కాషాయం శాంతికీ, కరుణకీ ప్రతీక. త్యాగానికి కూడా. ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌కాషాయధారి. ఆయన చేస్తున్నది కూడా శాంతి స్థాపనే. చూపిస్తున్నది కరుణే. రాష్ట్రాన్ని పీడిస్తున్న వారి చేత మాత్రం వారిలోని చెడును త్యాగం చేసేటట్టు చేస్తున్నారు. వారు చేయకపోతే తానే అందుకు పూనుకుంటు న్నారు. ఒక దేశం, అందులోని ఒక భాగం చిరకాలం పేదరికంలో అలమటించి పోయేటట్టు చేస్తున్న అశాంతిని ఆయన అక్షరాలా నిర్మూలిస్తున్నారు. రక్తపిపాసులు, మతోన్మాదులు, గూండాలు, మాఫియాల చర్యల కారణంగా నిత్యనరకం అనుభవిస్తున్న వారందరి పట్ల ఆయన కరుణ కురిపిస్తున్నారు. ఇందులో సాధారణ ప్రజానీకం మొదలు పారిశ్రామికవేత్తల దాకా ఉన్నారు. అక్కడ పట్టపగలే ఎమ్మెల్యే హత్యకు గురవుతాడు. కిడ్నాప్‌లు సర్వసాధారణం. సాధారణ ప్రజలనే కాదు, పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించి డబ్బు గుంజడం నిత్యకృత్యం. కబ్జాలూ అంతే. యోగి ఆదిత్యనాథ్‌ అక్షరాలా మూడో కన్ను తెరిచినది ఇలాంటి వారి మీదే. ఇంతకాలం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వాళ్లు స్వయంగా వచ్చి లొంగిపోతున్నారు. లొంగకపోతే వారి ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. ఎవరినో చంపేసి ఎక్కడో దాగితే ఇప్పుడు అక్కడ కుదరడం లేదు. మరుక్షణం అక్కడికి బుల్‌డోజర్‌ ‌వస్తుంది. ఇళ్లు నేలమట్టమయిపోతాయి.  యోగి ప్రదర్శిస్తున్న ఈ కాఠిన్యాన్ని సాధారణ ప్రజలు స్వాగతి స్తున్నారు. ఆయన చర్యలను పాటలుగా ఆలపిస్తున్నారు.  ఇది సత్యం. ఇంత కఠినంగా వ్యవహరించి ఆయన సాధించినదేమిటి? ఈ దేశంలో అతి పెద్ద రాష్ట్రాన్ని పేదరికం బారి నుంచి తప్పించి, చిరకాలంగా ఉన్న దుస్థితి నుంచి విముక్తం చేస్తున్నారు. అదంతా సంచలనం కోసం కాదు. ప్రతిపక్ష నేతల మీద కక్ష సాధింపు కాదు. అందులో మత దృష్టిని కూడా ఎవరూ చూడడం లేదు. రాజకీయ పార్టీలు నేరగాళ్లనూ, నేరగాళ్లు నేర ప్రవృత్తినీ వదులుకోక తప్పడం లేదు. రాష్ట్ర పురోగతి గురించి ఇటీవల నీతి ఆయోగ్‌ ఎన్నో విషయాలు వెల్లడించింది. పేదరికం, మాఫియా, క్రిమినల్‌ ‌గ్యాంగులు, మత కల్లోలాలు ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పటి మాట! ఇప్పుడు దేశంలోనే సెల్‌ఫోన్‌ల తయారీకి ఒక హబ్‌! ‌రూ.32.92 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు, వేగంగా విస్తరిస్తున్న హైవేలు, ఊపందు కున్న విమానాశ్రయాల నిర్మాణం, దేశంలోనే ఐదు అంతర్జాతీయ విమానాశ్ర యాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా అవతరించబోతుండటం, సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతుండటమే కాదు, సుసంపన్న రాష్ట్రంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌! ‌నిష్కామ కర్మ ‘యోగి’ సారథ్యంలో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘బీమారు’ స్థాయినుంచి ‘వికాసం’ వైపునకు అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు ‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’ ‌దశను కూడా దాటి ‘ఈజ్‌ ఆఫ్‌ ‌లివింగ్‌’ ‌స్థాయికి చేరుకున్నది. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తిలో ఇప్పుడు ఈ రాష్ట్రం గుజరాత్‌, ‌కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను దాటేసిందంటే యోగి ఆదిత్యనాథ్‌ ‌మంత్రదండం పుణ్యమే!

ప్రథమ ప్రధాని నెహ్రూ, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, నెహ్రూ కుమార్తె ఇందిర, ఆమె కుమారుడు రాజీవ్‌, ‌చౌధురి చరణ్‌సింగ్‌, ‌విశ్వనాథ్‌ ‌ప్రతాప్‌ ‌సింగ్‌, ‌చంద్రశేఖర్‌ ‌వీరంతా ఉత్తర ప్రదేశ్‌ ‌నుంచి ప్రధాని పీఠం చేరుకున్న వారే. ఈ ఏడున్నర దశాబ్దాలలో ఎక్కువ కాలం దేశాన్ని ఏలినవారే. కానీ రాజీవ్‌ ‌హయాంలోనే ఆ రాష్ట్రానికి దేశంలోని అత్యంత పేద రాష్ట్రాలలో ఒకటిగా ముద్ర పడింది. బీమారు రాష్ట్రాలలో ఒకటిగా అచ్చు వేయించుకుంది. భారతీయ సంస్కృతికి ప్రతీకగా కనిపించే రాముడు పుట్టిన పుణ్యస్థలిగా పూజలందుకునే అయోధ్య ఈ రాష్ట్రంలోనే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత, పురాణ ప్రఖ్యాత వారణాసి క్షేత్రం కూడా అక్కడిదే. మధుర, త్రివేణి సంగమం, సారనాథ్‌, ‌గోరఖ్‌పూర్‌, ఆ‌గ్రా.. అక్కడే ఉన్నాయి. దారుణమైన వెనుకబాటుతనం కూడా అక్కడ రాజ్యమేలుతున్నది. దీని నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలన్న యోగి రాజకీయ సంకల్పానికి ఇప్పుడు పరిస్థితులు కలసి వచ్చాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం అందులో ఒకటి. యోగికి ముందు ఉత్తరప్రదేశ్‌, ‌యోగి తరువాతి ఉత్తరప్రదేశ్‌లను పరిశీలిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. 2007 నుంచి 2012 వరకు ఎస్‌పీ, తరువాత బీఎస్పీ పాలించాయి. ఆ కాలంలో 1,064 ఘర్షణలు, దోపిడీలు, కల్లోలాలు నమోదయ్యాయి. 2017 తరువాత ఇవి తగ్గుముఖం పట్టాయి. యోగి నేరగాళ్ల పట్ల ఉక్కుపాదమే మోపారు. వీరి పట్ల ఆయనది ‘జీరో టాలరెన్స్’. ‌సాక్షాత్తు శాసనసభ సాక్షిగానే ఈ నేరగాళ్లని మట్టిలో కలిపేస్తాను అని ఆయన శపథం చేశారు. కొద్ది సమయానికే కరుడుగట్టిన నేరగాడు, ఆతిక్‌ అహ్మద్‌ ‌కొడుకు అసద్‌ ‌ఝాన్సీలో పోలీసు కాల్పులలో చని పోయాడు. మరునాడే ఆతిక్‌ అతని సోదరుడు ప్రత్యర్థుల కాల్పులలో కోర్టు ఆవరణలోనే మర ణించారు. యోగి ఆరేళ్లపాలనలో మార్చి 20, 2017 నుంచి మార్చి 16, 2023 వరకు 23,069 మంది నేరగాళ్లు స్టేషన్‌లకు వచ్చి మరీ లొంగిపోయారు. 183 మంది కరుడు గట్టిన నేరగాళ్లను ఎన్‌కౌంటర్‌ ‌లలో కాల్చి చంపారు. వికాస్‌ ‌దూబే, ఆతిక్‌, అసద్‌, ‌టింకూ కపాలా, హమాజ్‌ (‌బంగ్లా గ్యాంగ్‌స్టర్‌), ‌వినోద్‌కుమార్‌సింగ్‌ ‌వంటి వారంతా ఇందులో ఉన్నారు. 2017లో యోగి ముఖ్యమంత్రి అయిన 16 మాసాలలోనే 3,026 ఎన్‌కౌంటర్లు జరిగాయి. 69 మంది చనిపోయారు. అంటే తను మాఫియాలు, కబ్జాదారులు, చట్టాన్ని దారుణంగా ఉల్లంఘించేవారి పట్ల ఎంత కఠినంగా ఉండబోతున్నారో యోగి మొదటే వెల్లడించారు. వీళ్లు కాకుండా స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్సు మరో 9 మందిని కాల్చింది. 139 మందిని అరెస్టు చేసింది. ఒక్క రాష్ట్రంలో ఇంతమంది ఎలా తయారయ్యారు? సమాజ్‌వాదీ పార్టీ అనే ప్రాంతీయ పార్టీ జిల్లాకో మాఫియా ముఠాను తయారు చేసి పెట్టిందని అందరూ చెబుతారు. కానీ యోగి మీద కోపంతో, ఆయన ధరించిన కాషాయం మీద ద్వేషంతో, ఆయన పార్టీ బీజేపీ మీద అక్కసుతో మీడియా ఆయనకు రకరకాల పేర్లు పెట్టింది. అయినా యోగి చర్యలను సాధారణ ప్రజలు స్వాగతించి, మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకున్న సంగతి మీడియాకు పట్టడం లేదు. వరసగా ఆరేళ్లు సీఎం పీఠం మీద ఉన్న మొదటి ముఖ్యమంత్రి అన్న రికార్డు కూడా మీడియాకు పట్టడం లేదు. ఆయనను బుల్‌డోజర్‌ ‌బాబా అని ఎద్దేవా చేశాయి. కానీ ‘బుల్‌డోజర్‌ ‌కదిలితే దుష్టశక్తుల గుండెలు అదురు తాయి’ అంటూ సాధారణ ప్రజానీకం పాటలు కట్టి పాడుకుంటు న్నారు. పెళ్లిళ్ల డీజేలలో ఇవి వినిపిస్తు న్నాయి. సాధారణ ప్రజలు, బడుగులు, మధ్య తరగతి హిందూ కుటుంబాల విద్యార్థులు, మహిళలు యోగిని ఒక ఆపద్భాంధవునిగా చూస్తున్నారు. బుల్‌డోజర్‌ను రక్షణ కవచంగా భావిస్తున్నారు. ఒక్క ఉదాహరణ చూద్దాం. ఆతిక్‌ అహ్మద్‌ అనే ఎస్‌పీ నాయకుడు రాజ్‌పాల్‌ అనే బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి కూడా పథకం వేసి మోహిత్‌ ‌జైస్వాల్‌ అనే ఉత్తర ప్రదేశ్‌ ‌వ్యాపారవేత్తను కిడ్నాప్‌ ‌చేయించాడు. ఆతిక్‌ ‌మనుషులు అతడిని బెదిరించి ఖాళీ కాగితాల మీద సంతకాలు తీసుకుని 45 కోట్ల రూపాయల ఆస్తులను కాజేశారు. ఇక్కడ ప్రజల ధన,మాన ప్రాణాలు, రాష్ట్రంలో శాంతిభద్రతలు కంటే నేరగాళ్ల హక్కుల గురించి మీడియా గగ్గోలు పెట్టడం ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నది. మీడియా ఎంత గోల చేసినా యోగినే రెండోసారి సీఎంను చేసుకుంది యూపీ. ఏ విధంగా చూసినా యోగి చర్య అర్ధం లేని ప్రతిక్రియ కాదని తేలింది. ఇటీవల నీతి ఆయోగ్‌ ఇచ్చిన కితాబే ఇందుకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌ ‌పేద రాష్ట్రం దుస్థితి నుంచి బయటపడు తోంది. కొన్ని కోట్ల మంది ప్రజలను కరవు కోరలకు దూరం చేయడం అత్యుత్తమ సేవ కాదని ఎవరైనా భావిస్తే దానిని ఎందుకు గౌరవించాలి?

ఒక రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రధానంగా కావలసింది, మౌలిక సదుపాయాలు, శాంతి భద్రతలు. ‘సామ్యవాద’ పార్టీలు అధికారంలో ఉన్న కాలంలో ఈ రెండూ ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రానికి అందని ద్రాక్ష మాదిరిగానే ఉండేవి. నేరాలు, మాఫియా డాన్‌లకు అడ్డాగా మారడంతో రాష్ట్రం ‘బీమారు’ గానే ఉండిపోవాల్సి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాల లేమి సమస్యలను చక్కగా పరిష్కరించారు. దీని ఫలితమే ఇప్పుడు రాష్ట్రానికి దేశీ, విదేశీ పెట్టుబడులు పెరగడం. సముద్రతీరం లేని ఈ రాష్ట్రం, ఇటీవలి కాలంలో హై స్పీడ్‌ ‌మోటార్‌ ‌హైవేలు, విమానా శ్రయాల నిర్మాణాలు ఊపందుకోవడంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.

నెరవేరుతున్న 24.14కోట్ల ప్రజల ఆకాంక్ష

సుమారు 24.14కోట్లమంది ఉత్తరప్రదేశ్‌ ‌ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌కృషితో ప్రస్తుతం రాష్ట్రం స్వయంసమృద్ధి సాధించడమేకాదు, సురక్షిత, సౌభాగ్య రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి మార్చి 19, 2017న అధికార పగ్గాలు చేపట్టారు. అత్యంత పేద రాష్ట్రంగా, నిత్యం అశాంతితో సతమత•మైన ఆ ప్రాంతం నేడు దేశంలోనే ‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో’ రెండో స్థానానికి చేరుకున్నదంటే యోగి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అభివృద్ధి అనుకూల విధానాలను సృజనాత్మక రీతిలో అమలు జరపడమే ప్రధాన కారణం. ముఖ్యంగా కొవిడ్‌-19 ‌మహమ్మారిని అదుపు చేయడంలో యోగి ప్రభుత్వం అన్ని వర్గాలనుంచి ప్రశంసలు అందు కుంది. ‘టీకా జీత్‌కా’ కార్యక్రమాన్ని ప్రజల్లో బలంగా ప్రచారం చేయడం ద్వారా వ్యాక్సినేషన్‌లో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూ, అప్పటివరకు అరాచకాలకు అడ్డాగా మారిన మాఫియాను కూకటివేళ్లతో పెకలించి, రాష్ట్రాన్ని సురక్షితంగా మార్చారు. ఫలితంగా నేరగాళ్లు జైళ్లలో మగ్గుతుండగా వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మాఫియాలు ఆక్రమించుకున్న రూ.1800 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో అంతకుముందు ప్రతి మూడు నాలుగు రోజులకో మారు మతహింస జరిగేది. యోగి ఆదిత్య నాథ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరున్నరేళ్ల కాలంలో వీటికి అడ్డుకట్ట పడింది. ఇది నిజంగా యోగి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. నేరగాళ్లు, మాఫీయా డాన్‌ల పట్ల కుల మతాలక తీతంగా ఆయన కఠినంగా వ్యవహరించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత నివ్వడమే కాదు, స్త్రీలను వేధించే మూకలపై కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళా శక్తి కింద యాంటీ రోమియో స్క్వాడ్‌లు, పింక్‌ ‌బూత్‌లు ఏర్పాటయ్యాయి. యోగి ప్రభుత్వం పేదల, బలహీనవర్గాల సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించిన ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు లబ్ధిదారులకే నేరుగా అందుతున్నాయి. స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌, ఉజ్జ్వల లేదా ఉజాలా యోజన (ఆహార ధాన్యాల పంపిణీ) వంటి పథకాల అమల్లో ఉత్తరప్రదేశ్‌ ‌దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ‘సౌభాగ్య’ పథకం కింద రాష్ట్రంలో 2.94 కోట్ల మందికి విద్యుత్‌ ‌సదు పాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఉజ్జ్వల పథకం కింద 1.67 కోట్ల మంది మహిళలకు గ్యాస్‌ ‌సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు జరుపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం మద్దతు ధరను కచ్చితంగా అమలు చేస్తూ పెద్దఎత్తున ధాన్య సేకరణ జరుపుతోంది. యోగి ఆదిత్యనాథ్‌ ‌పదవీ కాలంలో రాష్ట్రంలో కొత్త చక్కెర మిల్లులు ప్రారంభం కావడమే కాదు, పాతవి ఆధునీకరించారు. చెరుకు రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడానికి వీలుగా ప్రభుత్వం ‘‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’’ (ఓడీఓపీ) పథకాన్ని అమలు చేసింది. చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందించింది. మౌలిక సదుపాయాలు, హ్యూమన్‌ ‌కేపిటల్‌ అభివృద్ధిలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. రాష్ట్రంలో ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేలు, వాటర్‌ ‌వేలు, ఎయిర్‌ ‌వేలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ ప్రాజెక్టులు అమలవు తున్నాయి. రక్షణ కారిడార్‌కు సంబంధించి  రూ.50,000 కోట్ల మేర పెట్టుబడులు రావడంతో, ఈ రంగంలో కూడా తయారీ హబ్‌గా రాష్ట్రం రూపొందనుంది. 2017లో రాష్ట్రంలో నిరుద్యోగం 17%గా నమోదవగా 2023 జూన్‌ ‌నాటికి ఇది 7.5%కు తగ్గింది. వచ్చే నాలుగేళ్లలో 20 మిలియన్ల యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా కారణంగా రాష్ట్రానికి తిరిగి వచ్చిన 40 లక్షలమంది వలస ప్రజలకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం చొరవ తీసుకుంది.

రూ.32.92 లక్షలకోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌సమ్మిట్‌ ‌జరిగింది. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్కొన్న పెట్టుబడి ప్రతిపాదనలు నిజరూపం దాలిస్తే 9.5 మిలియన్‌ ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. మొత్తం రూ.32.92 లక్షల కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాద నలు వచ్చాయి. నిజానికి మొదట రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను అంచనా వేసినప్పటికీ పరిస్థితులను గమనించిన తర్వాత రూ.17.3 లక్షల వరకు పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసంతో ఉంది. అయితే ప్రభుత్వ అంచనాలను తల్లక్రిందులు చేస్తూ దాదాపు రెట్టింపు పెట్టుబడులకు ప్రతిపాదనలు రావడం అన్నివర్గాలకు అమితాశ్చర్యం కలిగించింది. ఈ సందర్భంగా 18,645 అవగా హనా పత్రాలపై (ఎం.ఓ.యు)సంతకాలు జరిగాయి. ఇందులో బుందేల్‌ఖండ్‌‌ప్రాంత అభివృద్ధికి రూ.4.25 లక్షల కోట్లు, తూర్పు ఉత్తరప్రదేశ్‌ ‌ప్రాంతంలో రూ.9.55లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు జరగడం విశేషం. దేశ, విదేశాల పెట్టుబడులను ఆహ్వానించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పంపిన ఎనిమిది టీమ్‌లు మొత్తం 16 దేశాల్లోని 21 నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాయి. ఫలితంగా రూ.7.25 లక్షల కోట్లమేర పెట్టుబడులు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. యు.పి.జి.ఐ.ఎస్‌- 2023‌లో మొత్తం పది దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ పెట్టు బడుల సదస్సుకు ముందు వివిధ దేశాల దౌత్యవేత్తలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం విశేషం. ఒక్కసారి వెనక్కి చూస్తే 2018లో ఉత్తర ప్రదేశ్‌ ‌రూ.4లక్షల కోట్ల మేర పెట్టుబడులు సాధిం చింది. పెట్టుబడుల ప్రతిపాదన లను వాస్తవరూపం దాల్చడంలో ఉత్తరప్రదేశ్‌ ‌దేశంలోనే మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం బూజుపట్టిన పాత పారిశ్రామిక విధానంలో మార్పులు చేసి, కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం. ముఖ్యంగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలివ్వడం, జీఎస్టీ కారణంగా వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం చేపట్టిన ప్రధాన చర్యలు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణం మౌలిక రంగంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం.

మొబైల్‌ ‌ఫోన్ల తయారీకి రాజధాని

మనదేశంలో అమ్ముడుపోయే సెల్‌ఫోన్లలో 65శాతం ఉత్తరప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్నవేనన్న సత్యం చాలామందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో మొబైల్‌ ‌ఫోన్లకు రాజధాని అనదగ్గ స్థాయికి ఉత్తరప్రదేశ్‌ ఎదిగింది. గత ఐదేళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్‌ ‌సంపద సృష్టికర్తలకు ప్రధాన కేంద్రంగా మారింది. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టిన ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. త్వరలోనే దేశంలో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా రూపొందనుంది. రాష్ట్రంలోని సరకు కారిడార్‌ ‌నేరుగా మహారాష్ట్ర తీర ప్రాంతాన్ని కలుపుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 800 కిలోమీటర్ల పొడవైన హైవే గత 15 ఏళ్ల కాలంలో నిర్మితమైంది. రెండేళ్ల క్రితం పూర్తయిన పూర్వాంచల్‌ ‌హైవే నిర్మాణంతో, దేశంలోనే 28% ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రంగా అవతరించింది. నిజానికి ఈ ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే నిర్మాణానికి 2016లో అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించింది కానీ, భూసేకరణ జరపకపోవడంతో ఇది నిలిచిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్‌ ‌భూసేకరణ జరిపి, బిడ్‌లను తిరిగి ఆహ్వానించి ఈ ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే నిర్మాణం కేవలం 40 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అంతకు ముందు రూపొందించిన ప్రాజెక్టు రిపోర్ట్‌లో లోపాలను సరిదిద్దడంతో రూ.3వేల కోట్ల మేర పన్ను చెల్లింపుదార్ల సొమ్ము ఆదా చేయగలిగారు. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలను కూడా నిలిపేందుకు అనువుగా ఈ హైవే నిర్మాణం జరిగింది. అంతేకాదు ఈ హైవే మార్గాన్ని పారిశ్రామిక వాడల అభివృద్ధికి అనువుగా తీర్చిదిద్దడం విశేషం. ఈ హైవే తూర్పు ఉత్తరప్రదేశ్‌ను, రాష్ట్ర రాజధాని లక్నోతోను, ఎన్‌.‌సి.ఆర్‌ ‌ప్రాంతాన్ని ఆగ్రా-క్నో- యమునా ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేల ద్వారా అనుసంధానిస్తుంది. అందువల్ల పూర్వాంచల్‌ ‌హైవే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. 2022 జులై మొదటివారం నాటికి 294 కిలోమీటర్ల పొడవైన బుందేల్‌ఖండ్‌-‌గోరఖ్‌పూర్‌ ‌హైవే నిర్మాణం 99శాతం పూర్తి కావడంతో అదే నెల 16వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ దీన్ని జలౌన్‌ ‌జిల్లాలో ప్రారంభించారు. 2007-17 మధ్యకాలంలో గత రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రెండు ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేల నిర్మాణాన్ని పూర్తి చేశాయి. అవి యమునా ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేలు. బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే నిర్మాణానికి అయిన ఖర్చు రూ.14 వేల కోట్లు. గత ఆరేడు దశాబ్దాలుగా బుందేల్‌ఖండ్‌ అభివృద్ధికి నోచలేదు. ఇప్పుడీ ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే నిర్మాణంతో ఈ ప్రాంతం ఎన్‌.‌సి.ఆర్‌. ‌ప్రాంతంతో అనుసంధానమవుతుంది. గతంలో మాయావతి ప్రభుత్వం ప్రతిపాదించిన గంగా ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే నిర్మాణం, పర్యావరణ సమస్యల కారణంగా మూలపడటంతో, యోగి ప్రభుత్వం దాన్ని వెలికితీసి ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేసి పట్టాలెక్కించింది. మీరట్‌ ‌నుంచి ప్రయాగ్‌రాజ్‌ ‌వరకు 594 కిలో మీటర్ల నిర్మాణాన్ని తొలి దశలో చేపడతారు. ఇక రెండోదశలో టిగ్రి నుంచి ఉత్తరాఖండ్‌ ‌సరిహద్దు వరకు 594 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపొడవైన ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేగా రూపొందు తుంది. ఆజంగఢ్‌-‌గోరఖ్‌పూర్‌ ‌మధ్య 91 కిలోమీటర్ల మేర లింక్‌ ‌రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.


బీమారు అంటే…

1980 ప్రాంతంలో ప్రముఖ జనాభా శాస్త్రవేత్త ప్రొ. అశీష్‌బోస్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ‌గ్రోత్‌, ‌న్యూఢిల్లీ) ‘బీమారు’ అనే పదాన్ని  మొట్టమొదటగా ఉపయోగించారు. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి సమర్పించిన ఒక పత్రంలో  ఈ పదాన్ని ప్రయోగించారు. ఐక్యరాజ్య సమితితో సహా వివిధ అధ్యయనాలు భారత జి.డి.పి. వృద్ధిపై ఈ ‘బీమారు’ రాష్ట్రాల పనితీరు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోందని గతంలో స్పష్టం చేశాయి. నిజానికి ఇది దేశంలోని అత్యంత పేద రాష్ట్రాలైన బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాల పేర్లలోని మొదటి అక్షరాలతో కూడిన ‘సంక్షిప్త’ పదం. బీమారు రాష్ట్రాలు ప్రధానంగా మానవాభివృద్ధి సూచిక, ఆహారభద్రత విషయంలో బాగా వెనుకబడి ఉంటాయి. ఉత్తర ప్రదేశ్‌ ‌నుంచి విడివడి ఏర్పడిన ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రం ‘బీమారు’ జాబితా నుంచి బయటపడే యత్నాల్లో గణనీయ పురోభివృద్ధి సాధించడం విశేషం. రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాలు ‘బీమారు’ నుంచి బయటపడటానికి ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉంది. మానవాభివృద్ధి సూచికలో ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం మధ్యస్థాయిలో ఉంది. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ‌జార్ఖండ్‌ ‌రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. 2008-11 మధ్యకాలంలో ‘బీమారు’ రాష్ట్రాల్లో కొన్ని అధిక వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. ఈ రాష్ట్రాలకు గట్టి ఆర్థిక పునాది లేకపోవడంతో, అధిక వృద్ధిని నమోదు చేసినా ఇంకా వెనుకబడిన రాష్ట్రాలుగానే ఉండిపోతున్నాయి.


విమానాశ్రయాలు

బీజేపీ అధికారంలోకి రాక మునుపు రాష్ట్రంలో రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి, బీజేపీ రాష్ట్రపగ్గాలు చేపట్టాక 9 విమానాశ్రయాలను క్రియా శీలకం చేసింది. కొత్త విమానాశ్రయాల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలో త్వరలో 21 దేశీయ విమానాశ్రయాలు, ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 2021 అక్టోబర్‌ ‌నెలలో ప్రధాని నరేంద్రమోదీ కుశినగర్‌ ‌విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీన్ని కూడా మాయావతి ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికి వాస్తరూపం దాల్చింది మాత్రం యోగి ప్రభుత్వ హయాంలోనే. ఈ విమానాశ్రయానికి మొట్టమొదటి విమానం శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులను తీసుకువచ్చింది. గౌతమ బుద్ధుడు మహా పరినిర్యాణం చెందింది కుశినగర్‌లోనే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని అంచనా. ముఖ్యంగా చైనా, జపాన్‌, ‌కొరియా, శ్రీలంక, మలేసియా, ఇండొనేసియా, ధాయ్‌లాండ్‌ ‌దేశాల నుంచి బౌద్ధ••లను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన జెవార్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయంలో 2024 మొదట్లో విమానాల ట్రైల్‌ ‌రన్‌ ‌మొదలవు తుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్ట్ ఆసియా సంస్థ నిర్మిస్తోంది. ఇదే సంస్థ రెండు దశాబ్దాల క్రితం బెంగళూరు విమానాశ్రయ అభివృద్ధికి సహకరించింది. ఇప్పుడు నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. జెవార్‌ ‌విమానాశ్రయాన్ని యమునా ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేతో నేరుగా అనుసంధానిస్తారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 1.2 మిలియన్లు. ఇది ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 42 కిలోమీటర్ల దూరంలో, దాద్రి మల్టీ మోడల్‌ ‌లాజిస్టిక్‌ ‌సెంటర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో, డిఫెన్స్ ‌కారిడార్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆధ్యాత్మిక-సాంస్కృతిక రంగాలు

రాష్ట్రంలో ఆధ్యాత్మిక-సాంస్కృతికపరమైన మౌలిక సదుపాయాలు కూడా విస్తరిస్తున్నాయి. అయోధ్య ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపొందనుంది. రాముడు, కృష్ణుడు జన్మించిందీ, బుద్ధుడు పరినిర్యాణం చెందిందీ ఉత్తప్రదేశ్‌లోనే. ఫలితంగా రామాయణ, బౌద్ధ సర్క్యూట్‌ ‌పర్యాటకాలు అభివృద్ధి చెందుతాయని అంచనా. కాశీ విశ్వనాథ్‌ ‌ధామ్‌ ‌కారిడార్‌ను ప్రధాని ప్రారంభించిన నేపథ్యంలో వారణాసికి పర్యాటకు ల సంఖ్య పోటెత్తుతోంది. గతంలో జి.డి.పి. పరంగా దేశంలో ఆరోస్థానంలో ఉన్న యు.పి. ఇప్పుడు పంజాబ్‌ను కూడా దాటేసి రెండో స్థానానికి ఎగబాకడం గమనార్హం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram