అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేళ.. రామభక్తుల్లో గూడు కట్టుకున్న సంతోషం పెల్లుబికింది.మందిర  నిర్మాణానికి రామ జన్మభూమి ట్రస్టు ఇచ్చిన పిలుపుతో స్పందించిన భక్తులు..తోచినరీతిన సహకరించారు. ఒక ప్రాంతంలో రాములోరి విగ్రహం ప్రాణం పోసుకోగా, మరో ప్రాంతం నుంచి రాళ్లను తీసుకొచ్చారు. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకతగా ఉన్నాయి. అందులో భాగంగా భాగ్యనగరం పేరు కూడా అయోధ్యలో చిరస్థాయిలో నిలిచేలా ఇక్కడ పనులు జరిగాయి.

బాలరామునిగా అయోధ్యలో కొలువు దీరిన శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రాష్ట్రమూ పండుగ జరుపుకుంది. రామునిపై భక్తిని చాటుకునేందుకు జనం వివిధ రూపాల్లో స్పందించారు. వేల ఏళ్ల పాటు చిరస్థాయిగా నిలిచిపోయేలా అయోధ్య రామాలయ నిర్మాణంలో మన భాగ్యనగరం కూడా తన వంతు పాత్ర పోషించింది. ఆలయానికి తలుపులు ఇక్కడే తయారు చేయించారు. ఓ భక్తుడు వెండి పాదుకలు చేయించి పంపించాడు. మరో భక్తుడు భారీ లడ్డూను తయారు చేయించాడు.

సికింద్రాబాద్‌ ‌బోయిన్‌ ‌పల్లికి చెందిన అనురాధ టింబర్‌ ‌డిపోకు ఇలాంటి నిర్మాణాల్లో ప్రత్యేక అనుభవం ఉన్నట్లు గుర్తించిన రామజన్మభూమి ట్రస్టు… తలుపులు తయారు చేసే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించింది. తమిళనాడుకు చెందిన హస్త కళాకారులు కొన్ని నెలలపాటు ఈ పనుల్లో నిమగ్నమై తలుపులు తయారుచేశారు. తామర, నెమళ్లు, సంప్రదాయ భారతీయ సాంస్కృతిక చిహ్నాలతో నగారా శైలిలో వీటిని తయారు చేశారు.

గర్భగుడి తలుపులతో పాటు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అన్ని తలుపులను సంస్థే రూపొందించింది. గర్భగుడి తలుపు 5 ఏళ్ల రాముడి విగ్రహాన్ని కలిగి ఉంటుంది. తలుపులకు మహారాష్ట్రకు చెందిన బలార్షా టేకు చెక్కను ఉపయోగించారు. తలుపు చెక్క భాగం బంగారు రేకుతో కప్పి ఉంటుంది. తలుపులు 8 అడుగుల పొడవు,12 అడుగుల వెడల్పు, ఆరు అంగుళాల మందంతో బలంగా ఉంటాయని సంస్థ డైరెక్టర్‌ ‌శరత్‌ ‌బాబు తెలిపారు. ఇప్పటి వరకు ఆలయం చుట్టూ 100 ఫ్రేమ్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించిన శరత్‌ ‌బాబు… ఇప్పటికే 118 తలుపులు పూర్తి చేశామని, చెప్పారు. యాదాద్రి ఆలయానికి తలుపులు కూడా అనురాధ టింబర్‌ ‌డిపోలోనే తయారు చేశారు.

అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణం సందర్భంగా స్వామి వారికి పాదుకలను తెలంగాణ నుంచే పంపించారు. ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకలు కానుకగా ఇచ్చిన చల్లా శ్రీనివాసులు శాస్త్రి, ఇప్పుడు రామునికి ఎనిమిది కిలోల వెండితో బంగారు పూతతో కూడిన వెండి పాదుకలు తయారు చేయించారు. పాదుకలపై గోమాత, రాముని జెండా, గోమాత, స్వస్తిక్‌, ‌శంఖం, సూర్యుడు, ఖడ్గం చిత్రీకరించారు. వీటితో పాటు కల్పవృక్షం, మత్స్యావతారం, ధనస్సు, కలశం, అంకుశం కూడా చిత్రీకరించి ఉన్నాయి. రామలింగాచారి ఆగమ శాస్త్ర నిమయాల ప్రకారం వీటిని రూపొందించినట్లు చెప్పారు. ఇక పాదుకలపై కాలి బొటన వేలి మధ్యలో కనిపించే విధంగా ఆకుపచ్చ రాయిని కూడా అలంకరించారు. – మరో కిలో వెండితో పాదుకలకు పూత పెట్టించారు. శ్రీరామునికి విల్లు కూడా బహూకరించనున్నట్లు తెలిపారు.

భారీ లడ్డూ ప్రసాదం

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి లడ్డు తయారీ అవకాశం, అదృష్టాన్ని సికింద్రాబాద్‌ ‌మారేడ్‌పల్లికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ ‌సర్వీసెస్‌ ‌యజమాని నాగభూషణం రెడ్డి దక్కించుకున్నారు. 12వందల 65కిలోల బరువు గల లడ్డూను ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు మొదలుకొని శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ట చేసే రోజు వరకు 12వందల 65రోజులు అవుతుండటంతో దానికి గుర్తుగా అదే సంఖ్యలో 12వందల 65కిలోల లడ్డూను తయారు చేశారు.ఇందుకోసం 16 మంది నాలుగు రోజుల పాటు శ్రమించారు. లడ్డూ తయారీలో 350కిలోల శనగపిండి, 7వందల కిలోల చక్కెర, 40కిలోల నెయ్యి, కుంకుమపువ్వు వినియోగించారు.

సీతమ్మకు సిరిసిల్ల పసిడి చీర :

 చేనేతకు పేరుగాంచిన సిరిసిల్ల నుంచి సీతమ్మకు ప్రత్యేకంగా తయారు చేసిన పట్టుచీర వెళ్లింది. చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ అయోధ్య రామాలయ నిర్మాణం సందర్భంగా అమ్మవారికి పట్టుచీర గుర్తింపుగా ఇవ్వాలనుకున్నాడు. 20 రోజుల పాటు శ్రమించి రామాయణంలోని ముఖ్య ఘట్టాలు తెలిపే విధంగా చీరను నేశారు. కొంగుభాగంలో జై శ్రీరామ్‌ అని తెలుగు, హిందీ భాషల్లో అక్షరాలు వచ్చేలా చీరను నేశారు హరిప్రసాద్‌. ‌పట్టుచీరకు 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి వినియోగించారు. చీర మొత్తం బరువు 900 గ్రాములని హరిప్రసాద్‌ ‌తెలిపారు.

రామయ్యకు ముత్యాల హారం

 హైదరాబాద్‌కు చెందిన ప్రవళ జ్యువెలర్స్ ‌కూడా శ్రీరాముని కోసం మూడు కిలోల 600 గ్రాముల ముత్యాల హారం కానుకగా పంపింది. తొమ్మిది మంది కళాకారులు తొమ్మిది రోజులు కష్టపడి ఈ హారాన్ని తయారు చేశారు. ఈ హారం తయారు చేయడానికి ముంబై నుంచి ముత్యాలను తెప్పించారు. చూశారుగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మన భాగ్యనగర్‌ ‌దక్కించుకున్న ప్రత్యేక స్థానం.

 వాహనంపై అయోధ్య మందిరం

హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌ (‌గిన్నీస్‌ ‌బుక్‌ ‌రికార్డు విజేత) రెండు సంవత్సరాల పాటు కష్టపడి అయోధ్య రామాలయాన్ని పోలిన ప్రత్యేక వాహనాన్ని తయారు చేశారు. ఈ కదిలే ‘రామ మందిరం’ తయారీలో 20 మంది కార్మికులు కష్టపడగా, వీరిలో 10 మంది ముస్లింలు ఉండటం విశేషం. సుధాకార్స్ ‌మ్యూజియంలో పని చేస్తున్న అహ్మద్‌ అలీ దీని నిర్మాణంలో అన్నీ తానై పనులు చక్కబెట్టారు.

– సుజాత గోపగోని

About Author

By editor

Twitter
YOUTUBE