జనవరి 31 (2024) న ‘గద్దర్‌ ఫౌండేషన్‌’ హైదరాబాద్‌ లక్ష గద్దర్‌ జయంతి సభను నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే ఏడాది (2025 సంవత్సరం) నుంచి గద్దర్‌ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించి, తన మాటే జీఓగా భావించవచ్చునని చెప్పారు.

ఈ నేపథ్యంలో గద్దర్‌ గూర్చి కొంత నిష్పక్షపాత వైఖరితో మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాలు-అభిప్రాయాలు కొందరికి నచ్చక పోవచ్చు. అంత మాత్రాన సత్యం-నిజం తెరమరుగు కారాదు.

గద్దర్‌ తన జీవితంలో సింహభాగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించలేదు. పైగా పార్లమెంట్‌ ఒక పందుల దొడ్డి, అసెంబ్లీ ఒక బాతాఖానీ క్లబ్‌ అంటూ అగౌరవపరుస్తూ, దూషిస్తూ వేలాది వేదికల పై మాట్లాడాడు, పాటలు పాడాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూకటివేళ్లతో పెకలించి నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం మావోయిస్టుల ఆధ్వర్యంలో కదం తొక్కాలని  పిలుపునిచ్చాడు. ఆ విప్లవం తుపాకి గొట్టం ద్వారానే సాధ్యమని అందుకే సాయుధంగా తిరగబడమని దశాబ్దాలపాటు ఆయన సాంస్కృతికోద్యమం చేశాడు. తెలుగు నేలపైనే కాక ఇతర ప్రాంతాల్లోను మావోయిస్టులతో కలిసి ప్రచారం చేసిన విషయమూ అందరికీ తెలుసు. దేశమంతా కలియతిరిగి ప్రజాస్వామ్య ప్రక్రియపై నిప్పులు చెరిగాడు.

అంతేగాక మావోయిస్టులతో కలిసి కొంతకాలం అజ్ఞాత జీవితం-గెరిల్లా జీవితం గడిపాడు. వేలాదిమంది యువతీ యువకులను అజ్ఞాత-గెరిల్లా జీవితం గడిపేందుకుగాను అడవుల్లోకి ఆహ్వానిం చాడు. ఆయనపై గల గురి, నమ్మకంతో అనేకమంది అడవులకు వెళ్లారు. ఇదంతా జగమెరిగిన సత్యం. ఎన్నికైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు సహచర మావోయిస్టులతో కలిసి ఆయన ‘కుట్ర’ చేశాడు. ఆయనపై నమోదైన అనేక కేసులు ఇందుకు సాక్ష్యం.

అలాంటి గద్దర్‌ మావోయిస్టుల ప్రతినిధిగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపి మావోలకు ఎంతో మేలు చేకూర్చి వారి బలోపేతానికి అవిశ్రాం తంగా శ్రమించిన వ్యక్తి, కళాకారుడు ఇప్పుడు ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఎలా ఆదర్శప్రాయు డవుతాడు? ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపేందుకు ఎలా నిశ్చయిస్తుంది? ఇది కోటి రూకల ప్రశ్న. ఆరోగ్యకర ఆలోచనలు చేసే వారికిది ఆశ్చర్యం కలిగించే అంశం.

డా. వై.యస్‌. రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంతో పీపుల్స్‌ వార్‌ (మావోయిస్టు పార్టీ పూర్వ నామం) జరిపిన చర్చలు విఫలమయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతా అలజడి సృష్టించి, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని గద్దర్‌ తీవ్రంగా దూషించిన విషయం విస్మరించరానిది. అంతటి ఘన చరిత్ర గల గద్దర్‌ను వర్తమాన కాంగ్రెస్‌ ప్రభుత్వం, నాయకత్వం ఆదర్శంగా భావించడం ఆశ్చర్యకరమే కాదు, ఆందోళన కలిగించేదే.

ఆదర్శం వేరు, అభిమానం వేరు. ఎవరైనా తరతరాలు గుర్తుంచుకోదగ్గ రీతిలో నిస్వార్ధంగా ప్రజలకు సేవలు అందించినప్పుడే, తాను బోధించేవి ఆచరించినప్పుడే ఆదర్శప్రాయులనిపించుకుంటారు. ఈ కొలమానంతో చూస్తే గద్దర్‌ ఎక్కడా నిలవడు. ఆయన జీవనయానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయాలన్ని స్పష్టమవుతాయి.

కళను విప్లవీకరించి, విప్లవ రాజకీయాలతో మిళితం చేసి మావోయిస్టుల (అప్పటి పీపుల్స్‌వార్‌్‌)తో ప్రయాణం కొనసాగించినా అక్కడ కూడా అనేక ఆరోపణలతో రెండుసార్లు గద్దర్‌ బహిష్కరణకు గురైన సంగతి విస్మరించరాదు. ఆయనలోని దురాశ అత్యాశ, క్రమశిక్షణా రాహిత్యానికి తార్కాణమే తీవ్రమైన ‘వేటు’ అన్న విషయం విప్లవ అభ్యుదయ కాములందరికి తెలుసు.

అనంతరం పార్టీ బహిష్కరణను ‘పాజిటివ్‌’ గా భావించేవారిని, ఆయనకు ‘విముక్తి’ అభించిందని భావించే వారిని, తన అభిమానులను పోగేసి దగ్గరకు తీశాడు. తన పాటకు, మాటకు తిరుగులేదని నిరూపించేందుకు గాను బుల్లెట్‌ మార్గాన్ని వీడి, బ్యాలెట్‌ బాటను ఎంచుకున్నాడు. తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్న నినాదాన్ని అటకెక్కించి ఓటు ద్వారా విప్లవం తీసుకొస్తానని, భావ విప్లవం తీసుకొస్తానని సంకల్పం చెప్పుకున్నాడు. ఏకంగా దక్షిణాది రాష్ట్రాలలో ఓట్ల సునామి తీసుకొస్తానని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బడుగు బలహీన, దళిత-బహుజనులను ఏకం చేసి సరికొత్తగా లాల్‌-నీల్‌ మార్గంలో రాజ్యాధికారాన్ని కైవశం చేసుకుంటామని సదస్సులు-సభలు నిర్వహించాడు. ఆఖరికి ‘భారత రాష్ట్రపతి’ పదవి కోసం పావులు కదిపిన సంగతి సైతం సకల జనులకు తెలుసు. కానీ ఎక్కడా విజయం సాధించలేదు. ఆఖరికి మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కె.ఎ.పాల్‌ సారధ్యంలోని ‘ప్రజాశాంతి పార్టీ’లో చేరాడు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీడియా ముందు ప్రకటించాడు. చివర దశలో కూడా నామినేషన్‌ వేయకుండా, కె.ఎ.పాల్‌కు కనిపించకుండా అజ్ఞాతంలోకి జారుకున్నాడు. కొన్నాళ్ళకు ‘గద్దర్‌ ప్రజాపార్టీ’ అన్న పేరుతో భారత ఎన్నికల కమిషన్‌ దగ్గర రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు మీడియా ముందు ప్రకటించాడు. అప్పటివరకు తన నేతృత్వంలోని పార్టీకి రాజీనామా సమర్పించక పోవడంతో తన పార్టీ నుంచి గద్దర్‌ను బహిష్కరించినట్టు పాల్‌ ప్రకటించాడు. ఆ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. రకరకాల వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు, పద్ధతులు, వ్యవహారాలు, విధానాలు గౌరవప్రదమైనవిగా కనిపిస్తున్నాయా? చివరికి తాను రాజకీయ నాయకుడిగా ప్రకాశించలేకపోయినా తన పుత్రరత్నం సూర్యాన్ని రాజకీయ నాయకుడిగా చేసేందుకు ఆయన పడిన తాపత్రయం, హైరానా ఇంతా అంతా కాదు. దీన్ని పరిశీలించిన వారందరు ఆనాడు ముక్కున వేలేసుకున్నవారే.

అలాగే గద్దర్‌ చేసిన ప్రబోధాలకు, ఆచరణకు, వాటిపట్ల ఆయనకున్న నిబద్ధతను గూర్చి కొన్ని విషయాలు ముచ్చటించుకోవాలి. గద్దర్‌ సమకాలికుడు, ప్రముఖ కవి గూడ అంజయ్య రాసిన ‘ఊరు మనదిరా…ఈ వాడ మనదిరా…’ పాట గద్దర్‌కు అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. ఆ పాట రాసిన అంజయ్యకు మాత్రం ఎక్కడా గౌరవం దక్కలేదు. మరి అలాంటి వ్యక్తి ఆదర్శప్రాయుడు ఎలా అవుతాడు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత లూగించిన మరో కవి అందెశ్రీ. ఆయన రాసిన ‘జయ జయ జయహే తెలంగాణ’ అన్న గీతం ఇప్పుడు రాష్ట్ర అధికార గీతంగా గౌరవం పొందింది. అలాంటి కవి గాయకుడి సొంత ఆస్తి ఏ మేరకు ఎగబాకింది?… గద్దర్‌ సొంత ఆస్తి తారాజువ్వలా ఎలా దూసుకుపోయింది?

అంజయ్య, అందెశ్రీ నిస్వార్థంగా, నిజాయితీగా, నిండు హృదయాలతో, నిబద్ధతతో ఉన్నత ప్రమాణాలతో ఉద్యమ సాహిత్యాన్ని సృష్టించి తెలంగాణ నేలను పావనం చేశారు. వారి సాధారణ-సామాన్య జీవితం ఆదర్శమవుతుందా? లేక ఆర్భాటం చేస్తూ ఆటపాటలతో ఆకర్షించి మాయచేసి చెప్పేదానికి, మాయచేసి-చెప్పేదానికి, చేసే దానికి పొంతనలేని రీతిలో జీవితం గడిపిన గద్దర్‌ ఆదర్శప్రాయుడౌతాడా? ఎవరికి వారే ఆలోచించు కొని సమాధానం చెప్పుకోవాలి.

మతం మత్తుమందు అన్న మార్క్స్‌, మావోల మాటను భారతదేశంలో బలంగా ప్రచారం చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చి, హిందూ దేవుళ్లను దూషించి, సత్యసాయిబాబా లాంటి వారిని పరుషంగా విమర్శించిన గద్దర్‌ తన పార్టీ తనను బహిష్కరించాక ‘తత్త్వం’ బోధపడి రకరకాల గుళ్లు, గోపురాల చుట్టూ తిరిగాడు. ఇది భక్తి అనుకుందామా?…అవకాశవాదం అనుకుందామా?

ఈ అధ్యాయం తరువాతనే ఆయన తన రాజకీయ ‘సెకండ్‌ ఇన్నింగ్స్‌’ ను ప్రారంభించడం గమనార్హం. పైగా ఇదంతా ప్రజల అభీష్టం మేరకేనని పెద్ద బుకాయింపు. ఇలా అనేక ద్వంద్వ ప్రమాణాలను, దోషాలను తెలివిగా పాటల, చరణాల దరువుల మాటున దాచేశాడు. ప్రజాబాహుళ్య చైతన్యానికి విరుద్ధంగా తిరుగుబాటు, హక్కుల సాధన పోరాటం పేరిట కమ్యూనిజం మావోయిజం పల్లెపల్లెన పరిఢవిల్లాలని పాదాలకు గజ్జెకట్టి నర్తనమాడిన గద్దర్‌ గత చరిత్రను, హింసాత్మక భావజాలాన్ని అంతా ఎర్రతివాచీ కిందకు తోసేసి ప్రభుత్వం ఇప్పుడు ఆయనను ఆదర్శంగా చిత్రీకరించడం, అధికారికంగా జయంతిని నిర్వహిస్తా మనడం, చిత్రంగా-విచిత్రంగా ఉంది. విప్లవ కారులతో మిత్ర వైవిధ్యం కాదు, శత్రు వైవిధ్యం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ప్రజలచే ఎన్నికయిన రాజ్యం వేరు, విప్లవకారులు తిరుగుబాటు తత్త్వం వేరు. విప్లవకారులు ఎప్పుడూ ఎన్నికయిన ప్రభుత్వాలను సాయుధంగా కూల్చేందుకు కుట్ర చేస్తారన్న ఎరుక సైతం పాలకులకు ఉండాలి. అర్ధశతాబ్దానికి పైగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వేదికలపై గోచి, గొంగడి ధరించి ప్రజల నుంచి అపార సానుభూతి, ఆర్ధిక సాయం పొంది, తన శ్రావ్యమైన గొంతుతో పండిత- పామరులను ఆకర్షించి అందుకు కాంట్రాస్టు (పరస్పర విరుద్ధంగా) గా జీవితం కొనసాగించిన గద్దర్‌ ఆదర్శప్రాయుడెలా అవుతాడు?

మరోమాట, గద్దర్‌ రాజకీయ గురువు ప్రముఖ నక్సలైటు నాయకుడు కొండపల్లి సీతారామయ్య. (కొండపల్లి సీతారామిరెడ్డి-కె.ఎస్‌.) అన్న విషయం ప్రపంచమంతటికి తెలుసు. గద్దర్‌ ఆట- పాటలోని వాడి వేడి అంతా కె.ఎస్‌.దే. కొండపల్లి లేనిదే గద్దర్‌ లేడన్నదీ సత్యమే. కొండపల్లి సీతారామయ్య కృష్ణాజిల్లాకు చెందిన వాడయినప్పటికీ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సద్దుమణిగాక, 1971-72 లో తిరిగి ముల్కి-ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. గద్దర్‌ ప్రజా సాంస్కృతిక రాజకీయ జీవితం అక్కడే అప్పుడే ఆరంభమైంది. కె.ఎస్‌. కనుసన్నల్లోనే ఆయన రాజకీయ పాఠాలు వల్లెవేశాడు. పాటకు రాజకీయ పరిమళం అద్దాడు. తెలంగాణ ఉద్యమంతో పాటు నక్సలైటు ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య ‘జమిలి’గా నడిపాడు. ఆ రెండిరటిలోను గద్దర్‌ పాత్ర గణనీయమైనది. నక్సలైటు ఉద్యమం ఉధృతం కావడంతో తెలంగాణ గ్రామాలు, పల్లెలోని దొరలను పట్టణాలకు తరిమి వారి భూములను ప్రజలు స్వాధీనం చేసుకొనే కార్యక్రమానికి కొండపల్లి సీతారామయ్య ముఖ్య కారకుడు.

ఆ రకంగా తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యానికి కె.ఎస్‌. కేంద్రబిందువు. తెలంగాణ ప్రజల సాధికారతకు పాటుపడిన నాయకుడు ఆయన. మరణానంతరం కూడా ఆయన ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. అదో ఆ కొండపల్లి సీతారామయ్య జయంతి, వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న అభ్యర్ధన, డిమాండ్‌ అందితే ముఖ్యమంత్రి- రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా?….

ఎలాంటి విజ్ఞాపనలు, అభ్యర్ధనలు, డిమాండ్‌ లేకుండానే గద్దర్‌ జయంతిని వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించినప్పుడు గద్దర్‌ కన్నా గద్దర్‌ రాజకీయ గురువు కొండపల్లి అందుకు అర్హుడని అన్ని వివరాలు అందిస్తే, డాక్యుమెంట్లు చూపితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తుందా?… జయంతి, వర్ధంతులను నిర్వహిస్తుందా?…

కొసమెరుపు ఏమిటంటే… అరబిక్‌ భాష నుంచి ఉర్దూలోకి వచ్చిన గద్దర్‌ అన్న పదానికి నిఘంటువులో అర్ధం వెతికితే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ అర్థం స్ఫురించే వ్యక్తి ఆదర్శం ఎలా అవుతాడని అందరూ నిర్ఘాంతపోవడం ఖాయం.

– వుప్పల నరసింహం, 9985781799, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram