‘‘‌హిందువు నశించకూడదు. హిందువు నశించడం అంటే వ్యక్తి స్వేచ్ఛ నశించడం. ఉపాసనా స్వాతంత్య్రం నశించడం, హింస, ఆక్రమణ, దురాక్రమణ, రక్తపిపాస గెలవడం.. విశ్వమానవ ధర్మం ప్రపంచంలో బ్రతుకలేక కనుమూయడం.. ఇది జరుగకూడదు’’  

‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌’ అని సంస్థకు పేరు పెట్టడానికి కాస్త ముందు, 1925 విజయదశమి పర్వదినాన పదిహేను మంది ఆత్మీయులతో నాగపూర్‌లో తన ఇంట్లో సమావేశమైనప్పుడు సంస్థ సంస్థాపకులు పరమ పూజనీయ కేశవరావు బలిరాం హెడ్గెవార్‌ (‌డాక్టర్‌జీ) మదిలో మెదిలిన భావాలు ఇవేనంటారు. అటువంటి సంస్థపై రాహుల్‌ ‌గాంధీ, ఖర్గే వంటివారు నిరాధార ఆరోపణలు చేయడం అజ్ఞానమే.

భారతదేశం బయట యూరఫ్‌ ‌ఖండాన్ని మార్కస్, ‌ఫ్రాయిడ్‌, ‌డార్విన్‌ ‌ముగ్గురూ విశేషంగా ప్రభావితం చేసారు. మరో భూభాగాన్ని జీసస్‌ ‌క్రైస్ట్, ‌మధ్య ఆసియా ప్రాంతంలో మహ్మద్‌ ‌ప్రవక్తతో నిండిపోయింది. ‘ఏకేశ్వరోపాసన’ మనకు క్రొత్త కాకపోయినా, హిందూ ధృక్కోణంలో దాని నిర్వచనం వేరేగా గొప్పగా ఉంది. మనకు ‘ఒక్క దేవుడు’ కాదు ‘ఒకే దైవత్వం’ ఉంది. ఇది సనాతన హిందూ ధర్మోపదేశం. ‘‘ఏకం సత్‌: ‌విప్రా బహుదా వదన్తి’’ అని వైదికమైన ప్రబోధం హిందుత్వగా మనం ఆచరించాం. అయితే నా దేవుడిని మాత్రమే నమ్మాలనే అబ్రహామిక్‌ ‌మతాలు భారతదేశంపైకి అరబ్బు గుర్రాలనెక్కి కత్తి పట్టుకొని వచ్చాయి. మత వ్యాప్తికి ఆంగ్లేయుల కాలంలో కుట్రపూరితంగా  హిందూధర్మాన్ని సిద్ధాంతపరంగా లార్డ్ ‌మెకాలే దెబ్బకొట్టాడు. స్వాతంత్య్రం కోల్పోయిన హిందువులు సుమారు వెయ్యేళ్ల నిరంతర పోరాటం కొనసాగించారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం, 1885 రామమందిర ఉద్యమం, శివాజీ, గణేష్‌ ఉత్సవాలు, స్వదేశీ, స్వావలంబన, స్వాత్మదర్శనం, ఆధ్యాత్మిక ఉద్యమాలు, స్వామి వివేకానంద, దయానందల తపస్సు అన్నీ  డాక్టర్‌జీ ఆశయంలో ప్రతిఫలించాయి.

ఈ దేశ కర్త కర్మ క్రియ హిందువే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. హిందువు శరీరమే ఈ దేశం. అతని మనసులో మెదిలే దేశభక్తి ఆత్మ సాక్షాత్కారం వంటిదే ఇందులో భౌతికం, అలౌకికం కలగలసి ఉంటాయి. భౌతికం అరటిపండు తొక్క లాంటిది. అది రక్షణగా ఉన్నంతవరకు అందులో మధురమైన ఫలం సురక్షితంగా ఉంటుంది. ఈ దేశంలో జరిగిన విధ్వంసాన్ని డాక్టర్‌జీ ఇలా దర్శించారు. లోపలున్న మధుర పదార్థాన్ని కాపాడే కంచె దేశభక్తి. దైవభక్తి రక్షణ జరగాలంటే దేశభక్తి ముఖ్యం అనుకొన్నారాయన. దైవత్వం అంటే మనం అనకొనే అధమస్థాయి వ్యవహారం కాదు. ఆయన దృష్టిలో దైవత్వం ఒక దర్శనం. ఆయనో ద్రష్టలా దీన్ని అధ్యయనం, అనుశీలనం చేసారు. హిందుత్వంలోని భిన్నత్వంలోని ఏకత్వం. డాక్టర్‌జీది తత్త్వదర్శనం. ‘నాది మాత్రమే సత్యం’ అని ఎవరు అనుకొంటారో వాళ్లు ఇతరులపై దాడిచేస్తారని డాక్టర్‌జీ గమనించారు. అంతరంగంలో నీవు నాస్తికుడిగా కూడా ఉంటే ఉండు. కానీ భౌతికస్థాయిలో దేశీయ విలువలను గౌరవించాలనేది కూడా మనకో సిద్ధాంతం. ఇప్పటి నాస్తికుల్లా అవార్డు వాపసీ గ్యాంగ్‌ ‌వ్యవహారం కాదిది. చార్వాక, జాబాలి, బృహస్పతిలాంటి వాడైనా ‘ధర్మం’ ఒక సజీవ స్వరూపమై దేశంగా నిలబడినపుడు దానిని అందరూ గౌరవించాల్సిందే.

వెయ్యేళ్లు పరాధీనంగా ఉన్న మన దేశం.. కులం, ప్రాంతం, వర్గం, భాష, సంప్రదాయాల పేరుతో గిరిగీసుకొనే అధమ స్థాయికి దిగజారడాన్ని డాక్టర్‌జీ నిశితంగా పరిశీలించారు. ఈ సంకుచిత ధోరణులు సాంఘిక దురాచారాలుగా మారిపోయి సంస్కరణోద్యమాల పేరిట మరో కొత్త తెగ పుట్టుకురావడం ఇంకో విచిత్రం. వైద్యం రోగం కన్నా ప్రమాదకరంగా మారడం డాక్టర్‌జీని కలచివేసింది.

హిందుత్వను సరైన మార్గంలో తీసుకెళ్లే సమైక్య శక్తిని కల్పిస్తే ఈ దేశానికున్న ప్రత్యేకతలు నిలబడుతాయని తొలి సర్‌ ‌సంఘచాలక్‌ ‌భావన. ఈ తలంపు సంఘ్‌ ‌స్థాపనకు దారితీసింది. సంఘ్‌ ‌స్థాపించే నాటికే అనేక సంస్థలు తమ కార్యకలాపాలు ఉధృతంగా నడిపిస్తున్నాయి. దివ్యజ్ఞాన సమాజం, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్‌, ‌హిందూ మహాసభ వంటివి చాలా చైతన్యవంతంగా ఉన్నాయి. ఇందులో ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్‌లో సామాన్య హిందువులకు తగినంత ప్రోద్బలం ఉంది. బ్రహ్మ సమాజం, దివ్య జ్ఞాన సమాజం ‘హైప్రొఫైల్‌’‌ను ఆకర్షించేవి. హిందు మహాసభకు నిరంతర సంఘర్షణ ఉండేది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో మఖలో పుట్టి పుబ్బలో మునిగే సంస్థ పెడితే అనాలోచితం అవుతుందని డాక్టర్‌జీ భావించారు.  త్యాగధనులైన మునీశ్వరుల్లాంటి 15మందితో తన యజ్ఞం ప్రారంభించారు. ఇదొక మిషన్‌లా మారాలని ‘భగవాధ్వజాన్ని’ ముందు పెట్టారు. హిందుత్వంలో దేవుడు పసుపు కొమ్ములోకి గణపతిగా, నీళ్లలోకి  గంగగా, డబ్బులోకి లక్షిగా వచ్చినట్లే ‘ధ్వజం’లోకి భగవాన్‌గా ఆవహించాడు.

ఆ ధ్వజంలో దేవుడు, దేశం రెండూ కలసి ఉన్నాయి. రెండు కొనల అంతరార్థం ఇదే కావచ్చు. లౌకిక, అలౌకిక భావన కూడా ఉండవచ్చు. భగవంతుడి ముందు ‘ఇదం న మమ’ – ఇందు కోసం కాదు విశ్వకల్యాణం కోసం అనే ఆంతరిక దృక్పథంతో ‘నమస్తే సదావత్సలే’ అనే ప్రార్థనను ఆలపించే కోట్లాది గొంతుకల వేదనాదం అప్పుడే మొదలయ్యింది. అదే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌).

ఇప్పుడు నాగపూర్‌ ‌సంత్రాలు మా దగ్గర అమ్ముడుపోవు అన్న నేలకూ సంఘ్‌ ‌వెళ్లి తాకింది. మేం మార్కస్ ‌మానస పుత్రులం అన్న వాళ్ల భూమి మీదకూ పరశురామ వారసత్వంగా వెళ్లి నిలబడి, తలబడింది. దీనికంతా రుషులే ప్రచారకులుగా పుట్టి అందించిన నిస్వార్థ సేవా తత్పరత. వాళ్ల త్యాగాల పునాదుల మీద ఇప్పుడు భారతదేశంవైపు ప్రపంచం చూసే పరిస్థితి వచ్చింది.

డాక్టర్‌జీ తర్వాత మరో రుషీశ్వరుడు జడధారి పరమ పూజనీయ మాధవ సదాశివ గోల్వాల్కర్‌ ‘‌సంఘ్‌’‌కు తాత్త్వికంగా, సిద్ధాంతంపరంగా పూర్ణ స్వరూపం అందించారు. ఆయన తపస్సు దేశమాతోపాసన. గురూజీగా పేరొందిన గోల్వాల్కర్‌ ‌భారతమాతను అర్చించారు. తనయుడిగా తల్లి భారతి వైవిధ్యాన్నీ, విశ్వరూపాన్నీ దర్శించారు. సంస్థను తీర్చిదిద్దుతున్న సమయంలో ‘గాంధీజీ హత్య’ సంఘ్‌ ‌మెడకు చుట్టుకొంది.  జనవరి 30, 1948న గాంధీజీ హత్య జరిగిన సమయంలో మద్రాసులో ఉన్న గురూజీ నాగపూర్‌ ‌వెళ్లిపోయారు. నిజానికి సంఘ్‌ను బలిచ్చే ప్రయత్నంలో నాటి ప్రభుత్వం ఉండగా ‘సంఘం’ మాత్రం తన సచ్చీలతను నిరూపించుకొంది. సంఘ్‌ను నిషేధించినా, సంఘ కార్యకర్తలను, కుటుంబాలను హత్య చేసినా మృత్యువు ముందు నిలబడి దేశం కోసం తపించింది. సంఘ్‌ ‌తరపున ప్రభుత్వంతో ప్రముఖ న్యాయ కోవిదుడు టి.ఆర్‌ ‌వెంకట్రామశాస్త్రి  చర్చలు జరిపిన నేపథ్యంలో జులై 11,1949న నెహ్రూ ప్రభుత్వం సంఘ్‌పై నిషేధం ఎత్తేసింది. జైలునుండి విడుదలైన వెంటనే నేరుగా గురూజీ ఆయన దగ్గరకు వెళ్లారు. గురూజీ కాలంలో సంఘ్‌ ఎం‌త ఎదిగిందో అంతకన్నా ఎక్కువ కష్టనష్టాలకు గురయ్యింది. అయినా ‘సంఘ్‌’ ‌తన పని తాను చేస్తూ పోయింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రారంభం అయ్యాక తేది 25.05.1926 నుండి నిత్య కార్యక్రమాలు శాఖ రూపంలో మొదలయ్యాయి. రాంటెక్‌లో తొలిసారి శ్రీరామనవమి రోజు చేసిన సేవ, వారి కార్యసరళి నేటికీ నిరంతరంగా నడుస్తున్నాయి.

దేశవిభజన సమయం మొదలుకొని కరోనా కష్టకాలపు సేవల వరకు సంఘ్‌ ‌తన విశ్వరూపాన్ని విస్తరించుకొంది. ఎవరు అవునన్నా కాదన్నా అయోధ్య రామ మందిర నిధిని వసూలు చేసే సమయం మొదలుకొని, అక్షతలు ప్రతి భారతీయ గృహానికి చేర్చే పని వరకు తమ భుజస్కంధాలపై వేసుకుని స్వయం సేవకులు చేశారు.  సాధారణ పేద కుటుంబం నుండి వచ్చిన నరేంద్రమోదీ లాంటి వ్యక్తి ఈ దేశ ప్రధానిగా ఉంటూ, ప్రపంచ ఆశాజ్యోతిగా నిలబడ్డాడంటే ఆయన  వెనుక ఉన్న కుటుంబం సంఘ్‌. ‌దేశాన్ని కుటుంబంగా భావించే కార్యకర్తలు  మోదీ వెనకున్న మాట వాస్తవం.

ఆర్‌ఎస్‌ఎస్‌•‌లో వ్యక్తులకు ప్రాధాన్యం లేదు. వ్యవస్థ ఆ సంస్థకు ప్రాణం. సంఘ్‌ ‌దృష్టిలో అనామికత కూడా వ్యక్తిత్వంలో భాగం. నలుగురిని ఓ చోట చేర్చే వ్యక్తి పెద్ద బ్యానర్‌ ‌వేసుకొంటున్న ఈ కాలంలో కూడా భూతలశయనం, శీతలస్నానం చేసే ఓ కార్యకర్త తన పేరు కూడా తెలియకుండా లక్షల మందిని శ్రీరామ శోభాయాత్ర పేరుతో భాగ్యనగర్‌ ‌వీధుల్లోకి తేగలడు. తాను కనిపించాలని ఏకోశానా అనుకోడు. అదే ర్యాలీలో ఓ మూల నిలబడి పరిశీలన చేస్తాడు. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీ సంఘ్‌ ‌సిద్ధాంతాల వెలుగులో పని చేస్తుందంటే సాధారణ విషయం కాదు. అలాగే సామాన్యుల కోసం సంఘ్‌ అతి తక్కువ డబ్బుతో విలువల ప్రాధాన్యతలో పాఠశాలలు, తక్కువ ఖర్చు ఆరోగ్యసేవలు అందించడం చూశాక ప్రపంచంలో ఏ ఎన్జీవో ఇంత గొప్పగా పనిచేయలేదంటే ఆశ్చర్యం కాదు. దేశంలోని చాలా పార్టీల్లో సంఘ్‌ ‌కార్యకర్తలు పనిచేస్తున్నారు. సంఘ్‌ ‌వ్యక్తిత్వం మాత్రమే నిర్మిస్తుంది. వాళ్లను భుజాలపై మోయదు.

గదర్‌పార్టీలా ఇది విప్లవం కాదు. గాంధీలా సత్యాగ్రహం కాదు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం… సంఘ్‌ ‌వ్యవస్థలతో వ్యాపారం చేయదు. సేవ మాత్రమే చేస్తుందని దేశం నమ్మిన నిజం. డబ్బు ఆశించకుండా దేశం కోసం సమయమిచ్చే ఏకైక సంస్థగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక నీలి నీడలు కమ్ముకొన్నా జ్ఞాన సూర్యుల ప్రసరణతో ఎప్పటికప్పుడు మబ్బులు తొలగిపోయాయి.

సెక్యులరిజంతో దేశం సుమారు 65 ఏళ్లు అనుభవించిన సంతుష్టీకరణ వెనుక దాగిన ముసుగును సంఘ్‌ ‌ఛేదించగలిగింది. ఉడుతా యత్నంగా ప్రతీ రంగంలోకి ‘సంఘ్‌’ ‌ప్రవేశించగల్గిందంటే అనుశాసనం (క్రమశిక్షణ) త్యాగం, ఉద్దేశం అనుపమానం కాబట్టే. ఈ దేశ ఆత్మ హిందుత్వను మేల్కొల్పిన సంఘ్‌ ‌మీద ప్రతిరోజు రాహుల్‌ ‌గాంధీ, ఖర్గేలు ఆరోపణలు చేయడం సూర్యుడిపై దుమ్మెత్తిపోయడమే. సంఘ్‌ ‌విరాడ్రూపం ముందు వేసే రాజకీయ క్రీడలు రాహుల్‌కు అర్థం కావాలంటే గాంధీ హత్యానంతరం, ఎమర్జెన్సీ అనంతరం సంఘ్‌ ‌పాత్రను గురించి అధ్యయనం చేస్తే మంచిది. మోదీతో ఖర్గేకు రాజకీయ వైరం ఉండొచ్చు. దానిని రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇందులోకి సంఘ్‌ను లాగితే కమ్యూనిష్టులకు పట్టిన గతే పడుతుంది. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విషయంలో కాంగ్రెస్‌కు ఈ పాఠాలన్నీ కమ్యూనిష్టులు నేర్పించినవే. ఇపుడు మార్కస్, ‌నెహ్రూ మసకబారారు. వివేకానంద, శివాజీలు సాఫ్టవేర్‌ ఇం‌జనీర్లుగా యువత రూపంలో కొత్త అవతారంలో వస్తున్నారు. డెబ్బైఏళ్లు దాటుతున్న మోదీ యువకుడిగా ఆలోచిస్తుంటే, యువకుడైన రాహుల్‌ ‌పాతబడిన ఆలోచనలు చేయడం రాజకీయ ఆత్మహత్యే.

-డా।।పి.భాస్కరయోగి

కాలమిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE