భారత్‌ ‌పేరు చెప్పగానే భిన్నత్వంలో ఏకత్వం అన్న భావన వస్తుంది. కానీ ఇక్కడి పౌరులందరికీ ఒకే చట్టం వర్తించదన్న కఠోర వాస్తవం ఆ మహోన్నత భావనను వెక్కిరిస్తున్నట్టే ఉంటుంది. అయినా ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి భారతదేశం దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా నీళ్లు నములుతూనే ఉంది. పౌరులందరికీ ఒకే చట్టం…అంటే ఉమ్మడి పౌరస్మృతి అనివార్యమని డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం ప్రస్తావిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం దాదాపు మూడున్నర దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తూనే ఉంది. కానీ మైనారిటీలకు అంగీకారయోగ్యం కాని ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం సామరస్యాన్ని భగ్నం చేసే చర్యగా చాలా ప్రభుత్వాలు పరిగణించడమే పెద్ద వైచిత్రి. అందుకు కారణం- మైనారిటీలు అంటే ముస్లింలు (ఇతర మైనారిటీ వర్గాలు ఉన్నా వారిని అలా పిలవడానికి చాలామంది ఉదారవాదులకి, కాంగ్రెస్‌కి, మేధావులకు నోరు రాదు) షరియాను వదులుకోలేరన్న వాదన. అది వారికి పరమ పవిత్రమన్న అభిప్రాయం. దానిని మార్చడం అంటే ముస్లిం మనోభావాలను గాయపరచడమే నన్న భ్రాంతి. కానీ షరియా భారతదేశ ముస్లింలు మాత్రమే కాదు…ముస్లింలు అధికంగా ఉన్న కొన్ని దేశాలు, ముస్లింలే ఎక్కువగా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న దేశాలు, ముస్లింలు మెజారిటీగానే ఉన్నా సెక్యులరి జాన్ని పాటిస్తున్న దేశాలు కూడా అనుసరిస్తున్న మాట నిజం. కానీ ఆ దేశాలు షరియాను తాకరాని, మార్చకూడని దైవదత్త నియమావళిగా భావిస్తున్నాయా? ముమ్మాటికీ లేదు.

మన దేశంలో ఉన్న ముస్లిం పర్సనల్‌ ‌లా లేదా షరియా 1937 నాటిది మాత్రమే. దీనిని ఖురాన్‌ అం‌త పవిత్రంగా చూడాలని, మార్చాలని చూడడం మనోభావాలను గాయపరచడమేనని వాదించడమంటే దబాయించడం తప్ప మరొకటి కాదు. భారత్‌లో అయినా క్రిమినల్‌ ‌కోడ్‌ అం‌దరికీ సమానమే. ఇక్కడ మత, కుల, ప్రాంత, వర్గ ప్రసక్తి లేదు. భారత్‌ ‌సహా ముస్లిం దేశాలకు కూడా షరియాను యథాతథంగా అమలు చేయడం సవాలుగానే మారింది. షరియాకూ, ఆధునిక న్యాయవ్యవస్థకూ నడుమ పొంతన సాధ్యం కావడం లేదు. కాదు కూడా. మారుతున్న కాలాన్ని బట్టి పదునెక్కుతున్న మానవ హక్కుల భావనకు ముస్లిం పర్సనల్‌ ‌లాకు అసలే సయోధ్య కుదరడం లేదు. షరియాకు సున్నా (మహమ్మద్‌ ‌ప్రవక్త ప్రవచనాలు, ఆచరణ), ఫిక్‌ (‌ముస్లిం పండితుల అవగాహన మేరకు షరియా మీద వెలువడిన భాష్యం) మూలం. అందుకే షరియాను మార్చే ప్రయత్నాన్ని మనోభావాలకు ముడిపెట్టారు. దైవదత్తమన్న హోదా ఇచ్చారు. అయితే ఇది వాస్తవం కాదని కొన్ని ముస్లిం దేశాల ద్వారా అర్థ్ధమవుతుంది. షరియా అంటే దైవదత్తం కాదు, విశ్వవ్యాప్తం కానేకాదు. భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి దానిలో మార్పులు చేసుకున్నారు.

చాలా ముస్లిం దేశాలలో ఫిక్‌ ఆధారంగా షరియా నిర్మాణమైంది. అందుకే వాటి పరిధి, అమలు విస్తృతంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్‌ ‌చట్టానికి మూలం షరియా అనే అంటున్నాయి. ఈజిప్ట్, ‌పాకిస్తాన్‌ ‌వంటి దేశాలు పౌర చట్టాలతో పాటు షరియాను ఉపయోగించు కుంటున్నాయి. అంతో ఇంతో ప్రజాస్వామ్యం కనిపించే తుర్కియే, ట్యునీసియా దేశాలు సెక్యులర్‌ ‌న్యాయ వ్యవస్థకు షరియాను కొంతమేరకు జోడించుకున్నాయి.

ఇటీవలి కాలంలో చాలా ముస్లిం దేశాలు తమ కుటుంబ చట్టాలలో సంస్కరణలు తెచ్చాయి. అవన్నీ స్త్రీల హక్కులకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను, బాల్యవివాహాలు, బహు భార్యాత్వం, విడాకులు, ఆస్తి వారసత్వ హక్కు వంటి అంశాలలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో చేసిన సంస్కరణలు కావడం గమనించదగినది. ఆ దేశాలలో కూడా షరియా ప్రాధాన్యం తగ్గించే, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమైన ఇలాంటి సంస్కరణలను ఆమోదించడం సాధ్యం కాదని ఛాందసవాదులు బెదిరింపులకు దిగినా, ఆ పక్రియను మాత్రం పాలకులు నిలిపివేయడం లేదు. వివాహం విషయంలో స్త్రీకి మరిన్ని హక్కులు కల్పించడం, అలాగే విడాకులు, ఆస్తి, దత్తత వీటన్నిటి కంటె గృహహింస నుంచి రక్షణకు కుటుంబ చట్టాలలో సంస్కరణలు తేవడానికే అక్కడ మొగ్గు కనిపిస్తున్నది. అంటే స్త్రీపురుష సమానత్వం, సామాజిక న్యాయాలకు షరియా భరోసాగా ఉండాలని వారు ఆశిస్తున్నారు.

ఇప్పుడు ముస్లిం ఛాందసవాదానికి ఆలవాలంగా చెప్పుకునే పాకిస్తాన్‌లోను ముస్లిం కుటుంబ చట్టంలో (1961) పలు సంస్కరణలు తీసుకువచ్చింది. ఇలాంటి సంస్కరణల ధోరణి పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లో కనుపడుతున్నా మన ఉదారవాదులు గమనించకుండా దివ్యాంధుల వలె ప్రవరిస్తున్నారు. దీని ప్రకారం ఒక పురుషుడు మరొక వివాహం చేసుకోవాలంటే, అతడితో కాపురం చేస్తున్న మహిళ నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి. విడాకుల వివాదాలు తేల్చడానికీ, కుటుంబపరమైన సమస్యలు పరిష్కరించడానికీ ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేశారు. దేశ పురోగతి మందగమనంలో ఉన్నా, ఛాందసవాదులూ ఇతరుల మధ్య అధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉన్నా ఈ సంస్కరణల పక్రియకు మాత్రం ఎవరూ గండి కొట్టే ప్రయత్నం చేయడం లేదు. కానీ మత సూత్రాల ప్రాతిపదికగా కొన్ని మత పార్టీలు మాత్రం ఇవి సరికాదని కోర్టుల మీద ఒత్తిడి తెస్తున్నాయి.

విడాకుల విషయంలో ఈజిప్ట్ ఇం‌కాస్త పెద్ద అడుగే వేసింది. 2000 సంవత్సరంలో అక్కడ ఇస్లామిక్‌ ‌చట్టాన్ని సవరించారు. దాని ప్రకారం మహిళ ఏకపక్షంగా విడాకులకు(ఖులా) నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే తన ఆర్థికపరమైన హక్కులకు రక్షణ ఉంటుంది. కనీస వివాహ అర్హత వయసు స్త్రీపురుషులిద్దరికీ కూడా 18 ఏళ్లకు పెంచారు. పిల్లలకు 15 ఏళ్లు వచ్చే వరకు పిల్లలను తల్లులు తమ దగ్గర ఉంచుకునే హక్కును కూడా కల్పించారు. ఇక్కడ కూడా పురుషుల హక్కులను పణంగా పెట్టి స్త్రీలకు హక్కులు కల్పించడం సరికాదని ఛాందసవర్గాలు విమర్శించాయి.

ట్యునీసియా ముస్లింలు అధికంగా ఉన్న దేశమే అయినా, ఇక్కడ సెక్యులరిజాన్ని అనుసరిస్తారు. ఈ దేశం 1956 నాటి పర్సనల్‌ ‌కోడ్‌ ‌బహు భార్యాత్వాన్ని రద్దు చేసింది. భార్య లేదా భర్త ఎవరైనా కోర్టు ద్వారా విడాకులు పొందే అవకాశం ఏర్పరిచింది. ఈ సంస్కరణ స్త్రీలకు వారసత్వ హక్కును, పురుషులతో సమాన హోదాను కల్పించింది. ఇప్పటికీ కొన్ని ఆఫ్రికా ముస్లిం దేశాలలో ఉన్న బాలికల మర్మాంగ భాగాలను తొలగించే (మతం పేరుతో) ఆచారం ట్యునీసియాలో నిషిద్ధం. అలాగే బాల్య వివాహాలకు కూడా చోటు లేదు. అక్కడ చాలా సంస్కరణలకు విశేషమైన ఆదరణ లభించింది. చట్టానికి షరియా మాత్రమే పునాది కావాలని అక్కడ కొందరు వాదించే వారు ఉన్నా ట్యునీసియా తన సంస్కరణల పథం నుంచి తప్పుకోలేదు.

అసలు షరియా అనేది స్థిర చట్టం కాదు. ముస్లింల ఉమ్మడి స్మృతి కూడా కాదు. ఇందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ముస్లింలు తమ దేశాలలో చట్టాలను నిరంతరం మెరుగు పరుచుకుంటున్నారు. ఆధునికతకు తగ్గట్టు మలుచుకుంటున్నారు. ఇందుకు చారిత్రక, రాజకీయ, సామాజిక, మతపరమైన పరిస్థితు•లే దోహదం చేశాయి. షరియాను బట్టి ఆధునిక చట్టాలను రూపు దిద్దుకోవచ్చు కాని, అందులో ప్రయోజనం ఉండాలన్న ఒక వాదన అక్కడ బలపడింది.

ఈ వాస్తవిక అంశాలను భారతీయ ముస్లింలు కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. ముస్లిం దేశాలు తెచ్చుకుంటున్న సంస్కరణలు వాస్తవిక దృష్టితో పరిశీలించడం అత్యంత ప్రధానం. బీజేపీ ఏం చేసినా వ్యతిరేకించాలన్న మూఢత్వం, హిందూత్వం ముద్ర వేయడం భారతీయ ముస్లింలకు మేలు చేయదు. పైగా ముస్లిం మహిళలకు కీడు చేస్తుంది. దేశంలో ముస్లిం పర్సనల్‌లాను సంస్కరించాలన్న ఆశయం వందేళ్ల నాటిది. ఇప్పటికైనా ఆ సంస్కరణలను తేవాలని, రావాలని ఉద్యమిస్తున్న ముస్లిం సత్యశోధక్‌ ‌మండల్‌, ‌భారతీయ మహిళా ఆందోళన్‌ ‌వంటి సంస్థల ఆశయానికి మద్దతు ఇవ్వడం అవసరం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE