ఫిబ్రవరి 16 రథ సప్తమి

సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను సాక్షాత్తు శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణాలుగా భావించి ఆరాధిస్తారు. సూర్యుడు క్రమశిక్షణకు మారుపేరు. సమయపాలనలో,కర్తవ్య నిర్వహణలో యుగాయుగాలకు స్ఫూర్తిప్రదాత. ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

సూర్యభగవానుడు కర్మసాక్షి. సకల లోకాలకు ఆత్మస్వరూపుడు. ‘సర్వం సూర్యమయం జగత్‌’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. కాలస్వరూపుడు.. కాలానికి అధిపతి. సూర్యగమనాన్ని అనుసరించే సంవత్సర కాలం ఉత్తర దక్షిణాయనాలుగా విభజితమైంది. సూర్యుడు త్రిసంధ్యలలో రుక్‌ ‌యజు సామవేద మంత్రాల ప్రభావంతో కాంతిని అందిస్తున్నట్లు పురాణ కథనం. ఆ కారణంగానే సూర్యుడికి ‘త్రయితను’( మూడు వేదాలు దేహంగా కలవాడు)అని పేరు వచ్చింది.

అదితి కశ్యపులకు మాఘ శుద్ధ సప్తమినాడు రోహిణి నక్షత్రంలో సూర్యభగవానుడు జన్మించాడు. ఈ పర్వదినాన్ని ‘సూర్య జయంతి’ అని వ్యవహరి స్తారు. ఈ తిథి నాడే రథాన్ని అధిరోహించడం వల్ల ‘రథసప్తమి’ అని పేరు వచ్చిందని మత్స్యపురాణం పేర్కొంటోంది. దీనినే మహాసప్తమి, భానుసప్తమి, అచలాసప్తమి అనీ వ్యవహరిస్తారు. ఆయన ఉత్తర దిశ ప్రయాణం ఈ రోజునే మొదలవుతుంది.

సప్తాశ్వాలు పూన్చిన సూర్యుని ఏకచక్రరథం ఒక దిశలో పయనించే కాలం సంవత్సరంగా కాగా, ఆ చక్రం ఇరుసును వృత్తభాగంలో కలిపే ఆరు రేఖలూ ఆరు రుతువులు, ఏడు అశ్వాలను (గాయత్రి, త్రిష్టువు, అనుష్టువు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు) ఏడు రంగుల కాంతికిరణాలుగా భావిస్తారు. ద్వాదశ ఆదిత్యులు (పన్నెండుగురు) అని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. తీక్షణతను బట్టి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్యుడు సారథ్యం వహిస్తాడు. ఆ ప్రకారం, ఆయన జన్మతిథి (రథసప్తమి) వచ్చే మాఘ మాసంలోని ఆదిత్యుడిని ‘పూషుడు’అనే పేరుతో వ్యవహరిస్తాడు. చైత్రంలో ధాత, వైశాఖంలో అర్యముడు,జేష్ఠంలో మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు, ఆశ్వయుజంలో త్వష్ట, కార్తికంలో విష్ణువు, మార్గశీర్షంలో అంశుమంతుడు, పుష్యంలో భగుడు, మాఘంలో (రథసప్తం మాసం) పూషుడు, ఫాల్గుణంలో పర్జన్యుడు…పేర్లతో ఆయా నెలల్లో ప్రాతినిధ్యం వహిస్తాడు.

చంద్రుడు మఘ నక్షత్రంలో ఉండే మాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. ‘అఘం’ అనే సంస్కృత రూపానికి ‘పాపం’ అని భావం.మాఘం అంటే పాపాలను నశింపచేసేది. యజ్ఞయాగాదులకు అనువైనది, మాధవ ప్రీతికరమైనదని చెబుతారు.

రథసప్తమి ప్రత్యేకత గురించి ‘వ్రతచూడామణి’ పేర్కొన్న ప్రకారం, ఆరోజు సూర్యోదయానికి ముందే నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నదీతీరంలో కాని, చెరువులో కానీ వదిలి, జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలమీద ఉంచుకుని స్నానం చేయాలి (ఆధునిక యుగకాలంలో ఆ వెసులుబాటు లేనందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లే శరణ్యం) దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు, తేజస్సు పెంపుతో పాటు చర్మరోగాలు, జన్మాంతర సప్తవిధ పాపాలు (ప్రస్తుత, గత జన్మల పాపాలు, మాట, మనసు, శరీరంతో చేసిన పాపాలు,తెలిసీ తెలియక చేసినవి) నశిస్తాయని , ఆ రోజు సూర్యోదయ సమయ స్నానం సూర్యగ్రహణం నాటి స్నానమంత ఫలితం లభిస్తుందని విశ్వాసం.

రవి మకరరాశిలో ఉన్నప్పుడు వచ్చే సప్తమి సమయంలో సూర్యకిరణాలు నేలపై పుష్కలంగా పడతాయని, ఆ శక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లు, పారే నీటిపైన ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అందుకే రథసప్తమి నాటి స్నానపూలు విశిష్టమైనవని అంటారు. సూర్యపదానికి ‘అర్క’ అనే పర్యాయపదం కూడా ఉంది. ఆయనకు ప్రీతికరమైన జిల్లేడు అకులను ‘అర్కపత్రాలు’ అని, రేగు పండ్లను ‘అర్క ఫలాలు’అని సంబోధిస్తారు. ఈ రెండింటి•ని తల/భుజంపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల ఏడు జన్మల పాపకర్మలు నశిస్తాయని పురాణాలు చెబుతుండగా, దీనివెనుక ఆరోగ్యరహస్యాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. సూర్య కిరణాలు పడిన జిల్లేడు ఆకులు, రేగుపళ్లతో స్నానం చేయడం వల్ల తరువాత వేసవిలో వేడిని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుందని వారు వివరిస్తున్నారు చిక్కుడు ఆకులలో నైవేద్యం సమర్పించడం వల్ల ఆ ఆకుల్లో ఉండే ఆరోగ్య రసాలు పదార్థాల్లోకి చేరి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కేవలం రథసప్తమి నాడే కాకుండా ఏడాదంతా రోజుకు కొద్దిసేపు సూర్యకిరణాలు పడేలా గడిపినా, శరీరానికి అవసరమైన డి విటమన్‌ అం‌దుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

భాస్కరుడు నిత్యానుసంధానీయుడు. మరీ ముఖ్యంగా మాఘ మాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనను మరింత ప్రత్యేకతగా చెబుతారు. ఆదివారాలలో సూర్యనమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. సూర్యారాధన, సూర్యనమస్కారాల వల్ల జ్ఞానం, సద్గుణం, వర్చస్సు, బలం, ధనం, సంతానం, పాపనాశనం, సకల రోగ నివారణ, ఆయుర్వుద్ధి కలుగుతాయని రుగ్వేద వచనం. అందుకే ఆయన పుట్టిన తిథి ‘రథ సప్తమి’ని ‘ఆరోగ్య సప్తమి’ అనీ అంటారు. ఆయన కృప కోసం ‘అరుణపారాయణం’ చేస్తారు.

సూర్యారాధన అనాదిగా వస్తున్నదే. అవతార పురుషులు శ్రీరామ, శ్రీకృష్ణుడు సహా అనేకులు ఆయనను అర్చించారని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షి అనుగ్రహంతో పొందిన ఆదిత్య హృదయస్తోత్ర పఠనంతోనే లంకేశ్వరుడిపై విజయం సాధించాడని, నవమ బ్రహ్మగా వినుతికెక్కిన హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వవిద్యలు అభ్యసించారని పురాణగాథ. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో కుష్ఠువ్యాధి బాధ• నుంచి విముక్తుడ య్యాడట. ధర్మరాజు వనవాస కాలంలో సూర్యా రాధనతోనే ‘అక్షయపాత్ర’ను పొంది ఆకలిదప్పులను జయించగలిగాడు.

రథసప్తమి నాడు పెద్దలు/పండితులకు ఛత్రం (గొడుగు), చామరం (కస్తూరి మృగ కేశాలతో చేసిన విసనకర్ర) దానం ఇవ్వడం ఆచారం. దీనివల్ల పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకు సంబంధించి ప్రచారంలో ఉన్న గాథ ప్రకారం…. జమదగ్ని మహర్షి ధనుర్విద్య సాధనలో భాగంగా బాణ ప్రయోగం చేస్తుండగా, దూరంగా పడుతున్న వాటిని మునిపత్ని రేణుకాదేవి సేకరించి తెస్తోంది. ఆ క్రమంలో ఎండ తీవ్రతకు అలసిపోయింది. అందుకు సూర్యుడే కారణమని భావించిన ముని ఆగ్రహించగా, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆదిత్యుడు ఆ మహర్షికి నచ్చచెప్పి ఛత్రచామరాలు బహూ కరించాడు.

కొత్తగా నోములు, దీక్షలూ స్వీకరించే వారు రథసప్తమి నాడు వ్రతాన్ని ఆచరించి వాటిని ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. రథసప్తమి వ్రతం ఆచరించేవారు, ముందు రోజు (మాఘ శుద్ధ షష్ఠి) ఆయానికి వెళ్లి, సంకల్పం చెప్పు కోవాలని, ఆ రోజు ఏకభుక్త నియమం పాటించి, మరునాడు సూర్యోధయానికి పూర్వమే ఏడు జిల్లేడు/చిక్కుడు ఆకులను తల/భుజంపై ఉంచుకుని స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. రథసప్తమి నాటికి చలి క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. అందుకే పూర్వం రాజులు రథసప్తమి నాటి నుంచి జైత్రయాత్రలకు సన్నాహాలు చేసుకునేవారు.

సూర్యచంద్రులు కర్తవ్య పరాయణులు. క్రమశిక్షణకు మారు పేరు. కాలవిలంబన చేస్తూ, పనులు వాయిదా వేసే వారికి కర్తవ్య బోధ చేస్తారు. ‘సూర్యుడిలా సాగిపో’ అని ఉత్తేజపరచడం వింటూ ఉంటాం. సూర్యుడు ఎవరి ప్రమేయం లేకుండానే ఉదయిస్తాడు. జీవరాశికి ఆహారం, ఆరోగ్యం సమకూరుస్తూ, తన పని తాను చేసుకుంటూ వేళ మించగానే నిష్క్రమిస్తాడు. త్రిమూర్తి స్వరూపుడిగా పూజలు అందుకుంటూ జగదుత్పత్తి, వృద్ధికి బ్రహ్మ విష్ణు భూమికలను పోషిస్తున్నాడు. సూర్యరశ్మి ప్రభావంతో వానలు కురుస్తూ, వృక్ష జాతులు పెరుగుతూ సమస్త జీవరాశికి ఆహారం అందుతోంది.

దేశంలో అనేక సూర్యదేవాయాలు ఉన్నాయి. వాటిలో కోణార్క్ (ఒడిశా) అరసవెల్లి (ఆంధప్రదేశ్‌) ‌ప్రసిద్ధమైనవి. ఒడిశాలో ఏకశిలపై వంద అడుగుల ఎత్తయిన రథం నిర్మితమైంది. రెండు చేతులతో పద్మాలు ధరించి, రథచక్రాలు, గుర్రాలు అతిస్పష్టంగా జీవకళలొలుకుతూ దర్శనమిస్తాయి. అరసవెల్లిలో సూర్యకిరణాలు స్వామి విగ్రహ పాదాలను తాకడం ఆలయ నిర్మాణ కౌశలాన్ని తెలియచేస్తుంది.

తిరుమలేశునికి సప్తరథ సేవ

తిరుమలలో ఇతర పండుగల మాదిరిగానే రథసప్తమికి ప్రత్యేకత ఉంది. ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా ఆ ఒక్కరోజే శ్రీవారు ఏడు రథాలపై వివిధ అలంకారాలలో ఊరేగి కనువిందు చేస్తారు. సూర్య ప్రభ వాహనంతో తిరువీధి ఉత్సవం మొదలై చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష , సర్వభూపాల, చందప్రభ వాహనాలతో ముగుస్తుంది. దీనిని అర్థ బ్రహ్మోత్సవం అంటారు.

‘సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ

సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నమోనమః’…

స్నానం, దీపం, అర్ఘ్యం, అర్చనం, తర్పణం రథసప్తమి నాటి ప్రత్యేక ధర్మాలు. ముందురోజు (షష్ఠి) నిరాహారంగా ఉండి మరునాడు శాస్త్రోక్తంగా రథసప్తమి వ్రతం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఏడేడు జన్మల పాపాలు నశిస్తాయని ‘ధర్మసింధువు’ పేర్కొంటోంది.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE