జనవరి 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేళ బాలరాముడి విగ్రహం తొలిసారి టీవీ తెరల మీద దర్శనమీయగానే భారతీయులు పులకించిపోయారంటే అతిశయోక్తి కాదు. నిజంగా దివ్య మంగళ విగ్రహమే. అంతటి భవ్య మందిరానికి ఎంత పేరు వచ్చిందో, గర్భాలయంలో ప్రతిష్ఠించు కున్న 51 అంగుళాల కృష్ణశిలతో చెక్కిన బాలక్‌ ‌రామ్‌ ‌ప్రతిమకు కూడా అంతే ఆకర్షణ కనిపించింది. ఐదేళ్ల వయసు ఉన్న బాలుని రూపంలో చెక్కిన ప్రతిమ. సమ్మోహనమైన చిరు దరహాసం, దివ్యత్వం వర్షిస్తున్న కళ్లు, వాటి మధ్యనే పొటమరించిన బాల్యపు జాడలు అద్భుతం. ఎంత కళాత్మకమో, అంతటి ఆధ్యాత్మికానుభూతి జనితం. ఈ ఘనత అంతా ఆ శిల్పాన్ని చెక్కిన అరుణ్‌ ‌యోగిరాజ్‌దే. ఇప్పుడు అంతా ఆయన గురించి మాట్లాడుతున్నారు. స్వతహాగా రామభక్తుడైన అరుణ్‌ ‌యోగిరాజ్‌ ‌కూడా తన అంతటి అదృష్టవంతుడు ప్రపంచంలోనే లేడని భావిస్తున్నారు. ఒక దేవతామూర్తి గురించి ఇంత చర్చ జరగడం ఇటీవల కాలంలో ఇప్పుడే. ఆ విగ్రహాన్ని పూర్తి చేయడానికి అరుణ్‌ ఆరు మాసాలు కుటుంబానికి దూరంగా ఉండి, రేయింబవళ్లు శ్రమించారని ఆయన భార్య విజేత చెప్పారు.

తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అరుణ్‌ ‌యోగిరాజ్‌ ‌జనవరి 22 నాటి ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి హాజరయ్యారు. జనవరి 24న తిరిగి స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించడం విశేషం. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వేలాది మంది బీజేపీ కార్యకర్తలు అరుణ్‌ను పూలమాలలతో ముంచెత్తారు. ఒక శిల్పం ఒక ప్రాంతానికి తెచ్చిన గౌరవంగా వారంతా భావించారు.
అయోధ్య బాలక్‌రామ్‌ ‌ప్రతిమ మన కాలంలో చెక్కినదేనా? ఈ ప్రశ్న కూడా వస్తుంది. బేళూరు, హళేబీడ్‌లోని శిల్ప సంపదను గుర్తుకొస్తుంది చూస్తుంటే. కంచిలోని కామాక్షి అమ్మవారి ముఖంలోని వర్చస్సు స్ఫురణకు వస్తుంది. అంతటి శిల్ప విణ్ణాణం. అవన్నీ నల్లరాయితో చెక్కినవే. ఒక గొప్ప శిల్పుల వారసత్వం అరుణ్‌యోగిరాజ్‌లో కనిపిస్తుంది. ముగ్గురు శిల్పుల కళాఖండాలు గర్భాలయంలో స్థానం కోసం పోటీ పడినా చివరికి అరుణ్‌ ‌చెక్కిన శిల్పానికే ఆ అవకాశం దక్కింది. అరుణ్‌తో జీఎల్‌ ‌భట్‌, ‌సత్యనారాయణ పాండే అనే ఇద్దరు శిల్పులు కూడా పోటీ పడ్డారు. నా మీద నా కుటుంబం మీద శ్రీరాముడి దయ ఎల్లవేళలా ఉంటుందనే నా నమ్మకం అన్నారు అరుణ్‌. ‌తాను చెక్కిన శిల్పానికి ఇంతటి అదృష్టం పట్టిందంటే అందుకు కారణం, తన పూర్వికుల, తన కుటుంబం ఆశీర్వాదం ఎంతో ఉందని కూడా ఆయన సవినయంగా చెప్పుకున్నారు.
అరుణ్‌ ‌శిల్పుల కుటుంబానికి చెందిన వారే. ఐదు తరాలుగా వారంతా శిల్పులు. ఎంబీయే చదివిన అరుణ్‌ ‌కొద్దికాలం ఉద్యోగం కూడా చేశారు. కానీ ఆయన వారసత్వం ఆ ఉద్యోగంలో ఉండనీయలేదు. కేవలం ఆరు మాసాలకే ఉద్యోగం వదిలి మైసూరు వచ్చి ఉలి పట్టారు. ఆయన కళాతృష్ణకు, సృజనాత్మకతకు ఎల్లలు లేవని రుజువైంది. మైసూరుకు చెందిన ఆయన కుటుంబం 250 సంవత్సరాలుగా శిల్పాలు మలిచే పనిలోనే ఉన్నది. అరున్‌ 11‌వ ఏటనే తండ్రి యోగిరాజ్‌కు సహకరించేవారు. శిల్పకళలో అరుణ్‌కు తండ్రే గురువు. ఉద్యోగం వదిలి పెట్టి మళ్లీ శిల్పిగా జీవితం గడపాలన్న ఆయన నిర్ణయాన్ని తండ్రి వెంటనే స్వాగతించారు. కానీ తల్లి మాత్రం కొంతకాలం పాటు సర్దుకోలేకపోయారు. 2014లో కుమారుడికి దక్షిణ భారత యువ ప్రతిభా పురస్కారం వచ్చిన తరువాత మాత్రమే ఆమె అరుణ్‌ అభీష్టాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నారు. అరుణ్‌ ‌తాతగారి పేరు బి.బసవన్న శిల్పి. మైసూరు సంస్థానంలో శిల్పాచార్యుడు. సంస్థానంలోనే ఉన్న శిల్పి సిద్ధాంతి సిద్ధలింగ వద్ద కళను నేర్చుకున్నారు. మైసూరు రాజప్రాసాదం దగ్గర నిర్మించిన గాయత్రి ఆలయానికి 11 మాసాలలో 64 విగ్రహాలను అందించిన చరిత్ర బసవన్న శిల్పికి ఉంది. ఇప్పుడు అరుణ్‌ 15 ‌మంది బృందంతో కలసి శిల్పాలు చెక్కుతున్నారు. ఆయన సంస్థ పేరు బ్రహ్మర్షి కాశ్యప శిల్పకళాశాల ట్రస్ట్. ‌మైసూరులోనే ఉంది. కొద్ది మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వీరికి ఉచితంగానే ఆయన విద్య నేర్పుతారు. అమెరికా, మలేసియాల నుంచి కూడా విగ్రహాల కోసం ఆయనకు వర్తమానాలు వచ్చాయి.
అరుణ్‌ ‌వయసు 38 ఏళ్లే అయినా శిల్పిగా, అందునా దేవతామూర్తుల శిల్పిగా ఆయన చూపిన ప్రతిభ ఘనమైనది. సాధించిన విజయాలు అద్భుతం. కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ ప్రతిష్టించిన 12 అడుగుల ఆదిశంకరాచార్యుల అద్భుత ప్రతిమ అరుణ్‌ ‌చెక్కినదే. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఆవిష్కరించిన సుభాశ్‌చంద్ర బోస్‌ ‌విగ్రహం కూడా ఆయన శిల్పించినదే. మైసూరు జిల్లా చంచాన్‌కట్టేలో ప్రతిష్ఠించిన 21 అడుగుల హనుమ ప్రతిమను ఆయనే చెక్కారు. బీఆర్‌ అం‌బేడ్కర్‌, ‌స్వామి రామకృష్ణ పరమహంస, నంది, బాణశంకరిదేవి, మైసూరు మహారాజు జయచామరాజ్‌ ‌వడయార్‌ ‌ప్రతిమ కూడా (ఇవన్నీ మైసూరు పరిసరాలలోనే ఉన్నాయి) ఆయన ప్రతిష్టను పెంచినవే. అయోధ్యలో బాలక్‌రామ్‌ ‌ప్రతిమను చెక్కడానికి, మొదట ట్రస్ట్ ‌వారు చెప్పిన ఊహకు ఆకృతిని ఇవ్వడానికి తాను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని అరుణ్‌ ‌చెప్పారు. అయితే తన ప్రతిమే గుడిలోకి చేరడంతో అవన్నీ మరచిపోయానని అన్నారు. ఇందుకు అవసరమైన శిలను కర్ణాటకలోనే హెచ్‌డి కోటే తాలూకా గుజ్జెగౌడనపుర నుంచి తెచ్చారు. ఈ శిల ఉన్న భూమి యజమాని పేరు రామదాసు కావడం మరొక విశేషం. తన స్థలంలో రామాలయం కట్టడానికి నాలుగు కుంట స్థలాన్ని వెంటనే దానం చేశారు. అక్కడ ఆలయ నిర్మాణానికి పునాది కూడా వేశారు. ఈ కృష్ణశిల వేయేళ్ల క్రితానిదని మైసూరు విశ్వవిద్యాలయం ఎర్త్ ‌సైన్సెస్‌ ‌విభాగం ఆచార్యలు చెప్పడం మరొక విశేషం. ఇక కృష్ణశిలను ఎంచుకోవడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అమ్లాలకు ఈ శిల స్పందించదు. ఇక పాలు వంటివాటితో అభిషేకం చేసినా ఎలాంటి మార్పు ఉండదు. ఆ విగ్రహానికి అభిషేకం చేసిన పాలు, నీరు తీసుకున్నా ఎలాంటి సమస్య ఉండదు. పైగా ఈ విగ్రహం వేయేళ్లకు పైగా చెక్కుచెదర కుండా ఉంటుంది. కృష్ణశిలలు కొన్నిచోట్లే దొరుకుతాయి.
ట్రస్ట్ ‌తన ముందు ఉంచిన బాలక్‌రామ్‌ ఊహకు ప్రాథమికంగా ఆకృతిని ఇవ్వడానికి అనేక ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి అరుణ్‌ ‌బాలురను చూస్తూ గడిపేవారు. ప్రతిమ కోసం అరుణ్‌ ఎం‌త తపన పడినది, తపస్సు చేసినది ఆయన భార్య విజేత కూడా చెప్పారు. చెక్కే క్రమంలో ఒకసారి ఒక శకలం వచ్చి కంటిలో చొచ్చుకుపోయింది. ట్రస్ట్ ‌వారే శస్త్ర చికిత్స చేయించారు. ఆ సమయంలోను పని ఆపకుండా అరుణ్‌ ఒక్క కంటి సాయంతోనే శిల్పం చెక్కారు.
బాలక్‌రామ్‌ ఎత్తు 51 అంగుళాలు. దాదాపు 169 సెంటీమీటర్లు. 51 సెంటీమీటర్ల ఎత్తే ఎందుకు? ఏటా శ్రీరామనవమికి గర్భాలయంలోని బాలరామునికి సూర్యతిలకం రావాలంటే అదే ఎత్తు కావాలి. ఇందుకోసం చాలామంది సాఫ్ట్‌వేర్‌ ‌నిపుణుల సాయం తీసుకోవాలని అనుకున్నా, అంతిమంగా మళ్లీ సంప్రదాయం ఉలి, సుత్తి మాత్రమే ఆయనకు అక్కరకు వచ్చాయి.
– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram