– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ ఆకాశవాణి ప్రసంగం ‘మన్‌ ‌కీ బాత్‌’ (‌మనసులో మాట). గత ఏప్రిల్‌ 30 ‌నాటికి వందో ఎపిసోడ్‌ ‌పూర్తిచేసుకోవడం ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించే అంశం. నిజం చెప్పాలంటే మోదీ నిర్వహించిన ఈ కార్యక్రమం సమైక్యంగా ముందుకు సాగడం వల్ల కలిగే ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు తెలియజేయడమే కాదు ‘కలిసి ముందుకు సాగడం’ అనే జాతి ధర్మాన్ని గుర్తుచేసింది. ‘చరైవేతి… చరైవేతి’ (నిరంతరం ముందుకు సాగడం) అనేది మన స్వధర్మం. ఉమ్మడిగా ముందుకు సాగితే సాధ్యంకానిది ఏమీ ఉండదనేది భారతీయ సనాతన ధర్మం చెబుతున్న సత్యం.మన్‌ ‌కీ బాత్‌ ‌ప్రధాని దృష్టిలో ఒక ‘ఆధ్యాత్మిక ప్రయాణం’.

భగవంతుడిని పూజించినప్పుడు ఆయన పాదాల వద్ద ప్రసాదాన్ని ఉంచుతాం. అదేవిధంగా ‘జనతా-జనార్దన్‌’ అనే భగవానుడి పాదాల వద్ద ఈ ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌ప్రసాదం వంటిదే అన్నది మోదీ అభిప్రాయం! వ్యష్టి జీవనశైలిలో ఆధ్యాత్మికత, సుస్థిరతల సాధనకు అవసరమైన సాంస్కృతిక నేపథ్యం ఇందులో ఇమిడి ఉంది. మన సాంస్కృతిక మూలాలను 21వ శతాబ్దంలో పునరుజ్జీవింపజేసిన శక్తిమంతమైన సాధనంగా దీన్ని చెప్పవచ్చు. ప్రధాని మాటల్లో చెప్పాలంటే మన్‌ ‌కీ బాత్‌ ఒక దండలోని దారం వంటిది. పూసలను, పూలను ఒక్కటొక్కటి గుచ్చడానికి దారమే ఆధారం. ఆయన ప్రతి ఎపిసోడ్‌లో వివరించిన సేవా స్ఫూర్తి, దేశంలోని పౌరుల సామర్థ్యాలు ఆ దండలోని పూసలు! ఆరోగ్యకరమైన, సౌభాత్రంతో కూడిన దృఢమైన సమాజం కోసం ప్రధాని ఎంచుకున్న మార్గమిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఎపిసోడ్‌ల ద్వారా నరేంద్ర మోదీ కేవలం ఒక ప్రధానిగా కాకుండా ఒక కుటుంబ పెద్దగా భావాలు పంచుకుంటున్నట్టు, విషయావగాహన కలిగిస్తున్నట్టు ఉంటుంది. ఈ ఎపిసోడ్లలో ఎంచుకున్న అంశాలు సమాజాన్ని చైతన్య పూరితం చేయడానికి దోహదం చేసేవే. ఇన్ని ఎపిసోడ్‌లలోనూ మోదీ ఎప్పుడూ రాజకీయాలను, సున్నితమైన అంశాలను ప్రస్తావించకపోవడం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనం.

ఐక్యరాజ్య సమితిలో ప్రసారం

ఈ వందో ఎపిసోడ్‌ను న్యూయార్క్ ‌నగరంలోని ఐక్యరాజ్యసమితిలో ప్రత్యక్ష ప్రసారం చేయడం నిజంగా చరిత్రాత్మకం. సమితి ట్రస్టీషిప్‌ ‌కౌన్సిల్‌ ‌ఛాంబర్‌లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారత్‌లోనే కాకుండా 150 దేశాల్లో ఇది ప్రసార మైంది. మన్‌కీ బాత్‌ను 52 భాషల్లో అనువదించ డానికి ప్రసారభారతి చర్యలు తీసుకుంది. మన దేశంలో ఆకాశవాణితో పాటు దూరదర్శన్‌ 34 ‌ఛానళ్లు, మరో వంద ప్రైవేటు ఛానళ్లు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. మన్‌ ‌కీ బాత్‌ ‌ప్రారంభం నుంచి దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించేందుకు ఉపయోగపడిందనే చెప్పాలి. నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇది కేవలం విశ్వాసం, ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు ఇతరులలోని మంచి లక్షణాలను తెలుసుకొనే ఉత్తమ మాధ్యమం కూడా.

సరికొత్త నాయకత్వ శైలి

ప్రజాస్వామ్య సుస్థిరతకు ఇటీవల ‘సోషల్‌ ‌కేపిటల్‌’ ‌భావన ముందుకు వచ్చింది. ఇది ఎంతగా ముందుకు వచ్చిందంటే ఇప్పటివరకు ప్రజాస్వామ్య పనితీరుకు ప్రధానమైందిగా పరిగణిస్తున్న ‘లీడర్‌షిప్‌ ‌కేపిటల్‌’‌ను కూడా వెనక్కి నెట్టేసింది. లీడర్‌షిప్‌ ‌కేపిటల్‌ అం‌టే నాయకుల్లోని సామాజిక సమస్యలను పరిష్కరించే సామర్థ్యం. అయితే మన్‌ ‌కీ బాత్‌ ‌ద్వారా నరేంద్ర మోదీ అనుసరిస్తున్న పరస్పర ప్రభావశీలక రాజకీయ నాయకత్వ శైలి ఇతరత్రా రాజకీయ నాయకత్వ నమూనాలకు భిన్నం. ముఖ్యంగా మీడియా అత్యంత చురుగ్గా ఉన్న నేటికాలంలో, ప్రజాకర్షక విధానాలకే ప్రాధాన్యమిస్తున్న రాజకీయ నమూనాలను తోసిరాజన్న వినూత్న పద్ధతి ఇది. అంతేకాదు ‘ప్రేరణాత్మక భాషా సిద్ధాంతాన్ని’ (ఎంఎల్‌టీ- మోటివేటింగ్‌ ‌లాంగ్వేజ్‌ ‌థియరీ)ను మోదీ ఉపయోగిస్తున్న తీరుకు మన్‌ ‌కీ బాత్‌ అద్భుత మైన ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ ప్రేరణా భాషను సమయానుకూలంగా ఎప్పటికప్పుడు అవసరమైన రీతిలో వివిధ కోణాల్లో ఉపయోగించ డానికి మన్‌ ‌కీ బాత్‌ ‌నరేంద్రమోదీకి ఒక గొప్ప ఉపకరణంగా మారింది. ఇక్కడ మాత్రమే కాదు, అవసరమైన ప్రతిచోట ఆయనలోని ఈ నైపుణ్య ప్రయోగ సామర్థ్యం ఒక మహత్వ ఉత్ప్రేరకంగా పనిచేసి సమర్థుడైన జాతీయ నాయకుడిగా నిలబెట్టింది.

 మొదటి ‘మనసులో మాట’ 2014లో

‘మనసులో మాట’ను మొట్టమొదటిసారి ఆకాశవాణి ద్వారా వినిపించింది అక్టోబర్‌ 3, 2014‌న. ఆరోజు విజయదశమి పర్వదినం. అప్పటినుంచి ఇప్పటివరకు మన్‌కీ బాత్‌ ‌ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమవుతూ వస్తోంది. ప్రధాని తన వరుస ప్రసంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు, సామర్థ్యాలు కలిగిన 500 మంది భారతీయుల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌దేశంలోని 23 భాషల్లో, 29 మాండలికాల్లో అనువాదం అవుతున్నదంటే ఇది జన బాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో చెప్పాల్సిన పనిలేదు.ఈ మన్‌ ‌కీ బాత్‌లో ప్రజలకే ప్రాధాన్యం. దేశంలో విస్తారమైన సామాజిక వేదికను చేరడానికి ఉపయోగ పడిన ‘బ్రహ్మాస్త్రం’! ఒక్కమాటలో చెప్పాలంటే ఒక దేశ నాయకుడు ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించే ‘నివేదిక’! ప్రభుత్వం కాలానుగుణంగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, అందుకు కారణాలను ప్రజలకు వివరించడానికి మన్‌ ‌కీ బాత్‌ ఒక మాధ్యమంగా ఉపయోగడింది. మన్‌ ‌కీ బాత్‌ ఇం‌తగా విజయం సాధించడానికి కారణం, వివిధ రంగాల్లో వ్యక్తులు సాధించిన విజయాలను వివరించడం ద్వారా మోదీ ప్రజల్లో ప్రేరణ కలిగించడానికి యత్నించడం. ఇది మన జాతి శ్రేష్టత స్థాయి ఏ విధంగా ఉన్నదనేది ప్రజల్లో అవగాన కలిగించింది. ఇందులోని మరో ముఖ్యాంశం- ప్రాంతీయ క్రీడలు, పర్యాటకం, వ్యవసాయం, పురస్కారాలను ప్రస్తావించి, మన్నించడం. దీనివల్ల నిర్లక్ష్యానికి గురైన ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి క్ష్యాలను నిర్దేశించడానికి వీలుకలిగింది.మన్‌ ‌కీ బాత్‌లో ప్రధాని పండుగలు, కళారూపాలు, వారసత్వం, ప్రదేశాలు, ప్రజలు, గొప్ప వ్యక్తుల గురించి ప్రస్తావించడం ద్వారా సాంస్కృతిక ఔన్న త్యాన్ని తెలియజెప్పడానికి యత్నించారు. తన వందో ఎపిసోడ్‌ ‌లో లక్షద్వీపాలకు చెందిన కుమ్మెల్‌ ‌సోదరుల ఛాలంజెర్స్ ‌క్లబ్‌, ‌కర్ణాటకలో కావెంశ్రీ కళాచేతన మార్చ్‌ల గురించి ప్రస్తావించారు. మన్‌ ‌కీ బాత్‌ల్లో 300 సార్లు సాంస్కృతిక అంశాల ప్రస్తావన ఉంది.

 ప్రజల జీవనశైలి, వ్యాధులు, వాతావరణ మార్పులు, ఆహార నిర్వహణ, నైరాశ్యం, మానసికా రోగ్యం, డిజిటల్‌ ఎకానమీ, స్వచ్ఛభారత్‌ ‌మిషన్‌, ఆత్మనిర్భర్‌ ‌భారత్‌, ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌, ‌బాలికల విద్య, సాధికారత, సాంకేతికతలో యువత పాత్ర, నీటి సంరక్షణ, పరీక్షల వత్తిడిని అధిగ మించడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, రోడ్డు భద్రత, మత్తు మందుల నిరోధం, ఆర్థిక సమ్మిళితత్వం, విభిన్న ప్రభుత్వ పథకాలు, విధానాల వంటి అంశాలను ఎంపిక చేసుకున్నారు. సాధారణ భారతీయులు సాధించిన అద్భుత విజయాలను ప్రస్తావిస్తూ, సామాజిక చైతన్యం కలిగించడమే ప్రధాన లక్ష్యంగా ఇది సాగింది.మన్‌ ‌కీ బాత్‌ ఎపిసోడ్‌లలో 15% నుంచి 20% వరకు సమయం సాంస్కృతిక అంశాల ప్రస్తావనే ఉండటం గమనార్హం. రోజువారీ జీవన అంశాల ద్వారా పౌరులతో అనుసంధాన మయ్యేం దుకు, వారిలో తమ సాంస్కృతిక మూలాల విష యంలో ఆసక్తిని పునరుజ్జీవింపజేసేందుకు ఇదెంత గానో ఉపయోపడింది. ఇంతేకాదు, శ్రోతలను జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం ఆయన ప్రత్యేకత. అంతే కాదు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఇదొక మూలస్తంభంగా మారిందంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తావించిన అంశాలు

మన్‌ ‌కీ బాత్‌లో ప్రస్తావించిన అంశాలు ఎంచుకొన్న తీరు మోదీ నైశిత్యం, వైశాల్యం చాటుతాయి. మహిళలు, యువత, రైతులు వంటి అన్ని రకాల సామాజిక వర్గాలను ప్రస్తావించారు. త్రిపురలోని పనస పండు ప్రత్యేకత గురించి (77వ ఎడిషన్‌ ‌మే30, 2021), తమిళనాడుకు చెందిన గిరిజన మహిళలు పర్యావరణ హితమైన మట్టి కప్పులను తయారుచేస్తున్న అంశాన్ని (94వ ఎడిషన్‌ అక్టోబర్‌ 30, 2022), ‌యూరప్‌లో ఆంటోనియట్టా రోజీ ఏవిధంగా యోగాను బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చిందీ (54వ మన్‌ ‌కీ బాత్‌ ఎపిసోడ్‌)‌లో మోదీ వివరించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ చలనచిత్ర నిర్మాతలు కెన్‌జి యోషీ-జీ, మాట్సువో- జీలు జపాన్‌ ‌భాషలో రామాయణంపై పలు చిత్రాలను నిర్మించిన సంగతిని తన 89వ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. 75వ ఎపిసోడ్‌లో అస్సాంకు చెందిన సికారీ టిస్సో, కర్బీ భాషకోసం ఏవిధంగా తన జీవితకాల పర్యంతం కృషిచేసింది తెలియజెప్పారు. ఛత్తీస్‌గడ్‌లోని దియోర్‌ ‌గ్రామంలోని స్వయం సహాయక గ్రూపు మహిళలను ప్రస్తావించారు. గ్రామంలో రోడ్లు, దేవాలయాలు, కూడళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై చేస్తున్న ప్రచారాన్ని ఆయన ప్రశంసించారు. తమిళనాడులో 20వేల మంది మహిళలు వెల్లూరులోని నాగ్‌ ‌నదిని పునరుద్ధరించడానికి ముందుకు రావడం వంటి మహిళల సంఘటిత శక్తిని ప్రతిబింబించే అంశాలకు ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌వేదికగా నిలిచింది. దేశంలో గత 40ఏళ్లుగా పడావు భూముల్లో, కొండలపైన మొక్కలను నాటే కార్యక్రమం కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు. మూడు దశాబ్దాలుగా నీటి సంరక్షణ కోసం దిగుడుబావులను, కుంటలను ఎంతోమంది తవ్వకాలు కొనసాగిస్తున్నారు. గత 25-30 ఏళ్లుగా గ్రామాల్లో ఎంతో మంది బలహీన వర్గాల పిల్లలకు చదువులు చెబుతూ వస్తున్నారు. మరికొందరు నిరుపేదలకు వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు నిస్వార్థంగా చేపట్టే పనులు మన్‌ ‌కీ బాత్‌లో చోటుచేసుకున్నాయి. ప్రస్తావించిన ప్రధానిని, వింటున్న శ్రోతలను భావోద్వేగానికి గురిచేసిన అంశాలివి. అందుకే మన్‌ ‌కీ బాత్‌కు ఇంతటి ప్రాధాన్యత, ప్రాచుర్యం!

 ప్రజల భాగస్వామ్యం

మన్‌ ‌కీ బాత్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలనుంచి వారి లోని ఆలోచనలు, సలహాలు, సూచనలు కోరడం మరో కోణం. దీనివల్ల ప్రజలు తమ సందేశాల ద్వారా ప్రధానమంత్రి కార్యాలయంతో పారదర్శకతను పెంచుకోవడం సానుకూల పరిణామం. ఇది నిజంగా ప్రజా స్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. మొదటి పదిహేను మన్‌ ‌కీ బాత్‌ ఎపిసోడ్‌లకు వెబ్‌సైట్‌ ‌ద్వారా 61వేల అభిప్రాయాలు, 1.43లక్షల ఆడియో రికార్డులు అందాయి. ప్రతినెల కొన్ని ఎంపిక చేసిన అంశాలు ప్రసారంలో భాగం చేశారు. జూన్‌ 2,2017 ‌నుంచి ఈ మన్‌ ‌కీ బాత్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు చేరువ కావాలన్నదే దీని ముఖ్యోద్దేశం. రోహతక్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సర్వే ప్రకారం ప్రతినెల మన్‌ ‌కీ బాత్‌ ‌ప్రేక్షకులు లేదా వీక్షకుల సంఖ్య 23 కోట్లు! దేశం మొత్తం మీద కనీసం ఒక్కసారైనా మన్‌ ‌కీ బాత్‌ ‌విన్నవారి సంఖ్య వందకోట్లు! మన్‌కీ బాత్‌ ‌కార్యక్రమాన్ని ఎక్కువగా మెట్రోపాలిటన్‌ ‌నగరాల్లోని ప్రజలు ఆస్వాదించారు. ఈ కార్యక్రమంపై 2014లో ముంబై, చెన్నై వంటి ఆరు నగరాల్లో సర్వే నిర్వహించగా 66.7% జనాభా మన్‌ ‌కీ బాత్‌ను విన్నట్టు తేలింది. అయితే 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌బిహార్‌ ‌రాష్ట్రాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వింటుండగా, ఆంధప్రదేశ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ల్లో దీనిపై తక్కువ అవగాహన కలిగివున్నారు. మన్‌ ‌కీ బాత్‌ 50‌వ ఎపిసోడ్‌ 2018, ‌నవంబర్‌ 25‌న ఆకాశవాణిలో ప్రసారమైంది. సరిగ్గా ఇది ప్రసారం కావడానికి వారం ముందు ఆకాశవాణి టెలిఫోన్‌ ‌ద్వారా ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం ప్రేక్షకులపై అత్యంత ప్రభావం కలిగించినవి ‘సెల్ఫీ విత్‌ ‌డాటర్‌’, ‘ఇన్‌‌క్రెడిబుల్‌ ఇం‌డియా’, ‘ఫిట్‌ ఇం‌డియా’, ‘సందేష్‌ ‌టు సోల్జర్స్’ అని తేలింది. ఇక గుర్తుంచుకోదగ్గ ముఖ్యమైన అంశాలుగా ‘ప్రొమోషన్‌ ఆఫ్‌ ‌ఖాదీ’, ‘డ్రగ్‌ ‌ఫ్రీ ఇండియా’, ‘టీమ్‌ ‌తరిణి’ (ఇది భారత నేవీకి చెందిన రెండో సెయిల్‌ ‌బోట్‌. ‌దీన్ని గోవాలోని అక్వారియస్‌ ‌షిప్‌యార్డ్‌లో నిర్మించారు) నిలిచాయి.మన్‌ ‌కీ బాత్‌ 60‌వ ఎపిసోడ్‌ ‌తర్వాత డిసెంబర్‌ 29, 2019‌న ‘హిందుస్తాన్‌ ‌టైమ్స్’ ఇం‌దులో ఉపయోగించిన పదాలపై ఒక అధ్యయనం చేసింది. ఆ ఏడాది మన్‌ ‌కీ బాత్‌ల్లో ఎక్కువగా ఉపయోగించిన పదాలు ‘‘ఇండియా’’, ‘‘నేషన్‌’’. అదేవిధంగా ‘వాటర్‌’ ‌పదాన్ని 73 సార్లు, ‘యూత్‌’,‘‌యంగ్‌’ ‌పదాలను వరుసగా 30, 54 సార్లు ఉపయోగిం చినట్టు ఈ అధ్యయనం పేర్కొంది.

సానుకూల ప్రభావం

ఏప్రిల్‌ 26‌న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘మన్‌కీ బాత్‌ -100’‌పై ప్రముఖ బాలీవుడ్‌ ‌నటుడు అమీర్‌ఖాన్‌, ఐ.‌పి.ఎస్‌. ఆఫీసర్‌ ‌కిరణ్‌బేడీ, భారతీయ బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌లు మాట్లాడుతూ నరేంద్రమోదీ విధానాలు ఏవిధంగా దేశ ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతున్నదీ చక్కగా వివరించారు. ‘టార్గెట్‌ ఒలింపిక్‌ ‌పోడియం స్కీం’ (టీఓపీఎస్‌), ‌ఖేలో ఇండియా కార్యక్రమాలు అథ్లెట్స్ ‌విషయంలో ఏవిధంగా గేమ్‌ ‌ఛేంజర్‌గా మారిందీ నిఖత్‌ ‌జరీన్‌ ‌చక్కగా వివరించారు. ఈ పథకం వల్ల అథ్లెట్లు నిధుల కోసం బెంగపడకుండా కేవలం తమ క్రీడానైపుణ్యం పైనే దృష్టి కేంద్రీకరించే వాతావరణం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. టీఓపీఎస్‌, ‌ఖేలో ఇండియా పథకాలను కేంద్ర ప్రభుత్వం 2014, 2018ల్లో ప్రవేశపెట్టింది. ప్రధాని తనతో ‘చాయ్‌ ‌పే చర్చ’ గురించి మాట్లాడినప్పుడు, అంగవైకల్యం కలిగిన వారిని ‘దివ్యాంగులు’గా వ్యవహరించాలని ప్రజలను కోరిన సంగతిని ఆమె గుర్తు చేసుకున్నారు. దీనిపై అప్పట్లో సోషల్‌ ‌మీడియాలో ప్రతిస్పందన తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఒక్కటే ‘‘వైకల్యాన్ని అధిగమించి ఉన్న సామర్థ్యాలను’’ గుర్తించాలని! అమీర్‌ఖాన్‌ ‌మన్‌ ‌కీ బాత్‌ను ఒక ప్రజా ఉద్యమంగా పేర్కొంటూ, ప్రతినెల ప్రధాని తన ప్రసంగాల ద్వారా దేశ ప్రజలతో విశ్వసనీయ సంబం ధాన్ని బలీయంగా ఏర్పరచుకోగలిగారన్నారు. విశ్వాసం అనేది ఒక్కసారిగా కలిగేది కాదు… క్రమంగా నిర్మించుకోవాలి అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ ‌భవన్‌లో జరిగిన ఈ ‘మన్‌కీ బాత్‌ 100’ ఉత్సవాల్లో, ప్రధాని తన 99 ఎపిసోడ్‌లలో ప్రస్తావించిన 500 మందిలో 105 మందిని ఆహ్వానించారు. మన్‌ ‌కీ బాత్‌కు సంస్మరణగా ఒక తపాలా బిళ్లను, ఒక నాణేన్ని విడుదల చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాటల్లో చెప్పాలంటే మన్‌ ‌కీ బాత్‌ ఆకాశవాణికి కొత్త జీవితాన్నివ్వడమే కాకుండా, దాన్ని యువజనుల్లోకి తీసుకెళ్లింది. 2015లో ఆకాశవాణి సాధారణ ప్రకటనల స్లాట్లు పది సెకండ్లకు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉంటే మన్‌ ‌కీ బాత్‌కు మాత్రం పదిసెకండ్ల స్లాట్‌కు రూ.2లక్షలుగా ఉండటం దీనికున్న ప్రజాదరణకు నిదర్శనం.

అతిథిగా బరాక్‌ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా జనవరి 27, 2015న మన్‌ ‌కీ బాత్‌ ‌నాలుగో ఎపిసోడ్‌లో అతిథిగా పాల్గొన్నారు. అప్పట్లో ఆయన గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా సెప్టెంబర్‌ 29, 2019‌న ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ అతిథిగా పాల్గొన్నారు. ఈ షో సందర్భంగా మోదీతో మాట్లాడటానికి డాక్టర్లు, ప్రేక్షకులను అతిథులుగా ఆహ్వానించారు కూడా. ఇక మన్‌ ‌కీ బాత్‌ ‌విషయంలో ప్రశంసలు, విమర్శలు రెండూ ఉన్నాయి. ప్రజలతో ప్రధాని అనుసంధాన మవడానికి ఇది ఉపయోగపడిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇది ఏకపక్షంగా జరిగిందనేది విమర్శకుల మాట. కొద్దిమందికి మాత్రమే ఇది చేరుకున్నదని, చర్చించిన అంశాలపై విశ్వసనీయ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనేది కూడా విమర్శకులు ఎత్తి చూపుతున్న అంశం. సంక్లిష్టమైన అంశాలపై మరింత లోతుగా చర్చించే అవకాశం కల్పించలేదనేది కూడా మరో విమర్శ. పరిమిత సమయంలో జరిగే ఇలాంటి కార్యక్రమాల వినిపించిన ఈ విమర్శలు పేలవంగానే ఉన్నాయి. వీటి మాట ఎలా ఉన్నా, ప్రభుత్వ అజెండాను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ల గలిగిందన్నది మాత్రం అక్షర సత్యం.


సామాన్య ప్రజల అసామాన్య సేవలకు ప్రశంస

దేశ నిర్మాణం, సమాజ పురోగతిలో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని మోదీ తన కార్యక్రమంలో తప్పనిసరిగా ప్రస్తావించి ప్రశంసించేవారు. వ్యక్తులు, బృందాలు సాధించిన ఎన్నో విప్లవాత్మకమైన విజయాలను ఆయన ఇందులో పరిచయం చేశారు. ఆయన ప్రస్తావించిన తరువాత ఆ విజయాలు ఎంత ఘనమైన దేశ ప్రజలకు మరింత స్పష్టంగా తెలిసేవి. తమిళనాడులో వెల్లూరు దగ్గర నాగ్‌ అనే నదిని క్షాళన చేయడానికి స్థానికులు చేసిన కృషినే కాదు, 2021లో జేలం జిల్లాలోని నూన్‌ ‌నదిని క్షాళన చేయడానికి గ్రామస్థులు చేసిన కృషిని కూడా దేశం దృష్టికి తీసుకువెళ్లారు. తంజావూరు బొమ్మలు అక్కడి పేదల కష్టాలను ఎలా తీర్చాయో ఒకసారి పరిచయం చేశారు. తమిళనాడుకు చెందిన కేసీ మోహన్‌ ఒక సెలూన్‌ అధిపతి. కరోనా కాలంలో ఆయన తన జేబులో నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి బాధితుల ఆకలి బాధ తీర్చారు. గోదావరిలో చెత్తను తొలగించే పనిని చేపట్టిన నాసిక్‌ ‌వాసి చంద్రకిశోర్‌ ‌పాటిల్‌ను, కశ్మీర్‌లోయలో పిల్లల చదువుల కోసం కృషి చేసిన జావెద్‌ అహ్మద్‌ను, నీటి సంరక్షణ కోసం పాటు పడిన హజారీబాగ్‌ ‌సామాజిక సేవా కార్యకర్త దిలీప్‌ ‌కుమార్‌ ‌రవిదాస్‌ను మోదీ తన కార్యక్రమంలో ప్రశంసించారు.

ప్రజల కోసం 100 మరుగుదొడ్లు నిర్మించిన దిలీప్‌ ‌సింగ్‌ ‌మాలవీయను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. దినసరి కూలితో బతికే దిలీప్‌ ‌వృత్తికి తాపీ మేస్త్రి. ఎవరైనా ఇటుకలు, సిమెంట్‌ ‌వంటివి సమకూర్చుకుంటే ఉచితంగా మరుగుదొడ్డిని నిర్మించి ఇచ్చాడు. సిక్కింలోని సోంగో సరస్సును శుభ్రం చేసే పనిని చేపట్టిన సేంజె షెర్పాను, కేవలం వాతావరణ సూచనను అందరికీ తన వెబ్‌సైట్‌ ‌ద్వారా నిత్యం అందించిన సాయి ప్రణీత్‌ (ఆం‌ధప్రదేశ్‌), ‌తన గ్రామంలో బహిరంగ మల విసర్జన లేకుండా చేసిన జవాన్‌ ‌వికాస్‌ ‌ఠాకూర్‌ (‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌)‌ను కూడా ప్రధాని తన కార్యక్రమంలో పరిచయంచేశారు. వికాస్‌ ‌గ్రామ పంచాయతీలతో మాట్లాడి మరుగు దొడ్లు నిర్మింప చేశారు. తన వంతుగా రూ. 57,000 విరాళం కూడా ఇచ్చాడు. కర్ణాటకలోని మాండ్యా  ప్రాంత వాసి కామె గౌడ ఏనిమిది పదుల వయసు ఉన్న రైతు. ఇతడు పశువులను మేతకు తీసుకువెళ్లి అవి మేత మేస్తుండగా చిన్న చిన్న చెరువులు తవ్వే పని చేసేవాడు. అతడు తవ్విన 16 చెరువులతో అక్కడ నీటి కొరత తీరింది. ఈయన గురించి కూడా ప్రధాని మన్‌ ‌కి బాత్‌లో ప్రస్తావిం చారు. వీరందరూ సామాన్య ప్రజలు. ఉన్నత విద్యావంతులు కాదు. కోటీశ్వరులు అసలే కాదు. అయినా సమాజం పట్ల తమ బాధ్యతను నిస్వార్థంగా చేశారు. అదే ప్రధాని మనసును దోచింది.


‘మోదీ మాటతో పునరంకితమవుతున్నాను’

పడిలేస్తున్న ఏటికొప్పాక లక్కబొమ్మల పరిశ్రమ స్థిరంగా ఉండాలంటే పూర్తిస్థాయి హస్తకళల శిక్షణాలయం అవసరం. దీనివల్ల ఆదరణతోపాటు కొత్త తరానికి జీవనోపాధి లభిస్తుంది. నైపుణ్యం పెరుగుతుంది. ప్రపంచ పటంలో భారతీయత సత్తాచాటుకోవచ్చు.  ఇప్పటికే మేం ‘సృజన’ పేరిట ఏడాదికి ఒకసారి వర్క్‌షాప్‌ను నిర్వహించుకుంటున్నాం. భారతీయ కళలను తర్వాత తరానికి పరిచయం చేయాలంటే ప్రభుత్వాల సహకారం అవసరం. కులవృత్తులను గౌరవించే సంప్రదాయం పటిష్టం కావాలి. బొమ్మల విక్రయాలు 2007లో మందగించడంతో సంతోషంగా ఉన్న కళాకారులు కొంత డీలా పడ్డారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ నాతో మాట్లాడడంతో కొండంత ధైర్యం వచ్చింది. నాలుగైదు తరాల నుంచి ఇక్కడి కళాకారులకు కూడుపెడుతున్న లక్కబొమ్మల పరిశ్రమను ఎలాగైనా నిలుపుకోవాలని దృఢ నిశ్చయానికి వచ్చాను.

– చింతలపాటి వెంకటపతిరాజు (ఏటికొప్పాక),  జాగృతి 2020 దీపావళి ప్రత్యేక సంచిక నుంచి


పేరు ఎలా పెట్టారు?

‘మనసులో మాట’ చరిత్ర సృష్టించింది. మాటల కందని విజయమైంది. తనకు ఆకాశవాణి మధ్యమం ద్వారా సాటి భారతీయులతో మాటామంతీ జరపాలన్న ఒక కోరికను నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టిన కొన్ని వారాలకే వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో ఆయన మదిలోకి వచ్చిన ఆలోచనకు ఆకృతిని ఇవ్వడానికి గుజరాత్‌ ‌నుంచి వచ్చి ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఒక బృందం నడుం కట్టింది.మొదట ఎలాంటి పేరు పెట్టాలన్న మథనం జరిగింది. అది దేశమంతటినీ కదిలించాలి. పీఎంకే సాథ్‌, ‌వార్తా మోదీ, మోదీ వాణి ఇలా కొన్ని పేర్లు అనుకున్నారు. కానీ తృప్తి కలిగించలేదు. ఆఖరికి మోదీనే సంప్రతించాలని అనుకున్నారు. చాలా ప్రశాంతంగా దాని కోసం అంత ఆలోచన ఎందుకు సాధారణమైన పేరు పెడితే చాలు అన్నారు. అలా అటు ప్రధాని హోదాని గాని, ప్రభుత్వ జాడ గాని లేకుండా మన్‌ ‌కీ బాత్‌ అన్న పేరు వచ్చింది. మళ్లీ వారంలో ఏ రోజున ఏ సమాయానికి ప్రసారం కావాలన్న అంశం మీద చర్చ జరిగింది. అంతిమంగా ఆదివారం, ఉదయం 11 గంటలకు ప్రసారం చేయాలని అనుకున్నారు. అలాగే నెలకి ఒకసారి మాత్రమే అని కూడా నిర్ణయించారు. అన్నీ నిర్ణయించాక అనుకున్నట్టు ఆ సెప్టెంబర్‌లో తొలి మన్‌ ‌కీ బాత్‌ ‌ప్రసారం కాలేదు. చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు కావడం వల్ల, మోదీ అమెరికా పర్యటనల కారణంగా అంతా హడావిడి అయింది. అంతిమంగా అక్టోబర్‌ 2‌న స్వచ్ఛ భారత్‌ ఆరంభమైన తరువాత మరునాడు విజయదశమికి మన్‌ ‌కీ బాత్‌ ‌మొదటి కార్యక్రమం ప్రసారమైంది. ఈ కార్యక్రమాన్ని 2018-2020 మధ్య ఆరు నుంచి 14 కోట్ల మంది విన్నారు. 2014లో ఈ కార్యక్రమం ఆరంభమైన తరువాత ఆకాశవాణికి లభించిన ఆదాయం రూ. 33.16 కోట్లు. ఈ కార్యక్రమం కోసం చేసిన వ్యయం 7.29 కోట్లు. 2017-18 మధ్య మన్‌ ‌కి బాత్‌తో అత్యధికంగా 10.64 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.

తన తొలి కార్యక్రమంలో మోదీ ఖాదీ ధరించవలసిందని దేశానికి విజ్ఞప్తి చేయడం విశేషం. దేశంలో కొవిడ్‌ 19 ‌వంటి మహమ్మారి విజృంభించినప్పుడు, ఇతర దారుణ వైపరీత్యాలు సంభవించినప్పుడు మోదీ ఈ కార్యక్రమం ద్వారా సాంత్వన వచనాలు పలకడమే కాదు, ధైర్యం చెప్పేవారు. బాధితులు నిరాశకు లోనుకాకుండా తన వంతు ప్రయత్నం చేసేవారు. బధిరుల కోసం మన్‌ ‌కీ బాత్‌ను సంకేతాల ద్వారా వివరించిన కేరళ వాసి ఎస్‌కె మంజును కూడా ప్రధాని అభినందించారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram