డిసెంబర్‌ 23 ‌జాతీయ రైతు దినోత్సవం 

భారత్‌ ‌వంటి దేశ ఆర్థిక వ్యవస్థలో, అభివృద్ధిలో వ్యవసాయరంగం కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి ప్రధాన జీవనాధారం. 2011 ప్రపంచ బ్యాంక్‌ ‌లెక్కల ప్రకార దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 18 శాతం వ్యవసాయరంగం నుండి వస్తుంది. తాజా గణాంకాల ప్రకారం మన గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 84 శాతం మంది మహిళలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందులో 33 శాతం రైతులు. 47శాతం రైతు కూలీలు.

2009 నాటి ఒక అధ్యయనం ప్రకారం 94 శాతం మహిళా కూలీలు ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగులో పనిచేస్తున్నారు. 3.72. శాతం మంది పండ్లు, గింజలు, పానీయాలు, మసాలా దినుసుల పంటల ఉత్పత్తిలో పనిచేస్తున్నారు. దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోత కోయడం, కుప్పలు ఎత్తడం మొదలైన సేద్యం పనుల్లో మహిళలదే ఎక్కువ భాగస్వామ్యం. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు వ్యవసాయ రంగంలో మూడో వంతు భాగస్వామ్యం కలిగి ఉన్నప్పటికి మహిళలను రైతులుగా అంగీకరించడం లేదు. 2010-12 వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం సాగులో ఉన్న భూమిలో మహిళా రైతులు సాగు చేస్తున్న భూమి 13 శాతం. తెలంగాణలో 34% భూములను మహిళలు సాగుచేస్తున్నారు. వ్యవసాయ కూలీలలో 57శాతం మహిళలు. దేశంలో 74% గ్రామీణ మహిళా శ్రామికులు వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు. మహిళా రైతులు పురుషులతో సమానంగా పని చేసినప్పటికీ వారిని రైతులుగా పరిగణించడం లేదు. చట్టపరంగా సమాన ఆస్తి హక్కు ఉన్నా, ఆచరణకు నోచుకోకపోవడం వల్ల మహిళా రైతులు ఆ హక్కులను అనుభవించలేకపోతున్నారు. విధాన పరమైన చర్చల్లో గాని కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలో మహిళా రైతులు భాగస్వామ్యం కావడంలేదు.

పెట్టుబడి -మహిళా రైతులు

వ్యసాయానికి పెట్టుబడి ప్రధాన సమస్య. మహిళా రైతులకు సంస్థాగత రుణాలు కూడా లభించడంలేదు. ఇచ్చేందుకు ప్రైవేట్‌ ‌వడ్డీ వ్యాపారులు ముందుకు రావడంలేదు. రుణ మాఫీ పేరుతో ప్రభుత్వ అనాచరణ పథకాల ప్రకటనల వల్ల రుణాలు సకాలంలో అందక వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని చెల్లించలేని స్థితిలో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్కెట్లో సౌకర్యాలు లేక గిట్టుబాటు ధర లభించక తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకుంటు న్నారు. మహిళా రైతులకు మార్కెట్‌ ‌యార్డుల్లో విశ్రాంతి గదులు, టాయిలెట్ల సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు.

మహిళా రైతుల ఆత్మహత్యలు

శ్రమ దోపిడీ ఒకవైపు మరోవైపు మహిళా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో పలు జిల్లాల్లో చోటుచేసు కున్నాయి. గత మూడేళ్లలో దేశ వ్యాప్తంగా జరిగిన మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉండడం శోచనీయం. ఆత్మహత్యలకు పాల్పడినవారిలో సన్న, చిన్న కారు రైతులే ఎక్కువ. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామని మా•ర్కెట్‌కు వెళితే అనేక సాకులు చెప్పి ధాన్యాన్ని కొనకపోవడం కనిపిస్తుంది.  ఆహారధాన్యాల భద్రత, రక్షణ, నిలువ చేసుకునే సౌకర్యాలు లేక వర్షాలకు తడిసి ముక్క పట్టడం వల్ల తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఎదురవుతున్నది. పంటను అమ్ముకుందామని మార్కెట్‌కు వెళ్లిన వెలిగొండ మహిళా రైతు పి. రాజవ్వ, కరీంనగర్‌ ‌జిల్లా సైదాపూర్‌లో గట్టవ్వ అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

చట్టాలపై అవగాహన కల్పించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ పంపిణీ పథకాలలో మహిళలకు ప్రాధాన్యమిస్తూ ప్రవేశపెట్టిన చట్టాల పట్ల మహిళా రైతులకు అవగాహన కలిగించాలి. భూమి మహిళ పేరు మీదకి తేవడంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ‌సహకరించడం లేదు. ఒకరి పేరు మీద ఉన్న భూ యాజమాన్య హక్కులను మరొకరి పేరు మీద నమోదు చేస్తున్నారు. ఇందువల్ల భూమి ఉన్నప్పటికీ, పట్టా లేక ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు పొందలేక పోతున్నారు. మహిళా రైతులకు పట్టాలు ఇవ్వడం లేదు. భూమి చూపెట్టకపోవడం వీరికి ఇచ్చిన భూమి హక్కులు సాగుకు అనుకూలంగా ఉండక పోవడం వల్ల చాలా మంది మహిళా రైతులు వ్యవసాయం మానుకుంటున్నారు. మహిళా రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు భూమికి సంబంధించిన రికార్డుల కాలమ్‌లో పురుషులతో పాటు వారి భార్య పేరు తప్పనిసరి చేర్చాలి. మహిళల పేరు మీద ఉన్న భూములు విస్తీర్ణం కమతాల సంఖ్య గుర్తించిన ప్రత్యేక సమాచారం పట్ల మహిళా రైతులకు అవగాహన లేదు. భూమికి సంబంధించిన రెవిన్యూచట్టాల పట్ల అవగాహన కలిగించాలి. షెడ్యూల్‌ ‌కులాలు, తెగల మహిళా రైతులకు చట్టపరమైన అంశాల మీద పథకాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

హక్కుల రక్షణ

ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై హరితహారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగుచేస్తున్న భూముల్ని గుంజుకొని హక్కులను హరించరాదు. ఆదివాసీ ప్రాంతాలలో ‘అటవీ హక్కులచట్టం’లో భాగంగా భూమి మీద వ్యక్తిగత ఉమ్మడి హక్కులను గుర్తిస్తూ మహిళల జీవనాధార హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద పరిశ్రమల స్థాపనలో భూమిని కోల్పోయిన ఆదివాసీ మహిళా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి జీవనోపాధి కలిపించాలి.

మహిళా రైతుల• సహకార సంఘాలుగా ఏర్పడాలి. సహకార మార్కెటింగ్‌ ఏర్పరిచి సుస్థిర వ్యవసాయం వైపు వారిని ప్రోతాహించాలి. మహిళలు విత్తన ఉత్పత్తిలో ఎదిగేట్లు ప్రభుత్వం ప్రోత్సహించాలి. మహిళా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వారికి అధునాతన వ్యవసాయ పనిముట్లను అందించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారి శ్రామిక సామర్థ్యాన్ని పెంచే కార్యాచరణకు పూనుకోవాలి.

మహిళా రైతులు- సంక్షేమ చర్యలు

  1. ప్రభుత్వం మహిళా రైతులను రైతులుగా పరిగణించాలి. వ్యవసాయ రుణాలు మంజూరు చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన మహిళా రైతు బ్యాంకును ఏర్పాటు చెయ్యాలి.
  2. వ్యవసాయ విధానాల రూపకల్పనలో మహిళా రైతులకు భాగస్వామ్యం కలిగించాలి. ఉద్యాన వనాల పెంపకంలో మహిళా రైతులకు, రైతు కూలీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం మహిళా రైతులకు కూలీలకు ఉచిత వైద్య, ఉచిత ఆరోగ్య బీమా సహాయం అందించాలి.
  3. న్యాయ సాధికార సంస్థ మహిళా రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించి భూమి హక్కులు, రెవెన్యూ హక్కులుపై అవగాహన చైతన్యం కలిగించి మానవ హక్కుల రక్షణ అనువైన వాతావరణం ఏర్పరచాలి.
  4. సమానపనికి సమాన వేతనం ఇచ్చే విధానాన్ని, కనీస వేతనాలు పొందే అవకాశం మహిళా రైతులకు, రైతు కూలీలకు కల్పించాలి.
  5. స్త్రీపురుషులకు సమాన ఓటు హక్కు కల్పించినట్లే మహిళా రైతులకు రైతు కూలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
  6. మహిళా రైతుల పేరు మీద భూపంపిణీ మొక్కుబడిగా జరిగింది. ఆ హక్కులను స్పష్టంగా నమోదు చెయ్యాలి. గ్రామ స్థాయి నుండి అన్ని స్థాయుల్లో భూమికి సంబంధించిన రికార్డస్ ‌ఫహాని 1బి రిజిస్టర్‌ ‌వ్యవసాయదారుని కాలమ్‌లో పురుషులతో పాటు వారి భార్యల పేర్లు తప్పనిసరిగా నమోదు చేయాలి. భూమి పై టైటిల్‌ ఇవ్వాలి.
  7. మార్కెట్‌ ‌యార్డులో మహిళా రైతులకు విశ్రాంతి గదులు మరుగుదొడ్ల సౌకర్యం కలిగించాలి.
  8. మహిళా రైతులు తమకు తామే మహిళా స్వశక్తి పొదుపు సంఘాలుగా ఏర్పడి ఆర్థిక స్వావలంబన ఆర్థిక సాధికారిత సాధనకు కృషి చేయాలి.
  9. పామాయిల్‌, ‌కొబ్బరి, మామిడి పండ్ల తోటలు, పౌల్ట్రీల ఏర్పాటులో మహిళా రైతులకు 50 శాతం రిజర్వేషన్‌ ‌సౌకర్యం కలిగించాలి.
  10. మహిళా రైతులకు వ్యవసాయ విద్య. శిక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలను ఏర్పాటు చెయ్యాలి.

మహిళా రైతులకు, భూమిలేని అన్ని వర్గాల కార్మికులకు, ఒంటరి మహిళలకు అనువైన వ్యవసాయ విధానాలు, అవసరమైన పెట్టుబడులు నిర్దిష్ట కాలంలో ప్రభుత్వం అందించే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి. వ్యవసాయంలో ఆత్మ గౌరవంతో హుందాగా కొనసాగటానికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలు/ సమకూర్చడంలో ప్రభుత్వం వివిధ శాఖల మధ్య సమన్వయంతో వ్యవసాయ అధికారులు మహిళా రైతుల సంక్షేమ కోసం చర్యలు చేపట్టాలి. వ్యవసాయ సాంకేతికతను అందిపుచ్చుకొని ఆహారోత్పత్తిలో స్వయం స్వమృద్ధి సాధించడంలో మహిళా రైతులు క్రియాశీలక పాత్ర పోషించాలి. అప్పుడే మహిళా రైతుల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం సాధ్యమై, వ్యవసాయరంగం పురోగమిస్తుంది.

– నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ‌ఫోరం, కరీంనగర్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram