‘‌దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా సాధన చేస్తున్నాను. రచనా వ్యాసంగం ఒక పెద్ద సవాలు.నృత్యం ప్రదర్శక కళ, సాహిత్యం అంతర్గత కళ’-ఈ వాక్యాలు డాక్టర్‌ ‌మద్దాళి ఉషా గాయత్రివి.

ఈ పేరు వినగానే, వెంటనే మనకు గుర్తొచ్చేది ‘కిన్నెర.’

ఉష అంటే ప్రభాత సంబంధితం. గాయత్రి అనేది మంత్ర విలక్షణం. కిన్నెర… వీణా విశేషం. ఒకటి ప్రకృతికి, మరొకటి ఆధ్యాత్మికతకి, వేరొకటి మృదు మధురత్వానికి ప్రతీకలు. వీటన్నింటినీ కలగలిపిన నిత్య నిరంతర సాధన తత్వమే ఉషాగాయత్రిని కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి చేర్చింది. దేశ రాజధాని నగరంలోని విజ్ఞాన్‌ ‌భవనంలో ఆమెకి నగదుతోపాటు తామ్రపత్రం, నూతనవస్త్రంతో  ప్రత్యేక పురస్కృతిగా లభించింది. అవార్డు ప్రదాత-  రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కళలే సమాజ జాగృతికి కారకాలని అభివర్ణించారు.  ఆ అనుభూతే తన మదిని ఆనంద తరంగితం చేస్తోందని ప్రతిస్పందించారు ఉషాగాయత్రి.

ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలన్న ఉత్సుకత.సాహిత్యాన్నీ జీవత  సర్వస్వం చేసుకోవాలన్న గట్టి పట్టుదల. నర్తన, సారసత్వాలతో కళాభ్యుదయం సాధించాలన్న ఏకైక దీక.ఇవన్నీ నిండినందుకే ‘ఉషా గాయత్రీ కిన్నెర’ అయ్యారామె!

ఎంతటి సవాలునైనా స్వీకరించి అధిగమించడం ఉషాగాయత్రికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. నృత్యం, సంగీతం సాహిత్యం -ఈ మూడు తొలి నుంచీ తన పంచ ప్రాణాలు. కళారాధనే తనకు అన్నింటి కన్నా మిన్న. ఇందుకే మానసిక ఒత్తిడినైనా, శారీరక అలసటనైనా అధిగమిస్తున్నానంటున్నారు.

వచ్చే ఏప్రిల్‌లోనే తన పుట్టినరోజు. ఆ సందర్భంలో ఏటా ఒక సరికొత్త నిర్ణయం తీసుకోవడం తనదైన అలవాటు.

స్వస్థలం కర్నూలు ప్రాంతం. నాలుగేళ్ల ప్రాయం  నుంచే అభ్యాసం. కూచిపూడి, కథక్‌, ఒడిస్సీ, మరెన్నో పక్రియలు. వీటికితోడు యక్షగానాలు, పదములు, మృదంగ స్వరాలు, ఇంకా ఎన్నింటినో కాలక్రమంలో అభ్యసించి నిపుణత సంపాదించారు.

ఉన్నత విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లో సాగింది. కేంద్రీయ విశ్వ విద్యాలయంలో అపార ప్రతిభా సంపత్తి కనబరచారు. ‘సాహిత్యంలో సత్యభామ’అ అనే అంశంపై పరిశోధించి  తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు.

సత్యభామ!..స్త్రీ శక్తిని చాటిన ధీశాలి. కావ్య నాయిక. స్వాభిమానం, సౌకుమార్యం, సౌందర్య శోభితం, కళానైపుణ్యం, సంభాషణా చాతుర్యం, అలంకార ప్రియత్వం, పట్టిన పట్టును  వీడని స్వభావం.

‘పారిజాత అపహరణం’లో గుర్తొస్తోందా ఈ పద్యం?

‘ఆనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నేయినోయ భ

గ్గన దరిగొన్న భీషణ హుతాశనకీల యనంగ లేచి హె

చ్చిన కనుదోయి కెంపు దన చెక్కుల గుంగుమ పత్ర భంగ సం

జనిత నవీనకాంతి వెదజల్లగ గద్గద ఖన్నకంఠియై!’…ఇంతటి భావ ప్రకటన ఎంతటి అద్భుతమో కదా…

ఆ పాత్రకు సంబంధించిన వృద్ధి, వికాసం; నర్తనపరంగా అవతరణం- ఇలా అన్నింటినీ పరిశోధించి గ్రంథ సమర్పణ చేశారు ఉషా గాయత్రి.

అటు తర్వాత ఉద్యోగ జీవితం. కళాభ్యున్నతికే అంకితం కావాలనుకుని, తన పూర్తి సమయమంతటినీ నృత్య శిక్షణ, ప్రదర్శనలకే  కేటాయించారు. ఈ కళాసేవ నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తోంది.

భాగ్యనగరంతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాజధానీ నగరాల్లో; దేశ రాజధానిలోనూ అసంఖ్యాక ప్రదర్శనలు. అకాడమీకి తోడు అనేకానేక ప్రతిష్ఠాత్మక సంస్థల నిర్వహణలో నర్తనాభివాదాలు సమర్పించారు. విఖ్యాత నాట్యకారిణిగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు  ఇతర ప్రాంతాలూ, విదేశాల్లోనూ కళా విస్తృతి చేపట్టి కృతకృత్యులయ్యారు.

సాహితీ సాంస్కృతిక సంస్థ కిన్నెర అధిపతి రఘురామ్‌తో పరిణయం ఆమె నృత్య జీవితాన్ని మరెంతో మేలిమి మలుపు తిప్పింది. ఎంతమందికి శిక్షణ ఇచ్చారో, ఎన్నెన్ని ప్రదర్శనలిచ్చారో, ఎందరెందరికి ప్రోత్సాహం కలిగించారో లెక్కకి అందవు. కూచిపూడిలో మాస్టర్‌ ‌డిగ్రీతో అత్యంత ప్రతిభ చూపినా, పలు రూపకాలను రూపొందించి సమర్పించినా, వినూత్న ప్రయోగాలు చేసినా – అన్నీ కళాభారతికి నీరాజనాలేనని వినమ్రత వ్యక్తపరిచారామె.

దాదాపు పాతికేళ్ల క్రితం భారత స్వాతంత్య్ర దినోత్సవాన మారిషస్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఆ దేశ పాలనాధిపతి చేతులమీదుగా విశిష్ట సత్కారం అందుకున్నారు. ఇంకా పలు దేశాల్లో రోజుల తరబడి పర్యటించి, భారతీయతా విలువలను చాటి చెప్పారు. ప్రవాస భారతీయులు నిర్వహించిన అనేకానేక సదస్సులను తన కళతో సుసంపన్నం చేశారు.

‘వందేమాతరం’ అని ఎలుగెత్తినా

‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ అర్చించినా

స్వాతంత్య్ర భారతిని నృత్యకళతో సంభావించినా

స్వర్ణోత్సవ హారతిని నిండు మనసుతో సమర్పించినా

‘మాతృదేవోభవ’ అని ఎంతగానో కీర్తించినా…

ప్రేక్షక శ్రేణిలో తన్మయత వెల్లివిరిసింది. నృత్య ప్రాంతమంతా శోభించింది.

జాతీయతతోపాటు పురాణ కథనాలకీ మేటి నర్తనం.

యశోదకృష్ణలో తల్లీ తనయుల ప్రగాఢబంధం

శివభక్త మార్కండేయలో దైవ, భక్త అనుబంధం

అలమేలు మంగ చరిత్రలో భక్తి ప్రేమ చరిత్రలో భక్తి ప్రేమ తత్వచింతనం

రుక్మిణీ సత్యలో కృష్ణస్వామి పట్ల అనురక్తి పరికల్పనం

గోదాకల్యాణంలో భక్తురాలి, భగవంతుడి హృదయ వర్తనం

ఇలా వైకుంఠం ద్వారా దర్శన భాగ్య సేవనం

కుంతీ విలాపంలో మాతృమూర్తి నిర్వేదం

ఇంకెన్నెన్నో భావవాహినులతో వేదికలన్నింటినీ తీర్చిదిద్దారు ఆ నర్తకీమణి. ఒకే పక్రియలో అసంఖ్యాక అంశాలనీ జోడించారు. ఆ దీక్షా దక్షతలు ‘నృత్యం దర్శయామి’తో ప్రస్ఫుటమయ్యాయి.

‘నృత్య కిన్నెర’ పేరిట సంస్థ స్థాపనతో ప్రత్యేకించి కూచిపూడికి మరెంతో విశిష్టతను సంతరింపచేశారీమె. బాలలు, యువతీ యువకులు, ఉద్యోగినులు, గృహిణులు, విభిన్నరంగాలవారికీ నాట్యంమీద అనురక్తిని పెంచి పరిపోషించారు.

సింగపూర్‌, ‌కౌలాలంపూర్‌, శ్రీ‌లంక. బ్యాంకాక్‌, ‌యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌, ‌మరెన్నో ప్రాంతాలకు వెళ్లివచ్చిన ఆమె ప్రతి  వేదిక మీద  భారతీయ తాత్వికతకు పట్టం కట్టారు. పలు విశ్వవిద్యాలయాల నృత్య విభాగాలను సందర్శించి ప్రసంగాలు చేశారు. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య ఉత్సవ వేళ ‘ఎంతో ముగ్ధురాలినయ్యాను’ అంటూ భావోద్విగ్నత ప్రకటించారు. ఎన్నటికీ మరువలేని సందర్భం అది.

వందల కొద్దీ రూపకాలకు నృత్య దర్శకత్వం

చారిత్రక, సామాజిక అంశాలకు ప్రాధాన్యమివ్వడం

నృత్య, సాహిత్య, సంగీత పక్రియలను మేళవించడం

వీటివల్లనే పురస్మృతులెన్నో జాతీయ, ప్రపంచ స్థాయుల్లో ఉషా గాయత్రినే ఏరికోరి మరీ వరించి వచ్చాయి.

విఖ్యాత ‘హంస’ పురస్కృతి

ప్రతిభావమూర్తిగా పురస్కారం

నృత్యరత్నగా బిరుదు స్వీకరణం

అత్యుత్తమ నర్తకీమణిగా అవార్డులు అందుకోవడం

నర్తన గురువుగానూ అంతటా పేరొందడం

ఆమ్రపాలి, గీతాంజలి రూపకాలకు ఎన్నో ప్రశంసలు రావడం

తన జీవితంలో అనేక మెరుపులు. ఎన్ని సంపాదించినా, నిగర్వ స్వభావం.

ఎప్పుడు ఎవరితో మాట్లాడినా…

జావళి, పదం, తరంగం

అష్టపది, దరువు, తిల్లాన

వినవచ్చే మాటలివే. నృత్యమే జీవితమైన సార్థక నామధేయ.

‘షోడశకృష్ణం’లో అన్నీ కృష్ణ సాహసకృత్యాలే!

అన్నమార్యుని వంటి వాగ్గేయ కారుల రచనల నుంచి స్వరపరిచారన్నీ, నారాయణతీర్థ, నంది తిమ్మన రచనలనూ సమగ్ర అధ్యయనం చేశారు.

సత్యభామను ఆరాధించి, కూచిపూడిని ప్రేమించే ఉషాగాయత్రిది సహజకళ. కాలచక్ర పరిభ్రమణంలో వయసుకు దీటైన పాత్ర పోషణలతో ఆబాల గోపాలాన్ని  మెప్పించారు ఈ నృత్యరత్న. శ్రీ వేంకటేశుడు, గణనాథుడు, శ్రీకృష్ణుడు, ప్రహ్లాదుడు, లవుడు, కుశుడు.. వీరి మాతృమూర్తి పాత్రల పరిపోషణతో చరిత్ర సృజించారీ కళారమణి.

మునుపు విస్తృత రీతిన ‘కలాపం’ పేరుతో సమాలోచన సదస్సు నిర్వహించారు. మూడు ప్రాంతీయ శైలుల అభివ్యక్తీకరణ, విశదీకరణలకు వేదిక రూపం కలిగించి, సృజనశక్తిని నిరూపించారీమె. నిర్వహణ ప్రతిభకు చారిత్రక నిదర్శనం అదే.

 వచ్చేనెలలో పుట్టినరోజు ఉత్సవం ఉన్న ఈ నృత్య కిన్నెర ఇక ముందూ మరెన్నో పండుగలతో కళామతల్లికి హారతులర్పించాలి.

ఇంకొంత విభిన్నత ఏమిటంటే – రచయిత్రిగా ఉషాగాయత్రి ప్రస్థానం. వీటిలో ‘అమ్మమ్మగారి కాశీయాత్ర’ విలక్షణ రచనాశైలిని సూచిస్తుంది. ‘మౌనమే సాక్షిగా…’ అనేది నిశిత పరిశీలనకు అక్షరరూపమిస్తుంది.

తన కథలు, కథానికలు కుటుంబ వ్యవస్థకు నిలువుటద్దం పడతాయి.

మాటల్లో సున్నితత్వం కళాసంబంధ ఆత్మీయతను ప్రతిఫలిస్తుంది.ఇదివరకు ఓ ముఖాముఖిలో భావాల్ని వ్యక్తీకరిస్తూ…‘నాకు వృత్తి గత సంతృప్తిలేనిదే ఏ పక్రియనూ చేపట్టను, నా నృత్య శిష్యులకు సంబంధించీ, ఇదే విధానంతో ఉంటాను. ఒకదాని వెనుక మరో లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు కొనసాగాలన్నదే నా జీవితాశయం. నా దగ్గర విద్యను నేర్చుకునేవారికీ ఇదే చెప్తుంటాను. ఏ కళైనా మనకు ప్రాప్తించాలి. దీన్ని గుర్తించాల్సింది మనమే. గుర్తించి, ఆచరించి, గౌరవించి, కొనసాగిస్తేనే పురోగమనం. కళల్ని మనం ఉద్ధరించడంలేదు. అవే మనల్ని సముద్ధరిస్తున్నాయి. ఇంటా బయటా మనకో విశేష ప్రాముఖ్యత తెస్తున్నాయి.’

– ఈ మాటలు చాలవా ఉషాగాయత్రి ‘నర్తనాభినేత్రి’ అని ప్రకటించడానికి!

– జంధ్యాల శరత్‌బాబు    

About Author

By editor

Twitter
YOUTUBE