నరేంద్ర ప్రభుత్వం పట్ల కంటగింపుగా ఉన్న వారి కుట్రలు తారస్థాయికి చేరుతున్నాయని చెప్పడానికి సరైన ఉదాహరణ డిసెంబర్‌ 13, 2023న లోక్‌సభలో జరిగిన ఉదంతం. 22 ఏళ్ల క్రితం 2001లో సరిగ్గా ఇదే రోజున పార్లమెంట్‌ బయట నుంచి పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఇప్పుడు  బీజేపీ, మోదీ వ్యతిరేక శక్తులు లోపలికి ప్రవేశించి అల్లరి సృష్టించాయి. ఇది నిస్సందేహంగా భద్రతా వైఫల్యమని ప్రధాని మోదీ అంగీకరించారు. బుద్ధితక్కువ ప్రణాళికతో పెద్ద ప్రయోజనం సాధించడానికి వేసిన చౌకబారు ఎత్తు ఇది.

కానీ అది అత్యున్నత చట్టసభకు అసలు పొగబాంబు విసరడం కాకుండా, ఒంటికి నిప్పంటించుకుని పెద్ద గందరగోళానికే దుండగులు పథకం వేశారని ఢల్లీి పోలీసులు బయటపెట్టారు. నిప్పంటించుకున్న తరువాత కరపత్రాలు వెదజల్లాలని అనుకున్నారని కూడా పోలీసు శాఖ తెలియచేసింది. కేవలం నిరుద్యోగం, యువతలో అసంతృప్తి వంటి అంశాలనే దేశం దృష్టికి తీసుకురావాలన్నదే ఆగంతకుల ఉద్దేశమే అయితే, రాజస్తాన్‌లోని నాగౌర్‌ వెళ్లిన దర్యాప్తు బృందానికి ధ్వంసం చేసిన ఆధారాలు ఎందుకు దొరికాయి? ఈ కేసులో కీలకంగా ఉన్న లలిత్‌ రaా రాజస్తాన్‌లోని మరొక అనుమానితుడు మహేశ్‌ కుమావత్‌ దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు ఆధారాలు ధ్వంసమైన విషయం బయటపడిరది. ఈ కేసులో ఎప్పటిలాగే విపక్షం అత్యంత హీనంగా, బాధ్యతా రాహిత్యంతోనే వ్యవహరించింది. లోక్‌సభ మీద పొగబాంబులతో దాడికి దిగడం కేవలం నిరసన కిందకే వస్తుందా? అది ఉగ్రవాదం అనిపించుకోదా? ఇది కూడా గుర్తించకుండా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ దుండగుల తరఫున వత్తాసు పలుకుతున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వంలో విపక్షాలు యథాప్రకారం రాజకీయం చేస్తున్నాయి. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా సాగిన రైతు ఉద్యమంలో కనిపించిన వారు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త, తీస్తా సెతల్వాద్‌ సన్నిహితులు వీరి వెనుక ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులోనే తెలిసిపోయింది. ముందు ముందు ఎన్ని భయానక వాస్తవాలు బయట పడతాయో!

ప్రస్తుతానికి ఇది నిర్ధారణ కానీ నిజం. అనుమానం మాత్రమే కావచ్చును. కానీ, డిసెంబర్‌ 13 లోక్‌సభ లోపల, పార్లమెంట్‌ ప్రాంగణంలో ఆగంతకులు సృష్టించిన అలజడికి సంబంధించి, సోషల్‌ మీడియా సాక్షిగా మెజారిటీ ప్రజలు ఇది ‘అదృశ్య హస్తం’ పనే అనే నిర్ధారణకు వచ్చారు. దేశ వ్యాప్తంగా అన్ని టీవీ చర్చల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను, సాగుతున్న విచారణను గమనిస్తే, అనుమానాలను నిజాలుగా నిరూపించే ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.

పార్లమెంట్‌ ఘటనకు సంబంధించి విభిన్న కోణాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నా, ఈ వ్యాసం రాసే సమయానికి, ఆ ఘటనకు సంబంధించి, అధికారి కంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఏదీ ఇదమిత్థంగా నిర్ధారణ కాలేదు. అయితే, వ్యక్తమవుతున్న అనుమానాలు పూర్తిగా నిరాధారమైనవా? అంటే కాదు. అన్నీ కాకపోయినా, కొన్ని నిర్దిష్ట అనుమా నాలకు బలమైన ఆధారాలే కనిపిస్తున్నాయి. అందుకే పార్లమెంట్‌ ఘటనకు వెనక, ‘అదృశ్య హస్తం’ ఉందనే అనుమానాన్ని, మాములు జనం మొదలు మేధావుల వరకు ప్రతి ఒక్కరు రుజువు కాని నిజంగా గుర్తిస్తున్నారు. ఇందులో అత్యంత నీచంగా కనిపిస్తున్న అంశం` మహాత్యాగి భగత్‌సింగ్‌ పేరును కుట్రదారులు ఉపయోగించుకున్నారు. దీనిని ఖండిరచడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.

అదొక దుర్దినం

డిసెంబర్‌ 13 అంటేనే, అదొక దుర్దినం. 22 ఏళ్ల క్రితం 2001లో ఇదే డిసెంబర్‌ 13, పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ రోజున భద్రతా దళాల వేషంలో వచ్చి దుండగులు తొమ్మిది మంది సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ గాయాలు ఇంకా మాయనే లేదు. ఆ మచ్చలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంతలోనే, ఈ డిసెంబర్‌ 13న, ఆనాటి అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారథ్యంలో జాతి మొత్తం నివాళులు అర్పించిన కొద్దిసేపటికే, పాత గాయాన్ని మళ్లీ రేపారు. పార్లమెంట్‌ భద్రతను ప్రశ్నార్థ్ధకం చేస్తూ ఆగంతకులు పార్లమెంట్‌ లోపల వెలుపల అల్లరి సృష్టించారు. ఆనాటి విషాదాన్ని గుర్తుకు తెచ్చిన ఈ ఘటన సహజంగానే, అందరిలో ఆందోళన కలిగించింది. ‘ఇది మరో ఉగ్రదాడి కాదు కదా’ అనే అనుమానాలకు ఆస్కారం కల్పించింది. మరోవంక, డిసెంబర్‌ 13న లేదా అంతకు ముందుగా, 2001 డిసెంబర్‌ 13 పార్లమెంట్‌’పై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తామంటూ ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ ఇటీవల చేసిన హెచ్చరిక అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే, ప్రాథమిక సమాచారం మేరకు, లోక్‌ సభ ఘటనకు, ఆ తీవ్రవాది హెచ్చరికకు సంబంధం లేదని తెలుస్తోందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని కాదు కానీ లేక పోవచ్చును అంటూ ఊరడిరచారు.

గతంలోనూ …

ఇలాటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 1994లో, ఒకే సంవత్సరంలో రెండుసార్లు ఇదే తరహలో లోక్‌సభలో దుండగులు, సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి అలజడి సృష్టించారు. అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా ఆ ఘటనలను పెద్దగా పట్టించుకోలేదు. తొలిసారి ఆగంతకుని గట్టిగా మందలించి వదిలేశారు. రెండోసారి రెండురోజుల కారాగార శిక్ష విధించి తిహార్‌ జైలుకు తరలించారు. అంతేకానీ, ఆ ఆగంతకులు ఎవరు? ఏమిటీ? అంశాలపై లోతైన విచారణ జరగలేదు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టలేదు.

ప్రస్తుతానికి వస్తే, నరేంద్రమోదీ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధ్దమైంది. ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పీకర్‌ లేఖ రాశారు. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనీశ్‌ దయాళ్‌ సింగ్‌ నేతృత్వంలో కేంద్ర హోంశాఖ దర్యాప్తు సంఘాన్ని నియమించింది. అంతే కాదు. మళ్లీ ఇలాంటి దుశ్చర్యలకు ఆస్కారం లేకుండా ఢల్లీి పోలీసులు దుండగులపై, చట్ట వ్యతిరేక కార్య కలాపాల నిరోధక చట్టం (యుఏపీఏ) కింద కేసులు పెట్టి, ఒక్కొక్కరినీ కోర్టు ఎదుట హజరు పరిచారు. కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకున్నారు. చీకటి కోణాలను వెలికి తీస్తున్నారు. మరో వంక ఈ చట్టం పరిధిలో, బెయిల్‌ రావాడానికి కనీసం ఆరునెలల నుంచి సంవత్సరం వరకు ఆగవలసి ఉంటుందని న్యాయనిపుణులు చెపుతున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా, విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వం ఈ ఘటనను తేలిగ్గా తీసుకోలేదు. కఠిన చర్యలకు నడుం బిగించింది. సమస్య శాశ్వత పరిష్కారం వైపుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆగంతకులకు సందర్శకుల పాస్‌ ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ విషయంలోనూ చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదని, బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఒక విధంగా చూస్తే, ఈ విషయంలోనూ పార్లమెంట్‌ ఉభయసభల్లో అనవసర రాద్ధాంతం చేసిన విపక్షాలు, ఆనవాయితీ తప్పకుండా భంగపాటును కొనితెచ్చు కున్నారు.

పకడ్బందీ వ్యూహంతో దాడి

ఈ ఘటనపై విచారణ రేపు ఏ మలుపు తిరుగు తుందో! ఎలాంటి విషాద నిజాలు బయటకు వస్తాయో! అనే భయం అందరిలో వ్యక్తమవుతోంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, డిసెంబర్‌ 13 ఘటన అల్లరి చిల్లర వ్యవహారం కాదని అనిపిస్తుంది. పకడ్బందీ వ్యూహంతో పాత్రధారులను ముందుపెట్టి, వెనకనుంచి సూత్రధారులు జరిపించిన రాజకీయ కుట్రగానే ఈ ఘటనను చూడవలసి ఉంటుంది. అందుకే, ఎన్ని కోణాల్లో చర్చ జరిగినా, ఇప్పడు దేశంలో ప్రధానంగా ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. ‘పార్లమెంట్‌’ ఘటనకు ఎవరు బాధ్యులు? తెరపైన కనిపిస్తున్న ఆగంతకులే ఇంతటి సాహసం చేశారా? లేక తెర వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ఆ ‘అదృశ్య హస్తం’, ఎవరిది..? అనే ప్రశ్నే ఇప్పడు దేశం ముందు ప్రధానంగా నిలిచింది.

ప్రజాస్వామ్య దేవాలయంగా, దేశ సార్వ భౌమత్వానికి ప్రతీకగా భావించే పార్లమెంట్‌ ప్రతిష్టను దిగజార్చే దుర్మార్గానికి పూనుకున్నది ఎవరు? ఆ ఆగంతకుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు వెలుగు లోకి వచ్చిన నేపథ్యంలో సామాన్యుల నుంచి మేధావుల వరకు ‘అదృశ్య హస్తం’పై అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన విషయాలు, ముఖ్యంగా తెరపై కనిపిస్తున్న ఆ ఆరుగురు ఆగంతకుల రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యాన్ని పరిశీలిస్తే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయని అంటున్నారు.

తీగ లాగితే..

ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న, లలిత్‌ ఝాకు నక్సల్స్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. పీయూసిఎల్‌’(పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌) పూర్వ బంధాలతో పాటుగా, పశ్చిమ బెంగాల్‌లోని జంగల్‌ మహల్‌ ప్రాంతంలో చాలావరకు చల్లారిన నక్సల్స్‌ అగ్నిని తిరిగి రగిల్చేందుకు, ఎన్జీఓల ముసుగులో సాగుతున్న ప్రయత్నాల్లో ఈ ‘మాస్టర్జీ’కి భాగస్వామ్యం ఉన్నట్లు విూడియా కథనాలను బట్టి తెలుస్తోంది. విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో కోల్‌కతాలో రద్దీగా ఉండే రవీంద్ర రోడ్‌లో ‘ట్యూషన్‌’ ఇనిస్టిట్యూట్‌ నడిపిన లలిత్‌ రaాను అక్కడి ప్రజలు ‘మాస్టర్జీ’ అని పిలుస్తారు. ట్యూషన్స్‌ పేరుతో విద్య్యార్ధులను చేరదీసి, వారిని అడవి బాట పట్టించే, రిక్రూట్‌మెంట్‌’ బాధ్యతలో ‘మాస్టర్జీ’ ఉన్నారనే నిజం అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలిసినట్లు లేదు. వచ్చిపోయేవాళ్లు అందరూ విద్యార్ధులో, వారి తల్లి తండ్రులో అనుకున్నారు కానీ, వారిలో అడవి అన్నలు, అర్బన్‌ నక్సల్స్‌, సానుభూతి పరులు ఉన్నారనే విషయాన్ని గుర్తించలేదు. మీడియా కథనాలను బట్టి ఇప్పుడిప్పుడే ‘మాస్టర్జీ’ లీలలు వెలుగులోకి వస్తున్నాయి.

పార్లమెంట్‌ ప్రాంగణంలో అలజడి సృష్టించిన 42 ఏళ్ల జేఎన్‌యూ ‘శాశ్వత’ విద్యార్ధిని నీలమ్‌ రైతుల ఆందోళన, మహిళా రెజ్లర్ల ఆందోళనలో కీలక భూమిక పోషించినట్లు వస్తున్న ఫొటో ఫీచర్స్‌ సూచిస్తున్నాయి. ఆందోళనలను వృత్తిగా ఎంచుకున్న ఆమె జేఎన్‌యూ తుకడే తుకడే గ్యాంగ్‌ సాగించే దేశ ద్రోహ కార్యక్రమాలలోనూ క్రియాశీల పాత్రను పోషిస్తున్నారని, ఇటు సోషల్‌ విూడియాలో అటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.

అమోల్‌ షిండే విషయానికి వస్తే, చాలా విచిత్రమైన లింకులు బయటకు వస్తున్నాయి. ప్రత్యక్షంగా కాకపోయినా షిండేకు పరోక్షంగా తీస్తా సెతల్వాద్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. తీస్తా సెతల్వాద్‌ ఎవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గుజరాత్‌ అల్లర్ల నేపథó్యంలో నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని జైలుకు పంపేందుకు శతవిధాలా ప్రయత్నించిన న్యాయవాది, సామాజిక కార్యకర్త. అంతేకాదు, జాతీయవాద శక్తులను సమూలంగా తుడిచి వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుట్రలో ఆమె కీలక పాత్ర పోషించారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జైలుకు కూడా వెళ్లారు. ఆమెకు సన్నిహితంగా పనిచేసే పూణే న్యాయవాది అసిం సరోరే, పార్లమెంట్‌ ఘటనలో ముద్దాయిగా ఉన్న అమోల్‌ షిండే తరపున వాదించేందుకు స్వచ్ఛందంగా ఆయన  ముందు కొచ్చారు. ఈ న్యాయవాదికి తీస్తా సెతల్వాద్‌తోనే కాదు.. రాహుల్‌ గాంధీతోనూ సంబంధాలున్నట్లు, రాహుల్‌ భారత జోడో యాత్రలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తీగలాగితే డొంకంతా కదలడం అంటే ఇదేనేమో! ఈ అన్ని సంబంధ బాంధవ్యాలపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ కుట్ర

లోక్‌సభ ఘటనకు సంబంధించి తెరపై కనిపిస్తున్న, సాగర్‌ శర్మ, మనోరంజన్‌, విక్కీ శర్మల ఇతర ఆగంతకులు రాజకీయ, సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని గమనిస్తే, అందులో ఏ ఒక్కరికి కూడా స్థిరమైన జీవనోపాధి లేదు. ఆర్థిక స్థిరత్వం లేదు. ఈ అన్నిటినీ మించి, అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రా లకు చెందిన ఈ వ్యక్తులను ఎవరు కలిపారు?  ఎలా కలిపారు? అనే కీలక ప్రశ్న లోతుల్లోకి వెళితే కుట్ర కోణం స్పష్టంగా బయటకు వస్తుంది. అందుతున్న సమాచారాన్ని తులనాత్మకంగా విశ్లేషిస్తే, ఈ దాడి వెనక జాతీయవాద వ్యతిరేక, బీజేపీ, మోడీ వ్యతిరేక, కాంగ్రెస్‌, రాహుల గాంధీ అనుకూల శక్తుల హస్తం ఉందనే అనుమానాలకు మరింతగా బలం చేకూరు తుంది. అందుకే, చాలా చిన్న ఘటనగా కనిపిస్తున్న పార్లమెంట్‌ ఘటన వెనక చాలా పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు రోజు రోజుకు బలపడు తున్నాయి. ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన ‘నిజాలు’ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తు న్నాయి.

అదృశ్య హస్తానికి, ఇప్పుడే నామకరణం చేయడం కుదరక పోవచ్చును. కానీ, పార్లమెంట్‌ ఘటన ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించిన తీరు గమనిస్తే, విపక్షాలు జాతీయ సమస్యలను రాజకీయ కోణంలో చూస్తున్నాయి. జాతి ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలకే ఎత్తుపీట వేస్తున్నాయి అనే అభిప్రాయం బలపడుతోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ అన్నట్లుగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం దేశం ఏమైనా పర్వాలేదనే ధోరణిని అవలంబి స్తోందనే అభిప్రాయానికి ఈ దుర్ఘటన మరో కోణంలో అద్దం పడుతోంది. జేపీ చెప్పింది, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హావిూల గురించే అయినా, దేశ భద్రత విషయంలో అయినా, పార్లమెంట్‌ ప్రతిష్టను కాపాడే విషయంలో అయినా, ప్రజస్వామ్య విలువల పరిరక్షణ విషయంలో అయినా హస్తం పార్టీ పోకడ ఒకే తీరుగా ఉంటుందనేందుకు దీనిని మరో ఉదాహరణగా పేర్కొనవచ్చును.

‘రాగా’ స్వరం మారింది

అదలా ఉంటే, తాజాగా రాహుల్‌ గాంధీ స్వరం మారింది. ఇంతవరకు, పార్లమెంట్‌ భద్రతపై ఆందోళన వ్యక్తపరిచిన హస్తం పార్టీ ఆశాజ్యోతి రాగా, స్వరం మార్చి కొత్త రాగం ఎత్తుకున్నారు. ‘సురక్షా బ్రీక్‌ హుయి హై.. వో హై…’ అంటూ నాలుక మడతేసి తడబడుతూ కొత్త రాగం ఎత్తుకున్నారు. పార్లమెంట్‌ భద్రతకు భంగం కలిగిన మాట నిజమే కానీ, అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలు కారణమని ప్లేటు ఫిరాయించారు. ఇంతవరకు పార్లమెంట్‌ భద్రతపై కన్నీళ్లు కార్చిన రాహుల్‌, ఇప్పడు మోదీ విధానాల కారణంగా నిరుద్యోగం, ధరలు పెరిగిపోవడం వల్లనే యువత ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఆగంత కులను చర్యను పరోక్షంగా సమర్ధించారు. ఇక్కడ మరో విషయం ఏమంటే … ఆయన నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఫోకస్‌ పెట్టి, త్వరలో మరో విడత భారత జోడో యాత్రకు బయలుదేరుతున్నారు. ఇప్పడు, ఆ యాత్రకు ముందు, జరిగిన పార్లమెంట్‌ ఘటనను, రాహుల్‌ గాంధీ యాత్ర ప్రచార అంశాలను జోడిరచి చూస్తే, పార్లమెంట్‌ ఘటన వెనుక పరోక్ష మద్దతు ఎవరిదో అంచనా వేయవచ్చు.

కుట్ర అయినా …

అయితే, ఇది ఎవరి కుట్ర అయినా, ఈ కుట్ర వెనక ఎవరి హస్తం ఉన్నా, జరిగిన ఘటన పార్ల మెంట్‌ భద్రతకు సంబంధించి, అనేక అనుమానాలకు ఆస్కారం కల్పించింది. అందుకే ..ఇది చిన్న విషయం కాదు. చిన్న తప్పిదం కాదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో, ఆగంతకులు సభ లోపల వెలుపలా సృష్టించిన అలజడి, భద్రతా లోపాలను పట్టి చూపుతోంది.

ఆగంతకులు, పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రవేశించి, భద్రతా వలయాలను దాటు కుంటూ సందర్శకుల గ్యాలరీని చేరుకోవడం’ ఆపైన, 17 అడుగుల ఎత్తు నుంచి సభలోకి దూకి అలజడి సృష్టించడం సామాన్య విషయంకాదు. నిస్సం దేహంగా, అది భద్రతా లోపం. అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, పైపై పూతలతో పని కాదు. అవసరం అయితే, శస్త్ర చికిత్సకు అయినా సిద్ధం కాక తప్పదు.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram