‌- డా।। కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

‘మతమను రాక్షస రక్త దంష్ట్రికలలో, మా భూమి లంఘించి మా కుత్తుకులను, నొక్కెడు వేళ కూడా ఎటు దిక్కుతోచక వున్నప్పుడు, బ్రతుకే దుర్భరమైనప్పుడు’, ప్రతిఘటించడానికి హిందు వులు దళాలుగా ఏర్పడ్డారు. ప్రతీకార వాంఛ సర్వత్రా చెలరేగింది. కర్ణాటక, బీదర్‌ ‌జిల్లాలోని గ్రామాలు -గోర్టా, హోనల్లి. బాల్కీ – కల్యాణ్‌ ‌రైలు మార్గంలో ఉన్నాయి. ఖుర్షీద్‌ ‌జాహి జాగీర్‌లో భాగమివి. భారత్‌కు స్వతంత్రం వచ్చాక కూడా ఇక్కడ రజాకార్లు, వారి తాబేదార్లు నిజాం అధికారాన్ని సమర్థించారు. ఈ క్రమంలోనే గోర్టా గ్రామంలో నిజాంకు ఎదురు తిరిగిన వారిని భూస్థాపితం చేశారు. ఈ పోరాటానికి ప్రత్యక్ష సాక్షి ఇరశెట్టప్ప వంకే. ఆయన చెప్పిన వివరాలను ఖండేరావు కులకర్ణి తమ గ్రంథంలో వివరించారు. హల్‌గోర్టా, హోసలి గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవానికి త్రివర్ణ పతాకం ఎగుర వేయడంతో ఈ పోరాటం ప్రారంభమైంది.

 నిజాంను వ్యతిరేకించిన హిందువులను శిక్షించేందుకు ముస్లిం అధికారులు ఆ గ్రామాలకు పోలీసులను పంపించారు. హల్‌గోర్టాలో జెండా ఎగరవేసిన మాధవరావును అరెస్టు చేసి ఆ నేరం మోపారు. తరువాత హోసలిలో జెండా ఎగురవేసిన నేరానికి బావూరావ్‌ ‌పటేల్‌ను అరెస్టు చేయడానికి వెళ్లారు. ఆయన ఆ గ్రామ పటేల్‌ ‌కూడా. బావూరావ్‌ ‌తనను  అరెస్టు చేసేందుకు వచ్చిన ఇద్దరు పోలీసు లను గదిలో బంధించి మరుసటి రోజు వదిలేశాడు. ఈ పరిణామం అవమానకరమని గోర్టాలో ఉండే రజాకార్‌ ‌నాయకుడు హిసామొద్దీన్‌ ‌భావించాడు. ప్రతీకారంగా గ్రామాన్ని దోచుకుని, సర్వనాశనం చేయాలని తలిచాడు.

 పోలీసులను నిర్బంధించి వదిలాడు గనుక వారు తప్పక రజాకార్ల సాయంతో హోసలిపై దాడి చేస్తారని బావూరావ్‌ ఊహించాడు. అదే నిజమైంది. ఇరవై ఐదు మంది పోలీసులు, రెండు వందల మంది రజాకారులు దాడికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం అందింది. వెంటనే తనకు సాయంగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, స్నేహితులు తరలి వచ్చారు. ఈ సంగతి రజాకార్లకు తెలిసింది. అయితే ఎంత మంది సాయంగా ఉన్నారనే విషయం తెలియలేదు. దానితో రజాకారులు హోసలి వెళ్లకుండా ఆగారు. పటేల్‌కు సాయంగా కల్యాణి గ్రామం నుంచి వచ్చిన గోపాలరావు రేపటి నుండి మనం ఆయుధాలు సిద్ధం చేసుకొనే పనిలో ఉండాలని సలహా ఇచ్చాడు. ఆరోజు రజాకార్లు రాలేదు కాబట్టి అందరూ ఆయుధాల సేకరణకు జానాపూర్‌, ‌సాయెగాం గ్రామాలకు వెళ్లారు.

ఈ వార్త తెలిసిన వెంటనే రజాకార్‌ ‌నాయకుడు హిసామొద్దీన్‌ ‌తన ముఠాతో దాడిచేసి హోసలి గ్రామాన్ని దోచేశాడు. బావూరావ్‌ ‌పటేల్‌ ఇల్లు దోచి, తగలబెట్టాడు. నిరాయుధులైన గ్రామస్థులు ప్రతిఘటించలేకపోయారు. పటేల్‌ ‌తన గ్రామానికి పట్టిన దురవస్థ గురించి విని కోపంతో ఊగి పోయాడు. ఏ విధంగానైనా హిసామొద్దీన్‌ను తుద ముట్టించాలని ప్రతిజ్ఞ చేశాడు. రజాకార్ల వేషాలు వేసుకొని మిత్రులతోబాటు దారి కాశాడు.

గోర్టా నుండి కల్యాణ్‌కు ప్రజలు వ్యాపార నిమిత్తం వెళుతూ ఉంటారు. హిసామొద్దీన్‌ అదే దారిలో వెళతాడని పటేల్‌ ‌తెలుసుకున్నాడు. ఈ దారి మధ్యలోనే హిసామొద్దీన్‌ను పట్టుకోవాలని పటేల్‌ ‌నెల్లాళ్లు ఎదురుచూశాడు. ఒక రోజు గోర్టా రైతులు హిసామొద్దీన్‌కు లంచం ఇచ్చి తమ వెంట రక్షకునిగా రావలసిందని కోరారు. హిసామొద్దీన్‌ ‌నలుగురు అనుచరులతో తుపాకులు తీసుకుని బయలు దేరాడు. ఈ విషయం బావూరావ్‌ ‌పటేల్‌కు తెలిసింది. తన మిత్రులతో బాటు ఒక కాలువ గట్టు క్రింద రాత్రంతా వేచి ఉన్నాడు. నలభై ఐదు బళ్లు దాదాపు డెబ్బయి మందితో వస్తున్నాయి. వారంతా హిందు వులే అన్న సంగతి పటేల్‌కు తెలుసు. రాత్రి దాదాపు గడిచిపోయింది. మొదట దఫా వచ్చిన బండ్లతో హిసామొహిద్దీన్‌ ‌లేడు. పటేల్‌ ‌విసిగిపోయాడు. తెల్లవారుతూ ఉండగా గోర్టా రైతుల బండ్లు కాలువ దగ్గరకు చేరుకున్నాయి. రజాకార్ల వేషాలలో ఉన్న పటేల్‌ ‌బృందం బండ్లను ఆపమని కేకేసింది. బండ్లవాళ్లు రాళ్లు విసిరారు. మేము హిందువులం మాకు హిసామొద్దీన్‌ ఎక్కడ ఉన్నాడో చెబితేచాలు, మీ జోలికి రాము అని గట్టిగా అరిచారు. బండ్ల మధ్యన హిసామొద్దీన్‌ను పటేల్‌ ‌బృందం గుర్తించి చుట్టుముట్టింది. రామారావ్‌ ‌పాటిల్‌, ‌బోరోల్‌ అనేవారు ధైర్యం చేసి హిసామొద్దీన్‌ను కాల్చి చంపారు. బావూరావ్‌ ‌పటేల్‌ ‌ప్రతిజ్ఞ నెరవేరింది. బావూరావ్‌ ‌పటేల్‌ ‌మిత్రులతోబాటు నిజాం సరిహద్దులు దాటి తప్పించుకున్నాడు. పోలీసు చర్య తరువాత పటేల్‌ ‌తన దళంతో బాటు లింగదల్లి గ్రామాన్ని విముక్తం చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అయితే పటేల్‌ ‌చేతుల్లో హిసామొద్దీన్‌ ‌చనిపోవటం ఘోర ఓటమిగా రజాకార్లు భావించారు. బాపూరావ్‌ను ఏ విధంగానైనా నిర్భందించాలని ప్రయత్నించారు. హత్య జరిగిన రోజు నలభై ఐదు బళ్లతోపాటు వెళ్లిన రైతులనందరిని పోలీసులు పట్టుకెళ్లి బాగా కొట్టారు. ప్రతీకార హింసతో చెలరేగిన రజాకార్లను చూసి హిందువులు భయపడిపోయారు. సరిహద్దులు దాటేసిన బావూరావ్‌ ‌పటేల్‌ అతని మిత్రబృందం దొరికే అవకాశం లేదు. కనుక వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని రజాకారులు శిక్షింపదల చారు. ఆ ఊరిలో రజాకార్లను ఎదిరిస్తున్నవాడు శరణప్ప పటేల్‌.

‌సాయుధ రజాకార్లు ముచలం గ్రామాన్ని నలువైపుల నుండి చుట్టుముట్టి కాల్పులు జరుపుతూ ప్రవేశించారు. శరణప్ప పటేల్‌ ఇం‌టిపై దాడి చేయగా నిరాయుధుడైన శరణప్ప అతని భార్య ఇద్దరు పిల్లలు ఇంట్లో తలుపులు బిగించుకొని కూర్చున్నారు. రజాకార్లు ఆ ఇంటిపై కిరోసిన్‌ ‌చల్లి నిప్పు అంటించారు. ఎవరూ రాకుండా కాల్పులు జరుపు తూనే ఉన్నారు. ఇల్లు మొత్తం కాలి శరణప్ప, అతని భార్య పిల్లలు బూడిదైపోయారు. తరువాత ఆ గ్రామాన్ని దోచుకొని హింసాకాండ సాగించారు. శరణప్ప మొత్తం వంశాన్ని నాశనం చేయాలని రజాకార్లు ఆలోచించారు. కానీ ఆ సమయంలో ఇంట్లో లేని శరణప్ప తమ్ముడు మాత్రం బ్రతికి పోయాడు. తరువాత గోర్టా గ్రామాన్ని దోచుకున్నారు. గోర్టాలో ధనవంతులు చాలామంది ఉన్నారు. హిందువులతో పాటు ముస్లింలు ఉన్నారు. హిసా మొద్దీన్‌ ఈ ‌గ్రామం వాడే. గోర్టా ముస్లిమ్‌లు కూడా హిసామొద్దీన్‌ ‌హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఊగిపోతున్నారు.

గోర్టాలో పగటిపూట పంటపొలాల్లో పని చేసుకుంటున్న పటేల్‌ ‌గురుపాదప్పను రజాకార్లు హత్య చేసి నదిలో సగం దాకా పాతిపెట్టారు. హత్య జరిగి నప్పుడు చూసిన రైతులను ఈ విషయం బయట పెడితే చంపేస్తామని బెదిరించారు. గోర్టాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు క్యాంపు వేశారు. వీరు బాపూరావుతో సంబంధాల నెపంతో షావుకారు మహాదేవప్ప డుమనేను బాధించారు.డుమనే ఇంటిపై పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ‌దాడి చేయగా, ఆయన తన లైసెన్సుడు గన్‌ను పోలీసులకు స్వాధీనం చేశారు.

చైత్ర అమావాస్యనాడు సూర్యగ్రహణం. ఆ మరుసటిరోజు పండుగ. ఆ ఏర్పాట్లలో ప్రజలున్నారు. అదే సమయంలో గ్రామాల మీద హత్యాకాండ జరపాలని రజాకార్లు నిర్ణయించారు. ఘెడవాడి, హుయానాబాద్‌, ‌చాల్కీ కల్యాణ్‌, ‌బేటర్‌ ‌తదితర గ్రామాలపై దాడికి సుమారు రెండువేల మందితో రజాకార్లు గోర్టాలో సమావేశమయ్యారు. ఎదురైన ప్రతీ హిందువునీ నరికారు. ఇంట్లోకి చొరబడి బయటకు లాగి తలలు నరికారు. ఉదయం ఎనిమిది గంటల నుండి తలలు నరికేపని మొదలైంది. ఈ ఘోర హింసాకాండను వర్ణించడం సాధ్యం కాదన్నారు వంకే.

భీమ్‌రావ్‌ ‌పటేల్‌ అతని భార్య తమ పిల్లలను సంరక్షించడానికి విశ్వప్రయత్నం చేశారు. రజాకార్‌ ‌రసూలుకు 40 తులాల బంగారం ఇచ్చారు. దీనితో తాను రక్షణగా ఉంటానని నమ్మించాడు. బంగారం అందగానే పెద్దవాడిని చంపేశాడు. చిన్నవాడు తప్పించుకు పారిపోతుంటే తుపాకీతో కాల్చేసి, అతని శరీరాన్ని పిడకలపై కాల్చేశాడు. రామారావు పట్వారీ, నారాయణరావు ముక్తేదార్‌లను బయటకు లాగి తలలు నరికి ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి పూశారు. మాలా పటేల్‌, ‌బసప్ప, లింగాయత్‌ ‌మఠంలోని రాజయ్యను, స్వామి గణీప్ప కణజేను క్రూరంగా హత్య చేశారు. మరో ఇంట్లో మగవాళ్లను బయటకు లాగి నరకటం ప్రారంభించగా తన తమ్ముడ్ని చంపవద్దని గర్భవతి అయిన అతని అక్క అడ్డురాగా ఆమెను తన్నారు. ఆ దెబ్బకు ఆమె ప్రసవించి చనిపోయింది. పుట్టినవాడు బాబు పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ రోజు కనపడిన ప్రతీ స్త్రీని మానభంగం చేశారు. ఆ ఒక్కరోజు చనిపోయిన వారిలో కొందరి పేర్లు అనిరుద్దప్ప, శివన్న మైత్రి, మారుతి అప్పకొనే, దూలప్ప కణజే, రామారావు వంకే, గుర్రప్ప కణజే, గంగప్ప కణజే, భీమన్న రాజోలె, శరణప్ప కణకటీ, చిన్నప్పం దాద్దర్‌, ‌గుర్రప్ప బరాధర్‌, ‌కాళప్ప మదుకంటి, విరూపాక్షప్ప, మఠపతి బసవప్ప వంకే. ఇంతటి కష్టకాలంలోను గ్రామంలో సుమారు 500 మందిని దాచి ప్రాణదానం చేసిన వ్యక్తి హలంబరే నాగన్న.

గోర్టాలో హత్యాకాండను తప్పించుకొని దాదాపు ఐదు వందలమంది పిల్లలు, పెద్దలు మహాదేవప్ప డుమనే ఇంట్లో తలదాచుకున్నారు. డుమనే ఇల్లు ఓ చిన్నకోటలో రెండంతస్తుల మేడ. రాతి కట్టడం, చుట్టూగోడ. రెండవ అంతస్తుపై ముగ్గురు వ్యక్తులు తుపాకులతో పహరా ఉండి వారిని కాపాడారు. డుమనే ఇంట్లో చాలా ఆయుధాలు ఉన్నాయని దాడి చేయటం సాధ్యం కాదని రజాకార్లు ఎదురుగా ఉన్న ఇంటి నుండే కాల్పులు జరిపారు. ఆ కారణంగా మారుతీ అప్పకొనే, చిన్నప్ప బరాదర్‌ ‌మేడపైనే ప్రాణాలు వదిలారు. మహాదేవప్ప ఇంటిపై నుండి కాల్పులు సాగించిన వ్యక్తులలో ముఖ్యమైనవారు హలంబరే నాగన్న. అతని దగ్గర 12 బోర్‌ ‌తుపాకీ, మిగతా ముగ్గురి దగ్గర మూడు తుపాకులున్నాయి. వాటితో దాదాపు 15 మంది రజాకార్లను హత మార్చారు. శివరాముడు భుజంలో నుండి గుండు దూసుకుపోయింది, హలంబరే నాగన్నతో బాటు, కాశప్ప బాల్కె, సిద్దరామప్ప వటవే దినమంతా అలసిపోయి కూడా రజాకార్లను తిప్పికొడుతూనే ఉన్నారు. నాగన్న వీరోచిత పోరువల్ల ఐదు వందల ప్రాణాలు దక్కాయి. చీకటి పడగానే రజాకార్లు వెళ్ళిపోయారు. ఆ చీకటిని ఆసరా చేసుకుని ఐదు వందల మంది గోర్టాను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. డుమనే ఇల్లు ఖాళీ అయ్యింది. మరు సటి రోజు రజాకార్లు తిరిగి గోర్టాపై దాడిచేశారు. గ్రామం స్మశానంలా మారిపోయింది. శవాలపై రాబందులు, కాకులు ఎగురుతూ కన్పించాయి. రజాకార్లు డుమనే ఇల్లును సాంతం దోపిడి చేసి నేలంతా తవ్వేశారు. కారణం, పాతిపెట్టిన బంగారం దొరుకుతుందేమోనని ఆశ. ఏమీ దొరకలేదు. చివరకు నిప్పు పెట్టారు. జానాపూర్‌నుండి త్రివర్ణ పతాకం పట్టుకొని కొందరు యువకులు సహాయార్ధం వచ్చారు. ఇక్కడ పరిస్థితిని చూసి వారు వెనుదిరి గారు. వారిలో మాదప్ప, కుంటప్ప, రామిశెట్టి, అలడప్ప లను రజాకార్లు వెంటబడి కాల్చి చంపారు.

ఈ హత్యకాండల తరువాత గోర్టా గ్రామాన్ని రజాకార్లు కొన్ని నెలలు లూటీ చేశారు. అక్కడ దొరికిన ఏ వస్తువును వదల్లేదు. ధాన్యం, రేకులు, రూపాయలు, వెండి, బంగారం, తలుపులు, కిటికీలు, బట్టలు, పశువులు.. ఏది దొరికితే అది దోపిడీ చేశారు. భూములను, ఇళ్లను రజాకార్లు పంచు కున్నారు. ఇంత జరిగినా నిజాం తనకు తెలియనట్టే నటించాడు. అందుకే కృష్ణమాచారి అంటారు, ‘విషము గుప్పించినాడు నొప్పించినాడు, మా నిజాం రాజు జన్మజన్మల బూజు’’ అని. తరువాత వినోబా భావే ప్రత్యేకంగా వెళ్లి నిర్వాసితులైన గ్రామస్థులకు ఆ గ్రామాన్ని అప్పగించారు. బూడిదపాలైన గోర్టా గ్రామం స్వాతంత్య్రానంతరం కూడా గాయాలను మాన్పుకోలేక పోయింది. ఈ విధంగా నైజాం పాలనలో ఎన్నో జలియన్‌వాలా బాగ్‌ ‌సంఘటనలు జరిగాయి.

‘‘కొంగు లాగిన వ్రేళ్ళు కొలిమిలో పెట్టాలె /కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలె/ తన్నిన కాళ్లను ‘డాకలి’గా వాడాలె / కండకండ కోసి కాకులకు వెయ్య/కాలంబు రాగానే కాటేసి తీరాలె’’

-కాళోజీ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram