ఆం‌ధప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయవంతంగా ప్రయాణిస్తున్నదని, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్‌, ‌చంద్రబాబునాయుడి రాజకీయ అనుభవం, పవన్‌ ‌కల్యాణ్‌ ‌జనాకర్షణ మంచి ఫలితాలు తెచ్చిపెడతాయని బీజేపీ ఆంధప్రదేశ్‌ అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత సుస్పష్టమని కూడా చెప్పారు. ఒక్క చాన్స్ అం‌టూ అడిగిన జగన్మోహన్‌రెడ్డి అధికారం ఇచ్చినందుకు నేడు ఆంధప్రదేశ్‌ ‌ప్రజలు విసిగి వేసారిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలను కూడా వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సక్రమంగా అందించలేకపోయిందని ఆమె విమర్శించారు. వైఎస్‌ ‌షర్మిల, గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు మరచిపోలేదని పురందేశ్వరి చెప్పారు. అయోధ్యలో మందిర నిర్మాణం ఐదు వందల ఏళ్ల స్వప్నమని, అది పూర్తయినందుకు అంతా ఆనందించారని చెప్పారు. మే 13న పోలింగ్‌ ‌సందర్భంగా జాగృతికి శ్రీమతి పురందేశ్వరి ఇచ్చిన ముఖాముఖీలోని అంశాలు ఇక్కడ ఇస్తున్నాం:

బీజేపీ, తెలుగుదేశం పార్టీ-జనసేనల కొత్త ప్రయాణం ఎలా ఉంది?

పొత్తు కుదిరిన తర్వాత భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు వెళుతున్నాము. రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లాస్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో మాత్రమే కాకుండా మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ మూడు పార్టీలు పరస్పరం మాట్లాడుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో కూడా చర్చించుకుంటూ ముందుకు వెళుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కనుక మంచి సమన్వయం ఉంది. అట్లాగని చెప్పి ఇబ్బందులు లేకపోనూ లేదు. ఒకటి రెండు ప్రాంతాల్లో కొంత సమన్వయ లోపం ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి నాయకులు వెంటనే దృష్టి సారించి అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆశిస్తున్న నాలుగు వందల స్థానాలలో ఆంధప్రదేశ్‌ ‌నుంచి ఎన్ని స్థానాలు  ఉండవచ్చు?

సాధారణంగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో అన్ని స్థానాలు గెలవాలి అనే భావన తోటే, ఆ లక్ష్యంతోటే ముందుకువెళతాము. పాతికకు పాతిక పార్లమెంటు సీట్లు గెలవాలన్నది భావన. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాకొచ్చిన నివేదికను పరిశీలించినట్లయితే 18-20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అర్థమవుతుంది.

కేరళ, త్రిపుర వంటి ప్రాంతాలలో కూడా దూసుకుపోయిన బీజేపీ ఆంధప్రదేశ్‌ ‌వంటి రాష్ట్రంలో ఎందుకు వెనుకపడి ఉందని మీ అభిప్రాయం?

ఆంధ్రరాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులను భారతీయ జనతాపార్టీ ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్నది. సంస్థాగతంగా బలోపేతం అయ్యాము, కొంచెం బలం పుంజుకున్నాము అని భావించినప్పటికీ పొత్తులో ఎప్పటికప్పుడు వెళ్లటంవలన కొంతమేరకు మా సంస్థాగత బలం విషయంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా మేము సంస్థా గతంగా బలోపేతం అయ్యాము అని భావించాము. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తుపెట్టుకోవలసిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఒకింత కార్యకర్తలు తగ్గిన నేపథ్యం. కనుకనే ఎప్పటికప్పుడు అంటే 1998 ఆ ప్రాంతంలో 18 శాతంగా ఉన్న బీజేపీ ఓటు శాతం నెమ్మదిగా తగ్గుతూ రావడానికి కారణం ఎప్పటికప్పుడు పొత్తులకు వెళ్లడమే.

టిక్కెట్ల కేటాయింపులో కొంత గందరగోళం చెలరేగింది. ఇందుకు కారణం పొత్తు తతంగం ఆలస్యంగా ఆరంభం కావడమా? లేక అభిప్రాయా లలో పొంతన లేకపోవడమా?

భారతీయ జనతాపార్టీ పొత్తు పెట్టుకోవడానికి మూడు నెలల ముందే తెలుగుదేశంపార్టీ, జనసేనపార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. చర్చించుకున్న ఫలితం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, సీట్ల కేటాయింపు జరిగిపోయింది. భారతీయ జనతాపార్టీ ఈ పొత్తులోకి వచ్చిన తరువాత కొన్ని స్థానాలు ఆశించినప్పటికీ అక్కడ అప్పటికే పొత్తులో ఉన్న పార్టీలు, అవి కొంత బలంగా కూడా ఉన్నందువల్ల ఆ స్థానాలు కావాలని చెప్పి తెలుగుదేశం, జనసేన అడిగాయి.

ఈ సందర్భంలో అన్నీ మనం అనుకున్నట్టు రాకపోయినా ఆ తరువాత మళ్లీ వారితో చర్చించి నెమ్మదిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగక తప్పని పరిస్థితి. అనుకున్న స్థాయిలో మనకి సంతృప్తికరంగా అనిపించకపోయినా చాలావరకు కూడా మంచి సీట్లే భారతీయ జనతాపార్టీ తీసుకోకలిగింది.

దేశం మొత్తం మీద మోదీ ఫ్యాక్టర్‌ ‌సుస్పష్టం. మోదీ ప్రభంజనానికి తోడు నారా చంద్రబాబు నాయుడి అనుభవం, పవన్‌ ‌కల్యాణ్‌ ‌జనాకర్షణ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఎన్‌డీఏ కూటమికి ఆంధప్రదేశ్‌లో ఎలాంటి ఫలితాలు అందివ్వబోతు న్నాయి? వీటిని మీరు ఎలా ఓట్లుగా మార్చ బోతున్నారు?

నరేంద్రమోదీగారి నాయకత్వం కావచ్చు, చంద్రబాబునాయుడు సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం కావచ్చు, అదేవిధంగా పవన్‌కల్యాణ్‌గారి జనసేన జనాకర్షణ కావచ్చు, ఇవి ఆంధ్రరాష్ట్రంలో మంచి ఫలితాలను అందిస్తాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం.ఈ మాట ఎక్కడికి వెళ్లినా కూడా ఇవాళ ప్రజలు ఎన్‌డిఏ కూటమిని ఆశీర్వదించటానికి సన్నద్ధంగా ఉన్నట్లుగా సుస్పష్టంగా అర్థమవుతున్నది. కనుక ఈ నేపథ్యంలో కచ్చితంగా వందకుపైగా అసెంబ్లీ సీట్లు కూటమి గెలుచుకుంటుందని నేను భావిస్తున్నాను.

మోదీ పథకాల ప్రభావం ఆంధప్రదేశ్‌ ఎన్నికల మీద ఎలా ఉంటుంది?

ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే ఏ అభివృద్ధి కార్యక్రమంలోనన్న కావచ్చు, ఏ సంక్షేమ కార్యక్రమంలో నన్న కావచ్చు, మనకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం మెండుగా కనిపిస్తున్నది. రోడ్ల నిర్మాణం దగ్గర నుండి రైల్వే లైన్ల నిర్మాణం, ట్రైన్లు వేసే దగ్గర నుండి పేదలకు ఇచ్చే ఇళ్లు, అదే విధంగా మరుగు దొడ్లు, నీటి కుళాయిలు, విద్యుత్తు. ఏది చూసినా కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరిగే అవకాశం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తు న్నారు, అర్థం చేసుకుంటున్నారు.

తెలంగాణలో ఒక పార్టీని స్థాపించి, దానికి అధ్యక్షురాలిగా కూడా పనిచేసి ఇప్పుడు ఆంధప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ప్రచారంలో పాల్గొంటున్న, పోటీ చేస్తున్న వైఎస్‌ ‌షర్మిలను ఓటర్లు ఏ విధంగా పరిగణిస్తారు?

ఇతర పార్టీల అధ్యక్షులు, అధ్యక్షురాలు అన్న విషయాల మీద మేం దృష్టి కేంద్రీకరించడం లేదు. మేము ఏ విధంగా ప్రజల వద్దకు వెళుతున్నామో, మేము మా మనసులో మాట ప్రజలకు ఎంత స్పష్టంగా చేరవేస్తున్నామో, మా ఎజెండా ఏమిటో, సరియైనటువంటి రీతిలో ప్రజలకు తెలియజేయ గలుగు తున్నామో లేదా? ఇవే మా ప్రధాన ఫోకస్‌. ‌షర్మిలగారు, అంటే కాంగ్రెస్‌ ‌పార్టీ గతంలో అధి కారంలో ఉన్నప్పుడు వారి బుజ్జగింపు రాజకీయాలు- కొన్ని వర్గాలను ఓటుబ్యాంకులుగా పరిగణించి, వారికి మాత్రమే అన్ని విధాలా సహకరిస్తూ, మిగిలిన వర్గాలని విస్మరించిన విషయాన్ని ప్రజలు మరవలేదని మాత్రం నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర విభజన కూడా శాస్త్రబద్ధంగా చేయకుండా ఇష్టానుసారంగా చేసిన విషయమూ ప్రజలు మరవలేదు. కనుక ఇవన్నీ కూడా ప్రజల మనసులలో సుస్పష్టంగా వారికి గుర్తున్న విషయాలు.

2024 లోక్‌సభ ఎన్నికలు చరిత్రాత్మకమని, దేశంలో మరింత గుణాత్మకమైన మార్పునకు అవి బాటలు వేస్తాయని దేశమంతా, ప్రపంచ మంతా గట్టి అభిప్రాయం ఉంది. ఈ అంశం గురించి ఒక సీనియర్‌ ‌రాజకీయవేత్తగా మీరు ఏమను కుంటున్నారు?

కచ్చితంగా చారిత్రాత్మకమైనవని భావిస్తున్నాను. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు దేశంపై ప్రభావం చూపే అవకాశమూ ఎక్కువే. దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలంటే పార్లమెంటులో ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యత ఉండాలి. నిన్నమొన్నటి వరకు లోక్‌సభలో బిల్లులను ఆమోదింప చేసుకున్నప్పటికీ రాజ్యస•భలో అధిక్యత లేకపోవడం వల్ల కొన్ని బిల్లులను అనుకున్న స్థాయిలో చేసుకోలేక పోయాం. 370 అధికరణ, త్రిపుల్‌ ‌తలాక్‌ ‌రద్దు తదితర చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, అదే సుస్పష్టమైన ఆధిక్యత ఉంటే మరింత మెరుగైన, గట్టి నిర్ణయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు మంచి మెజారిటీ ఇవ్వాలనే భావన ప్రజల్లో కనబడుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహనరెడ్డి ఇంతకు ముందు ఢిల్లీ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించ లేదు. చాలా నిర్ణయాలను సమర్థిం చారు. వారి ఏంపీలు మద్దతుగా నిలిచారు. ఇకపై బీజేపీతో ఆయన ప్రయాణం ఎలా ఉంటుందని అనుకోవచ్చు?

నిజంగా దేశ ప్రయోజనాలకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశం ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమర్థిస్తారని అనుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి ఎన్నడూ దేశ వ్యతిరేక విధానాలు, నిర్ణయాలు చేయదు.

ఈ ఎన్నికలలో అయోధ్య ప్రభావం ఆంధప్రదేశ్‌లో ఎంత?

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరగాలన్నది అయిదు వందల సంవత్సరాల సుదీర్ఘ స్వప్నం. ఆ కల సాకారమైన వేళ కులమత వర్గాలకు అతీతంగా ఆశీర్వదిస్తున్నారు.

ఆంధప్రదేశ్‌లో పోటీ ఎవరెవరి మధ్య అని మీరు నమ్ముతున్నారు?

రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనపడుతుంది. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన పాపానికి ప్రజలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలిచ్చేసింది. అవినీతి పెరిగిపోయి కేవలం మా జేబులు నిండితే చాలు అనే ఆలోచన విధానం ప్రబలింది. ప్రజలు విసిగి వేసారిపోయారు. ఏ రంగం, ఏ వర్గం కూడా ఇవాళ న్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అది మాత్రమే కాక పేదల మీద సైతం భారం వేశారు. విద్యుత్తు చార్జీలు ఎనిమిదిసార్లు పెంచేశారు. నిత్యావసర ధరలు, పెట్రోలు, డిజీలు ధరలు పెరిగిపోయాయి. ప్రజలకి ఇళ్లు ఇవ్వటం కానీ, లేదా కేంద్రం ఇచ్చిన నీటి కుళాయిలు ఉచితంగా ప్రజలకు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. కనుక ప్రజలు ఎన్‌డిఏ కూటమిని ఆశీర్వదించటానికి సన్నద్ధంగా ఉన్నారు. పోటీ ఎవరెవరి మధ్యన కాదు, పోటీలో ఉన్నటువంటి సందర్భంలో, ఎన్నికల్లో ఉన్నటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించాలి అనేటటువంటి లక్ష్యంతోటే, ఆ ఆలోచన తోటే ఈ కూటమి ముందుకు వెళుతుంది. ఇవాళ చూసినట్లయితే డెవలప్‌మెంట్‌, అం‌టే వికాసం, యాంటి డెవలప్‌మెంట్‌ ఈ ‌రెండింటికీ మధ్య పోటీ జరుగుతుందని నేను భావిస్తున్నాను.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram