– కర్ణ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఈ ప్రపంచంలో అనేకచోట్ల నిధులు దాచి పెట్టారు. కొండల్లో, నీటిలో, భూమిలో భద్రంగా ఉన్నాయి. వాటిని పొందడం అందరి తరం కాదు. నీకు రాసి పెట్టుంటే ఆ  సంపద సమాచారం వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు అవకాశాన్ని చేజార్చుకోకుండా ఒడిసి పట్టుకోవాలి. అయితే, అందుకోసం నువ్వు ఎన్నో సాహసాలు చేయాలి. ఒక్కోసారి ప్రాణంపోయే పరిస్థితి రావొచ్చు. భయపడకూడదు. సంపద నీకు దక్కే సమయంలో వాతావరణం కూడా నీకు సహక రించదు. అన్నింటినీ భరించాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది’ ఒకతను మరో వ్యక్తికి చెప్తున్నాడు.

వెంకా ఈ మాటలు విని ‘వీళ్లెవరో పిచ్చోళ్లలా ఉండారు బా.. అయినా మనకెందుకులే.. అసలు లైఫ్‌ ఎటు పోతాందో అర్థం కాడంలేదు బా.. తిన్డం, తిరగడం, వెబ్‌ ‌సిరీస్‌లు, సినిమాలు డౌన్లోడ్‌ ‌చేస్కొని చూడ్డం, లేటుగా పడుకోవడం తప్ప కొత్తగా ఏమీలేదు. ఎంతకాలం ఇట్లా..’ నెల్లూరులోని ఓ వీధిలో కేఫ్‌ ‌బయట టీ తాగుతూ… సిగరెట్‌, ‌కాలుస్తూ స్నేహితుల వైపు చూసి అన్నాడు.

‘నిధి నాకు దొరకాలని కోరుకుంటున్నా బా.. జీవితంలో ఇక ఏ దిగులూ  ఉండదు. ఇలాంటివి నీకు నచ్చవులే. అయినా మాకేమన్నా నెలకి 50వేల జీతమొచ్చే ఉద్యోగాలుండాయా? పిచ్చిలేస్తాంది. డబ్బడిగితే మా అయ్య పళ్లు కొరకతాన్నాడు’ అనిల్‌ ‌ఫోన్‌ ‌చూస్తూ అన్నాడు.

‘ఇక్కడ నేనుండలేను బా.. ఎలాన్‌ ‌మస్క్ ‌తొందర్లో జనాన్ని మార్స్ ‌మీదకి  తీస్కొపోతాడంట. నేను ఆడికెళ్లిపోయి కొత్త లైఫ్‌ ‌స్టార్ట్ ‌చేస్తా.’ వెంకా చెప్పిన మాటలిన్న అనిల్‌, ‌కృష్ణ, మోహన్‌ ఉలిక్కిపడ్డారు. ‘ఫేసు ఇట్టా తిప్పు బా.. నువ్వు మార్స్ ‌మీదకి పోతావా?.. జరిగే పనేదైనా ఉంటే చెప్పు..’ అనిల్‌ ‌నవ్వుతూ అన్నాడు.

‘సర్లే.. నాకు స్పేస్‌ అం‌టే పిచ్చి. యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూస్తంటా కదా.. అలా ఆ ఆశ పుట్టింది. మీరు అంతలా వెక్కిరించబళ్లేదు.  రేయ్‌ అనిలా.. నీకూ ఏదో ఒకటి ఉండే ఉంటాది కదా.. అదేంటో చెప్పు..’

‘ఉందన్కో.. కాకపోతే నీలాంటిది కాదురా వెంకా .. మా ముత్తాత అప్పట్లో బ్రిటిష్‌ అమ్మాయిని చేస్కోని, కొన్నేళ్లకి అంతులేని సంపదతో ఇంగ్లండు కెళ్లి సెటిలై పోయుండాల్సింది. అదే జరుగుంటే ఈపాటికి నేను లండన్లో రాయల్‌ ‌లైఫ్‌ అనుభవిస్తూ ఉండేవాడిని.’

‘వామ్మో.. వాయ్యో.. ను మామూలోడివి కాదు బా.. సరే గానీ నీ సంగతి చెప్పరా కృష్ణా..’ వెంకా నవ్వాపుకోని అడిగాడు.

‘అది బా.. అది.. నేను తీసే నేచర్‌ ‌వీడియోలకి యూ ట్యూబ్లో మిలియన్స్‌లో వ్యూస్‌ ‌రావాలి. బాగా డబ్బొస్తాది. అప్పుడు వేరే పని చేయబళ్లేదు.. ఆ ప్లానింగ్లో ఉండా..

‘ఇది కొద్దిగా బెటర్రా కృష్ణా.. నీ సంగతి చెప్రా మోహన్‌..’

‘‌నాది కొంచెం ఇలాగే ఉంటాది బా.. ఇండియా మొత్తం బైక్లో తిరగాలి. రోజూ కొత్త ప్లేసుల్ని వీడియోస్‌ ‌తీసి యూ ట్యూబ్లో పెట్టాలి. దేశాన్ని చూసినట్టూ ఉంటాది. డబ్బుకి డబ్బొస్తాది.’

‘మీరిద్దరూ గట్టిగానే ప్లాన్‌ ‌చేస్తాండారు బా..’ వెంకా మాట్లాడుతుండగా సుమన్‌ ‌వచ్చాడు.

‘రారా బా.. ఏంది ఫుల్‌ ‌జోషులో ఉండావు.’

‘మన జీవితాలు మారిపోయే విషయంతో ఒచ్చినా..’ అని సుమన్‌ ‌చెప్పడంతో అందరూ ‘ఏంట్రా అది. ఏంట్రా అది. తొందర్గాచెప్పు’ అన్నారు.

‘నిన్న మా నాయనకి భోజనం ఇచ్చొద్దామని పనికాడికి పోయినా. అక్కడిద్దరు మాట్లాడుకుంటంటే ఇన్నా.. ఉదయగిరి కొండ మీద చిన్నచిన్న కోటలు ఏడెనిమిది ఉండాయంట. ఒకదాంట్లో నిధి ఉందని చుట్టుపక్కల ఊళ్లలో ప్రచారం ఉందంట. ఆ నిధి సంపాయిస్తే జీవితంలో స్థిరపడిపోయినట్టేనని చెప్పుకుంటుండారు. మనమెళ్లి నిధి సంపాయిద్దాం బా.. ఏమంటారు?’

‘కొంపదీసి సమాచారం వెతుక్కుంటావచ్చిందా?’ అనుకుని వెంకా ఆశ్చర్య పోయాడు. ఇందాక నిధి గురించి మాట్లాడుకున్నోళ్లు ఉన్నారేమోనని చూశాడు. అయితే అక్కడెవరూ లేరు.

నలుగురూ కాసేపు ఏం మాట్లాడలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

‘రేయ్‌ ‌వెంకా.. వాళ్లని పిచ్చోళ్లన్నావు. చూశావా మన్కి రాసుండాది కాబట్టే సమాచారం ఒచ్చి పడింది,’ అనిల్‌ ‌వెలిగిపోతున్న ముఖంతో చెప్పాడు.

‘ఉఫ్‌.. అనిలా.. కాసేపు ఆగురా సామీ.. సుమన్‌ ‌బా.. సినిమాల్లో చూపిస్తంటారు కదా.. ఫస్ట్ ‌మ్యాప్‌ ‌కోసం ఫైట్లు, చేజ్లు చేస్తారు. తర్వాత అపాయాల్ని తప్పించుకోని ఆఖర్లో నిధిని సొంతం చేస్కుంటారు. ఇప్పుడు మనం అలా చేయాలా..’ వెంకా వెటకారంగా అడిగాడు.

‘మూస్తావా.. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ స్వామి టెంపుల్స్‌లో అంతులేని నిధి ఉందని విన్నాం కదా.. చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందంట. ఉదయగిరికి చాలా చరిత్ర ఉండాది రా.. అక్కడ పురాతన కోటలు, ఆలయాలుండాయి. యుద్ధాలప్పుడు రాజులు వాళ్ల సంపదని దాచేసేవారు. కొన్ని ఈ కాలంలో బయటడుతుండాయ్‌.’

‘ఆపురా.. పనికొచ్చినోళ్లు మాట్లాడుకున్న పనికిరాని మాటలిని నువ్‌ ‌మాకు చెప్తాండావ్‌.’

‘అలా తీసిపారేయకు బా.. మనం పట్టించుకోని విషయాల్లో ఒక్కోసారి లోతెక్కువ ఉంటాది. మన జీవితాలు మారిపోయే పాయింట్‌ ఇదేనేమో.. ఆలోచించు.’ సుమన్‌ ‌చెప్పగా అనిల్‌, ‌కృష్ణ, మోహన్‌ ‌వెళ్దామని వెంకాని బతిమిలాడారు.

‘రేయ్‌ ఏం ‌మాట్లాడతన్నార్రా మీరు.. ఈ విషయం పోలీసోళ్లకి తెలిస్తే బాగా కుమ్మి లోపలేస్తారు. నేనొప్పుకోను..’

‘అంత తెలివి తక్కువుగా ఏం చేయంలే బా.. మనం చిక్కకుండా ప్లాన్‌ ‌వేద్దాం..’ అనిల్‌ అన్నాడు.

మోహన్‌ ‌వెంటనే ‘నాకో ఐడియా ఒచ్చింది బా.. ఉదయగిరిలో పురాతన కోటలు, ఆలయాల మీద డాక్యుమెంట్రీ తీస్తున్నామని చెప్దాం. కెమెరాతో అన్నీ షూట్‌ ‌చేద్దాం. కోట దగ్గర క్యాంప్ఫైర్‌ ‌వేసుకొని ఉంటామని అక్కడికెళ్దాం. ఎవరికీ అనుమానం రాదు. సైలెంటుగా నిధి కోసం వెతుకుదాం.. దొరికితే మన అదృష్టం. లేకపోతే డాక్యుమెంట్రీని యూట్యూబ్లో పెడితే డబ్బులొస్తాయ్‌.’ అని చెప్పాడు.

‘సూపర్‌ ‌బా.. ఈ ప్లాన్‌ ‌బాగుండాది. మనం వెళ్తున్నాం.’ వెంకా అందరి వైపు చూస్తూ చెప్పాడు.

రెండు రోజులయ్యాక సరంజామాతో అందరూ మారుతీ ఆమ్నీ వ్యాన్లో బయలుదేరి ఉదయగిరికి చేరుకున్నారు. ప్రజల్ని నమ్మించేందుకు ఉదయం కొన్ని చారిత్రక కట్టడాలను వీడియో తీశారు. సాయంత్రం కొండ కిందకు చేరుకున్నారు. పైకి వెళ్లే దారి దారుణంగా ఉంది. అయినా కష్టపడి చీకటి పడేలోగా మొదటి కోట సమీపానికి చేరారు. అక్కడి పరిస్థితులు ఏ మాత్రం వారికి అనుకూలంగా లేవు. వాతావరణం పగ పట్టింది. గాలి భయపెట్టేలా వీస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సామాన్లు మోసుకుంటూ కోట లోపలికి వెళ్లారు. శిథిలావస్థకు చేరుకున్న ఆ కట్టడాన్ని మెరుపుల వెలుగులో చూసి మరింత ఆందోళనకు గురయ్యారు.

‘సంపద నీకు దక్కే సమయంలో వాతావరణం కూడా నీకు సహకరించదు.’ ఈ మాటలు వెంకాకి గుర్తొచ్చాయి. ‘మనకు నిధి దక్కుతుంది బా..’ అన్నాడు స్నేహితులతో..

బయట వాతావరణంలో ఎలాంటి మార్పూ లేదు. కోట లోపలే టెంట్లు వేశారు. తర్వాత ఏం చేద్దామని స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. కాసేపటికి ఓ మూలన ఆకాశానికి గురిచేసినట్లుగా వెలుగు ప్రసరించింది. దీనిని చూసి కృష్ణ, సుమన్‌, ‌మోహన్‌ ‌భయపడ్డారు.

‘ఏం కాదుబా.. అందరం వెళ్లి చూద్దాం. ఒకవేళ అక్కడే నిధి ఉంటే మిగతా కోటలకు పోవాల్సిన పనుండదు.’ అన్నాడు వెంకా..

ఆ మాటలకు అందరికీ ఆశ పుట్టింది. దేవుడా కాపాడని జపిస్తూ ఐదుగురు వెలుగు సమీపానికి వెళ్లారు. ఒక్కసారిగా వెనుక నుంచి ఎవరో తోసి నట్లుగా, ముందు నుంచి ఇంకెవరో పట్టుకుని లాగి నట్టు అనిపించింది. అందరూ కిందకు జారి పోతుండగా భయపడిపోయి కేకలు వేశారు. కాసేపటికి వెలుగు ఆగిపోయింది.

ఐదుగురూ మట్టి మీద పడ్డారు.

‘రేయ్‌ ‌వెంకా.. మనమెక్కడున్నాం?’ అనిల్‌ అడిగాడు.

వెంకా టార్చ్‌లైట్‌ ‌వేసి చుట్టూ చూసి ‘రేయ్‌ ‌మనం కోట బయటే ఉన్నాం.’ అన్నాడు.

‘కింద పడితే కోట బయటికి ఎట్టా ఒచ్చినాం బా.. నాకేం అర్థం కాడంలేదు. ఏదో జరిగింది. సరే లోపలికి పోదాం పదండి’  అని అనిల్‌ అనడంతో స్నేహితులంతా వెళ్లారు.

ఇంతలో ఎవరివో మాటలు వినిపించాయి. వెంకా అందర్నీ ఆపి ‘రేయ్‌ అక్కడెవరో ఉన్నారు. గోడ చాటుకు రండి.’ అన్నాడు.

‘ఇందాక ఎవరూ లేరు కదా. ఇప్పుడెక్కడ్నుంచి ఒచ్చారు?’ కృష్ణ ప్రశ్నించాడు.

అందరూ గోడ చాటుగా ఉండి అక్కడెవురున్నారో చూశారు.

ఆ ఐదుగుర్ని చూసి వీళ్ల ఐదుగురికి మాటలు రాలేదు. కళ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తేరుకున్నారు.

‘రేయ్‌ ‌వెంకా..వాళ్లేంది అచ్చం మనలాగే ఉండారు. ఇందాక ఆ ప్లేస్లో మనమే కదా ఉంది. అసలేం జరిగింది రా?’ మోహన్‌ ‌తెల్లమొహమేసి అడిగాడు.

‘నాకేం తెల్సు రా.. నేను మీతోటే ఉన్నా కదా.. అంతా నాకేదో తెల్సినట్లు అడుగుతున్నారు.’ వెంకా పెద్దగా అరిచాడు.

లోపలునోళ్లు ఒక్కసారిగా గోడ వైపు చూశారు.

‘రేయ్‌ ‌మనం ఉన్నట్లు వాల్లకి తెల్సిపోయినాది. ఏదైతే అది అవుద్ది. పోయి అడగదాం పదండి.’ అనిల్‌ ‌ముందుకెళ్లబోయాడు.

కొద్దిక్షణాల్లోనే ఆ ఐదుగురు, ఈ ఐదుగురికి ఎదురుపడ్డారు. ఎవరూ మాట్లాడలేదు. నిశ్శబ్దం అలుముకుంది.

కాసేపటికి అనిల్‌ ‘ఎవర్రా మీరంతా.. మాలాగా ఎందుకున్నారు. అసలేం జరుగుతాందిక్కడ?,’ గంభీరంగా ఉన్నట్లు నటిస్తూ వణుకుతున్న గొంతుతో అడిగాడు.

‘అది అడగాల్సింది మేము రా.. మీరు మాలాగ ఎందుకున్నారు?, ఈ ప్లేస్కి ఎలా ఒచ్చారు?’ అనిల్‌-2 ‌గదమాయించాడు.

వాళ్ల మధ్య వాదనలు జరుగుతుండగా వెంకా, వెంకా-2 కళ్లు మూసి తల పట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నారు. కొన్ని నిమిషాల తర్వాత ‘ఆపండ్రా మీ గోల.. రేయ్‌ ‌వెంకా-2.. నీకు విషయం అర్థ మైందని నాకు అర్థమైంది. సో వీళ్లకు అర్థమయ్యేలా చెప్పేవరకు కాసేపు నువ్వు గమ్మునుండు. బా.. అదేం టంటే.. మీకు మల్టీవర్స్ ‌గురించి తెల్సా?’ వెంకా అడిగాడు.

అందరూ తెలీదన్నారు.

‘నేను స్పేస్‌ ‌వీడియోలు చూస్తుంటా కదా. సో కొంచెం తెల్సు. విశ్వాలు లెక్కలేనన్ని ఉంటాయి. ప్రతి దాంట్లో భూమి లాంటి గ్రహం ఉంటుంది. అక్కడ అచ్చం మనలాంటి మనుషులుంటారు. ఇద్దరి జీవితాలు దాదాపుగా ఒకేలా సాగుతుంటాయి. ఇప్పుడు మనం ఓ విశ్వంలో వచ్చి పడ్డాం. అది ఏ మూలనుందో నాకు తెలీదు.’ వెంకా చెప్తుండగా అందరూ నోరెళ్లబెట్టి చూశారు.

‘ఏంటి ఇదంతా నిజమా? ఇలా కూడా జరుగు తుందా?.. పాపం అనిల్‌-2 ‌గాడు వాళ్లయ్యతో ఎలా వేగుతుండాడో ఏందో..?’ అనిల్‌ అన్నాడు.

‘రేయ్‌.. ‌నువ్వు కాసేపు గమ్మునుంటావా?, ముందు ఇక్కడ్నుంచి ఎలా బయటపడాలో చూడండి మావా?’ కృష్ణ ఆందోళన చెందుతూ అడిగాడు.

‘అది నాక్కూడా తెలీదు బా.. నిధి దక్కుద్దా లేదా అని నేను ఆలోచిస్తున్నా…’ వెంకా అన్నాడు.

‘ఈడ నిధి లేదు. మేము వేరే దార్లోంచి కొండెక్కాం. అన్ని కోటలు చూసేశాం. ఇదే ఆఖర్ది,’ వెంకా-2 వెటకారంగా నవ్వుతూ చెప్పాడు.

‘అయ్యో! నిధిలేదా. ఎన్ని ఆశలు పెట్టుకు న్నాన్రా. అంతా అయిపోయింది బా.. ఏదో అనుకుంటే ఇంకేదో అయినాది. నిధి లేదు. మనం వేరే విశ్వంలో ఇరుక్కుపోయినాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా?’ అంటూ అనిల్‌ ఏడుపందుకున్నాడు.

వెంకా-2 అనిల్‌-2 ‌వైపు చూసి ‘వీళ్లు ఏ విశ్వంలో ఉన్నా ఇంతేనంట్రా..’ అన్నాడు.

సుమన్‌ ‌వైపు చూసి వెంకా పళ్లు కొరికాడు.

‘ఏరా నాదొక్కడిదేనా తప్పు.. అందరూ ఒప్పుకొనే కదా వచ్చారు. ఇలా జరుగుతాదని నేనేమైనా కలగంటినా?’ సుమన్‌ ‌ప్రశ్నించాడు.

‘ఉఫ్‌.. అయ్యిందేదో అయిపోయినాది. రేయ్‌ ‌వెంకా-2 మమ్మల్ని మీతోపాటు తీస్కెళ్లండి. కలిసి బతుకుదాం. మనం కష్టపడి పనిచేసి సంపాదించే రకం కాదు. సో.. ఏం జరిగిందో వీడియోలు చేసి యూట్యూబ్లో పెడ్తే బాగా పాపులరైపోతాం. డబ్బులు కూడా వస్తాయి. ఏమంటావ్‌?’ ‌వెంకా అడిగాడు.

‘నీతో వేగలేకపోతుండాం రా… అని ఇంట్లో వాళ్లు రోజూ తిడతన్నారు. ఇది మీక్కూడా జరుగుతా ఉంటాది. ఇప్పుడు ఇద్దరంటే వాళ్లు భయపడిపోతారు. ఇది కరెక్ట్ ‌కాదు,’ వెంకా-2 చెప్పేశాడు.

వాళ్ల మధ్య మాటలు జరుగుతుండగా.. ఆకాశం నుంచి వెలుగు కోట మధ్యలో ప్రసరించింది.

‘రేయ్‌ ‌బా.. మళ్లీ వెలుగొచ్చింది. ఇది మనల్ని మన విశ్వానికి చేరుస్తాదేమో..’ అనిల్‌ ‌కళ్లు పెద్దవి చేసి అన్నాడు.

ఒక రోబో వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అది అచ్చం మనిషిలాగే ఉంది. ‘నమస్తే.. వెంకా, అనిల్‌, ‌కృష్ణ, మోహన్‌, ‌సుమన్‌. ‌మా వాళ్లు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు అనంత విశ్వాల్లో ఒకదాంట్లో పడ్డారు.. కాసేపట్లో మిమ్మల్ని మీ విశ్వానికి పంపేస్తాం.’ అని మాటలు వినిపించాయి.

‘ఇదేంటి బా.. రోబో ఇంత స్పష్టంగా మాట్లాడుతోంది?’ మోహన్‌ అడిగాడు.

‘నా పేరు ధృవ్‌.. ఆ ‌రోబో నా కాపీ.. మేం చాలా అంటే చాలా అడ్వాన్సడ్. ‌మా లీడర్‌ ‌విశ్వాలను తయారు చేస్తుంటారు. టైంలో అప్పుడప్పుడు తేడాలు వస్తుంటాయి. దీంతో ఒక విశ్వం వాళ్లు ఇంకో విశ్వంలో పడిపోతుంటారు. నేను, నా బృందం ఈ తప్పుల్ని సరి చేస్తుంటాం. ఈరోజు పని ఎక్కువుంది. అందుకని నా రోబో కాపీని పంపించా. అది మిమ్మల్ని జాగ్రత్తగా మీ విశ్వంలోని కోట దగ్గరికి చేరుస్తుంది. అందరూ చేతులు పట్టుకుని ఓ మూలన నిలబడండి.’

ఐదుగురు వెంకా-2, అనిల్‌-2, ‌కృష్ణ-2, మోహన్‌-2, ‌సుమన్‌-2‌తో కాసేపు మాట్లాడి వీడ్కోలు పలికారు.

రోబో కిందకి చూడగానే వెలుగు భూమిలోకి ప్రసరించింది. కాసేపటికి ఐదుగురూ భూ గ్రహంలోని కోటలో తేలారు.

‘సంతోషంగా ఉండండి. ఇక సెలవు.’ ధృవ్‌ ‌చెప్పగా.. స్నేహితులంతా ఒకేసారి’ మరి మా నిధి సంగతేంది?, మీ లీడర్‌ ‌విశ్వాలనే తయారు చేస్తు న్నాడు కదా… మాకు కొంచెం సంపద ఇవ్వలేడా’ అనడిగారు.

‘నేను చాలా విశ్వాల్లో మనుషుల్ని చూశా. ప్రతిచోటా భూగ్రహ వాసులకు ఆశ ఎక్కువే. వేల ఏళ్ల నుంచి ఇదే సమస్య. మీరు ఎప్పటికి మారుతారో .. రేయ్‌ ‌బాబూ.. పిచ్చిపిచ్చి ఆలోచనలు మాని బాగా కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుని బాగుపడండి. అంతేగానీ టైం వేస్ట్ ‌చేసుకోకండి.’ ధృవ్‌ అన్నాడు. కొద్దిక్షణాల్లో రోబో మాయమైపోయింది. ఐదుగురూ ఉసూరుమంటూ ఇంటి బాట పట్టారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram