చారిత్రక ఘటనను గుర్తించడం దగ్గరే చరిత్ర కలిగిన ఒక పత్రిక ఔన్నత్యం వెల్లడవుతుంది. ఒక పరిణామానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించడమే పత్రికల బాధ్యత. బెంగాల్‌ ‌కేంద్రంగా వెలువడే ది స్టేట్స్‌మన్‌ ఆ ‌పని చేసింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పత్రిక అయోధ్యలో జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ ప్రాధాన్యాన్ని విశిష్టమైన రీతిలో నమోదు చేసింది.

నరేంద్ర లేదా నరేంద్రనాథ్‌ ‌దత్‌, ఇది స్వామి వివేకానందులు సన్యాస దీక్ష తీసుకోవడానికి ముందు పేరు. వివేకానంద పేరుతోనే ఆయన విశ్వ వ్యాప్తమయ్యారు. షికాగోలో (అమెరికా) జరిగిన ప్రపంచ సర్వమత సభలో ఆయన ప్రసంగించి, హిందూత్వం గురించి ప్రపంచానికి సరైన కోణంతో పరిచయం చేశారు. హిందూత్వం మత సహనానికి పెట్టింది పేరనీ, ఫాసిజానికీ  తీవ్ర వ్యతిరేకి అని ఆయన అక్కడ చాటి చెప్పారు. సర్వమతాలకు తల్లి వంటిదని కూడా ప్రకటించారు. రుషులు స్థాపించిన ఈ మతానికి ప్రపంచ నాగరికతలన్నింటిలోను అనుచరులు ఉన్నారని కూడా తెలియచేశారు. అన్ని మతాల ఉనికిని గౌరవిస్తూ, విశ్వ మానవాళి మధ్య సామరస్యాన్ని హిందూత్వం ప్రతిపాదిస్తుందని ప్రపంచ ప్రజలకు తెలిపారాయన.

ఇవాళ (జనవరి 22) భారత ప్రధాని నరేంద్ర చేసింది కూడా అదేనని పేర్కొన్నది ఆ వ్యాసం. రామరాజ్య సూత్రాల ద్వారా భారత జాతీయత అంటే ఏమిటో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారని వ్యాసకర్త జేపీ గుప్తా వ్యాఖ్యానించారు. రాముడు అంటే కరుణగల, పురోగామి శక్తి. అలాగే ప్రజలను ఏకం చేసేవాడు అని మోదీ చెప్పారు. భారత్‌కు ఉన్న 7000-8000 ఏళ్ల నాగరికతకు వారసత్వం రాముడని చెబుతూ ఆలయంలో బాల రాముడి ప్రతిమకు ప్రధాని ప్రాణప్రతిష్ఠ చేశారని వ్యాసకర్త వ్యాఖ్యానించారు. రాముడు ప్రతి భారతీయునిలోను వసుధైవ కుటుంబకం అన్న విలువను కల్పించాడని ప్రధాని అన్నారు. ఒక సాధారణ భారతీయుని ఇంటిలోనే కాదు, విశ్వవ్యాప్తంగా వాషింగ్టన్‌ ‌నుంచి న్యూయార్క్ ‌వరకు ప్యారిస్‌, ‌లండన్‌, ఉగాండా, సిడ్నీలలో రామనామం మారుమోగింది. దాదాపు భారతీయులంతా ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి జేజేలు పలుకుతున్నారు. అయోధ్యలో ఆధునిక కాలపు వాటికన్‌ ‌నగరాన్ని దర్శిస్తున్నారు. బ్రిటిష్‌ ‌శృంఖలాలు తెంచుకున్న భారతజాతికి ఆగస్ట్ 15‌న స్వరాజ్యం వచ్చింది. జనవరి 22 (ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు) ఆగస్ట్ 15‌తో సమానమైనదే. రాముని సూత్రాలు, జీవన విధానాల గురించి 21వ శతాబ్దపు ప్రపంచానికి పరిచయం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఆయన విలువలను విశ్వవ్యాప్తం చేయాలి. ఇండోనేషియా నేతలు తమ వెంట ఉంచుకునే చిన్న పెట్టెలో రామాయణ పాత్రల బొమ్మలు పెట్టుకుంటారు. ముస్లింల ఆధిపత్యం ఉన్న ఆ దేశంలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా రాముడు, రామాయణ ప్రస్తావన ఉంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మారుతి చిత్రాన్ని తన జేబులో ఉంచుకుంటారు.

రాముని జీవితం తెలిస్తే వర్తమానతరం నేతలు యుద్ధం కంటే శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలన్న ఆలోచనకు వస్తారు. నిజానికి వర్తమాన భారత నరేంద్రుడు గతంలో ఇది యుద్ధాల కాలం కాదని చెప్పడం ఈ నేపథ్యంతోనే. శాంతి మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవడం వీలవు తుందని ఆయన ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. రామరాజ్యం అంటే అంతా తలెత్తుకు తిరగడం. అంతా న్యాయం కోసం నిలబడడం. అందరినీ సమంగా చూడడం. బలహీనుల పక్షం వహించడం. ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడం. ఈ సూత్రాలనే వర్తమాన భారత నరేంద్రుడు ప్రపంచ నేతలకు తెలియచేశారు. ఆ విధంగా భారత్‌కు విశ్వగురు స్థానానికి బాటలు వేశారు.

(ది స్టేట్స్‌మన్‌, 24.1.2024)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram