– యర్రమిల్లి ప్రభాకరరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఉదయం ఎనిమిది గంటలు దాటింది. ఇంకా సూర్యుడుపైకి రాలేదు. ఆకాశం మబ్బుమబ్బుగానే వుంది. ఆపైన చిన్న చిన్న చినుకులు. సాధారణంగా అటువంటి వాతావరణం సంధ్యకు నచ్చుతుంది. కాని, ఈ రోజు మనసంతా చీకాకు, ఆందోళన. తల్లి ఇచ్చిన కాఫీ గ్లాసు చేతిలోనే ఉంది. కానీ కాఫీ  తాగలేకపోతోంది. ఇంతలో మెట్లమీద ఎవరో వస్తున్న సవ్వడి, తలఎత్తి చూసింది.

‘‘ఆ…  ముత్యం.. ఇల్లా వస్తున్నావేంటి? దారి తప్పావా ఏంటి? ఈపాటికి పొలంలోకి వెళ్లిపోవాలి గదా….’’ అంటోంది చిరునవ్వుతో సంధ్య.

ముత్యం అడుగు మీదకు వచ్చింది. సంధ్య పక్కనే ఉన్న ముక్కాలు పీట మీద కూర్చుంది.

‘‘ముత్యం నువ్వు కూడా కాస్త కాఫీ తీసుకో..’’ కామాక్షమ్మ ముత్యాలుకి కాఫీ గ్లాసు ఇచ్చింది. ముత్యం మౌనంగా గ్లాసు తీసుకుంది.

‘‘ఇప్పుడు చెప్పు ఏమిటి విశేషంగా ఇల్లా వచ్చావు?’’ సంధ్య అడిగింది.

ముత్యాలు ఏమి మాట్లాడలేదు. ఆమె కన్నులలో నీళ్లు ఉరుముతున్నాయి. మొహం ఎర్రగా మారి పోయింది.

‘‘ఏంటే? ఆ ఏడుపు… ఆపు… అసలేం జరి గింది?’’ సంధ్య ఆందోళనతో అడిగింది.

ముత్యాలు చీరచెరగుతో కన్నులు, మొహం తుడుచుకుంది. ‘‘సంధ్యా! నీకు తెలుసుగా నా డబ్బు, ఇబ్బందులు. రెండు సంవత్సరాలుగా వర్షాలతో పంటలు పోయాయి. అందుకోసం – సాగుకోసం అప్పు చేసాడు రాజయ్య. నేను ఇక్కడ సాగు చూసు కుంటున్నా, రాజయ్య పట్నంలో పనిచేస్తున్నాడు. కాని అప్పు తీరేంత డబ్బు రావాలంటే పంట చేతికి రావాలిగా – అంతవరకూ నెల వాయిదా వడ్డీలు కట్టాలండి… నాలుగు వాయిదాలు అతికష్టంమీద కట్టాడు రాజయ్య, తన కూలి డబ్బు నుంచి. కాని రెండు వాయిదాలు బాకీపడ్డాడు. అప్పులిచ్చిన వాళ్లు వాడి ప్రాణం తీస్తున్నారు. వాడి ప్రాణమే కాదు, నా ప్రాణం కూడా. నిమిష నిమిషానికి ఫోన్లు. తిట్లూ, బూతులు… బెదిరింపులు… రాజయ్య భయంతో వణికిపోతున్నాడు. నిన్న పట్నం నుంచి వచ్చి ఒకటే బెంగపడ్డాడు. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి సాయం కాలమే వెళ్ళిపోయాడు. నేనేం చెయ్యగలను ఇప్పుడు? పంటచేతికి అందాలి కదా! అప్పుడే. మళ్లీ ఉదయం ఆరుగంటలకే ఫోను. డబ్బు కట్టమని… నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు. నువ్వేదైనా సలహా చెబుతావేమోనని వచ్చాను’’ ముత్యాలు ఆందోళనతో చెప్పింది. ఆమె మదిలో ఆందోళన, భయం.

సంధ్య నిశ్చేష్టురాలైపోయింది.

‘‘ముత్యాలు అప్పు ఏ బాంక్‌లో తీసుకున్నావు?’’

‘‘లేదు సంధ్యా! బాంకులో కాదు. ఎవరో యాప్‌ ‌వాడంట. వాడిదగ్గర ఒక లక్ష తీసుకున్నాడు రాజయ్య. బయటున్న అప్పులు తీర్చేసాడు, మిగిలింది పంట మీద పెట్టాం. ధాన్యం చేతికి రాగానే తీర్చేయచ్చు అనుకున్నాం. పంట రావడానికి ఇంకా నాలుగు మాసాలు పడుతుంది కదా! ఈలోగా వడ్డీ డబ్బులు కట్టమని – ఇదిగో ఈ రకంగా ప్రాణాలు తీస్తున్నారు. నాకు రాజయ్యను చూస్తే భయమేస్తోంది. మనిషి మనిషిలా లేడు. చాలా చిక్కిపోయాడు. ఏమైనా చేసుకుంటాడేమోనని నాకు..’’ ముత్యాలు మారు మాటలాడలేకపోయింది. చెంగు కప్పుకుంది, మొహం మీద.

సంధ్య అవాక్కైపోయింది. ‘‘ఏంటి? యాప్‌ ‌వాళ్లు ఈ చిన్న రైతుల మీద కూడా పడ్డారా! ఏదో పట్నంలో వ్యాపారం చేసుకునే వారిని పీడిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఎంటి? ఇప్పుడు గ్రామాల్లోకి కూడా వచ్చేసారా!’’ పైకి గట్టిగానే అంది.

‘‘అవును సంధ్యా! నేనే కాదు… మన ఊళ్లోనే ఇంకా నలుగురైదుగురు నాలాంటి వాళ్లు వాళ్ల చేతిలో చిక్కుకున్నారు. ఏం చెయ్యాలో ఎవరికీ తెలియడం లేదు. మేమా! చదువు సంధ్యా లేనివాళ్లం. వాళ్లు బాగా బలం, డబ్బు వున్నవాళ్లు… ఎక్కువ వడ్డీ పిండు తున్నారు మా దగ్గర నుండి. అంతేకాదు, తిట్లూ, బెదిరింపులు…ఏదో ‘మార్ఫింగ్‌’ ‌చేస్తారని, మా ఫోటోలు బయట పెడతామని, వీడియో తీస్తామని ఒకటే బెదిరింపులు… మా పరువు తీస్తారంట… ఫోను మీద ఫోనులు, రాత్రీ లేదు పగలూ లేదు’’ ముత్యాలు కొద్ది ధైర్యం తెచ్చుకుని గబగబా చెప్పింది, ఆవేశంతో.

* * * * * * * * * *

సంధ్య,ముత్యాలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ముత్యాలు తండ్రి చిన్నరైతు. చాలీచాలని ఆదాయం. అంచేత ముత్యాలు చదువు తరగతిలోనే ఆగి పోయింది. సంధ్యపై చదువులు చదివింది. బి.టెక్‌ ‌చదువుకుని కంప్యూటర్‌ ఇం‌జనీరుగా పక్కనున్న పట్నంలో కాలేజీలో పనిచేస్తోంది. ఇంకా వివాహం చేసుకోలేదు. ముత్యాలుకి వివాహం జరిగి మూడేళ్లు దాటింది. చదువు డబ్బు- ఈ రెంటిలో అంతరాలు ఉన్నా, వాళ్లిద్దరి చిన్ననాటి స్నేహం చెక్కు చెదరలేదు. కలుసుకోవడం తగ్గిపోయినా అది మూడు పువ్వులు, ఆరు కాయలుగా పెరుగుతూనే ఉంది.

* * * * * * * * * *

ముత్యాలు చేతిని తన చేతిలోకి తీసుకుంది సంధ్య.

‘‘ముత్యం! నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నాకు అర్థమైంది. నేను ఏదో ఒకటి చేసైనా నిన్ను కాపాడుకుంటా. కాని నా దగ్గర అంత డబ్బు లేదే! ఒకటి రెండు నెలలు ఏదో విధంగా డబ్బు సద్దుబాటు చేసుకుని ఈ ఊబిలోంచి బయట పడదాం. అంతవరకు కొద్ది ఓపికగా’’ సంధ్య ఆపైన మాట్లాడ లేకపోయింది. ముత్యాలుని గట్టిగా కౌగిలించుకొంది.

‘‘సరే సంధ్యా! నువ్వేమీ బాధపడకు. నా ఖర్మ ఎల్లా వుంటే అల్లా జరుగుతుంది’’ నేను వెళ్తాను, పొలానికి వెళ్లాలి. ఇవాళ పొలంలో ఎరువెయ్యాలి’’ అంటూ లేచింది ముత్యాలు.

సంధ్య ముత్యాలు వెళ్లిపోతుంటే చూస్తూ అల్లాగే ఉండిపోయింది. తాను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి తనను తానే తిట్టుకుంటూ..

కామేశ్వరమ్మ వాళ్ల మాటలు వింటూనే వుంది.

‘‘ఏదో ఒకటి చెయ్యాలి సంధ్యా! ముత్యాన్ని అల్లా వదిలిస్తామా ఏంటి?’’ అని ఏదో చెబుతూనే వుంది.

* * * * * * * * * *

రెండు రోజులు గడిచాయి అతి భారంగా సంధ్యకు. ఆ సాయంకాలం పని ముగించుకుని ఇంటికి వచ్చింది. ఇంట్లో అడుగుపెట్టిందో లేదో… సంధ్యా! పరుగెత్తుకొని వచ్చిన ముత్యాలుని చూసి గబాలున గట్టుమీద నుంచి కింద కురికింది.

‘‘సంధ్యా! వాడు నా ఫోటోలు అదేటో చేసి వీడియోలో పెట్టాడట – అది చూసిన మా ఆయనకు తెలిసివారు వేళాకోళం చేసి ఏదేదో అన్నారట – రాజయ్య సహించలేకపోయాడట- తాను కూలీగా పనిచేస్తున్న ఇంటిపై నుండి దుమికాడు ఆత్మహత్య చేసుకుందామని….’’ ముత్యాలు ఏడుస్తోంది.

‘‘రాజయ్యకేం ప్రమాదం లేదు కదా!’’ ఆత్రుతగా అడిగింది కామాక్షమ్మ.

‘‘ఫరవాలేదమ్మా! ఏదో బతికాడు కాని కుడికాలు విరిగిపోయిందట…. ఇక అతుక్కోదట…’’ ఏడుస్తూ చెప్పింది ముత్యాలు. ఇక సంధ్య ఆగలేకపోయింది.’’ ‘‘ముత్యాలు.. బండెక్కుముందు- వాళ్ల పని చెబు తాను’’ అని ఆవేశంగా స్కూటర్‌ను ముందుకు నడిపింది.

* * * * * * * * * *

రాత్రి ఎనిమిదిగంటలైంది. సంధ్య, ముత్యాలు – ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌.ఐ.‌ముందర కూర్చు న్నారు. ముత్యాలు ఎస్‌.ఐ. ‌గారితో తాము అప్పు తీసుకున్న వివరాలు అన్నీ చెప్పింది. ఏదీ హామీ లేకుండా అప్పు ఇచ్చారని తీసుకున్నామని- రౌడీ కంపెనీ చేతుల్లో ఇరుక్కుపోయామని, లక్ష రూపాయల అప్పుకు వడ్డీయే నాలుగు నెలల్లో నలభై వేలు కట్టామని చెప్పింది ఏడుస్తూ.

పోలీసు అధికారి అంతా ఒక కాగితంపై రాసుకున్నాడు. ‘‘వాళ్ల పేర్లు, అడ్రస్‌లు ఏమైనా చెప్పగలరా!’’ అడిగాడు ఎస్‌.ఐ.

‘‘మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా!’’ అని నెమ్మదిగా పలికాడు.

లేదు సార్‌! ‌నాకేమీ వివరాలు తెలియవు కాని వాళ్లు నాకు రోజూ ఎన్నోసార్లు ఫోన్‌చేసి…. ‘‘ముత్యాలు ఆపైన మాటలాడలేకపోయింది.. తన ఫోన్‌ ‌చూపిస్తూ,

ఎస్‌.ఐ. ఆలోచనలో పడ్డాడు.

ఇంతలో ముత్యాలు ఫోన్‌ ‌మోగింది. ముత్యాలు ఫోన్‌ ‌తీసి ‘‘హలో’’ అనేంతలోనే ‘‘ఏం పిల్లా! మీ ఆయన కాలు విరిగిందని ఏడుస్తున్నావా? పరవా లేదులే…’’ ఏదేదో మాటలు వినిపిస్తున్నాయి. ముత్యాలు వణికిపోతోంది భయంతో.

ఇంతలో సంధ్య ముత్యాలు చేతిలోంచి ఫోన్‌ ‌తీసుకుని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌చేతికి ఇచ్చింది.

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌ఫోన్‌లోంచి మాటలు రికార్డు చేసాడు. ‘‘ఏమీ మాట్లాడవు?’’ అని ఫోన్‌లో ఇంకా మాటలేవో వస్తూనే వున్నాయి.

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌సీట్లోంచి గబాలున లేచాడు. అతనికి వయసు నలభై పైన ఉంటాయి. కోపంతో చేతిలోని లాఠీ బలంగా బల్లమీద కొట్టాడు. ‘‘అమ్మా యిలూ – ఇంక మీరేమీ బాధపడకండి- ప్రభుత్వం, చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతాయి. అనధికార యాప్‌లకు, దౌర్జన్యపూరితమైన యాప్‌ ‌లకు- వాటి ఏజెంట్లకు తగిన బుద్ధి చెబుతాము. వాళ్లని ఇప్పుడే, ఎక్కడున్నా పట్టు కుంటాము.’’

‘‘సంధ్యా! మీరు చిన్నవారైనా చాలా ధైర్యంగా మా దగ్గరకూ, ఏం జరిగినా ఫరవాలేదని వచ్చారు. మీరు తీసుకున్న ఈ చొరవ వలన మన ప్రాంతంలో కొద్దిమందినైనా రుణయాప్‌ ‌దుర్మార్గుల నుండి ఊరట కలుగుతుంది. మీ ధైర్యానికి నా సెల్యూట్‌’’ అన్నాడు! ఇక వాళ్లెవరూ జోలికి రారు, భయపడతారు. అంతేకాదు – అమాయకులైన చిన్న వ్యాపారులకు, చిన్న రైతులకు ఊరట సరేనా!’’ అంటూ పోలీస్‌ ‌జీప్‌ ఎక్కాడు.

* * * * * * * * * *

సంధ్య, ముత్యాలు ఇల్లు చేరారు. ఇద్దరికీ బల్లమీద భోజనం వడ్డిస్తూ ‘‘స్నేహం అంటే ఇదే!’’ అని పలికింది కామేశ్వరమ్మ, చేమర్చిన కన్నులు తుడుచుకుంటూ.

About Author

By editor

Twitter
Instagram