కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టారు. గత బడ్జెట్‌కు భిన్నంగా 2047 నాటికి ‘వికసిత్‌ ‌భారత్‌’ ‌సాధనే లక్ష్యంగా, సమగ్రాభివృద్ధి దిశగా రూపొందించిన ‘సమీకృత సమ్మిళిత’ బడ్జెట్‌ ఇది. ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో భారత్‌ను అగశ్రేణికి చేర్చడానికి సమ్మిళిత సమగ్రాభివృద్ధిపై బడ్జెట్‌ ‌దృష్టి పెట్టింది. ప్రధానంగా నాలుగు వర్గాల సంక్షేమంపై ఇది దృష్టి పెట్టింది. వారు- పేదలు, మహిళలు, అన్నదాతలు, యువత. వీరు పురోగమిస్తే దేశం పురోగమిస్తుంది. కేవలం 10 ఏళ్లలో దేశ ఆర్ధికవ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్ధిక వ్యవస్థగా వృద్ధి చెందేలా కృషి చేశామని నిర్మలా సీతారామన్‌ ‌పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టినదే అయినా ఈ బడ్జెట్‌లో ఎలాంటి జనాకర్షక పథకాలు లేకపోవడం గమనార్హం.

సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమానావకాశాలు, వనరులు అందాయి. వనరుల కేటాయింపు కంటే ఎక్కువగా ఫలితాల సాధన పై దృష్టి పెట్టడం వల్ల గత 10 ఏళ్లలో 25 కోట్లమందికి పేదరికం నుండి విముక్తి లభించింది. 2014తో పోలిస్తే తలసరి ఆదాయం రెట్టింపయి, ప్రస్తుతం రూ. 1.74 లక్షలకు చేరిందని నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. సాంకేతిక విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే బడ్జెట్‌ ‌లక్ష్యమని మంత్రి తెలియచేశారు. ఈ లక్ష్య సాధనకు ప్రజా భాగస్వామ్యం (జన్‌ ‌భాగి దారి) సబ్‌ ‌కా సాథ్‌, ‌సబ్‌ ‌కా ప్రయాస్‌ (అం‌దరితో కలిసి అందరి కృషి) సబ్‌ ‌కా వికాస్‌ (అం‌దరివికాసం) అవసరాన్ని గుర్తించారు. పౌరులకు విస్తృత అవకాశాలు కల్పించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు, వృద్ధి రేటు పెరుగుదల, స్థిరమైన సూక్ష్మ ఆర్థికవ్యవస్థ బలోపేతం వంటి చర్యలతో బడ్జెట్‌ ‌లక్ష్యాల సాధనకు కేటాయింపులు చేశారు.

ప్రాధాన్యాలు

మధ్యంతర బడ్జెట్‌ను ఏడు ప్రాధాన్యలతో రూపొందించారు.1. సమ్మిళిత అభివృద్ధి, 2. చివరి వ్యక్తి వరకూ లబ్ధి చేకూర్చడం 3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, 4. ప్రజల శక్తిని వినియోగించడం, 5. గ్రీన్‌ ‌గ్రోత్‌ (‌పర్యావరణ అనుకూల వృద్ధి), 6. యువశక్తి, 7. ఆర్థికరంగం. కాగా బడ్జెట్‌లో జనరంజక నిర్ణయాలు, పథకాలు ప్రకటించలేదు. ద్రవ్యలోటు తగ్గింపునకు ప్రాధాన్య మిచ్చారు. రూ.11.11 లక్షల కోట్లు కేటాయించి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. సమ్మిళిత వృధ్దే లక్ష్యంగా ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యమిచ్చారు.

గృహ నిర్మాణం, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహకాలు ప్రకటించారు. బడ్జెట్‌లో మహిళలు, యువత, స్వయం సహాయక బృందాల మహిళల సాధికారిత సాధనకు బడ్జెట్‌ ‌కేటాయింపులు ఉన్నాయి. పరిశోధనలకు ఆవిష్కరణ లకు లక్ష కోట్ల రూపాయలు కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయమని ఆర్థిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి అభివృద్ధి వ్యూహాలతో స్థూల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధికి మార్గం చూపిన బడ్జెట్‌గా పేర్కొనవచ్చు. దేశంలో ఆసుపత్రులకు మౌలిక సదుపాయాల కల్పన, వైద్య కళాశాలల ఏర్పాటు ప్రత్యేక కమిటీ ఏర్పాటు హర్షణీయం.

9-14 సంవత్సరాల బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ ‌నిరోధక టీకాలు ఇచ్చే పథకం వల్ల యేటా దేశంలో 80 వేల మందికి ఈ రకం క్యాన్సర్‌ ‌నుండి విముక్తి లభిస్తుంది. మాతాశిశు సంరక్షణకు ఉన్న పథకాలను ఒక సమీకృత కార్యక్రమం కిందికి తీసుకురావడం, మెరుగైన పోషకాహార పంపిణీ, ఆశా వర్కర్స్, అం‌గన్వాడీ కార్యకర్తలు, సహాయకులను ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌కింద ఆరోగ్య బీమా కల్పన చర్యలు, మహిళల ఆరోగ్య పరిరక్షణకు, ఆర్థిక సాధికారతకు ఉపకరిస్తుంది. ఇంకా మానవవనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది. దాదాపు 55 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుంది.

గతంలో ఎన్నడూ లేనట్లు పాఠశాల విద్య అక్షరాస్యత విభాగానికి కేంద్ర ప్రభుత్వం రూ.73,498 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి శ్రీ పథకానికి రూ. 6050 కోట్లు, సమగ్ర శిక్షా అభియాన్‌, ‌కేంద్రీయ విద్యాసంస్థలకు, నవోదయ విద్యాలయాలకు అధిక నిధులు ఇవ్వడం వల్ల విద్యారంగ అభివృద్ధి సాధ్యమే. ఉన్నత విద్యకు బడ్జెట్‌లో రూ. 9,624 కోట్ల మేరకు కోత విధించింది.

 నూతన ఆవిష్కరణలు నైపుణ్యం పెరిగి మానవ వనరుల అభివృద్ధికి దోహదపడతాయి. వ్యవసాయ రంగం, సహకార రంగానికి ప్రాధాన్యం, వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థ, అభివృద్ధికి వ్యవసాయ అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు పెరిగాయి. చేపల పెంపకం, పాల ఉత్పాదకత, ఆహార శుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ రంగాన్ని అభివృధి పరిచేందుకు ప్రైవేట్‌- ‌పబ్లిక్‌ ‌పెట్టుబడులకు ఆహ్వానం, నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం, వంటనూనెల తయారీలో ఆత్మనిర్బరత సాధనకు వ్యూహాల రూపకల్పన, వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సోయా, సన్‌ ‌ఫ్లవర్‌ ‌పంటలకు ప్రోత్సాహం ఈ బడ్జెట్‌లో కనిపిస్తుంది. అధిక దిగుబడులు ఇచ్చే ఆధునిక సాగు పద్ధతుల వినియోగం, మార్కెట్‌ అనుసంధానం, పంటల బీమా, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు వంటి పథకాలతో పాడిరైతులను ఆదుకునే చర్యలు వారికి లాభం చేకూరుస్తాయి. 11.8 కోట్ల మందికి పీఎం సమ్మాన్‌ ‌యోజన కింద ఆర్థికసాయంతో 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు.

వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల ప్రోత్సాహం

 గ్రామీణ ప్రాంతాలలో ఔత్సాహిక యువతను వ్యవసాయ స్టార్టప్‌ల ఏర్పాటు చేసేలా ప్రోత్స హించడం కోసం సహకార వ్యవసాయాభివృద్ధి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనితో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రకృతి వ్యవసాయం, రైతులకు సహకార పరపతి అందించడం, నూతన సాంకేతిక నైపుణ్యంతో కూడిన సేంద్రీయ వ్యవసాయం విధానాన్ని అమలు చేయడం దీని ఉద్దేశం.

వ్యవసాయాధారిత పరిశ్రమలు

ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన, కిసాన్‌ ‌డ్రోన్స్ ఏర్పాటు ద్వారా రైతులకు ప్రభుత్వ-ప్రైవేట్‌ ‌భాగస్వామ్యంతో డిజిటల్‌ ‌హైటెక్‌ ‌సేవలను అందిం చడం, సస్యరక్షణ పిచికారి సేవలు, భూదస్త్రాల డిజలీటీకరణ వంటివి గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే చర్యలుగా పేర్కొనవచ్చు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 86 వేల కోట్ల కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 43 శాతం ఎక్కువ. జాతీయ జీవనోపాధి మిషన్‌ అజీవికకు రూ. 15,047 కోట్లు కేటాయించారు.

మహిళా సాధికారిత

మహిళలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘లఖ్‌పతి దీదీ’ పథకం లక్ష్యాన్ని 3 కోట్లకు పెంచారు. దీనిలో స్వయం సహాయ బృందాలకు శిక్షణ ఇస్తారు. తద్వారా వారు ఏటా లక్ష రూపాయల ఆదాయం పొంది ఆర్థిక సాధికారిత సాధిస్తారు. యువత సాధికారిత, సాంఘిక సంక్షేమం అన్ని రంగాలలో పౌరులకు అవకాశాల కల్పన, ఉద్యోగాల కల్పన, నైపుణ్యం మెరుగుపరిచే దిశగా అడుగులు వేసిన బడ్జెట్‌ ఇది అని చెప్పవచ్చు. యువతలో ఉన్న సామర్ధ్యాన్ని వెలికితీయడం, ప్రపంచ స్థాయిలో ప్రతిభాపాటవాల వికాసానికి బడ్జెట్‌ ‌చేయూతనిస్తుంది.

ఆదాయపు పన్ను

ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను స్లాబ్‌లను 6 నుంచి 5కు తగ్గించారు. ఆదాయ పన్ను పరిమితి 6 లక్షల నుండి 9 లక్షల వరకు పెంచారు. గతంలో 10శాతం పన్ను చెల్లించే దాన్ని బడ్జెట్లో ఎత్తివేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను కార్పొరేట్‌ ‌పన్నులలో మార్పు లేదు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 75 వేల కోట్ల•, రైల్వేల అభివృద్ధికి రూ. 2.4 లక్షల కోట్లు, కొత్త రైల్వేల నిర్మాణానికి, మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయింపులు చేశారు. రైల్వేలో 3 కొత్త నడవాల ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు. దీని వల్ల సరుకు, ప్రయాణికుల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి.

మెట్రో నహా భారత్‌ ‌రైళ్ల విస్తరణ

 ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌ను 3 కారిడార్లుగా విభజించి రైల్వే బడ్జెట్‌ ‌రూ. 25,5,393 కోట్లుగా ప్రకటించారు. 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్‌ ‌స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అప్‌‌గ్రేడ్‌ ‌చేయడం వల్ల ప్రయాణికులకు సౌకర్యం వంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఇళ్లపై రూఫ్‌ ‌టాప్‌ ‌సోలార్‌ ఏర్పాటు చేసుకున్న వారికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించే అవకాశం కల్పించారు. దీనివల్ల ఏడాదికి రూ.15 వేల నుండి 18 వేలు ఆదా చేసుకోవచ్చు. 149 విమానాశ్రయాలు ఉన్న పౌర విమానయాన రంగానికి బడ్జెట్‌లో రూ.2,300 కోట్లు కేటాయించారు. 22 విమానాశ్రయాల పునరుద్ధరణ, 124 వాయుమార్గాలను ప్రారంభించి ఈశాన్య ప్రాంతాలతో అనుసంధానం చేస్తారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద రూ.13.7 లక్షల కోట్లు, పీఎం ఆవాస యోజనకు రూ.79 వేల కోట్లు కేటాయించడం వల్ల ఆర్థికవ్యవస్థలో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుంది.

విద్య వైద్య రంగాలకు పెద్ద పీట

 వైద్య, విద్యా రంగాలలో నెలకొన్న సమస్యలను పారదోలడం లక్ష్యంగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. వైద్య, మందుల, పరికరాలు, ఔషధ పరిశ్రమకు ఇస్తున్న పన్ను మినహాయింపు, పరిశోధనను ప్రోత్సహించడం ఇందుకే. ఇక వ్యవసాయంలో నానో యూరియా విజయవంతం కావడంవల్ల నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహి స్తారు. ఎరువులపై రాయితీ 8 శాతానికి తగ్గించారు. అయితే పంటలకు సాగునీటి పొదుపు, సూక్ష్మ సేద్యం పథకానికి, బిందు తుంపర్ల పరికరాలపై రాయితీలు లేవు.

ఆపరేషన్‌ ‌గ్రీన్‌ ‌పథకం కింద టొమేటో, ఉల్లిగడ్డ, మరో22 ఆహార పంటలకు పంట శుద్ధి నిల్వ సదుపాయాల జోలికి పోలేదు. ఇప్పటి వరకు 19 పంటలనే గుర్తించారు. జాతీయ ఎలక్ట్రానిక్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ (ఈనామ్‌) 1000 ‌కొత్త మార్కెట్లను ఆన్‌లైన్‌ ‌పరిధిలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు లేక పోవడం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయదారుల ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించని స్థితి రైతాంగాన్ని నిరాశకు గురిచేసేదేనన్న అభిప్రాయం ఉంది.

గల్ఫ్ ‌దేశాల్లో సమస్యలను ఎదుర్కొనే ప్రవాస భారతీయ మహిళల సహాయార్థం వన్‌ ‌స్టాఫ్‌ ‌సెంటర్‌ ‌నెలకొల్పే ప్రకటనకు నిధులను కేటాయించలేదు. నిర్భయ నిధి మీద దయ చూపలేదు. నూతన పాస్‌పోర్ట్ ‌కేంద్రాల ఏర్పాటు, భవనాల నిర్మాణ ప్రసక్తి లేదు. నదుల అనుసంధానం కోసం బడ్జెట్లో రూ।। 3500 కోట్లు కేటాయించారు. నిధుల కొరత వల్ల నదుల అనుసంధానం ఏళ్లు పట్టవచ్చు.

అన్న దాత సంరక్షణ యోజన, రైతు ఉత్పత్తి సంఘాలకు వడ్డీ రాయితీలకు నిధులు భారీగా పెంచారు. పరిశోధనలకు రూ. లక్ష కోట్లతో కార్పస్‌ ‌ఫండ్‌ ఏర్పాటు వల్ల స్టార్టప్‌ ‌పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచేందుకు వీలుగా పబ్లిక్‌ ‌ప్రైవేట్‌ ‌రంగాన్ని ప్రోత్సహించాలని బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందించేందుకు కార్పస్‌ ‌ఫండ్‌ ఏర్పాటు చేయడం వల్ల పరిశోధన, అభివృద్ధి వేగవంతమై, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన బడ్జెట్‌ ఇది. 2047 నాటికి భారత్‌ అభివృధ్ది చెందిన దేశంగా ఎదిగి, ప్రపంచంలో తృతీయ ఆర్థికశక్తి స్థాయికి చేరుకొని, సామాజిక న్యాయాన్ని నినాదంగా కాకుండ ఒక విధానంగా పాటించి భారత్‌ను విశ్వగురు స్థాయికి ఎదిగేలా చేస్తుందని ఆశిద్దాం.

నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ‌ఫోరం, కరీంనగర్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram