‘భారతదేశానికి ఆకాశమంత చరిత్ర ఉంది. కానీ దానిని నమోదు చేసిన పుస్తకాలు మాత్రం చాలా తక్కువ’ అన్నారు కేరళ పురావస్తు పరిశోధకుడు ఆచార్య శశిభూషణ్‌. ‌దీనికి ఇంకొక వాక్యం కూడా చేర్చుకోవాలి. చరిత్ర పుస్తకాలు తక్కువ అయితే, వాటిని చదివేవాళ్లు మరీ పరిమితం. లేకపోతే ఉత్తరాది వేరు, దక్షిణ భారతదేశం వేరు అంటూ రాజకీయం తప్ప మరే అంశమూ లేని కొన్ని సూత్రీకరణలు వచ్చి ఉండేవి కావు. ఉత్తరాది రాష్ట్రాలని పార్లమెంట్‌లో గోమూత్రం రాష్ట్రాలని ఎద్దేవా చేసేటంత కుసంస్కారం కనిపించి ఉండేది కాదు. దేశమంతా ఒకే సంస్కృతి ఉంది. భారత దేశమంతా ఒకే సాంస్కృతిక వారసత్వం ఉంది. రాజకీయ ఏకత్వం లేదు. తెచ్చుకున్న రాజకీయ ఏకత్వానికి వివేకం, విజ్ఞత అద్దాలన్న ప్రయత్నం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. డిసెంబర్‌ 10, 11 ‌తేదీలలో హైదరాబాద్‌లో సెంటర్‌ ‌ఫర్‌ ‌సౌత్‌ ఇం‌డియన్‌ ‌స్టడీస్‌ ‌కార్యశాలలో ప్రసంగించిన శశిభూషణ్‌ ఎన్నో గొప్ప విషయాలను ఆధారాలతో ఆవిష్కరించారు. అవన్నీ భారతదేశ ఐక్యతకీ, సాంస్కృతిక ఔన్నత్యానికి సంబంధించినవే. ‘సంప్రదాయపు లోతులు’ అన్న అంశం మీద ఆయన ప్రసంగించారు.

 ఆచార్య శశిభూషణ్‌ ‌మొదట మలయాళ సాహిత్య విద్యార్థి. తరువాత పురావస్తు శాస్త్రంలో పరిశోధన చేశారు. అయోధ్య గురించి ఆయన విశేషమైన పరిశోధన చేశారు. కేరళ చరిత్ర ఆధారంగా ఆయన చెప్పిన అంశాలలో శతాబ్దాలుగా ఉత్తర, దక్షిణ భారతదేశవాసుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఆధ్యాత్మిక ఏకాత్మత చర్చకు వచ్చాయి.

సంస్కృతిక భౌగోళిక అంశాలతో ముడిపడి ఉంటుంది. కేరళ చరిత్రను ఒక్క వాక్యంలో నిర్వచించాలంటే- వాణిజ్య అవసరాల కోసం పారతంత్య్రాన్ని ఆహ్వానించిన ప్రాంతం. వ్యాపారం పేరుతో వచ్చిన అరబ్బులు ఇస్లాంను, పోర్చుగీసు వారు క్రైస్తవాన్ని, చైనీయులు బౌద్ధాన్ని ప్రవేశపెట్టారు. పోర్చుగల్‌ ‌వారు అప్పుడే గుళ్లు కూల్చారు. అయినా నాటి కేరళ పాలకులు నిరోధించలేదు. నిజానికి హిందువులు ఏకం కాకుండా ఉంచే వ్యూహాలు ఇప్పటికీ అక్కడ అమలవుతున్నాయి. శబరిమలై చరిత్రకు సంబంధించి ఒక నకిలీ శాసనాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం కోర్టుకు ఇచ్చింది. దాని గురించి ఒక వర్గం చరిత్రకారులు బయటపెట్టారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కేరళ ప్రాంతంలో రామాయణం 9వ శతాబ్దం నుంచి జనంలో ఉన్నది. ఇందుకు కారణం ‘ఆశ్చర్య చూడామణి’ నాటకం. ఇదే కాదు, ఉత్తర భారతదేశంతో దక్షిణాదికి సంబంధమే లేదన్నట్టు వాదించే వారికి సమాధానంగా అనేక రుజువులు కనిపిస్తాయి. శంకరాచార్యులు కాలడి నుంచి కామాఖ్య (అస్సాం) దేవాలయం వరకు యాత్ర చేశారు. అంటే కశ్మీర్‌, ఈశాన్య భారతం వరకు కూడా ఆయన పాదముద్రలు కనిపిస్తాయి. స్వాతి తిరునాళ్‌, ‌మార్తాండవర్మ ఆసేతు శీతాచల పర్యంతం అన్న పదం రాశారు.  వీరందరికీ అనుసంధాన భాష ఏమిటి? సంస్కృతమే. నిజానికి మలయాళం (తమిళం వలె) సంస్కృతాన్ని ఏనాడూ పరభాషగా చూడలేదు. నలభయ్‌ ‌శాతం ఆ భాష నుంచి వచ్చిన పదాలే ఉన్నాయి. జోషి మఠం స్థాపించిన శంకర్‌నాథ్‌ ‌జోషియర్‌ ‌కేరళ వారే. కింది కులాలలో వస్తున్న విభేదాలను రూపుమాపడానికి ఒక ఆధ్యాత్మిక వేత్తను వెతకవలసిందని డాక్టర్‌ ‌పర్పుకు సలహా ఇచ్చిన వారు వివేకానందుడు. ఆ ఆన్వేషణలో లభించినవారే నారాయణ గురు. రాజా రవివర్మ కూడా తరువాత ఉత్తర భారతదేశంతో ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. అక్కడి దేవీదేవతల బొమ్మలు కూడా గీశారు. కానీ ఈ సంబంధాన్ని ద్వేషంగా మార్చే పని స్వతంత్ర భారతదేశంలో జరిగింది. ఆ(ఓ)నమ్‌ ‌పండుగ ఇందుకు ఉదాహరణ. ఆ పండుగను అక్కడ మహాబలి పునరాగమనం పేరుతోను, వామన జయంతి పేరుతోను, ఒక సామాజిక ఉత్సవంగా ముస్లింలు, ఇతర మతాలవారు కూడా నిర్వహిస్తారు. ఈ పండుగలో వాస్తవానికి మాంసాహారం నిషిద్ధం. కానీ కొన్ని ప్రాంతాలో మాత్రం తింటారు. అదే అలవాటు మొత్తం కేరళ అంతటా పాటింప చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నది. ఇది నిస్సం దేహంగా హిందువుల మధ్య విభేదాలు తేవడానికే. పట్టణంలో జరుగుతున్న పురావస్తు తవ్వకాలకు కమ్యూనిస్టు ప్రభుత్వం డబ్బులు కుమ్మరించడం కూడా ఇందులో భాగమే.

ఏమిటీ పట్టణం పురావస్తు తవ్వకాలు? ఎందుకు? కేరళలోనే మలబార్‌ ‌తీరంలో ఉన్న ముజిరిస్‌(‌ముసిరి) దగ్గర ఈ తవ్వకాలు జరుగు తున్నాయి. ఇది ఒకప్పటి ఇండో-రోమన్‌ ‌నౌకాశ్రయ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మొదట ఇనుప యుగానికి చెందిన ప్రజలు ఆక్రమించుకోగా, తరువాత రోమనలు ఆక్రమించారని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విధంగా ఈ ప్రాంతం పురాతన భారతీయ పాలకుల అధీనంలో కాకుండా రోమన్‌ల చేతిలోనే ఉన్నదని, వారి సంస్కృతి మాత్రమే వర్ధిల్లిందని చెప్పడం తవ్వకాల వెనుక ఉన్న వ్యూహం. ఆ విధంగా ఒక విభజనను తీసుకురావడమే కమ్యూనిస్టు ప్రభుత్వం ఉద్దేశం. ఇక్కడ చేర వంశీకుల నాణేలతో పాటు రోమన్‌లకు చెందిన టెర్రా సిగిల్లిటా వంటి రకం కుండపెంకులు ఎక్కువ దొరికాయి.

 కేరళ మాత్రమే కాదు, తమిళనాడు కూడా ఉత్తరాదిని వేరుగా చూడలేదనే చెప్పవచ్చు. రాజరాజ చోళుడు బృహదీశ్వర ఆలయం కోసం గంగాజలం రప్పించారు. శ్రీలంకలో ప్రతి నదిని దాని అసలు పేరుతో పాటు గంగ అన్న పేరు కూడా తప్పనిసరిగా ఉంటుంది.

అయినా ఈ విషయాలను చర్చకు రానివ్వకుండా ఒక వర్గం చరిత్రకారులు, వామపక్ష ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. చరిత్రను వక్రీకరిస్తూ, భారతీయ సంస్కృతికి వక్రభాష్యాలు చెబుతూ హిందువుల మధ్య ఏకత్వం రాకుండా చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలను ఆపవలసి ఉంటుంది. అందుకు మార్గం ఆ అంశాలను పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు రాజ్యమేలుతున్న వక్రభాష్యాలకు సమాధానం చెప్పాలంటే చరిత్ర పరిశోధన ఎంతో బలంగా జరగాలి.

సెంటర్‌ ‌ఫర్‌ ‌సౌత్‌ ఇం‌డియన్‌ ‌స్టడీస్‌ ఏర్పాటు వెనుక ధ్యేయం ఇదే. కార్యశాలలు, గోష్టు, పరిశోధన ద్వారా దక్షిణ భారతదేశ చరిత్రను  సమగ్రంగా అందించాలి. అంతేకాదు, ఉత్తర దక్షిణ భారతాలంటూ ద్రవిడ రాజకీయవేత్తలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి కూడా ఈ అధ్యయన కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తున్నది. దక్షిణ భారతదేశానికీ, ఉత్తర భారతదేశానికీ రాజకీయ ఏకత్వం కొంతకాలం లేకున్నా, సాంస్కృతిక ఏకత్వం చిరకాలం వర్ధిల్లిన సంగతిని ఉత్తర భారతదేశ వాసులకు తెలియచెప్పడం కూడా ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి.

About Author

By editor

Twitter
Instagram