వీధిపోరాటాలే ఆధారంగా; దొమ్మీలూ, రక్తపాతమే పంథాగా మనుగడ సాగించే తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌వంటి పార్టీ నుంచి ఇంతకు మించి ఆశించలేం. రాజ్యసభ చైర్మన్‌ అం‌టే ఉపరాష్ట్రపతిని పార్లమెంట్‌ ‌భవనం ముందే అపహాస్యం చేయడం, అవహేళన చేయడం అలాంటి పార్టీకి మాత్రమే సాధ్యం. కానీ ‘కాంగ్రెస్‌ ‌విలువలు కూడా ఇంతగా అడుగుంటి పోయాయా?’ అంటూ ఉపరాష్ట్రపతి నిలదీయవలసిన పరిస్థితిని తన దాయాదితో కలసిన 138 ఏళ్ల కాంగ్రెస్‌ ‌కూడా కల్పించుకుంది. ఒక మర్కట విన్యాసాన్ని కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు రాహుల్‌ ‌గాంధీ తన సెల్‌ ‌ద్వారా వీడియో తీశారు. డిసెంబర్‌ 19‌న కొత్త పార్లమెంట్‌ ‌భవనంలోని మకరద్వారం దగ్గర జరిగిన మర్కట విన్యాసం అంతా విస్తుపోయేటట్టు చేసింది.

లోక్‌సభకు శ్రీరామ్‌పూర్‌ ‌నియోజక వర్గం నుంచి టీఎంసీ సభ్యుననిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణ్‌ ‌బెనర్జీ ఒక హీనమైన విన్యాసానికి పాల్పడ్డారు. దీనిని దేశమంతా చీదరించుకున్నా కూడా కల్యాణ్‌ ‌బెనర్జీ తన ధోరణిని వీడలేదు. బుద్ధి తెచ్చుకోలేదు. డిసెంబర్‌ 24‌వ తేదీన మరొకసారి శ్రీరామ్‌పూర్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ను ‘మిమిక్రీ’ చేశారు. మళ్లీ అదే పాచిపాట- దాని పేరు భావప్రకటనా స్వేచ్ఛ. అది అతడి ప్రాథమిక హక్కుగా కూడా చెప్పుకున్నారు. అక్కడితో ఆగితే ఆయన తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఎం‌పీ ఎలా అవుతారు? గంధోళిగాడికీ, కేతిగాడికీ ఏ మాత్రం తీసిపోని ఆ టీఎంసీ సభ్యుడు అవసరమైతే మరొక వేయిసార్లయినా ఆ ‘మిమిక్రీ’ కళను ప్రదర్శిస్తానని బీరాలు పలికారు. దానిని గౌరవిస్తారట కూడా. మీరు వెక్కిరిస్తున్నది జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ అనే వ్యక్తిని కాదు, రాజ్యసభ అధ్యక్ష స్థానాన్ని అంటూ బీజేపీ వ్యతిరేకత అనే గుడ్డిద్వేషంలో, మత్తులో అన్ని విలువలకూ తిలోదకాలు ఇచ్చిన విపక్షాలను ఆయన మేలుకొలిపే ప్రయత్నం చేశారు. ఇదంతా వినిపించుకునే స్థితిలో విపక్షం లేదు.

అధినేత్రి కటాక్షవీక్షణాల కోసం కల్యాణ్‌ అనే ఈ నాయకుడు ఎన్ని మర్కట విన్యాసాలు చేయడానికైనా వెనుదీయడని తేలిపోయింది. ‘నేను మిమిక్రీ (ధ్యన్యనుకరణ) చేస్తూనే ఉంటాను. నా భావాలు వ్యక్తీకరించడానికి నాకు అన్ని విధాల హక్కు ఉంది. మీరు నన్ను జైలుకు పంపించవచ్చు. అయినా వెనక్కి తగ్గే ప్రశ్న లేదు’ అని తన అతిని కూడా ఆయన మిమిక్రీతో పాటే జనానికి పంచుతున్నారు. డిసెంబర్‌ 19, 2023‌న ఇలాంటి చేష్టలు ప్రదర్శించి కల్యాణ్‌ ‌దేశప్రజల కంట్లో పడ్డారు. చాలా విమర్శలు వచ్చాయి. అయినా ఉపరాష్ట్రపతిని లేదా రాజ్యసభ అధ్యక్షుడిని కల్యాణ్‌ ‘అవమానించే’ పని ఆపలేదు. పైగా ఇంత చిన్న విషయానికే ఆయనకి అంత కోపం రావాలా ఏమిటి? అంటున్నాడు ఈ ఎంపీ.

డిసెంబర్‌ 13‌న లోక్‌సభలో జరిగిన దుర్ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలని, రాజీనామా చేయాలని పట్టుబట్టిన 146 మంది ఎంపీలను దశల వారీగా సభ నుంచి బహిష్కరించారు. అందులో డిసెంబర్‌ 19‌న విపక్ష ఎంపీలు కొత్త పార్లమెంట్‌ ‌మరక ద్వారం దగ్గర నిరసన చేపట్టారు. ఆ సందర్భంలోనే కల్యాణ్‌ ‌బెనర్జీ ఈ మర్కట విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలను గాంధీ-నెహ్రూ వంశీకుడు రాహుల్‌ ‌గాంధీ తన సెల్‌లో వీడియో తీశారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. తాను జాట్‌ ‌వర్గం నుంచి వచ్చినందుకే, రైతు నేపథ్యం ఉన్నందుకు కల్యాణ్‌ ఇలాంటి చర్యకు పాల్పడ్డారని ధన్‌ఖడ్‌ ఆరోపించారు. అయితే ఇతరులను అనుకరించడానికి తనకు హక్కు ఉన్నదని చెబుతున్న కల్యాణ్‌, ‌ధన్‌ఖడ్‌ ‌చేసిన విమర్శను మాత్రం తప్పు పట్టారు. ఇది కదా, ప్రతిపక్ష మార్కు ఇంకా చెప్పాలంటే టీఎంసీ మార్కు ప్రజాస్వామ్యం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కూడా కల్యాణ్‌ ‌చర్య పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. ‘నా వెన్నెముక చాలా నిటారుగా ఉంటుంది. నేను పొడవైన మనిషిని!’ అంటూ ధన్‌ఖడ్‌ను దృష్టిలో పెట్టుకుని కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైనాయి.

విపక్ష నాయకుల విజ్ఞత మీద దేశ ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది. కానీ ఇలాంటి వాటిని సమర్ధిస్తున్నందువల్ల మేధావులుగా చెప్పుకునే కొందరు మీడియా వారి మీద కూడా దేశ ప్రజలకు గౌరవం పూర్తిగా పోయే పరిస్థితులు వస్తున్నాయి. కల్యాణ్‌ ‌విన్యాసాలను తన సెల్‌లో బంధించడం గురించి విలేకరులు రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. కానీ రాహుల్‌ ‌విలేకరులనే ఎదురు ప్రశ్నించారు. ‘విలేకరులు తనను వీడియో తీయడం గురించి ప్రశ్నించడం ఆశ్చర్యపరుస్తున్నదని, నిజానికి 146 మంది ఎంపీల సస్పెన్షన్‌ ‌గురించి వారు అడుగుతా రని ఆశించా’నని అన్నారట. ఇది కదా మేధావి లక్షణం అంటూ ఒక కాలమిస్ట్ ‌రాయడమే విశేషం. రాహుల్‌ ‌ప్రశ్న పత్రికా లోకాన్ని మేలుకొలిపే విధంగా ఉన్నదంటూ ఆ మహిళా కాలమిస్ట్ ‌రాహుల్‌ ‌మీద ప్రశంసలు కురిపించారు. కానీ దేశంలో కల్యాణ్‌ ‌చర్య పట్ల జనం అసహ్యించుకున్న మాట వాస్తవం.

ఇప్పుడు ఉపరాష్ట్రపతిని ‘మిమిక్రీ’ చేయడం దేశ ప్రజలందరికీ తెలిసినప్పటికీ ఈ కళను చిరకాలంగా కల్యాణ్‌ ‌ప్రదర్శిస్తున్నారు. అంటే నోటికి వచ్చినట్టు వదరే కళకు ఆయన చాలాకాలం నుంచే సాధన చేస్తున్నారు. చాలాకాలం క్రితం నాటి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ ‌భట్టాచార్యను కూడా కల్యాణ్‌ ఇలాగే అనుకరించారు. ఆ తరువాత నరేంద్ర మోదీని కూడా అనుకరించారని వార్తలు వచ్చాయి. బెంగాల్‌ ‌రాజకీయ వర్గాలు కల్యాణ్‌ను నోటివాటపు నేత అని ముద్దుగా పిలుచుకుంటారు. టీఎంసీ నేత మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడు కల్యాణ్‌. ఆమె ఆశీస్సులతోనే 2001లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వృత్తికి న్యాయవాది అయిన కల్యాణ్‌ ‌తన పార్టీ కేసులను ఎక్కువగా వాదిస్తారు. ఈయన చేష్టలంటే ఇలా పిల్లచేష్టలనిపిస్తాయి కానీ, ఈయన మూడుసార్లు శ్రీరామ్‌పూర్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో నందన్‌ అనేచోట బుద్ధదేవ్‌ను అనుకరించి, వార్తలకెక్కారు. 2012లో కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి టీఎంసీ వీడ్కోలు చెప్పింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశం మీద అప్పుడు కేంద్ర మంత్రి ఆనంద్‌ ‌శర్మను కూడా కల్యాణ్‌ ‌మిమిక్రీ చేశారు. ఇక పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో టీఎంసీ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని రిజర్వు బాంక్‌ ‌కార్యాలయం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలోను కల్యాణ్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీ మీద నోరు పారేసుకు న్నారు. ఈ చర్యను అప్పుడు చాలామంది ఖండిం చారు. ఇతడి నోటి దురదకు హద్దులు లేవు. హత్రాస్‌ (ఉత్తరప్రదేశ్‌) ‌వివాదం నేపథ్యంలో 2021లో కల్యాణ్‌ ‌సీతారాముల మీద కారుకూతలు కూశారు. ఈ తుంటరి వ్యాఖ్యలకు నాడు బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌ ‌కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, అతడిని అరెస్టు చేయాలని ఆందోళన చేశాయి. కానీ అక్కడ ఉన్నదే ఒక అరాచక ప్రభుత్వం ఇలాంటి వాడిని ఎందుకు అరెస్టు చేస్తుంది? ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతి పదవి చేపట్టక ముందు పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌గా పనిచేశారు. అప్పుడు టీఎంసీకీ, గవర్నర్‌కూ నడుమ అనేక వివాదాలు చెలరేగాయి. గవర్నర్‌ ‌నివాసం ఎదుట టీఎంసీ కార్యకర్తలు ధర్ణా చేయడమే కాదు, ఆయన మీద కేసు పెట్టాలంటూ గగ్గోలు పెట్టాయి. ఏమైనా టీఎంసీ అరాచకాలను బయటి ప్రపంచానికి అధికారికంగా తెలియ చేయడంలో గవర్నర్‌ ‌కొన్ని ప్రకటనలు ఉపయోగ పడినాయి. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికే లోక్‌సభ సభ్యుడు కల్యాణ్‌ ‌బెనర్జీలోను, రాజ్యసభ సభ్యుడు డిరీక్‌ ఓబరీన్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. లోక్‌సభలో మరొక ఎంపీ సౌగత్‌రాయ్‌ ‌సరళి కూడా ఇదే పంథాలో ఉంటుంది. దీనికి సహజంగానే కాంగ్రెస్‌ ‌కూడా తోడైంది. లోక్‌సభలో ఇద్దరు యువకుల అక్రమ ప్రవేశం వివాదాన్ని పక్కతోవ పట్టించడానికే ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్‌ ‌వీడియో తీసిన ఉదంతాన్ని ముందుకు తీసుకువస్తు న్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరామ్‌ ‌రమేశ్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. మహువా మొయిత్రా కూడా మరొకసారి ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవడా నికి వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోలేదు. ఔను మిమిక్రీ ఒక కళ కల్యాణ్‌ ‌ప్రదర్శించినది ఆ కళే అని వ్యాఖ్యానించారు.

కల్యాణ్‌ ‌బెనర్జీ నిర్వాకం మీద సుప్రీం కోర్టు న్యాయవాది వినీత్‌ ‌జిందాల్‌  ‌పార్లమెంట్‌ ఉభయ సభల నియమావళి సంఘాలకీ ఫిర్యాదు చేశారు. కల్యాణ్‌ ‌మీదనే కాకుండా, ఆ వికృత విన్యాసాన్ని సెల్‌లో రికార్డు చేసే విపరీత చర్యకు పాల్పడిన రాహుల్‌ ‌గాంధీ, ఇదంతా చూస్తూ వెకిలి నవ్వులు నవ్విన 141 మంది ఎంపీల మీద కూడా చర్యలు తీసుకోవాలని జిందాల్‌ ఆ ‌ఫిర్యాదులో కోరారు. కల్యాణ్‌ ‌విన్యాసం, దానిని వీడియో తీసే పని రెండూ కూడా అత్యంత అవమానకరమైన చర్యలని జిందాల్‌ ‌తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అవమానం గురించి ప్రధాని స్పందిస్తూ తాను గత ఇరవై ఏళ్లుగా ఇలాంటి అవమానా లకు గురి అవుతూనే ఉన్నానని చెప్పారని ధన్‌ఖడ్‌ ‌తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఉదంతం మొత్తంలో కనిపించే మెరుపు, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్య. ‘మేం ఎవరినీ తక్కువ చేసి చూడం. అందరినీ గౌరవిస్తాం. ఇది చట్టసభ సభ్యుడు ఒకరు చేసిన చిన్న పని. కానీ రాహుల్‌ ‌గాంధీ దానిని వీడియో తీయడం వల్ల వివాదం పెద్దదయింది’ అన్నారామె. రాహుల్‌ను కాకుండా కాంగ్రెస్‌ ‌నుంచి మల్లికార్జున ఖర్గేను ప్రధానిగా ప్రకటించాలంటూ తరువాతే మమత ఇండీ సభలో చెప్పిన విషయం తెలిసిందే.

భారత పార్లమెంట్‌లో రాజ్యసభను ఎగువ సభగా, పెద్దల సభగా గౌరవిస్తారు. కానీ లోక్‌సభలో పొగదాడి ఘటన నేపథ్యంలో జరిగిన సస్పెన్షన్లలో రాజ్యసభ సభ్యులు ఎక్కువగా ఉండడం విచారకరం. ధన్‌ఖడ్‌కు ముందు రాజ్యసభ చైర్మన్‌ ‌పదవిని నిర్వహించిన ఎం. వెంకయ్యనాయుడు కూడా అనేక సందర్భాలలో అవాంఛనీయ వాతావరణాన్ని చూడవలసి వచ్చింది. భారత అత్యున్నత చట్టసభలో ఎగువ సభ వర్తమాన పరిస్థితి ఇది.

సభలో అలజడి సృష్టించి దేశ ప్రజల కంట్లో పడదామన్న అవాంఛనీయ పోకడ సభ్యులలో పెరగడమే ఇందుకు కారణమన్న వాదన ఉంది. అలాగే పార్లమెంట్‌ను స్తంభింప చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి వాతావరణం తరచు కనపడడానికి మీడియా కూడా కారణమన్న అభిప్రాయం బలపడుతున్నది. సభ సజావుగా సాగుతూ, అర్థవంతమైన చర్చలు జరిపితే మీడియా దాని గురించి పట్టించుకోవడం లేదు. అదే సభలో అలజడి సృష్టించి, సభా నిర్వాహకుని మీద కాగితాలు విసరడం, పోడియంలోకి ప్రవేశించడం వంటి చర్యలు జరిగితే మీడియా దానిని విశేష ప్రాధాన్యం ఇస్తున్నది.  ఇలా అలజడి సృష్టించడానికే ప్రజా సమస్యల ప్రస్తావనగా కొన్ని ప్రతిపక్షాలు పేరు పెడుతున్నాయి. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించమే పనిగా చాలామంది సభ్యులు ఇలాంటి అప్రజాస్వామిక ధోరణికి పాల్పడుతున్నారని పలువురు సభ్యులు అంగీకరిస్తున్నారు కూడా. రాజకీయ పార్టీలలో వస్తున్న విపరీత పోకడలు కూడా ఇందుకు కారణమన్న విమర్శ ఉంది. అధికార పార్టీ మీద ఉన్న అక్కసును తీర్చుకోవడానికీ, ప్రజాక్షేత్రంలో తమకు ఎదురవుతున్న అపజయాలను కప్పి పుచ్చుకోవడానికి పలు పార్టీలు ఈ ధోరణిని ఆశ్రయిస్తు న్నాయి. అధికార పార్టీ మీద అసహనం, తమ అధిష్ఠాన దేవతల కరుణ కోసం కూడా కొందరు సభ్యులు గందరగోళాన్ని నమ్ముకుంటున్న సంగతి వాస్తవం. సిద్ధాంత నిబద్ధత లేకపోవడం, ప్రజా ఉద్యమాలతో సంబంధం లేనివారే ఎక్కువగా సభలో ప్రవేశించడం కూడా హుందాతనం లుప్తమైపోవడానికి కారణమన్న ఆరోపణను ఎవరూ నిరాకరించలేరు.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE