‘‘నవ్వవు జంతువుల్‌ ‌నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్‌ ‌దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు’’ అన్నారో కవి, మనిషికీ జంతువులకీ మధ్యన భేదం చెబుతూ. మరి ఎంత నవ్వించినా, ఎన్ని జోకులేసినా, కాంతం కథలు, సాక్షి వ్యాసాలు, బారిష్టర్‌ ‌పార్వతీశం, గిరీశం లెక్చర్లు చదివినా నవ్వని ‘వర్గం’ కూడా ఉందండి! అటువంటి ‘మ్యానుఫ్యాక్చర్‌ ‌డిఫిట్‌’ ఉన్న వారి గురించి ఏ రచయితా, కవీ ఎందుకనో పద్యాలు, కవితలు, కథలు రాయలేదు. ఓ తెలుగు కవి ‘వాసన లేని పువ్వులా పరిహాస ప్రసంగం లేని వాక్యం వ్యర్థమన్నాడు’. ‘ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితమని ‘హాస్య ధన్వంతరిలు’ తెలిపినట్టు ఒకాయన అన్నాడు.

‘నవ్వులో శివుడున్నాడురా..’ కచ్చితంగా ఆ రకమైన అమృతాన్ని అందించే పుస్తకం. రచయిత శ్రీరమణ (శీర్షిక బాగుంది కదా అని పత్ర శీర్షికను వాడాను. రమణ గారికి క్షమాపణలు). అయినా ‘కాపీ’ని ఓ ‘రైట్‌’‌గా భావించే అచ్చ తెలుగు ప్రపంచంలో వాడిని నేను కూడా (ఇది ముళ్లపూడి వారి జోక్‌). ‌సాహిత్య పక్రియలలో గొప్పగొప్ప వారి నిజ జీవిత సంఘటనల నుండి పుట్టిన హాస్యోక్తులను సంకలనాలుగా తీసుకురావడం అనాదిగా ఉంది. మహానుభావులనదగ్గ సాహితీ దిగ్గజాలు సహజ సరస సంభాషణల వెనుక వారి హాస్య చతురత, కొండొకచో వారి జీవితంలోని లోతైన విషాదాలను హాస్య‘రసం’తో ఎలా త్రాగేరు… ఎలా జీర్ణించు కొనేవారనేది కూడా ఇటువంటి పుస్తకాలు చెబుతాయి. కొన్ని సంఘటనలు వారి వ్యక్తిత్వాలను సున్నితంగా సరదాగా (ఆర్ధ్రతతో) ఆవిష్కరిస్తాయి. అటువంటివి ఎన్నో శ్రీరమణ ఈ సంకలనంలో గుదిగుచ్చారు. ప్రసిద్ధ చిత్రకారులు, చిత్ర దర్శకుడు బాపు, గొప్ప హాస్య రచయిత ముళ్లపూడి వారితో, ‘ఎడిటర్‌’ అనే పదానికి వన్నె తెచ్చిన నండూరి, పురాణం వంటి పత్రికా ప్రముఖులతో శ్రీ శ్రీరమణకున్న వ్యక్తిగత పరిచయాలతో సిద్ధించిన హాస్య గుళికలను ఈ పుస్తకంలో అందించారు. ‘సాహిత్యంలో హాస్యం’, ‘హాస్యంతో సాహిత్యం’, అనే పద ‘బంధాలకు’ శ్రీరమణ ‘నవ్వులో శివుడున్నాడురా’ సాక్ష్యం. ఆనందానికి లిపి నవ్వు అంటారాయన. కాస్త సీరియస్‌ ‌విషయాన్ని కూడా ఆయన ఎంతో సరసంగా, హాస్యంగా చెప్పిన వైనం ఘనం. ‘కలియుగంలో సత్యం, అహింసలే ఆయుధాలుగా విశాల భారతీయ శృంఖలాలను తెంచినప్పుడు ఒక బోసి నవ్వు అంతరిక్షం దాక వ్యాపించింది’ గాంధీ గురించి చెప్పిన వాక్యంలో ‘బోసినవ్వు’ చదువరికి ఆలోచనతో కూడిన ‘చిరునవ్వు’ను తెస్తుంది.

సునుశిత హాస్యం ఆలుమగల మధ్య ఎంత అందమైన అనురాగబంధాన్ని ఆవిష్కరిస్తుందో రమణులు ఆవిష్కరించిన తీరు అద్భుతం. పార్వతీదేవి శివున్ని సరదాగా ‘హాస్యం’ పట్టిస్తూ ‘‘స్వామి ఎన్నుండి ఏమి లాభం! మీకు అమ్మానాన్నలు లేరుగా’ అంటుంది, క(న)వ్విస్తూ… శివుడూ అంతగానే స్పందిస్తూ ‘‘నీకు మాత్రం అత్తమామలున్నారేమిటి?’’ అంటాడు. ఇది శ్రీరమణ కలం చమత్కారం. మరో సందర్భం- ఆదిభట్ల నారాయణదాసు ‘గోసంరక్షణ నిది’ పేరిట చందాలు వసూలు చేశారు. ఇందులో కొంత స్వంతానికి వాడుకున్నారని పుకారు లేచింది. నలుగురు పెద్ద మనుషులు ధైర్యం చేసి ఆదిభట్ల వారిని అడిగారు. అందుకు ఆయన ‘జమా ఖర్చులు లెక్క చూసుకోండి. ఒకవేళ సొంతానికి వాడుకున్నానే అనుకోండి, అందులో తప్పేముంది? నేను మాత్రం గోవులాంటి వాణ్ణి కాదా’ అన్నారు. ఇంకేముంది పెద్దలు నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఆలోచించి చూస్తే నిజ జీవితంలో చాలా సమస్యలను ‘హాస్యం’ పరదాతో అవలీలగా జయించవచ్చునని అనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం.. కొందరు కొద్దిపాటి అపజయాలకు కృంగిపోతారు. మరి కొంతమంది ఎంత పెద్ద కష్టమొచ్చినా కృంగరు. బాపు తీసిన ‘బంగారు పిచ్చుక’ సినిమా బాగా ఆడలేదు. అయినా ‘వందరోజులు’ అని పోస్టరు వేసారు. జనం గొప్ప హాస్యమనుకున్నారు. శ్రేయోభిలాషులు అడిగారు, ‘ఇది నిజమా’ అని. బాపుగారు ‘‘నిజమే.. మేము ఆ సినిమా తీసి వంద రోజులయింది’’ అన్నారట కూల్‌గా. వారు తమ అపజయాలను సహితం సరదాగా చెప్పి, సీరియస్‌గా ఆలోచించి విజయాలు సిద్ధింపజేసుకుంటారు మరి. ఇది వర్తమానతరం నేర్చుకోవాల్సిందే! శ్రీశ్రీ గురించి ఈ పుస్తకంలో శ్రీరమణ ఎన్నో అంశాలు చెప్పారు. శ్రీశ్రీ ‘‘సింహాలకు జూలుండును’’ అన్నారు. అందులోని ‘అర్థం’ చాలా మందికి అర్థం కాలేదు ‘జూ’లుండును అని చదువుకొంటే ‘జూ (జంతుప్రదర్శనశాల)లు’డును అనేది అవగతం అవు తుందంటారు రమణ. శ్రీశ్రీ ఏ అలంకారానికైనా నిర్వచనంగా నిలుస్తారు.

శ్రీరమణ మంచి చమత్కారి. విశ్వనాథ వంటి వారిని కూడా తమ చమత్కారాలతో ‘నవ్వించ గలడాయన’. అసలు విశ్వనాథలోని ‘హాస్యాన్ని’ ఎంతమంది తెలుసుకున్నారో తెలియదు. ఓసారి విశ్వనాథ శ్రీరమణని ఆటపట్టిస్తూ ‘ఏం చేస్తున్నావోయ్‌!’ అన్నారు. అందుకు రమణ, ‘మీ వేయిపడగలను తెలుగులో రాస్తున్నానండి’ అనగానే విశ్వనాథ వారు గొల్లున నవ్వారుట. అదీ ఆయనలోని భోళాతనం. కొంతమంది ఇరవైనాలుగు ఇంటూ ఏడు సీరియస్‌ ‌ముఖంతో ఉంటారు. భమిడిపాటి కామేశ్వరరావు ఇటువంటి వారే. ఆయన బిరుదేమో హాస్యబ్రహ్మ. కొంతమంది మిత్రులు ‘ఇంతగా అందర్నీ నవ్వించే మీరు నవ్వరేంటి మేష్టారు?’ అని అడిగితే సమాధానంగా భమిడిపాటి వారు ‘‘వడ్డించేవాడు తింటూ నవ్విస్తాడా ఏంటి?’’ అని మరలా తన సహజ గాంభీర్యాన్ని ధరించారట. మతంలో హాస్యం, మత ప్రవక్తల హాస్యం గురించి శ్రీరమణ చెబుతారు. క్రీస్తు బైబిల్‌లోని లూకా సువార్తలో ఈ విధంగా చెప్పివున్నాడు. ‘ఇప్పుడు ఏడ్చెడివారు రక్షింపబడుదురు గాక’ ఆ పిదప ‘వారెల్లరూ నవ్వబడుదురు’ అని. ఇక్కడ ‘నవ్వు’ అనేది ఓ సానుకూలాంశంగా మాత్రమే గ్రహించాలి.

జానపద సాహిత్యంలో బోలెడంత హాస్యం ఉంది. ఒక జానపదం చూద్దాం. ‘ఒకరికి చేయిచ్చి- ఒకరికి కాలిచ్చి / ఒకరికి నడుమిచ్చి కూకున్నానోయీ/ రాజా కూకున్నానోయీ…’ అంటుందామె. అందుకు బావ జడిసి ఎవరికెవరికేమని అడుగుతాడు. సమాధానంగా ఆ సరసాంగి ‘గాజుల్కు చేతినిచ్చి – అందెల్కి కాలునిచ్చి / వడ్డాణానికి నడుమునిచ్చి కూకున్నానోయి’ అంది. చరిత్రకు చెందిన చమత్కారాలూ హాస్యాన్నిస్తాయి అంటారు శ్రీరమణ. ఉదాహరణగా- ఒకనాటి గోకొండ నవాబు మల్కిభరాము పలు భాషలు తెలిసినవాడు. అందునా తెలుగు బాగా చదువుకున్నవాడు. ఒకసారి భోగసముద్రం వెంకటప్ప అనే భాషావేత్త తగిలాడు. ‘‘తమరు రెండు ప్రశ్నలు అడగండి, నేను ఒకే సమాధానం చెబుతాను’’ అన్నాడు నవాబుతో. నవాబు సరేనన్నాడు. తొలి ప్రశ్నగా ‘‘ఇల్లేల కురియన్‌? ‌పామేల పొంచున్‌?’’ అనగా వెంకప్ప ఒకే పదం ‘కప్పకనే’ అని సమాధానపరిచాడు. ఇల్లు కురిసేది (కారటం) పాము కాపు కాసేది ‘కప్పకనే’ కదా! ఇలాంటివెన్నో చమత్కార భాషణలున్నాయి. ఒక అగ్రహారంలో అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని కొంపలు కాలిపోయాయి. అందరూ పండితులే… వారు చర్చించు కుంటున్నారు. ‘‘ఇది సహజాగ్నా (సహజంగా ఏర్పడినదా), చోరాగ్నా (గిట్టనివాడు చేసినదా), హోమాగ్నా (హోమం వలన జరిగిందా) తేలాలనుకున్నారు. ఇలా భాషాపరమైన సరదా సరదా సంభాషణలు వలన భాషతో కూడిన హాస్యం ధ్వనిస్తుంది. ‘శ్లేష’లతో హాస్యం అందరికీ తెలిసిందే.

శ్రీరమణ గురించి ఎంత రాసినా, ఆయన చెప్పిన ఒక్క చెణుకునైనా గుర్తు చేసుకోకపోతే, చమత్కార కళ చిన్నబోతుంది. అందుకే ఇది. ఎప్పుడో గతించిన ఒక ప్రముఖ సంపాదకుని వారసులు వచ్చారు. సదరు ఎడిటర్‌గారి వ్యక్తిగత గ్రంథాలయం ఎవరికైనా ఇచ్చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అందుకు శ్రీరమణ పరిష్కారం, ‘అంత పనెందుకు? ఎవరి పుస్తకం వాళ్లు పట్టుకుపోవచ్చని చిన్న వార్త వేయించండి చాలు!’

– భమిడిపాటి గౌరీశంకర్‌, 9492858395

——————–

మన కథకు బంగారు మురుగు

తెలుగు కథకు ‘బంగారు మురుగు’ తొడిగిన రచయిత శ్రీరమణ. రచయితగా శ్రీరమణ స్వేచ్ఛార్థి. మనసుకు నచ్చినట్టు రచనలు చేయగలిగారు. ‘బంగారు మురుగు’ కథలోని మురిపెం ఆయనకే సాధ్యం. బామ్మ ఒడిలో పెరిగిన మనవడి కథ ఇది. లేదా మనవడే ప్రాణంగా పెరిగిన బామ్మ కథ అనుకున్నా ఇబ్బంది లేదు. తన మనవడు తండ్రి చేతిలో దెబ్బలు తినడానికి కారకుడైన స్వామిని ఆ బామ్మ అభిశంసించిన తీరు అమోఘం. ఆ స్వామి శిష్యుడిని పిలిచి,‘అరిసెలూ, అప్పాలు జయించలేనివాడు అరిషడ్వర్గాలని ఏం జయిస్తాడో’ అడగమంది. ‘మిథునం’ కథలో అప్పదాసును మరచిపోవడం అంత సులభం కాదు. పెరట్లోని ప్రతి మొక్కకీ, తీగకీ పేర్లు పెట్టి వాటితోనే పిలుచుకుంటూ ఒంటరితనాన్ని జయించిన ఒక వృద్ధ జంట కథ ఇది. ఎవరి ఇంటికీ వెళ్లకుండా తమకు కావలసిన విధంగా బతికారు. ఒక స్త్రీ గడప దాటకుండానే ఎంతటి వ్యాపార ప్రజ్ఞను ప్రదర్శించగలదో చెబుతుంది ‘ధనలక్ష్మి’ కథ. వరాలబావి, నాలుగో ఎకరం నవలిక ఏది తీసుకున్నా ఒక ప్రత్యేక శైలిలో అందించారు శ్రీరమణ.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన వ్యంగ్య రచనలు, పత్రికలలో నిర్వహించిన శీర్షకలు మరొక ఎత్తు. జలసూత్రం రుక్మీణీనాథ శాస్త్రిని గుర్తు చేస్తూ ఉంటాయి ఆయన పేరడీలు. రంగులరాట్నం, వెంకటసత్య స్టాలిన్‌, శ్రీ‌రమణ పేరడీలు, మొదటిపేజీ, హాస్యజ్యోతి, గుత్తొంకాయ కూర మానవసంబంధాలు, చిలకల పందిరి, శ్రీ ఛానెల్‌ 1,2 అన్నీ అద్భుతమే. వెంకట సత్య స్టాలిన్‌ ‌కోసం ఆయన ఎంచుకున్న శైలి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇదొక కాలంతో పనిలేని పాత్ర. స్టాలిన్‌ ‌త్రికాలజ్ఞుడు. పీవీ మొదలు, రవీంద్రనాథ్‌ ‌టాగోర్‌, ‌తిలక్‌, ‌నవాబుల కొలువులు, బ్రిటిష్‌ ‌పాలన అన్నింటి మీద ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తాడు. చరిత్రలో జరిగిన చమత్కారాలనే ఇంత అందంగా చెప్పారు.

రంగులరాట్నం ఉప శీర్షికే ‘చమత్కారాలూ మిరియాలూ, అల్లం బెల్లం మురబ్బాలూ’. ఇందులో ఆయన ఎవరినీ విడిచిపెట్టకుండా వెక్కిరించడం కనిపిస్తుంది. రాజకీయ నాయకులునీ రచయితలనీ వెక్కిరించడం శ్రీరమణకి మహా ఇష్టమనిపిస్తుంది. ‘పోస్ట్… ‌పోస్ట్‌మన్‌ ‌తెచ్చిన కవర్ని అందుకున్నది రాధ’ ఇంకా ఆమె మనసు పరిపరివిధాల కొట్టుకోవడం, చిరునామా తనదే అని రూఢి చేసుకోవడం ఇవన్నీ జరిగాక ఒక బాంబు పేలుస్తారు.. ఆ రోజు ఆదివారం. ఉత్సాహం కాస్త ఎక్కువగా ఉండే కలాలను కూడా శ్రీరమణ బాగా ఆట పట్టిస్తారు. అందుకు ఇదొక ఉదాహరణ- ‘కుండపోతగా వర్షం. చీకట్లు కమ్మిన ఆకాశపు వెండితెర మీద రంగుల హరివిల్లు వర్షపు ధారల్లోంచి చూడముచ్చటగా ఉంది..’ దీనికి (కథలూ కజ్జికాయలూ) ఆయన ఇచ్చిన ముగింపు, ‘కథే కాదు. ఏ పక్రియైనా ఒకే మూసలో నొక్కి తీసిన కజ్జికాయల్లా ఉండకూడదు. వేటికి అవి స్వేచ్ఛగా చేతితో వేసిన పకోడీల్లా ఉండాలంటాను.’ పేర్ల ముచ్చట కూడా ఒకటి ఉంది. నిజానికి ఇది కూడా వెక్కిరింతే. యాభయ్యో పడిలో తండ్రి అయిన మావయ్య కొడుక్కి పేరు నిశ్చయిం చాడు. అదే అల్లూరి. అదేమిటి, అది సీతారామరాజు ఇంటి పేరు కదా అంటుంది అత్తయ్య. అందుకు మావయ్య, గాంధీ, నెహ్రూ ఇంటిపేర్లు కాదేమిటి అని స్పష్టత ఇచ్చాడు.

ఇంకొకడు చంద్రం మామయ్య. ఈయన తాసీల్దారు. ఈయన భార్యకి సొంత డబ్బు పెట్టి కొన్న మామిడిపళ్లు నొసగా అనిపిస్తాయి.అవి మహచెడ్డ చౌకరోజులు. పాతిక రసాలకి పాతిక మార్కులు ఇచ్చేసేవారు పిల్లలకి. అత్తయ్య తన ఇద్దరు పిల్లలని అలాగే ఉత్తీర్ణులని చేసింది. అంతేనా, మావయ్య పదవీ విరమణ చేసిన తరువాత మామిడిపళ్ల బుట్టలు ఆగిపోయాయి. అత్తయ్య కాశీ వెళ్లి మామిడిపండును వదిలేసి వచ్చిందట.

కథలలో గాని, శీర్షికలలో, వ్యంగ్య రచనలలో కానీ గుర్తుండిపోయే వాక్యాలు రాస్తారు శ్రీరమణ. ఇప్పటి రచయితలు నేర్చుకోవలసినది అలాంటి వాక్యాలు రాయడం. అలాగే శ్రీరమణగారి హాస్య చతురత. ఇది మరీ ముఖ్యం.

About Author

By editor

Twitter
YOUTUBE