్తే స్పీకర్‌ పదవిని ఏకగ్రీవం చేస్తామని విపక్షం చెప్పడమే ఒక అనారోగ్యకర బేరమనిపిస్తుంది. అయినా ప్రోటెం స్పీకర్‌ను చేయదలిచిన కె. సురేశ్‌ను మళ్లీ బరిలోకి దింపారు. ఎన్‌డీఏ బలం మేరకు ఓం బిర్లా రెండోసారి స్పీకర్‌ అయ్యారు. ఆయన స్పీకర్‌ అయిన వెంటనే అత్యవసర పరిస్థితి బాధితులను స్మరిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. నిజానికి రెండోసారి ఎంపికైన మరుక్షణం నుంచే ఓం బిర్లా తన సహజ శాంత స్వభావాన్ని వీడవలసిన పరిస్థితి కల్పించింది విపక్షం. నీట్‌ మీద చర్చకు పట్టుపట్టింది. జూన్‌ 25, 1975 తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీని రుద్దినట్టే జూన్‌ 25, 2024వ తేదీ అర్ధరాత్రి రాహుల్‌గాంధీని విపక్ష శిబిరం మీద విపక్ష నేతగా రుద్దారు. రాహుల్‌గాంధీ తొలి ఉపన్యాసంతోనే ప్రభుత్వంమీద కాలు దువ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీట్‌ పరీక్ష లీకేజీ మీద తక్షణం చర్చ చేపట్టాలని పట్టుపట్టారు. రాజ్యసభలోను అదే తీరు.దీనితో సభలు వాయిదా పడ్డాయి. స్పీకర్‌ను మర్యాద పూర్వకంగా విపక్ష బృందం కలసినప్పుడు కూడా అత్యవసర పరిస్థితి గురించి ప్రస్తావించినందుకు రాహుల్‌ స్పీకర్‌కు నిరసన తెలియచేయడం వింతే. దీనిలో అధికార పక్ష భావప్రకటనా స్వేచ్ఛ కంటే, సభా సంప్రదాయా లకు విరుద్ధమైన రాజకీయ అంశంగా రాహుల్‌ చూడడం మరీ వికృతం. నిరంతరం రాజ్యాంగ రక్షణ బాధ్యతను స్వీకరిస్తున్నట్టు చెప్పుకున్న విపక్షం స్పీకర్‌ ఎంపిక వేళ తెలుగుదేశం, జేడీ (యు)లకు ఇచ్చిన సందేశాల గురించి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తాము బరిలోకి దింపిన కె. సురేశ్‌ దళితుడు కాబట్టి, సామాజిక న్యాయం కోసం ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ఆ సందేశాల సారాంశం. మరి, రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును నిలిపినప్పుడు ఆమె మీద యశ్వంత్‌ సిన్హాను పోటీకి దింపినప్పుడు ఈ సామాజిక న్యాయ పరిరక్షకుల బుద్ధి గాడిదలను కాయడానికి వెళ్లిందా?

సెంగోల్‌ వివాదం

తాము భారతీయ చరిత్ర మీద, దాని స్ఫూర్తి మీద, చారిత్రక చిహ్నాల మీద యథాప్రకారం దాడి సాగిస్తామని కూడా విపక్షం తొలి సమావేశాల వేళ ప్రకటించినట్టయింది. లోక్‌సభలో ఉంచిన సెంగోల్‌ను తొలగించి అక్కడ రాజ్యాంగ ప్రతిని (పెద్దది చేయించి) ప్రతిష్ఠించాలని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్‌కే చౌదరి (ఉత్తరప్రదేశ్‌) స్పీకర్‌ ఓం బిర్లాను కోరడం విశేషం. సెంగోల్‌ రాచరికానికి ప్రతీక అని కనిపెట్టాడు ఆర్‌కేచౌదరి. కాబట్టి ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన రాజ్యాంగ ప్రతిని ప్రతిష్ఠించాలట. చిత్రం ఏమిటంటే తమిళ భాషను, సంస్కృతిని ఎవరు ఎంత చిన్న మాట అన్నా మండిపడిపోయే ద్రవిడ పార్టీలు హిందీ ప్రాంతీ యుడు సెంగోల్‌ను తొలగించాలని పార్లమెంటులో చెప్పినా నోరెత్తలేదు. నిజానికి అది రాజదండం అని ఎవరూ అనడం లేదు. ఎందుకంటే అది ధర్మదండం. పైగా నెహ్రూ కూడా దాని ఘనతను ఆమోదించారు.

రాజ్యాంగ ప్రతిని చేతబూని విపక్షం లోక్‌సభ సాక్షిగా సాగించబోతున్న ఈ రాజ్యాంగ వ్యతిరేక యుద్ధం రోడ్ల మీదకు రావడానికి కూడా పెద్ద సమయం పట్టదు. మోదీ మళ్లీ ఎన్నికయితే రక్తపాతం తప్పదని రాహుల్‌ ఒక ప్రచార సభలో చేసిన వ్యాఖ్యకు రియాసీ (జమ్ము) బస్సు మీద కాల్పుల ద్వారా పాకిస్తాన్‌ కార్యరూపం ఇచ్చింది. నకిలీ రైతులు కూడా రోడ్లెక్క బోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు.

జాతీయ రక్షణకు ఉద్దేశించిన అజెండాలో ఏ ఒక్క అంశాన్ని అమలు చేయాలని బీజేపీ చూసినా మతోన్మాదులు రోడ్ల మీద మహిళలను, పిల్లలను కూర్చో బెడతారు. షాహీన్‌బాగ్‌లు మళ్లీ కొలువైనా ఆశ్చర్యపోనక్కరలేదు. దేశ విచ్ఛిన్నం వీరి ఏకైక అజెండా. ప్రజాస్వామ్యం అంటే దొంగ వాగ్దానాలు కాదు. ప్రభుత్వాన్ని స్తంభింప చేయడం కాదు. దేశ ప్రజలు విపక్షం నుంచి ఆశిస్తున్నది ఇది కాదు. విపక్షం విధ్వంసపు ఆలోచన అధికారపక్షం వెంటనే గ్రహించింది. నిర్దేశించుకున్న అజెండా ప్రకారమే నడిచేందుకు సిద్ధపడినట్టు సంకేతాలు కూడా ఇచ్చింది. అధికారం దక్కకపోతే విపక్షంలో కూర్చోవాలి. విలువల విధ్వంసానికి తెగబడకూడదు. దేశమే ప్రధానం అనుకోలేనివారి పని అది.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE