ఆయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం (జనవరి 22) జరిగిన ఆ కార్యక్రమాన్ని టీవీలు, ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రజలు తిలకించి పులకించారు. రాష్ట్రం రామనామ స్మరణతో మార్మోగిపోయింది.ఉదయం నుంచి తంటిస్నానాలు చేసి ఇళ్లలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని టీవీల ముందు కూర్చున్నారు. స్థానిక ఆలయాలు వద్ద, కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లలో వేడుకలను తిలకించారు. శివ, కేశవ, శక్తి భేదాలు లేకుండా అన్ని ఆలయాలలో శ్రీరాముడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీపాలంకరణ సేవ, తులసీమాలతో పూజలు, భజనలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ అఖండ దివ్యజ్యోతిని వెలిగించారు. విష్ణుసహస్ర నామం, హనుమాన్‌ ‌చాలీసా పఠించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. విగ్రహ ప్రతిష్ఠను తిలకించి ధన్యుల మైనట్లు భావించి చేసిన ‘జై శ్రీరాం’ జయజయ ధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికే పంపిణీ చేసిన మంత్రాక్షతలను తలపై జల్లుకున్నారు. దేశంలో సుసంపన్నంగా సాగుతూ రామరాజ్యం ఆవిష్కారం కావాలని ప్రజలు ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌, ‌విశ్వహిందూ పరిషత్‌, ‌భజరంగదళ్‌ ఆధ్వర్యంలో 16వ తేది నుంచే శ్రీరామ, హనుమాన్‌ ‌శోభాయాత్రలు నిర్వహించారు. అయోధ్యలో వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు అన్ని జిల్లాలకు చెందిన పలువురికి ఆహ్వానాలు అందాయి. వారితోపాటు ఇతరులు అనేకమంది హాజరయ్యారు. శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ ‌స్వామి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ‌చిరంజీవి, రామ్‌చరణ్‌తేజ వేడులకు హాజరైన ప్రముఖులలో ఉన్నారు.
ఒంటిమిట్ట సీతారామచంద్రస్వామి ఆలయం, తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.విజయవాడ నగరం ‘అయోధ్య’సంబరాలలో మునిగిపోయింది. దేవాలయాల్లో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఇస్కాన్‌ ‌మందిరంలో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి ‘దీపావళి’లా సంబరాలను జరుపుకున్నారు. ప్రతిష్ఠాపనోత్సవ నేపథ్యంలో కర్నూలు జిల్లా మంత్రా లయంలో తుంగభద్ర నదీతీరంలో 68 అడుగుల ఎత్తుగల అభయ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, హోమాలు, పూజలు నిర్వహించారు. విగ్రహం చుట్టూ శ్రీరాముడి జీవితచరిత్ర విశేషాలతో మ్యూజియం, ఉద్యానవనం నిర్మిస్తామని శ్రీఅభయరామ సేవా సమితి తెలిపింది. శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో రామ చంద్రమూర్తి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అమరావతిలో హైకోర్టు ప్రాంగణంలో న్యాయ వాదుల సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
చీరాల’ నుంచి రామయంత్రం
అయోధ్య శ్రీరామ మందిరములో యంత్రమును నిక్షిప్తం చేయటం కోసం చీరాలలోని చిదంబర శాస్త్రి యంత్రమును తయారు చేయించి అందజేశారు. భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్‌ ‌వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాసశాస్త్రి బంగారు పూతతో తయారు చేయించిన 9 కిలోల వెండి పాదుకలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ, అంతర్వేది ఆలయాలలో పూజాదికాలు నిర్వహించి గత అక్టోబర్‌లోనే అయోధ్యకు చేర్చారు.

తిరుమల నుంచి లక్ష లడ్డూలు
అయోధ్యకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉచితంగా శ్రీవారి ప్రసాదాన్ని చేసింది. ఇందుకు లక్ష లడ్డూలను అయోధ్యకు పంపింది. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ద్వారా ఈ లడ్డూలను తరలించింది. సోమవారం దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ‌శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసింది. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు ఉండగా.. అయోధ్య కోసం 25 గ్రాముల ఉండే లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించారు.
– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE