వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతికి ఎంపికైన రచన

-స.రామనరసింహం

‘‘అరవయ్యేళ్లకు పైగా తిరిగి అలసిపోయి ఆగిపోయింది మా గోడ గడియారం! సమయాన్ని నిక్కచ్చిగా చూపించే దాని ముళ్లయితే ఎన్ని మైళ్ల్ళు తిరిగాయో లెక్కే లేదు. దిగువ ఆ ఊగే ఇత్తడి బిళ్ల మా మనసుల్ని ఏళ్ల తరబడి అలా ఊపుతూనే ఉండేది.’’ అన్నాడు రమణ.

‘‘ వారానికోసారి ‘కీ’ ఇవ్వాలి దానికి. కుర్చీ వేసుకుని పైకెక్కి ఏడుసార్లో, ఎనిమిదిసార్లో లెక్కపెట్టి ఇచ్చేవారు నాన్నగారు ‘ఇంకా ఎక్కువసార్లు తిప్పితే ఏమవుతుంది?’ అని చిన్నపుడు నేనొకసారి అడిగితే ‘తాగుతోంది కదా అని చెల్లికి ఎక్కువ పాలు పడతామా? కక్కు కోదూ? అలాగే ఇదీనూ’ అన్నారాయన. ఇంట్లో పాపాయిలా అంత ప్రేమగా చూసుకునేవాళ్లం ఆ గడియారాన్ని. ఎన్నడూ దానికి అనారోగ్యమూ చెయ్యలేదు, ఆగిపోనూ లేదు.

ఆర్నెల్లకో, ఏడాదికో కిందకి దింపి శుభ్రంగా తుడిచి, లోపల నూనెతో ‘చక్ర’ స్నానం చేయించేవాడు అన్నయ్య. లోపల చెయ్యి పెట్టి ఏదో తీగని కదిపితే ఎన్ని కావాలంటే అన్ని గంటలు కొట్టేది విసుగు లేకుండా. మేము చప్పట్లు కొడుతూ ఆనందపడి పోయేవాళ్లం .

నాన్నగారు కొన్న ఆ గడియారం ఆయన పోయిన పదోనాడు ఆగిపోయింది!

దాన్ని నడిపించడానికి అన్నయ్య విఫలయత్నం చేసాడు. టౌనుకు తీసుకెళ్ళి రిపేర్‌ ‌చేయించాలి. నమ్మకంగా చేసే వాళ్లు దొరకాలిగా.

హైదరాబాదు నుంచి నేను వెళ్లినపుడు ఇంట్లోకి అడుగు పెడుతూనే చూసాను నడవలేని స్థితిలో, పలకలేని పరిస్థితిలో వృద్ధాశ్రమానికి వెళ్లడానికి• సిద్ధంగా ఉన్న పండు ముసలి లాగా కనిపించిందది. బాధేసింది. నాతో బాటు తీసుకొచ్చా. అదే ఇది. రిపేరు చేసేవాళ్లెవరన్నా నీకు తెలిస్తే చెప్పు. ఎంత ఖర్చయినా ఫరవాలేదు’’ అన్నాడు రమణ గూట్లో నిలబెట్టిన గడియారాన్ని తన స్నేహితుడికి చూపిస్తూ.

‘‘పాత గడియారాలు బాగు చేసే మనిషి దగ్గరలోనే ఒకతనున్నాడు. నేనా మధ్య చేయించాను.’’ అంటూ ఆ వివరాలు చెప్పేడు స్నేహితుడు.

కొత్త గడియారాలు అమ్మే షాపది. అందులో ఒక పక్కగా ఒక వృద్ధుడు కంటికి చిన్న ఉగ్గు గిన్నెలాంటి భూతద్దం పెట్టుకుని వాచీ రిపేర్‌ ‌చేస్తున్నాడు. ‘‘తీసుకురండి చూద్దాం’’ అన్నాడు. అతని పేరు ఖాసిం.

మర్నాడు గడియారంతో వచ్చిన రమణని కూర్చోమన్నాడు. అతడి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ పక్కనే ఓ యువకుడు కొత్త గడియారాలని గుడ్డతో తుడుస్తున్నాడు. అతడు ఖాసిం కొడుకు. పేరు సలీం.

‘‘ఇది నాకెంతో ప్రీతిపాత్రమైనది, విలువైనదీ భాయ్‌. ‌కొద్ది శ్రద్ధగా చేసిపెట్టాలి’’ అన్నాడు రమణ గడియారం విప్పుతున్న ఖాసింతో. బాగా దుమ్ము పట్టింది సాబ్‌. ‌సాఫ్‌ ‌చేసి ఆయిలింగ్‌ ‌చేసి చూస్తా. రెండు రోజులు పోయేక రండి.’’ అన్నాడు. ‘‘అలాగే కానీ, ఇన్నిసార్లు చెబుతున్నానని ఏమనుకోవద్దు, దీన్లో పార్టులు, మిషనూ జాగ్రత్త. అంటే వేరే వాటితో కలవకుండా .. కాస్త నమ్మకంగా చేస్తావనీ…’’ అంటూ రమణేదో చెప్పబోతోంటే ‘‘ఏం ఫికర్‌ ‌చెయ్యకండి సాబ్‌. ‌దీని విలువ నాకు తెలుసు.’’ అన్నాడు ఖాసిం. తండ్రినో తల్లినో ఆపరేషన్‌ ‌థియేటర్లోకి పంపి వస్తున్నట్టు దాని వైపే చూస్తూ బయటకొచ్చాడు రమణ.

మూడు రోజుల తర్వాత ఓ సాయంత్రం వెళితే ఖాసిం లేడు దుకాణంలో, సలీం ఉన్నాడు. ‘‘మా నాయన రిపేర్‌ ‌చెయ్యలేడు సార్‌, అట్లనే అంటాడు. రేపొచ్చి తీసుకుపోండి.’’ అన్నాడు మొహం చిరాగ్గా పెట్టి. రమణ గుండెల్లో రాయి పడింది. దొరక్క దొరక్క బాగుచేసేవాడు దొరికేడనుకుంటే ఇదేవిటి?

మర్నాడు వెళితే ‘‘రెండు స్ప్రింగులు పోయాయి సాబ్‌. ‌బాగా పాత మోడల్‌ ‌కదా. ఇక్కడ దొరకవు. ఏదైనా పురానా గడియారం లోంచి తీసి వెయ్యాలి. ఎక్కడో అక్కడ సంపాదించి వేస్తాలెండి ‘‘ అన్నాడు ఖాసిం. ఆశ చిగురించి ఆనందపడిపోయాడు రమణ.

‘‘ఏమనుకోకు ఖాసిం భాయ్‌. ‌నిన్న నీ కొడుకు తీసుకుపొమ్మన్నాడు’’ చెవిలో చిన్నగా అన్నాడు రమణ కాస్త దూరంగా కస్టమర్‌ ‌తో మాట్లాడుతున్న సలీంకి వినబడకుండా.

‘‘షాపంతా డొక్కు గడియారాలతోనూ, తుప్పు పట్టిన పార్టులతోను నింపేస్తున్నానని మావాడి కంప్లెంటు సాబ్‌. ‌నిజానికి పాత గడియారాలని డబ్బుల కోసం కాదు నేను బాగుచేసేది. అదొక తృప్తి. ఆనందం. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడొచ్చే కొత్త గడియారాలు బ్యాటరీతో నడుస్తాయి. వాటిల్లో జీవం ఎక్కడుంది? ఈ పాత గడియారాల్లో అయితే ముచ్చటగా చక్రాలు, స్ప్రింగులు, తీగెలు అల్లినట్టు ఉంటాయి. దీన్ని చూడండి. లోపల ఎన్ని చక్రాలున్నాయో! ఈ పెద్ద చక్రం తిరిగితే దీని పక్కనున్న ఈ చిన్న చక్రం దీన్ని ఒరుసుకుంటూ తిరుగుతుంది. ఇది తిరిగితే దీని లోపల మరో చక్రం తిరుగుతుంది. ఇలా ఒకటి తిరిగితే మరొకటి, మరొకటి.. అలా మొత్తం గడియారం తిరుగుతుంది. ప్రతి చక్రం ప్రాణమున్న ఓ మనిషిలా అనిపిస్తుంది సాబ్‌ ‌నాకు! ప్రతి మనిషి పక్కవాడికి సాయపడితే, ఆయన ఇంకొకడికి సాయపడతాడు. ఆయన మరొకడికి! అలా ఒకరినొకరు ఆదుకుంటేనే కదా ఈ సమాజం అనే గడియారం మంచిగా నడిచేది. నడవ గలిగినవాడు నడవలేని వాడిని నడిపించాలి. ప్రతి మనిషి ఇది ఇది తెలుసుకోవాలి సాబ్‌. ‘‌పక్కవాడితో నాకు పనేంటి’ అని అందరూ అనుకుంటే లోకం నడుస్తుందా చెప్పండి. ఏ గడియారాన్ని చూసినా నాకు ఇదే ఆలోచన.. మీరు నవ్వుతారేమో కానీ పాడైపోయిన గడియారాన్ని బాగు చేస్తున్నపుడల్లా నేనేదో సమాజాన్ని బాగు చేస్తున్నానన్న గొప్ప భావం ఏదో కలుగుతుంది సాబ్‌. అదో ఆనందం. అది నా కొడుక్కి అర్థం కాదు. అందుకే వాడు చిరాకు పడుతున్నా నేను ఈ పాత గడియారాల్ని వదలడం లేదు. వాడి మాటలు మీరు కూడా పట్టించుకోకండి. పిల్లోడు’’. అన్నాడు ఖాసిం. కొడుకు విన్నాడో లేదో తెలియదు కానీ అతడు కూడా వినాలనే ఖాసిం గట్టిగా చెప్పాడని రమణ గ్రహించాడు.

గొప్ప జీవిత సత్యాన్ని ఎంత బాగా చెప్పావు ఖాసిం. సమాజం ఒక గడియారం. అందులో ఒకరికొకరు సహకరించుకునే చక్రాలం మనం. ఆహా.. గొప్ప ఊహ!’’ అంటూ రెండు చేతులూ జోడించాడు రమణ. ఓ ఐదు వందల నోటు పర్స్ ‌లోంచి తీసి ఖాసిం చేతిలో పెట్టాడు బజానా అన్నట్టు.

‘పాతబస్తీలో మా దోస్త్ ఒకాయన ప్రతి బేస్తవారం ఇక్కడికొస్తాడు. ఆయనకు గడియారాల దుకాణం ఉంది. స్ప్రింగులు ఆయన దగ్గర దొరుకుతాయి సాబ్‌. ‌తీసి పెడతాను. సోమవారం రండి’’ అన్నాడు.

తరవాతి సోమవారం కూడా పని కాలేదు. దోస్తు వచ్చేడట కానీ స్ప్రింగులు తేలేదట. ‘ఇదిగో తెస్తాడు అదిగో తెస్తాడు’ అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నాలుగు వారాలు గడిపేడు ఖాసిం.

సార్‌. ‌మీ గడియారం చాలా పాతది. దానికి సరిపడే స్ప్రింగులు దొరికేదాకా గేరంటీ లేదు. ఎందుకీ పాతది? మంచిగా కొత్తది ఇస్తా తీసుకోండి. ఐదారు వందల్లో క్లాసు గడియారాలున్నాయి మా షాపులో.’’ అన్నాడు సలీం ఒకరోజు.

‘‘కొత్తది కొనుక్కోలేక కాదు సలీం. ఇది మా నాయన గారు నేను పుట్టని క్రితం కొన్నది. ఆయన జ్ఞాపకార్థం దాచుకుంటున్నా. దీని గంటలు వింటూ ఉంటే నాబాల్యం, మావూరు, ఆ రోజులూ గుర్తుకొస్తాయి. ఈ పెండ్యులం ఊగుతూ ఉంటే మా ఇంటి వెనక చింత చెట్టుకి కట్టిన ఊయలలో ఊగుతున్నట్టుంటుంది. వేరే ఎవరికీ ఇవి చెప్పినా అర్థం కావు.’’ అన్నాడు రమణ.

పోనీ ఒక పని చేద్దాం సార్‌. ‌పాత మిషను తీసేసి ఈ డయల్‌ ‌వెనక బాటరీ మిషన్‌ ‌బిగించి ఇస్తా. చక్కగా మీకు మీ గడియారం తిరుగుతున్నట్టే ఉంటుంది. తేడా తెలియదు!’’ అన్నాడు సలీం.

ఇది వరకు కొట్టే గంటలు కొడుతుందా? కింద ఇత్తడి బిళ్ల ఊగుతుందా?’’

సలీం నుంచి జవాబు లేదు. ఆ రెండూ సాధ్యం కావు మరి.

వారం గడిచేక ఓ రోజు ఆఫీస్‌ ‌నుంచి వస్తూ షాపుకి వెళ్లాడు రమణ. ఖాసిం లేడు. ఆ తరువాత రెండు మూడు రోజులు దూరం నించే చూశాడు ఖాసిం కనబడతాడేమోనని. ఏదైనా ఊరెళ్లాడా?

చివరికి ఓ రోజు ధైర్యం చేసి అడిగితే ‘‘జొరమొచ్చింది. తగ్గేదాకా రాడు షాపుకి ‘‘ అన్నాడు సలీం నిర్లక్ష్యంగా.

ఇంటి కొచ్చి సోఫాలో కూలబడ్డాడు రమణ. ‘‘ఎందుకంత హైరానా పడతారు? అతని వల్ల కాదు. ఒకవేళ రిపేర్‌ ‌చేసినా వెయ్యో రెండు వేలో అడుగుతాడు. పాత గడియారానికి అంత పెట్టడం అవసరమా? తెచ్చి ఎక్కడ పెడతారు? హాల్లో ఉన్న గడియారం చాలదా మనకి?’’ అంది ఇల్లాలు మంచి నీళ్లిస్తూ .. అతడి మనసు చివుక్కుమంది .

పది రోజులైనా ఖాసిం షాపుకి రాలేదు. రమణకేదో కీడు తోచింది. డెబ్భై ఏళ్ల మనిషి.

అతడికేమైనా అయితే ఇక తన గడియారం బాగు చేసేదెవరూ? ఒకవేళ అదే జరిగితే ? ఆగిపోయిన దాన్నే గోడకి తగిలించుకోవాలి. చలనం లేని ఆ మూగ గడియారం తననింకా ఏడిపించదూ! ఆ రాత్రి నిద్ర పట్టలేదతనికి.

సలీంకి తెలియకుండా అతని పక్క షాపతన్ని కలిసి ఖాసిం ఇంటి అడ్రసు సంపాదించి, ఓ సాయంత్రం వాళ్ల ఇంటికెళ్లాడు రమణ.

మంచం మీదున్నాడతడు. పలకరించి ధైర్యం చెప్పాలనుకున్నాడు కాని ఖాసిమే రమణకి ధైర్యం చెప్పాడు. ‘‘వర్రీ కావొద్దు సాబ్‌. ఇదిగో ఇంటికే తెచ్చిపెట్టుకున్నాను చూడండి.’’ అంటూ తన పక్క గూట్లో గడియారాన్ని చూపించాడు. ‘‘ మా దోస్తు రేపు ఇంటికొస్తాడు. స్ప్రింగులు వచ్చాయంటే రిపేర్‌ అయిపోయినట్టే. రెండు రోజుల్లో నా బీమారీ కూడా నయమైపోతుంది.’’

రమణ బయటకు వస్తూ ఉంటే డాక్టర్‌ ఎదురయ్యాడు. తెలిసిన డాక్టరే. అతను వెనక్కి వచ్చేదాకా బయట నిలబడి, రాగానే ఖాసిం పరిస్థితి గురించి అడిగాడు.

‘‘కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఆ రిపోర్టులని బట్టి గాని చెప్పలేం. డబ్బు లేకో ఏమో టెస్టులు చేయించుకోవడం లేదు వీళ్లు’’ అన్నాడు డాక్టర్‌.

 ‘‘‌కొడుకున్నాడుగా? అంత ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాడా తండ్రికి?’’ అనుకున్నాడు రమణ.

ఎప్పటికి ఖాసిం బాగుపడేనూ, ఎప్పటికి తన గడియారం తయారయ్యేను? ఎంతసేపూ ఇదే ఆలోచన.

ఒకసారి కూరగాయల మార్కెట్లో సలీం ఎదురుపడ్డాడు. ‘‘ఆగండి. మా నాయన్ని బతకనివ్వరా మీరు? మీ వల్లే ఆయన చచ్చిపోయేట్టున్నాడు మనశ్శాంతి లేకుండా! ఎందుకొచ్చారు మా ఇంటికి? వొద్దంటున్నా వినకుండా మీ గడియారమే ముందేసుకుని కూర్చుంటున్నాడాయన.’’ అంటూ గట్టిగా అరిచేడు. చుట్టూ అందరూ వాళ్ల వైపే చూస్తున్నారు.

రమణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనేం తప్పు చేశాడు? తన వల్ల ఖాసిం చచ్చిపోతాడా? ఎంత మాటన్నాడు! మనశ్శాంతి లేనిది తనకా? అతడికా? ఎందుకొచ్చిన తాపత్రయం ఇది? గడియారమూ వద్దు. ఖాసిమూ వద్దు. మనసు రాయి చేసుకోడానికి విశ్వప్రయత్నం చేశాడు రమణ.

మతి చెడి ఇంటివైపు అడుగులు వేస్తున్న అతడికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది! ‘సలీం అన్నదాంట్లో తప్పేం ఉంది? ‘తనేమో తన గడియారం బాగుపడాలని కోరుకుంటున్నాడు. అలాగే సలీం కూడా తన తండ్రి బాగుపడాలని కోరుకుంటున్నాడు. జీవం లేని మర గడియారం కోసం తను! విలువైన తండ్రి ప్రాణం కోసం అతడు!!

ఏదో స్థిరమైన అభిప్రాయానికి మార్గం కనిపించి ఆనందం కలిగింది అతడికి. ‘తన మర గడియారాన్ని బాగు చెయ్యగలిగిన స్థితిలో అతడు లేకపోవచ్చు కానీ అంతకంటే ఎంతో విలువైన ఆ ‘జీవ గడియారా’న్ని బాగు చేసి, ఆగిపోకుండా చెయ్యగల స్తోమతు తనకుందిగా!’ అనుకున్నాడు. ఖాసిం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తిరిగే చక్రం తిరగలేనిదాన్ని తిప్పాలి. మనిషికి మనిషి సాయపడాలి. అప్పుడే కదా సమాజం సక్రమంగా నడిచేది. ఎంతబాగా చెప్పాడు!!

ఆ సాయంత్రం రమణ ఖాసిం ఇంటికెళ్ళాడు. అతడి వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు.

ఇంట్లోంచి బయటకు వస్తూ నాలుగు అడుగులు వెయ్యగానే ఎదురుగా వస్తూ కనిపించాడు సలీం. చూస్తూనే విరుచుకుపడ్డాడు. ‘‘ఎందుకొచ్చావ్‌ ‌మా ఇంటికి? రావొద్దని చెబితే కాదా?’’ ఆవేశంగా అరుస్తూ చెయ్యి పైకెత్తి కొట్టబోయి, తమాయించుకుని ఒక్క తోపు తోసాడు విసురుగా వెనక్కి పడిపోయాడు రమణ. చేతిలోంచి సంచీ, దాని లోంచి గడియారమూ నేల మీద పడి దాని అద్దం ముక్కలై చెల్లాచెదురుగా నేల మీద పడ్డాయి! రమణ ఏమీ మాట్లాడలేదు. గాజు పెంకుల్ని మెల్లగా ఎత్తి సంచిలో వేసుకుంటున్నాడు.

గడియారాన్ని తీసుకుపోతున్నాడని అర్థ్ధమైంది సలీంకి. తను తొందర పడ్డాడా? ఒక్క క్షణం ఆగి, ఇంటి వైపు అడుగులేశాడు.

కొడుకును చూస్తూనే ‘‘రా బేటా రా’’ అంది ఖాసిం పక్కనే మంచం మీద కూర్చున్న అతడి తల్లి. ‘‘అయ్యో, ఇప్పుడే ఆ సాబ్‌ ‌వచ్చి వెళ్లాడు. నువ్వు కూడా ఉండుంటే ఎంత సంతోషించేవాడివో. ఇదిగో వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పి, ఐదు వేలు మీ నాయన చేతిలో పెట్టేడాయన. రిపేర్‌ ‌కాలేదని చెబుతున్నా ‘వద్దం’టూ గడియారం తీసుకెళ్లిపోయాడు’’ అంది వంద నోట్ల కట్ట కొడుక్కి చూపిస్తూ.

వచ్చేవారం కథ..

బిడ్డతల్లి – జిల్లేళ్ల బాలాజీ

About Author

By editor

Twitter
Instagram