ఉదయించే సూర్యుడు ఆ పార్టీ గుర్తు. కానీ దాని వెనుకంతా ఏడున్నర దశాబ్దాల చీకటి చరిత్ర ఉంది. అది హిందూత్వ మీద ద్వేషం పేరుతో మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను, ముస్లిం మతోన్మాదాన్ని ఎగదోస్తోంది. ఏడున్నర దశాబ్దాలుగా తమిళనాడులో ఎస్సీఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని  బ్రాహ్మణ వ్యతిరేకత అనే ముసుగులో దాచి పెట్టే పార్టీ కూడా అదే. సామాజిక న్యాయం అంటూ గొంతు చించుకుంటూనే శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలి చీరను లాగి, జాకెట్టును చించేసిన దుశ్సాసన సంతతి అంతా ఆ పార్టీలోనే ఉంది.  ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే హిందీ భాషను రుద్దుతున్నారంటుంది. జాతీయ సమైక్యతను ప్రబోధిస్తే హిందుత్వను పులుముతున్నారని గగ్గోలు పెడుతుంది. రాష్ట్ర పురోగతి పేరుతో వేర్పాటువాదాన్ని చాపకింద నీరులా సాగించే పార్టీ కూడా అదే. ప్రజాస్వామ్యం పేరుతోనే మునిమనుమలకు కూడా కిరీటాలు తయారు చేసి పెట్టుకున్న, సింహాసనాలు తయారు చేసుకుంటున్న కుటుంబ పార్టీలలో దానిదే అగ్రస్థానం. అదే ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే). లక్షల కోట్ల అవినీతి వ్యవహారాలలో పీకల్లోతు మునిగి ఉన్న డీఎంకే పాపం ఇప్పటికి పండింది. ఆ పాపాల చిట్టాను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నారు కె. అన్నామలై.  దాని చీకటి చరిత్రను తవ్వి పోస్తున్నారు. ఆయన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆయన వెల్లడిస్తున్న సత్యాల సంకలనమే ‘డీఎంకే ఫైల్స్’

———-

‌ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో కేవలం 13 మంది నాయకుల ఆస్తుల విలవ ఎంతో అన్నామలై బయటపెట్టారు. నాలుగు భాగాల ఈ ఆర్థిక హారర్‌ ‌ధారావాహికలో మొదటిభాగం సారాంశం ఇదే. ఆ మొత్తమే రూ. 1.34 లక్షల కోట్లు. తొలి ఫైల్‌ ‌విడుదల కాగానే, సుసంపన్న సంస్కృతి కలిగిన తమిళనాడును ఎంకే స్టాలిన్‌ అవినీతి అనే విషంతో నింపేశారని, బీజేపీ ధ్వజ మెత్తింది. అధికార డీఎంకే మనీలాండరింగ్‌ ‌కోసం నీచమైన కొత్త కొత్త మార్గాలను అన్వేషించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జఫర్‌ ఇస్లామ్‌ ‌విమర్శించారు.

వీటన్నిటి మీద సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ కోరుతోంది. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల లోపు మిగిలిన భాగాలను దశల వారీగా అన్నామలై ప్రజల ముందు పెట్టబోతున్నారు. ఆ ఎన్నికలలో అన్నామలై నినాదం ఎన్‌మన్‌ఎన్‌ ‌మక్కాళ్‌ (‌నా భూమి నా ప్రజలు). ఆయన విడుదల చేస్తున్న వీడియోలు డీఎంకే ఫైల్స్ అనుకోకుండా చక్కని రుజువు వచ్చి కూర్చుంది. అదే తమిళనాడు ఆర్ధిక మంత్రి పళనివేల్‌ ‌త్యాగరాజన్‌ (‌పీటీఆర్‌)‌ది అని చెబుతున్న ఆడియో. దీని ప్రకారం డీఎంకే ప్రథమ కుటుంబం ఒక్క సంవత్సరంలోనే రూ. 30 వేల కోట్లు సంపాదిం చింది. ఈ డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలియక ఇబ్బంది పడుతోంది.

ఏమిటీ డీఎంకే ఫైల్స్ ?

1969 ‌మొదలు ఇంతవరకు, విడతల వారీగా ద్రవిడ పార్టీలే తమిళనాడులో అధికారంలో ఉన్నాయి. అందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‌కుటుంబం (డీఎంకే), ఇంచుమించుగా 30 ఏళ్లకు పైగా, అధికారంలో ఉంది. ఈ 30 ఏళ్ల డీఎంకే పాలనలో కరుణానిధి/స్టాలిన్‌ ‌ఫ్యామిలీ ద్రవిడవాదాన్ని కవచంగా కప్పుకుని అక్రమార్జనకు పాల్పడింది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆరోపణ కాదు. కరుణానిధి కుమార్తె కనిమొళి సహా మరికొందరు డీఎంకే ముఖ్య నేతలపై అవినీతి ఆరోపణలు చిరకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, కరుణానిధి నాటిన కుటుంబ పాలన అవినీతి విషబీజం, ఆయన కుమారుడు స్టాలిన్‌, ‌స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌ ‌చేతుల్లో ఇంతింతై అన్నట్లుగా రాష్ట్ర వ్యాపితం అయింది. వేల నుంచి లక్షల కోట్లకు పడగలెత్తింది. షెల్‌ ‌కంపెనీలు చీకటి వ్యవహారాలు సాగిస్తున్నాయి. అవినీతికి టెక్నాలజీని జోడించి కొత్త పుంతలు తొక్కుతున్నాయనే ఆరోపణలు కొత్తగా వినిపిస్తు న్నాయి. ఈ అవినీతి కథలనే అన్నామలై ‘డీఎంకే ఫైల్స్’ ‌పేరిట బహిర్గతం చేస్తున్నారు.

నిజానికి, అన్నామలై ఇంకా పూర్తి చిట్టాను బయట పెట్టనే లేదు. అయితే ఏప్రిల్‌ 14‌న ఆయన విడుదల చేసిన ‘డీఎంకే ఫైల్స్’ ‌ఫస్ట్ ఎపిసోడ్‌’ ‌లోనే స్టాలిన్‌ ‌ఫ్యామిలీ అవినీతికి సంబంధించిన నమ్మశక్యం కాని నిజాలను బయట పెట్టారు. అందులో ప్రధానంగా గతంలో 13 ఏళ్ల క్రితం, 2011లో కరుణానిధి ప్రభుత్వంలో ఉప ముఖ్య మంత్రిగా ఉన్న స్టాలిన్‌ ‌మహానగర మెట్రో టెండర్ల గోల్‌మాల్‌ ‌వ్యవహారంలో, ఫ్రాన్స్‌కు చెందిన అల్‌స్టోమ్‌ (శ్రీ•‌శీఎ) కంపెనీ నించి మధ్యవర్తుల ద్వారా రూ.200 కోట్లు ముడుపులు పుచ్చుకున్నారని, అన్నామలై ఆరోపించారు. ఆరోపించడం కాదు, ఆధారాలను బయటపెట్టారు. ఈ ముడుపుల వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు. సీబీఐ విచారణ జరుగుతుందని నమ్ముతున్నారు. స్టాలిన్‌ అయన కుటుంబం, పార్టీ అవినీతిపై పోరాటం సాగిస్తానని అంటున్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆయన కుటుంబ సభ్యులు, ఇతర డీఎంకే నేతలు రూ.1.34 లక్షల కోట్ల అవినీతిలో ఎవరి వాటా ఎంతో, ఎవరి చేతివాటం ఎంతో కూడా అన్నామలై వెల్లడించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిది స్టాలిన్‌, అల్లుడు శబరీశన్‌ ఒకే ఒక్క సంవత్సరంలో రూ.30 వేల కోట్లు సంపాదించారని, రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్‌ ‌త్యాగరాజన్‌ (‌పీటీఆర్‌) ‌చెప్పినట్లుగా సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్న క్లిప్పింగ్‌ ‌డీఎంకే ఫైల్స్‌లో తాము చేసిన ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, తమిళనాడు ఆర్థిక మంత్రి పీటీఆర్‌ ‌చెప్పినట్లు కరుణానిధి తమ జీవితకాలంలో సంపాదించిన మొత్తం కంటే, అయన మనుమలు ఒక సంవత్సర కాలంలో పోగేసిన అవినీతి సొమ్ము ఎక్కువ ఉంటుందని, దీనిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అన్నామలై డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇదీ తమిళనాట ద్రవిడ పార్టీ సాధించిన పురోగతి. తమిళనాడు తొలి రాజకీయ కుటుంబం ఏడాదిలోనే రూ. 30,000 కోట్లు దండుకున్నదని తాను చెప్పినట్టు వచ్చిన వీడియో గురించి త్యాగరాజన్‌ ‌గట్టిగానే ఖండించారు. తన సోషల్‌ ‌మీడియాలో రెండు పేజీలు ఇందుకు కేటాయించారు కూడా. అయితే ఈ ఆడియో దేశం మీదకు వెళ్లిపోయిన నాలుగు రోజుల తరువాత జరిగింది. పార్టీలో, అసెంబ్లీలో కూడా రగడ జరిగింది. రెండో దశ ఫైల్స్ ‌విడుదల చేసిన సందర్భంలోనే పీటీఆర్‌ ‌తన ఖండనను వెలువరించారు. డీఎంకే పార్టీని చీల్చాలని బీజేపీ చూస్తున్నదని ఆయన ఆరోపించారు. ఆ ఆడియో వాస్తవం కాదనీ అన్నారు. అయితే అటు పీటీఆర్‌గాని, ఇటు డీఎంకే కాని ఈ ఆరోపణ గురించి అన్నామలై మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అక్కడ ఉన్నదే డీఎంకే ప్రభుత్వం. ఇక ఫిర్యాదు చేయడానికి ఎందుకు ముందుకు రాలేదన్న విమర్శ, చర్చ వచ్చాయి. కానీ బీజేపీ మాత్రం ఆ ఆడియో నిజానిజాల మీద ఫోరెన్సిక్‌ ‌దర్యాప్తు చేయించాలని కోరింది. ఈ ఆడియో డీఎంకే పరువును మంట గలిపిందన్న అభిప్రాయం ఇప్పటికే ఏర్పడింది. ఈ ఆడియోను బట్టే తాను చేసిన ఆరోపణలు నిజమవు తున్నాయని అన్నామలై వ్యాఖ్యానించారు. కాబట్టి ఆయన మీద పోలీసు ఫిర్యాదు చేయాలి. లేదా క్రిమినల్‌ ‌డిఫమేషన్‌ ‌కేసు పెట్టాలి. ఈ రెండూ చేయలేదు కాబట్టి ప్రజలు ఏమనుకోవాలి అని రాజకీయ విశ్లేషకుడు సుమంత్‌ ‌రామన్‌ ‌ప్రశ్నించారు. అన్నామలై వీడియోలు, ఆర్థికమంత్రి ఆడియో అన్నీ ఎంకే స్టాలిన్‌ ‌జాతీయ రాజకీయాలలోకి అరంగేట్రం చేద్దామని అనుకుంటున్న సమయంలో వెలువడడం… తనకు మూఢ నమ్మకాలు లేవని చెప్పుకునే డీఎంకేకు అశుభమే.

 చిత్రం ఏమంటే, కరుణానిధి మనుమలు, (స్టాలిన్‌ ‌కొడుకు, అల్లుడు) ఒకే సంవత్సరంలో కరుణానిధి జీవిత కాలంలో సంపాదించిన ఆస్తుల కంటే ఎక్కువ అక్రమ ఆస్తులు కూడా పెట్టారని ఆర్థికమంత్రి పీటీఆర్‌ ‌చెప్పినట్టు ప్రచారంలో ఉన్న ఆడియో క్లిప్పింగ్‌పై డీఎంకే ముఠా వెంటనే స్పందించలేదు. నోళ్లు పడిపోయాయని అనుకోవాలి. అంతేకాదు, డీఎంకే ప్రభుత్వం చేస్తున్న పనులకు మంత్రిగా ఆమోదం తెలపడానికి తన ఆత్మ అంగీకరించడం లేదని పీటీఆర్‌ అన్నట్టు చెబుతున్న మరొక వీడియో కూడా వైరల్‌ అయింది. ఉదయ్‌నిధి, శబరీశన్‌ ‌భారీ సంపాదన గురించి మిత్రపక్షాల నుంచి వత్తిడి వచ్చినా ఆయన మొదట మౌనంగానే ఉన్నారు. చివరకు స్వయంగా స్టాలిన్‌ ‌కాల్‌ ‌చేసి హెచ్చరించిన తర్వాత మాత్రమే ఆర్థికమంత్రి అప్పటికే సోషల్‌ ‌మీడియాలో భయంకరంగా వైరల్‌ అయిన ఆడియో క్లిప్పింగ్‌పై స్పందించారు. అదంతా కల్పితమని, తమ మధ్య చిచ్చుపెట్టేందుకే అన్నామలై ఈ ఆరోపణలు చేస్తున్నారని ప్రకటన విడుదల చేశారు.

ఇంతేకాదు.. ఇంకా ఉంది

నిజానికి, ఇంతవరకు డీఎంకే ఫైల్స్‌లో బయటపెట్టింది… తక్కువని బయట పెట్టవలసింది, ఎక్కువని స్వయంగా అన్నామలై ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డీఎంకే ఫైల్స్ ‌ఫస్ట్ ఎపిసోడ్‌లో బయట పెటిన రూ. 1.34 లక్షల కోట్ల అవినీతి వ్యవహారం కేవలం 11 మంది డీఎంకే నాయకులకు సంబంధించినదే అయినా, అది వారు ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన మొత్తానికి, తాము పూర్తి ఆధారాలతో సేకరించిన వాస్తవ ఆస్తుల వివరాల ఆధారంగా లెక్క కట్టిన అవినీతి మొత్తమే రూ.1.34 లక్షల కోట్లుగా నిర్ణయానికి రావడం జరిగిందని వివరించారు. ఇతర నాయకులు, బినామీల వివరాలను కలిపితే, ఈ మొత్తం అంచనాలకు సైతం అందనంతగా ఉంటుందని అన్నామలై ఒక ఇంటర్వ్యూలో వివరించారు.ఇక చోటా నాయకులు కూడబెట్టిందో ఎంతో తెలుసుకోవాలంటే సాధారణ తమిళుడు గుండె నిబ్బరంతో ఉండక తప్పదు. అంతేకాదు, ముందు ముందు మరిన్ని ఎపిసోడ్స్ ‌రిలీజ్‌ ‌చేస్తామని అందులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తాయని అన్నామలై అంటున్నారు. ఈ లెక్కన చూస్తే, ‘డీఎంకే ఫైల్స్’ ‌ముందు ముందు మరిన్ని ప్రకంపనలు సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇదిగో చిట్టా

నిజానికి, అన్నామలై డీఎంకే ఫైల్స్ ‌వన్‌లో స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌ అవినీతి కథలనే కాదు, స్టాలిన్‌ ‌సోదరి కనిమొళి సహా ఇతర కుటుంబ సభ్యులు, మంత్రులు, ఇతర పార్టీ నేతల అవినీతి చిట్టాను కుడా బయట పెట్టారు. కనిమొళి 2019 ఎన్నికల సమయంలో తన ఆస్తులను రూ.30 కోట్లుగా పేర్కొన్నారు. కానీ ఆమెకు కలయింగర్‌ ‌టీవీలో ఎనిమిది వందల కోట్ల విలువైన వాటాలు ఉన్నాయి. ఇంత స్వల్ప వ్యవధిలో అంత సంపాదన ఎలా సాధ్యమైంది అనేది అన్నామలై ప్రశ్న. ఇక జగద్రక్షకన్‌ అనే కేంద్ర మాజీమంత్రి తన ఎన్నికల అఫిడవిట్లో అప్పులు ఉన్నాయని చూపించాడు. ఇప్పుడు ఆయన సంపాదన ఏకంగా వందల కోట్లకు వెళ్లిపోయింది. ఇది ఎలా సాధ్యమవుతుందో చెబితే తమిళ ప్రజలు మొత్తం అనుసరిస్తారని అన్నామలై అడుగుతున్నారు. ఇక ఇవి వేలు అనే మంత్రి ఎన్నికలప్పుడు తన అరుణయి అనే కాలేజీ విలువ రూ. 1086 కోట్లు ఉంటుందని అఫిడవిట్‌లో ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆయన కాలేజీ విలువ రూ. 4,000 కోట్లకు పెరిగింది. ఆయన కాంబన్‌ ‌కాలేజీ విలువ కూడా రూ.141 కోట్లకు పెరిగింది. ఇలా అనేక మంది డీఎంకే నాయకులు తమ ఆస్తులను అడ్డగోలుగా పెంచుకున్నారని అన్నామలై ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ‌రేపోమాపో అన్నీ కలసి వస్తే తరువాతి ముఖ్యమంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌, ‌బావకు పోటీగా రావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్న అల్లుడు శబరీశన్‌, ‌సీఎం సోదరి కనిమొళి, దగ్గరి బంధువు కళానిధి మారన్‌ అవినీతి చిట్టాలు, కూడబెట్టిన మొత్తాల వివరాలు కూడా ఇందులో ఉన్నాయని వేరే చెప్పక్కరలేదు. తొలిభాగంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలలో మెట్రో ప్రాజెక్టులో నేటి ముఖ్యమంత్రి స్టాలిన్‌కి నాడు అందిన భారీ ముడుపులు, ఉదయ్‌నిధి స్టాలిన్‌ ‌నిర్మాణ సంస్థ రెడ్‌ ‌జెయింట్‌ ‌మూవీస్‌కు పెట్టుబడులు, శబరీశన్‌ ‌మనీ లాండరింగ్‌ ‌వ్యవహారాలకు సంబంధించి ఉన్నాయి. డీఎంకే మంత్రులు కేఎన్‌ ‌నెహ్రూ, కె. పొన్ముడి, అన్బిల్‌ ‌మహేశ్‌ ‌పొయ్యోమోజి, ఎంపీలు ఎస్‌. ‌జగద్రక్షకన్‌, ‌టీఆర్‌ ‌బాలు, డీఎం కాతిర్‌ ఆనంద్‌, ‌కళానిధి వీరాస్వామిల అవినీతి చిట్టాలు కూడా ఉన్నాయి.

డీఎంకే ప్రథమ కుటుంబం అవినీతి సినిమా చాలా పెద్దది. తాత, తండ్రి, ఇప్పుడు మనుమడు కూడా ఒకరి నుంచి ఒకరు అవినీతిని పుణికి పుచ్చుకున్నారు. 2006-2011 మధ్య స్టాలిన్‌ ‌కొడుకు ఉదయనిధి కొన్ని సినిమాలు తీశాడు. వాటికి అయిన ఖర్చు రూ. 300 కోట్లు. అప్పుడు డీఎంకే అధికారంలో ఉంది. అందులో చాలావరకు సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. అయినా ఇన్ని సినిమాలు ఇంత పెట్టుబడితో ఉదయ్‌నిధి ఎలా తీశారని అన్నామలై అడుగుతు న్నారు. ప్రస్తుతం ఉదయ్‌నిధి ఆస్తుల విలువ రూ. 2,039 కోట్లు. అదే 2021లోనే అంటే రెండేళ్ల క్రితమే ఆయన ఆస్తుల విలువ కేవలం రూ. 33 కోట్లు. 2019-20లో ఆయన చూపిన వార్షికా దాయం రూ. 4.98 లక్షలు.

స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌కు సెయింట్‌ ‌జార్జెస్‌ ‌బ్యాంక్‌తో ఉన్న బంధం గురించి కూడా అన్నామలై ప్రశ్నించారు. ఈ బ్యాంక్‌కు మనీలాండరింగ్‌తో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌కూ, నోబెల్‌ ‌స్టీల్‌కూ మధ్య కుదిరిన రూ. 1000 కోట్ల అవగాహన ఒప్పందం గురించి కూడా అన్నామలై ప్రశ్నించారు. ఈ ఒప్పందం మార్చి 2022లోనే కుదరింది. విషయం అదికాదు, నోబెల్‌ ‌స్టీల్‌ ‌సంస్థలో డైరెక్టర్లు అన్బిల్‌, ఉదయ్‌నిధి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌చంకలో మనుషులు.

ఇప్పుడు డీఎంకేను నడిపిస్తున్నది కరుణానిధి కుటుంబం. అయితే అది చాలా చాలా చాలా పెద్దది. ఎందుకంటే ఆయనకు ముగ్గురు భార్యలు. వారే పద్మాతి అమ్మాళ్‌, ‌దయాళు అమ్మాళ్‌, ‌రజతి అమ్మాళ్‌. ఎం‌కే ముత్తు, ఎం•కే స్టాలిన్‌, ఎం‌కే అళగిరి, ఎంకే తమిళరుసు కుమారులు. సెల్వి, కనిమొళి కుమార్తెలు. వీరు, వీరి సంతానం, మనుమలు, కూతుళ్లు, అల్లుళ్లు కూడా రాజకీయాలలో, వ్యాపారంలో, సినిమా రంగంలో తమిళనాట మకుటాలు లేని మహారాజుల మాదిరిగా వెలిగిపోతున్నారు. ఇందులో దయాళు అమ్మ సంతానమే స్టాలిన్‌.

ఎం‌కే స్టాలిన్‌ ‌తనకంటే పదేళ్లు చిన్నదైన దుర్గను 1976లో పెళ్లి చేసుకున్నారు. చిత్రంగా ఈయన రాజకీయ జీవితం అవినీతికి వ్యతిరేకంగా జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ఉద్యమం ప్రారంభించిన నేపథ్యంలో, అత్యవసర పరిస్థితి కాలంలో మొదలయింది. దుర్గను పెళ్లి చేసుకున్న ఐదు మాసాలకే ఇతడిని మీసా కింద అత్యవసర పరిస్థితిలో అరెస్టు చేశారు. అప్పుడు జైలులో తనను హింసించారని తన ఆత్మకథ ‘మీలో ఒకడిని’లో చెప్పుకున్నారు. దుర్గ డీఎంకే కుటుంబంలో ఉన్నా, ఆస్తికురాలు. ఆ మధ్య ఒక ఆలయానికి వెళితే, దేవతామూర్తులకు పట్టే ఛత్రాన్ని ముఖ్యమంత్రి భార్యగా దుర్గకు పట్టడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

యథాప్రకారం అన్నామలై చేసిన ఆరోపణలను డీఎంకే నేతలు ఖండించారు. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ ‌భారతి ఈ ఆరోపణలను జోక్‌ అని అన్నారు. ఆయన పేర్కొన్న డీఎంకే నేతలంతా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారని తెలిపారు. వాటిలో ఏ ఒక్కటి తప్పుగా అనిపించినా వారి ఎన్నికను ప్రజలు సవాల్‌ ‌చేయవచ్చని అన్నారు. అలాగే, 2011లో మెట్రో రైలు టెండర్ల వ్యవహారంలో డీఎంకేకు రూ.200 కోట్ల ముడుపులు అందినట్లు అన్నామలై చేసిన ఆరోపణలనూ డీఎంకే తోసి పుచ్చింది. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ అవినీతిపై 2014 నుంచి సీబీఐ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. అన్నామలై చేసిన అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేయాలని డీఎంకే ఆర్‌ఎస్‌ ‌భారతి సవాల్‌ ‌విసిరారు. ఇక అన్నామలై పేర్కొన్నట్లుగా ఆయన ఇంటి అద్దె నుంచి ఇతర ఖర్చులకు సంబంధించి నెలకు ఏడు నుంచి ఎనిమిది లక్షలను ఇతరులు, ఆయన పార్టీ భరిస్తే ఇక ఆయనకు సొంతంగా ఏమి ఉన్నాయని డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ ‌భారతి ప్రశ్నించారు.

ఎదురు దాడి

అంతేకాదు, డీఎంకే అన్నామలైపై ఎదురు దాడికి దిగింది. ఆయన ఇంటి ఖర్చులు, ఆఫీస్‌ ‌ఖర్చుల లెక్కలు తీసింది. కారెక్కడిది.. కారులో పెట్రోల్‌కు పైసలెక్కడివీ అని ప్రశ్నలు లేవనెత్తింది. నెలకు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని, వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేతలు,అవినీతి మచ్చలేని అన్నామలైని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఆయన చేతికున్న ఖరీదైన వాచ్‌ ఎక్కడిదని ప్రశ్నిం చారు. ఈ ప్రశ్నలు అన్నిటికీ అన్నామలై సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఆయన ఐపీఎస్‌ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇంతవరకు జరిపిన బ్యాంకు లావాదేవీలకు సంబంధించి 212 పేజీల బ్యాంకు ఎకౌంటు స్టేట్‌మెంట్‌ ‌బహిర్గతం చేశారు. డీఎంకే నేతలు, మీడియా, సామాన్య ప్రజలు ఇంకా ఎవరైనా చూసుకోవచ్చని సవాలు విసిరారు. అంతే కాదు, తనపై నిరాధార ఆరోపణలు చేసిన డీఎంకే నేతలపై పరువు నష్టం కేసులు వేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే, అరుధర అవినీతి కేసులో తనకు ముడుపులు ముట్టాయని ఆరోపణలు చేసిన డీఎంకే నేత ఆర్‌ఎస్‌ ‌భారతికి రూ. 500 కోట్ల పరువు నష్టం డిమాండ్‌ ‌చేస్తూ లీగల్‌ ‌నోటీసు పంపారు.

ఇది అంతం కాదు

నిజానికి, డీఎంకే నేతల అవినీతి ఆరోపణలకు సంబంధించి డీఎంకే ఫైల్స్ ‌బయట పెట్టింది పిసరంత అయితే బయటకు రావలసింది కొండంత అని, అన్నామలై అంటున్నారు. ఈ సంవత్సరం చివరి వరకు, మరిన్ని సంచలన వివరాలతో డీఎంకే ఫైల్స్ … ‌విడుదల చేస్తూనే ఉంటానని, ఆయన చెపుతున్నారు. అంతేకాదు త్వరలో డీఎంకే ఫైల్స్‌ను ప్రజల్లోకి తీసుకు వెళతామని అన్నామలై స్పష్టం చేశారు. అలాగే, డీఎంకే నేతలు డిమాండ్‌ ‌చేసిన విధంగా క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని, పరువు నష్టం కేసులకు సంబంధించి డీఎంకే నేతలు ఇచ్చిన లీగల్‌ ‌నోటీసులకు స్వాగతం పలుకుతున్నానని అన్నామలై స్పష్టం చేశారు. పరువు నష్టం నోటీసులు ఇచ్చిన డీఎంకే నాయకులు ప్రొసీడ్‌ ‌కావాలని అంటున్నారు. కోర్టులో కేసుకు ఎదుర్కునేందుకు తను సిద్ధంగా ఉన్నానని అన్నామలై డీఎంకే నేతలకు సవాలు విసిరారు. ఇప్పుడు బంతి డీఎంకే కోర్టులో ఉంది.. స్టాలిన్‌ ‌సాహసం చేస్తారా .. చేతులెత్తేస్తారా.. చూడవలసి ఉంది.


అన్నామలై

కర్ణాటక క్యాడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి. ఉద్యోగం వీడి బీజేపీలో చేరారు. అనతికాలంలోనే పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అంతే అయితే, ఆయన గురించి అంతగా చెప్పుకోవలసింది,పెద్దగా ఉండక పోవునేమో! కానీ, ఈ రోజున ఆయన గురించి ఒక్క తమిళనాడులోనే కాదు, దేశం అంతటా చర్చ జరుగుతోంది. ఎవరీ అన్నామలై ..ఏమా కథ ..అనే ప్రశ్న సోషల్‌ ‌మీడియాను చుట్టేస్తోంది. ఆ పేరే అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తమిళనాడు రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఆయన పార్టీ నాయకత్వం చేపట్టిన నాటి నుంచే సంచలనాలకు కేంద్రమయ్యారు. ఇప్పుడు ఆయన ప్రతిష్ట, సాహసం, నిశిత పరిశీలన రాష్ట్రాన్ని దాటాయి. దేశం అంతా ఆయన గురించే మాట్లాడుకునేటట్టు చేశాయి. ఆయన పై అందరిలో ఎందుకు ఇంత ఆసక్తి? ఎందుకు మీడియా ముఖ్యంగా జాతీయ మీడియా ఆయన వెంట పడుతోంది? దేశంలోని ప్రధాన టీవీ ఛానల్స్ అన్నీ ఎందుకు ఆయన ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతున్నాయి. ఎందుకు సదస్సులకీ, గోష్టులకీ పిలిచి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయి? ఆయన ఇంటర్వ్యూలు ఒకటి తర్వాత ఒకటిగా దేశంలో ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ ఎందుకు ప్రసారం చేస్తున్నాయి? ప్రాంతీయ ఛానల్స్‌లోనూ ఆయన పేరు ఎందుకు మారుమోగి పోతోంది? ఈ అన్నిటినీ మించి అన్నామలై పేరు వినగానే అధికార పార్టీలో ఎందుకు ప్రకంపనలు, ప్రకోపాలు పుట్టుకొస్తున్నాయి? ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‌బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా అన్నామలై పై ఎందుకు కస్సుబుస్సు మంటోంది? ఎందుకు స్టాలిన్‌ ‌కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‌సహా డీఎంకే పరివార భోక్తలు కోట్లలో (రూ.1,400 కోట్లు) పరువు నష్టం దావా వేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు? ఉదయ్‌నిధి, టీఆర్‌ ‌బాలు, కనిమొళి అంతా పరునష్టం దావాల కోసం క్యూ కట్టారు. నోటీసులతో అయన నోరు మూయించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?అంటే, ఈ అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం వస్తుంది. ఆ సమాధానమే ‘డిఎంకే ఫైల్స్’. ‌బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి తన ఆరోపణలు సంధిస్తున్నారు అన్నామలై. ఈ ద్రవిడ పార్టీ, అది ప్రచారం చేస్తున్న ‘ద్రవిడ నమూనా’ల అసలు రూపు, రంగు ఏమిటో ప్రజలకు తెలియచేయడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ ఫైల్స్‌లో మొత్తం 35 మంది అవినీతి చిట్టాలు ఉన్నాయి. వాటి సేకరణ కోసం ఆరు మాసాలు శ్రమించవలసి వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి సూర్యనారాయణన్‌ ‌చెప్పారు.


ఆట మొదలైంది

ఉదయ్‌నిధి స్టాలిన్‌, ‌స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌, ఒకే ఒక్క సంవత్సరంలో రూ.30 వేల కోట్లు అక్రమాస్తులు కూడపెట్టారని తమిళ నాడు ఆర్థిక మంత్రి పి.త్యాగరాజన్‌ (‌పీటీఆర్‌) ‌పేరిట వైరల్‌ అవుతున్న వీడియో మరింత సంచలంగా మారింది. ఇందుకు సంబంధించి, ప్రధానంగా స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌, ‌ప్రాధాన ప్రమోటర్‌గా ఉన్నట్లు చెపుతున్న రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ జీ స్క్వేర్‌’ ‌సంస్థ కార్యాల యాలపై ఏప్రిల్‌ 24‌న ఐటీ సోదాలు జరిగాయి. అది కూడా ఎక్కడో ఒక దగ్గ్గర కాదు..చెన్నై, హైదరాబాద్‌, ‌బెంగుళూరు, తిరువనంతపురం సహా దేశంలో మొత్తం 50 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న డిఎంకే నాయకుల ఇళ్లపైనా సోదాలు నిర్వహించారు.

డీఎంకే ఎమ్మెల్యే మోహన్‌, ఆయన కొడుకు కార్తీక్‌, ‌మరికొందరు ఈ రియల్టర్‌ ‌సంస్థలో భాగస్వాములు. అన్నానగర్‌లో ఆడిటర్‌ ‌షణ్ముగం నివాసంలోను, ఇంకా చెన్నైతో బాటు ఆళ్వార్‌ ‌పేట్‌, ‌కోయంబత్తూరు, తిరుచ్చి వంటి చోట్ల గల ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇక చెన్నై సహా తిరుచ్చి, కోయంబత్తూరు, కర్ణాటక లోని హోసూర్‌, ‌బెంగుళూరు, మైసూర్‌, ‌బళ్లారితో బాటు తెలంగాణలోని వివిధ చోట్ల ఐటీ సిబ్బంది నిర్విరామంగా తమ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు, డిఎంకే ఫైల్స్’‌కు ఏదైనా సంబంధం ఉందా? లేక కంపెనీ ప్రకటించిన విధంగా ఇవి రొటీన్‌ ‌సోదలేనా అనేది తేలవలసి ఉంది. అయితే, ఐతే సోదాలతో అట మొదలైందని అనుకోవచ్చని ఇటు డిఎంకే అటు బీజేపీ వర్గాలు అంటున్నాయి.అందుకే ఈ ప్రకంపనలు, అందుకే ఈ ప్రకోపాలు. అందుకే అన్నామలై చుట్టూ మీడియా పరుగులు.

About Author

By editor

Twitter
Instagram