1977‌లో కర్పూరి ఠాకూర్‌ ‌బీహార్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, లోక్‌నాయక్‌ ‌జేపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్నాలో జనతా పార్టీ నేతలు సమావేశమయ్యారు. లోక్‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అనేకమంది ప్రముఖులతో కలసి ముఖ్యమంత్రి హోదాలో కర్పూరి ఠాకూర్‌ ‌కూడా వెళ్లారు. ఆయన కుర్తా చిరిగి ఉంది. ఇది చూసి చంద్రశేఖర్‌ (‌జనతా పార్టీ అధ్యక్షుడు, తరువాత ప్రధాని) తనదైన శైలిలో కర్పూరి ఠాకూర్‌ ‌కొత్త కుర్తా కొనుక్కోవడానికి కొంత డబ్బు విరాళంగా ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆ డబ్బు కర్పూరి ఠాకూర్‌ ‌స్వీకరించారు కూడా. కానీ క్షణం ఆలోచించకుండా, ఆ మొత్తాన్నిముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. కర్పూరి ఠాకూర్‌ ‌వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పే ఒక ఉదాహరణ మాత్రమే ఇది.

కర్పూరి ఠాకూర్‌… ఈ ‌పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది, అయన నిరాడంబరత. సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం, చేసిన తపస్సు.
వందేళ్ల నాడు జనవరి 24,1924న బిహార్‌లోని సమస్తిపూర్‌లో, నిరు పేద వెనుకబడిన వర్గాల వారి కుటుంబంలో జన్మించిన, కర్పూరి ఠాకూర్‌, ‌ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. సామాజిక న్యాయం లక్ష్యంగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించారు. స్వల్ప కాలమే అయినా రెండుసార్లు, (1970 డిసెంబర్‌ ‌నుంచి 1971 జూన్‌ ‌వరకు మొదటిసారి, 1977 జూన్‌ ‌నుంచి 1979ఏప్రిల్‌ ‌వరకు రెండవసారి) ముఖ్యమంత్రిగా సేవలందించారు. అంతకు ముందు, తొలిసారిగా 1952 సోషలిస్ట్ ‌పార్టీ సభ్యునిగా అసెంబ్లీ అడుగు పెట్టిన నాటి, నుంచి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఇంకా అనేక హోదాల్లో వివిధ పదవుల్లో సేవలందించారు. నిజమైన ప్రజా ప్రతినిధికి నిలువెత్తు నిదర్శనంగా కర్పూరీ ఠాకూర్‌ ‌నిలిచారు.
కర్పూరి ఠాకూర్‌, ‌పేరుకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా, అధికారంలో ఉన్నది కొద్ది కాలమే అయినా,ఆ కొద్ది కాలంలోనే సామాజిక న్యాయం లక్ష్యంగా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సామాజిక న్యాయం అనగానే ఆయన రూపమే గుర్తుకు వచ్చేలా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కర్పూరి ఠాకూర్‌ ఈ ‌నాటికీ, బిహార్‌ ‌ప్రజల గుండెల్లో ముఖ్యంగా బడుగులు, నిరుపేదల గుండెల్లో, జననాయక్‌’‌గా పదిలంగా ఉన్నారు.
ఒక్కరే కాదు …
ఒక్క కర్పూరి ఠాకూర్‌ అనే కాదు, అలాంటి మహనీయులు, మహా పురుషులు ఎందరో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ, భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను కుటుంబ చట్రంలోకి కుదించి వేసింది. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో భాగస్వాములైన మహనీయులు ఎందరినో మరుగు పరిచింది. అంతే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబం పాలనలో సాగిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు, కాంగ్రెస్‌ ‌సారధ్య సంకీర్ణ ప్రభుత్వాలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న, ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు సహా జాతీయ నాయకులను, మరీ ముఖ్యంగా నిమ్నవర్గాలకు చెందిన నాయకులను గుర్తించలేదు. గౌరవించలేదు. ఇంకా చెప్పాలంటే చిన్నచూపు చూసింది. ఈ రోజుకూ కాంగ్రెస్‌ ‌పార్టీది అదే వైఖరి. నిమ్నవర్గాలను ఓటు బ్యాంకుగా చూస్తుందే, కానీ, మనుషులుగా చూడడం మరిచిపోయింది.
ముఖ్యంగా నిమ్నవర్గాలకు, బడుగుజీవులకు అన్నింటా జరిగిన అన్యాయమే పురస్కారాల విషయంలోనూ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అం‌బేద్కర్‌ను సైతం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు అవమానించాయి. నెహ్రూ, ఇందిర తమకు తామే భారతరత్న పురస్కారం ఇచ్చుకున్నారే కానీ, అన్ని విధాల అర్హుడైనా అంబేడ్కర్‌ను భారతరత్నతో గౌరవించాలన్న ఆలోచన చేయలేదు. చివరకు 1990లో విశ్వనాథ ప్రతాప సింగ్‌ ‌ప్రభుత్వం మరణానంతరం ‘భారతరత్న’తో సత్కరించింది. జాతీయ పురస్కారాల విషయంలో రాజకీయ తూకాలు, కొలతలు ఘనంగా పనిచేస్తూ వచ్చాయి. అందుకే అనంతర కాలంలో అవార్డు వాపసీ మేధావులు పుట్టుకొచ్చారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రాతిపదికన పురస్కారాలను తొడిగే సంస్కృతికి చుక్క పెట్టారు. అసామాన్యులుగా ఎదిగిన సామాన్యులను గుర్తించి గౌరవించే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. సమాజంలో మార్పు కోసం క్షేత్ర స్థాయిలో కృషి• చేసిన సామాన్యులను జాతీయ పురస్కారాలతో సత్కరించారు. తాజాగా ప్రస్తుత సంవత్సరానికి పద్మ పురస్కారాల ప్రకటన నేపధ్యంగా, ఇదే విషయాన్ని ప్రధాని ఆకాశవాణి మన్‌ ‌కీ బాత్‌లో మరో మారు ప్రస్తావించారు.
జననేతకు భారతరత్న
ఆ క్రమంలోనే స్వయంగా అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, జననేత కర్పూరి ఠాకూర్‌ ‌సేవలను గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం, ‘భారతరత్న’ ప్రకటించింది.
మట్టిలో మాణిక్యంలా ఎదిగొచ్చిన బడుగుజీవి కర్పూరీ ఠాకూర్‌ ఈరోజుకూ చీకటిబతుకులకు వెలుగురేఖగా నిలిచారు. ప్రధానమంత్రి అన్నట్లుగా, దివంగత కర్పూరి ఠాకూర్‌ ‌సమాజానికి చేసిన సేవలు మరువలేనివి, మరపురానివి. జననాయక్‌ ‌కర్పూరి ఠాకూర్‌ ‌వ్యక్తిత్వ విశేషాలను,ఆయన వదిలి వెళ్లిన విలువలను గుర్తు చేసుకుంటే, ఇప్పడు కాదు, ఎప్పుడోనే, ఆయనకు ఆ గౌరవం దక్కవలసింది. నిజానికి, కర్పూరి ఠాకూర్‌ ఈ ‌తరానికే కాదు, భవిష్యత్‌ ‌తరాలకు సైతం ఆదర్శపురుషునిగా నిలుస్తారు. నమ్మిన విలువలకు ప్రాణ పోసిన పుణ్య మూర్తి కర్పూరి ఠాకూర్‌, అం‌దుకే, ఒక్క బిహార్‌ అనే కాదు, దేశంలో ఎక్కడైనా సామాజిక న్యాయం అనగానే, కర్పూరి ఠాకూర్‌ ‌స్ఫురణకొస్తారు. అంతటిమహనీయునికి మరణానంతరం అయినా భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం, ‘భారతరత్న’తో సత్కరించుకోవడం, మన అదృష్టం. ఒక విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిమ్న జాతులకు ఇచ్చిన మరో కానుక. మరో భరోసా.
ఆదర్శపురుషుడు
ఆదర్శాలు అందరికీ ఉంటాయి, కానీ, వాటి ఆచరణ రూపం ఇచ్చే మహనీయులు కొందరే ఉంటారు. కర్పూరి ఠాకూర్‌ ఆ ‌రెండవ కోవకు చెందిన మహనీయుల జాబితాలో ముందు వరసలో ఉంటారు. ఏ నాడు స్వలాభం చూసుకోలేదు. అలాగే, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఏ నాడు నమ్మిన సిద్దాంతాలను, ఆదర్శాలను వదులుకోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నా, కుమార్తె వివాహం కోసం సొంత సొమ్ములు ఖర్చుచేశారే, తప్ప సర్కార్‌ ‌సొమ్ము ముట్టలేదు. చివరకు సొంత ఆస్తి అనేది చిల్లి గవ్వ అయినా లేకుండానే తనువు చాలించారు. ఆయన కన్ను మూసిన సమయంలో ఆయన నివాసానికి చేరుకున్న అనేక మంది ప్రముఖులు, ఆ ఇంటిని, ఇంటి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారంటే, ఆయన చివరిక్షణం వరకు ఎంత నిజాయతీగా నిరాడంబరంగా జీవించారో వేరే చెప్పనక్కరలేదు. జననాయక్‌ ‌కర్పూరి ఠాకూర్‌ ఆస్తులు సంపాదించుకోలేదు. కానీ, కోట్లాదిమంది పేద, బడుగుజనుల జీవితాల్లో కర్పూరకాంతులు వెలిగించారు. అందుకే ఆయన కర్పూర క్రాంతి హారతులు అందుకుంటున్నారు.
ప్రధాని మాటల్లో
కర్పూరీ ఠాకూర్‌’‌కు భారతరత్న ప్రకటించిన సమయంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ‘‘నిరాడంబరంగా జీవించిన జన్‌నాయక్‌ ‌కర్పూరి ఠాకూర్‌ ‌సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఆ పోరాటమే ఆయన జీవితం. తన చివరిశ్వాస వరకు నిరాడంబరమైన జీవనశైలి అనుసరించిన కరూరి ఠాకూర్‌ ‌సామాన్య ప్రజలతో మమేకమై సామాజిక న్యాయం కోసం కృషి చేశారు’’ చేసిన వ్యాఖ్య స్వర్గీయనేత గొప్పతనాన్ని కళ్లకు కట్టింది. స్వర్గీయ కర్పూరి ఠాకూర్‌ ‌నిరాడంబరత చాటిచెప్పే ఉదంతాలను కూడా మోదీ గుర్తుచేసుకున్నారు.
అడుగు జాడల్లో
నరేంద్ర మోదీ జన్‌నాయక్‌ ‌కర్పూరి ఠాకూర్‌ ‌భావాలు, విధానాలను ఆదర్శంగా తీసుకున్నారు. ఆ విషయం ఆయనే చెప్పారు. ‘‘గత పదేళ్లుగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక సాధికారత సాధించడం లక్ష్యంగా మా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూ, ప్రజా సంక్షేమ విధానాలు అనుసరిస్తోంది’’ ఆని పేర్కొన్నారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి గత ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకే, పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు. కర్పూరి ఠాకూర్‌కు ఇంతకు మించి ఇవ్వగల నివాళి మరొకటి ఉండదు. సామాజిక న్యాయం సాధన కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి అన్న దృఢ సంకల్పంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకే, ప్రభుత్వ విధానాలు, సాధించిన విజయాలు చూసి జన్‌ ‌నాయక్‌ ‌కర్పూరీ ఠాకూర్‌ ఎం‌తో గర్వపడేవారని నేను నమ్మకంగా, గర్వంగా చెప్పగలను, అన్నారు ప్రధాని. మోదీ ప్రభుత్వం సామాజిక న్యాయ సంకల్పంతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో కర్పూరి ఠాకూర్‌’‌కు భారతరత్న ప్రకటించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. బడుగుజీవుల జననేతకు కర్పూర హారతి.

-రాజనాల బాలకృష్ణ
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE