‌ప్రపంచంలో నాగరికత వెల్లివిరిసిన మొట్టమొదటి రాజ్యం అయోధ్య. సూర్యవంశ రాజులు రాజధానిగా చేసుకున్న ప్రాంతం అయోధ్య. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు అయోధ్యను లక్షల సంవత్సరాల క్రితమే నిర్మించాడు. ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు. ఆయన పేరున ఇక్ష్వాకుల వంశం వచ్చింది. ఆ వంశంలో పుట్టిన వాడు పృథువు. ఆయన సమస్త భూమండలాన్ని జయించాడు. కాబట్టి భూమికి పృథ్వి అనే పేరు వచ్చింది. దానికి అయోధ్య రాజధాని. రఘువు అనే చక్రవర్తి కారణంగా అదే వంశానికి రఘువంశం అనే నామం సార్ధక మయింది. శ్రీరాముడు అదే వంశంలో పుట్టి తన సుపరిపాలన చేత రఘుకుల తిలక అనే పేరును సముపార్జించాడు.

సృష్టికర్త బ్రహ్మ. ఆయన నుంచి ఉద్భవించిన వాడు మరీచి. ఆయన కుమారుడు కాశ్యపుడు, అయన కుమారుడు సూర్యనారాయణుడు, ఆయన కుమారుడు వైవశ్యతుడు. ఆయనే అయోధ్యను నిర్మించి, పాలించాడు. ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు, ఆయన కుమారుడు కుక్షి, ఆయన కుమారుడు వికుక్షి, ఆయన కుమారుడు బాణుడు, ఆయన కుమారుడు అనరణ్యుడు (రావణుని చేతిలో హతమయ్యాడు). ఆయన కుమారుడే పృథువు ఆయన కుమారుడు త్రిశంఖు దుందుమారుడు మాంధత – సుసంధి- ధ్రువసంధి భరతుడు (జడభరతుడు) – అశితుడు సగరుడు అసమంజ సుడు-అంశుమంతుడు- దిలీపుడు- భగీరధుడు- కకుత్సుడు- రఘువు (రఘువంశం)-ప్రవుర్దుడు- శంఖనుడు-సుదర్శనుడు -అగ్నివర్ణుడు – శీఘ్రవేదుడు-మరువు – ప్రశిష్యకుడు – అంబరీషుడు (ఏకాదశవ్రతం) – నహుషుడు – యయాతి-నాభానుడు- అజుడు- దశరథుడు – కుమారుడు శ్రీరాముడు. ఆయన కుమారులు కుశుడు, లవుడు. దేవదానవుల యుద్ధంలో దేవతల పక్షాన పోరాడిన మాంధాత, రఘువు, దశరథుడు వంటి వారు ఎందరో ఈ వంశంలో జన్మించారు.

అయోధ్య చక్రవర్తులు – రావణుడు

కైకసి కుమారుడు రావణుడు. రాముని కంటే కొన్ని లక్షల సంవత్సరాల పూర్వీకుడు. ఇక్ష్వాకుడు కుమారుడైన మాంధాత మొదటిసారిగా రావణునితో యుద్ధంలో తలపడతాడు. అయితే బలపరాక్రమా లలో ఎవరికి ఎవరూ తీసిపోని కారణంగా ఎవరూ గెలవని పరిస్థితి. అనంతరం అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత పృథువు తండ్రి అనరణ్యుడు రావణునితో తలపడి అతని చేతిలో మరణిస్తాడు. తన వంశంలో పుట్టిన వాని చేతిలోనే నీవు మరణిస్తావని రావణుని అనరణ్యుడు శపిస్తాడు. అనరణ్యుని నుంచి 28 తరాల తర్వాత అంటే ఆ కాలంలో ఒక్కొక్క చక్రవర్తి సుమారుగా 40 నుంచి 50 వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ఆ విధంగా లెక్కచూస్తే అనేక లక్షల సంవత్సరాల అనంతరం రాముడు అయోధ్యలో జన్మించారు. అదే మన రామజన్మభూమి కథ.

ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు. ప్రస్తుతం మనం వైవశ్వత మన్వంతరంలో 28 మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం. రాముడు 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో జన్మించాడు. రావణ సంహారానంతరం రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై రమారమి పదివేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆయన సుపరిపాలన కారణంగా రామరాజ్యపాలన అనే నానుడి ప్రజలలో ఏర్పడి ఇప్పటికీ దానినే మనము కోరుకుంటున్నాం. రాముని తర్వాత కుశుడు అయోధ్యను పాలించాడు.

భృగువంశానికి చెందిన వాల్మీకి రాముని పాలనకు ప్రత్యక్ష సాక్షి. కావున ఆయన చేత రామాయణ మహా కావ్యాన్ని రచింపచేశాడు బ్రహ్మ. రుక్షుడు అనేది వాల్మీకి అసలు నామం.

పోరాటం: మరికొన్ని అంశాలు

మీర్‌ ‌బకీ ఆధ్వర్యంలో బాబర్‌ ‌సేన దాడి చేసినప్పుడు తమ ఆరాధ్యదైవమైన శ్రీరాముని ఆలయాన్ని రక్షించుకున్నది మధ్య భారత్‌కు చెందిన మహంతులు, రామవంశజులు అని చెప్పుకునేవారు, రాజపుత్రులు చేసిన ప్రయత్నం ఫలించకపోగా లక్షా 74 వేల మంది చనిపోయారని బాబర్‌నామాలో పేర్కొన్నట్టు చెబుతారు. రక్తంతో తడిసిన ఇటుకలను లాహోర్లో నిర్మించే మసీదుకు తరలించారని చరిత్రకారుల కథనం.

హుమాయున్‌ ‌షేర్షాను ఓడించి ఢిల్లీ పీఠాన్ని ఎక్కిన తర్వాత జన్మస్థాన్‌కు వచ్చే హిందువులపై పన్నులు వేయడం, జరిగిందని కొన్ని కథనాలు చెబుతాయి. దీన్ని వ్యతిరేకించిన హిందువులు, సూర్యవంశ క్షత్రియులు, సరిసిద, రాజ్‌పూర్‌ ‌పరిసర ప్రాంతంలోని హిందూ సేనలను సమీకరించి మొట్టమొదటి సారిగా బాబ్రీ కట్టడంపై దాడి చేసి మొగలులు కట్టిన పలు కట్టడాలను ధ్వంసం చేశారు. అయితే మొగలులు తిరిగి సైన్యాలను సమీకరించుకుని ప్రతీకారంతో హిందూసేనను, అయోధ్య చుట్టుపక్కల గ్రామాలను ధ్వంసం చేశారని, సుమారు పది వేల మంది హిందూసేనను చంపివేశారని కథనం. హుమాయున్‌ ‌మరణా నంతరం హిందూ సేనలు జన్మస్థానాన్ని రక్షించు కోవాలనే ధృఢ సంకల్పంతో బాబ్రీ కట్టడంపై దాడిచేసి, అక్బర్‌ ‌సేనతో తలపడి కొంతమేరకు సఫలీకృతమయ్యారు. కట్టడానికి ఎదురుగా ఒక వేదికను ఏర్పాటుచేయగలిగారు. ఔరంగజేబు కాలంలో హిందువులకు కొత్త ఇక్కట్లు తప్పలేదు.

జనరల్‌ ‌జబాజ్‌ ‌ఖాన్‌ ఆధ్వర్యంలో మొగల్‌ ‌సైన్యం అయోధ్యపై దండెత్తడానికి వస్తుందని తెలుసుకున్న హిందువులు చుట్టుపక్కలనున్న అనేక మంది హిందూసేనను మోహరించగలిగారు. పరశురామ మఠానికి చెందిన సమర్థ రామదాసు శిష్యుడు వైష్ణవదాసు నాయకత్వంలో సంతులు, సాధువులు రామజన్మభూమి సేవకులు ఏకమై మొగల్‌ ‌సేనతో తలపడ్డారు. ముందుగా రాముడి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి గుడికి పశ్చిమాన ఉన్న బావిలో పడవేశారు.

ఊర్వశి కుండ్‌ ‌ప్రాంతంలో మొగలులతో ఏడు రోజుల పాటు భీకర యుద్ధం చేసింది రామసేన. మొగల్‌ ‌సేన తోకముడవక తప్పలేదు. అయితే ఔరంగజేబు తన సేనను మరల అయోధ్య ముట్టడికి పంపగా సుమారు పదివేలమంది హిందువులు మరణించారని అంచనా. హిందూ సేనలు చేసిన బలిదానానికి గుర్తుగా అయోధ్య చుట్టుపక్కల ప్రజలు నేటికీ శ్రీరామనవమి నాడు తమ పూర్వీకుల స్మృత్యర్ధం పూలు, పండ్లు సమర్పించుకుని వారి సాహసాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.

లక్నో నవాబుల పెత్తనం

ఢిల్లీలో మొగలుల పతనానంతరం కూడా హిందువుల కష్టాలు తీరలేదు. లక్నో నవాబులు కూడా జన్మస్థానంపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించారు. నవాబ్‌ ‌నజీరుద్దీన్‌ ‌హైదర్‌ ‌కాలంలో హిందువులు జన్మస్థాన్‌పై పట్టు సాధించగలిగినా అది ఎక్కువ కాలం ఉండలేదు. మరల నవాబుల ఆక్రమణలోనే చాలా కాలం ఉండిపోయింది. మొదటి స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో రెండు రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో అయోధ్య దాని చుట్టు పక్కల ఉన్న అనేక చిన్నపాటి హిందూ రాజులు ఏకమై పాల్గొన్నారు. ఆ యుద్ధంలో రెండువైపులా అనేక గ్రామాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాజా మాన్‌సింగ్‌ ‌మధ్యవర్తిత్వంతో నవాబు మొత్తబడి రామ్‌ ‌సేవకులకు మరల గద్దె నిర్మించుకొని పూజలు చేసుకోవడానికి అనుమతినిచ్చారు (అక్బర్‌ ‌కాలంలో మొదటి గద్దె నిర్మితమైందని ఒక కథనం).

బ్రిటిష్‌ ఇం‌డియాలో 1912లో చిన్నపాటి యుద్దాన్ని చూసింది అయోధ్య. బ్రిటిష్‌ ‌సేనపై హిందువులు దాడిచేసి కట్టడాన్ని కొంత మేర ధ్వంసం చేశారు. 1934లో నికోల్సన్‌ అనే అధికారి ధ్వంసం అయిన కట్టడానికి మరమ్మతులు చేసి పునరుద్ధ రించారు. 1949లో గద్దెపై రామ్‌లల్లా విగ్రహాన్ని ఎవరో ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. అప్పటి నుంచి హిందువులు, ముస్లీంలు ఆ స్థలంపై పెత్తనానికి ప్రయత్నాలు చేస్తూ కోర్టులో కేసులు వేసుకున్నారు.

1986లో రాజీవ్‌ ‌గాంధీ ప్రభుత్వం గేట్లు తెరచి పూజలు చేసుకోవడానికి అనుమతి నిచ్చింది. 1992 డిసెంబర్‌ ఆరవ తేదీన బాబ్రి కట్టడాన్ని హిందూ సేనావాహిని, కరసేవకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. 2019న సుప్రీం కోర్టు సంచల తీర్పునిస్తూ స్థలం రామ జన్మస్థలం అని నిర్ధారించింది.

-గాళ్ల శంకర్‌

‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram