ఆగస్ట్ 1-7 ‌ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

నవజాత శిశువుకు తొలి కానుక తల్లి స్తన్యమే నంటుంది ఆయర్వేదం.  వేదరాశి తల్లిపాలకు పవిత్ర స్థానం ఇచ్చింది. స్తన్యాన్ని ఆపాత మధురంగా, దీర్ఘా యువుగా చిత్రించింది. వక్షో జాన్ని అమృతభాండంగా కీర్తించింది అధర్వణ వేదం.  సంపూర్ణంగా జీర్ణమైన ఆహారం శరీరంలో తెచ్చే మార్పులతో ఉద్భవించేవే తల్లిపాలు.

అవే వక్షోజాలలోకి (స్తన్యాశయ) చేరతాయి. వక్షోజంలోకి పాలను తీసుకుపోయే దమని (స్తన్యవాహ దమని) గురించే కాక, ఆ ప్రదేశంలో ఉండే పది కండరాల పనితీరు గురించి సుశ్రుతుడు వివరించాడు. బిడ్డను కన్న తరువాత తల్లి వక్షోజంలో క్షీర సృష్టి ఎలా జరుగుతుంది (స్తన్య ప్రవర్తన)? స్తనపాన విధి (పాలు పట్టడం), తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రయోజనాలు (స్తన్య సంపత్‌), ‌కొందరు తల్లులు పాలు ఇవ్వలేకపోవడానికి కారణాలు (స్తన్య నాశ హేతు), అలాంటి తల్లులలో పాలవృద్ధి కోసం ఔషధాలు (స్తన్య వృద్ధి ద్రవ్యాలు), పాలు మానిపించే క్రమం (స్తన్య అపనాయకాలం) వంటి అంశాలను ఆయుర్వేదం కూలంకషంగా వివరించింది. మాతృ క్షీరం శిశువుకు అమృతతుల్యమైనది. భారతీయ పురాతన వైద్య శాస్త్రవేత్తలు, అపర ధన్వంతరులు ప్రతిపాదించిన ఈ సూత్రాన్నే ఆధునిక వైద్యశాస్త్రం కూడా నిర్ద్వంద్వంగా ఆమోదిస్తున్నది. ఏటా సంభ విస్తున్న 8,20,000 (ఐదేళ్లలోపు) చిన్నారుల మరణా లను నివారించడానికి తల్లిపాలే కీలకం కాగలవని గుర్తించాలని పిల్లల ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గర్భం నుంచి శిశువు బయటపడిన తరువాత సాధ్యమైనంత తొందరగా స్తన్యమివ్వాలన్నది కొంతమంది మన ఆయుర్వేద ఆచార్యుల ఆదేశం. ఆ తరువాత ఎంతకాలం ఇవ్వాలి? అంటే ఆరు మాసాలు తప్పనిసరిగా ఇవ్వాలి. మళ్లీ గర్భం దాల్చే వరకు తల్లి బిడ్డకు పాలు ఇవ్వవచ్చునని చెబుతోంది ‘సుశ్రుత సంహిత’. ఇప్పుడు అమెరికాలో వైద్యులు బిడ్డకు సంవత్సరం వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వవచ్చునని చెబుతున్నారు. స్పర్శ, ఆప్యాయతలే పాలను స్రవింప చేస్తాయని సుశ్రుతుడు చెబుతాడు. స్తన్యం వాత, పిత్త నివారిణి. అలాగే రక్తదోష నివారిణి కూడా. అభిగతజన్యతో శిశువు కంటి దోషాలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంటే శిశువుకు బలాన్నే కాదు, రోగ నిరోధక శక్తినీ ఆ క్షీరం ప్రసా దిస్తుంది. చంటిపిల్లలు రోజులో కనీసం 20 గంటలు నిద్రపోవడానికి దోహదం చేసేవీ తల్లిపాలే. పాలు తల్లి రక్తం నుంచే జనిస్తాయని, ఎర్రరక్తకణా కారణంగా వస్తాయని కాశ్యపుడు చెబుతాడు. దోష రహితమైన పాలు ముత్యం రంగులో మెరుస్తూ, తీపి రుచిని కలిగి ఉంటాయని చరకుడు నిర్దేశించాడు.

 తల్లిపాల ఉత్పత్తి వెనుక ఉన్న శాస్త్రీయత గురించి విశేషంగా చర్చించిన ఆయుర్వేదం స్తన్యం శిశువు నోటికి అందించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలు చేసింది. శుచిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, తలకు గుడ్డతో పాలు ఇవ్వాలి.  పిల్లలకు స్నానం చేయించిన తరువాత, తల్లి కూడా వక్షోజాలను నీటితో శుభ్రం చేసుకుని మాత్రమే పాలు పట్టాలని సుశ్రుతుడు సూచించాడు. తల్లిపాల వృద్ధికి, ఆరోగ్యకరంగా ఉండడానికి బెల్లం, గుమ్మడి, కొబ్బరి, నెయ్యి, ఖర్జూరాలు వారు తీసుకోవాలంటారు వారు.

తల్లి మానసిక స్థితిని బట్టి బిడ్డకు పాలు ఇవ్వడం సరైన విధానమని ఆయుర్వేద ఆచార్యులు చెబుతారు. క్షుధిత (ఆకలితో ఉన్న స్త్రీ), శోకం (బాధలో ఉన్న), శ్రాంత (అలసిన స్త్రీ), దుష్టధాతు (టిష్యూలలో లోపం) ఉంటే వారు పాలు ఇవ్వరాదు. గర్భిణి, జ్వరిత, స్థూలకాయురాలు కూడా పాలు ఇవ్వడానికి అర్హులు కారు. వారిలో పాల ఉత్పత్తి సరిగా ఉండదని ఆయుర్వేదం చెబుతోంది. తరువాత ఆవు లేదా మేక పాలలో కొంచెం నీరు కలిపి ఇవ్వవచ్చు. తల్లిపాల ఆహారం నుంచి శిశువు పరిణామం చెందే దశగా దీనిని చూస్తారు. ఈ దశలోనే తేలికపాటి ఆహారం కూడా అందిస్తారు.

చిన్నారిలో యాంటీబాడీలను పెంపొందించడం, విటమిన్‌లు సమకూర్చడం, పౌష్టికాహారంగా ఉపయోగపడడం, జీర్ణ పక్రియను సజావుగా ఉంచడం, ప్రోటీన్లు అందించడం వంటి సేవలకు మాత్రమే తల్లిపాలు పరిమితం కావడం లేదు.  బిడ్డకు స్తన్యం ఇవ్వడం వల్ల తల్లుల ప్రసవానంతర జీవితం సాఫీగా ఉంటుంది. గర్భధారణతో పెరిగిన శరీర బరువు తగ్గుతుంది. పాలు ఇవ్వడం వల్ల ఆక్సీటోసిన్‌ అనే హార్మోన్‌ ‌శరీరంలో విడుదలై గర్భసంచిని ప్రసవ పూర్వస్థితికి తీసుకువస్తుంది. రొమ్ము కేన్సర్‌, ఒవేరియన్‌ ‌కేన్సర్‌ ‌ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. పాలు ఇస్తే తల్లులలో రోజూ 500 నుంచి 700 కేలరీలు ఖర్చు కాగలవు. తల్లులలో పాలు లేక పోవడం, లేదా అధిక ఉత్పత్తికి ఆయుర్వేదం శతావరి వంటి ఔషధాలను సూచించింది. నెలల పిల్లలకు కేవలం మనిషి పాలే ఇవ్వాలని చెప్పారు. ఆవు పాలు తల్లిపాలతో సమానమన్న విశ్వాసం ఉన్నా ఇలాంటి సూచన కనిపిస్తుంది. ఇవన్నీ శాస్త్రబద్ధమైనవి. కాలపరీక్షకు నిలిచినవి. ఇలాంటి గొప్ప జ్ఞానం ఈ దేశంలో ఉందని గుర్తు చేసుకోవడం అనివార్యం. తెలియకుండానే కొన్ని ఆయుర్వేద మార్గదర్శకాలను మనదేశంలో బాలింతలు పాటిస్తున్నప్పటికీ, నేటి హడావిడి జీవనశైలిలో నష్టపోతున్నది పసికందులనే చేదు నిజాన్ని గుర్తించాలి.

అవగాహన పెరగాలి

నేటి భారతదేశంలో మాతాశిశు రక్షణ ఉన్నదా? అంటే లేదనే చెప్పాలి. ఆసుపత్రులలో ప్రసవాలు జాతీయ స్థాయిలో 79 శాతంవరకు ఉన్నాయి. కానీ బిడ్డ జన్మించిన గంటలోపు తల్లిపాలు అందించాలన్న శాస్త్రీయ విధానానికి నోచు కుంటున్న శిశువులు 42 శాతంకంటే తక్కువ. నేషనల్‌ ‌ఫ్యామిలీ హెల్త్ ‌సర్వే-4 ఈ విషయాలను వెల్లడించింది. ముర్రుపాలు బిడ్డకు సర్వశ్రేష్టమన్న వాస్తవాన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాలకు అందజేయడంలో మనం విఫలమయ్యాం. వాటిని విషప్రాయంగా భావించి పారబోస్తున్న గ్రామీణులు ఇంకా ఉన్నారు.

 ఇప్పుడున్న హడావిడి జీవనశైలిలో తల్లులు పాలు ఇవ్వకపోవడానికి కారణం కుటుంబ మద్దతు లేకపోవడమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లులలో పాల వృద్ధికి చిట్కాలు చెప్పే ముందుతరం స్త్రీలు కుటుంబంలో ఉండడం లేదు. ఫలితం- పోతపాల వైపు మొగ్గ వలసి వస్తున్నది. అసంఘటిత, ప్రైవేటు రంగాలలో పనిచేసే మహిళలు అనివార్యంగా బిడ్డలను స్తన్యానికి దూరంగా ఉంచుతున్నారు. భ్రమలు కల్పిస్తూ, ప్రత్యామ్నాయ తల్లిపాలంటూ స్వైర విహారం చేస్తున్న కొన్ని వ్యాపార ప్రకటనలు కూడా ఇందుకు కారణం. ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగినా, తల్లిపాలు పసికందులకు సరైన రీతిలో అందిస్తున్న వారి సంఖ్య పతనం కావ డానికి ఇలాంటి పరిణామాలన్నీ కారణమే. ఈ సమస్య నుంచి బాలింతలను తప్పించి, స్తన్యం మీద చంటి బిడ్డలకు ఉన్న హక్కును కాపాడాలంటే వారిలో చైతన్యం తీసుకురావాలి. వాస్తవాలను చెప్పాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram