ఒకనాడు దేశంలో ఒక మహా విపత్కర పరిస్థితి ఏర్పడింది. హిందువులు సామాజిక ఏకత్వాన్ని మరచిపోయి వికృత మత సిద్ధాంతాలలో మునిగిపోయి, స్వార్థానికి, లౌకిక భోగాలకు దాసులై జీవితాన్ని గడపసాగారు. భరతభూమిలో ధర్మగ్లాని సంభవించింది. ఆనాడు పూజ్యపాదులు శ్రీ శంకరాచార్యులు ఉద్భవించారు. వారు అద్వైత మత ప్రవర్తకులే. కాని వారు చేసింది ధర్మప్రతిష్ఠాపన. వికృత రూపం ధరించిన సంప్రదాయాలను నిరసించి, సత్‌సంప్రదాయాలను అమోదించి, అనుష్టింపజేపి సమాజ సమైక్యతను సాధించారు. ఏ ప్రయాణ సౌకర్యాలు లేని రోజులలోనే దేశమంతటా మూడు పర్యాయాలు పర్యటించి, నలుమూలలా మఠాలను ఏర్పరచి సమాజ యోగ క్షేమాలకు చక్కని వ్యవస్థను ఏర్పరిచారు.

మరి ఈనాడో – పచ్చి స్వార్ధం, బానిస మనస్తత్వం నరనరాన జీర్ణించిపోయి, హిందూ జాతిలో ధర్మగ్లాని సంభవించింది. సమాజాన్ని సుఖశాంతులతో వెలయింపజేసే ధర్మం జాతి జీవితానికి దూరం కావడంతో అనేక విధాలయిన అలజడులు, అపోహలు, అసూయ, విద్వేషాలు పెచ్చుపెరిగాయి. ఆ దురవస్థ నుండి హిందూజాతిని సముధ్ధరించడానికి 1906లో మరల ఒక మహా పురుషుడు ఉద్భవించినాడు, ఆయన మాధవరావు సదాశివరావు గోల్వల్కర్‌. అనుయాయులు ‘గురూజీ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. రైలుపెట్టే స్వగృహంగా 33 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ప్రతి సంవత్సరం రెండేసి సార్లు పర్యటించి ధర్మ ప్రబోధం చేసిన మహనీయుడు గురూజీ. ధర్మప్రతిష్ఠాపనకు స్థిరమైన ధృఢమైన పునాదులు వేసిన మహర్షి గురూజీ.
గురూజీ రామకృష్ణ పరమహంస శిష్యులైన స్వామి అఖండానంద శిష్యులుగా స•న్యాస దీక్షను స్వీకరించి వారి ఆశ్రమంలో ఆరు నెలలపాటు ఆధ్యాత్మిక సాధనను సాగించారు. అయితే స్వంత మోక్షం కోసం తపోసాధనలో గడపడానికి ఉద్దేశించిన జీవితం గాదు గురూజీది. స్వామి అఖండానంద నిర్యాణం తరువాత గురూజీ నాగపూర్‌ ‌తిరిగి వచ్చారు. అంతకు ముందే రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతోనూ, దాని నిర్మాత పరమ పూజనీయ హెడ్గేవార్‌తోనూ వారికి గల సంబంధం ధృఢతరం కాసాగింది. డాక్టర్‌జీ అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ అయ్యారు. చివరిక్షణం వరకు హిందూ సముద్ధరణ కోసం, హిందూ సమాజ సంఘటన కోసం, నిర్విరామ కృషి చేశారు. నిజమయిన సన్యాసి వారు. కాదు కాదు మహాయోగి, మహర్షి. కాని వారు కాషాయాంబరాలు, దండకమండలాలు ధరించలేదు. వేదాంత చర్చలకు యోగ సాధనలకు భగవన్నామ సంకీర్తనలకు జీవితాన్ని అంకితం చేయలేదు. గురూజీ సేవించిన భగవంతుడు సాక్షాత్తుగా, సజీవంగా సాకారంగా, నిలచిన పరమేశ్వరుడు. గురూజీకి అత్యంత భక్తి పాత్రమయినది ఆ సమాజ పరమేశ్వరుని పాదాలు- సమాజంలో అట్టడుగున నిలచిన జన సమూహాలు.
సమాజంలో కాలక్రమేణ చొచ్చుకొని వచ్చిన భ్రష్టాచారాలు, సాంఘిక దురాచారాలు చూచి వారి మనసు క్షోభించేది.కొందరిని అంటరానివారని దూరం చేయడం వారికి సుతరాము నమ్మతంగాదు. నిష్కారుణమైన ఈ దురాచారాన్ని తొలగించడానికి ఎంతో కృషి చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో హిందువులంతా ఒక్కటే అనే సమత్వభావన ఆచరణ పూర్వకంగా కన•బడుతున్నది. కాని యావత్తు హిందూ సమాజం ఇది ఆచరించాలి. అందుకోసం హిందువు హృదయాంతరాళం నుండి తరతరాలుగా తిష్ఠవేసుకు కూర్చొన్న ‘అస్పృశ్యతను పాటించకపోవడం అధర్మం’ అనే వికృత భావన తొలగాలి. దానికి సాధనం ధర్మగురువులు, మఠాధివతులు, పీఠాధిపతులు మొదలయిన వారు అస్పృశ్యతను నిరసించడం ఒక్కటే. ఈ కార్యాన్ని వారు సాధించారు. 1969 డిసెంబరులో ఉడిపిలో జరిగిన కర్ణాటక ప్రాంత విశ్వహిందూ పరిషత్‌ ‌మహాసభలలో వివిధ పంథాలకు చెందిన ధర్మాచార్యులు, గురువులు అస్పృశ్యతను నిరసిస్తూ ‘‘హైందవాః సోదరాస్సర్వే’’ అని ప్రకటించారు. దీనికి మూలకారణం గురూజీ అని చెప్పడం అనవసరమే. ఆనాడు ఆ సమావేశంలో పాల్గొన్న ఆర్‌. ‌భరణయ్య (పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమీషన్‌ ‌సభ్యులు, అస్పృశ్యులనే వర్గానికి చెందిన వారు) గురూజీని కౌగలించుకొని, సంతోష బాష్పాలు రాలుస్తూ రుద్ద కంఠంతో ‘‘గురూజీ, మాకోసం ఈ మహాకార్యాన్ని స్వీకరించిన మీరెంత మంచివారు. మీరొక్కరే ఈ కార్యాన్ని సాధించగల సమర్థులని నా విశ్వాసం’’ అన్నారు.
‘‘హిందూ ధర్మం నుండి ఏ కారణంచేతగానీ పతనం చెందిన వ్యక్తి ఇక శాశ్వతంగా ధర్మానికి దూరం గావలసిందే’’ అనే ఒక భావన ఉంది. ఇది ఆత్మహత్యాసదృశ్యం. గౌహతిలో విశ్వహిందూపరిషత్‌ ‌మహాసభలో మాట్లాడుతూ గురూజీ ఇలా అన్నారు. శతాబ్దాలుగా వర మతావలంబులైన మన సోదరులను దూరంగా నెట్టి వేసే ఒక దురాచారానికి స్వస్తిపలికించి, మరల మాతృధర్మం ఒడిలో చేరే భాగ్యాన్ని వారికి కలిగింపచేయడం యుగ ప్రవర్తకు నకే చెల్లుతుంది. ఈనాడు విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో వేనవేలుగా క్రైస్తవులు, మహ్మదీయులు తిరిగి హిందూధర్మాన్ని స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్‌ ఆవిర్భావానికి గురూజీ కృషి అగ్రగణ్యమయినది. వారు పరిషత్‌ ‌సంస్థాపక ధర్మకర్తలుగా చివరి క్షణం వరకు మార్గదర్శనం చేసారు.
హిందూ సామాజిక వ్యవస్థకు మూలమయిన జీవనతత్త్వాన్ని విశ్లేషించి ఆధునిక యుగానికి అన్వయించిన ప్రతిభాశాలి గురూజీ. ‘నిత్యానిత్య వస్తు వివేకము’ వేదాంతపరమయిన అర్థంలో గాక, సామాజికపరంగా ఇట్లా అన్వయిస్తారు వారు. ‘సమాజంలో పుట్టి పెరిగి నశించిపోయే వ్యక్తి అనిత్య వస్తువు. కాని అనేక వ్యక్తుల నముదాయంగా వెలసిన సమాజం నిత్యం అనంతంగా సాగుతునే ఉంటుంది. ప్రతివానికి ఈ వివేకం కావాలి. అనిత్యమైన వ్యక్తి స్వార్థం కంటె నిత్య వస్తువు అయిన సమాజ శ్రేయస్సుకు అగ్రస్థానం ఇవ్వవలసి ఉంటుంది’. వారి ఆ భావన ఫలితమే ఈ నాడు హిందువు శతాబ్దాల గాఢ నిద్రను వదలి ప్రతి క్రియాత్మక ఆలోచనలకు స్వస్తి చెప్పి సనాతన ధర్మ ప్రాతిపదికపై నవనవోన్మేష మయి న సృజనాత్మక ఆలోచనలలో ఉరకలు వేస్తూ ముందడుగు వేస్తున్నాడు. భాషా ప్రాంత వర్ణవర్గాది భేదాలతో సతమత మవుతూ పవిత్ర భారత సవిత్రి సమగ్ర స్వరూపాన్ని దర్శించలేకపోయిన హిందువు ఈనాడు వాటిని అధిగమించి అఖిల భారత దృష్టితో చూడగలుగుతున్నాడు. గురూజీ జీవితాంతము కృషి చేసినది ఈ హిందూ సంఘటన కోసమే. దాని ద్వారా ప్రపంచంలో శాంతి సౌభాగ్యాల సంరక్షణ కోసమే. ‘‘ఏకం సత్‌ ‌విప్రా బహుధా వదంతి’’ (ఉన్నది ఒకే సత్‌ ‌స్వరూపము. దానిని జ్ఞానులు పరిపరివిధాలుగా చెబుతారు) అంటూ సర్వమత సత్యత్వాన్ని సమాదరణీయతను ఉద్ఘాటించిన విశాల హిందూ ధర్మమొక్కటే శాంతిస్థాపన చేయగలుగుతుందనడం నిర్వివాదాంశం.
ఈ దేశంలో ఎందరెందరో మహానీయులు గురూజీ వ్యక్తిత్వంతో ప్రభావితులయ్యారు. వారితో సన్నిహిత సంబంధము నెరపిన వ్యక్తులు కాంగ్రెస్‌, ‌సోషలిస్ట్, ‌జనసంఘ్‌ ‌మొదలయిన రాజకీయ పార్టీలన్నిటిలో ఉన్నారు. అన్ని ధార్మిక సంస్థలలోనూ ఉన్నారు టీఆర్‌ ‌వెంకటరామశాస్త్రి. డాక్టరు ప్రకాశ, కేఎం మున్షీ, మాస్టర్‌ ‌తారాసింగ్‌, ‌కంచి కామకోటి శంకరాచార్యులు ఇలా ఎందరెందరో. వారి ప్రభావం ఆకాశంలా అందరినీ ఆవరించింది. రోజుకు ఒక్క పర్యాయం మాత్రమే అతి స్వల్పంగా భుజిస్తూ రెండు మూడు గంటల పాటు మాత్రమే నిద్రిస్తూ ముఫ్ఫై మూడు సంవత్సరాల నిరంతర పర్యటనల శ్రమకు ఓర్చగలిగిన గురూజీ మహాయోగి. వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ద్వారా చేసిన కృషి హిందువులకు తాము మరచిపోయిన ‘‘సంఘచ్ఛధ్వం సంవదధ్వం…’ అనే వైదిక సూక్తిని గుర్తుకు తెచ్చి ఆ ప్రకారంగా కలసికట్టుగా మాటలలో చేతలలో నడకలో ఆలోచనలలో వ్యవహరించేటట్లు చేయడం. అట్టి వ్యక్తులను లక్షల సంఖ్యలో నిర్మాణం చెయ్యడం. వారు ఉద్దేశించినది హిందూ సమాజం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒకటే అయిపోవాలని. ఈనాడు వారు లేకపోయినా వారు వెలిగించిన ధ్యేయజ్యోతి అనేక హృదయాలలో కాంతిపుంజాలను వెలార్చుతూనే ఉన్నది. వారీనాడు ఒక్క శరీరంతోగాక అనేక లక్షల శరీరాలతో తమ కార్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గురూజీ భారతజాతిలో భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఒకసారి ఇలా అన్నారు ‘‘ఒక మహాసౌధానికి పైన మెరసిపోయే శిఖరం మీద ఒకకాకి కూడా కూర్చోవచ్చు. కాని ఆ మహాసౌధాన్ని పెను తుపానుకు కూడా చలించకుండా ఉంచిన పునాదిలోని రాయి కావడం అందరికీ సాధ్యం కాదు. ఆ రాయి మన ఆదర్శం.’’ వాస్తవానికి వారు అదేవిధంగా తమజీవితంలో అనుక్షణం జీవించారు. భావిచరిత్ర వారికి యోగ్యమయిన స్థానాన్ని ఇస్తుందనడంలో సందేహంలేదు.

ఏ.ఈ. పురుషోత్తమరావు
25.02.1974 ‘జాగృతి’ నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram