చీకట్లను చీల్చుకుని నలుములలకూ చెదిరిపోయిన వారంతా ఎవరి ముట్టుకు వారు గుట్టలో వైపు బయలుదేరారు. పసిపాపలు కేరు మంటున్నారు. ఈ అరుపులు విని రజాకారులు అటువైపు రావచ్చని ఆ శబ్దం వినిపించకుండా వారి నోర్లు మూసేశారు తల్లులు. ఇంతలో మల్లయ్యకు గౌరమ్మ, లక్ష్మీ కనిపించలేదు. చీకట్లో మల్లయ్య వాళ్లకోసం వెదకసాగాడు. వృద్ధురాలు దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో, ఆమె వెంట లక్ష్మి ఉండిపోయిందేమో అనుకుంటుండగా వాళ్లు ఇద్దరూ వచ్చేశారు.


వరంగల్‌ ‌పక్కనే ఉన్న కుగ్రామం నుంచి రాత్రివేళ రహస్యంగా బయలుదేరిందా సమూహం. ఎలా తెలిసిందో! రజాకార్‌ ‌మూక వచ్చి దాడి చేసింది. ఆ సమూహంలో 13 ఏళ్ల బాలిక లక్ష్మి. ఒక రజాకార్‌ అత్యాచారం చేయబోయాడు. అప్పటికే దారుణంగా గాయపడిన ఆ గుండెలోకి మరొక తూటా దిగింది. కొన ఊపిరితోనే ఆ బాలిక తనను పాడుచేయ బోయిన ఆ రజాకార్‌ను తీవ్రంగా ప్రతిఘటించింది. కాఫిర్‌ ‌కె లడకీ అంటూ కాల్చేశాడా రజాకార్‌. ‘‘‌బాబా.. బాబా!’’ అంటూ పిలిచి చనిపోయిందా బాలిక. ఆ రజాకార్‌ ‌చీకట్లోనే కళ్లు విప్పారించి చూశాడు. ఆమె.. హమీదా అని గుర్తించాడు. ఇతడి పేరు రహమాన్‌. ‌వెంటనే అతని వెనుక ఒక తుపాకీ తూటా దిగిపోయింది. కానీ అది ఆ బాలిక బాబా అంటూ పిలిచినప్పుడు గుండెను తాకిన దాని కంటే తీవ్రమైనదేమీ కాదు. లక్ష్మి… హమీదా.. రహమాన్‌ ఎవరు వీరు? ఈ కథ అదే చెబుతుంది, వినగలరా?

 నిజాం నుంచి తెలంగాణ నేల విముక్తి కోసం నెత్తురు ధారపోసిన పూర్వుల త్యాగాన్ని తలచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆనాడు ఎంత చీకటి రాజ్యమేలిందో తల్చుకుంటే గుండె చెదిరి పోతుంది. అలాంటిదే ఈ కథ. ఆ సాయుధ రైతాంగ పోరాటమంతా దృశ్యాలు దృశ్యాలుగా కళ్ల ముందు కదిలి రక్తం పొంగిపోతుంది. పిల్లలు, స్త్రీలు, వృద్ధ్దులు ఈ పోరులో ఎంత నలిగిపోయారో తెలియజేప్పే వాస్తవకథ ‘చీకటిరాజ్యం’. అనేక పక్రియల్లో సాహిత్య సృజన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అడ్లూరి అయోధ్యరామకవి రచన. వరంగల్‌ ‌జిల్లా, తాటికొండ గ్రామంలో 1922లో జన్మించిన అడ్లూరి తాను చూసిన క్రూర రజాకార దాడులను అక్షరీకరించారు.

రజాకారుల నాయకుడు కాశీం రజ్వీ సైన్యం అతని మాట తప్ప ఎవరి మాటా వినదు. ఎప్పుడు ఏ గ్రామంపైబడి తగలబెట్టి ప్రజలను చంపి దోచుకుంటుందో ఎవరికీ తెలియదు. ఓ రాత్రి ‘అల్లాహో అక్బర్‌… ‌నారాయే తక్బీర్‌… ‌మారో … లగావో… షాహె ఉస్మాన్‌ ‌జిందాబాద్‌… ‌జలావ్‌’ అని నినాదాలు చేసుకుంటూ వచ్చి వరంగల్‌ ‌ప్రక్కన గల ఒక చిన్న కుగ్రామానికి రజాకారులు నిప్పుపెట్టారు. ప్రజలు ప్రాణాలు చేత బట్టుకుని తలదాచుకోవడానికి చీకట్లో చెట్టుకొకరు పుట్టకొకరు పరుగెడుతున్నారు. ‘మారో… మారో’ అరుపుల నడుమ తుపాకులు పేలాయ్‌. ‌పరుగెడుతున్న ఇద్దరు పెద్దగా అరచి నేలకూలారు. ‘పకడో.. లావ్‌’ అని నిజాం సామ్రాజ్య రక్షణ దీక్షాధరుడు రజాకార్‌ ‌నాయకుని కంఠం అరచింది. ఆ ఇద్దరు సాయన్న, మైసన్న.

సాయన్నను, మైసన్నని వారి మెడ చుట్టూ కట్టుకున్న రుమాలలోనే కాళ్లు చేతులు కట్టి నాయకుని దగ్గరకు తెచ్చారు రజాకారులు. నాయకుని ఆజ్ఞ అయ్యింది. ‘అల్లాహో అక్బర్‌…‌నారయ తక్బీర్‌’ ‌కాలుతున్న గుడిసెల పైకి విసిరారు. కొన ఊపిరితో ఉన్న మైసన్న, సాయన్నల శరీరాలను చూస్తూ, ‘ఇదే బాధ్యతాయుత ప్రభుత్వం’ అంటూ మంటలను చూస్తూ రజాకార్లంతా ఆనందంగా అరుచుకున్నారు. మళ్లీ నాయకుడి హుకూమైంది. త్వరత్వరగా లూటీ జరిగింది. మోయ గలిగినంత సర్దుకొని, మిగిలినవి అగ్నికి ఆహుతి చేయాలి. గుడిసెల మంటలు తగ్గుతున్నాయి. లూటీ పని త్వరగా పూర్తి చేశారు రజాకారులు.

రజాకారులు గ్రామాల మీదపడి రాక్షస కాండతో చెలరేగి పోతున్నకాలం. ఆ దాడులను ఎదుర్కోవ డానికి ప్రజలు గ్రామ రక్షక దళాల్ని (స్వయ సేవకులను) తయారు చేసుకున్నారు. రజాకారుల దాడి ఎప్పటికైనా తప్పదని అనుమానంతో ప్రజారక్షక దళ సభ్యులు గ్రామీణులను ముందు నుండి హెచ్చరి స్తూనే ఉన్నారు. ఒకవేళ రజాకారుల దాడి జరిగితే ఈ పిల్లల్ని, పెద్దల్ని జనాలను ఏమి చేయాలన్నదే పెద్ద ప్రశ్న. దానికోసం గ్రామానికి రెండు పర్లాంగుల దూరంలో గుట్టల దరి ఓ స్థలాన్ని ఎంపిక చేసుకు న్నారు. దాడి జరిగితే అక్కడ నుంచి సులువుగా తప్పించుకోవచ్చును. అందుకే గ్రామ రక్షక దళం సభ్యులు అక్కడే మకాం ఉంటున్నారు. వారి నాయకుడు రాంచందర్‌. ఈ ‌వార్త రజాకారులకు తెలిసింది.

గుట్ట ప్రక్క స్వయంసేవక శిబిరంపై ఆ రాత్రి దాడి చేయాలని రజాకారులు నిర్ణయించుకున్నారు. వారి రాకను ముందుగా కనిపెట్టిన స్వయంసేవక దళం వారు రజాకారులను దారి మధ్యలోనే అడ్డగిం చారు. ఉభయులకు జరిగిన కాల్పులో ఆరుగురు రజాకారులు నేలకొరిగారు. ఇంక అధికారి ఆజ్ఞలను కూడా లెక్క చేయకుండా మిగతా రజాకారులు బూట్లు విప్పి చేత్తో పట్టుకుని వెనక్కు పరుగులు తీశారు. విధి లేక వారి నాయకుడు కూడా వారి వెనుక పరుగెత్తాడు. పడిపోయిన రజాకారుల శవాలను తీసుకుపోవడానికి కూడా అవకాశం లేకపోయింది. స్వయంసేవక దళాలు ఆరు తుపాకులూ, నూట అరవై తూటాలు లాక్కొని ఆ రహస్య స్థలానికి చేరుకున్నారు. పక్కనే రక్షణకై తవ్విన కందకంలో రజాకారుల శవాలను పూడ్చి స్వయంసేవకులే అంత్యక్రియలు పూర్తి చేశారు. రజాకారులకు ఆ రాత్రి జరిగినంత పరాభవం ఎన్నడూ జరగలేదు.

రజాకారులకు నాయకునిపై గల భయంతో గుండెలు, కోపంతో మెదళ్లు కంపించసాగాయి. ఆ వేడి మీద కసితో హుటాహుటీన వచ్చి ఈ చిన్న గ్రామంపై దాడి చేశారు. గ్రామం వెలుపల కాపలా ఉన్న గ్రామ రక్షకదళం ఈల ఊదడం, ఊరి మొగనే ఉన్న గౌరమ్మ కొంప తగులబడి పోవడం, రజాకారుల తుపాకీ గుండుకు మైసన్న, సాయన్న బలి కావడం ఒకదాని వెంట ఒకటిగా ఒకేసారి జరిగిపోయాయి. రజాకారుల గుంపు తుపానులా ఒకేసారి వచ్చి గ్రామం మీద పడటంతో గ్రామీణులకు ఏమిచేయాలో తోచలేదు. చెల్లాచెదురైపోయారు. పది నిమిషాలు వ్యవధి ఉన్నా ఎదిరించే వాళ్లే. ఆ మాత్రం సమయం కూడా చిక్కలేదు గ్రామానికి. రక్షకదళంలో గల మల్లయ్య, మైసన్న, శాయన్నలలో మైసన్న, సాయన్నలు రజాకారుల తుపాకీ గుళ్లకు బలై పోయారు. దీనితో గ్రామ ప్రజల్లో ధైర్య సాహసాలు దిగజారిపోయాయి. గుట్ట దగ్గరున్న శిబిరం చేరేవరకు వారికి ప్రాణాలు కుదుట పడలేదు.

చీకట్లను చీల్చుకుని నలుమూలలకూ చెదిరి పోయిన వారంతా ఎవరి మట్టుకు వారు గుట్టలవైపు బయలుదేరారు. పసిపాపలు కేరు మంటున్నారు. ఈ అరుపులు విని రజాకారులు అటువైపు రావచ్చని ఆ శబ్దం వినిపించకుండా వారి నోర్లు మూసేశారు తల్లులు. ఇంతలో మల్లయ్యకు గౌరమ్మ, లక్ష్మీ కనిపించలేదు. చీకట్లో మల్లయ్య వాళ్లకోసం వెదకసాగాడు. వృద్ధురాలు దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో, ఆమె వెంట లక్ష్మి ఉండిపోయిందేమో అనుకుంటుండగా వాళ్లు ఇద్దరూ వచ్చేశారు. మల్లయ్యకు లక్ష్మీ, గౌరమ్మ అంటే ప్రాణం.

శిబిరంలో స్వయంసేవకుల నాయకుడు రామచందర్‌. ‌ప్రజలకు ఎన్నో రకాలుగా చెప్పాడు, ‘ఇక్కడే ఉండి కలిసికట్టుగా పోరాడదామని’. ఎంత చెప్పినా తాము మాత్రం యూనియన్‌ ‌ప్రాంతాలకు పోయి తలదాచుకోవాలనుకున్నారు. కారణం తిండి గింజలు, బట్టలు, ఇల్లూ అన్నీ తగులడి పోయాయి. చివరకు పశువులను కూడా మంటల్లో వేశారు, పశువులకంటే తుచ్చులయిన రజాకారులు. చివరిగా రామచందర్‌ అడిగాడు, ‘మీరంతా యూనియన్‌ ‌ప్రాంతానికే వెళ్లి తలదాచుకోదల్చుకున్నారా?’ అని. వారంతా ముక్తకంఠంతో యూనియన్‌ ‌ప్రాంతానికే వెళ్ల నిశ్చయించినట్లు చెప్పారు.

రామచందర్‌కు ఇక గత్యంతరం లేదు. రక్షణకై పదిమంది స్వయంసేవకులని తీసుకుని వీరిని సరిహద్దు దాటించి యూనియన్‌ ‌ప్రాంతానికి చేర్చడానికి నిశ్చయించాడు. శిబిరంలో ఉన్న రొట్టె లన్నింటిని మూట గట్టించాడు. ఆ క్షణమే అంతా ప్రయాణం కావాలన్నాడు. కారణం, పగలు మండు టెండలో ప్రయాణం అసాధ్యం. కాబట్టి రాత్రే బయలుదేరాలి. ఆ రాత్రంతా నడిచిన గౌరమ్మ కళ్లు తేలేసింది. రామచందర్‌ను, మల్లయ్యను పిల్చి లక్ష్మి నెట్లాగైనా సరిహద్దులు దాటించమని అప్పగించి ప్రాణం వదిలేసింది. అక్కడింక మమకారాలు, హృదయాలు పనికిరావు. గౌరిని సమాధి చేసి రామచందర్‌ ‌దళం బయలుదేరింది.

లక్ష్మి అని గౌరి పెట్టిన ఆ బాలిక అసలు పేరు హమీదా. గౌరి ఇంటి పక్కనే ఉండేవారు. తండ్రి రహమాన్‌ ఓ ‌తొమ్మిది నెలల క్రితం ఊరు వదలి పోయాడు. రజాకారులలో కలిసిపోయాడని వినికిడి. మళ్లీ ఏనాడూ ఇంటికి రాలేదు. హమీదా తల్లి నాలుగు నెలల క్రితం బెంగతో చనిపోయింది. పోతూ పోతూ హామీదాను గౌరికి అప్పగించింది. గౌరి హమీదాను మనుమరాలుగా చూసుకుంటూ ‘లక్ష్మి’ అని పేరు పెట్టి పిలుస్తూ ఉండేది. గోదావరి ఇంకా పరుగు దూరంలో ఉంది. గోదావరి దాటితే యూనియన్‌ ‌ప్రవేశం.

అక్కడ రజాకారులు లేరు. స్త్రీలను అవమాన పరచడం, ఇళ్లు తగులబెట్టడం, హింసాయుత పాలన లేదు. స్వతంత్ర వాయువులు పీల్చడానికి కాంది శీకులంతా ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. ఇంతలో ఆ చీకట్లో ఎక్కడి నుండి వచ్చారో ‘‘నారా యే తక్బీర్‌! అల్లా హో అగ్బర్‌’’ అని కేకలు వేస్తూ, గుర్రాలపై నుండి సవారీ చేస్తూ కాల్పులు జరిపారు. తుపాకీ మోతలో ఎవరెవరు నేల కొరిగారు, ఏమైపోతున్నారో అర్థం కాలేదు.

లక్షికి 13 ఏళ్లు. ఏపుగా కనపడుతుంది, కాంది శీకులందరిలోకి అందగత్తె. ఆ లక్ష్మి కోసమే గౌరి ఇంతకాల బతికింది. ఆరునెలల క్రితమే ఒక్కగాను ఒక్క కొడుకు పోలీసు తూటాలకు బలి అయినప్పుడే ప్రాణం పోవాలి. కాని లక్ష్మి మీద మమకారంతో బ్రతికింది.

రామచందర్‌ అతని అనుయాయులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కాందిశీకు లంతా చెల్లాచెదురైయ్యారు. లక్ష్మి కెవ్వుమంది. ఒక రాక్షస రజాకారు నాయకుని చేతిలో చిక్కింది.. ‘‘చుప్‌ ‌చుప్‌’’.. ‌చీకట్లో శబ్దాలు. రజాకార్‌ ‌కంఠం నుండి శబ్దం. ఆ కంఠ ఎంత కర్కశమైన దయినా దానిలో లక్ష్మికి ఏవో పూర్వస్మృతులు వినవస్తున్నాయ్‌. ఆశతో రాని కంఠాన్ని విడిపించుకుని ‘‘బాబా, బాబా’’ అని మూల్గింది.

రజాకార్‌ ‌రక్తదాహం ఉపశమించింది. బాబా అంటూ లక్ష్మి వాలిపోయింది. ‘‘కాఫర్‌ ‌కే లడకి’’ అన్నాడు కాని కంఠం జ్ఞాపకం వస్తున్నది. ముఖం మీద ముఖం పెట్టి ఆ చీకట్లో చూశాడు. ఏదో స్మృతికి వస్తున్నది. హృదయం కొట్టుకుంటుంది. రజాకార్‌ ‌రాక్షస గుండెలో కూడా రక్తం కరిగింది.

‘‘హామీదా…’’ తొమ్మిది నెలల క్రితం పూర్వం కడసారి చూసిన తన ముద్దు బిడ్డ హామీదా. ఇప్పుడు ఈ అడవిలో, ఈ చీకట్లో ఒక సైతాన్‌కు బలియా… అల్లా… యా అల్లా అంటూండగా వెనుక నుండి పేల్చిన తుపాకీ దెబ్బకి రహమాన్‌ ‌నేల కొరిగాడు.

యూనియన్‌ ‌ప్రాంత శిబిరం గాయపడ్డ కాంది శీకులతో నిండిపోయింది. స్వయంసేవకులంతా హామీదా అంత్యక్రియలకు సన్నాహం చేస్తున్నారు.

అడ్లూరి అయోధ్యరామకవి చీకటిరాజ్యం కథ గురించి రాస్తూ విమర్శకుడు వాసిరెడ్డి నవీన్‌• ‌తెలంగాణ విముక్తి పోరాట కథలు చారిత్రకంగా ఎక్కడా నమోదు కాలేదు అంటాడు. చీకటిరాజ్యం కథలో అనాథ అయిపోయిన హామీదాను లక్ష్మి అనే పేరుతో ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఆమెను తండ్రి రహమాన్‌ ‌రజాకారుగా మారి తన గారాల పట్టిని తానే చంపడం ఎంతో హృదయ విదారకరం. మతోన్మాదం ఖరీదు ఓ కుటుంబం సర్వ నాశనమైంది. ఇది కథే కాని, ఒక నిజానికి అక్షర రూపం. అడ్లూరి అయోధ్య రామకవి ఈ విషయా లను బుర్రకథగా చెపుతూ ఊరూరా తిరుగుతూ ప్రజ లను చైతన్యవంతులుగా చేస్తూ ఉండేవాడు.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram