– పి. చంద్రశేఖర ఆజాద్‌, 9246573575

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘మూడు నెలలు మాత్రమే బతుకుతాడు అన్న మా అబ్బాయి ఆరు నెలలు బతికాడు. ఆ ఆరునెలల కాలంలో ప్రతిరోజూ నాకు గుర్తుంది. ఇలాంటి సన్నివేశాలు నేను ఎన్నో రాసాను. ఆ ఆరు నెలల సంఘర్షణని నేను రాయాలి. అది అసలు సిసలు రచన… నేను రాయవలసిన హార్ట్ ‌టచింగ్‌ ‌స్టోరీ… అయితే అది నేను రాయలేను’’ అన్నాడు.

‘‘అదేంటి సార్‌… ‌వందల సినిమాలు రాసిన మంచి రచయిత. ఆయన రాయలేకపోవటం ఏమిటి?’’

భుజాలు ష్రగ్‌ ‌చేసాడు గోవింద్‌.

‘‘ఆరు నెలలపాటు ప్రతి నిమిషం ఆయన నరకం అనుభవించారు. అది ఆయన మాత్రమే రాయగలరు సర్‌’’.

‘‘ఎవరి బాధల్ని వారు, ఎవరి జీవితానుభవాల్ని వారు బాగా రాయగలరు అనటాన్ని అందరం ఒప్పుకుంటాం. అది పూర్తిగా నిజం కాదు. ఎదుటి వారి బాధల గురించి విన్నప్పుడు కూడా మనం స్వంతం చేసుకోవచ్చు. ఎంత ఖరీదయిన ఆభరణాని కయినా ఓ చేర్పు కావాలంటారు. అవునా?’’

అప్పుడు రిత్విక్‌కి తన నవల గుర్తు వచ్చింది. అందులో చివరికి ఒక్క వాక్యం ఉంటుంది. దాంతో నవల ముగుస్తుంది. కానీ ఆ వాక్యం రిత్విక్‌ది కాదు. రాస్తున్నప్పుడు అలాంటి వాక్యం ఎందుకు తట్టలేదో ఇప్పటికీ అర్థం కాదు. ఆ ఒక్క వాక్యం నవల మొత్తం సారాంశాన్ని చెప్పటమే కాకుండా ఓ స్థాయికి తీసుకువెళ్లింది. మరో సందర్భంలో ఓ పేజీ ఎడిట్‌ అయింది. అప్పుడు రిత్విక్‌ ‌పడిన బాధ అంతా ఇంతా కాదు.

అప్పుడు ఆ ఎడిటర్‌ని అడిగి చివరి సన్నివేశం గురించి వివరించాడు. అది విన్నాక ఆయన నొచ్చు కుంటూ ఈ పేజీ ఎలా మిస్సయిందో తెలియదు. పుస్తకంగా తీసుకువచ్చినప్పుడు తప్ప కుండా యాడ్‌ ‌చెయ్యి అన్నారు.

‘‘ఏంటి రిత్విక్‌ ఆలోచిస్తున్నావు?’’

అప్పుడు రిత్విక్‌ ఆ ‌నవల గురించి చెప్పాడు.

‘‘ఆ వాక్యం మీది సార్‌. ఆ ‌నవల చదివిన వారు ముఖ్యంగా ముగింపు వాక్యం చాలా బాగుంది అని ప్రశంసించారు. ఓ రచనకి ఎడిటర్‌ ఎం‌త అవసరమో మరోసారి గుర్తు చేశారు’’ అనగానే చిన్నగా నవ్వాడు…

‘‘ఆ మిత్రుడు నన్ను ఒక రచయితను చూసి పెట్టు… నీ దృష్టిలో మంచి రచయితలు ఉంటారు కదా అని రిక్వెస్ట్ ‌చేసాడు. అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చావు రిత్విక్‌’’.

అప్పుడు ఆనందం కలిగింది.

‘‘సినిమాల్లో కూడా మంచి రచయితలు ఉన్నారు. అది నా ఫ్రెండ్‌కి తెలుసు. అయినా అతనికి ఆ వాతారణం ఇష్టంలేదు’’.

‘‘నేను కూడా టీ.వి. రంగంలో ఉన్నాను సర్‌’’.

‘‘అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా, నీ హృదయాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నావని. నువ్వు పొల్యూట్‌ ‌కాలేదు రిత్విక్‌… అం‌తేకాదు, నువ్వు ఎన్ని సీరియల్స్ ‌రాసినా సాహిత్యాన్ని ఎలా వదలలేదు అని….’’

‘‘ఇంకోటి చెబుతున్నా. మనం అనేక అంశాల మీద పోటీలు పెడుతుంటాం. ఏ పత్రికకి ఎలా రాస్తే బహుమతి వస్తుంది అనే దృష్టి నీకు లేదు. నువ్వు రాయాలనుకున్నది రాస్తావు. ఎవరు ఎందుకు రాస్తున్నారో నేను గుర్తు పట్టలేనా రిత్విక్‌…’’

ఏం ‌సమాధానం చెప్పాలో తెలియలేదు.

‘‘సరే… ఇప్పుడు నువ్వు ఆ కథ రాయాలి అంటే నువ్వు నా మిత్రుడితో    ఉండాలి. అతను చెప్పింది నువ్వు రికార్డ్ ‌చేసుకోవాలి’’.

‘‘కానీ వారు ఇప్పటికీ బిజీగా ఉన్నారు’’.

‘‘నిజమే. ఇప్పటికిప్పుడు తన కమిట్‌ ‌మెంట్స్ ‌వదులుకోవటం కష్టం. తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలి. అలాగే తను చర్చల కోసం, షూటింగ్‌ల కోసం విదేశాలు వెళ్తుంటాడు. అవసరం అయితే నువ్వు కూడా వెళ్లాల్సి వుంటుంది’’.

‘‘ఇందుకేనా సర్‌ ‌నన్ను రమ్మంది’’ అడిగాడు రిత్విక్‌.

‘‘‌కాదు. ఇది ఓ చిన్న భాగం. మనం చేయవలసిన పనులు ఇంకా వున్నాయి. నీకు మనీ అవసరమా… అడగటం మరిచిపోకు’’.

‘‘అవసరం లేదు సర్‌. ‌నేను అన్ని ఏర్పాట్లూ చేసి వచ్చాను’’.

‘‘అలా కాదు. నువ్వు మా కోసం కొన్ని కమిట్‌మెంట్స్ ‌వదులుకున్నావు. నీ బ్యాంక్‌ ఎకౌంట్‌ ‌నెంబర్‌ ‌చెప్పు. నేను ట్రాన్స్‌ఫ•ర్‌ ‌చేయిస్తాను’’ అన్నాడు.

‘‘అది కాదు సర్‌’’.

‘‘ఈ ‌విషయంలో నువ్వు ఇంకేమి చెప్పవద్దు’’ అన్నాడు గోవింద్‌

*****

భువనేశ్వరి ఏదో ఆలోచనల్లో ఉంది.

ప్రభాత్‌ ‌బయటకు వెళ్తూ ఆగి, ఆమె దగ్గరకు వెళ్లాడు.

‘‘నేను ఈ రోజు ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నాను. తిరిగి రావటానికి నాలుగు రోజులు పట్టవచ్చు’’.

‘‘ఢిల్లీ ఎందుకు?’’

‘‘మనం కొన్న లాండ్‌ ‌రిజిస్ట్రేషన్‌కి చిన్న ప్రాబ్లమ్‌ ఉం‌దని చెప్పారు. అది పొలిటికల్‌గా డీల్‌ ‌చేయాల్సి ఉంది. పోనీ నువ్వు కూడా వస్తావా?’’

‘‘నేను ఒక్కదాన్నీ హోటల్లో కూర్చుని ఏం చేయాలి? అయినా మీరు ఢిల్లీ కంటే ముందు యు.కె. వెళ్లి వస్తే బాగుంటుంది’’.

‘‘ఇంతకు ముందు మనం రెండుసార్లు వెళ్లాం. అయినా రస అక్కడ ఉంది కదా, నీకు చూడాలనిపిస్తే వెళ్లిరా’’.

‘‘రస గురించి మాట్లాడాలి. మీరు పది నిమిషాలు స్పేర్‌ ‌చేయగలరా?’’

అతను వాచ్‌ ‌చూసుకుంటూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు.

‘‘మీరు కొంటున్న ల్యాండ్‌ ‌మన రసజ్ఞ హాస్పటల్స్ ‌కోసమే కదా’’.

‘‘అవును’’.

‘‘అది ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టటం మంచిది’’.

అతను నొసలు చిట్లించాడు.

‘‘రస మీతో మాట్లాడిందా?’’

‘‘లేదు… అయినా తను బిజీగా ఉంటుంది కదా!’’

‘‘ఆస్కార్‌ ‌వైల్డ్‌తో…’’

‘‘నాకు అర్థం కాలేదు. హీ ఈజ్‌ ‌నో మోర్‌ ‌కదా….’’

‘‘ఆయన వెళ్తూ… వెళ్తూ తన బుక్స్ ‌కొన్ని ఈ ప్రపంచం మీద వదిలి వెళ్లాడు కదా. అవన్నీ చదువుతుందంట. మీకు ఇంకో విషయం చెప్పాలి. మా అక్క వాళ్లు అమరావతిలో సెవెన్‌ ‌స్టార్‌ ‌హోటల్‌ ‌కట్టబోతున్నారంట’’.

‘‘బ్యాడ్‌ ఐడియా… ఇంకా నయం నేను ఏదో ఇండస్ట్రీ పెడతారేమో అనుకున్నాను’’.

‘‘ఇప్పుడు ఫుడ్‌కి మించిన ఇండస్ట్రీ ఏముంది ప్రభాత్‌? ‌దాంతో ఆగరంట. తిరుపతిలో, ఆ తర్వాత చెయిన్‌ ‌హాస్పటల్స్ ‌ప్లాన్‌లో వున్నాయి’’.

‘‘చాలా విషయాలు తెలుసుకున్నావు. ఇవన్నీ అమెరికాలో కూర్చుని ఎలా చేస్తారు?’’

‘‘ఇండియా వస్తారు. ఇప్పుడు కూతురూ, అల్లుడూ ఉన్నారు. వాళ్లు చూసుకుంటారు. సరయూ మన రసలా కాదు. దానికి స్పీడ్‌ ఎక్కువ. అసలు మా నాన్న ముందు నుండి వసుంధరని ప్రమోట్‌ ‌చేస్తూ వచ్చాడు. నన్ను పట్టించుకోలేదు’’ అంది కోపంగా.

‘‘ఆయన ప్రమోట్‌ ‌చేయటం ఏమిటి? నిన్ను చదువుకోవద్దు అన్నారా? నువ్వు చదువుతానంటే అమెరికా, యు.కె. పంపించనన్నారా..? నువ్వు నాకు పల్లెటూర్లు కావాలి. అమ్మమ్మ-నానమ్మ కావాలంటూ తిరిగావు’’.

‘‘నీకు మామగారంటే సాఫ్ట్ ‌కార్నర్‌ ‌వున్నట్లుంది’’.

‘‘ఏ మాత్రం లేదు. వాస్తవం మాట్లాడుతున్నాను. మీ ఫాదర్‌ ఎం‌తోమందికి ఉపయోగపడ్డారు. అందులో బంధువులున్నారు. స్నేహితులున్నారు. అఫ్‌కోర్స్ ‌నా వరకు ఉపయోగపడలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆయనకి రమేష్‌ అం‌టే ఇష్టం అనిపిస్తుంది’’.

‘‘అనిపించటం కాదు. అది నిజం. సరయూ ఇప్పుడు రూల్‌ ‌చేయాలనుకుంటోంది. ఇప్పటి వరకు ఆగారు. ఇక ముందు అది చేసే పనుల్ని మనం కళ్లు పెద్దవి చేసుకుని చూడాలి. మనం ఉన్న ఆస్తుల్ని అమ్ముకు తింటున్నాం’’ అంది నిరసనగా…

‘‘నువ్వు అలా మాట్లాడితే ఎలా? మనకు కలిసిరాలేదు. అయినా ఇంకొకరితో కంపారిజన్‌ ఎం‌దుకు?’’

‘‘నేను దేశంలో అందరితో కంపేర్‌ ‌చేసుకోవటం లేదు. నా అక్కతో కంపారిజన్‌. ఒకే రక్తం పంచుకుని పుట్టాం. ఆయన సిక్‌ అయిన ఇండస్ట్రీస్‌ ‌మనకు యిచ్చాడు. లాభాలన్నీ వారి వాటాకి వెళ్లాయి’’.

‘‘ఈ విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు రస గురించి చెప్పు’’.

‘‘మనం తన మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. హాస్పటల్‌ ‌వద్దు అంది. తను ఇప్పుడే చదువు పూర్తి చేయదంట. పిహెచ్‌.‌డి. చేస్తుందంట. సైంటిస్ట్ అవుతుందంట’’.

ఆలోచనలో పడ్డాడు.

‘‘సరయూకున్నంత ఫైర్‌ ‌దానికి లేదు. సరయూని చూస్తుంటే నాకు వసుంధర గుర్తు వస్తుంది. రస నాలాంటిది. రమేష్‌, ‌వసుంధర, సరయూని ముందు నుండి కాలిక్యులేటెడ్‌గా పెంచారు’’.

‘‘భువనా… నువ్వు అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడితే నాకు బాగుండదు. ఆక్స్‌ఫోర్డ్ ‌యూని వర్సిటీలో సీట్‌ ‌తెచ్చుకోవటం అంటే ఏంటను కున్నావు. అక్కడ పొలిటికల్‌ ఇన్‌ప్లుయన్స్ ‌లేదు. సరయూ దృష్టి బిజినెస్‌. ‌రస దృష్టి అదికాదు. అయినా తను ఇంకా చదువుకుంటోంది. తను రకరకాలుగా అనుకుంటోంది. ఎక్కడయినా సెటిల్‌ ‌కావచ్చు భువనా…’’

‘‘ఆ తర్వాత మీ ఇష్టం. తన ఇష్టం. నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇప్పుడు నువ్వు ఆ లాండ్‌ ‌విషయంలో ముందుకు వెళ్లటం మంచిది కాదు. రస కోసం అయితే రిస్క్ ‌తీసుకోవద్దు’’ అంది.

ప్రభాత్‌ ‌కారు వెనకాల కూర్చున్నాడు.

అతడికి రమేష్‌ ‌గుర్తు వస్తున్నాడు. తోడల్లుడు, భువనకి కంపారిజన్‌ ‌వద్దు అని చెప్పాడు. అది లేకుండా ఎలా వుంటుంది? రమేష్‌, ‌తనూ ఇద్దరూ సోదరుల వరస అవుతారు-ఒకే తల్లి కడుపున పుట్టక పోయినా! ఇంతకు ముందు ఎప్పుడన్నా కలిసే వారు. అతనికి, వసుంధరకి కూడా ఇండియా కంటే అమెరికా ఇష్టం.

వచ్చినప్పుడు బాగానే మాట్లాడేవాళ్లు.

అయినా అందులో ఏదో దర్పం కనిపించేది.

ఇది నా దృష్టి లోపమా అనుకునేవాడు.

అతను ఇంజనీరింగ్‌ ‌చేసాడు. వాళ్ల నాన్న భూస్వామి. వందల ఎకరాలు వున్నాయి. అతనితో పోల్చుకుంటే తను చాలా చిన్నవాడు. అయినా భువనను తనకు ఇవ్వటం వెనక చాలా చర్చలు జరిగాయి. అవన్నీ వివరంగా తెలియవు. వసుంధర, భువనేశ్వరిల మధ్య చిన్నప్పటి నుంచి ఓ పోటీ లాంటిది ఉంది.

మొదట్లో వసుంధర భువనకంటే తన ఫ్రెండ్స్‌కి ఎక్కువ విలువ యిచ్చేది. భువన అంటే చిన్న చూపు. ఆమెలో బలహీనతలను ప్రత్యేకంగా చూపించేదని భువన అంటుంది. భువన అమ్మమ్మ దగ్గర కొంతకాలం ఉంది. ఆమె పూజలు, ఆమె భావాలు బాగా ప్రభావం చూపించాయి.

ముఖ్యంగా భువనకి సెంటిమెంట్లు ఎక్కువ. నమ్మకాలు ఎక్కువ. ఓ పెద్ద కుటుంబంలో ఇదో చిత్రమైన కాంట్రాస్ట్. ‌క్రమంగా భువన మారి పోయింది. ఇద్దరికీ ఒకే అమ్మాయి. వసుంధర వాళ్లు ఇంకొకరిని కనాలనుకోలేదు. అబ్బాయి కావాలనే సెంటిమెంట్‌ ‌రమేష్‌కి, వసుంధరకి లేవు. అయినా కొంత కాలం ఆగారు. వారు ఆపరేషన్‌ ‌చేయించుకున్నారని తెలిసాక మాత్రం భువన చేయించుకుంది.

ఇవన్నీ ఆలోచిస్తుంటే చిత్రంగా ఉంటుంది అనుకున్నాడు ప్రభాత్‌. అప్పుడతనికి అత్తగారు గుర్తొచ్చింది.

ఆమె తులసి!

******

తులసి న్యూయార్క్‌లో వుంటోంది.

వసుంధర-రమేష్‌ అక్కడ ఉంటారు. వారితోనే ఉంటుంది. ఆమె పడక కుర్చీలో వాలి కళ్లు మూసుకుని వుంది. అడుగుల చప్పుడు వినిపిస్తే కళ్లు తెరిచి చూసింది. రెండు గ్లాసుల్తో జ్యూస్‌ ‌తీసుకు వచ్చింది వసుంధర. అమ్మకు అందించింది.

ఎదురుగా కూర్చుంది.

‘‘సరయూ, అల్లుడూ అమరావతికి వెళ్తున్నారమ్మా’’ అంది.

‘‘ఎప్పుడు?’’

‘‘ఈ రోజు రాత్రి ప్రయాణం’’.

‘‘మళ్లీ ఎప్పుడు వస్తారు?’’

‘‘తెలియదు. చాలా పనుల మీద వెళ్తున్నారు’’.

‘‘ముంబయ్‌ ‌కూడా వెళ్తారా?’’

‘‘నాకు తెలియదు. అయినా అక్కడికి వెళ్లకుండా వుండరు’’.

‘‘భువనని కలుస్తున్నారా?’’

అప్పుడు వసుంధర జ్యూస్‌ ‌సిప్‌ ‌చేస్తుండి పోయింది తప్ప మాట్లాడలేదు. అదే సమయంలో రసజ్ఞ గుర్తు వచ్చింది.

‘‘అమ్మమ్మా’’ అంటూ తను కనిపించగానే పరుగులు తీసుకుంటూ వచ్చేది. అలా కాళ్లకు చుట్టుకుపోయేది.

అప్పుడు చాలా సంతోషం కలిగేది.

‘‘అమ్మమ్మా… నువ్వు ఎప్పుడూ యంగ్‌గా కనిపిస్తావు… అసలు నీ వాయిస్‌ ఎం‌త స్వీట్‌గా వుంటుంది! తాత నీ వాయిస్‌ ‌కోసం నిన్ను చేసుకుని వుంటాడు కదూ’’ అనేది కాస్త పెద్దయ్యాక.

నిజంగానే తులసి కంఠం బాగుంటుంది. అది విన్నవారు ఆమెకి డెభై అయిదు సంవత్సరాలు వుంటాయనుకోరు. సరయూ కోసం ఫోన్‌ ‌చేసినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడేది. వాళ్ల ఫ్రెండ్స్ ‘‘‌హూ ఈజ్‌ ‌దట్‌ ‌గాల్‌’’ అనేవారు.

‘‘గ్రాండ్‌ ‌మా’’ అంటే నమ్మేవారు కాదు. ఓ సారి ఇంటికి తీసుకు వచ్చి చూపించింది. ఆమెతో మాట్లాడాక మాత్రం థ్రిల్లింగ్‌ ‌గా ఫీలయ్యేవారు.

‘‘అమ్మా… నీకు భువనని చూడాలని ఉందా?’’

ఆమె ఆలోచనల నుండి బయటపడి…

‘‘నాకేనా చూడాలనిపించేది. భువనకి ఉండదా? కనీసం ఎప్పుడన్నా ఫోన్‌ ‌చేసి అమ్మా…. ఎలా వున్నావు అని అడుగుతుందా? నాకు మీ ఇద్దరూ రెండు కళ్లు అంటే మా అమ్మకు ఒకటే కన్ను అనటం నేను మరిచిపోగలనా!’’

‘‘మరెందుకు సరయూ-భువనను కలుస్తుందా అని అడిగావు?’’

‘‘అడిగాను! నేను భువనని కూడా కన్నాను. దానికి నీ మీద ద్వేషం ఎందుకు? నేను ఏం తక్కువ చేసాను వసూ’’ అంది.

‘‘అలాంటి విషయాలు ఎందుకు ఆలోచి స్తున్నావు… కొన్ని మనం వదిలేయాలి. నువ్వు ఉన్నంత కాలం హాపీగా వుండు’’.

‘‘అంతకంటే చేయగలిగిందేముంది. రెండో మనవరాలి పెళ్లికి మనల్ని పిలుస్తారా?’’

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE