అన్ని దారులు అయోధ్యవైపే. అందరి దృష్టి రాముని ప్రాణప్రతిష్ఠపైనే.ఈ రసవత్తర ఘట్టాన్ని చూసి తరించేందుకు హిందూ సమాజం దాదాపు ఐదు శతాబ్దాల పైగా నిరీక్షించింది. ఎన్నో బలిదానాలు, మరెన్నో ఆత్పార్పణల అనంతరం అయోధ్యలో రామాలయం అన్న కల సాకారమైంది. బాలరామయ్య ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని దేశం అంతా రామనామంతో మార్మోగింది. ఆలయాలు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి. అయోధ్య ఆలయంలో ఆరు రోజుల పాటు విశేష కార్యక్రమాలు సాగాయి.

ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా అయోధ్య నగరం అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన వీధులన్నీ కాషాయజెండాలు, ఫ్లెక్ల్సీలు, దీపాలతో అతిథులను ఆహ్మానం పలికాయి. ఎక్కడ చూసినా జైశ్రీరామ్‌ అని రాసి ఉండటంతో పాటు రామభజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగింది. ఇక అయోధ్య రామాలయం అయితే సప్తవర్ణాల శోభితంగా మారింది. ఆలయాన్ని పూర్తిగా విద్యుత్‌ ‌దీపాలతో, పూలతో అలంకరించారు. రాత్రి సమయాల్లో బంగారు వర్ణంతో గుడి వెలిగిపోయింది. గుడి దగ్గర కూడా పూలతో అలంకరించారు. ప్రధాన రహదారి నుంచి గుడికి వెళ్లే దారిలో పది అడుగుల ఎత్తు వరకూ పూలతో అలంకరించారు. రామునితో పాటు వివిధ చిత్రాలను, జైశ్రీరామ్‌ అన్న పేరును పూలతో రూపొందించారు.
ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు జనవరి 16వ తేదీన ప్రారంభం అయ్యాయి. శర్కాధివాస, ఫలాధివాస,పుష్పాధివాస, మధ్యాధివాస. శయ్యాధి వాస,ఔషధీవాస, కేసరధీవాస, ఘృతదివస తదితర కార్యక్రమాలను 21వ తేదీ వరకూ నిర్వహించారు. అనంతరం మూడురోజులపాటు భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. 22వ తేదీన నిర్వహించే ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానితులకు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం 23వ తేదీ నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని ట్రస్ట్ ‌పేర్కొంది. ఇక కార్యక్రమాలను వివరంగా చెప్పుకోవా లంటే… 16వతేదీన వేదపండితులతో సర్వ ప్రాయ శ్చిత్త హోమం, దశవిధి స్నానం, 17న రామ్‌లల్లా విగ్రహంతో ఊరేగింపు, 18న గణేశ్‌, అం‌బిక, వరుణ, వాస్తు పూజలు, 19న అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన చేశారు. 20వ తేదీన సరయూనది పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి సంప్రోక్షణ చేశారు. 21న జలాధివాసం అంటే యజ్ఞం అనంతరం ప్రత్యేక పూజల మధ్య అయోధ్య రాముని విగ్రహానికి 125 కలశాలతో దివ్యస్నానం చేయించారు.
ఈ మధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఐదు అడుగుల ఎత్తు ఉన్న రాముని విగ్రహానికి ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపుగుడ్డతో కప్పి ఉంచారు. మొత్తం మూడు విగ్రహాలు తయారు చేయించగా, గర్భాలయంలో ప్రతిష్ఠిస్తున్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన అరుణ్‌ ‌యోగిరాజ్‌ ‌మలిచారు. మిగిలిన రెండు విగ్రహాలను ఆవరణలో మరోచోట ప్రతిష్ఠిస్తారు. కేదార్‌నాథ్‌లోని శంకరాచార్య విగ్రహం, ఇండియా గేట్‌ ‌దగ్గర 30 అడుగుల సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌చెక్కిన అనుభవం అరుణ్‌ ‌యోగిరాజ్‌ది. బాలరాముని మూర్తి కోసం.. వివిధ నర్సరీ స్కూళ్లలో పిల్లల్ని నిశితంగా పరిశీలించానని, ఎంతో మానసిక శ్రమతో అందమైన రూపం ఇచ్చానని యోగిరాజ్‌ ‌చెప్పుకొచ్చారు. విగ్రహానికి అవసరమైన రాయిని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రాయిని సేకరించామని, చివరకు ఎన్‌ఐఆర్‌ఎం ‌శాస్త్రవేత్తలు, డిపార్టుమెంటు ఆఫ్‌ ‌మైన్స్ ‌వారి పరిశీలనలో హెచ్‌ ‌డొకోటేకు చెందిన కృష్ణశిల ఎంపికయ్యిందని ఆయన వివరించారు.
ప్రాణప్రతిష్ఠకు ముందే హనుమంతుడి జన్మ స్థలంగా భావిస్తున్న కిష్కింధ నుంచి ప్రత్యేక రథం అయోధ్యకి చేరుకుంది. దాదాపు వందమంది భక్తుల బృందం రాముడి చిత్రాలు ఉన్న కాషాయజెండాలు ప్రదర్శిస్తూ, ‘జై శ్రీరాం’ నినాదాలు చేసుకుంటూ రథంతో పాటు ప్రయాణించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శించటంతో పాటు సీతమ్మ జన్మస్థలిగా చెబుతున్న నేపాల్‌ ‌లోని జనక్‌పురి సైతం ఈ రథం వెళ్లింది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది అయోధ్యకు వస్తున్న వేళ, తాము కూడా ముందుగానే ఇక్కడకు రావాలని ప్రణాళిక వేసుకున్నామని శ్రీహనుమాన్‌ ‌జన్మభూమి తీర్థక్షేతట్రస్టు ప్రతినిధి అభిషేక్‌ ‌కృష్ణశాస్త్రి తెలిపారు. అలాగే రామయ్య అత్తగారిల్లు బీహార్‌ ‌లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భారీగా కానుకలు అయోధ్యకు చేరాయి. వాటిలో ధన, ధాన్య, కనకాది వస్తువులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రవాళపెరల్స్ ‌సంస్థ మూడు కిలోల ముత్యాలతో స్వామికి గజమాల తయారు చేసి పంపింది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భక్తులకు అందించటానికి వారణాసి, గుజరాత్‌లకు చెందిన స్వీటు షాపుల వారు 45 టన్నుల లడ్డూలను తయారు చేయించి పంపారు. టీటీడీ దేవస్థానం లక్షటన్నులు తయారుచేయించి పంపింది.
ఆలయం పూర్తికాకుండానే ప్రతిష్ఠ సరికాదని కొందరు ధర్మాచార్యులు అభిప్రాయపడినట్టు, అందుకే తాము హాజరుకావడంలేదన్నారనే వార్తలు వచ్చాయి. అనేకమంది ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. సాధారణంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఏడుగురు గిరిజనులు పాల్గొనాలి. అందులో ముగ్గురు దానిని అనుస రిస్తున్నవాళ్లయి ఉండాలి. మొత్తం 121మంది ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ట్రస్ట్ ‌పేర్కొంది. శ్రీగణేశ్వర శాస్త్రి ద్రవిడ్‌జీ కార్యక్రమాన్ని పర్యవేక్షించటంతో పాటు, అనుష్ఠాన కార్యక్రమాలకు సంబంధించిన సూచనలు చేశారు. కాశీకి చెందిన శ్రీ లక్ష్మీకాంత్‌ ‌దీక్షిత్‌ ‌ప్రధాన ఆచార్యునిగా వ్యవహ రించారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఎన్నో తాత్వికతలు, సిద్ధాంతాలు, విధానాలు ఉన్నాయి. వివిధ ఆచార్యులు వాటికి ప్రాతినిధ్యం వహిస్తుంటా రని ఆలయ ట్రస్ట్ ‌పేర్కొంది. 150కి పైగా మార్గాలకు చెందిన, మహామండలేశ్వరులు, మండలేశ్వరులు, శ్రీ మహంతలు, మహంతలు, నాగాలు, సాధువులు, గృహస్తులు, తత్త్వవాసీలు, ద్వీపవాసీలు గిరిజన సాంప్రదాయాల వారు ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు విచ్చేస్తున్నట్టు వివరించింది.
ఆలయ నిర్మాణంలో హైదరాబాద్‌ ‌ఘనత
అయోధ్య ఆలయనిర్మాణంలో హైదరాబాద్‌ ‌తన వంతు పాత్రను పోషించింది. 2,500 ఏళ్లకు ఒకసారి తలెత్తే తీవ్ర భూకంపాలను కూడా తట్టుకునేంత పటి ష్ఠంగా ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇందుకు అవసరమైన పరీక్షలను అధికారులు రూపొందించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి హైదరాబాద్‌ ‌పాత బస్తీకి చెందిన ఇంజనీర్‌ ‌ప్రదీప్‌ ‌కుమార్‌ ‌నాయకత్వం వహించారు. రూర్కీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ ‌సైంటిఫిక్‌ అం‌డ్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌రీసెర్చికి చెందిన సెంట్రల్‌ ‌బిల్డింగ్‌ ‌రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ‌డైరక్టర్‌ ‌హోదాలో, ఆలయంలో 3డీ స్ట్రక్చరల్‌ ఎనాలసిస్‌, ‌సీస్మిక్‌ ‌రీసిలియన్స్ ‌పరీక్షలు చేపట్టారు. సంస్థ పూర్వ డైరక్టర్‌ ‌గోపాలకృష్ణన్‌ ‌కూడా ఇందుకు తన వంతు సహాయసహకారాలను అందించారు. అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి, శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12గంటలకు రాముని విగ్రహం పైన నేరుగా సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నిముషాలపాటు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమై భక్తులకు కనువిందు చేయనుంది. ‘సూర్య తిలకం’గా దీనిని పిలుస్తారు. శిఖరం సమీపాన మూడో అంతస్తులో పడిన సూర్యకిరణా లను గర్భగృహాలకు తెచ్చేందుకు వీలుగా సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకుని గేర్‌ ‌బాక్సులను, రిఫ్లెక్టివ్‌ ‌మిర్రర్‌లను ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్‌ ‌డిపో 118 చెక్క ద్వారాలను రూపొందించింది. ఒక్క మేకు, బందు కూడా ఉపయోగించకుండా దీనిని తయారు చేసింది. బలార్షా టేకును ఉపయోగించామని చదలవాడ శరత్‌ ‌బాబు తెలిపారు.
నేపథ్యం…
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల స్థలాన్ని హిందువులకు రామాలయనిర్మాణానికి అందించ వలసిందిగా, సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును అందించటంతో రామాలయనిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఆలయ నిర్మాణానికి 2021లో నిధి సమర్షణ అభియాన్‌ ‌పేరుతో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌ప్రారంభించింది. లక్షా 50వేల మంది విశ్వహిందూపరిషత్‌ ‌కార్యక్రమాలలో పాల్గొన్నారు. నాటి రాష్ట్రపతి కోవింద్‌ ‌తన నెల జీతం అందించటంతో జనవరి 2021లో విరాళాల సేకరణ ప్రారంభమైంది. ప్రజల విరాళాలలో 3వేల కోట్లు – రూపాయలలో వచ్చిన విరాళాలే. ఇప్పుడు తాజాగా విదేశీ కరెన్సీ పొందేందుకు వీలుగా ఎఫ్‌సిఆర్‌ఐకు ట్రస్ట్ ‌దరఖాస్తు చేసుకుంది
రామమందిరం నిర్మాణానికి 1988లోనే అహ్మదాబాద్‌కు చెందిన సోంపుర కుటుంబం సిద్ధమైంది. 2020లో వాస్తు, శిల్ప శాస్త్రాలకు అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులుసాగాయి. గత 15 తరాలుగా సోంపుర కుటుంబానికి ఆలయ నిర్మాణాలుచేపట్టిన విశేషమైన అనుభవం ఉంది. సోమనాథ్‌ ఆలయాన్ని కూడా ఈ కుటుంబమే నిర్మించింది.
మొత్తం 71 ఎకరాల విస్తీర్ణంలో, ఆరు భాగాలుగా ఆలయ నిర్మాణం సాగింది. గర్భగుడి సహా ఇందులో ఐదు పెవిలియన్లు ఉంటాయి. గన్‌ ‌మండపం, రంగ మండపం, నృత్యమండపం, కీర్తన మండపం, ప్రథాన మండపం అని వీటికి పేర్లు పెట్టారు.
• రామాలయం కాంప్లెక్స్ ‌నిర్మాణం మూడు అంతస్తుల్లో, ఒక్కో అంతస్థు 20 అడుగుల వంతున సాంప్రదాయ నగర పద్ధతిలో సాగింది.
• ఆలయం 380 అడుగుల పొడువు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. 392 పిల్లర్లు, 44 గేట్లు ఉంటాయి. ఎక్కడా ఇనుమును ఉపయోగించలేదు.
• ఆలయంలోకి ప్రవేశం తూర్పు వైపు నుంచి ఉంటుంది. సింహద్వారం నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాలి. రాజస్థాన్‌ ‌పింక్‌ ‌స్టోన్‌ ‌తో నగర విధానంలో సింహద్వారం లేదా లయన్‌ ‌గేట్‌ను నిర్మించారు.
• రామమందిర్‌ ‌కాంప్లెక్సులో మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్‌ ‌రాజ్‌, ‌మాతా శబరి, దేవి అహల్య మందిరాలను నిర్మించాలని సంకల్పించారు.
• ఆలయ నాలుగు మూలలా నాలుగు గుళ్లు నిర్మిస్తారు. సూర్యదేవుడు, దేవిభాగవతి, భగవాన్‌ ‌శివ, ఆలయాలను నిర్మిస్తున్నారు. ఉత్తర దిశలో మాతా అన్నపూర్ణ, దక్షిణ దిశలో ఆంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయి.
• రాజస్థాన్‌ ‌రాష్ట్రం భరత్‌పుర్‌ ‌జిల్లా బన్సా పహార్‌పురలోని రాజస్థాన్‌ ‌శాండ్‌ ‌స్టోన్‌తో ఆలయ నిర్మాణం చేపట్టారు. చెక్కడం, కట్టడం పనులను అయోధ్యలోని ఆలయ నిర్మాణ ప్రాంగణంతో పాటు రాజస్థాన్‌ ‌లోని వర్క్ ‌షాపుల్లో చేపట్టారు.
• ఈ నిర్మాణ పనులను బెంగుళూరుకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌రాక్‌ ‌మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం), ఆర్కిటెక్ట్ ‌సి.బి.సోంపుర, లార్సన్‌ అం‌డ్‌ ‌టూబ్రో (ఎల్‌ అం‌డ్‌ ‌టీ), టాటా కన్సల్టింగ్‌ ఇం‌జనీర్స్ (‌టీసీఈ) పర్యవేక్షిస్తున్నారు.
యువత సాహసం
రామమందిరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంతోమంది యువత సాహసయాత్రలు చేపట్టారు. బీహార్‌కు చెందిన నితీష్‌ ‌కుమార్‌ అనే యువకుడు 615 కి.మీ. సైకిల్‌ ‌తొక్కి రామజన్మభూమిపై కాలుమోపారు. వారణాసికి చెందిన సోనీ చౌరాసియా 228 కి.మీ. స్కేటింగ్‌ ‌చేస్తూ అయోధ్య బయలు దేరింది. 124 గంటల మారథాన్‌ ‌నృత్యంతో గిన్నీస్‌ ‌రికార్డు సాధించిన ఈమెను ట్రస్ట్ ‌ప్రత్యేకంగా ఆహ్వానించింది. ముంబయ్‌కు చెందిన షబ్నం షేక్‌ అనే యువతి అయోధ్యకు 1400కి.మీ. పాద యాత్ర చేపట్టింది. ఈమె రోజుకు 60 కి.మీ. నడుస్తోంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా చెప్పుకోదగ్గవి చాలానే ఉన్నాయి.

-డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు
  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram