‘గ్రంథాలయోద్యమం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో బెంగాల్‌ ‌నుంచి అనుభవం సంపాదించాను. గ్రంథాలయం అంటే విప్లవ సంఘం. విప్లవాన్ని మించింది గ్రంథాలయం’ అన్నారు బ్రిటీష్‌ ‌హోం సెక్రటరీ ఆర్మ్ ‌స్ట్రాంగ్‌.

‌పుస్తకం మంచి నేస్తం. ఊహలకి రెక్కలు తొడిగి నిన్నటి చరిత్రలోకి రేపటి భవిష్యత్తులోకి తొంగి చూసి రావచ్చు. ఒక్క మనిషే ఎన్నో జీవితాల్ని అనుభవించ వచ్చు. పుస్తకంలో వేరు వేరు పాత్ర లుంటాయి. వాటి బంధాల్నీ, భావోద్వేగాల్ని, జీవన పోరాటాల్నీ చదువుతున్నంతసేపూ మనని మనం మరిచిపోయి ఆ పాత్రలతో మమేకమైపోతాం.

ఏ మతమూ సొంత భాషను సృష్టించుకోలేదు. వాస్తవంగా మతానికి భాష లేదు. ప్రజల భాషలనే తాము సొంతం చేసుకున్నారు. భారత ముస్లింలు ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారత ముస్లింలు ఉర్దూను తమ భాషగా నిర్ణయించారు. అందువల్ల దానిని బోధన, రాజకీయ, న్యాయాలయాల భాషగా చేశాడు నిజాం. బెంగాల్‌ ‌ముస్లింకు ఉర్దూ భాష రాదు. వారు బంగ్లాభాషను ప్రేమిస్తారు, తిరుగుబాటు చేసి పాకి స్తాన్‌ ‌నుండి విడిపోయి బంగ్లాదేశ్‌ ఏర్పరచుకున్నారు. ఇతర దేశాల ముస్లింకు ఉర్దూ భాష ఉందని కూడా తెలియదు. ఉర్దూను ఇస్లాంకు అంటకట్టడం ఓ రాజకీయ కుట్ర.

నిజాం నవాబు ఇస్లాం సంవత్సరాన్ని హిజ్రీని రాజకీయ సంవత్సరం చేశాడు. ప్రధాన ముస్లిం దినాలను సెలవులుగా ప్రకటించారు. ముస్లింల నమాజు దినం శుక్రవారం సెలవు. మొహరం సందర్భంగా సుదీర్ఘ సెలవులు. రంజాన్‌ ‌మాసంలో ఒంటిపూట ఆఫీసులు. రంజాన్‌ ‌సందర్భంగా తిను బండారాలు కనిపించనీయరాదు. హోటళ్లకు, మిఠాయి దుకాణాలకు నల్లని తెరలు విధిగా వేయాలి. మసీదుకు వంద గజాలు అటు, వంద గజాలు ఇటు బాజాలు మోగించరాదు. అది దేవునిసేవ, పెళ్లి ఊరేగింపు, శవయాత్ర. ఏదైనగాని ఈ నిబంధన పాటించాల్సిందే. లేకుంటే శిక్షాస్మృతి ప్రకారం అది నేరం అవుతుంది. శిక్ష పడుతుంది. దీన్యాత్‌ అనే మత విషయకమయిన పీరియాడ్‌ను విద్యాలయాల్లో ప్రవేశ పెట్టి, ఖురాన్‌ ‌బోధించేవారు.

కార్వే పండితుని అధ్యక్షతన నవంబర్‌ 11, 1922 ఏర్పాటైన నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభలో తెలుగుకు జరిగిన అవమానంతో ఆ మరునాడు టేకుమాల రంగారావు ఇంటిలో 11 మందితో ‘ఆంధ్రజన సంఘం’ ప్రారంభమైంది. కొద్ది రోజుల్లోనే అనేక చోట్ల దాని శాఖలు ఏర్పడ్డాయి. సమావేశాలు, ఉపన్యాసాలతో తెలుగు వారిలో ఉత్సాహం వెల్లివిరిసింది. హనుమకొండలో జరిగిన ప్రతినిధుల సభ, ఈ సంఘం ద్వారా లఘు పుస్తకాలు ప్రచురించాలని నిర్ణయించింది. రాజకీయాల జోలికి పోకుండా సంస్థ జాగ్రత్త వహించింది. అయినా నిజాం ప్రభుత్వం సహించలేదు. ఆంధ్రజన సంఘం స్ఫూర్తితో సూర్యాపేటలో ప్రారంభమైన ‘ఆంధ్ర విజ్ఞాన వికాసిని’ గ్రంథాలయాన్ని మూయించారు. అనుమతి లేనిదే గ్రంధాలయం నడపరాదని సర్కార్‌ ఆదేశిం చింది. సర్కారువారి దప్తరములలో, ఆఫీసులలో వ్యవహారమంతయు ఉర్దూలో ఉండగా చచ్చిపోయిన తెలుగును బైటికి గుంజవలసిన పనిలేదు’’ అంటూ సిరిసిల్ల గ్రంథాలయాన్ని తాహశీల్దారు మూయించి వేశాడు.

ఆంధ్రోద్యమం ప్రారంభమయ్యాక తెలంగాణ ప్రజలలో ధైర్యం, ఉత్సాహం కలిగాయి. గ్రంథాల యాలు స్థాపించారు. తెలంగాణలో గ్రంథాల యమంటే పుస్తకాలు ఉండే స్థలం మాత్రం కాదు..అది చైతన్య నిలయం. ప్రజలు ఒకచోట చేరడానికీ వివిధ విషయాలు చర్చించడానికి, కార్యక్రమాలు రూపొందించడానికీ ఉపకరించే స్థలం! అందుకే గ్రంథాలయం అంటే నిజాం బెదురు. ఏదో ఒక కారణం చూపి వాటిని మూయించాడు.

మడికొండ (వరంగల్‌ ‌జిల్లా) ఆంధ్ర గ్రంథాలయం ఏర్పాటైంది. అందుకు ప్రభుత్వ అనుమతి అవసరమని పోలీసు పటేలు పట్టుబట్టాడు. కార్యదర్శి అది అవసరం లేదన్నాడు. గ్రంథాలయం నిర్వహణ కష్టమైంది. ఇది ఇలా ఉండగా కోర్టు నుండి ఓ లేఖ వచ్చింది.

‘‘ప్రతిరోజూ సదరు లైబ్రరీకి పుస్తకములు, పత్రికలు చదువుకొనగలందులకు జనులు వచ్చుచున్నారు. మరిన్నీ ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ముషీర్‌ ‌దక్కన్‌ ‌వగైరా పత్రికలు వస్తూ ఉన్నవి. హాలు-ప్రస్తుతం-సదరు లైబ్రరీ ఖాయం చేయుటకు, యే మహద్మ – డిపార్టుమెంటు నుండి అయినా (హుకుం) – అనుమతి పొంది ఉన్నారా? (ఆగరు) ఒకవేళ పొందకున్నట్లయితే -(ఫేరన్‌) – ‌వెంటనే పొంద వలసింది. (కెంకె)-ఎందుకనగా (అక్సరు) తరచు మజహబీ మతపు – వార్తలతో జగడాలు అవుతూ ప్రాణహాని కూడా కలుగుతూ ఉన్నది. కాబట్టి మరొక హుకుం వరకూ గ్రంథాలయం మూసి ఉండవలెను’’. అని దాని సారాంశం.

మహిళలకు తెలుగులో విద్య బోధించాలని మాడపాటివారు తమ ఇంట్లోనే పాఠశాల నడిపారు. అందులో వారి భార్య మాణిక్యమ్మ సహా ఏడుగురు మహిళలు ఉన్నారు. వారిని మెట్రిక్యులేషన్‌కు సిద్ధం చేశారు. ఆ మహిళలను మెట్రిక్యులేషన్‌ ‌పరీక్షకు బ్రిటిష్‌ ఆం‌ధ్రాలోని ఒక విశ్వవిద్యాలయాన్ని అనుమ తించవలసిందిగా కోరారు. ఆ విద్యాలయం ‘‘మాకు దేశీయ సంస్థానాలతో సంబంధం లేదు’’ అని తెలియచేయడంతో చివరకు మహారాష్ట్రలోని కార్వే విద్యాలయం ఈ మహిళల కోసం ప్రత్యేకంగా తెలుగు విభాగం ప్రారంభించి, తెలుగులో పరీక్షలు నిర్వహించి డిగ్రీలు ప్రదానం చేసింది.

తెలంగాణలో తెలుగు భాషా అభివృద్ధి ప్రచారానికి ‘అణా గ్రంథమాల’ (ఏ పుస్తకమైనా అణా’.. ఆరు పైసలు) పేరుతో కేసీ గుప్తా ఆధ్వర్యంలో ప్రచురణ సంస్థ ప్రారంభమైంది. వెల్దుర్తి మాణిక్యాలరావు, గుండవరం హనుమంతరావు సంపాదకులుగా ఉన్నారు. ‘ఆంధ్ర భాషా ప్రచారం బాగా జరగాలి. అత్యధిక సంఖ్యలో ప్రజలు మా గ్రంథాలను చదవి, విజ్ఞానాన్ని ఆర్జించాలి’’ అనేదే వారి లక్ష్యం. రమారమి ఎనభై పేజీలు గల పుస్తకాన్ని గుడ్ద్డిదీపం వెలుగులో చదువుకునే వారు పుస్తక ప్రియులు.

ఈ సంస్థ ప్రచురించిన ‘వీర సావర్కర్‌ ‌జీవిత చరిత్ర’ను ప్రభుత్వం నిషేధించింది. వెల్దుర్తి మాణిక్యరావు ‘రైతు’ పుస్తకాన్ని రాసి ముద్రించగా, (జనవరి 21, 1940) నిజాం నిషేధించాడు. ఆ పుస్తకం వల్ల రైతుల్లో అశాంతి, తిరుగుబాటు వస్తుందని వాదన లేపాడు. సాధారణంగా ఓ పుస్తకాన్ని నిషేధించాలంటే హోం శాఖ ఆదేశం చాలు. కానీ ‘రైతు విషయలో నిజాం సర్కార్‌ అసాధారణ పద్ధతిని అవలంబించింది. ‘ఫర్మానా’ (ఉత్తరువు) జారీతో పుస్తకాన్ని నిషేధించింది. అణాకు లభించే ఈ పుస్తకం అంటే ప్రభుత్వానికి ఇంత భయం. రైతు సోదరులారా! నిద్రించుటకు ఇది సమయం కాదు. బద్ధకమునకు ఇది అదనుకాదు. బద్ధ్దకంకణులై కార్యదీక్ష బూనుడు. విజయలక్ష్మి మిమ్ములను తప్పక వరించును. స్వాతంత్య్రమాల మీ కంఠమునలంకరించగలదు. అప్పుడు మిమ్ముగన్న ఆంధ్రమాత సంతోషాతి శయమున ఆనందబాష్పములు రాల్చగలదు’ మాణిక్యరావు రాసిన మాటలు ఆ ప్రభుత్వానికి విప్లవ వాఖ్యలుగా అనిపించాయి. నిజాంకు విశ్వాస పాత్రులుగా ఉన్న రైతుల గుండెల్లో ఈ పుస్తకం క్రాంతి బీజాలు వెదజల్లుతాయని వణికి పోయింది ప్రభుత్వం. నిజాం స్వయంగా ఫర్మానా జారీ చేసి ఈ పుస్తకాన్ని నిషేధించడాన్ని బట్టి, ఈ పుస్తకాల రాతలకు ప్రభుత్వం ఎంతగా భయపడిపోయిందో అర్థమవుతుంది. ‘రైతు’ పుస్తకానికి కొండా వెంకట రంగారెడ్డి (మాజీ ఉప ముఖ్యమంత్రి) పీఠిక రాస్తూ,‘దీనిని చక్కగా చదివి, ఇందులోగల సమస్యలను గ్రహించిన పక్షమున రైతు తన ప్రాపంచిక, పారమార్ధిక, రాజకీయ బాధ్యతలను తెలిసికొని, తన ఆర్థికస్థితిని బాగుపరచుకొని, స్వశక్తిపై ఆధారపడి ఆత్మ గౌరవమును కాపాడుకొను అవకాశమును పొందగలడు’ అని పేర్కొన్నారు.

‘అణా గ్రంథమాల’ ప్రచురణ రంగంలో ఆనాడు ఒక విప్లవాన్ని తెచ్చింది. నూరు పుస్తకాలు ఒకేసారి కొన్నవారికి అయిదు రూపాయలకే ఇచ్చేవారు.అధిక పేజీలు గల పుస్తకాలను అణాకు చొప్పున ఎలా అందించారో అర్థం కాదంటారు దాశరథి.

ఈ సంస్థ ప్రచురించిన ‘నెహ్రూ జీవిత చరిత్ర’కు బూర్గుల రామకృష్ణారావు పీఠిక, ‘హైదరాబాదు రాజ్యాంగ సంస్కరణలు’ పుస్తకానికి సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణరావు, మందుముల నరసింగరావు పరిచయవాక్యాలు రాశారు. ఉమ్మెంతుల కేశవరావు, సురవరం ప్రతాపరెడ్డి కలిసి ‘జాగీరులు’ పుస్తకం రాశారు. ‘ఖాదీ’ అనే పుస్తకానికి మాడపాటి హనుమంతరావు పీఠిక సమకూర్చారు. తమ ఇరవై నాలుగో పుస్తకంగా ‘‘కాళోజీ కథలు’’ ముద్రించారు. సురవరం ప్రతాపరెడ్డి ‘‘మొగలాయి కథలు’’ రెండు భాగాలుగా ప్రచురించింది.

ముఖ్దూం మొహియుద్దీన్‌ ‌కవితా సంపుటిని ప్రచురించిన గౌరవం ఈ ‘అణా గ్రంథ•మాల’కే దక్కుతుంది. ఆయన కలంలో వాడి గళంలో వేడి చిన్నతనం లోనే ప్రవేశించింది. ఆయన కులమతాల కతీతుడు. యుద్ధ వ్యతిరేకత, శాంతి కాముకత ఆయన ధ్యేయాలు. ఆయన కవితలను దాశరధి తెలుగులోకి అనువదించారు. మచ్చుకు దడదడలాడే గుండెల శబ్దం వినిపిస్తుంది

అంధకారమున పదముల వాదం వినపడుతోంది

ఎవరో! ఎవరో పిలిచే పిలుపు వినపడుతోంది

భవితవ్యమదే! బహు వేగంగా ఇటు వస్తుంది

ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది.

అణా గ్రంథాల వలన నాటి రచయితలలో ఎక్కువమంది ప్రభావితమై తమ కథలలో ఈ విషయాన్ని తెలియజేశారు. మచ్చుకు ఓ కథ. బెల్లంకొండ నరసింహాచార్యులు ‘‘సియాసీ సభలు’’ అనే పేరుతో కథ రాశారు.ఆయన కష్టకాలంలో ఊరిను ఆదుకోవడమే గాక, హరికథలు చెప్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ముఖ్యంగా రంగంపేట, జోగిపేట, అందవోలు, టేకుమళ్ల, పొట్లం చేరు, బిక్కనూరు ప్రజలను సమాయత్తం చేయించి యాసియాసి సభలకు యోచన చేస్తున్నాడు. ‘‘సియాసి సభలంటే’’ నిజాం రక్కసి ఫ•ర్మానాలను ధిక్కరించే వ్యూహము. ‘‘ధిక్కరించి బతుకుతామా’’ ‘‘బతికినన్ని దినాలైనా చాలు’’ ఊరూవాడ కదిలితే మనమే గెలుస్తాం అన్నారు అయ్యవారు.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram