ఇటీవల జరిగిన శాసనసభల ఎన్నికలలో శృంగభంగమైన కాంగ్రెస్‌కు ఆ బాధ నుంచి తేరుకోక ముందే కొత్త తలనొప్పి పట్టుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే జరిగిన ఐఎన్‌డిఐ కూటమి సమావేశంలోని అనిశ్చితి కూడా పార్టీకి ఆందోళన కలిగించేదిగా అనిపించింది. ఎన్నికలలో ఘోరపరాజయాలు, కూటమి వ్యవహారశైలి కాంగ్రెస్‌ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో కొత్త సమస్య తలకు చుట్టుకుని, గాంధీ-నెహ్రూల కుటుంబం పరువు తీసింది.

కాంగ్రెస్‌ ‌పార్టీ, గాంధీ-నెహ్రూ కుటుంబం, భావి ప్రధానిగా కాంగ్రెస్‌ ‌భావించే ఆ కుటుంబ వారసుడు రాహుల్‌ ‌గాంధీ వ్యవహారశైలి, పార్టీ పట్ల నిర్లిప్త వైఖరి, అతడి సామర్ధ్యంపైనే కాక, కాంగ్రెస్‌ ‌సంస్కృతి, రాజీవ్‌గాంధీ, సోనియా తదితరులపై మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్‌ ‌ముఖర్జీ అభిప్రా యాలు ఆయన కుమార్తె శర్మిష్ఠ రచించిన ‘ఇన్‌ ‌ప్రణబ్‌, ‌మై ఫాదర్‌-ఎ ‌డాటర్‌ ‌రిమెంబర్స్’ అన్న పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్‌ ‌వాదిగా, నేతగా ఉన్న కాలం నాటి అనేకానేక ఘటన లపై ఆయన తన డైరీలో వ్యాఖ్యానించారు.

రాహుల్‌ను, కాంగ్రెస్‌కు చుక్కానిగా తీర్చిదిద్దా లన్న సోనియా తల్లిప్రేమ, గారాబం ఎక్కువైన రాహుల్‌ ‌వ్యవహారశైలి ఇప్పటికీ పార్టీలోని సీనియర్‌ ‌నాయకులనేకుల బీపీ పెంచుతూనే ఉంది. సోనియా వైఖరి సామూహిక ఆలోచన, నిర్ణయాలు చేయడానికి వ్యతిరేకంగా ఉందంటూ కాంగ్రెస్‌కు చెందిన 23 మంది సీనియర్‌ ‌నాయకులు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని  2020లో రాసిన లేఖ ఎటువంటి పరిణామాలకు దారి తీసిందో అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ప్రణబ్‌ అభిప్రాయాలు ప్రాముఖ్యతను సంతరించు కుంటాయని వేరే చెప్పనవసరం లేదు.

ఒక కాంగ్రెస్‌వాదిగా ఎవరితోనూ పంచుకోని తన ఆవేదనను, అభిప్రాయాలను ప్రణబ్‌ ఎం‌త శ్రద్ధగా నమోదు చేశారో, దానిని అంతటి తటస్థ వైఖరితో ఆయన కుమార్తె శర్మిష్ట యథాతథంగా ప్రచురించేందుకు శ్రమపడి, యూపీఏ కాలంలో చీకట్లో ఉండిపోయిన అనేక విషయాలను వెలుగు లోకి తెచ్చారు. 1960ల నుంచే ఎంతో శ్రద్ధగా డైరీ రాయడాన్ని ముఖర్జీ అలవాటు చేసుకున్నారు. ప్రణబ్‌ ‌డైరీలలో నమోదు చేసిన అంశాలు, కాలక్రమంలో తను భిన్న అంశాలపై జరిపిన సంభాషణల ఆధారంగాను ఈ పుస్తకాన్ని రచించినట్టు ఆమె పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలిపారు.

మరణించడానికి నెల ముందు, అంటే  జులై 28, 2020లో ప్రణబ్‌, ‘‘‌కేవలం గాంధీ-నెహ్రూ కుటుంబం రాజకీయ వినోదం కోసం కాంగ్రెస్‌ను ఓ మైదానంగా మార్చడంతోనే పార్టీ తన ప్రజా స్వామిక స్వభావాన్ని కోల్పోయింది. అదే దేశంలోని ప్రభుత్వ పాలనా పద్ధతిని ప్రభావితం చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులే 37 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని నియంత్రించడం అత్యంత నీచమైన ఆధిపత్యం. ఆ కుటుంబం నేడు సంస్థకు జవసత్వా లను ఇవ్వకుండా దాని బలాన్ని తినేస్తోంది. 2001- 2003 వరకు సోనియాజీ పాక్షికంగా వేసిన పునాదిని (బేస్‌) 2004 ‌నుంచి సోనియాగాంధీ, రాహూల్‌ ‌కోల్పోయారు. ఇందుకు కారణం, ఇతర ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో కేంద్రంలో ఏదో ఒకరకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల మాత్రమే వారు ఎక్కువగా ఆసక్తి చూపడం’’ అని తన డైరీలో రాసుకున్నారు.

ఈ మాజీ రాష్ట్రపతికి అత్యంత ఆగ్రహం తెప్పించినది – 2013లో దోషారోపిత రాజకీయ నాయకులను కాపాడాలనే యత్నంతో జారీ చేసిన ఆర్డినెన్స్‌ను బహిరంగంగా చించివేయడం. అతడి రాజకీయ అపరిణతిపై ముఖర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సందర్భంగా ఆయన తన డైరీలో, ‘‘అజయ్‌ ‌మాకెన్‌ ‌పెట్టిన విలేకరుల సమావేశంలోకి దూసుకువచ్చి, కేబినెట్‌ ‌నిర్ణయాన్ని అర్థం లేనిదానిగా (రాహుల్‌) అభివర్ణించాడు. ఇది ఎంత మాత్రం తగని పని. రాహుల్‌ ‌గాంధీకి గాంధీ-నెహ్రూ వంశపు అహంకారం, పొగరు వచ్చినా, రాజకీయ చతురత రాలేదు’’ అని ఘాటుగానే విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వాస్తవానికి అద్దం పట్టినా, రాహుల్‌ ‌రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవే.

వాస్తవానికి ఆ ఆర్డినెన్స్‌ను శిక్ష పడిన ఆర్జేడీ అధిపతి లాలూ యాదవ్‌ ‌వంటి వారిని అనర్హత వేటు నుంచి తప్పించేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం రూపొందించిందేనన్న వాదనా ఉంది. ఆ ఆర్డినెన్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కపిల్‌ ‌సిబాల్‌, అహ్మద్‌ ‌పటేల్‌ ‌నుంచి తన కార్యాలయానికి ఎలా కాల్స్ ‌వచ్చాయో ముఖర్జీ నమోదు చేశారు. అయితే, కూటమి భాగస్వాములను రాహుల్‌ ‌చర్యలు ఎలా ప్రభావితం చేస్తాయో అని ముఖర్జీ ఆలోచనలో పడ్డారు.

ఈ వార్తను తండ్రికి మొదట తెలిపింది తనేనంటూ, ‘‘చాలాకాలం తర్వాత నా తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురికావడం చూశాను! ఆయన ముఖం కందిపోయి, ‘‘తను (రాహుల్‌) ఎవరను కుంటున్నాడు?  కేబినెట్‌ ‌సభ్యుడు కాదు. అలాంట ప్పుడు ఒక కేబినెట్‌ ‌నిర్ణయాన్ని బహిరంగంగా అలా ఎలా చించేయగలడు? ప్రధాన మంత్రి విదేశాలలో ఉన్నారు. తన చర్యలు ప్రధానమంత్రిపైనా, ప్రభుత్వంపైనా ఎటువంటి ప్రభావం చూపుతాయో, దానికి ఎలాంటి  పర్యవసానాలుంటాయో అతడికి ఏమైనా అర్థమవుతోందా? ప్రధానమంత్రిని ఇలా అవమానించే హక్కు అతనికి ఎక్కడిది?’’ అంటూ ఆవేశపడ్డారు. రాహుల్‌ ‌వెర్రికూతలు, చేష్టలే కాంగ్రెస్‌కు తిలోదకాలు ఇచ్చేశాయని ముఖర్జీ భావించారని శర్మిష్ఠ పేర్కొన్నారు.

తన ప్రభుత్వం పట్ల బహిరంగ తిరస్కారాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు ప్రదర్శించాడు. అటువం•ప్పుడు నీకు ప్రజలు మళ్లీ  ఎందుకు ఓటు వేయాలంటూ, నాడు ఢిల్లీ కాంగ్రెస్‌ ‌యూనిట్‌లో చురుకుగా పని చేస్తున్న శర్మిష్ఠను ప్రశ్నించారు. ఆ ఆర్డినెన్స్‌ను జారీ చేయవద్దంటూ పార్టీలో సభ్యులకు నచ్చచెప్పేందుకు రాహుల్‌ ‌తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఎవరూ అతడి మాటను వినలేదని తాను తండ్రికి చెప్పడానికి ప్రయత్నించడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘నేను ఈ విషయాన్ని నా తండ్రికి చెప్పి•నప్పుడు, తన ఇన్నేళ్ల రాజకీయాలు, పార్టీలో ప్రభావవంతమైన స్థానం ఉన్నప్పటికీ, ఎటువంటి నాటకీయతకూ పాల్పడ కుండా రాహుల్‌ ‌తన సహచరులకు నచ్చచెప్పలేక పోయాడంటే, బహుశ రాజకీయాలు అతడికి తగినవి కావేమో అటూ ఆయన తీవ్రంగా స్పందించారు’’ అని అన్నారు

రాహుల్‌ ‌గాంధీకి రాజకీయంగా పరిణితి లేదని, అందుకే బహుశ అతడు ఊహాత్మక యుద్ధంలో (బాటిల్‌ ఆఫ్‌ ‌పర్సెప్షన్‌)‌లో ఓడిపోతున్నాడని ప్రణబ్‌ అన్నారు. ఈ ఘటన తర్వాత ఆయనకు రాహుల్‌పై ఉన్న విశ్వాసం సన్నగిల్లింది. ప్రణబ్‌ ‌ముఖర్జీ అంచనా ప్రకారం గాంధీలు- సోనియా, రాహుల్‌, ‌ప్రియాంక గాంధీలు ఒకరినొకరు తప్ప ఇంకెవరినీ పూర్తిగా విశ్వసించరు.

391 పేజీలు ఉన్న ఈ సుదీర్ఘ గ్రంథం పూర్తిగా రాహుల్‌ ‌గాంధీపై విమర్శలే గుప్పించడానికే పరిమిత మైందనుకుంటే పొరపాటే. అనేక సందర్భాలలో, రాహుల్‌, ‘‌చాలా మర్యాదస్తుడు,’ ‘ప్రశ్నల పుట్ట’ అని ముఖర్జీ ప్రశంసించారు. ఇవన్నీ రాహుల్‌కు అధ్యయనం పట్ల ఉన్న ఆసక్తికి సంకేతాలని ఆయన భావించారు. కానీ, ‘రాజకీయంగా రాహుల్‌ ఇం‌కా పరిణితి చెందవలసిన అవసరం ఉంద’ని కూడా ముఖర్జీ గమనించారు. సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు ప్రణభ్‌ ‌భారత రాష్ట్రపతి అయిన తర్వాత కూడా రాహుల్‌ ఆయనను రాష్ట్రపతి భవన్‌లో కలుసు కుంటూనే ఉండేవారు. కేబినెట్‌లో చేరి, పాలనలో స్వీయ అనుభవాన్ని గడించవలసిందిగా ముఖర్జీ అనేక పర్యాయాలు రాహుల్‌కు సలహాలు ఇస్తూ ఉండేవారు. ఇటువంటి సందర్భంలోనే ఒకసారి, మార్చి 25, 2013న,‘‘ అతడికి (రాహుల్‌) ‌విస్తృత విషయాంశాల మీద ఆసక్తి ఉంది కానీ ఒక అంశం నుంచి మరొక దానిపైకి వేగంగా దృష్టి మరలుస్తాడు. అతడు ఎంత విన్నాడో, ఎంత అర్థం చేసుకున్నాడో నాకు తెలియదు’’ అంటూ పేర్కొన్నారు.

జులై 15, 2013లో రాహుల్‌ ఆయనతో కలిసి భోజనం చేశాడు. కాంగ్రెస్‌ను వ్యవస్థాగతంగా సంస్కరించేందుకు తన ప్రణాళికలను గురించి వివరణాత్మకంగా రాహుల్‌ ‌చెప్పారని ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారు. ఆ ప్రణాళికలు ఏమిటన్నది రాయనప్పటికీ, సవాళ్లను ఎదుర్కొనేందుకు రాహుల్‌ ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించాడని మెచ్చు కున్నారు. రెండు నెలల తర్వాత రాహుల్‌ ఏం ‌చేయ బోతున్నాడో  (ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను చించివేయడం) ముఖర్జీకి తెలిసి ఉంటే ఆ పని చేయవద్దంటూ బలంగా సలహా ఇచ్చి ఉండేవారు.

వీ•న్నింటినీ మించి 2014 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన తర్వాత రాహుల్‌ ‌తరచు పార్లమెంటుకు గైర్హాజరు కావడం పట్ల తన తండ్రి బాధపడ్డారని శర్మిష్ఠ అన్నారు.

ప్రధానమంత్రి పదవి ఇస్తారనుకోలేదు

తనను ప్రధాన మంత్రిని చేస్తారనే ఆశలు తనకు ఎప్పుడూ లేవంటూ సోనియా ఒక జర్నలిస్టుకు చెప్పిన విషయాన్ని శర్మిష్ఠ గుర్తు చేశారు. ‘‘2004లో  ప్రధానమంత్రిని కావాలన్న కోరికను సోనియాగాంధీ త్యజించిన తర్వాత, ఎవరు ప్రధానమంత్రి అవుతారనే విషయంపై మీడియాలో ఊహాగానాలు సాగాయి. నా తండ్రి పేరు, మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. నేను ఆయనను ఎంతో ఉత్సాహంతో అయితే నువ్వేనా ప్రధానమంత్రివి అని అడిగాను. కానీ ఆయన లేదు, మన్మోహన్‌సింగ్‌ అవుతారని సమాధానం చెప్పారు’ అని శర్మిష్ఠ వెల్లడించారు.

2009 సార్వత్రిక ఎన్నికలు జరిగే కొద్ది కాలం ముందు తను సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలం కాదని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ (సిడబ్యుసి) సమా వేశంలో రాహుల్‌ ‌గాంధీ అన్న విషయాన్ని ప్రణబ్‌ ‌ముఖర్జీ డైరీలో ఎక్కించారు. రాహుల్‌ ‌తన ఆలోచనలను క్రమబద్ధంగా, సందర్భోచితంగా ఉంచు కోవాలని తన తండ్రి చెప్పారని, తాను ఆయనను కలుస్తానని రాహుల్‌ ‌గాంధీ చెప్పారని ఆమె పేర్కొన్నారు. 2004-2014వరకు సాగిన యూపీఏ పాలనాకాలంలో ఇరువురు నాయకుల మధ్య పెద్దగా సంభాషణలు సాగలేదని ఆమె అన్నారు.

రాహుల్‌ ‌ప్రధాని ఆకాంక్షలపై అనుమానాలు

ప్రణబ్‌ ‌మొగల్‌ ‌గార్డెన్స్‌లో మార్నింగ్‌ ‌వాక్‌ ‌చేసేవారు. మార్నింగ్‌ ‌వాక్‌ ‌వేళ, పూజవేళ తనను ఎవరూ కదిలించినా ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కానీ, ఒక రోజు ఉదయం మొగల్‌ ‌గార్డెన్స్‌లో రాహుల్‌ ‌గాంధీ వచ్చి కలుసుకున్నారు. వాస్తవానికి, రాహుల్‌ ఆ ‌సాయంత్రం వచ్చి కలుసుకోవలసి ఉందని తనకు తెలిసిందంటూ శర్మిష్ఠ తెలిపారు. నేను ఈ విషయాన్ని తండ్రికి చెప్పినప్పుడు, ఆయన ఎంత మాత్రం ఆశ్చర్యపోలేదు. రాహుల్‌ ‌గాంధీ కార్యాలయం ఎమ్‌ఎమ్‌, ‌పీఎమ్‌కి మధ్య తేడా తెలుసుకోలేనప్పుడు, అతడు ప్రధానమంత్రి ఎలా కాగలడు? అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయాన్ని ఆమె పుస్తకంలో పొందుపరిచారు.

సావర్కర్‌పై సోనియాతో ఏకీభవించని ముఖర్జీ

సావర్కర్‌ ‌చిత్రాన్ని పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్లో పెట్టేందుకు అంగీకరించి నందుకు సోనియా గాంధీ  ఫిబ్రవరి 25, 2003 నాటి కాంగ్రెస్‌ ‌పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం గురించి ముఖర్జీ డైరీలో రాసుకు న్నారు. సావర్కర్‌ ‌బ్రిటిష్‌ ‌వారికి క్షమాభిక్ష పిటిషన్లు, తను విధేయుడనంటూ బాండ్లను సమర్పించినవాడనే భావన కాంగ్రెస్‌లో ఉంది. అయితే, ‘‘అది అతడి త్యాగాన్నీ, దేశభక్తినీ తగ్గించద’’ని సోనియాకు సమాధానం చెప్పినట్టు ముఖర్జీ రాసుకున్నారు. ‘‘తర్వాతి సంవత్సరాలలో ఆయన అభిప్రాయాలు ఏమైనప్పటికీ, అతడిని దేశభక్తుడిగా పరిగణించి నందున తాను  (పార్లమెంటరీ కమిటీ) సమావేశంలో సావర్కర్‌ ‌చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు అంగీకరించానని ఆమెకు స్థిరంగా చెప్పాను’’ అని కూడా రాశారు.

‘‘వ్యక్తులు మరుగుజ్జులయిపోయారు. సెల్యులార్‌ ‌జైల్లో సావర్కర్‌ ‌సోదరులు అనుభవించిన బాధలను ఎవరైనా ఎలా మరచిపోగలరు?’’ అంటూ దానికి కొనసాగింపుగా రాసుకున్నారు ప్రణబ్‌. ఆ ‌కార్యక్రమాన్ని బహిష్కరించాలని పార్టీ నిర్ణయించింది కనుక తాను హాజరుకానని సోనియాకు హామీ ఇస్తూనే, అది చాలా తప్పుడు నిర్ణయమని విధేయుడైన కాంగ్రెస్‌వాదిగా ముఖర్జీ ఆమెకు చెప్పినట్టుగా తన డైరీలో నమోదు చేశారు.

About Author

By editor

Twitter
Instagram