అనుపమ వ్యక్తిత్వం

‘‘డాక్టర్‌జీది అనుపమ వ్యక్తిత్వం. ఆయన జీవితకాలం తగ్గింపబడినందున ఆయన జీవితంలో ఈ జీవన కార్యం పూర్తికాలేదు. కాని దానిని సంపూర్ణ్ణం చేయగల మహా సంస్థనాయన నిర్మించారు. ఆయనను నేను సన్నిహితంగా పరిశీలించాను. ఆయన ఉత్తమ దేశభక్తుడని, గొప్ప సంఘటనకర్తయని అర్ధం చేసుకున్నాను.’’

  • స్వాతంత్య్ర వీర సావర్కర్‌

హిందూ యువక పరిషత్‌ అధ్యక్షులుగా ఉన్నప్పుడు డాక్టర్‌జీ ఒకసారి పూనాలోని మా యింటికి వచ్చారు. ఆరోజు టీ త్రాగే సమయానికి ఊరిలోని పెద్దలు కూడ విచ్చేశారు. సంభాషణ రాజకీయాల వైపు మళ్ళింది.

‘‘మహాత్మాజీ అంటే నా హృదయంలో అపారమైన గౌరవం ఉంది. వారి కాంగ్రెసు ఉద్యమం పట్ల నాకు హృదయ పూర్వకమైన అభిమానం ఉంది. అయితే కార్యక్షేత్రం మరొకటి. అదికూడ స్వరాజ్య ఉద్యమానికి సహాయక పూరకంగా ఉన్నది. ఒకేవ్యక్తి అన్ని పనులూ చేయలేడు. పరిమితమయినదే అయినా నిర్దిష్టమైన ఒక కార్యక్షేత్రాన్ని ఎన్నుకొని, దాంట్లోనే తన శక్తినంతా వినియో గించడం వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నేడు కార్యకర్తల శక్తి దుర్విని యోగ మవుతున్నదని నాకు తోస్తోంది’’ అని డాక్టర్‌జీ అన్నారు.

నన్ను చూపుతూ నామిత్రులొకరు డాక్టర్‌జీతో ‘‘మనమే అన్ని పనులూ చేయాలని ఈయన భావం’’ అని అన్నారు. దానికి డాక్టర్‌ ‌నవ్వుతూ ‘‘నాకు మాత్రం అది సరైనదనిపించటం లేదు. నేను ఒక కార్యరంగాన్ని నిర్ణయించుకున్నాను. దేశంలోని యువకుల పట్ల నిర్లక్ష్యం చూపబడుతోందని నాకు తోస్తోంది’’ అన్నారు. అప్పుడు నేను ‘‘ఇప్పుడు జాతీయోద్యమాలన్నిటిలోను యువకులే పాల్గొంటున్నారుకదా’’ అన్నాను.

డాక్టర్‌జీ ఒక్క క్షణం మౌనంగా ఉండి శాంత గంభీర స్వరంతో ఇలా అన్నారు: ‘‘మీరనేది నిజమే. కాని దాని అర్థం ఇప్పటి యువకవర్గం సంఘటితంగా ఉన్నదని కాని, జాతీయోద్యమాలకు కావలసిన సద్గుణాలు కలిగి ఉన్నదని కాని కాదు. అపరిపక్వమైన దశలోనే యువకులు జాతీయోద్యమాలలోకి దుముకుతున్నారు. ఉద్యమాలలో దిగేముందు యువకుల సామర్థ్యం సర్వాంగీణంగా వికాసం చెందడం అత్యవసరం. దానికై శీలసంపన్నులైన యువకుల యొక్క దేశవ్యాప్తమైన సంఘటన ఒకటి కావాలి. కాంగ్రెసు దీన్ని గురించి ఆలోచించినట్లే కనపడదు.’’

‘‘అయితే స్వరాజ్య పోరాటానికి దూరంగా ఉండే మీరీ సంఘటన చేయాలను కుంటున్నారా?’’ అని నేనడిగాను. ‘‘పైకి అలాగే కనిపించవచ్చు. కాని యువకులలో సంసిద్దత లేకుండా వారిని ఉద్యమాలలోకి దించడం వారికి, ఉద్యమాలకు కూడా హానికరం. సైనిక శిక్షణ ఇవ్వకుండానే యుద్ధరంగంలోకి క్రొత్త రిక్రూటులను పంపడం న్యాయమా?’’ అని వారడిగారు.

 డాక్టర్‌జీ చెప్పిన మాటలు అక్కడ ఉన్నవారందరికీ నచ్చినట్లనిపించింది. నేనింకా ఇలా అడిగాను: ‘‘అయితే ఇలా యువకులకు ఎప్పటిదాకా శిక్షణ ఇస్తారు?’’ వెంటనే నవ్వుతూ ఆయన ‘‘అది పూర్తయ్యాదాకా’’ అన్నారు. అందరి నవ్వు పూర్తయాక కొంచెం ఆగి డాక్టర్‌జీ ఇలా అన్నారు. ‘‘దేశంలో పోరాటం సాగుతూనే ఉంటుంది. నేను మాత్రం శక్తినంతా వినియోగించి మా పద్ధతిలోనే పనిచేస్తూంటాను. దేశానికి ఈ సంఘటన ఇప్పుడు కాకపోతే మరొకప్పుడయినా ఉపయోగపడుతుందని నా నమ్మకం.’’

– శ్రీ పి.కె. ఆత్రే

(‘స్వరాజ్యోద్యమం-సంఘటన’ పేరుతో ఏప్రిల్‌ 5, 1962 ‌జాగృతి సంచికలో వెలువడిన వ్యాసమిది)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram