స్వరాజ్య సమరం తెచ్చిన జాతీయ సమగ్రతను స్వతంత్ర భారతంలో నిలబెట్టడంలో పాలనా యంత్రాంగం పాత్ర ఉన్నదా? ఉంటే ఎంత? ఈ అంశం కీలకమైనది. ఆ అంశాలే చెప్పారు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ ‌కృష్ణారావు. సమగ్రతను కొత్తగా ఏమీ తీసుకురాలేకపోయినా దానికి చేటు చేయలేదని, స్వతంత్ర భారతదేశంలో పరిపాలన పాత్ర అంతవరకేనని కూడా చెప్పారు. పాలనలో పారదర్శకత, పాలన నిర్వహణలో సరళత్వమే ధ్యేయంగా దాదాపు మూడున్నర దశాబ్దాలు సేవలు అందించిన అధికారి కృష్ణారావు. 1979 ఐఏఎస్‌ ‌బ్యాచ్‌కు చెంది, ఆంధప్రదేశ్‌ ‌క్యాడర్‌లో పనిచేసిన కృష్ణారావు కృష్ణ, నెల్లూరు, కడప, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో వివిధ హోదాలలో పనిచేసి, ఆంధప్రదేశ్‌ ‌తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రధాన కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. కాలమిస్ట్‌గా, ‘నవ్యాంధ్ర మై జర్నీ’ పుస్తక రచయితగా, ఇంకా అనేక అభిరుచులు కలిగిన విశిష్ట వ్యక్తి ఆయన. విశ్రాంత జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటున్న వ్యక్తి. సేంద్రీయ వ్యవసాయం ఆయన అభిరుచి. ఆయన మాటలలో అయితే ఆంధప్రదేశ్‌ ‌బీజేపీలో ‘పార్ట్‌టైమ్‌ ‌పాలిటీషియన్‌’. ‌నిష్కర్షగా మాట్టాడడం ఆయన ప్రత్యేకతలలో ఒకటి. ఈ ఆగస్ట్ 15 ‌సందర్భంగా  కృష్ణారావుతో జాగృతి జరిపిన ముఖాముఖీ.


ఏ దేశంలో అయినా, రాజకీయ నాయకులు, వారి పదవీకాలం, వారి ప్రమాణ స్వీకారాలు, అధికారం, ఆర్భాటం.. తెరమీద కనిపించే వ్యవహారం. ఒక దేశ లక్ష్యసాధనకు అవసరమైనది, పాలన. కానీ దాని పాత్ర తెర వెనుకకే పరిమితం. అలాంటి పరిపాలనలో విస్తృత అనుభవం కలిగి, పాలనాదక్షుడిగా ప్రతిష్ట పొందిన మీరు పరిపాలన అన్న ఆ అంశాన్ని ఎలా నిర్వచిస్తారు? ఆ పరిణామం ఏమిటి?

ఒక్కొక్క దేశానికి వాళ్ల చారిత్రక పరిస్థితులు, వారసత్వం వంటి అంశాలకు అనుగుణంగా పరిపాలనా విధానం అభివృద్ధి అవుతుంది. మనది బ్రిటిష్‌ ‌పాలనా వారసత్వం. వాళ్లు మనకు కొన్ని వ్యవస్థలను ఇచ్చిపోయారు. వాటిలో ప్రధానమైనవి రెండు. ఒకటి పటిష్టమైన, బలీయమైన సివిల్‌ ‌సర్వీసెస్‌. ‌రెండు పోలీసు సర్వీస్‌. ‌రెండింటికి ఒక నియామక విధానం-అది కూడా న్యాయబద్ధమైన విధానం- ఉంది. వీటిలో ముఖ్యమైనది నియామక పద్ధతే కూడా. పాలన అంటే వాటికి అనుగుణంగా ఏర్పాటైన వ్యవస్థ. సర్దార్‌ ‌పటేల్‌గారు అన్నట్లు నిజంగా ఇదొక ఉక్కుచట్రం. ఆ ఉక్కుచట్రంతోనే బ్రిటిష్‌వారు రెండువందల ఏళ్లు పాలించారు. కాగా, పాలనను ఈస్ట్ ఇం‌డియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం తీసుకున్న తరువాత శతాబ్దకాలం వరకు వాళ్ల పాలనకు మూలస్తంభం ఈ సివిల్‌ ‌సర్వీస్‌ ‌వ్యవస్థే. ఆ రెండు వ్యవస్థలు బాగా పనిచేశాయి.

పరిపాలన-అడ్మినిస్ట్రేషన్‌- అం‌టున్నాం. దాని మౌలిక లక్షణాలు ఏవి?

పరిపాలన ప్రథమ కర్తవ్యం శాంతి భద్రతలు. పరిపాలన ఉన్నది ప్రధానంగా ఆ బాధ్యతను నిర్వర్తించడానికే. అది ఎప్పటికీ మరిచిపోవద్దు. ఆపైన అదనపు రెవెన్యూ వసూళ్లు సహా ఎన్నైనా చేయవచ్చు. ప్రభుత్వం నడవాలంటే రెవెన్యూ కావాలి. కానీ రెవెన్యూ వసూళ్లలో కూడా రాను రాను వీళ్ల పాత్ర తగ్గిపోతోంది. అది ప్రధాన ఆదాయ వనరు కూడా కాదు. దాని నుంచి ఎక్సైజ్‌, ‌కమర్షియల్‌ ‌టాక్స్ ‌విడిపోయాయి. ఇండిపెండెన్స్ ‌వచ్చిన తర్వాత ఈ సంక్షేమ రాజ్యంలో పరిపాలన పరిధి బాగా పెరిగింది. కామన్‌ ‌మ్యాన్‌కు అనుకూలంగా ఉండే వివిధ పథకాలు అమలు చేయడం, ఫలితాలు సామాన్య మానవునికి ఉపయోగపడే విధంగా చూడడం అందులో భాగం. అది పెద్ద అజెండాగా తయారయింది. ఇది ప్రజాస్వామ్యం నుంచి వచ్చింది. ప్రజాస్వామ్యం, ఓటింగ్‌, ‌సామాన్య మానవులకు చోటు పెరగడంతో సంక్షేమ పథకాలు ప్రధాన అభివృద్ధి అజెండా కిందకి వచ్చాయి.

బ్రిటిష్‌ ‌లేదా ఇస్లాం పాలన రావడానికి ముందు మనదైన ప్రాచీన పరిపాలన అయితే ఉంది. దాని ఛాయలు ఈ వ్యవస్థ మీద ఏమీ లేవా? ఇంకా చెప్పాలంటే, బానిస రాజులు ఉన్నారు, 1526 వరకు పరిపాలించినవారు. వాళ్లు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాన్ని మొగల్‌ ‌పాలకుడు అక్బర్‌ ‌కాలంలో తోడర్‌మల్‌ అమలు చేశాడు కదా!

ఆ పాలనా విధానం, ఈ పాలనా విధానం పూర్తిగా వేరు. ఆనాటి పాలనా విధానంలో రాజు, దండ నాయకులు, గణకులు తదితరులు ఉండేవారు. రాజుకు అనుగుణంగా ఉండేటటువంటి పాలకులు, దండనాయకులు రాజ్యం చేశారు. మంత్రి పాలనా వ్యవస్థలో ముఖ్యుడు. మొగల్‌ ‌కాలంలో అదే పద్ధతి. ఈ ప్రాచీన విధానం నిలిచిపోయి కొత్త విధానం వచ్చింది. తటస్థ సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌కాన్సెప్ట్ ‌వచ్చింది బ్రిటిష్‌వారి కాలంలోనే. ఒకటి చెప్పవచ్చు. మొగలులు అంతకుముందున్న రెవెన్యూ విధానం మీద బాగా ఆధారపడ్డారు. బ్రిటిష్‌వాడు అదే చేశాడు. కానీ దాన్ని బాగా మెరుగు పరిచాడు. మెరుగు పరిచి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే విధంగా వ్యవస్థీకరించాడు. అప్పటికి అధునాతనమైన పరికరాలు వచ్చాయి. ఇంతకుముందు లేనివి. ఆ భూమి కొలతలు, సెటిల్‌మెంట్‌, ‌క్వాలిటీ అసెస్‌మెంట్‌ ఇవన్నీ వచ్చాయి.

ఆధునిక పాలనానుభవం భారతీయులకు ఎలా దక్కింది? తొలి అడుగు ఏది?

మొదటి నుంచి పాలనలో తెల్లవారిదే ఆధిపత్యం. మనవారు కొద్ది కొద్దిగా రావడం మొదలుపెట్టారు. సర్దార్‌ ‌పటేల్‌గారు ఇదే పద్ధతి కొనసాగిస్తే బాగుం టుందని ఆలోచించి దీన్నే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీసెస్‌గా మార్చి తీసుకొచ్చారు. మన సివిల్‌ ‌సర్వీసెస్‌కు సంబంధించి కొంత మేలు, కొంత చేటు కూడా ఉన్నాయి. ప్రధానమైన మేలు ఏది- వీళ్లు వివిధ స్థాయిల్లో పనిచేస్తారు. జిల్లా కన్నా కింది స్థాయిలో, జిల్లా స్థాయిలో తమ పాలన మొదలెడు తారు. ఆపై రాష్ట్రస్థాయి, కేంద్రస్థాయి. కాబట్టి వివిధ స్థాయిలలో మంచి అనుభవం గడిస్తారు.

బ్రిటిష్‌ ఇం‌డియాలో ఇండియన్‌ ‌సివిల్‌ ‌సర్వీసెస్‌ అనేదే స్వతంత్ర భారతంలో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీసెస్‌గా మారింది. వీటి మధ్య వ్యత్యాసం, వాటిలోని లాభనష్టాలు ఏమిటి?

ఆరోజు ఐసిఎస్‌కుగానీ ఈరోజు ఐఏఎస్‌కుగానీ ఉన్న పెద్ద ఆస్తి వైవిధ్య భరితమైన, అనేక కోణాలు ఉన్న అద్భుత అనుభవం. అటు అభివృద్ధి, ఇటు శాంతిభద్రతల సాధనలో అనుభవం. రాజకీయ నాయకులతో క్షేత్రస్థాయిలో మెలగటం. ఇవన్నీ  అనుభవాన్ని సుసంపన్నం చేసే అంశాలు. వ్యక్తిగా సేవ చేయడం, వృత్తిపరంగా పాటు పడడం. అది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది.

భారతదేశానికి జాతీయ సమగ్రత అనే భావనను స్వరాజ్య సమరం తీసుకువచ్చింది. అందుకు బీజం వేసింది. స్వతంత్ర భారతదేశంలో పరిపాలన ఆ సమగ్రతను పరిరక్షించడంలో ఎలాంటి పాత్రను నిర్వహించింది?

పైన చెప్పిన అంశం జాతీయ సమగ్రత విషయంలో తోడ్పడే అవకాశం ఉంటుంది. అయితే జాతీయ సమగ్రతలో పరిపాలన పాత్రను ఇతమిత్థంగా చెప్పడం, నిర్వచించడం సాధ్యం కాకపో వచ్చు. ఆ అంశం అంత స్పష్టంగా లేదు. ఉండదు కూడా. కానీ స్వరాజ్య సమరంలో వచ్చిన జాతీయ సమగ్రత చెదిరిపోకుండా నిలపడంలో మాత్రం పరిపాలన పాత్ర కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల నుండి అధికారులు వస్తారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన అనుభవం, అది కూడా సంపద్వంతమైన అనుభవం, దాని ఫలితం దేశం నలుమూలలా ప్రతిబింబించే అవకాశం చాలా ఉంది. నిజంగా ఇదొక పెద్ద ప్లస్‌ ‌పాయింట్‌. ‌సివిల్‌ ‌సర్వీసెస్‌ అలాంటి లక్షణం ఉన్న వ్యవస్థ అనే చెప్పాలి. రెండవది అమెరికా పద్ధతి. హైర్‌ అం‌డ్‌ ‌ఫైర్‌ ‌విధానం. అధ్యక్షుడితో పాటు వస్తారు, వెళ్లిపోతారు. మన సివిల్‌ ‌సర్వీసెస్‌ అట్లా కాదు. ఎన్నికైన వారంతా జీవితకాలం అందులోనే ఉంటారు. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఆపై విపక్షమైనా, వీళ్లు వచ్చినా, వాళ్లు వచ్చినా వారైతే ఉంటారు. మళ్లీ దీని వల్ల కూడా లాభనష్టాలు రెండూ ఉన్నాయి. చిరకాలం కొనసాగగలగడం లాభం. బాధ్యతాయుతంగా ఉంటారు. ఇది జీవితకాల సేవ. అందుచేత ఎప్పుడైనాగానీ కొన్ని అంశాల మీద తీసుకున్న నిర్ణయాలు తరువాత ప్రశ్నార్థకం కాగలవు. అందుకే ఆ జాగ్రత్త. ఇక నష్టం. ఇది రెండు రకాలు.

 ఒకటి: రాను రాను పాలన బాగా సాంకేతి కతను సంతరించుకుంటున్నది. అలాగే వృత్తి నైపుణ్యాన్ని చూపిస్తున్నది. కొన్ని కొన్ని శాఖలలో డొమైన్‌ (ఒక అధికారి పరిధిలోని ప్రాంతం)కు సంబంధించిన పరిజ్ఞానం చాలా ముఖ్యం. వాణిజ్య, ఆర్థిక అంశాల నిర్వహణలలో విస్తారమైన పరిజ్ఞానం అవసరం. ఇదంతా నిజమే. కానీ దీనిని ఐ.ఏ.ఎస్‌. ‌వారు ఎంతవరకు సాధించగలరు? ఇది ప్రశ్న. ఎందుకంటే వీళ్ల మొత్తం 37 ఏళ్ల సర్వీస్‌లో 15 ఏళ్లు జిల్లాలోను, రాష్ట్రంలోను పనిచేస్తారు. అంటే 15 ఏళ్లు డొమైన్‌లో సాధించిన అనుభవానికి దూర మవుతారు. ఇంతలో ఆ డొమైన్‌ ఎం‌తో మారుతుంది. హఠాత్తుగా వీళ్లు అక్కడికి పోతే ఇమడగలరా? అయితే దీనికి భారత ప్రభుత్వంలో ఒక పద్ధతి ఉన్నది. ఒకచోట నియమిస్తే ఐదేళ్ల దాకా స్థానచలనం ఉండదు. కనుక డొమైన్‌కు చెందిన అనుభవం వస్తుంది. రాష్ట్రంలో అలా ఉండడం లేదు. పోస్టింగులు ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల మీద జరుగుతాయి. మూడు నెలలు, నాలుగు, ఆరు నెలల్లో ఎప్పుడైనా స్థానచలనం రావచ్చు. కాబట్టి వృత్తి నైపుణ్యం అభివృద్ధి కావటానికి రాష్ట్రాల్లో కష్టమవు తున్నది. ఈ సర్వీసెస్‌లో అదో పెద్ద ప్రతిబంధకమని చెప్పుకోవచ్చు.

రెండు: మితిమీరిన రాజకీయ జోక్యం. యాభయ్యవ దశకంలో పనిచేసిన వారు 60ల్లో అబ్బా.. మా కాలమంటారు. 60ల్లో వారు 70ల గురించి అలాగే అంటారు. మేమొచ్చేసరికి, ఇప్పటి వాళ్లతో పోల్చుకుంటే పరిస్థితి ఇంకా క్షీణించింది.

ఇంకొన్ని వాస్తవాలు కూడా చెప్పుకోవాలి. ఇది సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌పరిధికి బయటది. సివిల్‌ ‌సర్వీసెస్‌ను జాతీయ సమగ్రత మీద ఫోకస్‌ ‌పెడదామనే ప్రవేశ పెట్టారు. కానీ, దానివలన మాత్రమే సమగ్రత వచ్చిందని అనుకోను. ఎప్పటికైనా జాతీయ సమగ్రత పటిష్టం కావాలంటే ప్రజలలో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలి. ఇది ఒక జాతి, మనమంతా ఒకటి అనేటటువంటి భావన ప్రజల్లోకి తీసుకుపోవటానికి కృషి చేయాలి. రెండవది భారతదేశం లాంటి దేశంలో ఈ మొత్తం అజెండాను అమలు చేయడం ముఖ్యమైనది, మనసులో పెట్టుకోవల్సింది డైవర్సిటీ. ఇది పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్న చందంగా ఉండకూడదు. అలా చేస్తే జాతీయ సమగ్రత ఆలోచన విఫలమవుతుంది. భారత్‌లో జాతీయ సమైక్యతను గురించి ఎవరు మాట్లాడినా ఒకే ఒక సిద్ధాంతం- భిన్నత్వంలో ఏకత్వం. ఆ విభిన్నతలోని ఏకత్వాన్ని గుర్తిస్తూ అదే పునాదిగా వివిధ ప్రాంతాలను, వివిధ జాతులను, వివిధ భాషా ప్రయోజనాలను సమ న్వయం చేసుకుంటూ ఒక నమూనా తయారుచేసుకోవాలి. ఆ మోడల్‌ ‌వైవిధ్యానికి పెద్ద పీట వేసేదిగా ఉండాలి. ఒకటే మతం, అనిగానీ, ఒకే భాష అనే కోణం నుంచి పోతే విఫలమవుతుంది.

ఇది ప్రజాస్వామ్యం. పార్టీలు మారతాయి. ప్రభుత్వాలు మారతాయి. ఈ అనివార్య పరిణామాల నడుమ సివిల్‌ ‌సర్వెంట్లు ఎలా నెట్టుకు వస్తారు?

ఇన్నాళ్లు ఈ సర్వీసెస్‌ని నిలబెట్టి ఉంచింది ఏదీ అంటే తాటస్థ్యం. సివిల్‌ ‌సర్వెంట్‌ల తటస్థ వైఖరి. ఆ వైఖరే లేకపోతే సర్వీసెస్‌ ఔచిత్యం ఏమిటి? అది ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది కదా! ఇపుడు తటస్థంగా ఉండకుండా ఈ రోజు వచ్చిన పార్టీ నాయకులు చెప్పింది చేసి, రేపు ఇంకొకరు వచ్చిన పుడు అతడు చెప్పింది చేస్తే? ఇపుడు అమెరికాలో జరుగుతున్నదదే. అంతదానికి ఈ వ్యవస్థ ఎందుకు? మనం కూడా అదే విధానం తెచ్చుకోవచ్చు కదా- హైర్‌ అం‌డ్‌ ‌ఫై•ర్‌. ఇం‌కొకటి చెప్పాలి. వృత్తిపరమైన సామర్ధ్యం కూడా తగ్గింది. డొమైన్‌ ‌పరిజ్ఞానం వీళ్లకు లేకుండా పోతుంది. అందుకని లేటర్‌ ఎం‌ట్రీ ప్రిన్స్‌పుల్‌ ఐచ్ఛిక అంశాన్ని బట్టి క్షేత్రాన్ని ఎంచు కోవడం వచ్చింది అంటే ఆ డొమైన్‌ ‌పరిజ్ఞానం ఉన్నవాడు వస్తాడు. ఫైనాన్స్ ‌క్షుణ్ణంగా చదివినవాడు ఆ విభాగంలోకి, కామర్స్ ‌పరిజ్ఞానం బాగా ఉన్నవాడు ఆ వైపు వెళతారు. ఇప్పుడు అలాంటి నైపుణ్యం ఉన్నవాళ్లు కనిపించడానికి కారణం లేటర్‌ ఎం‌ట్రీ ప్రిన్సిపుల్‌. ఒకటి మాత్రం చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులలో ఐ.ఏ.ఎస్‌ ‌ప్రాసంగికతపై కొంత చర్చ జరగాలి. చర్చ జరిగి ఏఏ శాఖలకు ఈ వ్యవస్థను పరిమితం చేయవచ్చు? ఏ శాఖలలో లేటర్‌ ఎం‌ట్రీకి అవకాశం ఇవ్వాలి అనే అంశాల మీద స్పష్టత రావాలి. ఇలాంటి చర్చ మొదలైంది. కానీ మరింత చర్చ అవసరం.

సంస్కృతి, వారసత్వ సంపద మొదలైనవి పరిపాలనా వ్యవస్థలో ప్రధాన అంశాలు కావా?

అట్లా పెట్టలేదు. మీరన్నది కరెక్ట్. అలా చేసుండాల్సింది. కల్చర్‌ను ప్రాధాన్యం లేనిదన్నట్టు వదిలేశారు. సంస్కృతి, నైతిక విలువలు పాటించడం, వ్యక్తిగత బాధ్యతను ప్రదర్శించడం…ఈ అజెండా ప్రధాన అజెండాగా లేదీరోజు.

బ్రిటిష్‌ ‌పాలన కారణంగా అనుకోవచ్చునా?

అలా అనను. సెక్యులరిజాన్ని నిర్వచించే విధానం కూడా ఈ పరిణామానికి కారణమైంది. సెక్యులరిజం అంటే అన్ని మతాలకు సంబంధించిన మంచిని బోధించటం అనే కోణం తీసుకొనుంటే బాగుండేది. సెక్యులరిజం అంటే పూర్తిగా మత తాటస్థ్యం అనటంతో మంచిని గురించి మాట్లాడటం, చెప్పటం ఒక అజెండా కింద ఉండనక్కరలేదు. ఇది మారాల్సిన అవసరమైతే ఉంది.

చాలాచోట్ల రాజకీయ నాయకుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పాలనాధికారుల మీద కూడా ఉన్నాయి. నిజానికి చట్ట నిర్మాతలకీ, పరిపాలకులకీ ఇప్పుడు అంతా అనుకుంటున్న ఆ దూరం పెరిగిందా?

ఆ దూరం పెరిగిందా? దగ్గరయినారా? ఆలోచించాలి. నేనది ఒప్పుకోను. ఎందుచేతనంటే రాజకీయ నాయకుడే అవినీతిపరుడు, మిగతా వారంతా నిజాయితీపరులు అనే భరోసా ఏమీలేదు. అలాంటిదే ఉంటే ఎప్పుడైనా ఓ కాలంలో ఉండేదేమో! ఇప్పుడు పోయింది. అవినీతిలో వీళ్లూ వాళ్లూ కూడా తక్కువ కాదు. అలాగే అందరూ రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి వారి మధ్య దూరం పెరగలేదు. వాళ్లు చాలా దగ్గరయినారు. ఇటువంటి అజెండాలో సహ కుట్రదారులే కూడా.

అయితే ఈ సంక్షోభాలన్నీ ఆ ఇద్దరు అలా దగ్గరయిపోవడం వల్లనే అనుకోవచ్చునా?

మొదట చెప్పవలసినది ఇవాళ చాలామంది రాజకీయ నాయకుల్లో దార్శనికులు లేరు. స్వాతంత్య్రం వచ్చిన తొలితరం నేతలలో అందరూ దార్శనికులే. వాళ్లందరూ ఒక ఉద్యమం నుంచి వచ్చారు. జాతీయోద్యమంలో పాల్గొని ప్రజానాయ కులయ్యారు. కనుక వారికి నిజమైన దార్శనికత ఉన్నది. ఈ రోజు ఆ దార్శనికత చాలావరకు లోపించింది. అలా అని అందరిని అనలేం. దానికి ప్రజల్ని కూడా తప్పుపట్టాలా అంటే, పట్టాలి. తరువాత అధికారులు. వారిలో రెండు రకాలు. అలాంటి నేతలతో కలసిపోయి వాళ్ల అజెండాను కూడా స్వంతం చేసుకోవటానికి కూడా చాలామంది సిద్ధం. ఇది పరస్పరం సౌకర్యంగా ఉంటోంది. అయితే ఎవడైనా గట్టిగా నిలబడితే వాణ్ణి పక్కన పెడతారు. ఇది మంచిది కాదు. కానీ నిజం.

అసమానతలు వాస్తవం. వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య అసమానతలు. దీనికి పాలనా యంత్రాంగాన్ని ఎంతవరకు తప్పుపట్టవచ్చు. రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు?

ఒకటి- ప్రాంతాల మధ్య అసమానతలకి చాలా కారణాలు ఉంటాయి. అందుకు ఏ ఒక్కటో చూపలేం. సాంస్కృతిక వైరుధ్యాలు ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యం ఉన్న వైరుధ్యాలూ ఉన్నాయి. వారసత్వానికి సంబంధించినవీ ఉన్నాయి. ఆర్థిక అసమానతలు అని ఎందుకు అనడం లేదంటే ఇపుడు యూపీ, బిహార్‌లకి ఆర్థికపరంగా ఏం తక్కువ? ఎన్నో వనరులు ఉన్నాయి. అద్భుతమైన భూసంపద, పుష్కలంగా నీళ్లు, వాణిజ్య కార్యకలాపాలు చేయ గలిగిన ప్రజలు. అంటే, అక్కడ సమస్య ఆర్థికం కాదు. సాంస్కృతికం, వారసత్వానికి సంబంధించినవి. అలాగే ప్రాంతాల వారీ సమస్యలు, విద్య, చైతన్యం.. ఇవన్నీ చాలా ముఖ్యం. వీటి వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు వస్తున్నాయి. ఈ అసమానతలు తగ్గించే విధంగా ప్రభుత్వానికి వచ్చే నిధులను కేటాయించడమే ఆర్థికసంఘం బాధ్యత. ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌చేసే కేటాయింపులలో ఎక్కువ భాగం ఈ రాష్ట్రాలకు ఇస్తున్నారు. అయినా అసమానతలు తగ్గడం లేదు. నిధులు ఎక్కువ ఇచ్చినా అభివృద్ధి జరగటంలేదు. నాయకత్వానికి సంబంధించిన అంశాలూ ఉన్నట్టున్నాయి. నాయకులు సరైనవారైతే ఆ రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రాంతాల మధ్య అసమానతల గురించి.

ఇక వ్యక్తుల మధ్య అసమానతలు. దానికి రెండు మూడు కారణాలున్నాయి. ఒకటి వంశ పారంపర్యమైనవి. తాత, తండ్రి సంపాదిస్తే నీకు వచ్చేస్తుంది. దీనితో గ్యాప్‌ ‌పెరిగిపోతుంది. సంపాదించేవాడికి సంపాదించనివాడికి గ్యాప్‌ ‌పెరుగుతుంది. రెండోది అవకాశాల అందుబాటు. విద్యావకాశాలు. ఇవన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. కానీ ప్రజాస్వామ్యంలో మంచి లక్షణమేమిటంటే సాధారణ ప్రజలను నిర్లక్ష్యం చేయలేం. అందుకే సంక్షేమ పథకాలు భారీ ఎత్తున వస్తున్నాయి. అవి కొంత అసమానతలు తగ్గించే అవకాశం ఉంది. నిజానికి అసమానతలు ఏ అభివృద్ధి క్రమంలో అయినా కనిపించేవే. దానిని ఆర్థిక పరిభాషలో చెబుతాను. ఒకటి లేబరు-శ్రమ. రెండోది మూలధనం, మూడోది ఎంటెర్‌‌ప్రైజ్‌. ‌నాలుగోది ఏదైనా ఒక అసెట్‌ ఉం‌టే ఇచ్చేటటువంటి రెంట్‌. ‌వీటికి పేమెంట్స్ ‌కింద ఏమేమి పోతాయి? ఒకటి వేతనాలు. ఇంకొకటి వ్యవస్థాపకుడికి వస్తుంది. మూడోది ఏదైనా అసెట్‌ అయితే రెంట్‌ ‌వస్తుంది. క్యాపిటల్‌ ఇం‌టరెస్ట్ ‌వస్తుంది. మాములువాళ్లకి ఏముంటాయి? వేతనాలు ఉంటాయి. వాడు ఎంత శ్రమ జేసినా, క్యాపిటల్‌ ఉం‌డదు, ఎంటర్‌‌ప్రైజ్‌ ‌లేదు, ఆస్తి లేదు. ఇంట్రస్ట్ ‌రావడానికి లాభం, రెంట్‌ ‌వచ్చే అవకాశా లేవు. ఉన్నతవర్గంలో ఉన్నవాడికి నాలుగూ ఉంటాయి. కనుక వృద్ధి పక్రియ పురోగమించే కొద్దీ ఈ అంతరం పెరుగుతూనే ఉంటుంది. అది మౌలికమైనది. ఇప్పుడు అరిచే ప్రతివాడు అర్థం చేసుకోవాల్సిన ప్రాథమికాంశం ఇదే. ఎక్కువ అసమానతలను గురించి మాట్లాడద్దు. ఈ వేతనాలు వచ్చేవాడికి కనీస జీవన ప్రమాణాలు ఎట్లా ఇద్దామనే దానిమీద మాట్లాడదాం.

ఈ కోణం నుంచి ఆలోచించినవారు ఎవరైనా ఉన్నారా?

పండిత్‌ ‌దీన్‌దయాల్‌ ఇం‌టిగ్రల్‌ ‌హ్యూమనిజం కాన్సెప్ట్ ఒక తడవ చదివితే ఎంత ముందుచూపుతో రాశాడా అనిపిస్తుంది. సాధారణ ఆరోగ్య బీమా గురించి ఆయన 1960లోనే మాట్లాడారు. సమగ్ర ఆరోగ్య విధానం, సమగ్ర విద్యావిధానానికి కావలసిన ఏర్పాటు చేయడం, మద్దతు ఇవ్వటం గురించి ఆయన చెప్పారు. విద్య, వైద్యం రెండూ ముఖ్యమైనవే. తరువాత వృద్ధాప్య బీమా. ఈ మూడు స్వీకరించి కనీస జీవన ప్రమాణాలు కల్పించగలిగిన తరువాతే అసమానత తగ్గుతుంది.

మీరు 1979లో ఈ సర్వీసెస్‌లోకి వచ్చి ఉండచ్చు. కానీ ఈ వ్యవస్థకు సంబంధించిన అంతకు ముందటి చరిత్ర మీకు అవగాహన కూడా ఉంటుంది. భారతదేశం ఒక సంక్షోభంలోకి ప్రవేశిస్తున్న సమయం 1979. అప్పుడు మీరు ఈ సర్వీసెస్‌లో ప్రవేశించారు. దానికి ముందు సంగతి వేరే. తరువాత కాలం వేరే. ఈ క్రమంలో పరిపాలనా అనే దానిని పద్ధతిగా అమలు చేయడానికి, గౌరవించడానికి ప్రయత్నిం చిన సమయాలేవి?

పరిపాలనను పూర్తిగా అర్థం చేసుకోవడానికీ, సక్రమంగా అమలు చేయడానికీ ప్రతివాడూ ప్రయత్ని స్తుంటాడు. కానీ అందులో ఎవరు విజయం సాధించారన్నది ముఖ్యం. కానీ, విజయమనేది మన ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రయత్నం ఎవరూ చెయ్యరు అనేదేం లేదు. దానికన్నా ముఖ్యమైనవి సైద్ధాంతిక స్పష్టత, వ్యవహార జ్ఞానం. ఈ రెండూ ఉంటే వాళ్లు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ధోరణిని మూడు విధాలుగా విభజించవచ్చు. నెహ్రూ పాలన, ఇందిరాగాంధీ పాలన, ఆపై సంకీర్ణ పాలన, తరువాత మోదీ పాలన. దీన్ని మూడు రకాలుగా వివరిద్దాం. నెహ్రూగారి పాలనా సమయంలో ఆయన చిత్తశుద్ధిని, ఉద్దేశాలని ప్రశ్నించవలసిన అవసరం లేదు. కానీ స్థూలంగా ఆయన తీసుకున్న, ఆయన విశ్వసించిన సోషలిస్ట్ ‌నమూనా లోపభూయిష్ట నమూనా. అది తెలియటా నికి 20, 30 ఏళ్లు పట్టింది. ఆరోజు సోషలిస్ట్ ‌నమూనాదే రాజ్యం. కానీ అది విఫలమైంది. సోవియెట్‌ ‌రష్యా కూలిపోయే దాకా ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఆయన ఉద్దేశం బాగున్నా, నిజాయితీ ఉన్నా, నమూనా విఫలం కావడం వలన ఆ కాలం బాగా నష్టపోయింది. తరువాత ఇందిర పాలనా సమయానికి వస్తే, అది స్వతంత్ర భారత దేశంలో కీలకమైన కాలం. ఆమె చిత్తశుద్ధిని కూడా శంకించాల్సిన అవసరం లేదు. నిబద్ధత ఉన్న జాతీయ నాయకులలో ఆమె ఒకరు. కానీ తండ్రి ప్రవేశపెట్టిన నమూనానే కొనసాగించారామె. కానీ ఆ వ్యవస్థకు ఇంకాస్త అవినీతిని అద్దారు. ఆమె కాలంలో అవినీతి ఎక్కువైంది. దాంతో సంక్షేమం పట్ల దృష్టి పెట్టి, చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంది. ఒకటి బ్యాంకులు జాతీయకరణ. ఇది మంచి నిర్ణయమని నేననుకుంటున్నాను. కానీ మొత్తంగా ఆర్థిక వ్యవస్థ పెరగలేదు. ఎందుకంటే అదే లోపభూయిష్ట వ్యవస్థ కొనసాగింది.

వారి పాలనకీ, మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులలో పదవులు చేపట్టిన అ•ల్‌ ‌బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీల పాలనలకీ స్థూలంగా ఏమిటి తేడా?

ఇందిరాగాంధీ తరువాత వాజ్‌పేయి, మోదీగారు వచ్చేంతవరకు అదొక సంక్షోభాల నేపథ్యం. వాజ పేయి గారి కూటమిలోని మిత్రులకు స్వప్రయోజ నాలు ఎక్కువ. అలాగే ప్రాంతీయ పరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటితోనే కూటమిగా దేశాన్ని దిశలేకుండా నడిపించిన కాలం. ఆ సమయంలోనే కశ్మీర్‌ ‌సమస్య ప్రబలింది. మనం అంతర్గతంగా తన్నుకుంటున్నాం. అవతలివాడు వచ్చి వేయిగాయాలతో మీ భూమిని రక్తసిక్తం చేస్తానన్నాడు. వాజ్‌పేయి గారి పాలన సమయం నుంచి ఒక ఫోకస్‌ ‌వచ్చింది. అది దేశాభివృద్ధి. నేడు మోదీ గారి పాలనలో ఫోకస్‌ అం‌తా వ్యవహార జ్ఞానంతో కూడిన దేశాభివృద్ధి. వ్యవహార జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం వాజ్‌పేయికి రాలేదు. ఇక్కడకి ప్రధానంగా గుర్తించాల్సిందని విదేశీ సిద్ధాంతాల రాద్ధాంతం లేదు. దేశం ఏంటి, దేశానికి ఏమి కావాలి, ఏం చేయాలి? అంతే, అదొక్కటే. ఆ అజెండా నడిపించిననాడు మంచిగానే జరుగుతుంది.

స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతు న్నది. ఇప్పటికీ గిరి ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. అందుకు కారణంగా మతాంతరీకరణలను, మావో యిజాన్ని ప్రధానంగా చూపించాలా? పరిపాలనా వ్యవస్థ అక్కడకు వెళ్లలేకపోయిన వైఫల్యాన్ని చూడాలా? పాలనా యంత్రాంగానికి బదులుగా తమ సమస్యలను తీర్చగలిగే దిక్కును వెనుకబడిన ప్రాంతాలవారు మతాంతరీకరణలలో, మావోయిస్టు లలో చూశారు కదా? అది ఎంతవరకు వాస్తవిక దృష్టి?

పరిపాలనా వ్యవస్థ అక్కడికి వెళ్లలేకపోబట్టే ఇవన్నీ వచ్చాయి. పరిపాలనా వ్యవస్థ అక్కడి దాకా వెళ్లుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు, అది మొదటిది. ఇక రెండవది, చాలా ముఖ్యమైనది. సమగ్రాభివృద్ధి లేకపోవడం వలన ఈ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నీ ఎప్పుడు వస్తాయి? నిరుద్యోగిత ఎక్కువ ఉండి, పనిచేయగలిగిన వాళ్లకు ఏం చేయాలో తెలియనప్పుడు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణంగా వృద్ధి చెందితే, అందరికీ ఉద్యోగ కల్పన జరిగితే ఈ సమస్యలన్నీ సమసిపోవడం ఆరంభమ వుతుంది. ఇంకొక మౌలిక అంశం- అవి బాగా సుదూర ప్రాంతాలు. కొన్ని శక్తులకు ఆలవాలం కూడా. కనుకనే మావోయిస్టులు తమకు అనుకూలమై నవి ఎంచుకున్నారు. ఇక మతాంతరీకరణ అంటే వాళ్లు అన్నిచోట్లకు వెళ్లిపోతున్నారు. అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అది డబ్బులతో కూడిన వ్యవహారం. అంతర్జాతీయ అంశం. పెద్ద పెద్ద లాబీలు పని చేస్తున్నాయి. మావోయిస్టుల కంటే మతాంతరీకరణలు ప్రమాదకరమైనవి. దానిని ఎదుర్కోవడమంటే ఆర్థిక వ్యూహం సహా పెద్ద వ్యూహం ఉండాలి. పరిపాలనా కూడా దానికి ట్యూన్‌ అయి ఉండాలి. పరిపాలన దానిని పట్టించుకున్ననాడే సమస్య పరిష్కారమవుతుంది.

భారతదేశంలో పరిపాలనకు సంబంధించి రావలసిన మార్పుల గురించి అనుభవజ్ఞులుగా మీరు ప్రభుత్వానికి చేసే సూచనలు ఏమిటి?

మొట్టమొదటిది వృత్తి నైపుణ్యం పెంచే పని ఇంకా గట్టిగా జరగాలి. మౌలికంగా వారికి పునశ్చరణ అయితే అవసరం. ఒకటి ఐ.ఏ.ఎస్‌.‌లో ఉన్న పెద్ద మైనస్‌ ‌పాయింట్‌ ఏమిటంటే సెక్యూరిటీ ఆఫ్‌ ‌సర్వీస్‌. ‌చేరగానే నన్ను ఎవడూ తీసేయలేడు అనే భావన. అది ఉండకూడదు. నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలి. దానికి సరైన ఏర్పాటు చేయాలి. లేటర్‌ ఎం‌ట్రీ నా దృష్టిలో మంచి విషయమే. నిపుణులను తెచ్చి ఉపయోగించుకోవాలి. భారత ప్రభుత్వంలో కాలపరిమితులు ఉన్నాయి. రాష్ట్రాల్లో లేదు. కింది స్థాయిలోను లేదు. ఒక సివిల్‌ ‌సర్వెంట్‌ను ఒక శాఖలో నియమించిన తరువాత అతన్ని నాలుగైదు సంవత్సరాలు ఉంచాలి. అతడికి విషయం బోధపడు తుంది. ఈ విధానాన్ని తీసుకురావాలి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram