‘జైశ్రీరామ్‌’ అని బిగ్గరగా నినదిస్తూనే కొద్దిమంది స్వచ్ఛంద సేవకులు సికింద్రాబాద్‌ నుంచి సలార్‌పూర్‌ చేరుకున్న వారందరి మీద పూలరేకులు జల్లుతూ స్వాగతం పలికారు. అప్పుడు వేకువ మూడు గంటలు. ఇరవై బోగీలతో ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 4.45 గంటలకి సికింద్రాబాద్‌లో బయలుదేరిన ఆస్తా ఎక్స్‌ప్రెస్‌ రైలు దాదాపు 33 గంటల ప్రయాణం తరువాత 9వ తేదీ తెలవారుజాము మంచి చలిలో సలార్‌పూర్‌ స్టేషన్‌లో ఆగింది. మా అయోధ్య యాత్రకు తొలి అడుగు ఇదే.


అక్కడ నుంచి పసుపు రంగు అధునాతన ఎలక్ట్రిక్‌ బస్సులలో (జీరో ఒమిషన్‌) మమ్మల్నందరినీ ‘మిథిలా అతిథి గృహ’ (టెంట్‌ సిటీలలో ఒకటి)కు తీసుకువెళ్లారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ భారీ టెంట్‌. జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ ఛాయలు దారంతా ఇంకా తాజాగానే ఉన్నాయి. ఇరువైపులా విద్యుత్‌ దీపాలంకరణ. వాటిలో రామబాణం, హనుమ, మందిర్‌, రాముని ఆకృతులు ఉండేటట్టు చూడడం విశేషం. బస్సులోని స్పీకర్‌ నుంచి సియారామ్‌ జైజై సియారామ్‌ అంటూ రాముడి పాట శ్రావ్యంగా, గంభీరంగా. మిథిలా అతిథి గృహం దగ్గర ముందు ఒక పెద్ద డేరాలోకి వెళ్లమన్నారు. అక్కడ కొద్దిసేపు సేద తీరిన తరువాత మరొక టెంట్‌లోకి పంపించారు. అంతవరకు ఉన్నది వేచి ఉండేందుకు ఏర్పాటు. రెండోది 12 గంటల పాటు మేమంతా బస చేసినది. సువిశాలమైనది.

ఆ చలిలోనే దాదాపు వేకువ ఐదు గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకుని గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేసి అయోధ్య ధామ్‌కు వెళ్లడానికి బస్టాప్‌కు చేరుకున్నాం. అప్పటికే అక్కడ వేలాది మంది బస్సుల కోసం వేచి ఉన్నారు. కొద్దిసేపు వేచి ఉండక తప్పలేదు. రాత్రి తీసుకువచ్చిన ఆ బస్సులే మమ్మల్ని సరయూ ఒడ్డున దింపాయి. ఇదంతా శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్‌ ఏర్పాటే.

అక్కడ నుంచి నడక. ఆ పుణ్యతీర్థం నుంచి దాదాపు కిలోమీటరు నడిచి హనుమాన్‌ ఘడీకి వెళతారు భక్తులు. 72 సోపానాలు ఎక్కితేనే ఆయన దర్శనం లభిస్తుంది. మళ్లీ బయటకు వచ్చి ఎడమ దిశగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిస్తే భవ్య రామ మందిరం చేరతాం. ఉదయం తొమ్మిది ప్రాంతానికి అక్కడ కనీసం లక్ష మంది ఉన్నారు. ఈ రద్దీని తట్టుకోవడానికి పోలీసులు చాలా పెద్ద ప్రయత్నమే చేయవలసి వచ్చింది. ఒకవైపు వృద్ధులు, మరొకవైపు పిల్లలతో తల్లులు, మహిళలు ఆ దర్శనం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. జైశ్రీరామ్‌, జై సియారామ్‌, హనుమాన్‌కి జై అంటూ వేచి ఉన్నారు. నగరమంతా వినిపించే రీతిలో అమర్చిన మైకులలో ఎప్పటికప్పుడు హిందీ ఇంగ్లిష్‌ భాషలలో సూచనలు వినిపిస్తున్నాయి, తోసుకోద్దంటూ, ప్రశాంతంగా దర్శనం చేసుకోమంటూ.

 నిజమే, జైశ్రీరామ్‌ జాతీయ సెంటిమెంట్‌గా అవతరించిందని ఇప్పటికే రుజువైంది.

మనం కూడా అయోధ్యలో.. కొన్ని దశాబ్దాల పాటు వార్తాపత్రికలలో మాత్రమే చూసిన అయోధ్యలో, హిందువులు సాగించిన ఒక మహా ఆధ్మాతిక సంఘర్షణకు వేదిక వంటి అయోధ్యలో నడుస్తున్నాం అనుకుంటేనే ఎంతో గొప్పగా అనిపించింది. ఆధ్యాతిక పోరులో రాలిన ప్రతి రక్తపు బిందువు నుంచి ఇంకొందరు ధార్మిక వీరులను సృష్టించిన అయోధ్య ఇది.

అయోధ్య ఎంత పురాతన నగరం! భారతీయ ఆత్మ రామచంద్ర ప్రభువు పుట్టిన నేల! హిందూ సమాజ జీవనాడి, సామాజిక రాజకీయ తాత్త్వికతకు మూలమైన రామరాజ్యానికి రాజధాని. ఎన్ని పురాతన కట్టడాలు! ఎన్ని మఠాలు! ఎన్నెన్ని దేవాలయాలు! జనవరి 22 నాటి విగ్రహ ప్రతిష్ఠ కోసం నగరమంతా అద్భుతంగా అలంకరించారు. సరయూ నది దగ్గర నుంచి హనుమాన్‌ ఘడీకి వెళుతున్న దారంతా ఇరువైపులా రామాయణ ఘట్టాలు చిత్రించారు.

మొదట దర్శించుకునేది హనుమాన్‌ ఘడీ. ముందు బంటును దర్శించుకుని, ఆ తరువాతే ప్రభువును లేదా బాలక్‌రామ్‌ను చూడాలి.

అయోధ్య నగరానికి దీపస్తంభంలా భాసిస్తూ సరిగ్గా నడిబొడ్డున ఉంది హనుమాన్‌ ఘడీ. పదో శతాబ్దంలో కట్టిన ఆ అంబర చుంబిత ఆలయం కొన్ని గజాల దూరంలోనే కనిపిస్తున్నది. కానీ ఆ అద్భుత ఆలయంలోకి తీసుకువెళ్లే 76 సోపానాలలో మొదటిదాని దగ్గరకు చేరడానికి చాలా సమయమే పట్టింది. మేమే నడిచామో, జనం నడిపించారో అర్ధం కాలేదు. కొన్ని మెట్లు ఎక్కిన తరువాత ఒక కోట బురుజు మీదకు చేరుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ వెనక్కి తిరిగి చూస్తే తెలిసింది` మా వెనుక ఎంత మంది దర్శనం కోసం వేచి ఉన్నారో! కనుచూపు మేర, మేం నడిచి వచ్చిన ఆ దారంతా అక్షరాలా అంగుళం కూడా ఖాళీ లేకుండా భక్తజనం. హోరెత్తించే రామనామ స్మరణ.

 మహా రామభక్తుడు హనుమ నివసించిన గుహ ఇక్కడే ఉండేదని జనం విశ్వాసం. రామ్‌కోట లేదా జన్మభూమిని ఆ గుహలో ఉంటూనే హనుమ రక్షిస్తూ ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమకు నైవేద్యంగా సమర్పించడానికి ఆ దారిలోనే ఒక దుకాణంలో తీసుకున్న మిఠాయిలు మా చేతులలో ఉన్నాయి. అచ్చంగా నాలుగు బురుజులు ఉన్న కోటను తలపిస్తుంది ఆలయం. ఇది అయోధ్యకు ప్రత్యేక ఆకర్షణ.

రామాయణానికి రాముడే నాయకుడు. కానీ శ్రీసీతాయణం అని కూడా గౌరవిస్తారు ఆ పురాణ గాథని. ఇక సుందరకాండకు నాయకుడైన హనుమకు రామాయణంలో ఉన్న ప్రాధాన్యం అంచనాకు అందేది కాదు. మహాకవి వాల్మీకి మహోన్నత భావనకు ఆకృతి ఇచ్చినట్టు ఈ ఆలయాన్ని పుణ్య అయోధ్యా నగరికి నడిబొడ్డున కట్టారనిపిస్తుంది. హిందూధర్మమే కాదు, బౌద్ధం, జైనం కూడా ఆయనను ఆరాధిస్తాయి. అసలు ఆసియా ఖండమంతా ఆయనను కొలుస్తుంది. శక్తికి ప్రతీక హనుమ. మానవ సమాజంలో నిద్రాణమైన శక్తిని తట్టి లేపడంలో, సానుకూల చింతనతో కర్తవ్యం వైపు లంఘింప చేయడంలో, లక్ష్య సాధనకు ప్రేరేపించ డంలో ఆధ్యాత్మిక చింతన ద్వారా చేయగలిగే మేలును హనుమ అనే పాత్ర రూపంలో మనకు దర్శింప చేసిన మహాకవి వాల్మీకి. హనుమ బలమంతా మనోబలానికి ప్రతీకే. ఆయన దుష్ట శక్తులను దునుమాడే దేవుడు. భారతదేశంలో చాలాచోట్ల హనుమంతుని ఆలయాలు ఉన్నాయి. దేని ప్రాధాన్యం దానిదే. కానీ రామజన్మభూమిలోని ఈ గుడి ప్రశస్తి వేరు. ఇక్కడ కూడా మనం బాల హనుమను దర్శించుకోవచ్చు. పైగా అంజనీదేవి ఒడిలో కూర్చిన ఉన్న హనుమ దర్శనమిస్తాడు. లోపల కొలువై ఉన్న ఆంజనేయస్వామి ప్రసన్నుడు మాత్రం కాదు. ‘ఏ మాత్రం తేడా వచ్చినా…’ అన్నట్టు కాస్త తీక్షణ దృక్కులతోనే ఉన్నాడు. కానీ భక్తజనాన్ని అనుగ్రహించ డంలో లోటు లేదు. ఆయన సన్నిధిలో ఏం కోరుకున్నా జరుగుతుందని అంతా భావిస్తారు. ప్రధానంగా కంటికి కనిపించని దుష్టశక్తుల బారి నుంచి కాపాడే దిక్కు హనుమ అన్న భావన నేటికీ బలంగానే ఉంది.

హనుమాన్‌ ఘడీ నుంచి బయటపడి ఎడమ వైపు సాగితే కొత్త రామాలయం. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు. సన్నటి దారులు. పాత కట్టడాల మధ్య నుంచి నడక. మధ్యలో కొన్నింటి మీద వాటి పేర్లు. ఎప్పుడో విన్నట్టే అనిపిస్తాయి. నిజమే విన్నవే. అయోధ్య ఉద్యమ సమయంలో విన్నాం మనమంతా. అందుకే ఇంత చిన్న సందుగొందులలో లాఠీ దెబ్బలు తింటూ, తుపాకీ గుళ్లను కూడా తప్పించుకుంటూ ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తున్నట్టు ఉండే బాబ్రీ పేరుతో ఉన్న ఆ కట్డడాన్ని కూల్చారు. అంతేనా! వివాదాస్పద కట్టడంలో ఉండిపోయిన బాలరాముడిని గుడారంలో ప్రతిష్ఠించారు. అదే భవ్య మందిర నిర్మాణానికి శ్రీకారమైంది. రామాలయ నిర్మాణం కోసం హిందూ సమాజాన్ని చైతన్యపరచడానికి రథయాత్ర చేసిన బీజేపీ అగ్రనేత లాల్‌ కృష్ణ అడ్వాణీ కరసేవ ఘట్టం తరువాత అయోధ్య వచ్చినప్పుడు ఈ వీధులను చూసి చలించిపోయారు (తొలి కరసేవ సమయంలో ఆయన బిహార్‌లో నిర్బంధంలో ఉన్నారు). పక్కనే ఉన్న పోలీసు అధికారులను ప్రశ్నించారు కూడా. నిరాయుధులైన రామభక్తులను ఇలాంటి ఇరుకు ప్రదేశంలో అంత దారుణంగా హింసించడానికి మీకు మనసెలా ఒప్పిందని అడిగారు, కన్నీటి పర్యంతమవుతూ. అంతమంది చేసిన త్యాగాలకు ఈరోజు ఫలితం దక్కింది. బాలరాముడికి కొత్త ఆలయం వచ్చింది. దానిని మన తరం చూస్తోంది.

అయోధ్యలో బాలక్‌రామ్‌ ప్రాణప్రతిష్ఠ జరిగిన కాలానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అలౌకికమైన ప్రాధాన్యం ఉంది. దాదాపు వేయేళ్ల బానిసత్వం తరువాత జరిగిన కొత్త సూర్యోదయమది. నాగరికతా ప్రయాణంలో ఒక మలుపు లాంటి క్షణాలవి. వలసవాదపు సంకెళ్లు తెగిపడుతున్న సమయంలో జరిగింది. ఆలయం అంటే ఒక నిర్మాణం అందులో ఒక విగ్రహం, హారతులు, ప్రసాదాలు ఇవి మాత్రమే కావు అన్న మహోన్నత నాగరికత సారం అర్ధమవు తున్న సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించుకుంది హిందూ సమాజం. ఏ ఆలయమైనా అది నాగరికతకు ఆనవాలు. ఆ దృష్టితోనే బాలరాముడిని, ఆ ఆలయాన్ని దర్శించాలి. ఇన్ని లక్షల మంది భక్తుల లోను బహుశా అదే భావన. అందుకే ఆ నిష్ఠ. మేల్కొంటున్న నాగరికత ఇచ్చిన ఆ స్పృహ దాని నుంచి వచ్చినదే.

ఎన్నిసార్లయినా ఈ మాట చెప్పుకోవాలి. లేకపోతే హిందూ ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన ఆ త్యాగధనుల చరిత్రలు గాలిలో కలసిపోతాయి. అయోధ్య రామమందిరం కోసం హిందూ సమాజం ఐదు వందల ఏళ్లు పోరాడిరది. ఆలయం అంటే ఇటుకలు, సున్నం, ఒక కట్టడం కాదు, నాగరికతకు ప్రతీక అన్న పాఠం చూపిన సాగిన ఉద్యమమది. దేశీయమైన అన్ని విలువల వలువలను విడిచేసి జాతిని నిస్సిగ్గుగా గెంతేటట్టు చేసినది విదేశీ పాలన. ఆ వలస బుద్ధి నుంచి భారతీయులు బయటపడు తున్న తొలి ఘడియలలో అయోధ్య మందిర నిర్మాణం జరిగింది. అందుకు అవసరమైన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వాతావరణాన్ని సృష్టించిన వారు ఎందరో! సాధుసంతులు, హిందూ ధర్మ శ్రేయోభిలాషులు, ఆత్మాభిమానం కలిగిన హిందు వులు ఆ పని చేశారు. వారికి గడచిన ముప్పయ్‌ ఏళ్లుగా సంఘ పరివార్‌ మద్దతుగా నిలిచింది. ఆధ్యాత్మిక పోరాటానికి జాతీయ భావాలను అద్దింది. అందుకే ఈ ఘట్టానికి ఇంత పవిత్రత. దర్శనంలో ఇంత ఉద్విగ్నత. కనీవినీ ఎరుగుని ఈ ప్రత్యేకత. ఆ నినాదాలలో ఆ కొత్త భావన. వారంతా జైశ్రీరామ్‌ అంటున్నారు. భారతమాతాకు జై అంటున్నారు. ఇంకా… నరేంద్ర మోదీకీ, యోగి ఆదిత్యనాథ్‌కీ జయం కలగాలని నినదిస్తున్నారు. ఆకాంక్షిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అయోధ్య తరహా విజయాలు ఇంకా సాధించుకోవాలన్న దీక్ష వారిలో మొలకెత్తుతున్నది. అందుకు నాయకులు రావాలని హిందువులు కోరుకుంటున్నారు. ఈ కొత్త భారత దేశంలో, భారతీయులు భారతీయుల మాదిరిగా ఆలోచించడం ఆరంభించిన తరువాత కట్టుకున్నదే అయోధ్య గుడి. మనదైన సంస్కృతిని నిర్ద్వంద్వంగా శిరోధార్యమని తలచడం, మూలాలు శోధించడం, విస్తరించడం వంటి విషయాలు బలోపేతమవుతున్న కాలంలో, ముఖ్యంగా ఈ పదేళ్ల కాలంలో ఆ దిశగా సాగిన కృషికి పరాకాష్ఠగా ఆ రామాలయం నిర్మాణం జరిగింది.

హిందూ సమాజాన్ని సర్వభ్రష్టం చేసినది విదేశీ పాలన ఒక్కటేనా? వలస పాలన మాత్రమేనా? స్వతంత్ర భారతదేశాన్ని ఏలిన తొలితరం ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ పరిపాలన కూడా ఆ పనే ఎలాంటి వెరపు లేకుండా చేసింది. మెజారిటీ ప్రజల మనోభావాలు ‘సెక్యులర్‌’ అన్న ఒక కృతక భావనలో కునారిల్లిపోయాయి. పూచిక పుల్లలతో సమాన మైనాయి. సెక్యులర్‌ అన్న పదం భారతీయతకు చేసిన మహా ద్రోహం, హిందూ సమాజానికి అది చేసిన విద్రోహం గమనించే వివేకం, వివేచన జాతిలో కలిగిన క్షణంలోనే అయోధ్య ఆలయం నిర్మాణానికి పునాదులు పడినాయి.

సెక్యులర్‌… ఆ పదాన్ని 1951లో జార్జ్‌ జాకబ్‌ హోల్యుక్‌ మొదట వాడాడు. ఆ భావనను పరివ్యాప్తి చేయడంలో యూరప్‌ వాడైన హోల్యుక్‌ దృష్టి వేరు. మానవత్వాన్ని సిలువ వేస్తున్న చర్చి దురాగతాలకు విరుగుడుగా అక్కడ సెక్యులరిజం పుట్టింది. కానీ బుర్రంతా పేరుకున్న భారత వ్యతిరేకత, భారతీయత మీద అర్ధం లేని ద్వేషం, బానిస బుద్ధి ఫలితంగా మన తొలి ప్రభుత్వాల అధినేతలు దానిని శిరోధార్యంగా స్వీకరించారు. ఇక్కడే చరిత్ర క్షమించని ఒక అజ్ఞానం కనిపిస్తుంది. విషకన్యలా, ఓ అందమైన ఆదర్శంలా కనిపిస్తూ కొన్ని దశాబ్దాల పాటు రాజ్యమేలిన ఆ సెక్యులర్‌ భావన, ఆ దృష్టిల ఫలితమే మిటి? జాతి తనదైన అస్తిత్వాన్ని మరచిపోయేటట్టు చేయడమే. హిందూ జాతి చరిత్రలో మహా స్వీయ విస్మృతికి అదే దోహదం చేసింది. సంస్కృతికి, ఆరాధనా పద్ధతులకి, ఆధ్యాత్మిక ధోరణులకు, మరీ ముఖ్యంగా ఆత్మ గౌరవానికి జాతిజనులను దూరంగా నెట్టివేసింది. ఎంత దూరంగా! నేను హిందువును అని చెప్పుకోవడానికి హిందువే సంకోచించేటంత దూరంగా. భారతీయుడినని భారతీయుడే ప్రకటించుకోవడానికి సిగ్గు పడేటంతగా. అంతేనా! ఎవరైనా ధైర్యంగా నేను హిందువును అని ప్రకటించు కున్నా అతడొక ప్రమాదకారి అన్నట్టు, మధ్య యుగాల వాడు అన్నట్టు మిగిలిన వారు చూసేటట్టు చేసింది. అలాంటి ప్రకటనను కేవలం అనాగరికలు మాత్రమే చేయగలరన్నట్టు చిత్రించింది. నా ధర్మాన్ని నా దేశంలో తప్ప ఇంకెక్కడ నేను ఆచరించగలను అని నిలదీస్తే మతోన్మాదమని ముద్రవేసే వరకు సెక్యులరిస్టులు వెళ్లిపోయారు. సెక్యులర్‌ భావనను తీసుకొచ్చి రుద్దిన తొలితరం నాయకులు కూడా హిందువులు సోమరులు, అజ్ఞానులు అంటూ సాక్షాత్తు ఎర్రకోట మీద నుంచి వ్యాఖ్యానించిన సందర్భాలు సెక్యులర్‌ విషపుటాలోచనలకు రెక్కలు తొడిగాయి. స్వాతంత్య్ర దిన వేడుకల సందేశం పేరుతో వలసవాదాన్ని మరింత బలంగా స్వతంత్ర భారతీయుల మెదళ్లలో చొప్పించారు.

యూరప్‌లో పుట్టి భారతదేశానికి వచ్చిన సెక్యులరిజం ఇంకాస్త అదనపు ప్రమాదాన్ని సంతరించుకుంది. ఇది దేశంలో ఉన్న సాంస్కృతిక ఐకమత్యాన్ని నాశనం చేసే పనికి పూనుకుంది. రాజకీయ ఐక్యతా కృషికి తీవ్ర విఘాతాలు సృష్టించింది కూడా. ఫలితమే ఉత్తర భారతం, దక్షిణ భారతం వేర్వేరు అన్న వేర్పాటువాద నినాదాలు. తమిళనాడులో వేయేళ్ల చరిత్ర కలిగినవి 35 రామాలయాలు ఉన్నాయి. అందులో ఆరణి ఆలయం మరీ ముఖ్యమైనది. ఇక్కదే పుత్తిర కామట్టేశ్వర ఆలయం. దశరథ మాహారాజు ఉత్తర భారతంలోని అయోధ్య నుంచి ఆరణి వెళ్లి శివుడి కోసం తపస్సు చేశాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఎందుకు ఆ తపస్సు! తన తరువాత రాజ్యభారం మోసే వారసుడి కోసం. దక్షిణ భారతం లేదా భారతదేశ దక్షిణ భాగంలో జరిపిన తపస్సు ఫలితమే ఉత్తర భారతం లేదా భారత ఉత్తర భాగంలో జన్మించిన రాముడు. ఆయనే ఈ దేశ ఆత్మ. కుంభకోణం అనే పుణ్యక్షేత్రం దగ్గర జటాయుకుండం ఉంది. ఇలాంటి చోట రాముడిని చెప్పులతో ఊరేగించారు. ఈ పతనాన్ని జాతిలో వేగవంతం చేసిన ఘనత, ఈ కుసంస్కారాన్ని జాతిలో నింపిన ఘనత సెక్యులరిజానిదే. దాని విషపుకోరలు ఎంత లోతుగా దిగాయంటే, జనవరి 22, 2024న జరిగిన అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు అనుమతి తరువాతనే తమిళప్రజలు టీవీలలో చూడగలిగారు. అక్కడి ఆలయాలలో ఉత్సవాలూ, పూజలూ నిర్వహించుకున్నారు. అయోధ్య రాముడి అక్షింతలు ప్రజలు వేసుకున్నారు. తిక్క వేషాలు వేసినందుకు అత్యున్నత న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఒక విగ్రహ విధ్వంసకుడు, జిన్నాయే ఆదర్శంగా ఉన్న వేర్పాటువాది, హిందూ ద్వేషి, నాగరికతకే శత్రువు రామస్వామి నాయకర్‌ వినాశకర ఆలోచనలను పల్లకిలో మోసేందుకు ఆధునిక కాలంలో సరిగ్గా సరిపోయింది ఇక్కడి సెక్యులరిజం. కానీ అయోధ్య విగ్రహ ప్రతిష్ఠను క్రైస్తవ దేశాలు కూడా ఆనందంగా జరుపుకున్నాయి.

చరిత్రను పూర్తిగా మరచిపోయిన నాయకుల చేతిలో స్వతంత్ర భారత తొలి ప్రభుత్వ పగ్గాలు వెళ్లిపోయాయి. స్వీయ విస్మృతికి ఎర్రతివాచీ పరిచిన నాయకులు ప్రధానులయ్యారు. స్వరాజ్య సమరంలో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేకోద్యమ ఘట్టానికి పెద్ద స్థానమే ఉంది. మీ రాజ్యాంగం మేమే రాస్తామంటూ వచ్చిన ఆంగ్లేయ బృందంతో భారతీయులంతా ముక్తకంఠంతో ‘అవతలకి పొండి’ అని చెప్పిన ఘట్టమది. తొలి ప్రధాని నెహ్రూ స్వతంత్ర భారత రాజ్యాంగం అడ్వర్డ్‌ జెన్నింగ్స్‌ రాయాలని గట్టిగానే కోరుకున్నారు. అదే సమయంలో గాంధీజీ బీఆర్‌ అంబేడ్కర్‌ రాయాలని అంతే గట్టిగా కోరుకున్నాడు. అబుల్‌ కలాం ఆజాద్‌ వార్షిక స్మారకోపన్యాసం కోసం ఆర్నాల్డ్‌ టాయన్‌బీని నెహ్రూ 1961లో పిలిచారు. ఆ ప్రముఖ చరిత్రకారుడు ఈ దేశంలో ఔరంగజేబు తన రాజకీయ ప్రత్యర్థులను ఘోరంగా అవమానించడానికే ఆలయాలను కూల్చి మసీదులు కట్టాడని నిర్మొహమాటంగానే చెప్పాడు. ఆ వాస్తవాన్ని నెహ్రూ పట్టించుకోలేదు. సరిగ్గా భారతదేశంలో ఔరంగజేబు నిర్వహించిన పాత్రనే పోలెండ్‌లో రష్యా నిర్వహించింది. తరువాత జరిగిందేమిటి? మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా చిత్తుగా ఓడిన తరువాత పోలెండ్‌ ప్రజలు తమ మత దేవాలయమే అయినా, రష్యా జార్‌ కట్టిన ఆ చర్చిని కూల్చారు. అది ఒక నియంత, స్థానికుల ఆత్మ గౌరవాన్ని నేలరాసిన పరాయి పాలకుడు కట్టాడు. అక్కడ చర్చిలో సిలువ మీద ఏసు కాదు, తమ దేశ ఆత్మ గౌరవం వారికి కనిపించింది పోలెండ్‌ ప్రజలకి!

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా తమదైన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కనిపిస్తున్నది. థాయ్‌లాండ్‌లో పాలకుడైన వాడికి రాజ్యాంగం ఇచ్చే బిరుదు రామ్‌. తాను కోల్పోయినదేమిటో తెలుసుకుని ప్రతి దేశం ఆత్మాభిమాన దృక్కోణంతో తిరిగి పొందేందుకు అన్వేషిస్తున్నది. తెచ్చుకుంటున్నది. యోగాను మనం అలాగే తెచ్చుకున్నాం. ఇప్పుడు విస్తరించాం. ఐరాసలో 190 వరకు దేశాలు దానిని ఆచరిస్తున్నాయి. మన ఆయుర్వేదం శక్తి ఏమిటో ప్రపంచం తెలుసుకునే అవకాశం కరోనా ఇచ్చింది. ఇది రుద్దడం కాదు. విజ్ఞానాన్ని పంచడం. ఇది భారతదేశ చరిత్ర సూత్రం. ఇదంతా గతం మీద గుడ్డిప్రేమ కాదు. వాస్తవాన్ని తెలుసుకోవడం. మూలాల అన్వేషణ. ఆ వాస్తవికతకు ఆధారం దొరికిన తరువాత చెబుతున్న మాట.

ఉత్తర భారతం, దక్షిణ భారతం మాటలు ఒక బూటకం. నీచాతినీచమైన రాజకీయ ఎత్తుగడ. జి 20 సదస్సులు దేశం నలుమూలలా నిర్వహించారు. మహాబలిపురంలోను నిర్వహించారు. 198 చోట్ల వేదికలు వచ్చాయి. ఇదంతా దేశంలోని వైవిధ్యాన్ని, అదే సమయంలో భిన్నత్వాన్ని ప్రపంచానికి చూపడానికి చేశారు. కాశీ కారిడార్‌, ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ కారిడార్‌, చారధామ్‌ అభివృద్ధి అలాంటి ఉద్దేశంతో చేసినవే. అసలు భారతదేశమే సహజంగా ప్రజాస్వామ్యం ఉన్న దేశం. కాంచీపురానికి కొద్దిదూరంలోనే ఒక ఊరిలో కులోత్తుంగ చోళుడి మూడు శాసనాలు ఉన్నాయి. ఆ మూడు ఎన్నికల వ్యవస్థ గురించి చెబుతాయి. ఎలాంటి వారు పోటీ చేయాలి, ఎన్నికల నిర్వహణ ఎలా జరగాలి? ఎన్నికైన వారు తప్పు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇది చెప్పాయి. ప్రజాస్వామ్యం అంటే ఇతరుల అభిప్రాయాలను వారు స్వేచ్ఛగా వెల్లడిరచే అవకాశం ఉండడం. కానీ సెక్యులరిజం హిందువుల గళాన్ని తొక్కిపెడుతున్నది. హిందూ ద్వేషానికి అది పర్యాయపదమైంది. అందుకే సెక్యులరిజం అంటే రాజకీయ మత మార్పిడి అని వ్యాఖ్యానిస్తున్నారు. అది మానసిక బానిసత్వాన్ని కాపాడేది. గతంతో బంధాన్ని తెంపి వేస్తుంది. గతం మరచిపోయేటట్టు చేసి కొత్త రాజకీయ మతం వైపు నెట్టే చింతన. దానికి మైనారిటీల బుజ్జగింపే ప్రధానం. మెజారిటీ ప్రజల మనోభావాలను అవమానించడమే దాని సిద్ధాంతం. అందుకు తాజా ఉదాహరణ, దేశంలో జైశ్రీరామ్‌ నినాదం ఒక సెంటిమెంట్‌గా ధ్వనిస్తుంటే కాంగ్రెస్‌ అగ్రనాయకుడు ఏమిటీ 24 గంటలు రామ జపం అని చిందులు వేయడం. ఎలా చూసినా సెక్యులరిజంతో భారతీయుడు భారతీయుడిగా ఆలోచించలేడు.

వీటన్నిటికీ సమాధానమే అయోధ్యలో రామాలయం. అయోధ్య అనే కాదు, దేశంలో ఆలయ పర్యాటకం విస్తరించాలి. గుడితో సంబంధం ఉన్న అన్ని వ్యవస్థలను మన సొంతం అనుకోవాలి. గుడులను జాతి ఐక్యతా వేదికలుగా చూడాలి. అదే ఇప్పుడు అయోధ్యలో అంకురిస్తున్నది. తెలుగువాళ్లు, తమిళులు, గుజరాతీలు, బెంగాలీలు, అస్సామీస్‌ అంతా అక్కడ రాముడిని దర్శించుకోవడానికి వచ్చారు. రాముడు ఇప్పుడు భారత జాతి ఐక్యతా ప్రతీక. ఉత్తర భారతమో, దక్షిణ భారతమో, పశ్చిమ భారతమో, ఈశాన్య భారతమో.. ఏదీ అక్కడ ఎవరికీ గుర్తుకు రావడం లేదు.

భద్రతా చర్యలకు సంబంధించిన అన్ని లాంఛ నాలు పూర్తి చేసుకుని కొత్త మందిరానికి చేరువగా వచ్చాం. దాదాపు 15 వరకు ఉన్న మెటల్‌ డిటెక్టర్ల ద్వారా వేలాది మంది నడిచి వెళుతున్నారు. ఓపికగా అన్ని నిబంధనలు చాలావరకు పాటిస్తున్నారు.

రామ మందిర దర్శనం ఆకాంక్ష తొలి మెట్టుకు చేరుకుంది. అదిగో రామమందిరం. ఎంత అద్భుతం. ఎంత కళాత్మకత! ఒక్కొక్క మెట్టును కళ్లకద్దుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నారు భక్తులు. ప్రతి ద్వారాన్ని కళ్లకు అద్దుకుంటున్నవారు ఇంకొందరు. నగరి శైలిలోని ఆ ఆలయం ఆధునిక కాలపు ఆధ్యాత్మిక కళాఖండం. ఆ స్తంభాలు, పై కప్పులు, శిల్పాలు అన్నీ కళ్లు చెదిరే సౌందర్యంతో ఉన్నాయి.

ఎదురుగా కనిపించింది బాలక్‌ రామ్‌ ప్రతిమ – అరుణ్‌ యోగిరాజ్‌ అద్భుత సృష్టి. తెల్లటి గర్భగుడిలో నీలమేఘ శ్యాముడి ప్రతిమ, చిరునవ్వుతో.

ఒక్కసారి ఆలయమంతా పరికించి నిష్క్రమి స్తున్నారు భక్తులు. అందరి ముఖాలలోను గొప్ప తృప్తి. ఇన్ని శతాబ్దాలకు నాగరికత తనదైన వెలుగుతో మెరిసింది కదా! అందుకే ఆ తృప్తి.


సికింద్రాబాద్‌ నుంచి సలార్‌పూర్‌

మొత్తం 67 గంటల ప్రయాణం. అయోధ్య రామమందిర దర్శనం చేసుకునే వారి కోసం ఏర్పాటు చేసిన ఆస్తా ప్రత్యేక రైలులో మేం వెళ్లాం. ఇదే కాదు, ఇంకొన్ని రైళ్లు మాకు ముందు, వెనుక కూడా వెళ్లి వచ్చాయి. మా యాత్ర ఫిబ్రవరి 11వ తేదీన ముగిసింది. ఆ రాత్రే అంటే ఆదివారం రాత్రే సూరత్‌ నుంచి బయలుదేరిన 22 బోగీల ఆస్తా రైలు మీద మహారాష్ట్రలోని నందర్బర్‌ అనే చోట రాళ్లు వేశారు. ఆ వార్త చూశాక మేం ప్రయాణించిన రైలుకు అంత భద్రత ఎందుకు కల్పించారో అర్ధమైంది. అందుకు కాకపోయినా, రైల్వే శాఖ తీసుకున్న జాగ్రత్తలు, సేవ, శ్రద్ధ చెప్పుకోదగినవి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మీదుగా ఈ రైలు ఉత్తర ప్రదేశ్‌ చేరుకుంది.

మేం ప్రయాణించిన రైలుకు 20 బోగీలు ఉన్నాయి. మేమంతా పాటించిన మొదటి నియమం` సికింద్రబాద్‌లో ఇచ్చిన గుర్తింపు కార్డును మెడ నుంచి తీయకపోవడం. అక్కడ ఆధార్‌కార్డును చూపించిన తరువాత, జాబితాలో మన పేరును తనిఖీ చేసి ఈ గుర్తింపు కార్డును ఇచ్చారు. ఈ రైలు ప్రత్యేక అవసరాల కోసం తప్ప ఏ స్టేషన్‌లోను ఆగదు. భోజనాలు, అల్పాహారాలు, సిబ్బంది మారడం వంటి పనులకు మాత్రమే రైలు కొన్నిచోట్ల ఆపారు. ప్రతి బోగీకి ఇద్దరు గన్‌మెన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి బోగీకి పూర్తి సమయం అక్కడే ఉండేవిధంగా పారిశుద్ధ్య కార్మికుడిని కూడా ఏర్పాటు చేశారు. రaాన్సీ రైల్వే స్టేషన్‌లోను మరొక చోట డాగ్‌ స్క్వేడ్‌తో స్టేషన్‌ను తనిఖీ చేశారు. దానికి దగ్గరలోనే ఉన్న ఉరయి అనే స్టేషన్‌లోకి ఆస్తా రైలు ప్రవేశించినపుడు అసలు ప్లాట్‌ఫారమ్‌ మీద ప్రయాణికులను కూడా అనుమతించలేదు.

ఉదయం ఎనిమిది ప్రాంతంలో తేనీరు, తరువాత అరగంటకు అల్పాహారం ఇచ్చారు. మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. మంచినీరు కూడా వారే ఇచ్చారు. పడక బట్టలు కూడా వారే ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ కంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ లలో చలి తీవ్రత చాలా ఎక్కువ. ఆహారం ఎక్కువగా ఉత్తర భారతీయ వంటకాలతో ఉన్నది. చపాతీలు తప్పనిసరిగా వడ్డించారు.

రామభక్తులంతా క్రమశిక్షణతో వ్యవహరించారు. సంఘ ప్రార్థన క్రమం తప్పకుండా పాడుకున్నారు. రామభజన మరొక కార్యక్రమం. హనుమాన్‌ చాలీసాను కూడా క్రమం తప్పకుండా సామూ హికంగా పఠించారు. విసుగు జనించకుండా అన్ని గంటల ప్రయాణం సుఖంగానే సాగింది. ఒకటి మాత్రం నిజం. మనం దర్శనం చేసుకోబోతున్నది ఒక మహా పోరాటం తరువాత సాధించుకున్న ఆధ్యాత్మిక విజయం. ఈ స్పృహే మమ్మల్నందరిని రామాలయం దర్శనం కోసం ఎదురు చూసేటట్టు చేసింది. దర్శనం కలిగించిన తృప్తి సికింద్రాబాద్‌ వరకు ప్రశాంతంగా తీసుకువచ్చింది. ఇందుకు రైల్వే శాఖ వారికి, సిబ్బందికి అంతా కృతజ్ఞతలు తెలియచేశాం.


గుడారాల నగరాలు

రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాట్లు చరిత్రలో నిలిచిపోతాయి. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టారు. జనవరి నెల, ఉత్తర భారతదేశపు చలి. భక్తులు రాక మానరు. అయినా వారికి సాధ్యమైనంత మేర ఉచితంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాదాపు మూడేళ్లలో అసలు ఆలయం పని పూర్తయింది. తిరుమల తిరుపతి లేదా వైష్ణోదేవి క్షేత్రాల మాదిరిగా సకల సౌకర్యాలతో ఉండాలంటే కొద్దికాలం అవసరం. అయినా ఆ లోటు కనిపించకుండానే ట్రస్ట్‌ గొప్ప ప్రయత్నం చేసింది.

ఇందుకోసం ఏర్పాటు చేసినవే టెంట్‌ సిటీలు. ఇవి మొత్తం అయిదు. గుప్తార్‌ ఘాట్‌, బాగ్‌ బిజేసి, రామ్‌కథా పార్క్‌, కరసేవకపురం, బ్రహ్మకుండం అనే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. అయోధ్య అభివృద్ధి బోర్డు, ఉత్తర ప్రదేశ్‌ పర్యాటక శాఖ వీటిని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నది. ఇందులో బాగ్‌ బిజేసీ టెంట్‌ సిటీ పెద్దది. ఇవి కాక సరయూ నదికి సమీపంలో కొన్ని విలాసవంతమైన గుడారాలుకూడా ఏర్పాటు చేశారు.

ఒక్కొక్క టెంట్‌ సిటీని 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దానిలో 20 నుంచి 25 వేల మంది భక్తులు బస చేయవచ్చు. కరసేవకపురం, మణిరామ్‌దాస్‌ కంటోన్‌మెంట్‌ల వద్ద నిర్మించినవి సాధారణ భక్తుల కోసమే. ఇక్కడే మిథిలా అతిథి గృహ ఉంది.

మేం వెళ్లడానికి ఒక రోజు ముందు అక్కడ వర్షం కురిసింది. ఆ అతిథి గృహం మిథిలను, పక్కనే ఉన్న పంచవటి, ప్రయాగ, అంజనేరి వసతి గృహాలన్నీ పంటచేలు కప్పెట్టి నిర్మించారు. ప్రతి టెంట్‌ సముదాయంలోను ఐదారు విభాగాలు ఉన్నాయి. మొదటిది వేచి ఉండే గుడారం. తరువాతి బస చేసే గుడారం. ఇందులో 875 మంచాలు ఉన్నాయి. ప్రతి మంచానికి ఒక పరుపు, దిండు, రొజాయ్‌ సరఫరా చేశారు. దట్టమైన గుడ్డతో కప్పినా, మంచు బిందువులు లోపల రాలుతూనే ఉన్నాయి. ఈ పెద్ద టెంట్‌ పక్కన కొన్ని చిన్న చిన్న గుడారాలు వేశారు. వీటిలో మళ్లీ 20 లేదా 30 మంచాలు ఏర్పాటు చేశారు. కిందంతా ఆకుపచ్చ తివాచీ. ఈ ప్రధాన గుడారం వెనుకే పాయఖానా ఏర్పాటు చేశారు. మరొక పక్క భోజనశాల. ఇలా చూస్తే అన్ని టెంట్‌ సిటీలు కలసి రోజుకు 80,000 మంది భక్తులకు వసతిని కూర్చగలవు.

మేం ప్రాణప్రతిష్ఠ జరిగిన మూడు వారాల తరువాత వెళ్లాం. అయినా అక్కడ పాయఖానాలు మంచి స్థితిలోనే ఉన్నాయని చెప్పాలి. వెస్ట్రన్‌ కమోడ్‌లు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది స్నానాలు చేయడం, పాయఖానాలు ఉపయోగించడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా, అది లెక్కలోనిది కాదు. మిథిల అతిథిగృహంలో ఎక్కువగా తెలుగువారు ఉన్నారు. అక్కడ ప్రకటనలు కూడా తెలుగులోనే చేశారు. భోజనం, అల్పాహారం, తేనీరు ఉచితం. ఏడుగంటలకే తేనీరు అందించగలిగారు. తొమ్మిదికి అల్పాహారం. వీటికి ఎదురుగా బయట ఒక పోలీస్‌ పోస్ట్‌, ఒక అగ్నిమాపక సెల్‌, ప్రాథమిక వైద్యం అందించే ఏర్పాటు చేశారు. మరొక వారంలోనే ఎండలు ముదురుతాయి కాబట్టి మేం అక్కడ ఉన్నప్పుడే సీలింగ్‌ ఫ్యాన్లు బిగించే పని కూడా మొదలయింది.

ఇటు టెంట్‌ నగరాలలోను, అటు అయోధ్య నగరంలోను, ఆలయ ప్రాంగణంలోను తిరుగులేని విధంగా పారిశుద్ధ్యం ఉండేటట్టు చూస్తున్నారు. అన్ని వేలమంది, అన్ని ప్రాంతాల వారు అక్కడికి వచ్చి వెళుతున్నా, చాలా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటున్నారు.


రామమందిరం

అయోధ్య రామమందిర కళాత్మకత గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిని సంప్రదాయ నగర్‌ శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపం నిర్మించారు. వీటిని దాటుకుని గర్భాలయం చేరతాం. సింహద్వారం దటాక తూర్పు నుంచి మనం ఆలయంలోకి ప్రవేశిస్తాం. స్తంభాల మీద, గోడల మీద హిందూ దేవీదేవతల విగ్రహాలను చెక్కారు. ఆలయ ప్రాంగణం చుట్టూ సూర్యుడు, దేవీ భగవతి, గణేశ్‌, శివుడికి మందిరాలు ఉన్నాయి. ఉత్తర దిక్కున అన్నపూర్ణ ఆలయం, దక్షిణాన హనుమ మందిరం ఉన్నాయి.

సింహద్వారానికి కాస్త ముందు దాదాపు 15 మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. వాటి కింద నుంచి భక్తులు అసలు ప్రాంగణంలో ప్రవేశిస్తారు. అక్కడ నుంచి మూడు నాలుగు శ్రేణులుగా భక్తులను విభజించి, దశల వారీగా భక్తులను లోపలికి పంపుతున్నారు. ఇందువల్ల ఆలయంలో రద్దీ బాగా అదుపులో ఉంది. మన వెనుక కొన్ని వేల మంది దర్శనం కోసం వేచి ఉంటారన్నది సత్యం. అందుకే రాముడిని కొన్ని సెకనులు మాత్రమే దర్శించగలం. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మంది దర్శించుకుంటున్నారు. లోపలికి సెల్‌ఫోన్‌లు అనుమతించరు. మీరు రహస్యంగా తీసుకువెళ్లి, అక్కడ భద్రతా సిబ్బంది కంటపడితే కొంచెం కటువైన తిట్లు తప్పవు. చాలా ఉత్తర భారత దేవాలయాలకు వలెనే ఇక్కడ అప్పుడే భారీగానే భద్రతా ఏర్పాటు చేశారు. ఆఖరికి హనుమాన్‌ ఘడీ నుంచి తీసుకువెళ్లిన ప్రసాదం కూడా లోపలికి అనుమతించరు. సెల్‌ఫోన్లు, చిన్న బ్యాగులు భద్రపరుచుకోవడానికి గుడిలోకి ప్రవేశించే చోటే లాకర్లు సౌకర్యం ఏర్పాటు చేశారు. దాదాపు ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి.

చిన్నదైనా పెద్దదైనా ఆలయాన్ని నాగరికతకు ఆనవాలుగా చూడవలసిన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఆలయం దగ్గర దాపరికాలు, కాపీనాలు చూపించడం సరికాదన్న సంగతి విస్మరించవద్దు. దేవస్థానాల వద్ద సత్ప్రవర్తన అనివార్యమని గుర్తుంచుకుందాం. మన ఆలయాలను మనం గౌరవించాలి. అది భగవానుడిని నిలయం. కాబట్టి చిత్తశుద్ధి అవసరం. పరిశుభ్రత ఇంకా అవసరం. వీటిని దృష్టిలో ఉంచుకుందాం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram