Glimpses of Pran Pratishtha ceremony of Shree Ram Janmaboomi Temple in Ayodhya, Uttar Pradesh on January 22, 2024. PM presents on the occasion.

1989‌సంవత్సరంలో ఎక్కడైతే సింహద్వారం దగ్గర శంకుస్థాపన చేశామో, ఇప్పుడు మళ్లీ  అక్కడే, కానీ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఆలయ ప్రాంగణంలో నిలబడడం ఓ అద్భుత అనుభవం. అనిర్వచనీయమైన అనుభూతి. భాషకు అందనిది . ఓ మహదవకాశం నాకు మళ్లీ దొరికింది.  ఇక్కడి దృశ్యం నయనానందకరం. వందలాదిమంది, కాదు, వేలమంది… ఒకవైపున పూలదండలు కడుతూ, వాటిని అలంకరిస్తూ, నాపరాళ్లు పరుస్తూ, అతిథులకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ హడావిడిగా ఉన్నారు. లోపల..ఎక్కడైతే ప్రాణప్రతిష్ఠాపన చేస్తున్నారో అక్కడ కాశీ పండితులు పూజలు చేసి, తర్వాత పల్లకిలో రామ్‌లల్లా ఉత్సవమూర్తిని యాగశాలలోకి తీసుకురావడం… ఇవన్నీ  నేను దర్శించుకోగలిగాను. ఇది సాధారణ ఘట్టం కాదు. మేము ఉండగానే, ఈ కల సాకారమవుతుందని, మన హిందువుల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రతీకగా రామ్‌లల్లా నిలబడడం ఎంతో గర్వం ఉంది. ఆ భావనను ఏ విధంగా వ్యక్తం చేయాలో తెలియని ఉద్వేగం ఆవరించింది నన్ను. గొంతు గద్గదమయింది.

భవ్యమందిరం కోసం నాడు, ‘ప్రాణ్‌ ‌జాయ్‌ ‌పర్‌ ‌మందిర్‌ ‌వహా బనాయేంగే,’ ‘ఆధా రోటీ ఖాయేంగే మగర్‌ ‌మందిర్‌ ‌వహీ బనాయేంగే’ ‘ఇధర్‌ ‌పె దేఖో జైశ్రీరామ్‌ ఉధర్‌ ‌పె దేఖో జైశ్రీరామ్‌, ‌కహీపె దేఖో జైశ్రీరామ్‌’ అం‌టూ  చేసిన నినాదాల హోరు చెవులలో మళ్లీ ప్రతిధ్వనించింది. జైళ్లల్లో ఆ గోడల నిండా హనుమాన్‌ ‌చాలీసాలు రాశాం. సరయూ ఒడ్డున కూర్చొని అందరం రామనామ జపం చేయడం, ఇలా పాత స్మృతులన్నీ గుర్తుకొస్తూ ఉంటే, ఇప్పుడు కొత్త నిర్మాణమవుతున్న ఆలయాన్ని చూస్తూ ఉంటే ఆ అనుభూతి మాటలకు అందుతుందా! అయోధ్య రూపురేఖలే మారిపోయాయి. విశాలమైన రోడ్లు, అందరూ రావడానికి చక్కటి అతిథి గృహాలు అన్నీ నిర్మించారు. రామాయణంలో ఉన్న అన్ని ఘట్టాలను, మార్గంలో ప్రదర్శనకు పెట్టారు. ఆ కావ్యాన్ని చదవకుండానే, చూసి అర్థం చేసుకు నేటట్టుగా ప్రేరణాత్మకంగా తీర్చిదిద్దారు.

అశోక్‌ ‌సింఘాల్‌జీ బ్యానర్లు కూడా కనిపించి నప్పుడు కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆరోజు రామ భక్తులందరినీ ఏకం చేశారు. ఆయన విగ్రహాన్ని  సందర్శించుకోవాలి. ఆయనతో పాటుగా విష్ణు హరిదాల్మియా, రాజమాత విజయరాజె సింథియా వంటివారంతా గుర్తుకువచ్చారు. ముఖ్యంగా, మన  పుల్లారెడ్డిగారు గుర్తుకువచ్చారు. ఇది వారందరి కల. నేడు భౌతికంగా లేకపోయినా, పైలోకాలలో వారి ఆత్మలు ఎంత ఉప్పొంగిపోతాయో అనిపించింది.

మన తెలుగువారి ప్రాశస్త్యం ఇక్కడ ఎక్కువగా కనపడింది నాకు. ఆ రోజున కూడా నేను, ‘శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు’ అంటూ మూడు ఇటుకల పైన తెలుగులో రాసి పట్టుకెళ్లినవాటినే శిలాన్యాస్‌ ‌పునాదిలో పెట్టారు దీక్షితులుగారు. శిలాన్యాస్‌ ‌చేసిన ప్రదేశంలో ఈ భవ్య కట్టడాన్ని చూసి, అహా, ఇక్కడ మన ఇటుకలున్నాయి. ఆరోజు నా మెడలోది బంగారు వరలక్ష్మి రూపు తీసి పెట్టాను. ద్వారబంధం తలుపులు కూడా తెలుగునాట నుంచి వచ్చినవే. చదలవాడ శరత్‌బాబు గారిని కూడా కలిశాం. బంగారు వాకిళ్ల నుంచీ అన్నీ వారు దగ్గరుండి చూపించారు. ఎంత అద్భుతంగా ఉన్నాయో!  అలాగే మన చిదంబర శాస్త్రిగారి దగ్గర యంత్ర పూజ జరగడం, ధర్మవరం నుంచి అమ్మవారికి పట్టుచీర రావడం, బంగారు పాదుకలు… ఒకటేమిటి, చెప్పుకుంటూ పోతే తెలుగువారికీ, రామచంద్రుడికీ ఉన్న బంధం ఎంత గొప్పదో ఇంకా బాగా అర్థమైంది.

నాకు ఒకటే అనిపించింది, ఆత్మగౌరవానికి కలిగిన కళంకాన్ని తొలగించేలా మందిర నిర్మాణం చేసుకున్నాము అంటే, దీని పరమోద్దేశం మళ్లీ ఈ ధర్మభూమిలో ‘రామో విగ్రహవాన్‌ ‌ధర్మః’ అన్నట్టుగా ఆ ధర్మాన్ని పునఃప్రతిష్ఠాపన చేసుకుంటున్నాం. ధర్మ సంస్థాపన… స్థాపన కాదు. సంస్థాపన అంటే మళ్లీ మళ్లీ జరిగేది. దానికి ప్రతీకగా ఇది నిలబడినట్టుగా నాకు అనిపించింది. గ్లోబలైజేషన్‌ అని చెప్పుకున్నా, దాన్ని ఆధ్యాత్మికపరంగా మన వారసత్వాన్ని, మన ధర్మాన్ని కలిపేందుకు మళ్లీ రామచంద్రుడు  ఇలా వచ్చాడు. ‘రాముడంటే ధర్మము, సంస్కృతి అంటే సీతమ్మ. ధర్మం నుంచి సంస్కృతి కనుక విడిపోతే ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం నుంచి కాపాడటానికి, ధర్మాన్ని, సంస్కృతిని కలిపినవాడు ఆంజనేయ స్వామి… వివేకమనే ఆంజనేయుడు.

నేను మాతా శివచైతన్య గారితో, మరికొందరు మహిళలతో కలిసి నాడు కరసేవకు వెళ్లాను. వారితో పాటుగా పుల్లారెడ్డిగారు, నారాయణమ్మగారు తదితర పెద్దలంతా ఉన్నారు. మేము ఇండోర్‌లో దిగగానే అరెస్టు చేసి ఝాన్సీలో పెట్టారు. ఆ సమయంలో అనేక సంఘటనలు జరిగాయి. అది చెప్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ‘దక్షిణ భారతంలో రాముడి పట్ల ఇంత ప్రేముందా? అని మమ్మల్ని అడిగా రప్పుడు. నేను, ‘అదేమిటండీ, రాముడి కోసం ఆనాడు ఒక్క రామదాసు జైలుకెళ్లాడు. నేడు వేలమంది రామదాసులు జైళ్లల్లో ఉన్నారు’ అన్నాను.128 దేశాల నుంచి రకరకాల ఆకృతులలో, రంగులలో ఇటుకలు వచ్చాయి. తూములూరి లక్ష్మీనారాయణగారు (జాగృతి మాజీ సంపాదకులు) మహానుభావులు… నమస్కరిం చాలి. నేను నా భర్తతో కలిసి వచ్చాను. మేమిద్దరం కలసి వస్తుంటే, ‘అమ్మా! ఆదిదంపతుల్లా కలిసి వస్తున్నారు. మీరే కూర్చోండి శిలాన్యాస్‌కి’ అని కూర్చోపెట్టడం, నేను హారతి చేతిలో వెలిగించడం, (10 నవంబర్‌) అం‌తమంది ధర్మాచార్యుల మధ్యలో నన్ను కూర్చోపెట్టి, ధర్మేంద్రజీ మహారాజ్‌ ‌మంగళా శాసనం చేస్తుండగా, అక్కడ  నారాయణమ్మగారు, మరొకరు కలిసి వేణీ బంధనం మడివేసి, నవయుగ ద్రౌపది అంటూ ప్రశంసించడం… జరిగాయి. ఆనాడు చేసిన సేవకే రాముడు నన్ను మళ్లీ ఇక్కడకు రప్పించుకొని, ఆశీర్వదించాడా? ఒక ఆనంద కక్ష్యలోకి వెళ్లిపోయాను. ‘అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం’లోకి చేర్చాడు.

కానీ కరసేవకులు తుపాకీ గుళ్లకు బలైపోయినప్పుడు, ఇసుకమూటలు కట్టి వారిని నదిలోకి తోసేసిన దృశ్యాలు గుర్తుకు వస్తే మాత్రం చలించిపోతోంది మనసు. కానీ గుర్తుకు రాకుండా ఎలా? ప్రతి ఇంటికీ తుపాకీ గుళ్లు చేసిన రంద్రాలు, క్షతగాత్రుల రక్తపు మరకలు ఉన్న గోడలు. ఇంకా కళ్ల ముందే ఉన్నాయి. హిందువులమనే విషయాన్ని విస్మృతి చెంది జీవిస్తున్న మనలో అటువంటి భావాన్ని మేల్కొల్పి, మన అస్తిత్వాన్ని మనం గుర్తు చేసుకోవడానికి, అదొక హిందూ మానస మందిరం చేసుకోవాలని మన పిలుపునకు స్పందించి ప్రజలందరూ తమ భావనచేత ఇటుకలను తీసుకొని వచ్చారు.  ఏ నిర్మాణాన్నైతే సాకారం చేసుకోవాలనుకున్నామో, ఏ కళంకాన్ని తొలగించాలనుకున్నామో, దానిని పూర్తిచేసుకున్నాం కదా మనం. నాడు ఒక్కొక్క కరసేవకుడూ చైతన్య రూపుడై, నిలువరించలేని ఝంఝా మారుతంలా విజృంభించారు. ఆ కట్టడాన్ని తొలగించారు. స్వంత నిర్ణయంగా ఎవరికి వారు ఆ గుంబజ్‌లపైకి ఎక్కి వాటిని ధ్వంసం చేశారు. ఆ ప్రభంనాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆహా అనిపిస్తుంది, అదే నాకూ అనిపించింది. ఆలయం అనేటువంటిది ఒక నిర్మాణం కాదు. దాని ద్వారా జాతి నిర్మాణం, వ్యక్తి నిర్మాణం జరగాలి. ఆలయమనేది సమాజ సంక్షేమ కేంద్రమనే భావనను పూర్వీకులు అందించారు. అక్కడ విగ్రహంగా రాముడిని చూడటం లేదు, సాక్షాత్తు రాముడినే నిలబెట్టుకున్నాం. రాముడిని నిలబెట్టు కున్నామంటే, ధర్మాన్ని నిలబెట్టుకున్నాం. ఆ ధర్మమనేది జాతికి అన్నివైపులా ప్రసరించాలి. అయోధ్య రామమందిరం ఒక సూపర్‌ ‌థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌. ‌సమాజానికి కావలసిన ధర్మాన్ని అది ప్రసారం చేస్తున్నప్పుడు జాతికి మేలు జరుగుతుంది. మన ఉద్దేశం, పరమోద్దేశం కూడా ఇవే.

– అయోధ్య నుంచి సత్యవాణి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram