వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

కాలం మారిపోయింది. కాలానికి రూపమే లేదు – మరి మారి పోవటం ఏమిటి?!

కాలంతో కలిసి ప్రయాణించే మనుష్యుల మనస్తత్వాలలో మార్పు-అదే కాలంలో మార్పు!

మనిషి మనస్తత్వంలో మార్పు ఎందుకనో- చుట్టూఉన్న సౌకర్యాలూ, అవసరాలూ, ఒత్తిళ్లు, ఆకర్షణలూ..ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా చాలానే మన ఎదురుగా వచ్చి నిలబడతాయ్‌.

‌మనిషి మనసు మునుపటిలా లేదు. మారి పోయింది. స్వార్థపూరితం అయిపోయింది అనెయ్యటం మరొకటి – ఆ మారిపోయిన మనుష్యుల్లో తామూ ఒకరిమేనన్న విషయం మాత్రం మర్చిపోతారు!

తాను వేరన్నట్టు ఈ ప్రపంచానికంతకూ ప్రేక్షకుడిని అన్నట్టు మాట్లాడతాడు. అదే ఆ పరమాత్ముడికి దగరవ్వటానికి తన జీవితానికి తనే ప్రేక్షకుడిగా మారాలంటే మాత్రం కష్టం అంటాడు.

నేను కూడా బహుశః అంతే అయి• ఉండవచ్చు ననుకోండి.

ఇప్పటి మనిషి అవసరాలు పెరిగాయ్‌. అలా పెరగటంలో పక్క మనిషి ప్రభావం చాలా ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే మనిషి తన జీవితంలో సగభాగం పక్కవాడి మెప్పుపొందటానికే జీవిస్తాడన్నది సత్యం కనుక. మళ్లీ భగవంతుడి మెప్పును పొందటానికి అంతటి తహతహ ఉండదు. కోరికలు కోరుకోవటం తప్ప పరమాత్మని మెప్పించటానికి మరి నిస్వార్ధం, త్యాగం కావాలి! నిజానికి వాటి రుచిని మనస్సుతో తెలుసుకోగలిగితే ఇంక దానికి సాటి అయినది మరొకటి కనిపించదు మరి!

నిస్వార్ధం, త్యాగం కూడా ఎక్కడో అక్కడ నవ్వుల పువ్వుల్నీ, ఆశీర్వాదాల హరివిల్లునీ పూయిస్తూనే ఉంటాయో – అవి అదృశ్యంగా మనని ఆలకిస్తూనే ఉంటాయ్‌. ‌ప్రభాస్‌, ‌ప్రణితల గురించి నా ఆలోచనా స్రవంతి ఎక్కడెక్కడికో ప్రవహించింది.

వాళ్ల సమస్యకి ఎలాగయినా పరిష్కారాన్ని సూచించాలని నా మనస్సు కోరుకుంటోంది. పెద్దవాడిగా నిలబడి నాలుగు చివాట్లు వేసేస్తే పరిష్కారం అయ్యే సమస్యలు కావివి.

ముందున్న జీవితకాలమంతా సుఖంగానే ఉంటుందన్న భ్రాంతిలో తీసుకున్న నిర్ణయం మరి అది!

అందుకే జీవిత నగ్నసత్యాల్లోకీ, మనస్సు మూలాల్లోకీ వెళ్లి అక్కడ ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా వాళ్ల అరచేతుల్లో అవగాహనకి పెడితే నేరుగా వాళ్ళు అసలైన పరిష్కారం వైపు అడుగులు వెయ్యగల దారె దొరకదు.

ఈ రోజుల్లో పిల్లలకి ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. అన్నిటికీ తొందరపాటే అన్నమాట ఒక పదినెలర్లు అనుకుంటే అయిపోదు!

ప్రేమ విషయంలో మనస్సుకి అన్నది ఎప్పుడు లేకపోలేదని?! ఆవేశంతో కూడుకున్నది కనుకనే బహుశః అంత మధురంగా ఉంటుందేమో!

ముందు కాలానికీ, ఇప్పటి కాలానికీ ఒక్కటే భేదం- అప్పట్లో స్త్రీ పురుషుడిమీద ఆర్థికంగా ఆధారితగా ఉండేది. పురుషుడికీ స్త్రీ లేకపోతే జీవితం లేదన్నది పరమ సత్యమే అయినా-ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చెయ్యటానికి మరో స్త్రీ సిద్ధంగా ఉండటం అన్నది కూడా ఆ సమస్య మీద బలమైన ముద్రని వేస్తోందనిపిస్తుంది! అనిపించటం ఏమిటి అదే సత్యం కూడాను.

బాధ సాంద్రత, భరించేశక్తీ కూడా- ఆ తర్వాత దొరికే జీవితపు వెసులుబాటుని బట్టి కూడా ఉంటుందనిపిస్తుంది.

ఆ వెసులుబాటే ఇప్పటి స్త్రీకి కొద్దిగా చొరవ తీసుకునే అవకాశం ఇస్తోంది. ఇటువంటి అవకాశం కూడా స్త్రీ జీవితంలో వాంఛితమే!

ఈ రోజుల్లో మగవాడు కాస్త మునుపటి మగవాడికన్నా భిన్నంగా తనని తను తరచి చూసుకుంటున్నాడు. మునుపటి రోజుల్లో సంసారపు సింహాసనంలో కేవలం తనకి మాత్రమే చోటు అనుకునేవాడు. అది తప్పు అని ఇప్పుడు గ్రహించటానికి ప్రయత్ని స్తున్నాడు.

అప్పుడు, ఎప్పుడూ ఆ సింహాసనం ఇద్దరికీ సగ భాగమే.ఇప్పటి స్త్రీ అధికారికంగా పక్కకి జరుగు అని అనగలుగుతోందంటే! తెర వెనుక నుంచి తెరముందుకి వచ్చిందంతే!

అసలు సమస్య ప్రేమ అతిశయాలంకారం మీద ఆధారపడి ఉంటుంది! వైవాహిక జీవితం వాస్తవాలంకారం మీద ఆధారపడి వుంటుంది.

ఈ పాటికి మీకు సమస్య ఏమిటో అర్థం అయిపోయివుంటుందనుకుంటాను. ప్రభాస్‌, ‌ప్రణీతల మధ్య తగాదా ఇప్పుడు విడాకుల వరకూ వెళ్లింది.

ప్రణీత నా మనవరాలు- కూతురి కూతురు. నా కూతురు నా దగ్గరకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమించుకోవటం ఉత్సాహంతో పెట్టే పరుగు! ఆ తర్వాతి వైవాహిక జీవితం ఆయాసం రాకుండా వేసే సమతుల్యపు అడుగులు!

జీవితం అంతా పరుగుపెడుతూనే ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇద్దరూ ఆ పని చెయ్యటానికి అశక్తులే! కానీ ఆ అశక్తతను ఒకరికి ఒకరు నిశబ్దంగా ఆపాదించుకుంటారు.

అక్కడ మొదలవుతుంది గొడవ.

తనలాగే ఎదుటిమనిషీ అనుకుంటే- ఇలా ఎందుకూ అన్న ప్రశ్న మొదల వుతుంది. ఈ మాటలన్నీ వాళ్లిద్దరికీ చెప్పాను. ఇద్దరూ విన్నారు. వెంటనే అర్థం అయిపోతే ఇన్ని న్యాయస్థానాలూ, ఇన్నన్ని జంటలు విడిపోవటాలూ ఎందుకు ఉంటాయ్‌!

‌మొహాలు చేదుమాత్ర తిన్నట్టుగా పెట్టారు. ఇదిగో- ఇటువంటి సందర్భంలోనే వాళ్లకి నేనొకపని చెప్పాను. అదేమిటంటే- వాళ్లు ప్రేమించుకున్న నాటి సందర్భాల్ల్లోకే వీలయితే ఆ స్థలాల్లోకీ వెళ్లి వాటిని మరోసారి గుర్తు చేసుకుంటూ వాటిని మీ ఇదరులా కాకుండా మూడో వ్యక్తిగా పక్కన ఉండి చూడమన్నాను. ఇప్పుడు జరుగుతున్నది అదే!. నేను చెప్పటం ఎందుకు ప్రత్యక్షంగా చూద్దాం పదండి మరి!

                                                                                           *          *           *

చెరువుగట్టుమీద గాలి చల్లగా, మంద్రంగా హాయిగా వీస్తోంది. ప్రభాసూ ప్రణీతా ఆ గట్టుమీద ఆసీనులయివున్నారుగానే ఆ చల్లదనాన్ని ఆస్వాదించే స్థితిలో మాత్రం వాళ్లు లేరు. వాళ్ల మనసుల్లో చచ్చేంత ఉక్కపోతగా వుంది మరి!

ముందుగా తనే మౌనాన్ని ఛేదిస్తూ అంది ప్రణీత ‘‘ఏమిటాలోచిస్తున్నావ్‌?’’ ‘‘అసలు మా అమ్మకి నాకు ప్రభాసని పేరు పెట్టాలన్న ఆలోచన ముప్పయ్యేళ్ల క్రితమే ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను! ఇప్పుడు ఈ ఆరడుగుల ప్రభాస్‌ ‌వెలుగులోకి వచ్చి ఈ అయిదడుగుల ప్రభాస్‌ ‌జీవితాన్ని చిందరవందర చేసేస్తాడని అప్పుడు మా అమ్మ ఊహకి అందే వీలులేదు కదా! ప్చ్’’ ‌దిగుల్లో మునిగిపోతు న్నట్టుగా హీనస్వరంతో అన్నాడు ప్రభాస్‌.

ఆ ‌క్షణంలో ప్రేమ మైకంలో ఇక్కడే కూర్చుని తను ఒకప్పుడు చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయ్‌ ఇద్దరికీ.

‘‘నువ్వు ప్రభాసంత పొడవు లేకపోయినా ఫర్వాలేదు అసలు ఆ హీరో ప్రభాస్‌ అం‌త పొడవు ఉండటమే నాకు నచ్చదు తెలుసా!

పది రోజుల క్రితం ప్రణీత అన్నమాటలు ఇద్దరికీ జ్ఞాపకం వచ్చాయ్‌. ‌మళ్లీ

‘‘భూమికి జానెడు ఉన్నావ్‌ ‌ప్రభాసన్న పేరొకటి నీ మొహానికి!’’

ఇక్కడికి వచ్చేముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇద్దరూ ఓ పది నిమిషాలపాటు ప్రశాంతంగా ఆలోచించాలి. మనస్సుని మునుపటిలా రెచ్చిపోనివ్వకూడదు. రంకెలు వెయ్యనివ్వకూడదు.

గతంలో జరిగిన దృశ్యాన్ని మూడోవ్యక్తి స్థానంలో నిలబడి చూడాలి.

అందుకే మౌనంగా ఉన్నారిద్దరూ.

కాస్సేపటి తర్వాత ఎక్కడో అగాధాల్లోంచి ఒకమాట సన్నగా వినిపించటం మొదలు పెట్టింది ప్రణీతకి ‘‘ఇప్పుడు నిజంగా నీ ప్రభాస్‌ ఆరడుగుల వాడయితే నీకు నచ్చడు! ఈ రెండేళ్లు సాహచర్యంలో ఈ అయిదడుగుల ప్రభాసే నీ సొంతం! ఇతనే కావాలనిపిస్తుందే పిచ్చి మనసా కాస్సేపు ఆ క్షణాల్లోకి వెళ్లి జీవించు!’’

ప్రణీత కాస్సేపు అదేపని చేసింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన ప్రభాస్‌ ‌పొడవుగా ఉంటే తనకి నచ్చడుగాక నచ్చడు.

‘‘పద వెళ్దాం!’’ ప్రణీత గొంతు ముక్తసరిగా ఉన్నా కాస్త ప్రశాంతంగా ఉండటంతో ప్రభాస్‌ ‌పొడవు గొడవ తమ జీవితాల నుంచి నిష్క్రమించినట్టే అనుకున్నాడు నిశ్చింతగా.

‘ఇక రేపు తన పొగడ్తల చిట్టా ప్రారంభం అవుతుందేమో భగవంతుడా’ అనుకున్నాడు గాభరంగా మరుక్షణం.

మర్నాడు ఇద్దరూ ప్రేమించుకునేటప్పుడు కూర్చున్న పార్కుకు వెళ్లి అదే బెంచీమీద కూర్చున్నారు. మళ్లీ ఇద్దరికీ లోపల ఉక్కపోతే!

‘నువ్వు ఛీ అంటే నువ్వు ఛీ’ అని తిట్టుకున్న పాయింట్లన్నిటి మీదా ఈ రివర్స్ ‌పోగ్రామ్‌లో చర్చ జరగావి మరి!

ఇక్కడ కూర్చుని మొదటిసారిగా ప్రణీత పెదాల వైపు చూస్తూ అన్నమాటలు, ఆ తర్వాత అన్న మాటలూ గుర్తుకి వచ్చి గతుక్కుమన్నాడు. అప్రయత్నంగా తన పెదాలని తడుముకున్నాడు ప్రభాస్‌. ‌ప్రణీత గుర్రుగా చూడటం తెలుస్తోంది పక్కనుంచే.

ప్రణీత పెదాల గురించి జరిగిన వాగ్వాదం ఇద్దరి కళ్ల ముందూ మెదిలింది. ముందుగా ప్రణీతకీ ‘పైగా మొన్న ఏమన్నాడూ మొహాన్ని ములక్కాడలా చేసుకుని’’ అప్పుడు బుద్ధిలేక నీ పెదాలు చెర్రీ పళ్లలా ఉంటాయ్‌ ‌పణ్ణీ అన్నాను! ఇదిగో ఇప్పుడు చెబుతున్నాను విను నీ పెదాలు చిర్రీ పళ్లలా ఉంటాయ్‌ ‌కాదు ఉండేడుస్తాయ్‌!’’

‘‘‌చిర్రీ పళ్ళా?! అవ్వేమిటి?’’ తను గుర్రుగా అడిగింది అప్పుడు.

‘‘నేనే సృష్టించానులే పిచ్చిగా ఉండే పళ్లవి!’’ అన్నాడు కసిగా.

ఆ గతం గుర్తు కొస్తుం• …ప్రభాస్‌ ‌భయం భయంగా వాలుకళ్లతో చూశాడు. సరిగ్గా అప్పుడే ఇటువైపు చూసిన ప్రణీత మూతి మూడు వంకర్లు తిప్పి అటువైపు తిరిగిపోయింది.

కాస్సేపు ఆలోచనా ముద్రలో ఉండిపోయిన ప్రభాస్‌ ‌హఠాత్తుగా కెవ్వుమన్నట్టుగా అరిచాడు.

‘‘ఏవఁయింది?’’ చిరుగ్గా అడిగింది ప్రణీత.

‘‘నీ పెదాలని అచ్చంగా చెర్రీపళ్లలా ఊహించుకుంటే భయం వేసింది. నీ మూతి ఎర్రగా…’’

‘‘ఆపాపు! మరప్పుడు అలాగే కదా పొగిడావ్‌! ‌తర్వాత్తర్వాత మాత్రం చితీ, బుర్రీ అన్నావ్‌!’’

‘‘అబ్బే పెదాలు పెదాల్లాగే లేత చర్మం రంగులో ఉండాలి! అప్పుడలా ఎందుకున్నానో నాకర్థం కావటంలేదు ఆఁ! తాతయ్యగారు చెప్పారుగా ప్రేమించుకునేటప్పుడు అతిశయాలంకారం ఉంటుందని! ఏదీ ఇటు తిరుగు! హమ్మయ్యా ఇలాగే బావున్నావ్‌!’’

‌ప్రణీత గోముగా నవ్వింది…గీరగా చూసింది.

హఠాత్తుగా ఏదో గుర్తుకి వచ్చినదానిలా అడిగింది ‘‘అవునూ ఎవరయినా పెదాలని దొండపళ్లలా ఉన్నాయంటారుగానీ నువ్వు చెర్రీ పళ్లని ఎందుకన్నావ్‌?’’ ‘‘అప్పుడే అడక్కపోయావూ ఇప్పుడెందుకడుగుతున్నావ్‌?’’

‘‘అదీ ప్రేమ పిచ్చి! గందరగోళం కనుక!’’

‘‘నాకూ అంతేగా మరి! అప్పుడు మనం కబుర్లు చెప్పుకుంటుండే రోజూ చెర్రీ పళ్లు అమ్మే అబ్బాయి వచ్చేవాడు కదా! ఆ పళ్లు చూసి నువ్వు ‘ఈ పళ్ల రంగు ఎంత బాగుందో కదా అనేదానివి! అందుకే అలా చెబితే బావుంటుందని ఐడియా వచ్చేసింది. ఇప్పుడు చెర్రీలేదు, దొండాలేదు! నీ పెదాలరంగే అద్భుతం! ఇక ఈ పెదాలరంగు ప్రహసనం ముగిసిందిగా! తర్వాతి పోగ్రామ్‌ ఎవరిదీ నీదా నాదా?’’ అత్రంగా అడిగాడు ప్రభాస్‌.

‘‘ఇద్దరిదీను?’’ తల దించుకుని అంది ప్రణీత

‘‘ఇద్దరిదీనా? అయితే ఇంకనే ఈజీగా బాలన్సయిపోతుంది! ఇంతకీ ఏవిఁటది?’’

‘‘నిన్ను చూడకుండా క్షణమైనా ఉండలేను! అది నిజంకాదనీ ప్రతిక్షణం ఎదురూ బొదురూ కూర్చుంటే ఒకరంటే ఒకరికి విసుగువుడుతుందని రుజు వయిందిగా!

ఇంట్లో ఉన్నా ఏ గదిలోకోపోయి పుస్తకం చదువు కుంటూనో, ఫోన్‌ ‌చూసుకుంటుంనో కూర్చుంటావ్‌! ‌ప్రేమించుకునేటప్పుడు నిముషానికో ఫోన్‌ ‌చేసేవాడివి! పెళ్లయిన కొత్తలో నా కొంగు అదేలే నా చున్ని పట్టుకుని తిరిగేవాడివి! ఇప్పుడు కుదిపి కుదిపి పలకరిస్తేనేగానీ పలకటంలేదు!’’

‘‘నువ్వు మాత్రం ముందేమో నా మాటల్ని పంచదార గుళికలూ, సున్నుండ ముక్కలూ అనేదానివి! తర్వాత్తర్వాత అబ్బా ఊరుకోండీ మీసొల్లు వాగుడు వినలేక ఛస్తున్నాను అనే దశకి వచ్చావ్‌!’’

‘‘‌వినలేకపోతే విడాకులిచ్చేయ్‌ అని నువ్వేకదా ఇంకో పదడుగులు ముందుకి వేశావ్‌!’’

‘‘ఏదో ప్రాసకుదిరింది కదా అని అఘోరించాను! నువ్వేమో పుట్టింటికిపోయి నిజంగానే విడాకులకి నోటీసు పంపించావ్‌!’’

ఇద్దరూ కాస్సేపు ఎడమొహం, పెడమొహంగా కూర్చుండిపోయారు. కాస్సేపటి తర్వాత ప్రభాస్‌ అన్నాడు’’ నిజం చెప్పు నేను అలా తక్కువ మాట్లాడుతూ ఏదో ఒక ప్రక్కన కూర్చుంటేనే నీకు బావుందికదూ!’’

ప్రభాస్‌ అడిగిన ఆ తీరుకి ప్రణీత అవునని ఒకసారి, కాదని ఒకసారీ అడ్డదిడ్డంగా తల వూపింది.

‘‘నాకూ అంతేలే అది సహజం కనుక!’’

‘‘మరి ప్రేమించుకుంటున్నపుడు ఒక్క క్షణమయినా చూడకుండా ఉండలేననటం’’ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ అంది ప్రణీత

‘‘తాతయ్య గారు చెప్పారుగా వైవాహిక జీవితం వాస్తవాలంకారమని!’’

‘‘అన్ని తాతయ్యగారు చెప్పనవేనేమిటి? నువ్వేదయినా చెప్పు!’’

ఎలా చెప్పాలా అని మూతిమీద చూపుడు వేలుతో తట్టుకుంటూ చివరికి ఐడియా ఫ్లాష్‌లా వెలిగి మొహాన్ని కూడా వెలిగించుకుంటూ అన్నాడు ప్రభాస్‌ ‘‘ఇల్లు కట్టుకోవటానికి వేసే పునాది ఎలా ఉంటుందో తెలుసా! తెలిసేవుంటుంది లే! మన జీవన సౌధానికీ ఆ బరువైన, వెడల్పయిన ప్రేమ డైలాగులు అవసరం అన్నమాట! పునాదంత వెడల్పుగానూ, పైన కూడా కట్టుకుంటే మనం ఉండటానికి చోటు వుంటుందా? ప్రేమ కూడా అంతే! ఉక్కిరి బిక్కిరి అయిపోతాం! పాలెప్పుడూ పొంగుతూనే ఉంటే గిన్నెలో ఒక్క చుక్కయినా మిగులుతుందా?’’

‘‘ఏదో అర్థమయినట్టే ఉందిలే. ఇక ఆయసపడకు!’’ అప్పటికి విడాకులన్న ఆలోచనలోంచి ప్రణీత మనస్సు బయటికి వస్తోంది.

‘‘హమ్మయ్య!’’

‘‘ఇన్నీ తెలిసున్నవాడివి నాతో అలా రాక్షసుడిలా దెబ్బలాడి విడాకులదాకా ఎందుకు తీసుకొచ్చావ్‌ ‌మరి?’’

‘‘నేను రాక్షసుడ్నయానని గుర్తించకుండా నువ్వే రాక్షసివయ్యావనుకున్నాను!’’

          ఈసారి ప్రణీత ఉరిమినట్టు చూడలేదు. అందుకే ప్రభాస్‌ ‌వెంటనే అన్నాడు ‘‘ఇప్పుడు జ్ఞానోదయం అయిందిగా!’’ ఈసారి ప్రణీత మొహం వికసించింది.

‘‘ఇక తర్వాతదీ ఏవిఁటి నీ చేతివంట అమృతం అని పెళ్లయిన కొత్తల్లో అనటం ఇప్పుడేమో ఏం మాట్లాడకుండా తినెయ్యటం అప్పుడప్పుడు లోపాలు ఎంచటం. పైగా పక్కింటి వాళ్లు కూరేదయినా ఇస్తే ఎంత బావుందో అనటం. ఇది అంతే అతిశయాలం కారం ఇంటి పునాదిలాంటిదే!

అమృతాన్ని కూడా రోజూ సేవిస్తుంటే మామూలు మన కాఫీలాగే అయిపోతుంది!’’

‘‘పోనీ కనీసం పాయసంలా ఉంది అనొచ్చుగా!’’

‘‘కాఫీ రోజూ తాగకపోతే ఉండలేం! అందుకే కాఫీతో పోల్చాను నీ చేతివంటని!’’

ప్రణీత పెదవులమీదకి ముసిముసి నవ్వులు మధురంగా ముసురుకుంటూ వచ్చాయ్‌ అవి రెండుక్షణాలే మనగలిగాయ్‌.

‌మళ్లీ కస్సుమంది. కస్సుమనటంలో కాస్తంత నటనే ఉంది. ‘‘అప్పుడేమో నా నడక హంసనడక కన్నా బావుంటుందన్నావ్‌! ఇప్పుడేమో ఏవిఁటా హంసనడక అడుగులు తొందరగా వెయ్యి అని విసుక్కుంటావో! దీని సంగతి?’’ ఏవిఁటి అన్నట్టు కనుబొమలెగరేసింది.

ప్రభాస్‌ ‌రెండు క్షణాలు ఆలోచనలో పడ్డాడు. కొత్త ఉపమానం ఏమీ దొరకలేదు. అందుకే ఇందాక చెప్పిన ఉపమానమే! పాలు పొంగుతూనే ఉంటే ఆఖరికి అడుగంటిపోయి మాడిపోతాయ్‌! ఒక పొంగు వచ్చిం తర్వాత ఏం చేస్తే దాన్లోంచి పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇలా ఎన్ని వస్తాయో చూడు!’’

‘‘నువ్వే నా ప్రాణం.. నీ కోసం ప్రాణమయినా ఇచ్చేస్తానంటే నిజంగా నాకేదయినా అయితే నీ ప్రాణం ఇచ్చేస్తావా?’’ అడిగింది బేలగా మొహం పెట్టి ప్రణీత.

‘‘నువ్వూ అన్నావుగా బోలెడన్నిసార్లు ఆ మాట?’’

‘‘ముందు నువ్వు చెప్పు నేను తర్వాత చెబుతానులే!’’

‘‘ప్రాణం ఇచ్చెయ్యటమంటే నీకేదయినా అయితే నా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతానని! నేను చనిపోతే నువ్వు జీవచ్ఛవమైపోవటం!’’ అని అంటుంటే ప్రభాస్‌ ‌నోటికి చప్పున తన చేతిని అడ్డం పెట్టిందీ. ప్రేమను అతని భుజం మీద తలవొల్చుకుంది. ‘‘ఈ విషయాలన్నీ నీకెప్పుడు అర్థం అయ్యాయ్‌’’?

‘‘‌తాతగారు ఆలోచించమని చెప్పనప్పట్నుంచీ!’’

‘‘అవును మనని మూడోవ్యక్తిగా ప్రక్క నుంచి చూడమన్నప్పుడు నాకు మన పరస్పర ఆరోపణలు ఎంత అర్థం లేనివో, విలువైన జీవితం ముందు అవి ఎంత అప్రధానమైనవో అర్థం అయింది!’’

‘‘తాతయ్యగారి దగ్గరికి మన సమస్యని తీసుకువెళ్లి ఉండకపోతే ఈ పాటికి మనం విడిపోయి ఉండేవాళ్లమేమో!’’ ప్రభాస్‌ ‌విచారంగా అన్నాడు. అతని చేతులు ప్రణీత చుట్టూ ప్రేమగా బిగుసుకున్నాయ్‌.

‌మూడు పువ్వులూ, ఆరుకాయలూ అన్నట్టుగా సాగిపోతోంది ప్రభాస్‌, ‌ప్రణీతల సంసారం.

తీరిగ్గా కూర్చున్న ప్రభాస్‌ అన్నాడొకరోజు ‘‘నిన్ను చూడకుండా ఒక్క క్షణమయినా ఉండలేను అనడం ఒక రకంగా నిజమే పణ్ణీ! ప్రేమించుకునేటప్పుడు నువ్వూ, నేనూ ఇంకా వేరువేరు కనుక అలాగే చెప్పుకోవాలి!

ఇప్పుడు జీవితంలో ఒకరికి ఒకరం ప్రతిక్షణం ఫిక్సయిపోయాం కనుక కాస్సేపు కనిపించకపోయినా, దూరంగా ఉన్నా దగ్గరగా వున్నా ఫీలింగే ఉ•ంటుంది. నువ్వు నా అర్థాంగివి కదా! అదన్నమాట ఈ పెళ్లి మేజిక్కు!’’

‘‘మీరింకా అదే చెప్పటానికి ప్రయత్నిస్తున్నారా?పెళ్లిలోని సహజత్వాన్ని నేనిప్పుడు బాగానే అర్థం చేసేసుకున్నాను!’’ ఓ విధమైన నిర్భయత్వంతో, ధీమీతో అంది ప్రణీత.

‘‘ప్రేమావేశంలో అతిశయాలంకారం, పెళ్లి జీవితంలో వాస్తవాలంకారం! మన సయోధ్య ఈ సృష్టికి అలంకారం!’’ హాయిగా నవ్వేశాడు ప్రభాస్‌!

                                                                                            *         *           *

చూశారుగా వాళ్ళిద్దరిమధ్యనా జరిగిన కథ!

అదండీ సంగతి. ఇలాంటి పిల్లలెవరయినా ఎదురయితే మీరూ యిలా చెప్పి చూడండి!

వచ్చేవారం కథ..

ద్యోతకం – డా. నెల్లుట్ల నవీన్‌చంద్ర

About Author

By editor

Twitter
Instagram