భారత స్వాతంత్య్రోద్యమం ఒక అపురూప చరిత్ర. ఆ స్మరణీయ పోరాటంలో సర్వం అర్పించినా చరిత్రపుటలకు ఎక్కలేకపోయిన జీవితాలను స్మరించుకోవడానికి ఉద్దేశించిన ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌మన తరం చూసిన అద్భుత ఘట్టం. అందులో తెలుగు ప్రాంతానికి చెందిన అల్లూరి శ్రీరామరాజుకు దక్కిన ఘన నివాళి ఇంకా అరుదైన అద్భుత సన్నివేశం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  ఏడాది పాటు సాగిన ఆ మహనీయుడి 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవం జూలై 4, 2023న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మైదానంలో స్ఫూర్తిదాయకంగా సాగాయి. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కావడం మరొక ప్రత్యేకత. జూలై 4, 2022న అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లి  ప్రారంభించి, ఆ త్యాగమూర్తికి నివాళి ఘటించిన దృశ్యాన్ని తెలుగువారు ఎవరూ మరచిపోలేరు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో నిర్వహించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని ఈ సందర్భంగా అభినందించాలి. ఇందుకు తోడ్పడిన క్షత్రియ సేవా సమితి దీక్షను కూడా విస్మరించలేం.

విశాఖ మన్యంవీరుడి ఆశయాలనూ, ఆయన దేశభక్తిని దేశ ప్రజలంతా ఆచరించిన నాడే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రథమ పౌరురాలు అన్నట్టే ఆయన జీవితం, పోరాటం అనన్య సామాన్యమైనవి. భావి తరాలకు స్ఫూర్తినిచ్చేవే కూడా. భారత స్వాతంత్య్రో ద్యమ చరిత్రలో ఆయన స్థానం అజరామరమైనదని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్‌ ‌వలెనే శ్రీరామరాజు కూడా భారతీయులకు చిరస్మరణీయ మైన యోధుడని రాష్ట్రపతి అన్నారు. ఆమె అన్నట్టు గిరిజనుల సమస్యల ఆధారంగా ఆంగ్లేయుల మీద ఆయన అలుపెరుగని పోరాటమే చేశారు. ఈ సందర్భంగా ఆమె అల్లూరి సీతారామరాజు చలన చిత్రం కోసం శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాటను కూడా గుర్తు చేశారు. అసలు ఆమె తెలుగు లోనే ఉపన్యాసం ప్రారంభించడం కూడా గమనార్హం. శ్రీరామరాజు ఉద్యమం, నేతాజీ సుభాశ్‌ ‌చంద్రబోస్‌ ‌పోరాటం దేశ ప్రజలను కదిలించాయని  చెప్పారు. అల్లూరి పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటుచేసిన స్మృతివనాన్ని కూడా  ఈ కార్యక్రమంలోనే వర్చువల్‌ ‌విధానం ద్వారా ఆమె ప్రారంభిం చారు.

గడ్డిపోచలను గడ్డపారలుగా మలచిన స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని ఈ కార్యక్రమా నికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కొనియాడారు. గీతలోని ‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతామ్‌’ అన్నట్టు దీనుల కోసం అల్లూరి అవతరించారని, ఆయన దైవాంశ సంభూతులని కూడా కేసీఆర్‌ ‌నివాళి ఘటించారు. తెలంగాణ గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌తన ఉపన్యాసం మొత్తం తెలుగులో సాగించారు. ఆయన తెలుగు ప్రాంతానికి గెరిల్లా పోరాట పంథాను పరిచయం చేసిన యోధుడనీ, భరతమాత ముద్దుబిడ్డ అని ఆమె కొనియాడారు. అల్లూరిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం చారిత్రక దృష్టి కాలేదని, ఆయన జాతీయ నాయకుడని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ఘనంగా నివాళి ఘటించారు. తెలుగువారి పోరాట పటిమని, పౌరుషాగ్ని వేడిని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు అల్లూరి అని కూడా ఆయన అన్నారు.

నిరుడు గోదావరి తీరాన ఉత్సవాలు ప్రారంభ మైన ఆ క్షణాలను కూడా ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఉద్విగ్న భరిత ప్రసంగం ఈనాటికీ తెలుగువారి చెవులలో మారుమోగుతూనే ఉంది.

చరిత్ర పుటలలో ఉండే మనదైన మట్టి వాసనను గమనిస్తేనే, గుండె నిండా అఘ్రాణిస్తేనే చరిత్ర సరిగా అర్థమవుతుంది. పేరుకు భారతీయులే అయినా విదేశీ సిద్ధాంతాల చట్రం నుంచి, రంగుటద్దాల నుంచి చూసే వారికి మన చరిత్ర వైవిధ్యం అర్థం కాదు. అందుకే భారతీయ వైవిధ్యమూ అర్థం కావడం లేదు. తేదీలూ, కార్యకారణ సంబంధాలూ వెతుక్కుంటూ, చరిత్ర నుంచి పొందవలసిన స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. దేశ గతమంటే వర్తమాన తరానికి భవిష్యత్తును గురించి దృష్టిని ప్రసాదించేది. అలాంటి సమున్నత దృక్పథం కలిగిన వారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. కాబట్టే అల్లూరి శ్రీరామరాజు అనే సీతారామరాజు ఉద్యమంలోని తాత్త్వికతను గుర్తు పట్టారు. ‘దమ్ముంటే మమ్మల్ని ఆపండి అంటూ శ్రీరామ రాజు నాడు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి సవాలు విసిరారు. ఇప్పుడు 130 కోట్ల మంది ఆయన స్ఫూర్తితో మన వ్యతిరేకులకు అలాగే, దమ్ముంటే మమ్మల్ని ఆపండి అని సవాలు విసరాలి. సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆ యుగపురుషుడు ఇస్తున్న స్ఫూర్తితో మనం ముందుకు నడిస్తే మనల్ని ఎవరూ ఆపలేరు’ అన్న గొప్ప సందేశం ప్రధాని హృదయం నుంచి ఉప్పొంగిందంటే, మనదైన చరిత్రను దేశీయమైన దృష్టితో దర్శించడమే కారణం. జూలై 4, 2022న అల్లూరి 125వ జయంత్యుత్స వాలకు పాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చిన ప్రధాని మోదీ ఆ చరిత్ర పురుషుడి, యుగపురుషుడి ఖ్యాతిని, స్ఫూర్తిని దేశ ప్రజలందరికీ పరిచయం చేశారు.  భారతీయులందరి తరఫున సీతారామరాజుకూ, ఆయన వెంట నడిచి త్యాగాలు చేసిన గిరిజన వీరులకు పాదాభి వందనం చేస్తున్నానంటూ అనన్య సామాన్యమైన సంస్కారాన్ని ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత మహోత్స వాల వేళ జరిగిన ఈ కార్యక్రమం  మొత్తం ఆ మహోత్స వాలకే మకుటాయమానంగా భాసిల్లేదేనంటే అతిశయోక్తి కాబోదు. 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించడం మరింత శోభనిచ్చింది. అల్లూరి కుటుంబీకులు, మల్లుదొర కుటుంబీకులు, నాటి ఆంధ్ర ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌, ‌కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి, ప్రముఖ చలనచిత్ర నటుడు చిరంజీవి, రాష్ట్ర బీజేపీ నాటి అధ్యక్షుడు సోము వీర్రాజు, నటి, మంత్రి రోజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు తొమ్మిది దశాబ్దాలు సాగిన భారత స్వాతంత్య్ర సమరంలో గిరిజనులు చేసిన త్యాగాలను గుర్తు చేసే విధంగా, చరిత్ర పుస్తకాలు మరచిన ఆ త్యాగమూర్తుల గాథలను ఇప్పుడు ఇంటింటికీ చేర్చాలన్న ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ, తమ ప్రభుత్వం గిరిపుత్రుల వెతలు తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో మేళవించి ప్రధాని మోదీ తన అద్భుత ఉపన్యాసాన్ని సాగించారు.

అల్లూరి సీతారామరాజు, మన్యం గిరిజన వీరుల పోరాటం, త్యాగాలు, వీరగాధలే 130 మంది భారతీయు లను సంకల్ప సిద్ధి కోసం ముందుకు నడిపిస్తున్నాయని ప్రధాని మోదీ ఆనాడు అన్నారు. ‘‘తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా’’ అంటూ అల్లూరి సీతారామరాజు సినిమా పాటను గుర్తు చేశారు. స్వాతంత్య్ర సంగ్రా మంలో యావత్‌ ‌భారతావనికే స్ఫూర్తిగా నిలిచిన నాయకుడైన అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేలపై మనం అందరం కలుసుకోవడం మన అదృష్టమని సమున్నత గౌరవం ప్రకటించారు. గిరిజనుల హక్కుల కోసం ఆయన పోరాడారు. అల్లూరి ఇచ్చిన మనదే రాజ్యం నినాదం… వందే భారతం అనే నినాదానికి సరితూగు తుందని కీర్తించారు ప్రధాని. ఆంగ్లేయులకు ఎదురొడ్ది పోరాడి నట్లు నేడు యువత మన దేశం కోసం ఉద్యమించాలి. ఈ రోజు కొత్త అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అభివృద్ధికి దోహదపడాలని మోదీ పిలుపునిచ్చారు. ‘ఆంధప్రదేశ్‌లో దేశభక్తి పురుడు పోసుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇక్కడి వారే. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య నుంచి కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు వరకు ఎందరో మహానుభావులు జన్మించారు. వీరంతా మన కోసం పోరాడి జీవితా లను త్యాగం చేశారు. అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంగా వీరి కలలను మనం సాకారం చేయాలి. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన భారత్‌ను చూడాలంటే అన్నివర్గాలకు సమాన అవకాశాలు గల భారత్‌ను మనం నిర్మించాలి.  అలాంటి పుణ్యభూమికి రావడం నా అదృష్టం’ అని చెబుతూ ప్రధాని సవినయంగా శిరస్సు వంచి నమస్కారం చేశారు.

అల్లూరి జయంతోత్సవాలను ఘనంగా చేయాలని ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను వస్తానని ప్రధాని నరేంద్రమోదీ నాకు మాట ఇచ్చారని ఆ కార్యక్రమం లోను పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అల్లూరి కుటుంబం, గిరిజన సైన్యం, మల్లుదొర, వీరయ్యదొర, ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు కుటుంబాలను కలసి వారి నుంచి స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు.

మన పూర్వికులు, స్వాతంత్య్ర సమరయోధులు  జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి స్వాతంత్య్రం తెచ్చారు. ఈ మట్టి నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనుల్లో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు. ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన సంస్కర్త. భావాల పరంగా ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడు అన్నారు ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌. ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టిన సంగతిని గుర్తు చేశారు.

అల్లూరి 125వ జయంతి ఆజాదీ కా అమృతోత్సవంతో కలిసివచ్చి తెలుగువారందరికీ చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగిలింది.

About Author

By editor

Twitter
YOUTUBE