– జయసూర్య, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఉత్తర పదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో షహబ్‌గంజ్‌ ‌ప్రాంతం. అది  ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశం. పాములా మెలికలు తిరిగి ఉండే కొన్ని రహదారుల వెంట నడిచి వెళితే మొత్తానికి ఆ ప్రచురణ సంస్థ దర్శనమిస్తుంది. అదే గీతా ప్రెస్‌. ‌చుట్టూ హడావిడిగా ఉండే విపణులు. గీతా ప్రెస్‌ ‌కార్యాలయానికి చేరుకుంటామనగా ప్రతి గోడ, స్తంభం  ‘హరే రామ, హరే కృష్ణ’ అన్న రాతలతో కనిపిస్తాయి. ప్రెస్‌లోకి అడుగు పెట్టగానే వినవచ్చే పలకరింపు ‘రామ్‌ ‌రామ్‌’ అనే. ఈ వాతావరణం ఎలా ఏర్పడింది? దానికి సమాధానం ఆ పవిత్ర ప్రచురణాలయం మేనేజర్‌ అశుతోష్‌ ఉపాధ్యాయ చెబుతారు- గీతా ప్రెస్‌ ‌సనాతన ధర్మప్రబోధానికి అంకితమైంది.

సత్యం, అహింస, ధర్మనిరతి, గాంధేయ విధాన ఆచరణలకు కట్టుబడి భారతజాతి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన వికాసానికి శతాబ్దం నుంచి అద్వితీయ సేవలందిస్తున్న ప్రచురణ సంస్థ గోరఖ్‌పూర్‌ ‌గీతా ప్రెస్‌. 2021 ‌సంవత్సరానికి గాను గాంధీ శాంతి పురస్కారాన్ని ఈ సంస్థకు ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని న్యాయ నిర్ణేతల మండలి జూన్‌ 18న తీర్మానించింది. సనాతన హిందూధర్మ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసే సదాశయంతో 1923లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గీతా ప్రెస్‌ ఆవిర్భవించింది.

అన్ని రకాల పుస్తకాలు కలిపి దాదాపు 92 కోట్ల ప్రతులు వెలువరించిన గీతాప్రెస్‌ ‌ప్రయాణం ఓ అద్భుతం. జయదయాళ్‌ ‌గోయెంకా, ఘనశ్యామ్‌దాస్‌ ‌నెలకొల్పిన ఈ ప్రచురణాలయం రూ.10 అద్దె భవనంలో అంకురించింది. ఈ సంస్థను స్థాపించాలన్న ఆలోచన 1900 సం।।లో జయదయాళ్‌కు కలిగింది. ఉత్తరప్రదేశ్‌ ‌తూర్పు ప్రాంతంలోని చిన్న పట్టణం గోరఖ్‌పూర్‌. ‌గోరఖ్‌నాథ్‌ ‌మఠం కేంద్రంగా అది హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది (ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆ ‌మఠానికి మహంత్‌గా వ్యవహరించారు). జయదయాళ్‌ ‌గోయెంకా జౌళి, ప్రత్తి మిల్లు వ్యాపారిగా ఉత్తర భారతంలోని వివిధ పట్టణాలలో పర్యటిస్తూ, వివిధ మత పెద్దలు, తాత్త్వికులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. అప్పటికే ఆధ్యాత్మిక సత్సంఘాలకు వెళ్లే అలవాటు ఉన్న జయదయాళ్‌ ‌భగవద్గీత హిందీ అనువాదం తేవాలని ఒక ప్రచురణకర్తతో ప్రయత్నించి విఫలులయ్యారు.హిందూధర్మ మహోన్నత తత్త్వ విచారణకు మూలకందమైన  భగవద్గీత అప్పటికి కూడా హిందీలో ఆవిష్కృతం కాలేదు. పైగా ఆ రోజులలో కేవలం ఉత్తర భారత హిందూ ప్రాంతాలకే గీతా ప్రెస్‌ ‌సేవలు పరిమితమైనాయి. నెమ్మదిగా భగవద్గీత అందుబాటులోకి వచ్చింది.

సహచర వ్యాపారస్థుడు ఘనశ్యామ్‌దాస్‌ ‌ప్రోత్సాహంతో గీతా ప్రెస్‌ అనతికాలంలోనే ప్రాచుర్యం పొందింది. హిందూ ఆధ్యాత్మిక సుసంపన్నతకు ఆలవాలమైన, మార్వారీ వ్యాపారవేత్తలకు కేంద్రస్థానమైన గోరఖ్‌పూర్‌ ‌దీనికి కేంద్రమైంది.  క్రమేపీ ‘హనుమాన్‌‌ప్రసాద్‌ ‌పొద్దార్‌’ ‌సంపాదకత్వంలో హిందీలో ‘కల్యాణ్‌-‌కల్పతరు’ పత్రిక ప్రారంభమైంది.యావద్భారతం నుంచి వచ్చిన రచనలే కాకుండా, ప్రపంచంలోని వివిధ మతాల తత్త్వవేత్తల, మేధావుల రచనలను కూడా ప్రచురించి ‘కళ్యాణ్‌ ‌కల్పతరు’ ఆస్తికత్వ భావజాల మహోన్నతను చాటుతూ విజయధ్వజం ఎగురవేసింది. 1800 వివిధ మత, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు సంబంధించిన 910 మిలియన్‌ (‌దాదాపు 92 కోట్లు) ప్రతులకు పైగా ప్రచురించింది. 15 భాషలలో అనన్య సేవలందించింది. 162.1 మిలియన్‌ ‌పైగా ప్రతులు శ్రీమద్భగవద్గీత; ఇంకా పురాణాలు, ఉపనిషత్‌ల 26.8 మిలియన్‌ ‌పైగా ప్రతులు గీతా ప్రెస్‌ ‌నుంచి వెలువడినాయి. హిందూధర్మ విశిష్టతను విశ్వవ్యాప్తంగా బృహత్తరంగా తేటతెల్లం చేశాయి. ప్రస్తుత అత్యాధునిక ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లో ప్రతీరోజు 70,000 గ్రంథాలు వెలుగు చూస్తున్నాయి. 41 శాతం ప్రచురణలు హిందీలోను, 5 శాతం ఇంగ్లిష్‌లో వస్తున్నాయి. జాతీయ స్థాయిలో తమిళం, తెలుగు, ఒరియా, నేపాలీ భాషల చదువరులకు అందుబాటులో గీతా ప్రెస్‌ ‌గ్రంథాలు ఉన్నాయి. 11మంది ధర్మకర్తలతో నడుస్తున్న ఈ సంస్థకు ప్రస్తుతం దేవీదయాళ్‌ అగర్వాల్‌ ‌ప్రధాన సారథి.1955లో నాటి దేశాధ్యక్షుడు డా।। రాజేందప్రసాద్‌ ‌ప్రారంభించిన ప్రెస్‌ ‌కార్యాలయంలో ఇప్పుడు 450 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. 2023- గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన గీతాప్రెస్‌కు జాతిపిత మహాత్ముని రాజకీయ, మత నైతికత, సామాజిక ఆశయ సాధనతో సాన్నిహిత్యం ఉంది.

1934 జనవరిలో భారతీయ ఆధ్యాత్మిక మాసపత్రికగా విశేష ప్రతిష్ఠ పొందిన ‘కల్యాణ కల్పతరు’ సంపాదకులు హనుమాన్‌ ‌ప్రసాద్‌ ‌పొద్దార్‌, ఆ ‌పత్రికలో వర్ణచిత్రాలను ఎందుకు ప్రచురించవలసి వచ్చిందో ఎడిటోరియల్‌లో ఒక సందర్భంలో స్పష్టం చేశారు. ఇది దాని సారాంశం.

త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు లేదా యుగాల కాలభ్రమణంలోని దేవ, దేవీ స్వరూపాలకు భౌతికంగా రూపకల్పన చేయడం మానవ మాత్రులకు సాధ్యం కాని అంశం. గతంలో రాళ్లు, చెక్కవంటి పదార్థాలపై దేవ,దేవీ చిహ్నాలు, విగ్రహరూపాల సృజన, దేవాలయాల ఆవిర్భావం ఆస్తికత్వ ప్రదీప్తికి ఆలవాలమైనాయి. అక్షర జ్ఞానంలేని వారికి కూడా విగ్రహారాధన, భగవద్భక్తికి నేటికీ అవే ఆధారంగా విరాజిల్లుతున్నాయి. శిల్పాలు, కుడ్యచిత్రాల నుంచి ఆవిర్భవించిన దేవదేవీమూర్తుల చిత్రాలలో, ఈ ఆధునిక (పత్ర) ప్రింటింగ్‌ ‌యుగంలోను భగవద్భక్తి విలసిల్లడానికి గీతాప్రెస్‌ ‌ప్రచురణలపైన అచ్చువేసిన చిత్రపటాలు కారణం అంటే సత్యదూరం కాదు. ఆ వర్ణ చిత్రాలు ఆకర్షణీయమై, ఆరాధనీయమై శోభాయమానంగా వెలుగొందాయి. ఇలాంటి ధోరణి శతాబ్ది క్రితమే గీతా ప్రెస్‌ ‌నాంది పలికింది.

గీతా ప్రెస్‌ ‌ప్రచురణలు హిందూ ధర్మ ప్రచారానికి పరిమితం కాలేదు. సంస్థ స్థాపన కాలం నాటికి స్పష్టంగా కనిపిస్తున్న మార్పు అవసరాన్ని స్థాపకులు గుర్తించారు. మతం, ఆధ్యాత్మిక చింతనలతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాల మీద జాతిలో కొత్త దృష్టి నాటి అవసరం. దానిని గీతా ప్రెస్‌ ‌నెరవేర్చింది. మత సామరస్యం, మహిళా సాధికారత, సాంఘిక దురాచారాల నిర్మూలన, ఇందులో ప్రధానంగా అంటరానితనం, కుల వివక్ష మీద కూడా గీతా ప్రెస్‌ ‌దృష్టి పెట్టింది. ‘కల్యాణ్‌’ ‌ద్వారా ఈ అక్షరోద్యమం సాగింది. ఇందులో ఆ అంశాలకు సంబంధించిన కథలు, కవితలు, ఇతర రచనలకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చేవారు. స్వాతంత్య్రోద్యమానికి కావలసిన కరపత్రాలు కూడా ముద్రించే బాధ్యతను గీతా ప్రెస్‌ ‌తీసుకునేది.

పోద్దార్‌ ‌తరువాత వారి వారసులు ఇదే ధ్యేయాన్ని గౌరవించారు. అయితే మారుతున్న కాలం, అవసరాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు డిజిటల్‌ ‌సౌకర్యాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. కల్యాణ్‌ ‌ప్రస్తుత సర్క్యులేషన్‌ ‌రెండు లక్షలు. సనాతన ధర్మ బోధనలను దేశంలో ఉన్న పేదలలోనే పేదలకు సయితం చేర్చడమే తమ పత్రిక లక్ష్యమని మేనేజర్‌ ‌లాల్‌ ‌మణి తివారీ చెప్పారు. గీతా ప్రెస్‌ ‌ప్రజాదరణ, మద్దతు ఉన్న ప్రచురణ సంస్థ. దాని విజయ రహస్యం ఇదే. అందుకు ఉదాహరణ- కరోనా కాలం. అప్పుడు దేశంలో చాలా ప్రచురణ సంస్థలు నష్టాల పాలయ్యాయి. కానీ గీతా ప్రెస్‌కు మాత్రం రూ. 77 కోట్లు లాభాలు వచ్చాయి.

గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.111 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. కల్యాణ్‌ ‌పత్రిక ఆశయమే గీతా ప్రెస్‌ ‌ప్రచుణలలోను కనిపిస్తుంది. రామాయణం, హనుమాన్‌ ‌చాలీసా, శివ చాలీసా పుస్తకాలు కేవలం రెండు రూపాయలకే (చిన్నవి) సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అది కూడా 15 భాషలలో అందిస్తున్నారు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు స్వీకరించినా జంతు సంబంధమైన ఉత్పత్తులు ఉన్న పదార్థాలను మాత్రం తమ అచ్చుపనికి వారు అనుమతించడం లేదు. ఈ ప్రచురణ సంస్థ పాకెట్‌ ‌పరిమాణం పుస్తకాలు నుంచి, ఉద్గ్రంథాల వరకు రోజుకు 70,000 ప్రతులు వెలువరిస్తుంది. నెలకు 500 మెట్రిక్‌ ‌టన్నుల కాగితం అవసరమవుతుంది. ఇప్పటికీ వ్యాపార ప్రకటనలు తీసుకోవడం ఇక్కడ నిషిద్ధమే.

About Author

By editor

Twitter
YOUTUBE