మంచన గుండేరావు

పూర్వ విభాగ్‌ ‌సంఘచాలక్‌, ‌పాలమూరు

ఉద్యమం అంటే కవులు ఉంటారు. రచనలు ఉద్యమకారులకు దిశా నిర్దేశం చేస్తాయి. ఊపునిస్తాయి. హైందవ ధర్మరక్షణకు విశ్వహిందూ పరిషత్‌ ‌జరిపిన అనేక పోరాటాలలో తన కలంతో ఊతమిచ్చి స్వయంగాపాల్గొన ఉద్యమ కవి మంచన గుండేరావు. వీహెచ్‌పీ కార్యకర్తగా అయోధ్య ఉద్యమంలోను ఆయన తనదైన పాత్రను నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉద్యమంలోని పలు ఘట్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

1989లో పాలమూరు జిల్లా బౌద్ధిక్‌ ‌ప్రముఖ్‌ ‌బాధ్యత నిర్వహిస్తున్నాను. నిజానికి 1969లో కళాశాల విద్యార్ధిగా ఉన్నప్పుడే నేను స్వయం సేవక్‌ను. అప్పటి విశ్వహిందూ పరిషత్‌ ‌ప్రాంత ప్రధాన కార్యదర్శి కె.బి. సోమయాజులు తమ పర్యటనలో భాగంగా ఓసారి మా గ్రామం జడ్చర్ల వచ్చారు. ఆ తర్వాత వారు ప్రాంత స్థాయి పెద్దలను సంప్రదించి ఉంటారు. 1981లో శ్రీశైలంలో జరిగిన సంఘ ప్రాంత బైఠక్‌లో నన్ను విశ్వహిందూపరిషత్‌ ‌కార్యానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదే బైఠక్‌లో నాటి ప్రాంత బౌద్ధిక్‌ ‌ప్రముఖ్‌ ‌దీవి ద్వారకా చార్యులు, ప.పూ.బాలాసాహెబ్‌ ఎదుట బౌద్ధిక్‌కు ముందు వైయక్తిక్‌ ‌గీత్‌ ‌పాడమన్నారు. నేను ‘సౌధానికి పునాది ఆధారం, సంఘానికి శాఖ వరం’ అనే గీత్‌ (‌నేను రాసింది) పాడగా పరోక్షంగా వారు అభిందించినట్లు చెప్పారు. ఆ తర్వాత పరిణామ క్రమంలో విభాగ్‌ ‌ధర్మప్రసార ప్రముఖ్‌గా విశ్వహిందూపరిషత్‌లో బాధ్యత అప్పగించారు. 1984లో అప్పటి మా విభాగ్‌ ‌ప్రచారక్‌ ‌పట్లోళ్ల రాంరెడ్డి నన్ను జడ్చర్ల వదలి భాగ్యనగర్‌ ‌పరిషత్‌ ‌కార్యాలయంలోనే నివాసం పెట్టడానికి ప్రోత్స హించారు. అలా కేంద్ర కార్యాలయంలో ఉంటూ నా కప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో 1985లో ప్రాంత కార్యదర్శిగాను, 1987లో ఉమ్మడి ప్రాంతాల ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యత పెరిగింది. 1984లో ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో మొదటి ధర్మ సమ్మేళనం జరుగగా అందులో పాల్గొన్న దాదాపు 900 పైగా సాధుసంతుల సమక్షంలో అయోధ్యలోని శ్రీరామజన్మభూమిలో శ్రీరామచంద్ర భగవానుని కటకటాల నుండి ముక్తి కలిగించడమే గాక, అదే చోట భవ్యమందిర నిర్మాణం జరపాలన్న ప్రముఖ తీర్మానం ఏకగ్రీవంగా జరిగింది. ఆ క్షణంలోనే శ్రీరామ కార్యంలో పాల్గొనాలన్న తీవ్ర కాంక్ష నా మనస్సులోనూ ఏర్పడింది. ఆ తర్వాత నన్ను కలిసిన వారిలో ‘జైశ్రీరామ్‌’‌తో పలకరించడం ప్రారంభించాను. అలాగే ఫోన్‌లోనూ ‘హలో’కు బదులుగా ‘జైశ్రీరామ్‌’ ‌సంబోధన ఒక విడదీయలేని భాగమైంది. హిందువులలో మానసికంగా, భారత దేశంలో సామాజికంగా వచ్చిన ఈ మార్పుతోనే అది తెచ్చిన సత్ఫలితమే జనవరి 22, 2024 మధ్యాహ్నం శ్రీరామజన్మస్థానంలో శ్రీస్వామి దివ్యమంగళ విగ్రహ ప్రాణప్రతిష్ఠ.

1983లో జరిగిన ఏకాత్మతాయజ్ఞం, 1984లో ప్రాంత స్థాయిలో జరిగిన శ్రీ సత్య రథయాత్ర హిందూ సమాజ కార్యకర్తలలో ఉద్యమస్ఫూర్తిని నింపాయి. శ్రీరామజన్మభూమి ఉద్యమానికి పూర్వరంగంగా అపారమైన సంసిద్ధతనిచ్చాయి. సంఘ కార్యంలో అప్పుడప్పుడు సందర్భాన్నిబట్టి పాటలు రాయడం అన్న నా అభిరుచి ఉద్యమం లోనూ పాటల రచనకు పురికొల్పింది. యాత్రా కాలంలో నాతోపాటు పర్యటించిన ఆప్తమిత్రుల, ప్రముఖ రచయిత హెబ్బార్‌ ‌నాగేశ్వర రావు ఇచ్చిన ప్రోత్సాహం మరింత ఊతమిచ్చింది. మొదట ఉమ్మడి ప్రాంతల పరిషత్‌ ‌ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత పశ్చిమాంధ్ర ప్రాంత కార్యదర్శిగా పనిచేస్తూ డా।।బి.రామరాజు, తూములూరి లక్ష్మీనారాయణ, కె.బి.సోమయాజులు, విశిష్ట వదాన్యులు జి.పుల్లారెడ్డి మొదలైన పెద్దల మార్గదర్శనంలో పాటల రచన కొనసాగిస్తూ శ్రీరామజన్మభూమి వివిధ యోజనల కనుగుణంగా రచనలు సాగించాను. వాటిలో కొన్ని కార్యకర్తల కంఠంలో ప్రతిధ్వనిస్తూ పలు కార్యక్రమాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇదంతా దైవకృపే.

శ్రీరామప్రభువు చరణాల చెంత నా మొదటి పాట ‘ధన్యత’ ప్రాంతంలో సత్సంగాల, భజన మండలులలో భక్తులు పాడుకొంటున్నారు. శ్రీరామశిలా పూజను, శ్రీరామజ్యోతి, శ్రీరామ పాదుకా పూజ, ఆగ్రహించిన హిందూ హృదయం, ఎన్నా ళ్లని ఈ తలవంపులు, ‘ఇక తలవంచం, అన్న స్ఫూర్తి గీతాలు, శ్రీరామకరసేవ, కరసేవా ప్రబోధం అన్న ప్రబోధ గీతాలు, కరసేవకులకు వీడ్కోలు, ఉత్కంఠ ఆశావహ గీతాలు మొదలైన 30కి పైగానే కాక హిందీ నుండి అనుసరణ గీతాలూ వచ్చాయి. ఇదంతా శ్రీ రాముని దయ తప్ప మరేమీ కాదు. చాలాకాలం నాతో కలిసిమెలిసి పనిచేస్తూ ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూ నా వ్యాసంగానికి తోడు నిలిచిన మిత్రులు వై. రాఘవులుకి శతథః అభినందనలు.

వివిధ సందర్భాలలో నేను స్వయంగా 3,4 సార్లు శ్రీ అయోధ్యను, శ్రీరామజన్మ భూమిని దర్శించాను. గుడారంలో మాత్రమే శ్రీరాముని దర్శనం లభించింది. అడుగడుగునా పోలీసు తనిఖీలతో భక్తులెందరో బాధతో దర్శనం చేసుకున్నారు.

1990నాటి మొదటి కరసేవలో నేను నా కుమారుడు కృష్ణప్రసాద్‌ ‌పాల్గొన్నా ము. అయోధ్య దారిలో రైలులో ఉండగానే పోలీసులు స్టేషన్‌లో బలవంతం గా దింపి సమీపంలోని ‘మహాబా’ జైలుకు పంపారు.

శ్రీరామజన్మభూమి ఉద్యమంలో భాగంగా ఒక దశలో విశ్వహిందూపరిషత్‌ ‌కేంద్రం నుండి ప్రాంత విభాగాలకు ఒక సూచన వచ్చింది. ఆయా ప్రాంతాల్లోని పార్లమెంటు సభ్యులకు పరిషత్‌ ‌ప్రాంత అధికారుల వ్యక్తిగతంగా కలిసి వారికి ఉద్యమ వివరాలను వివరించి, వారి నుండి ఉద్యమానికి వారి వారి సమర్థనను లేదా ఉద్యమంపై వారి అభిప్రాయాన్ని సేకరించి పంపాలని సూచన. తదనుగుణంగా పశ్చిమాంధ్ర ప్రాంతం నుండి అప్పటి ప్రాంత కార్యాధ్యక్షులైన డా।।బి.రామరాజుగారు, ప్రధాన కార్యదర్శినైన నేను ఢిల్లీకి వెళ్లి మన ప్రాంతానికి చెందిన వారిలో కొందరిని పార్లమెంటు భవనంలోను, మరికొదరిని వారి అధికార నివస గృహాలలోనూ కలిసాము.

అట్టివారిలో చాలామంది మాతో ఏకీభవిస్తూనే వ్రాతపూర్వకంగా సమ్మతి తెలపడానికి వెనుకాడారు. ఆ వరుసలో నాటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ పి.వి.నరసింహారావుగారిని కలవగా డా।। రామరాజుగారితో వారిలో పూర్వ పరిచయాలు కారణంగా స్నేహపూర్వకంగా పలకరించారు. శ్రీ రామరాజుగారు విషయాన్ని వివరించగా పివిగారు అంతా ఓపికగా విని ‘‘మాపై స్థాయిలో రాజీవ్‌గాంధీ లాంటివారున్నారు కదా! వారి అభిప్రాయాన్నే మేమూ సమర్థిస్తాము అంటూ నర్మగర్భంగా చెప్పి, తేలికగా తప్పుకొన్నారు. అయినా మీ ప్రయత్నం మంచిదే. చేస్తూ ఉండండి’’ అంటూ సాగనంపారు.

ఇక ఆనాటి పార్లమెంటు సభ్యులు ఎన్‌.‌జి.రంగాగారిని కలవగా ‘దేశంలో పరిష్కరించాల్సినవి ఎన్నో సమస్యలు ఉండగా మీకు ఈ రామమందిరమే ముఖ్యమైనది అనిపించిందా? అంటూ దెప్పి పొడిచి పంపించేశారు.

అట్టి భయంకరమైన 500 సంవత్సరాలు గడిచిపోయాయి. రామానుగ్రహం, సాధుసంతుల ఆశీస్సులు, సంఘ, పరిషత్‌ ఇత్యాది శ్రీరామభక్తుల అకుంఠిత దీక్ష, పరిశ్రమ ఫలితంగా శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో పునః సకల లాంఛనాలతో, వైభవంగా విరాజిల్లుతుండడం మనందరి అదృష్టం. ఈ పునర్వైభవ స్థితి మరింత వృద్ధి చెంది గోహత్య మొదలైన కళంకాలన్నీ రూపుమాపిపోవాలని ఆకాంక్ష.

జై శ్రీరామ్‌ – ‌భారత్‌మాతాకీ జై

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram