– కాశింశెట్టి సత్యనారాయణ

‘‘హైదరాబాద్‌ ‌నవాబు దగ్గరకి ఈస్ట్ ఇం‌డియా కంపెనీవారు సుమారు నలభై సంవత్సరాల క్రితం స్నేహంగా ప్రవేశించి ఆరు సైనిక పటాలాలను వారి ఆధీనంలో సికింద్రాబాద్‌ ‌వుంచి, ఆ పటాల జీతాలకు గానూ కడప, బళ్ళారి జిల్లాలను రెంటిని నవాబు వద్ద నుండి జాగీరుగా తీసుకొని అనుభవిస్తున్నారు. రాజ్యతంత్రంలో ఏ పని జరిపించాల్సి వచ్చినా రెసిడెంట్‌ అనుమతి తప్పనిసరి.’’ తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచిన యాత్రా కథనం ‘కాశీయాత్ర చరిత్ర’లో కనిపించే వర్ణన ఇది. రచయిత ఏనుగుల వీరాస్వామయ్య. ఈ చరిత్ర, ఇందులో అలనాటి నిజాం సంస్థానం గురించి రాసిన మాటలు ఒక సామాజిక దృశ్యాన్ని మన ముందు ఉంచుతాయి. అవన్నీ చరిత్రకు దర్పణం పడతాయి.

యాత్రా చరిత్రలు ప్రత్యేక పక్రియ. సృజన కారుడు తాను దర్శించిన స్థలాలను వివరిస్తూ, దానికి అనుభవాలనూ, అనుభూతులనూ పాఠకులన• కదిలించే రీతిలో జోడిస్తాడు. తెలుగు సాహిత్యంలో ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీ యాత్రా చరిత్ర’ (1838) అలాంటిదే. ఆంగ్ల సాహిత్యంలో మొదటి కవిగా చెప్పే చాసర్‌ The Canterbury Tales పేర్కొన దగిన యాత్రా చరిత్ర, ఈ ప్లాట్‌ను ‘‘బెకాచియో’’ రాసిన ‘‘ది డి కామరూన్‌’’ ‌నుండి గ్రహించాడు. కాంటర్‌బరీలో కలుసుకున్న యాత్రికులు చెప్పుకునే కథలే ఇందులో సారాంశం. అవన్నీ ఎక్కడెక్కడివో గాథలు. కాశీయాత్రా చరిత్రలోనివి నిజాం సంస్థానంలోని వాస్తవాలు.

మానవుడు మొదట ఆహారం కోసం అన్వే షించాడు. ఆపై కొత్త విషయాల కోసం ఖండాలు దాటాడు. ఆధునికయుగంలో ఆనందం కోసం, వైవిధ్యం కోసం ప్రయాణించాడు. 4వ శతాబ్దంలో అలెగ్జాండర్‌ ‌దండయాత్రలలో తన వెంట భూగోళ, ఖగోళశాస్త్రాలు తెలిసిన వారినీ, ‘స్టెపర్స్’ అనే ఉద్యో గులనూ తీసుకువెళ్లాడు. వీరు సైనికులు వేసిన అడుగులు లెక్కించి ఒక్కరోజులో సైన్యం ఎన్ని మైళ్లు సాగిందో చెప్పగలిగేవారు. దానికి పట్టే సమయం, కావలసిన ఆహారం గురించి కూడా లెక్క చెప్పగలరు.

గ్రీకు పురాణగాథ ‘ఒడిస్సీ’లోని నాయకుడు యూలిసిస్‌ ‌దేశాలన్నీ తిరుగుతూ, యుద్ధాలు చేస్తూ ఇరవై సంవత్సరాల తరువాత దేశానికొచ్చి పరిపాలన ప్రారంభిస్తాడు. కానీ కాలు నిలవక కొడుక్కి రాజ్యం అప్పజెప్పి (I cannot rest from travel) తిరిగి సముద్రయాత్రకు సిద్ధమవుతాడు. ఇది యాత్రలలోని నిషా.

ధామస్‌ ‌కుక్‌ (1808-1892)‌ను పర్యాటక పిత అనడం పరిపాటి. ఇతడు థామస్‌ ‌కుక్‌ అం‌డ్‌ ‌సన్‌ అనే సంస్థను స్థాపించాడు. ఈయన కూడా వీరాస్వామయ్య తరువాతివాడే. కాశీ మజిలీ కథలు రాసిన మధిర సుబ్బన్నదీక్షితులు (1868 -1928) వీరస్వామయ్య యాత్ర పూర్తయిన 37 ఏళ్ల తరువాత జన్మించారు. రాహుల్‌ ‌సాంకృత్యాయన్‌ ‌కంటే వంద సంవత్సరాలు ముందువాడు వీరాస్వామయ్య. తెలుగువాడు.

‘‘నేను 1780లో చెన్న పట్టణంలో జన్మించాను. మా నాన్నగారి పేరు సామయ మంత్రి. ఒంగోలుకు చెందిన వెన్నెలకంటి సుబ్బారావు పంతులుగారు, రాజమండ్రికి చెందిన కొచ్చర్లకోట వెంకటరాయని గారు మాకు చాలా దగ్గర బంధువులు’’ (పేజీ 012) అని రాసుకున్నారు.

తొమ్మిదో ఏట తండ్రి మరణించాడు. తల్లే పెంచింది. ఈస్ట్ ఇం‌డియా కంపెనీలో వాలంటీర్‌గా, వేర్‌హౌస్‌లో బుక్‌ ‌కీపర్‌గా పనిచేసి, 1819 సుప్రీంకోర్టు ఇంటర్‌ ‌ప్రిటేటర్‌గా ప్రమోట్‌ అయ్యాడు. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే తీర్పులన్నీ ఈయన ఇచ్చిన నివేదికల మీదనే ఆధారపడి ఉండేవి. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆయనకు ఉన్న పాండిత్యంతో న్యాయాధికారులు చాలా అభిమానించేవారు.

ఆయన బంధువు వెన్నెలకంటి సుబ్బారావు 1822-23 సంవత్సరాలలో కుటుంబ సమేతంగా కాశీయాత్ర చేసి పదమూడు నెలల తరువాత వచ్చారు. అంచెబళ్ల మీద, పల్లకీల మీద ఆయన చేసిన ప్రయాణం వీరాస్వామయ్యకు స్ఫూర్తినిచ్చింది. కానీ సుబ్బారావు తన పుస్తకాన్ని వీరాస్వామయ్య గ్రంథం ప్రచురణ అయిన తరువాత పూర్తిచేశాడు. రెగినాల్డ్ ‌బిషప్‌ ‌హెబర్‌ అనే ఈస్టిండియా కంపెనీ మతాధికారి 1824లో భారతదేశ యాత్ర చేసి The Bishop Herber’s Jounal అనే పేరుతో మూడు సంపుటాలు రాశాడు. అవి కూడా చదివారు వీరాస్వామయ్య.

‘‘నా కాశీయాత్రకు పురోహితులు నిర్ణయించిన సమయం 1830వ సంవత్సరం మే నెల 18వ తేదీ మంగళవారం సాయంత్రం 9 గం।।లకు. ‘సహృద యులు, దయాళువు అయిన మీతో ప్రయాణం చేయటమే మేము చేసుకున్న పుణ్యం’ అంటూ చాలామంది చేరుకున్నారు. వాళ్ళందరికి తిండీ తిప్పలు, మా మూడు పల్లకీలు మోయడానికి అవసర మైన ఉప్పాడ బోయీలు, వంటవాళ్ళు, సామానులు మోసే కావడివాళ్ళు, నీళ్ళ కుండలు మోసేవారు, దారికోసం చెట్లు నరికేవారు, బంట్రోతులు, కాపలా మనుష్యులు అందర్నీ లెక్క వేసుకుంటే వందమంది అయ్యారు. అందరికీ సూత్రధారి వీరాస్వామి. అవసర మైనప్పుడు వైద్యం, దారిలో దొంగల భయం, అడవి జంతువుల భయం. కాబట్టి అందరూ నన్నే నమ్ము కున్నారు. నేను దైవం మీద భారంవేసి ‘నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి’ అనుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాము. కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళైకి మాట ఇచ్చినట్టుగానే నా కాశీయాత్ర గురించి ప్రతీవారం అనేక విషయాలతో చెన్నపట్నం ఉత్తరాలు రాస్తూండే వాడిని. నేను ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూవుంటే నా వుత్తరాలు దక్షిణం వైపు పక్షుల్లా ఎగిరి వచ్చి మా పిళ్ళై చేతుల్లో పడేవి, దారిలో ఎన్నో బాధలు పడ్డాం, బ్రిటిష్‌ ఆఫీసర్‌ ‌వద్ద అప్పుకూడా తీసుకున్నాం.’’ అని రాసుకున్నారు. చివరకు యాత్ర ముగించి సెప్టెంబర్‌3, 1831‌న ఇంటికి చేరారు.

వీరాస్వామయ్య బ్రిటిష్‌ ఆఫీసర్ల వద్ద నుండి రక్షణ కోసం తీసుకున్న సర్టిఫికేట్లూ, సుప్రీంకోర్టు జడ్జిచే రాయించుకున్న ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్లు, పాస్‌పోర్టుల్లా ఉపయోగపడే ఇతర పత్రాలూ, ఉత్తరాలు, ఆయుర్వేద మందులు పెట్టె, డబ్బు సంచులు ఇవన్నీ పల్లకీలో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. వీటితోపాటు డైరీలు, ఉత్తరాలు. పల్లకీ మోస్తున్న ఉప్పాడ బోయీల ‘ఒహోం ఒహోం భాయ్‌’ ‌రాగాల మధ్య, భుజాల మీద బరువును లయాత్మకమైన ఊతపదాలతో కరిగిస్తూ, కాగడాల వెలుతురులో ప్రయాణం సాగించారు. అణాలు, అర్థణాల, పావలాలు, చెన్నపట్నం దుడ్లు కడప దాటిన తరువాత దొరకవు. వెండి నాణేలు మాత్రం పనికి వస్తున్నాయి. కృష్ణకు అవతలి పైసలు, కృష్ణకు ఇవతల పనికిరావు.

 షాపురంను మూడు గంటలకు వదిలి పెట్టి రాత్రి ఎనిమిది గంటలకు 20 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు షహరుకు సమీపంగా వుండే బేగం బజారు అనే పేటలో ఒక తోట బంగళాకు చేరారు. వీరాస్వామి ఆ అనుభవాలను ఇలా నమోదు చేశారు. శంషాబాద్‌ ‌మొదలు చిన్న తుప్పల దారి, దానికి రెండు పక్కల అగుపడుతూ వచ్చాయి. దగ్గర దగ్గర చిన్నగ్రామాలు ఉంటున్నాయి. అనేక మసీదులు చూస్తూ రావచ్చు. చిన్న చెరువులు కొన్ని ఉన్నాయి. వాటి కింద మామిడి తోపులు, వున్నాయి. ఆ దినం మొహరం ప్రారంభమై తొమ్మిదో దినం… ఆ రోజు 1830 జూన్‌ 29‌వ తేదీ మంగళవారం రాత్రి మొదలు జూలై 8వ తేదీ సాయంత్రం మంగళవారం వరకూ హైదరాబాదు షహరుతో కలిసిన బేగం బజారులో వారు ఉన్నారు. ఆ రాత్రి మొదలు జూలై 19వ తేదీ సోమవారం వరకూ ఇంగ్లీషు వారి సైన్యం ఉండే సికింద్రాబాద్‌ అనే పేరు కలిగిన బస్తీకి దగ్గరగా ఉన్న కాకాగూడా బొమ్మదేవర నాగన్న తోట చావిడిలోఉన్నారు.

గోలకొండ ప్రస్తావన: మేము ఉన్న తోటకి 10 కి.మీ. దూరంలో గోలుకొండ అనే దుర్గ ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ బలమైన కోట వుంది. అందులో నిజాం యొక్క అంతఃపుర స్త్రీలు, సంస్థానం యొక్క మూలధనంతో సహా అక్కడ వున్నారు. పెద్ద గృహాలున్నాయి. ఈ షహరులో పెద్ద మనుషులు ఆనందంగా వుండడానికి ఒక బగీచా అనే చిన్న తోట వుంది. దానిలో నీళ్ళు పైకిచిమ్మే పౌంటెన్‌ ‌వుంచారు. ఇక్కడ పరిపాలన జరిగే క్రమం ఏమంటే పూర్వకాలమందు ఢిల్లీ పాదుషాకు సిపాయిలుగా సేవలు చేసి, సంతోషపెట్టి ఈ రాజ్యాన్ని జాగీరుగా పుచ్చుకున్న అసఫ్‌ ‌జాహీ వంశస్థులు ఇప్పుడు రాజ్యం చేస్తూ వున్నారు. ఇంతకు మునుపు సాలార్‌జింగ్‌ అనే అతను మంత్రిగా పనిచేసి సంవత్సరం క్రితం చనిపోయాడు. అతని కుమారుల్లో ఒకడైన నసరుద్దౌలా అనేవాడు ఇప్పుడు కంపెనీ వారి సహాయంతో పట్టం కట్టుకొని ప్రభువు అనిపించుకొని వున్నాడు. ఈ నవాబు కింద ఒక దివాన్‌ ‌జాగీరు అనుభవిస్తున్నాడు. అతని కింద ఓ పేష్కర్‌ ‌సకల రాజ్యతంత్రం విచారిస్తూ వుంటాడు.

ఉన్న రాజ్యమంతా నౌకర్లు అయిన అమీరులు, ఉమరాలు, అనబడే పెద్ద మనుష్యులకు జాగీర్‌దార్లకు వంశపారం పర్యంగా ప్రభుత్వం చేసేవారికి జామీన్లుగా ఇచ్చి, జామీన్‌దార్ల మాత్రం సాలుకి ఇంత మాత్రమని రూపాయిలు వసూలు చేసుకుంటూ వుంటారు. ఆస్తిని కౌలుకు ఇవ్వకుండా ఉంచుకొన్నా, సొంతంగా నిర్వహించుకోవడం కూడా పూర్తిగా చేయడం లేదు. ఎవరి ఆధీనంలో వుండే భూమికి వారే పూర్తి స్వతంత్రులుగా వున్నారు… ఇలా సాగింది.

ఇంకా- కుంఫిణి వారు పన్నులు బకాయి పడి కట్టని, బలవంతులైన జమీందార్ల వద్ద సాలీనా పన్నులు వసూలు చేసుకొనేటట్టు, నవాబులు తమ రాజ్యాన్ని వారికి ధారాదత్తం చేశాడు. అటువంటి వారి వద్ద కుంఫినీ వారు రూకలు వసూలు చేసి నిజాంకు ముజరా (కమీషన్‌) ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం వున్న ఆరు పటాలాలు కాక మరో పన్నెండు పటాలను పూర్తిగా రెసిడెంట్‌ ‌మూకలుగా ఇంగ్లీషు వారి ఖాయిదాలో అల్వాల్‌ ‌మొదలైన స్థలాల్లో ఉంచి, నెలనెలకు వారి జీతం రెసిడెంట్‌ ‌మూలకంగా ఈ నవాబు దివాన్‌ ‌షేష్కర్‌ ఇస్తూ, రూపాయలు చెల్లించని జమీందార్ల మీదికి కావలసినప్పుడు కావలసినంత ఈ సైన్యాన్ని పంపిస్తూ వస్తున్నారు… అని రాశారాయన.

కుంఫిణి (ఈస్టిండియా కంపెనీ) కాలంలో ఇక్కడి పరిస్థితి ఏమిటో ఇలా వివరించారు: దివాన్‌ ‌చందూలాల్‌ (‌దివాన్‌) ఈ అదనపు పటాలాల జీతానికిగాను నెలకు సుమారు మూడు లక్షల రూపాయిలు ఇస్తున్నాడు. ఇదికాక నవాబ్‌కు ఖర్చులకుగానూ నెలకి సుమారు మూడు లక్షల రూపయలు చెల్లిస్తున్నారు. ఈ ఖర్చులు చేయడానికి చందూలాల్‌కు రాజ్యంలో వచ్చే వసూలు చాలక డబ్బు అప్పు చేసేవాడు. ఈ నవాబు ర్యాం అంతా కంపెనీ వారి వల్ల చాలా భయపడుతూ వుంది.

పాలన వ్యవహారాలతో పాటు ఇతర అంశాలు కూడా రాసుకున్నారాయన: అరటిపళ్ళు మినహా సకల విధములైన పండ్లు మంచివి దొరుకుతున్నాయి. కానీ చెన్నపట్నానికి మూడింతలు ధర వుంది. చోఠా ఆరంజి పళ్ళు విస్తారంగా వున్నాయి. కూరగాయలు అదే ప్రకారం ధర ఎక్కువ అయినా మంచి రుచిక రంగా వున్నాయి. వస్త్రాలు, ఆభరణాలు సిపాయిలకు సంబంధించినవే దొరుకుతున్నవి. అని రాశారు.

కలిగి ఉన్నవారు ఎలా ఉండేవారు: సాధారణ వ్యక్తుల్లో రత్నాలు కొనేపాటి ఉత్సాహం, ధైర్యం  లేనందున వర్తకులు ఆభరణాలు వగైరా ఉంచుకొని విక్రయించే ఏర్పాటు లేదు. అవి కావలసిన గొప్పవారు వ్యాపారులనే వస్తువులతో సహా తమ ఇంటికే పిలిపించుకొని కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరు తమ కాపలా కోసం కొంత సిబ్బందిని ఉంచుకుంటున్నారు.పై రాష్ట్రాల నుండి వచ్చినవారు ఇక్కడ భయపడుతూ తిరుగేవారు.

ద్రవ్య మారకం ఎలా ఉండేదీ అంటే: ఇక ద్రవ్యం విషయానికొస్తే హైదరాబాద్‌లో పిచ్చి రూపాయిలని ఒక రకం, గోవింద బఖీలు అని ఒక రకం చెలా మణీలో వున్నాయి. ఈ రూపాయి ఒక చేతి నుండి మరో చేతికి వస్తే ఒకటి, రెండు పైసలు అదనపు రుసుమియ్యక మారవు. ప్రతీ రూపాయినీ పరీక్షచేసి ఏదో ఒక దోషం చూపుతారు. చెన్నపట్నం కుంఫిణీ రూపాయిలకు ఆ ఇబ్బంది లేదు. అయితే అవి ఇక్కడ దొరకవు. ఇక్కడ ఒక రూపాయికీ నలభై పైసలు.

మూసీ, హిందూ ఆలయాల గురించి ఇలా రాశారు: ముచ్‌కుంద నదిని వీరు మూసీ అని పిలుస్తారు. ఒక సంవత్సరం ముందు మూసీనదికి వరద వచ్చి ఇంగ్లీషు వారు కట్టిన వారధిని పగులగొట్టి ఈ షహరులో కొన్ని వీధుల్ని ముంచి వేసింది. షహరు చుట్టూ అనేక కొండలున్నాయి. ఆ కొండలుకు చివరిలో మసీదులు కట్టారు. హిందూ దేవాలయాలు లేవు. వున్నా వాటిని వృద్ధికి రానియ్యరు, షవారుకు ఇంగ్లీషు దండుకు మధ్య 6 కి.లో మీటర్ల దూరంలో హుస్సేన్‌ ‌సాగర్‌ అనే చెరువు వుంది. ఆ కట్ట మీద ఇంగ్లీషు వారి గుర్రపు బండ్లు పోయే దానికి బాట వేశారు. మొగలాయి వాహనాలు, సాధారణ మనుష్యులు తిరిగి పాడు చేయకుండా వుండే దానికి బాటకు ఇరుప్రక్కల తమ పహారా పెట్టారు. జాతుల వాళ్లను (విదేశీయులను) కాకుండా ఇతరులను ఆ కట్టపై అనుమంతిచరు. ఈ జాతుల వారు ఫిరంగులతో సహవాసం చేసేవారు. కనుక వారిని ఫిరంగి వారని ఆ దేశస్తులను పిలుస్తున్నారు.

సికింద్రాబాద్‌ ‌గురించి: (సికింద్రాబాద్‌) ‌కంపెనీ సైన్యం వుండే స్థలం హైదరాబాదు కన్నా త్వరగా అభివృద్ధి చెందుతున్నది. కట్టెల బళ్ళకు, విస్తరాకులకు, షహరులో రావడానికి నాలుగైదు రకాల సుంకాలు విధిస్తారు. పన్ను విధించేవారు ఎంతంటే అంత కట్టవలసిందే, కాదంటే వారు చంపినా అడిగే దిక్కు లేదు. ఇంగ్లీషు దండులో న్యాయ విచారణ కూడా కొత్వాల్‌ ‌చావడిలో కమీషనరేట్‌ అసిస్టెంటు ద్వారా జరుగుతుంది. అందువల్ల ప్రజలు వర్తకులు ఈ దండులో నివసించడానికే ఇష్టపడుతున్నారుట.

పేదల గురించి: ఇక్కడి నేల గులక కలిసిన ఎర్ర రేగడి మట్టి మహాగట్టిగా వుంటుంది. షహరు చుట్టూ వుండే ప్రదేశం బహుసారవంతమైంది.ఏ వృక్షం అయినా శక్తిమంతంగా పెరుగుతుంది. అయితే తోటలపై ఎవరూ శ్రద్ద పెట్టడం లేదు. కారణం, పేదవారు ఏ చెట్టువేసినా వాటి ఫలాలను మాత్రం ‘‘ఆయుధాలే ఆభరణాలుగా’’ వుంచుకొని, దర్పమ్‌ ‌యశస్సుగా భావించేవారు అనుభవిస్తున్నారు. పేద ప్రజలను అనుభవించనీయరు.

హైదరాబాదు షహరు చుట్టూ బేగం బజార్‌ అనే బస్తీ, సాహుకార్ల కోఠీలు (పెద్ద భవనాలు) ఉన్నాయి. ఇక్కడకు సుమారు 3 కి.మీటర్ల దూరంలో కారువానా అనే బస్తీలో రత్నాలు అమ్మే వర్తకులుండేవారు. బేగం బజారును ఆనుకొని ఇంగ్లీషు రెసిడెంట్‌ ‌సొంత ఖర్చుతో విశాలమైన హవేలీ చుట్టూ ప్రజలు, వర్తకులు ఇళ్ళు కట్టుకొని వుండటం చేత ఇది పెద్ద బస్తీ అయ్యింది. ఈ స్థలం పేరు చంద్రఘాట్‌ (‌చాదర్‌ ‌ఘాట్‌) అం‌టున్నారు. దివాన్‌ ‌పేష్కారు చందూలాల్‌ ఇక్కడ ఇల్లు కట్టుకొని కాపురం వుండేవాడు. నిజాం దేవిడీ ఈ షహరు మధ్యే వుంది. అనేకమైన పెద్ద మనుష్యులు, అమీర్లు, ఉమరాలు అని పేరు గల వార్లు, సాధారణ వర్తకులు, నిజాం వంశస్తులు షహరు మధ్యే కాపురం వున్నారు.

ప్రేమ వ్యవహారాలు: బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌గా పనిచేసిన జేమ్స్ ‌కిర్క్ ‌పాట్రిక్‌ ‌హైదరాబాద్‌ ‌రాకుమారినే పెళ్ళి చేసుకొని ఆమెతోనే కాపురం చేశాడు. షహరు లోపల షాలీబండ అనే పేరు గలిగిన ప్రాంతంలోనే భాగమతి వుండేదని అక్కడే సుల్తాన్‌ ‌మహామ్మద్‌ ‌కూలీకుతుబ్‌షా చూసి ప్రేమించి పెళ్ళి చేసుకొని ఆమె జ్ఞాపకార్థమే భాగ్యనగర్‌ (‌హైదరాబాద్‌) ‌నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది.

యాత్రా రచనలు కేవలం అనుభవాలను పంచడం మాత్రమే కాక సాహిత్యపక్రియలు చెప్పడం కూడా చూస్తాం. యాత్రాచరిత్రలు కూడా అన్ని సాహిత్యపక్రియల వలెనే గౌరవం పొందాలి.

– కాశింశెట్టి సత్యనారాయణ,

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE