‘‘అయ్యో, అయ్యో…ఆపు నాన్నా ఆపూ!’’ పరుగెత్తుకెళ్లి తండ్రిని పట్టుకుని పక్కకు లాగాడు చిన్నకొడుకు సూర్యం.

అప్పటికే పెంపుడు గుర్రాన్ని కసిదీరా చితక బాది ఆయాసపడుతున్నాడు రంగయ్య. అన్ని దెబ్బలు తిన్నా ఆ గుర్రం కిమ్మనకుండా తల వంచుకుని నిలబడి ఉంది. దాని తెల్లటి ఒంటిమీద రంగయ్య కొట్టిన దెబ్బల• వాతలు తేలి కనిపిస్తున్నాయి.

‘‘దీన్ని ఇట్టా కాదు, ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు.’’ ఆవేశంతో మళ్లీ కొట్టటానికి ప్రయ త్నించాడాయన.

‘‘ఇలా దాన్ని గొడ్డును బాదినట్టు బాదితే ‘పాపం’ సంగతి సరే, అది చచ్చి ఊరుకుంటుంది తెలుసుకో?’’ అంటూ తండ్రి చేతిలోని దుడ్డుకర్రను లాగి దూరంగా విసిరేశాడు సూర్యం.

‘‘సస్తే మాత్రం ఏంటంట! ఒక్కసారిగా దీని పీడ ఇరగడైపోతుంది.’’ కోపంతో బుసలుకొడుతున్నాడు రంగయ్య.

అరుగుపై కూర్చుని చంటిబిడ్డకు పాలిస్తున్న పెద్దకోడలు అమర, గుర్ర దీనస్థితికి మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది. కడుపు నిండిన చంటిబిడ్డ, నోరు తెరుచుకుని ఏడుస్తున్న తల్లి ముఖంలోకే కళ్లార్పకుండా చూస్తున్నాడు. ‘‘ఇందాకటి నుండి చూస్తున్నా, గుర్రాన్ని పిచ్చికుక్కను కొట్టినట్టుగా కొట్టావు. అయినా నీ కోపం ఇంకా చల్లారినట్టులేదు.’’ అన్నాడు అరుగుమీద కుట్టుమిషను ముందు కూర్చొని ఉన్న పెద్దకొడుకు రమణ.

‘‘దీంతో నా మానమే పొయ్యింది. బండిని లాగతా లాగతా సటుక్కున నడిరోడ్లో కూలబడింది. ఎంత లేపినా లెయ్యనని మొండికేసేసరికి యేరే దారిలేక ఓ బల్ల రిక్సాని కుదుర్సుకుని, బండ్లోని లగేజీ నంతా దాన్లోకెక్కించి డెలివిరీ సెయ్యాల్సొచ్చింది. దాంతో నాకు గిట్టిన కూలీనంతా బల్ల రిక్సావోడికి ఇయ్యాల్సొ చ్చింది.’’ రగిలిపోతూ అన్నాడు రంగయ్య.

‘దీన్ని ఇక్కడే ఇంతగా సావబాదాడంటే, ఉదయం బరువును మొయ్యలేక సతికిలబడ్డప్పుడు ఇది ఇంకెన్ని దెబ్బలు తినుంటుందో? అత్త పోయాక మామకు కోపం బాగా పెరిగిపోయింది.’ అనుకుంటూ మరింతగా కుమిలిపోయింది అమర.

‘‘ఈ మధ్య నీలో పెరిగిన అత్యాశ వల్ల అపరిమితమైన బరువును దాని నెత్తిమీద పెడితే అదెలా లాగుతుందనుకున్నావు? అదేమైనా యంత్రమను కున్నావా? ప్రాణమున్న జీవి. అది తెలుసుకో ముందు.’’ కోపంతో అన్నాడు రమణ.

‘‘ఈ దినంతో దీని యవ్వారమేందో బాగానే తెల్సొచ్చింది. ఒకసారి సు•ం మరిగిందంటే ఇంకెన్ని దెబ్బలనైనా ఓర్సుకుంటిందనీ తెల్సింది. వోరం దినాలుగా ఇదే తంతు. సోమరిపోతు గుర్రం. ఇదే ఏ గొడ్డో అయ్యుంటే… ఏ కసాయోడికో, కబేలాకో తోలేసి నాలుగు డబ్బులు కళ్లజూసి ఉందును. అందుకూ పనికిరానిదై పాయె.’’ నిరుత్సాహంతో అన్నాడు రంగయ్య.

‘‘నాన్నా, అన్యాయంగా మాట్లాడకు. ఇన్నేళ్లు మనల్ని ఆదుకున్న ఈ జీవిని ఇదేనా నువ్వు అర్థం చేసుకున్నది? ఇదే మనిషైతే ఇలా మాట్లాడేవాడివా? మూగ జంతువనే కదూ ఇంతటి పాడు ఆలోచన చేశావు?’’ సూటిగా అడిగాడు సూర్యం.

‘‘పనికిరానిదై పొయ్యాక ఇంకెట్టా ఆలోసించాలి?’’ తేలికగా అనేశాడు రంగయ్య.

‘‘ఎప్పుడైతే నీకా ఆలోచన వచ్చిందో ఇక ఈ గుర్రంతో నీకు ఏ సంబంధమూ లేదు నాన్నా.’’ చెప్పాడు సూర్యం.

‘‘మరి ఎందుకూ పనికిరాని దీన్నింట్లో పెట్టుకుని ఎవురు మేపతారంట?’’ సూర్యాన్నే చూస్తూ అన్నాడు రంగయ్య.

‘‘నేనే. ఇకపై దీని ఆలనా పాలనా అంతా నేనే చూసుకుంటాను.’’ గుర్రాన్ని ప్రేమగా నిమురుతూ అన్నాడు సూర్యం.

‘ఓయబ్బో! ఇప్పటిదాకా ఓ ఉజ్జోగమూ లేదు, పైసా వరుమానమూ లేదు. గుర్రం బాగోగులు సూస్తాడంట… గుర్రం బాగోగులు! అదీ ఎంత మాత్రమో నేను సూడకుండా పోతానా…’ అని గొణుక్కుంటూ వీధిలో••ళ్లాడు రంగయ్య.

ఓ వారం తర్వాత గుర్రాన్ని వెంటబెట్టుకుని పట్నానికి వెళ్లిన సూర్యం, మళ్లీ ఆరునెలల వరకూ ఇంటివైపే రాలేదు. అప్పుడప్పుడూ మాత్రం కొంత డబ్బును ఇంటికి పంపుతూ వచ్చాడు.

                                                                                               *     *     *

ఓ రోజు మినీలారీలో గుర్రాన్ని ఎక్కించుకుని ఇంటికొచ్చాడు సూర్యం.

బలిష్ఠంగా, మిసమిసలాడుతూ ఉన్న గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రంగయ్య. అంతేకాదు, గుర్రంలో ఉరకలేసే      ఉత్సాహాన్ని కూడా పసిగట్టాడు. ‘మనోడు దాన్ని బాగానే మేపుతున్న ట్టున్నాడే?’ అని మనసులో అనుకున్నాడు రంగయ్య.

సూర్యం కూడా మనిషి బాగా మారిపొయ్యాడు. చక్కటి దేహదారుఢ్యంతో, మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. మాటల్లో వేగమూ, నడకలో చురుకు దనమూ కనిపిస్తున్నాయి. అతని కళ్లల్లో ఏదో తెలియని కసి కనిపిస్తోంది.

తమ్ముణ్ణి చూసి ఎంతో ఆనందించాడు రమణ. సూర్యంను ఆదరంగా పలకరించింది అమర.

అతని కోసం ఆ పూట చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటుచేసింది. ఆ రోజంతా బిడ్డను ఎత్తుకునే ఉన్నాడు సూర్యం.

‘‘తమ్ముడూ, పట్నంలో గుర్రాన్ని పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు రా?’’ ఎంతో ఆసక్తిగా అడిగాడు రమణ.

‘‘అన్నా, ఈ గుర్రంతో నేనిప్పుడు బరువును మొయ్యించటం లేదు. కానీ ఈ గుర్రం సాయంతో నేనిప్పుడు జిమ్నాస్టిక్స్ ‌ప్రాక్టీస్‌ ‌చేయిస్తున్నాను. అంటే గుర్రం ఎక్కువగా ఫీట్లు చెయ్యదు కానీ, నేనే దానిపై నిలబడి రకరకాల విన్యాసాలు చేస్తాను. దీన్నే ఇంగ్లీషులో ‘ఈక్వస్ట్రెయిన్‌’ అం‌టారు. అక్కడక్కడా నాలాంటి గుర్రపు రౌతులకు పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిల్లో పాల్గొంటున్నాను. ఎప్పటికైనా ఒక గొప్ప పోటీలో పాల్గొని పెద్ద మొత్తం దక్కించుకోవాలని చూస్తున్నాను. దాంతో మన పేదరికాన్ని దూరం చేసి, నాన్ననూ మిమ్మల్నీ బాగా చూసుకోవాలనుకుంటున్నాను.’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్న సూర్యం మాటలకు రమణ, అమర ఎంతగానో పొంగిపోయారు. రంగయ్య లోపల సంతోషించినా పైకి ఏమీ అనలేదు.

మరుసటిరోజు గుర్రాన్ని తీసుకుని మళ్లీ పట్నం వెళ్లిపోయాడు సూర్యం.

                                                                                         *     *     *

ఉన్నట్టుండి ఒకరోజు సూర్యం ఇంటికొచ్చాడు. అది మామూలు రాకగా అనిపించలేదు ఎవరికీ. ఏదో విశేషమే ఉందనుకున్నారు. ఆ పూట భోజనాలయ్యాక… ‘‘అన్నా, కోవై ప్రాంతపు జమీందారుగారొకరు ఈ యేడాది ఊటీలో వేసవి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలని నిశ్చయించారు. అందులో భాగంగా ‘ఎవరైనా తనను ఆశ్చర్యపరిచేలా సాహస విన్యాసాలు  చేసినవారికి    ృఅక్షరాలా పాతిక లక్షల రూపాయల బహుమతినిస్తానని’ పత్రికా ముఖంగా ప్రకటించారు.’’

‘‘పాతిక లక్షలా?’’ ఆశ్చర్యపోతూ అన్నారు రమణ, అమర. నమ్మశక్యం కానట్టుగా ముఖం పెట్టాడు రంగయ్య.

‘‘ఔను! కావాలంటే ఇదిగో ఈ ప్రకటనను చదువూ.’’ అంటూ తన చేతిలోని ఆంగ్ల దినపత్రికను ఇచ్చాడు సూర్యం.

రమణ చదవటం పూర్తిచేసి, ‘‘నిజమే నాన్నా. పాతిక లక్షలు! పెద్ద మొత్తమే.’’ కళ్లు పెద్దవి చేస్తూ తలూపాడు.

‘‘అందుకే… అందులో నేనూ పాల్గొని ఎలాగైనా ఆ బహుమతిని దక్కించుకోవాలని నిర్ణయించు కున్నాను.’’

‘‘ఇంకేం. అలాగే కానివ్వూ…’’ నవ్వుతూ అన్నాడు రమణ.

‘‘కానీ, అందుకు మీ అందరి సహకారమూ కావాలి. అప్పుడే నేను అనుకున్నది సాదించగలను.’’

‘‘తప్పకుండా మేమందరమూ నీకు సహకరిస్తాం. ఏమంటావు నాన్నా?’’ అనగానే ఆయనా అలాగేనన్నట్టు తలూపాడు.

                                                                                         *     *     *

ఊటీలోని ఆ మినీ ఇండోర్‌ ‌ప్లే గ్రౌండ్‌ ‌వృత్తాకారంలో ఉంది. మధ్యలో జరిగే ప్రదర్శన అందరికీ కనబడేటట్టుగా చుట్టూ గ్యాలరీని నిర్మించారు. ప్రదర్శనకారులు మైదానంలోకి వచ్చేందుకు అనువుగా ఒక ప్రవేశద్వారం ఉంది. ఎవరూ మైదానంలోకి చొచ్చుకురాకుండా చుట్టూ పటిష్టమైన బారికేడ్లు కట్టారు. అంతేకాక పోలీసుల నిఘా కూడా ఏర్పాటు  చేశారు.

అప్పటికే గ్యాలరీ అంతా ప్రేక్షకులతో నిండిపోయి సందడిగా ఉంది. కింది వరుసలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనాలలో కోవై జమీందారు కుటుంబ సభ్యులు కూర్చుని ఉన్నారు.

వాళ్లకు కాస్త పక్కగా అనౌన్సరు ఆనాటి కార్యక్రమ వివరాలను మైక్‌లో చెబుతున్నాడు.

కాసేపటికి ప్రదర్శనలు మొదలయ్యాయి. సంగీతం సన్నగా వినిపిస్తున్నది. ప్రేక్షకులు చప్పట్లతో ఆహ్వానం పలికారు.

ఒక్కొక్క గ్రూపూ ఎంతో విలక్షణంగా తమతమ విన్యాసాలను ప్రదర్శించసాగాయి. జమీందారు ఎంతో ఆసక్తిగా ఆ విన్యాసాలను వీక్షిస్తున్నారు. ప్రేక్షకుల కేరింతలతో, కేకలతో, అరుపులతో, నవ్వులతో ఆడిటోరియమంతా సందడిగా ఉంది.

అర్ధగ•ంట గడిచింది. తర్వాత కార్యక్రమంగా అనౌన్సర్‌ ‌మైక్‌లో సూర్యం పేరును ప్రకటించాడు.

దాంతో సూర్యం కుటుంబ సభ్యులందరూ గుర్రం సహా ప్రవేశద్వారం దగ్గరికి చేరుకున్నారు. ఆ గుర్రం ఎంతో చలాకీగా ఉంది. దాని నుదుటి మధ్య భాగాన కొమ్ములాంటిది ఏర్పాటు చెయ్యటంతో అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ప్రత్యేకంగా తయారుచేసిన జీనును కూడా  అమర్చారు.

రంగయ్య గుర్రం కళ్లేన్ని పట్టుకుని ముందుకు నడుస్తుంటే, ఆయన వెనకే సూర్యం, రమణ, అమర అనుసరించారు. ట్రాక్‌ ‌చుట్టూ సూర్యం కుటుంబ సభ్యులు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పూర్తిగా ఒకసారి తిరిగొచ్చాక ప్రవేశద్వారం దగ్గర సూర్యం మాత్రం ఆగిపోయాడు.

రమణ అక్కడున్న తమ సరంజామా సంచీని తీసుకుని సన్నగా ఈలవేస్తూ గుర్రాన్ని మెల్లగా చేత్తో తట్టాడు. దాంతో అది అమితమైన వేగంతో తన గాలప్‌ను(నాలుగు కాళ్లతో లయబద్దంగా చేసే పరుగు) ప్రారంభించింది. చుట్టగా చుట్టి తనచేతిలో ఉంచుకున్న కళ్లేన్ని(తాడును) వదులుచేసుకుంటూ రంగయ్య రింగు మధ్య ప్రదేశానికి చేరుకోసాగాడు. ఆయన వెంట రమణ, అమర నడిచారు.

మధ్య ప్రదేశానికి చేరుకునేసరికి ఇప్పుడు రంగయ్య చేతిలోని కళ్లెం పొడవుగా సాగి కనిపిస్తున్నది. గుర్రం ట్రాక్‌లో తిరుగుతుంటే అదే దిశలో, ఉన్నచోటే రంగయ్య కూడా అడుగులు పక్కకు జరుపుతున్నాడు.

రమణ తన చేతిలోని సరంజామాను తండ్రికి కాస్త పక్కగా పెట్టి నేలమీద కూర్చున్నాడు. అతని పక్కనే అమర కూర్చుని నిద్రపోతున్న చంటిబిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకుంది.

గుర్రం ప్రవేశద్వారం దగ్గరకు సమీపిస్తుండగా తయారుగా ఉన్న సూర్యం గుర్రం పక్కన తనూ రిథమిక్‌గా పరుగెత్తసాగాడు. కొంత దూరం పరుగెత్తాక జీను పిడిని చేతులతో గట్టిగా పట్టుకుని అలాగ్గా ఎగిరి గుర్రంపై ముందొక కాలూ వెనకొక కాలూ పెట్టి నిలబడ్డాడు. గుర్రం గాలప్‌కు తగ్గట్టుగా తనూ ముందుకూ వెనక్కు కదలసాగాడు.

ప్రారంభ విన్యాసానికే ప్రేక్షకులు చప్పట్లతోపాటు కేకలు, ఈలలు వేశారు.

ఇక మొదలైంది సూర్యం విన్యాస పరంపర. గుర్రం పరుగెడుతుంటే దానిపైన పిల్లిమొగ్గ వేశాడు. ప్రస్తుతం అతను ధనురాసనం వేసినట్టుగా కనిపిస్తున్నాడు. అదే వేగంలో నిటారుగా నిలబడి చేతులు రెండూ గాల్లోకి విసిరాడు. గుర్రం అదే లయను అందిపుచ్చుకుని చక్కటి గ్యాలప్‌తో పరుగు తియ్యసాగింది.

ఈసారి సూర్యం జీనుకున్న పిడులను రెండు చేతులతో పట్టుకుని కాళ్లు పైకి చక్కగా చాపి శీర్షాసనంలో తలకిందులుగా నిలబడ్డాడు. అదే భంగిమలో ఉంటూ రెండు కాళ్లనూ ముందుకూ వెనక్కూ జరిపాడు. తర్వాత పక్కలకు జరిపాడు. క్షణాలలో కాళ్లను చేతులకు సమాంతరంగా తెచ్చి నిటారుగా నిలబడి విసురుగా చేతులను గాల్లోకి విసిరాడు.

గుర్రం అదే గ్యాలప్‌తో రిథమిక్‌గా పరుగెడు తున్నది. దానికి తగ్గట్టుగా సూర్యం చక్కటి బ్యాలెన్స్‌ను ప్రదర్శిస్తున్నాడు.

గుర్రం కిందనుండి ఇటు దూరి అటు తేలాడు. అటు నుండి ఇటు వచ్చాడు. ఎక్కడా తొట్రుపడలేదు. జారిపడలేదు.

మళ్లీ గుర్రంపై నిలబడ్డాడు. చేతులు గాల్లోకి లేపాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. జమీందారు చిర్నవ్వు నవ్వాడు.

అప్పటిదాకా నేలపై కూర్చొని వున్న రమణ లేచి నిలబడ్డాడు.

అంతే! ఠక్కున అప్పటివరకూ వినిపిస్తున్న సంగీతం ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఆగిపోవటంతో ప్రేక్షకుల మాటలూ కేకలూ అన్నీ ఆగిపోయాయి. అన్నీ ఆగినా గుర్రం పరుగు మాత్రం ఆగలేదు. అది పరుగెడుతూనే ఉంది.

అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఏదో వింత జరగబోతుందని అందరికీ అనిపించసాగింది. అందరూ ఆతృతగా సూర్యం కేసే చూడసాగారు.

రమణ తాను తీసుకొచ్చిన సరంజామా సంచీని తీసుకుని గుర్రం పరుగులు తీస్తున్న రింగ్‌ ‌దగ్గరికి చేరుకుని •నేలమీద పెట్టాడు. అందులో నుండి ఓ ఐదడుగుల వెదురుబొంగును చేతిలోకి తీసుకున్నాడు. గుర్రం తన ముందుకు రాగానే, దాని పక్కనే పరుగెడుతూ బొంగును సూర్యం చేతికందించాడు.

రమణ వెనక్కు తిరిగి మళ్లీ సంచీ దగ్గరికొచ్చి ఈసారి ఒక వెడల్పైన పలుచటి ప్లాస్టిక్‌ ‌బుట్టను తీసుకున్నాడు. ఆ బుట్ట లోపలి భాగం ఒక మెత్తని వస్త్రంతో అల్లబడి వుంది. బుట్ట కిందిభాగంలో ఒక స్క్రూ బిగించబడి వుంది.

గుర్రం ఓ రౌండు పూర్తిచేసుకుని తన దగ్గరకు రాగానే బుట్టను సూర్యానికి అందించాడు రమణ. సూర్యం ఆ బుట్టను అంతకుముందు తీసుకున్న వెదురుబొంగు పైభాగంలోని రంధ్రంలో ఉంచి బొంగును తిప్పుతూ బుట్ట అటుఇటు కదలకుండా గట్టిగా బిగించాడు. గుర్రం పరుగెడుతూనే ఉంది.

ఇప్పుడు అమర తన బిడ్డతోసహా లేచి నిలబడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆమె ఒకసారి బిడ్డ ముఖంలోకి చూసింది. బిడ్డ మంచి నిద్రలో ఉన్నాడు. వంగి బిడ్డ బుగ్గల్ని ముద్దాడింది. స్థిరంగా నడుచుకుంటూ వెళ్లి గుర్రం పరిగెత్తే దారి పక్కన నిలబడింది. రెండు అరచేతులమధ్యా బిడ్డను ఉంచుకుని సరిగ్గా సూర్యం అందుకునేలా చేతులు చాచి నిలబడింది.

సూర్యం అప్పటికే వెదురు బొంగును కాళ్ల దగ్గరున్న ప్రత్యేక అరలో నిలబెట్టి దాన్ని తన మోకాలితో అదిమిపట్టి ఉంచాడు. వదిన చాపిన చేతులమధ్య ఉన్న పసిబిడ్డను అలాగ్గా అందుకున్నాడు సూర్యం. ఆ బిడ్డను వెదురు బుట్టలోకి చాకచక్యంగా ఏ చిన్న కుదుపు కూడా లేకుండా పడుకోబెట్టాడు.

తర్వాత ఆ వెదురుబొంగును కుడిచేత్తో పట్టుకుని కొంతమేర పైకిలాగి కింద ఎడమచేత్తో ఆ బొంగును పట్టుకున్నాడు. కుడిచేతిని వదులుచేసి పక్కకు తెచ్చాడు. ఇప్పుడు ఎడమచేత్తో బొంగును మరికొంత మేర పైకిలాగి కుడిచేత్తో పట్టుకున్నాడు. అలా చేతులను పైకీ కిందికీ మారుస్తూ బొంగును పైకెత్తాడు. బొంగు అడుగుభాగం వచ్చేసరికి, ఇప్పుడు బిడ్డ పడుకున్న బుట్ట ఐదడుగుల ఎత్తుకు వెళ్లింది.

ఈసారి రమణ ఇచ్చిన మరో ఐదడుగుల వెదురు బొంగును తన ఎడమచేత్తో అందుకున్నాడు సూర్యం. దాన్ని కుడిచేతిలోని మొదటి బొంగు అడుగుభాగం కింద ఉంచి మెల్లగా తిప్పుతూ బిగించాడు.

ఆ వెదురు బొంగును మళ్లీ చేతులతో ఇంతకు ముందులాగా పైపైకి ఎత్తసాగాడు. కొంతసేపటికి బిడ్డ పదడుగుల ఎత్తుకెళ్లాడు.

రమణ చివరగా మరో మూడడుగుల వెదురు బొంగును అందించాడు. సూర్యం ఇంతకు ముందులాగానే చేతిలోని బొంగుకు దానికి జతచేసి పైకెత్తాడు. ఇప్పుడు బిడ్డ పదమూడడుగుల ఎత్తున ఉన్నాడు.

ఊపిరి ఆగినంత పనైంది అమరకు. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. భయం ఆమె ఒళ్లంతా పాకింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బిడ్డ అంత ఎత్తునుండి నేలమీద పడి మరణించవచ్చు.

గుర్రం చక్కటి గ్యాలప్‌లో పరుగెడుతున్నది. సూర్యంలో ఏమాత్రం అదురూ బెదురూ లేదు. వణుకూ తొణుకూ లేదు. తన దృష్టంతా బుట్టపైనే ఉంచాడు. ఆ బొంగును పొట్టదగ్గర నడుముకు చుట్టుకున్న గుడ్డ కుదురులో ఉంచాడు.

తర్వాత బొంగును పట్టుకున్న రెండుచేతుల్లో నుండి ఎడమచెయ్యిని మాత్రం బొంగుపైనే ఉంచి కుడిచేతిని మెల్లగా పక్కకు తీశాడు. చూస్తున్నవాళ్లకు విస్మయం కలుగుతోంది. అది కలా నిజమా అన్న భ్రమలో ఉన్నారు. తర్వాత మెల్లగా ఎడమ కాలిని పక్కకు తీశాడు. అంటే ఇప్పుడు ఎడమచెయ్యి, కుడికాలిపై పట్టు బిగించి గుర్రంపై విన్యాసం చేస్తున్నాడన్నమాట.

గుర్రం ఒక రౌండు పూర్తిచేశాక కుడిచేతినీ, ఎడమకాలినీ మళ్లీ యథాస్థానంలోకి తెచ్చాడు. వెదురు బొంగును పొట్ట దగ్గరున్న గుడ్డ కుదురులో నుండి తీసి రెండు చేతులతో బిగించి పట్టుకున్నాడు.

ఈలోపు రమణ తల పైకెత్తి ఏకాగ్రతతో వెదురుబొంగునే చూస్తూ గుర్రం పక్కనే పరుగెత్త సాగాడు. సూర్యం ఓ చిన్న ఈల వేసి వెదురు బుట్టలోని బిడ్డను ఉన్నపళాన గాల్లోకి ఎగరేసి వెదురు బొంగును వదిలేశాడు. క్షణాలలో భూమిపైకి దూసుకొస్తున్న బిడ్డను తన రెండు చేతులతో పట్టుకున్నాడు సూర్యం. అప్పటికే నేలమీదకు పడిపోతున్న బొంగును చేతులతో పట్టుకున్నాడు రమణ. అమర పరుగెత్తుకుంటూ వచ్చి బిడ్డను తీసుకుని తన గుండెకు హత్తుకుంటూ కన్నీళ్ల మధ్య తన పెదాలను బిడ్డ బుగ్గలపై ఆన్చింది. రమణ పరుగెత్తుకుంటూ వచ్చి భార్యనూ, బిడ్డనూ తన బాహువుల మధ్య బంధించాడు.

సూర్యం నేలమీదికి దిగి తన రెండు చేతులనూ గాల్లోకి విసిరాడు. లేచి నిలబడ్డ ప్రేక్షకులకు కృతజ్ఞతాపూర్వకంగా అభివాదం చేశాడు. ప్రత్యేక ఆసనంపై కూర్చొని ఉండాల్సిన జమీందారు ఎప్పుడు నిలబడ్డాడో తెలీదు, ఆనందంతో తన స్థాయిని కూడా మరచిపోయి…శెభాష్‌… ‌శెభాష్‌… అని బిగ్గరగా అరుస్తూ చప్పట్లు చరుస్తున్నాడు.

రెండు సెకన్ల తర్వాత ఒక కాగితంమీద ఏదో రాసి అనౌన్సర్‌ ‌చేతికందించాడు.

‘‘…పాతిక లక్షలను బహుమతిగా గెలుచుకున్న ఈ నాటి విజేత… సూర్యం అతని కుటుంబ సభ్యులు…’’ అనగానే ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు జడివానను తలపించాయి. దాన్ని వింటూ సూర్యం వేగంగా పరుగెత్తికెళ్లి అమాంతం తన రెండు చేతులతో గుర్రం మెడను కౌగిలించుకుని ఉద్విగ్నతతో, అణచుకోలేని దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలాసేపటి వరకూ దాని మెడను వదలకనే ఉండిపోయాడు. అప్పుడప్పుడూ దాని ముఖంపై ముద్దులు పెట్టాడు.

ఆ దృశ్యాన్ని చూసి తనూ కన్నీళ్ల పర్యంతమవు తున్నాడు రంగయ్య. ఇక రమణ, అమర పరిస్థితి చెప్పనక్కర్లేదు.

జమీందారు నుండి పాతిక లక్షల చెక్కును సూర్యం అందుకుంటూ ఉండగా జమీందారు అతణ్ణి ఒకే ఒక ప్రశ్న అడిగాడు. ‘‘నువ్వు కన్నీళ్లు పెట్టు కోవటానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా?’’

‘‘అయ్యా, ఈ రోజు జరిగిన విన్యాసంలో అస్సలు ఏ మాత్రం తర్ఫీదు లేని ఒకే ఒక జీవి ఆ పసిబిడ్డ. ఇవ్వాళ ఈ ఫీట్‌ ‌చెయ్యనున్నామని మా వదినకు ఈ ఉదయమే చెప్పాము. అప్పటినుండి ఆమె స్థిమితంగా ఉండలేకపోయింది. ఆ తల్లి హృదయం ఎంతటి భయాందోళనలకు గురైందో నేను చెప్పలేను. ఏమీ కాదని ఎంతగా ధైర్యం చెప్పినా ఆమె అంగీకరించ లేదు. చివరికి అయిష్టంగానే ఒప్పుకుంది. కానీ మేము ఆ విన్యాసం చేస్తున్నంతసేపూ తన బిడ్డ ఎక్కడ కింద పడిపోతుందేమోనని ఆ తల్లి గుండె ఎంతగానో తల్లడిల్లి ఉంటుంది. నిజానికి ఈ ఫీట్‌లో నాకన్నా ఎంతో గొప్పగా ప్రదర్శన చేసింది మాత్రం నా గుర్రమే. అది మూగజీవి. అది ఎక్కడా ఒకడుగు తడబడో, వేగంగానో, నిదానంగానో, పక్కకో పరుగెత్తలేదు. ఏ లయలో పరుగును మొదలు పెట్టిందో చివరిదాకా  అదే లయను కొనసాగించింది. మేమిద్దరం నిన్నటి దాకా ఒక డమ్మీబొమ్మతో మాత్రమే ప్రాక్టీస్‌ ‌చేశాం. కానీ, ఇవ్వాళ ఆ బొమ్మ స్థానంలో ప్రాణమున్న పసిబిడ్డను తెచ్చిన విషయం గుర్రానికి ఆ క్షణంలో మాత్రమే తెలుసు. మనం అనుకుంటూ ఉంటాం జంతువులకు ఏమీ తెలియదని. కానీ వాటికి అన్నీ తెలుసు. తెలుసుకుని సమయానుకూలంగా నడుచుకుంటాయి. బిడ్డకు ఏ మాత్రం ప్రమాదం జరగకూడదని అది ఎంతో జాగ్రత్తతో తన పరుగును పూర్తిచేసింది. ఆ విధంగా అదొక బిడ్డకు తల్లిలా నడుచుకున్న విధం నన్నెంతగానో కదిలించి వేసింది. అందుకే పెల్లుబుకు తున్న నాలోని దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను.’’ అని చిన్నగా నవ్వాడు సూర్యం.

అప్పుడు ఆ ఆడిటోరియమంతా మళ్లీ చప్పట్లతో మారిమోగిపోయింది.

-జిల్లేళ్ల బాలాజీ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది 

About Author

By editor

Twitter
Instagram